హృదయమెంత సున్నితం నేస్తం!
అందుకే భగవంతుడు దాన్ని
ఉరఃపంజరం మధ్య
అతి పదిలంగా పొందుపరిచాడు
అయినా దానికి గాయాలు అవుతూనే ఉంటాయ్
నవనీతాలు దొరుకుతూనే ఉంటాయ్…
ఎదలో తడి ఏర్పడి
ఆ ఊట నీటిబుగ్గలా పైకి తన్నుకొచ్చి
కాసేపు కనుపాపలతో చెలిమి చేసి
కనులని చెలిమెలు చేసి
అయినా కూడా నిలువలేక
మనసాగలేక
అశ్రుధారలై… దుఃఖ భాష్పాలై…
కన్నీటి వరదలై… ఉద్వేగ జలపాతాలై…
దుముకుతాయి… గంగావతరణ దృశ్యాలై…
ఇంతకన్నా ఇంకేం కావాలి… మానవతకై…
హృదయ స్పందనకై…!!