బర్మా హింస
అది చూసి
బావురుమనాలి
బౌద్ధ హంస
ఏ కాలంలోనూ
ఏ దేవుడూ
ఎవరినీ రక్షించలేదు
ఏ హంతకుల్నీ
ఏ రాజ్యం
ఎన్నడూ శిక్షించలేదు
మతస్తుల్ని చంపేరా
మనుషుల్ని చంపేరా
ఇప్పుడు కుల నిర్మూలనే కాదు
మత నిర్మూలనా జరగాలి
మనుషుల్లారా!
దేవుళ్ళని నమ్మి మోసపోకండి
ఘర్షణలు జరిగినప్పుడల్లా
దేవుళ్ళు మరణిస్తూ ఉంటారు
నిస్సహాయంగా చూస్తూ ఉంటారు
రక్త రోహింగ్యా!
నీ హంతకుల్ని కాలం విడిచిపెట్టదు.
గౌరీ!
మీ నాన్నతో కలిసి
సాహిత్య అకాడెమీ
సెంట్రల్ కాలేజీ హాల్లో
కర్నాటక కవి సమ్మేళనాల్లో
కవితలు చదివాను.
మీ నాన్న రక్తం
నీలోనూ ప్రవహించకుండా
ఎలా ఉంటుంది?
మీ నాన్న భావజాల వారసత్వం
నీలోనూ నినదిస్తూ ఉంటుంది
ఆడపిల్లను చంపి
భారతమాతను హత్య చేసారు
ముష్కరులో దుష్ట దుష్కరులో
నారింజ రంగు నాటు తుపాకి వేటగాళ్ళు
నిజంగా నిన్ను కాదమ్మా
నా బిడ్డనే చంపినట్లుగా ఉంది.