పొయట్రీ (2010) వాడ్రేవు చినవీరభద్రుడు

సినిమా చూసేటప్పటికి అర్థరాత్రి దాటిపోయింది. కొన్నాళ్ళ కిందట ఒక మిత్రురాలు చెప్పినప్పట్నుంచీ చూడాలనుకుంటున్నది నిన్నటికి చూడగలిగాను. సినిమా పూర్తయ్యేటప్పటికి చెప్పలేని సంతాపమేదో హృదయాన్ని చుట్టుకుపోయింది. సినిమా అదృశ్యమైపోయింది. అప్పటిదాకా చూసిన దృశ్యాలన్నీ కలగలిపి ఒక బూడిద రంగు పొరలాగా మనసుమీద పరుచుకుపోయాయి. ఎవరో నీకు బాగా కావలసినవారు చాలా పెద్ద విపత్తులో ఉన్నారని తెలిసినపుడు, నీకేమి చెయ్యాలో తెలీక, అలాగని నువ్వు మామూలుగా  ఉండిపోలేక, గొప్ప నిస్సహాయతని అనుభవిస్తావో అట్లాంటిదేదో భావన మధ్య ఎప్పటికో నిద్రపట్టింది.

సినిమాలో కథ, ఆ కథ చుట్టూ ఉన్న సమాజం, అది కొరియా కావచ్చు, ఇండియా కావచ్చు, పడుతున్న అంతర్గత సంక్షోభానికి అంతిమంగా మూల్యం చెల్లించేది స్త్రీలే అన్నది ఈ కథా సారాంశమని చెప్పేయవచ్చు. కానీ, ఈ సినిమాకి ‘కవిత్వం’ అని పేరు పెట్టాడు దర్శకుడు. ఇందులో ప్రధాన పాత్రధారి 60 ఏళ్ళ వయసులో కవిత్వ పాఠశాలలో చేరి కవిత్వమెట్లా రాయాలో నేర్చుకోవడానికి ప్రయత్నించడం కథలో ఆద్యంతాల పొడుగునా పరుచుకున్న విషయం. అదే, కవిత్వంతో ఈ కథ ముడిపడి ఉండడమే, ఈ సినిమాను అసాధారణ సృజనగా మార్చేసింది. అదే ఎక్కడో మన హృదయం లోపల ఆరని చిచ్చు ఒకటి రగిలించి పెడుతుంది.

లీ చాంగ్‌ డాంగ్‌ అనే దర్శకుడు తీసిన ఈ సినిమాలో కథ సంగ్రహంగా ఇది. దక్షిణ కొరియాలో ఒక పట్టణం శివార్లలో ఉండే యాంగ్‌ మీ-జా అరవయ్యో పడిలో పడ్డ ఒక అమ్మమ్మ. ఆమె కూతురు తన భర్త నుంచి విడాకులు తీసుకోవడంతో, తన కొడుకుని తల్లి దగ్గర వదిలిపెడుతుంది. జోంగ్‌-వూక్‌ అనే ఆ హైస్కూలు పిల్లవాడు బాధ్యతారహితంగా పెరుగుతుంటాడు. ఆమె ఒక సంపన్నుడి గృహంలో పరిచారికగా, పక్షవాతంతో బాధపడుతున్న ఆ సంపన్నుడికి సేవచేస్తూ పొట్ట పోషించుకుంటూ ఉంటుంది. మీ-జా తనకి ఒంట్లో బాగోలేదని డాక్టర్‌కి చూపించుకుంటే, ఆమెకి అల్జీమర్స్‌ వ్యాధి సంక్రమించిందనీ, త్వరలోనే ఆమె తన జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదముందని చెప్పారు. ముందు నామవాచకాలూ, తర్వాత క్రియా పదాలూ, అట్లా ఒక్కొక్కటే మర్చిపోయే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఆమె చిన్నతనంలో ఒక ఉపాధ్యాయిని ఆమెను కవివి అవుతావని చెప్పింది గుర్తొస్తుంది. కవిత్వం రాయడమెట్లానో నేర్పే శిక్షణా తరగతుల ప్రకటన ఒకటి చూస్తుంది. అందులో చేరుతుంది. కవిసమ్మేళనాలకు హాజరవడం మొదలుపెడుతుంది. కానీ కవిత రాయడమెట్లానో, ఏం చేస్తే కవిత్వం వస్తుందో ఆమెకి అర్థం కాదు. ‘కవిత రాయాలంటే నువ్వు ముందు చూడడం నేర్చుకోవాలి, వెతకాలి, యాచించాలి, ప్రార్థించాలి’ అంటాడు కవితా గురువు. ‘కవిత బయట

ఉండదు, అది నీలోనే ఉంది, అది ఎప్పుడో వచ్చేది కాదు, నువ్వు కనుక్కోగలిగితే ఇప్పుడే కనిపిస్తుంది’ అని కూడా అంటాడు. ఆమె కవిత్వం గురించి వెతకడం మొదలుపెడుతుంది.

ఇంతలో హఠాత్తుగా తెలుస్తుంది ఆమెకి. ఆమె మనమడు చదువుతున్న పాఠశాలలో ఒక పదహారేళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుందనీ, ఆ బాలికను ఆరునెలలుగా ఆమె సహాధ్యాయులు ఆరుగురు రేప్‌ చేస్తూ వచ్చారనీ, ఆ పిల్లల్లో తన మనమడు కూడా ఒకడనీ. ఆ పిల్లల తల్లిదండ్రులు ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని ఆమెని కూడా పిలుస్తారు. ఈ వార్త బయటికి పొక్కేలోపు ఏదో ఒక విధంగా సమస్య పరిష్కరించుకోవాలంటారు. ఆ పిల్ల తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించడమొక్కటే మార్గమనుకుంటారు. పాఠశాల యాజమాన్యం, పోలీసులు, చివరికి ఒక పత్రికా విలేఖరి- అందరూ ఇందులో భాగస్వాములే. అందులో మీ-జా చెల్లించవలసిన సొమ్ము చిన్న మొత్తమేమీ కాదు. కానీ ఆమె చివరికి తనని తాను చెల్లించుకుని ఆ మొత్తాన్ని సంపాదించి వాళ్ళ చేతుల్లో పెడుతుంది. తన మనవణ్ణి చూసిపొమ్మని కూతురికి కబురు చేస్తుంది కానీ కూతురు వచ్చేటప్పటికి ఆమె ఇంట్లో ఉండదు. ఆ రోజు వాళ్ళ కవిత్వ తరగతుల్లో చివరి రోజు. పాఠాలు పూర్తయ్యే రోజుకి ప్రతి ఒక్కరూ కనీసం ఒక పద్యమైనా రాయాలని ఉపాధ్యాయుడు చెప్పి ఉంటాడు. ఆ చివరి రోజు, తక్కిన వాళ్ళెవరూ కవిత తేలేదు కానీ, మీ-జా అక్కడ ఒక పూలగుత్తితో పాటు తాను రాసిన ఒక కవిత కూడా పెట్టి వెళ్ళిపోయి ఉంటుంది. రేప్‌కి గురయి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న బాలిక మీద రాసిన కవిత అది. ఆ ఉపాధ్యాయుడు ఆ కవిత చదివి వినిపిస్తుండగా చిత్రం ముగిసిపోతుంది.

టాల్‌స్టాయ్‌ రాసిన ‘ఫోర్జెడ్‌ కఫన్‌’ లాంటి కథ. కానీ దీన్ని దర్శకుడు ఒక సామాజిక విమర్శగానో, లేదా కుటుంబ బంధాల మధ్య సంఘర్షణగానో, బాధ్యతారహితంగా రూపుదిద్దుకుంటున్న యువతకు హెచ్చరికగానో చిత్రించలేదు. చాలా బిగ్గరగానూ, తీవ్రంగానూ మాట్లాడడానికి అవకాశమున్న ఈ కథని దర్శకుడు తనని తాను ఎంతో అదుపు చేసుకుంటూ ఎంతో సంయమనంతో చెప్పడానికి ప్రయత్నించాడు. కేన్స్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమా ఉత్తమ స్క్రీన్‌ప్లేగా ఎంపికయ్యిందంటే, నిగ్రహంతో కూడిన ఆ కథనమే కారణమని అర్థమవుతుంది.

కానీ, ఇంతకీ దర్శకుడు మనతో పంచుకున్నదేమిటి? ఇది సామాజిక హింస గురించిన చిత్రమా లేక కవిత్వం గురించిన చిత్రమా?

సినిమా గురించి నెట్‌లో కొంతసేపు శోధిస్తే, 2011లో గార్డియన్‌ పత్రికలో వచ్చిన ఒక రివ్యూ కనబడింది. అందులో సమీక్షకుడు రాసిన చివరి వాక్యాలిలా ఉన్నాయి.

‘ఒక వృద్ధురాలు అల్జీమర్స్‌ వ్యాధి తన జ్ఞాపకశక్తిని పూర్తిగా తుడిచిపెట్టెయ్యకముందే, ఒక కవిత రాయాలని కోరుకోవడం గురించిన సినిమానే అయి ఉంటే ఇది బాగానే ఉండి ఉండేది. సినిమా మొదటిసారి చూసినపుడు నేనిట్లానే అనుకున్నాను. ఇంతమాత్రమే తీసి ఉంటే బాగుండేది అనుకున్నాను. కానీ, సినిమాలో ఆ బాలిక ఉదంతమే లేకపోతే, ఈ సినిమా ఇప్పుడున్న సినిమా అయి ఉండేది కాదు. ఆ దారుణ సంఘటన, దానిపట్ల మీ-జా స్పందిస్తూ వచ్చిన తీరు, ఆ నష్టబాలిక జీవితంలో తన నష్ట యవ్వనాన్ని ఆమె పునర్దర్శించిన విధానం ఈ సినిమా తాలూకు విషాదాత్మకతను నిర్దేశిస్తున్నాయి. వెర్రిది, మీజా తాను కవిత రాయలేకపోతున్నానని పదే పదే బాధపడుతూ ఉండేది, కానీ ఆమెకి తెలియకుండా ఆమె కవిగా మారుతూ వచ్చింది. ఒక మృత్యువు నీడన తన అంతరంగిక చైతన్యాన్ని శుభ్రపరచుకుంటూ వచ్చింది. అది మాటల్లోకి ప్రవహించనివ్వు, ప్రవహించకపోనివ్వు. ఆమెకి జీవితమంటే ఏమిటో అర్థమవుతోంది. నిముష నిముషానికీ, దృశ్యం నుంచి దృశ్యానికి మన కళ్ళముందు రూపొందుతూ వచ్చిన ‘కవిత్వం’ ‘ఆ జీవిత స్పృహనే’.

ఈ వాక్యాలు చదవగానే నాకు ప్రసిద్ద కొరియా కవి సో చాంగ్‌-జూ రాసిన ఒక కవిత గుర్తొచ్చింది. ‘విచ్చుకుంటున్న ఒక చామంతి పువ్వు’ అని అతడు రాసిన కవితః

ఒక చామంతిమొక్క పువ్వు పుయ్యడం కోసం

కోకిల ఈ వసంతకాలమంతా

ఘోషిస్తూనే ఉంది.

ఒక చామంతి పువ్వు పుయ్యడం కోసం

కారు మబ్బుల నుంచి

ఉరుము దద్దరిల్లుతూనే ఉంది.

సుదూర యవ్వనాల జ్ఞాపకాల్తో

గొంతు పట్టేసిన బెంగతో

అద్దం ముందు నిలబడ్డ

నా చెల్లెల్లాంటి

ఓ చామంతి పువ్వా,

నీ పసుపు రేకలు విప్పారడానికి

రాత్రంతా ఎంత మంచు కురిసిందంటే

నేనసలు నిద్రపొలేకపోయాను.

సో చాంగ్‌-జూ ఈ మాటలు కూడా అన్నాడట

‘తన దగ్గర తిరిగి ఇవ్వడానికేమీ లేకపోయినా, విషయాలపట్ల, జీవిత సంగతుల పట్ల తనలో అపారమైన, లోతైన ఆరాటమొకటి మేల్కొంటున్నట్లుగా కవి గుర్తిస్తాడు. ఆ ఆరాటాన్ని ఏకైక దారిదీపంగా మార్చుకుని తన హృదయంలో వెలిగించి పెట్టుకుంటాడు. ఆ వెలుగులో తన లోపల్లోపల సంచలించే భావోద్వేగాల్ని పొరలు పొరలుగా తడుముకుంటూ వాటికి పేర్లు పెట్టడం మొదలుపెడతాడు. అట్లా పేర్లు పెట్టుకుంటూ పోతూ, ఆ వ్యాపకమంతటితోనూ శక్తి పుంజుకుంటాడు. అప్పుడు తిరిగి ఎట్లాంటి ఆసక్తి లేని ఈ ఉదాసీన ప్రపంచానికి ఆరాటపడడమెట్లానో నేర్పడం మొదలుపెడతాడు’.

బహుశా ఈ వాక్యాలు ఈ సినిమాను అర్థం చేసుకోవడానికే రాసినట్లున్నాయి. శోకం శ్లోకంగా మారుతుందని ఈ సారి ఒక కొరియా దర్శకుడి ద్వారా విన్నాననుకుంటున్నాను.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.