నేనొక పరిశీలకుణ్ణి
ాతి హృదయాలను
పరీక్షనాళికలో వేసి పరీక్షిస్తాను
ఎర్రజెండా చేతపట్టి
ఎర్ర తిలకాన్ని దిద్ది
మీలో రక్తం ఎగిసిపడేలా
నిద్ర లేపుతాను
విప్లవాన్ని కళ్ళారా చూస్తాను
నేనొక పరిశీలకుణ్ణి
పరిశీలిస్తాను
సమాజంలో ఎన్నో బతుకుల్ని
కలం పట్టి
తెల్లని కాగితంపై
నల్లని బతుకులను పరిశీలిస్తాను.
మీ బండరాళ్ళ మనసులను
నిద్రలేపి
స్పందించేలా
చేస్తాను
విప్లవమనే ఉగ్గుపాలను
మీ నోట్లో పోస్తాను
నెత్తుటి అలలు ఎగిసిపడేలా
నా కవిత్వంతో
కనురెప్పలు తెరిచేలా చేస్తాను
మసి పట్టిన సమాజాన్ని
దుర్మార్గ రాజకీయాల్ని
నా కలంతో రిపేర్ చేస్తాను.
మేం
తీయని పదార్థంలాంటి
మీ మాటల వాసన
చీమల్లాంటి మా ముక్కులకు తగులుతుంటే
ఆ ప్రసంగాల గాలికి
మేం పుర్రెలూపుతున్నాం
ఎన్నికలకు
మీరంతా మా చుట్టూ చేరితే
మాలో భావాలు
మా నిరుద్యోగుల గానాలు
వ్యక్తం చేసి
బల్ల గుద్ది తీరుతాం
నాలోంచి నేను
పచ్చిక బయలుపై
సమకూర్చుకున్న పదాలు
తేట మాటలతో
రాసుకున్న వాక్యాలు
నే రాసే రాతలు
ఎవరో జల్లేసినట్టు
చెల్లాచెదురైపోయాయి
చిందరవందరగా పడున్నాయి
ఏరుకోలేక సతమతమవుతున్నాను
నాలోంచి నేను
నా కళ్ళల్లోంచి చూస్తూ
ఒక్కొక్కటి ఏరుకుంటూ
ఒక దగ్గరకు పోగు చెయ్యాలి
వెళ్ళిపోండి! వెళ్ళిపోండి!
అటు వెళ్ళకండి
రంగస్థలంపై
పార్టీ ప్రచారాలు
సుగంధ ద్రవ్యాల్లా ఆకర్షిస్తాయి
ఆర్భాటాలు
ప్రకటనల్లా మనసుల్లోకి దూరి
ఆశలు రేపుతాయి
అటు వెళ్ళకండి
ఆ అయస్కాంతపు మాటలకు
ఇనుప పుర్రెలింక ఊపకండి
వెళ్ళిపోండి! వెళ్ళిపోండి!