‘ఇంతకుమించి నువ్వేం చేయగలవు?’
చాలదా ఈ ప్రశ్న. చీకటి కోణాలు సోపానాలుగా రాయబడిన దారుణ విజయ పీఠికకి ఆవల?
అవును ఒక స్థాయిని మించిన దుఃఖం మనిషికి ఇచ్చే ధైర్యం ముందు అన్ని వ్యక్తిత్వ వికాసాలూ దిగదుడుపే… ఆ సంగతి మీరూ ఒప్పుకుంటారు ఈ పుస్తకం చదివితే…!
కొన్ని పుస్తకాలు చదివాక కలిగే ఉద్వేగాన్ని మాటల్లో చెప్పలేం. అసలు చెప్పాలంటే మాటలు రావు. కవిత్వం, వచనం ఏదీ సరిపోదు.
చదివి పక్కన పెట్టాక కూడా అందులో అక్షరాలు మన గుండెలోతుల్లో చిన్న అర కట్టుకుని పాతుకుపోయాయా అనిపిస్తుంది. ఆ దుఃఖం కళ్ళను తడపదు, గుండెను తడుముతుంది. లే… నిద్రావస్థ నుంచి లే… అంటూ లోపల ఒక సముద్రమై ఎగసి పడుతుంది.
”బ్రెస్ట్ స్టోరీస్”
1978 నుంచి 1998 మధ్య కాలంలో మహాశ్వేతాదేవి రాసిన మూడు కథల సంపుటే ఇది. ఆ ఇరవై సంవత్సరాల కాలంలో ఆమె అనేక కథలు, వ్యాసాలు రాసారు. అయితే ఈ మూడు కథలకీ మధ్య ఒక సారూప్యత ఉంది.
ద్రౌపది
బ్రెస్ట్ గివర్
చోళీ కే పీఛే…
అన్ని కథల్లో… రొమ్ములే కథాంశాలు. అంతేకాదు, ప్రస్తుత సామాజిక వ్యవస్థలో దోపిడీకి బలవుతున్న స్త్రీత్వానికి ప్రతీకలు కూడా.
మహా శ్వేతాదేవి!!
90 సంవత్సరాల క్రితం సాహిత్య నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి, తాను జన్మించిన అగ్రవర్ణ కుటుంబాలు సమాజంలో ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నాయో, నిమ్న కులాలపై తమ దగ్గరి బంధు వర్గం చేస్తున్న దాష్టీకాలను కళ్ళారా చూసిన వ్యక్తి. కాస్తంత భుక్తి కోసం జీవితాలనే అమ్ముకునే దీనులే ఆమె రచనల్లో ప్రధాన పాత్రలుగా మన మనసుల్ని తడుముతూ ఉంటారు.
నాలుగు దశాబ్దాల సాహిత్య జీవితంలో ఆమె వందలకొద్దీ వ్యాసాలు, కథలూ… ఎన్నో నవలలూ రాసారు. దాదాపుగా ఆమె అన్ని రచనలూ గిరిజనుల జీవన స్థితిగతులనూ, సమాజంలో వివధ వివక్షా రూపాలనూ ఎత్తి చూపుతాయి.
ఇక ప్రస్తుత కథా సంపుటి ‘బ్రెస్ట్ స్టోరీస్’ లోకి వస్తే…
మొదటి కథ ”ద్రౌపది”
ద్రౌపది కథలో ప్రధాన పాత్రధారిణి అయిన ద్రౌపది ఒక గిరిజన విప్లవకారిణి.
1971లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన యుద్ధ నేపధ్యంలో రాసిన కథ ఇది. యుద్ధం జరుగుతున్నప్పుడు వందలాది మంది బంగ్లా యువతులు సామూహిక అత్యాచారానికి గురయ్యారు.
ద్రౌపది కూడా అలాగే ఒకసారి నిర్బంధించబడుతుంది. ఆమెని వివస్త్రని చేసి ఆమెపై సామూహికంగా అత్యాచారం చేస్తారు. ఆ తర్వాత చిరిగిన వస్త్రాలను ఆమె పైకి విసిరేని ఆమె నగ్న శరీరాన్ని కప్పుకొమ్మని ఆదేశిస్తాడు సేనానాయక్. అతనివైపు ధిక్కారంగా చూసిన ద్రౌపది… లేచి నిలబడి అతనిని సూటిగా చూస్తూ… ఇక్కడ మగవాళ్ళు ఎవరున్నారు? నేనెందుకు సిగ్గుపడాలి? అని అడుగుతుంది. అప్పుడు నెత్తురోడే ఆమె రొమ్ములు శత్రువుని వణికించిన ఆయుధాలకి ప్రతీకగా రచయిత్రి మనకి చూపిస్తారు.
ఆమెని శారీరకంగా హింసించామే తప్ప మానసికంగా ఓడించలేకపోయామన్న భావన సేనానాయక్‌ని వణికిపోయేటట్లు చేస్తుంది. భౌతికంగా ఎవరెన్ని గెలుపులు గెలిచామని విర్రవీగనీ, మానసిక బలం ఉన్నవారి ముందు అవన్నీ పిల్లి కూతలుగానే మారిపోతాయన్న పాఠం మనకు అవగతమవుతుంది.
”ఇంతకు మించి ఏం చేయగలరు…”
ఈ ప్రశ్న పుస్తకం చదివాక మనల్ని వెంటాడేస్తుంది.
అందరూ దుఃఖపడేచోట… ఏ ఒక్కరో ఉవ్వెత్తున ఒక జ్వాలలాంటి ఘర్జనని గొంతుని దాటిస్తారో… అప్పుడిక దుఃఖం ఎదుటివాడి జీవితంలో కుంభవృష్టిగా కురుస్తుంది. దాన్ని అడ్డుకోవడం ఇక ఏ శక్తివల్లా అవ్వదు.
ఇక రెండవ కథ బ్రెస్ట్ గివర్.
బ్రెస్ట్ గివర్ కథలో కుటుంబాన్ని పోషించానికి కిరాయికి పాలిచ్చే వృత్తిలో చేరిన ఒక తల్లి… తాను పాలిచ్చి పెంచిన ఏ కొడుకూ తనని ఆదుకోకపోగా… తన కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడిన తన రొమ్ములూ ఆమెని మోసం చేసిన పరిస్థితుల్లో రొమ్ము క్యాన్సర్‌తో చనిపోతుంది.
ఈ కథలో ముఖ్య పాత్రధారిణి యశోద. భర్తకి రెండు కాళ్ళూ పోయి సంపాదన లేని పరిస్థితిలో కుటుంబ పోషణ కోసం ఒక భూస్వామి పిల్లకి కిరాయికి పాలిచ్చే తల్లిగా వెళుతుంది. యవ్వనవంతురాలిగా ఉన్నంత కాలం పాలిచ్చే తల్లిగా అనేకమంది భూస్వాముల పిల్లలను బతికించిన యశోద మధ్య వయసుకి వచ్చాక వట్టిపోయిన ఆవులాగ అన్ని కుటుంబాల నుంచి నిరాదరణ ఎదుర్కొంటుంది. క్రమంగా ఆమె నుంచి సహాయం పొందిన అన్ని కుటుంబాలూ ఆమెని మర్చిపోతాయి. చివరకు ఆమె రొమ్ము క్యాన్సర్‌తో చనిపోతుంది. ఈ కథ చదువుతుంటే మనకు కన్నీళ్ళాగవు.
ఇక మూడవ కథ సంచలనం సృష్టించిన ”ఛోళీ కే పీఛే…”
ఉపేన్ అనే ఒక ఛాయాగ్రాహకుడు, గంగా అనే ఒక నిరుపేద మహిళ మధ్య జరిగిన కథ. ఛాయాగ్రాహకుడైన ఉపేన్, తన వృత్తిలో భాగంగా గ్రామీణ జీవన పరిస్థితులను ఫోటోలుగా తీస్తూ… గంగ ఫోటోలను తీస్తాడు. యాదృచ్ఛికంగానే గంగ రొమ్ములను ప్రతీకగా కొన్ని చిత్రాలను తీసిన ఉపేన్ క్రమంగా వాటిపట్ల ఒక రకమైన అబ్సెషన్ పెంచుకుంటాడు. తన భార్య కృత్రిమ అందాలను గంగతో పోల్చుకుంటూ, భార్యపట్ల విముఖత ప్రదర్శించడం మొదలుపెడతాడు. ఆ తర్వాత జరిగిన అనేక సంఘటనలు గంగ జీవితాన్ని అగాధంలోకి తోసేస్తాయి. ఉపేన్ జీవితం కూడా దిగజారిపోతుంది. భర్త నుంచే కాక తమ తోటి గిరిజనుల నుంచి నిరాదరణకు గురైన గంగ, చాలా దారుణంగా గ్యాంగ్ రేప్‌కు గురవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో పొట్ట కూటికోసం వ్యభిచారిగా మారుతుంది. ఆమెని వెతుక్కుంటూ వెళ్ళిన ఉపేన్‌కు రవిక తీసి, పచ్చి గాయాలుగా రక్తమోడుతున్న తన వక్షోజాలను చూపించి, ఇప్పుడు మరలా వీటిని పత్రికలో చూపించు అంటుంది. విచలితుడైన ఉపేన్… చివరికి రైలు ప్రమాదంలో చనిపోవడంతో కథ విషాదాంతమవుతుంది. కలవరపెట్టే అనేక భయానక దృశ్యాలను ఈ కథలో రచయిత్రి చిత్రించిన తీరు పాఠకులని తీవ్రంగా ఆలోచింప చేస్తుంది.
మహాశ్వేతాదేవి!!
‘రచయితలందరూ తమ తరానికి జవాబుదారులు, తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు… అంతస్సాక్షి ఉన్న రచయితలు పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.’ ‘నేను అభాగ్యుల పక్షాన నిలబడి నా శాయశక్తులా కలంతో పోరాటం కొనసాగిస్తున్నాను. ఆ విధంగా నాకు నేను సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తే తలదించుకోవలసిన అగత్యం ఏనాడూ కలగబోదు’ అంటూ తాను ఏ అక్షరమైతే రాసిందో, అదే శ్వాసగా బతికిన గొప్ప మనిషి.
గిరిజనుల జీవితాల గురించి రచనలు చేయడం కోసం, ఆ తెగలతో పాటు అడవుల్లో తిరిగి వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకున్నారు.
ఆమె ప్రతి రచనలోనూ మారుమూల అడవుల్లో ఒదిగి ఉండే అమాయక గిరిజనుల జీవితాలు కళ్ళకు కట్టినట్లు వర్ణింపబడతాయి. ఆదివాసులంటే భయంకరమైన మనుషులని వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉండవన్న నాగరిక సమాజపు అపోహల్ని ఆమె బద్దలు కొట్టింది. కొండ ప్రాంతాలంటే దొంగలు, దోపిడీ ముఠాలు నెలవుండే చోటన్న కట్టుకథల్ని ఆమె చెదరగొట్టింది. ఆమె రచనలు సామాజిక పరిశోధనా గ్రంథాలు. ఆమె అక్షరం సాహిత్య ప్రపంచపు సాధికారత.
కథలు, నవలల ద్వారా అట్టడుగు స్వరాన్ని వినిపించిన ఆమెకి పద్మ విభూషణ్, మెగనెసే, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ… ఇలా సాహిత్యంలో ఉన్న అవార్డులన్నీ పూలమాలలై వరించి తమ ప్రతిష్టను పెంచుకున్నాయి.
ఆమె రాసిన చాలా కథలు, నవలలు అప్పట్లో తెలుగులోకి అనువదింపబడినా ప్రస్తుతం చాలావరకు అందుబాటులో లేవు. ప్రస్తుత సమాజం కుల మత వర్గ లింగ ప్రాతిపదికన దారుణంగా విభజించబడిన నేపధ్యంలో అలాంటి స్పృహతో దశాబ్దాల క్రితమే మనల్ని మేలుకొలిపిన మహాశ్వేతాదేవి రచనలు ఎప్పటికీ చదవాల్సిన ఆణిముత్యాలు.