ఇంద్రగంటి జానకీబాల
ఒక పాతికమంది స్నేహితులం కలిసి గోలగోలగా మాట్లాడేసుకుంటున్నాం – అందరం ఆడవాళ్ళం – కాస్తోకూస్తో
చదువుకున్నవాళ్ళం. సంగీత, సాహిత్యాల పట్ల ఎనలేని అభిమానం గలవాళ్ళం – ఒక్కొక్కరం ఒక్కొక్క పాట పల్లవి అందుకుని
అదరగొట్టేస్తున్నాం. నిజంగా అది ఎంతో అపురపమైన సన్నివేశం – బానిసత్వం నుండి బయటపడి, అప్పుడే స్వేచ్ఛని పొందినట్లు
అందరూ రెచ్చిపోతున్నారు.
అప్పుడే నా మిత్రురాలు నా దగ్గరకొచ్చి ”మీరో మా౦ఛి పాట పాడాలి. ఈ రాగాలు, తాళాలు, స్వరాలు, సరిగమలు
వద్దండి బాబు చక్కని, అందమైన ఆకాశంలో తేలించే పాట ఒకటి పాడండి. అదే సినిమాపాటైతే నేను పైన చెప్పిన ఈ
రాగతాళమేళాల గోల వుండదనుకుంటాను – ఊ… మొదలుపెట్టండి” అంది. ఆమె కళ్ళల్లో మెరిసే స్నేహం నన్ను
సమ్మాహితురాల్ని చేస్తున్నా ఆమెలోని అజ్ఞానం మనసును చివుక్కుమనిపించింది.
సినిమా పాటకి రాగం వుండదనీ, తాళం అవసరం లేదనీ, సరిగమలు, సాకీలు వుండేది వేరే సంగీతమని ఆమె భావం.
ఒక సినిమాపాటను తయారుచెయ్యాలంటే నిజానికి చాలా సంగీతజ్ఞానం వుండాలి. అంటే రాగాలు తెలియలి. తాళం
గురించి మంచి అవగాహన వుండాలి. వాద్యాలను ఎలా వుపయెగించాలో తెలియాలి. ఇన్ని తెలిసి, సాహిత్యంలోని భావానికి
అనుగుణంగా ట్యూన్ కంపోజ్ చెయ్యలి. దాన్ని అర్థం చేసుకుని పాడేవాళ్ళు పాడాలి. అప్పుడే అందమైన సినిమాపాట పుడుతుంది –
ఇది కేవలం అవగాహన. అంతే –
అరవైలలో ఒక సంఘటన అందరూ హాస్యంగా చెప్పుకునేవారు-
ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రొడ్యూసర్ తను తీయబోయే కొత్త సినిమాకి ఒక మ్యూజిక్ డైరక్టర్‌ని మాట్లాడుకున్నాడు. ఆ
మ్యూజిక్ డైరక్టర్ నెంబర్ ఒన్‌గా వెలిగిపోతూ కేవలం ఆయన మ్యూజిక్ వుండే సినిమా హిట్టవుతుందనే పేరుపొంది వున్నారు.
అందుకే తనకి ఇంత రెమ్యునరేషన్ యిస్తేగానీ చెయ్యను అని నిర్ణయించుకున్నారు.
అయితే మన ప్రొడ్యసరు గారు ఎన్ని హిట్టు సినిమాలు తీసి, బాగా డబ్బు గడించినా – వ్యాపారం వ్యాపారమే –
లాభాలు లాభాలే బేరాలు బేరాలే – అందువల్ల ఆయన తన సహజ ధోరణిలో కొంత బేరసారాలు సాగించారు.
మ్యూజిక్ డైరక్టరుగారు లొంగి రాలేదు. ఇంక చేసేది లేక, ఆయన మ్యూజిక్ వుండి తీరాలనే కాంక్షతో మ్యూజిక్
డైరక్టర్ అడిగిన పారితోషికానికి ఒప్పుకున్నాడు -,
పాటలు కంపోజ్ చేయడం మొదలైంది. హార్మోనియమ్ ముందుపెట్టుకుని వాయిస్తూ రకరకాల ట్యూన్స్ ఆయన
పాడుతుంటే నిర్మాత హోదాలో అక్కడే కుర్చీ వేయించుకుని కూర్చునేవాడాయన. తరుచూ ఈ మాత్రానికేనా అంత డబ్బు డిమా౦డు
చేస్తున్నాడు? అని సందేహం నిర్మాతకి వస్తూనే వుండేది-, పాట కంపోజ్ అయింది – అందరూ ఆహా! ఓహో! అన్నారు. నిర్మాతగారు
తలూపారుగానీ గంటనించీ చూస్తుండగా ఆయనకొక విషయం అంతుపట్టలేదు. సంగీతదర్శకుడ్నే డైరక్ట్‌గా అడిగేద్దామంటే భయం.
ఆయనకు కోపమొస్తే వదిలేసి వెళ్ళిపోతారు. అందుకని అసిస్టెంటుని నెమ్మదిగా పిలిచి, పక్కకి తీసుకెళ్ళి – ”ఏమయ్యూ! బోలెడు
డబ్బుపోసి ఆయన్ని పెట్టుకున్నాను. అంత ఆరుమనీ పెట్టెలో అన్నీ తెల్లమెట్లే నొక్కుతున్నాడు కాస్త నల్లమెట్లు కూడా
నొక్కమని చెప్పవయ్యూ” అన్నాడు.
అవాక్కయిన అసిస్టెంట్ సమాధానం ఏం చెప్పాలో తెలీక అయెమయంలో పడిపోయాడు.
ఆ తర్వాత ఆ సినిమాలో పాటలన్నీ హిట్టే మరి.