‘స్థానిక వనరులతో సుస్థిర సేద్యం’ ఇది నినాదం కాదు. ఆచరణాత్మక కార్యక్రమం. దీర్ఘకాలిక లక్ష్యం.
ఈ ఆలోచన ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఏర్పాటుకు (CSA)కి పునాది. వ్యవసాయ రంగంలోని సంక్షోభాలతో, సాగుభూమిని వదులుకోలేక, ఆ భూమినే నమ్ముకుని బతకలేక, బతుకు దాలించుకుంటున్న రైతాంగాన్ని చూసి కలతపడింది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అంతిమంగా అన్నింటినీ నష్టపరిచే రసాయనాలు, విష కాసారాలు లేని, వ్యవసాయం వైపు అన్నదాతలను అడుగులు వేయించేందుకు కృషి చేయాలనుకుంది. అందులో భాగంగా, సేంద్రీయ సాగుపై 2004 నుండి రైతులకు శిక్షణ ఇస్తూవస్తోంది వ్యవసాయ కేంద్రం.
విస్తృతంగా ఆయా పద్ధతులపై ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ కృషిలో భాగంగా అసంఘటితంగా ఉన్న, రైతులను సంఘటితం చేసే పనిని CSA చేపట్టింది. ఈ నేపథ్యంలోనే 2013 నవంబర్‌లో రైతులు, రైతు సహకార సంఘాలు, వినియోగదారుల సహకార సంఘాలతో కలిసి సహకార సంఘాల సమాఖ్య ‘సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ’ (SAPCL)ని ఏర్పాటు చేసింది.
మహిళా సాధికారత, మహిళల భాగస్వామ్యం అనే నినాదాన్ని ఆచరణ సాధ్యం చేసేందుకు నిత్యం కృషి చేస్తోంది. అందులో భాగంగా, సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీకి కడప జిల్లాకు చెందిన మహిళా రైతు మల్లీశ్వర్యమ్మను చైర్మన్‌గా నియమించింది. మహిళా సహకార సంఘాలను కూడా ఇందులో భాగస్వాములను చేసింది.SPACL తన సభ్యుల నుండి సేంద్రీయ, పురుగు విషాలు వాడని, సేంద్రీయ ఉత్పత్తులను సమీకరించి ”సహజ ఆహారం” బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తున్నది.
రైతులకు లాభసాటి ధరలు, కస్టమర్లకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించడమే సహజ ఆహారం ప్రధాన లక్ష్యం. దేశంలో సేంద్రీయ ఉత్పత్తులను నేరుగా రిటైలింగ్ చేస్తున్న మొట్ట మొదటి రైతుల కంపెనీ ఇది. ఈ కంపెనీలో రైతు సహకార సంఘాలే భాగస్వాములుగా ఉన్నాయి.
సుస్థిర వ్యవసాయ కేంద్రం, మరో ప్రయత్నంగా, ‘డెవలప్‌మెంట్ డైలాగ్’ పేరుతో, వ్యవసాయరంగానికి సంబంధించిన అనేక విషయాలను సాహిత్య రూపంలో ప్రచురిస్తోంది. వీడియో రూపంలో పొందుపరుస్తోంది. ‘తొలకరి’ మాసపత్రికకు సాంకేతిక సహకారం అందిస్తోంది. కృషి టివి వెబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఇలా రైతాంగానికి నిత్యం చేరువగా ఉంటోంది.
ఇలాంటి అనేక అడుగులతో ముందుకు సాగుతున్న CSA, సరిగ్గా ఏడాది క్రితం ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ని కూడా ఏర్పాటుచేసుకుంది. అది కూడా అతి తక్కువ పెట్టుబడితో ఈ యూనిట్‌ని మొదలుపెట్టింది. మహిళలతోనే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కొనసాగడం మరో విశేషం. రుచి, శుభ్రత, క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, కస్టమర్ల మన్ననలు అందుకుంటోంది. ఈ ఏడాది కాలంలో స్నాక్స్, స్పైస్ పౌడర్స్, స్వీట్స్, సోలార్ డ్రై ప్రోడక్ట్స్, పచ్చళ్లు, బేవరేజెస్ ఇలా దాదాపు 40 రకాల ప్రాసెసింగ్ ఫుడ్
ఉత్పత్తులను ‘సహజ ఆహారం బ్రాండ్’ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇటీవలే బేకింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ తరం మరిచిపోతున్న, ఆరోగ్యానికి అవసరమైన చిరుధాన్యాలను, ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తోంది.
ఈ యూనిట్ నిర్వహణ వెనక దీర్ఘకాలిక లక్ష్యం కూడా ఉంది. భవిష్యత్‌లో ఆసక్తి, అభిరుచి కలిగి, స్వయం సాధికారత దిశగా అడుగులు వేయాలనుకునే మహిళలకు అండగా నిలవాలనుకుంటోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఎవరైనా, ఇలాంటి యూనిట్స్ పెట్టుకోవాలనుకుంటే, వారికి శిక్షణ ఇచ్చేందుకు మా టీం సిద్ధంగా ఉంది.