నాకు నదుల పుట్టుక, వాటి పరీవాహక ప్రాంతాలు, నదుల ఒడ్డున వెలసిన నాగరికత… ఇవన్నీ చూడటం, తెలుసుకోవడం ఒక ఆసక్తి. అనుకోకుండా ఒకరోజు అర్థరాత్రి నదీ తీరానికి వెళ్ళాల్సి వస్తుందని, మహాభారతంలో గాంధర్వ పర్వంలో ఒకే రేవులో అనేక మంది స్త్రీలు దుఃఖిస్తూ తమ సౌభాగ్యాన్ని తుడిచేసుకుంటూ నల్లపూసలని తెంచి వేసినట్లే ఈ ఆధునిక కాలంలో కాస్తో కూస్తో అభ్యుదయ భావాలతో బ్రతికే నాకు అలాంటి స్థితి వస్తుందని నేనేనాడూ ఊహించలేదు. అందులో ”గడప బొట్టు” లాంటి కథ వ్రాసిన నాకు వాస్తవ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలో అన్న స్పష్టమైన ఆలోచనయితే ఉంది కానీ ఇంత దారుణంగా అర్థరాత్రి నదీ తీరానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. అసలలాంటి తలంపే నాకు పెద్ద అవమానంగా తోస్తాను.
ఎందుకంటే… నాకు చిన్నతనం నుండి భర్త చనిపోయిన స్త్రీలని తోడబుట్టినవారు, బంధువుల మధ్య కూర్చోపెట్టి మరీ చేసే తతంగాలంటే పరమ అసహ్యం. మా పెదనాన్నగారి కూతురు, మా అక్కకి ఇలాంటి తంతే నిర్వహించారని తెలిసి బాధపడ్డాను. అక్కని ఇంటికి నిద్రకి పిలిచినపుడు ఆమె వస్తున్నప్పుడు ఎదురుగా వెళ్ళొద్దని, లోపలి గదిలోనే కూర్చోమని మా అమ్మ ఆజ్ఞ జారీ చేసినా నేను పట్టించుకోలేదు. అక్క వచ్చినప్పుడు ఆమెకు ఎదురుగా వెళ్ళి చూసాను కూడా. తర్వాత అమ్మ చేత రెండు మొట్టికాయలు తిన్నాను. మరి కొంతకాలానికే నేను పురిటి మంచంలో ఉండగానే తాతయ్య చనిపోవడంతో, మా నాయనమ్మకి అలా చేస్తుంటే తట్టుకోలేక ఏడ్చేసాను. మా అన్నయ్య, చెల్లి, మేమంతా వ్యతిరేకించినా మా మాట చెల్లుబాటు కాక అనాగరిక మూక ఆమెని ఆ అర్థరాత్రి సమయంలో మరింత దుఃఖానికి గురిచేసే తీరారు.
పసుపు రాసుకోవడం, ఇంత మందాన కుంకుమ దిద్దుకోవడం, రంగు రంగుల గాజులేసుకుని నిర్దాక్షిణ్యంగా పూలని తెంపి జడలో అలంకరించుకోవడం, వాటివల్లే అందంగా ఉన్నామని భ్రమపడటం లాంటివన్నీ లేనిదాన్ని. అలాగే మనిషికన్నా తాళిని గౌరవించడం, పరమ పవిత్రంగా కళ్ళకద్దుకోవటం లాంటివన్నీ చేయని పెడసరం మనిషిని కూడా. అకస్మాత్తుగా ఇంటికి బంధువులో, తెలిసినవారో వస్తే వారికి కొత్తగా మతం పుచ్చుకున్న వారి మాదిరిగా కనబడతాను. ఎవరన్నా సుద్దులు చెప్పినా వినేసి, నవ్వేసి ఊరుకుంటాను తప్ప నాకిష్టం లేని పని ఎన్నటికీ చేయని మొండిదాన్ని. అలాంటి నా చేత తెల్లచీర (విధవరాలు కట్టే చీర) కట్టించి కొంతమంది తృప్తిపడ్డారు. తోడబుట్టిన వారికి మంచిది కాదంట, కీడు జరుగుతుందని కొందరు ఏవేవో వ్యాఖానాలు.
నా భర్తకి 13 నెలల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ఒక అధునాతన చికిత్సా కేంద్రంలో ఆ విభాగానికి చెందిన వైద్యులు కూడా కొన్ని నెలలకు మించి బ్రతకడం కష్టమని, చికిత్స కూడా వద్దని సూచించారు. అయినా చికిత్స చేయించదలచాము. బ్రతికినన్నాళ్ళు వైద్యుల సూచన మేరకు నడుచుకుంటూ చికిత్స చేయించాము.
నలభై రోజుల క్రితం ఆయన చనిపోయిన తర్వాత నాలుగోరోజు విపరీతంగా వస్తున్న బంధువులను చూసి నా మనసులో మాటని మా కుటుంబాలలో ఉన్న అత్తలు, ఆడపడుచులు, తోటికోడళ్ళు అందరూ కలిసి కూర్చున్నప్పుడు చెప్పేసాను. ”పసుపు రాయడాలు, కుంకుమ తుడవడం, గాజులు పగలగొట్టడం లాంటి విషయాలు నేను ఏమీ చేయను. నాకు వాటిపట్ల ఆసక్తితో ఎప్పుడూ ధరించలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ధరించి వాటిని తీసేయడం లాంటివి నేను చేయను. మీరందరూ ప్రత్యేకించి ముఖం చూసే రోజు అంటూ రావద్దు, స్వీట్స్ లాంటివి తేవద్దు. వివాహం ద్వారా నాకు ఏవైతే నా శరీరంపై తోడయ్యాయో అవే తీసేసి ప్రక్కన పెడతాను, మిగతావి నేను చేయను” అని చెప్పాను. ఈ తరం వారందరూ హర్షించి మనఃస్ఫూర్తిగా అభినందించారు. అత్తల తరం వారు కొంత వ్యతిరేకత… ప్రక్క గదిలోకి వెళ్ళి చర్చలు పెట్టారు.
నాకు తెలుసు… నాకు తెలుసు… నా చుట్టూ ఉన్నవారందరూ దేని గురించి ఆలోచిస్తున్నారో. నాకొక అగ్ని పరీక్ష పెట్టదలచారన్నది నాకు సుస్పష్టంగానే తెలిసిపోతోంది. ఇలాంటిది ఏదో ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక సంవత్సర కాలం నుండి నేను తయారుగానే ఉన్నాను. జనన మరణాలు మన చేతిలో ఏమీ ఉండవన్నది రోగికి, వైద్యం చేస్తున్న డాక్టర్‌కి కూడా తెలియదు. ఏ రోజున ఏమి జరగనున్నదో… ఆయనకన్నా నేను ముందుగా చనిపోతే? అన్న ఆలోచన వచ్చి ఆగిపోయేది కూడా. జరిగేది జరిగే తీరింది. ఇక జరపాల్సింది మా వంతు అన్నట్లు ఉన్నారు ఈ కొందరు. మా అత్తగారు కూడా సాంప్రదాయాలు అని పెట్టింది ఎందుకు? అవన్నీ చేయకపోతే ఎట్లా? అని వ్యాఖ్యానించినట్లు విన్నాను. ఎవరి సూచన మేరకో మా అన్నయ్య భార్య గాజులు, పూలు, పసుపు, కుంకుమ, స్వీట్స్ తెచ్చి నా ఎదురుగా పెట్టింది. స్వీట్స్ తెచ్చి డైనింగ్ టేబుల్‌పైన, మిగతావన్నీ తీసి అద్దం అలమారలో పెట్టేసాను.
మా హౌస్ ఓనర్ కాల్ చేసి తొమ్మిదో రోజునో, పన్నెండో రోజునో, పదిహేనో రోజునో చేసే కార్యక్రమాలన్నీ ఇంట్లో చేయవద్దని చెప్పారు. పెద్ద కర్మ లాంటి సంస్కారాలేమీ ఇంట్లో చేయమని, పార్కింగ్ ప్లేస్‌లో చేసుకుంటామని చెప్పాను. మళ్ళీ తొమ్మిదో రోజు, పదకొండో రోజు అని ప్రత్యేకంగా చెప్తుంటే అప్పటికి గాని విషయం నాకర్థమై, అలాంటివన్నీ ఏమీ చేయనని చెప్పాను. దాదాపు పన్నెండు నిమిషాల సమయం అదే విషయం రిపీట్ చేస్తూ వచ్చారు. నాకు మనసుని మెలేసే నొప్పితో పాటు చెవి నొప్పి వచ్చి మాట్లాడటం ముగించాను. సొంతిల్లు లేకపోవటం అంటే ఏమిటో అర్థమై మనో దుఃఖం వెల్లువలా ముంచేసింది నన్ను. తర్వాత రోజు నా కొడుకు, పెద్దవాళ్ళు అందరూ కూర్చుని పెద్ద కర్మ రోజు ఎంతమందిని పిలవాలి, ఎంత ఘనంగా చేయాలో బంధుమిత్రులకి చేసే విందు భోజనాల్లో ఏమేమి వంటకాలు వడ్డించాలి అని మాట్లాడుకుంటుంటే, నేను తక్కువ ఖర్చుతో ముగించేసి, ఏదైనా అనాథ శరణాలయానికి విరాళం ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఆ మాటని తోసిపుచ్చి ఘనంగా చేయాల్సిందే అని, చావు కూడా పెళ్ళి లాంటిదే అన్న మాటలని, తీరుని నిజం చేయాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు నా కొడుకు.
అదే సమయానికి మళ్ళీ నాకొక ఫోన్ కాల్. మా ఇంటి ఓనరు పిన్నిగారు. ఇంట్లో పదకొండో రోజో, పదిహేనో రోజో చేసే కార్యక్రమం చేయొద్దు అని. పైగా ఆ మాటలని విన్నపం అనుకోమని చెబుతుంటే నాకు ఎందుకు బ్రతికి ఉన్నానా అని విరక్తి కలిగింది. నేను దుఃఖిస్తూ ఉంటే మా అబ్బాయి చాలా బాధపడ్డాడు. మా నాన్నగారికి ఏమి చేయాలో కొడుకుగా నేను అన్నీ చేస్తాను. అమ్మని మాత్రం అలా చేయి, ఇలా చేయి అంటూ మీరెవరూ బలవంతపెట్టవద్దు. ఆమెకి ఎలా ఇష్టమయితే అలా ఉండనీయండి అని చెప్పాక కాస్త సతాయించడం మానుకున్నారు. అర్థంలేని ఆచారాలతో, అనుమానపు భయాలతో సంకోచించే వీళ్ళందరూ చదువుకున్నవారు, స్పెక్యులేషన్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు. షేర్ల ధర ఎప్పుడు పతనమవుతుందో తెలియదన్నట్లు ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు కదా! ఇంట్లో ఎందుకు చనిపోనిచ్చారు? ఎప్పటినుండో అనారోగ్యంగా ఉన్న వ్యక్తి కదా, ముందు తెలియదా అన్న అర్థాలు. బాత్రూంకి స్వయంగా వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పడిపోయిన మనిషిని లేవదీసే క్రమంలో నా రెండు చేతుల మధ్య ఊపిరి అందక ఊపిరి ఆగిపోయిన మనిషి. నెలలు మాత్రమే బ్రతుకుతారనుకున్న వ్యక్తిని సంవత్సరం పాటు కంటికి రెప్పలా కాచుకుని కాపాడుకున్నాను, ఆయనకు సమయం వచ్చేసింది, వెళ్ళిపోయారు.
విగతజీవిగా మారిన ఆయన్ని రెండు గంటలు నట్టింట్లోనే పరుపువేసి పడుకోబెట్టాం. సంప్రదాయం ప్రకారం తలవైపు దీపం కూడా వెలిగించలేదు. మార్చురీకి పంపి ఖండాంతరంలో ఉన్న కొడుకు వచ్చిన తర్వాత దహన క్రియలు చేయడం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు జరుపుతూ మా పార్కింగ్ ప్లేస్‌లో నుండి ప్రక్కవారి పార్కింగ్ ప్లేస్‌లోకి వారి భౌతికకాయం జరిపినందుకు వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పైగా ఆ భార్యాభర్తలిరువురూ ఒకరు టీచర్, ఒకరు ఎం.ఈ.ఓ. వీరు పాఠశాలల్లో పిల్లలకి ఏం సంస్కారం నేర్పుతారో! అడుగడుగునా మూఢాచారాలు, నిత్యం పూజలు చేస్తారు. దుఃఖంలో ఉన్న, వారి ప్రక్కనున్న సాటి మనిషి పట్ల క్రూరంగా వ్యవహరిస్తారు. ఆఖరికి మా పార్కింగ్ ప్లేస్‌కి తెరలు అడ్డు కట్టుకుని కార్యక్రమం జరిపించాము. వేరే ఫంక్షన్ హాల్‌లో భోజనాలు ఏర్పాటు. ఆ రోజు మా ప్రక్క పార్కింగ్ ప్లేస్‌లో కారు పార్క్ చేసే ఉంచారు. ఇంకొక్క వికృతం ఏంటంటే ఆ రోజు నా చేత తెల్లచీర కట్టించడం, నా ముఖం బయటికి కనబడకుండా కట్టడి చేయడం లాంటి మూర్ఖాచారాలను బలవంతంగా అమలు చేయించడంలో మా అత్తగారు కృతకృత్యులయ్యారు. అయినా నా స్నేహితురాండ్రు ఇద్దరు నా దగ్గరికి వచ్చి కూర్చుని నాకు అండ అనిపించారు.
ఆయనకి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన తర్వాత మొట్టమొదటగా నేను హౌస్ ఓనర్‌తోనే విపులంగా మాట్లాడాను. ఒకవేళ ఇంట్లో ఉండగా జరగరానిది జరిగితే మీకేమన్నా అభ్యంతరాలు ఉంటాయా? అని. మాకలాంటివేమీ లేవు ఆంటీ, ఇంట్లో ఏమీ చేయొద్దు, పార్కింగ్ ప్లేస్‌లో పెట్టుకోండి, కార్యక్రమాలు అవి అక్కడే చేసుకోండి అని భరోసా ఇచ్చారు ఆమె. హమ్మయ్య! అనుకున్నాను. ఆ భరోసా వల్లనే మా వారి స్వగ్రామం వెళ్ళిపోవాలని అనుకుని కూడా ఈ ఇంట్లోనే ఉండిపోయాం. కానీ వారు మరణించిన తర్వాత వీళ్ళందరి మనసుల్లో భయాలు, అనేకానేక అనుమానాలు, మూఢాచారాలు చూస్తే మనం నాగరిక ప్రపంచంలో, ఇంటర్నెట్ యుగంలో బ్రతుకుతున్నామన్నది అబద్ధం అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడు ఉన్నా లేకపోయినా నీడ, అంటే సొంత గుడిసె చిన్నదైనా ఉండాలనిపించింది. ఒకానొక దశలో చాలా అసహనంతో ఇంటి ఓనర్స్‌కి ఏ ఏ హక్కులైతే ఉంటాయో అద్దెకి ఉన్నవారికి కూడా అవే హక్కులుంటాయి, ఆ హక్కులన్నవి ఏమిటో లాయర్ చేత ఒక నోట్ తయారుచేయించి ఇంటి గోడకి అతికించి మరీ చేయాల్సిన కార్యక్రమం చేసుకుంటామని అన్నాను. అప్పుడు నాకొక లాయర్ సపోర్ట్‌గా కూడా ఉన్నారు. కానీ నేను అలాంటిదేమీ చేయలేదు. నాకు ఇంటి ఓనర్లపైన ఎలాంటి కోపం, నిరసన కూడా లేదు. లక్షలు, ఎకరాలు, నివేశన స్థలాలు అన్నీ పోగొట్టుకున్నా ఎప్పుడూ పోయాయనే బాధకూడా లేని నాకు తొలిసారిగా బాధ అనిపించింది. ఇలాంటి సమయాల్లో సొంత ఇల్లు లేకపోవడం అనే అవమానం తట్టుకుని నిలబడాల్సి వచ్చింది.
ఇక తర్వాత రోజు నుండి నా దినచర్య మామూలుగా సాగిపోవాలి తప్పదు. ఆ సమయాన అనేక సంఘర్షణలు
ఉన్నా వంట చేయడం అన్నది అందులో ముఖ్యమైనది. నెమ్మదిగా మనసు సంభాళించుకుని లేచి నిలబడి దైనందిన జీవితంలోకి వచ్చేసాను. మంచి రోజు చూసి పుట్టింటికి నిద్రకి వెళ్ళమన్నారు. అయిష్టంగా తల అడ్డంగా ఊపాను. అక్కడ మళ్ళీ హితోక్తులు, పుట్టింటి వాళ్ళకి కీడు, ఇప్పుడు వెళ్ళకుండా తర్వాత ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళడం కుదరదు అని. అక్కడ తలవంచాను. మిత్రులు, బంధువులు అందరూ వెళ్ళిపోయారు. పుట్టెడు దుఃఖం వెంటబెట్టుకుని నా కొడుకు వెళ్ళాడు. తర్వాత బ్యాంకు పనుల నిమిత్తం, కూరగాయలు తెచ్చుకోవడానికి, కరెంటు బిల్లు కట్టడానికి అన్నింటికీ నేను మామూలుగా బయటికి వెళ్తున్నాను. నిత్యం సాయిబాబాని కొలిచే వాళ్ళు ఆయన చెప్పినవి, ఆచరించి చూపిన వాటిలో ఒక్క మార్గంలో కూడా నడవరు. ఒకే ఫ్లోర్‌లో ఎదురుగా ఉన్న ఇంట్లో మనిషి చనిపోతే చిన్న పలకరింపు కూడా పలకరించని మనుషులని చూసాను నేను.
ఇక ఇంట్లో నుండి అడుగు బయటపెట్టగానే డభేల్ మంటూ ముఖాన తలుపు వేసుకునేవాళ్ళు, నేను కనబడగానే ముఖాన చెంగు వేసుకుని ముఖం దాచుకునేవాళ్ళు, ఎదురుగా ఎప్పుడూ కనబడే మనుషులే అయినా చిన్న చిరునవ్వు నవ్వకుండా ముఖం బిగదీసుకునేవాళ్ళు… ఇవన్నీ షరా మామూలే! వీళ్ళందరినీ చూసి నేను నవ్వుకుంటాను. నాకు ముఖాన కుంకుమ పెట్టుకోవాలనిపిస్తే, గాజులు వేసుకోవాలనిపిస్తే, పూలు పెట్టుకోవాలనిపిస్తే నిరభ్యంతరంగా పెట్టుకుంటాను. ఎవరు ఏమనుకుంటారో అని నేను పట్టించుకోను.
వాస్తవ జీవితాల్లో స్త్రీల జీవితంలో మతాలకి సంబంధించిన ఆచారాలు ఇప్పటికీ కఠోరంగా ఉన్నాయి. ఇంకా అజ్ఞానం పేరుకునే ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే రాజారామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈ మూర్ఖపు సమాజంలోని మనుషులతో ఎంత యుద్ధం చేయాల్సి వచ్చిందో అన్నది తలచుకుని తెరిపిన పడతాను. ఈ అనుభవం నేను ఇతరుల సానుభూతి ఆశించి పంచుకోవడం లేదు. సమాజం ఇప్పుడు కూడా ఇలాగే ఉంది అని తెలియజేయడానికి మాత్రమే!
నిజంగా నేను చేసిన యుద్ధంలో నేను ఓడిపోయాను. ఇది మరీ అవమానంగా ఉంది నాకు. నాలాంటి, మీలాంటి వారు మార్పు కోరుకున్నా మారని, మారనివ్వని మనుషులు మన మధ్యనే ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే, ఇలాంటి మూఢాచారాల వల్ల హిందూ ధర్మం పట్ల కూడా విముఖత కలుగుతుంది. మానసిక వికాసం లేని మతం, ఆచారం, ధర్మం మనకి ఏల అనే ఆలోచనలు వస్తాయి. ఛానల్‌కి ఒక లేక నలుగురైదుగురు పండితులు, గురువులు, ప్రవచనకారులు ఉన్నారు కదా! ఔష్ట్రa్ ఱర ్‌ష్ట్రవ ఎవaఅఱఅస్త్ర శీట షబశ్ర్‌ీబతీవ? ఔష్ట్రa్ ఱర ్‌ష్ట్రవ ఎవaఅఱస్త్ర శీట తీఱ్‌బaశ్రీర? ఏమిటో అన్నది అజ్ఞానులకు తెలియజేయండి.
జీవన పోరాటంలో ఎన్నో యుద్ధాలు చేసాను. అన్ని చోట్లా నేనే గెలిచాను. కానీ ఈ యుద్ధంలో నేను ఓడితిని.
వనజ గారి యుద్ధంచేసి అలసితిని.చూసి సిగ్గుపడ్డాను..ఓ క్షణం
ఆవిడ వేదన ప్రతి అక్షరం లో, లిఖించలేని రాయడం రాని అమ్మ కి రూపం కాదా?..ఇక్కడ వనజ గారు,అద్దంలో మన బొమ్మే కదా..ముంజేతికంకనం కి అద్దం ఎందుకు?
ఇక్కడ పోరాటంలో కాన్సర్ తో ఓటమి కంటే ఇక్కడి అలసట కి బాధగా ఉంది..ఈ కాన్సర్ కి మందు లేదా? దేనిలోకి మన పిల్లల ని లాగుతున్నారు..ఎక్కడో ఉన్న వాళ్ళని వదిలితే ఇక్కడి పసిపిల్లలూ అదే వేదనలో..నాతో నడిచే ఉన్నత విద్య ,ఉన్నత పదవుల్లో ఉన్న వారు ముర్కాపు జాఢ్యాల్లో ఉండీ దేముడున్నాడు అని నమ్మితే ఇది ఎందుకు వర్తించదు ? అనే వారు ఉన్నారు.పిచ్చి సినిమాల కై టీవీ లో చర్చించే వారు కి ఇది బాధ్యత కాదా
బలమైన మీడియా లో చర్చ లు.కొంత మేరకైనా మార్పుకు తోడ్పడతాయి..ఒక్క మనసు మారినా అదో తరాన్ని మారుస్తాది…
వనజ గారు యుద్ధం లో మీరు కాదండి ఓడింది ..స్త్రీ ని మాత్రం గొప్ప సంస్కృతి పేరుతో
బలి చేసిన పెద్దోళ్ళు అనే మన చిన్న మనసున్నోళ్లు….మన తాతలు, నాన్నలు..ఇంకెవరెవరో..
వాళ్ళ కాన్సర్ కి మందు కనిపెట్టాలి…నిజం .
రిషి