నేనే ప్రశ్నల పొదిని
ప్రశ్నల్లోంచి జవాబులు
రాబట్టే కలం యోధని
మేడిపండు విప్పి
సమాజం ముందుపెట్టి
పురుగుల్ని కడిగే ప్రవాహాన్ని
నా చుట్టూ దడికట్టేసి
కట్టడిలో పెట్టేసి
పొరలు పొరలుగా వేరుచేస్తామని
నిగూఢ సందేశాలిస్తూ
రక్తపుకూడు తినే
రాకాసి డేగల రెక్కల చప్పుడు
దొంగచాటుగా ప్రశ్నని
అమావాస్య చీకటిలో
సమాధి చేసేశానని
సెలెబ్రేట్ చేసుకుంటున్నావా
హూ… అవునులే…
వాలిని చెట్టుచాటు నుంచి
చంపిన రాముడి వారసులుగా…
అంతకుమించి ఏం చెయ్యగలరు?!
అటు చూడు…
నీవు తర్పణం చేసిన
రక్తంతో నిండిన కలాలు
ఎర్రెర్రని అక్షరాలు చిత్రిస్తున్నాయ్
నీ తూటా దెబ్బతో
నిత్య చైతన్యమైన గళాలు
విశ్వవ్యాపితమై ఇకపై
నీ ఆటలు సాగవని గర్జిస్తున్నాయ్
ఒక్క ప్రశ్నని తూట్లు పొడిస్తే
ఒక్క కలాన్ని సమాధి చేస్తే
ఒక్క గళాన్ని నులిమేస్తే
ఒక్కటి కాదు… అనంతమై… ప్రశ్నల
విత్తనాలు విస్ఫోటనమై విశ్వమంతా
ధిక్కార స్వరంతో మొలకెత్తుతున్నాయ్
పుట్టలు పగిలి పరుగులు పెడుతూ
రగుల్ జెండాలతో నీవైపే వస్తున్నాయ్
ఎన్ని ప్రశ్నలను ఏరేస్తావ్?
ఎన్ని అక్షరాలను అంతం చేస్తావ్??
ఎన్ని గొంతుకలను నులిమేస్తావ్???
నీ… దృష్టిలో నే… చలిచీమనే కావచ్చు…
ఎంతటి బలవంతమైన సర్పమైనా
చలిచీమల చేత చిక్కి చావక తప్పదుగా?!