బాధిత ముస్లిం స్త్రీల ప్రతిఘటన – గీతాంజలి ”పహెచాన్‌” -షేక్‌ ఇబ్రహీం

ఇదివరకున్న సాహిత్యం కంటే ఇవాల్టి సాహిత్యం కొంత విలక్షణమైనది. ఇవాల్టి సాహిత్యం పూర్తిగా సామాజిక అవసరాల నుంచి కాలానుగుణంగా మారుతూ సామాన్యుల పక్షాన నిలబడింది. ఆంగ్ల విద్యావిధానం తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపు కుదపడం వలన విభిన్నమైన సాహితీ ప్రక్రియలు వచ్చి చేరాయి. వాటిలో కథ కూడా ఒకటి. సాహిత్యంలో ఎలాగైతే విభిన్నమైన ప్రక్రియలు చోటు చేసుకున్నాయో, అలానే కథా సాహిత్యంలో కూడా విభిన్నమైన అస్తిత్వవాద ధోరణులు చోటు చేసుకున్నాయి. ముస్లిం స్త్రీల అంతర్గత-బహిర్గత సమస్యలను గుర్తించి గీతాంజలి రాసిన ‘పహెచాన్‌’ కథా సంపుటి ఆధునిక సాహిత్యంలో ఎంతవరకు ప్రాచుర్యం వహించాయో స్థూలంగా విశ్లేషించడానికి చేసిన ప్రయత్నమే ఈ వ్యాస ముఖ్య

ఉద్దేశ్యం.

మనిషి నుంచి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతో కూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాల వారీగా, ప్రాంతాల వారీగా భాషా రూపాతరం చెందుతూ, ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖికంగా కథల ప్రచార ప్రయాణాన్ని ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష, లిపి రూపం సంతరించుకోవడంతో కథా ప్రయాణంలో వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి కథ ప్రచారంలో ఉన్నప్పటికీ ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజానీకానికి సైతం కథ చేరువయ్యింది. మానవ జీవితంలో కథ భాగమైంది.

ఒక కథను చదివిన తర్వాత మనసు చలించాలి. మళ్ళీ చదివింపజేయాలి. ఈ కథ బాగుందని పదిమందికి చెప్పించగలగాలి. మళ్ళీ పదేళ్ళో, ఇరవైయేళ్ళో పోయిన తర్వాత కథ చదివినా అదే అనుభూతిని, అదే స్పందనను కలిగించాలి. అప్పుడే అది గొప్ప కథ అవుతుంది. అలాంటి కథలు రాసే వారిలో గీతాంజలి (భారతి) గారిని ప్రధానంగా చెప్పవచ్చు.

గీతాంజలి కథలు నేరుగా పాఠకుడి మనసును తాకుతాయి. కొన్ని కథలు పాఠకుడి ముందుకొచ్చి జాలిగా నిలబడుతాయి. కొన్ని కథలు చదివాక భయపెడతాయి. కొన్ని కథలు పాఠకుడిని పరీక్షిస్తాయి. కొన్ని నిరీక్షణ నేర్పుతాయి. కొన్ని ఆలోచింపచేస్తాయి. కొన్ని కథలు అచ్చం పాఠకుడివే అనిపిస్తాయి. కొన్ని కథలు సంవత్సరాల తరబడి వెంటాడుతాయి. కొన్ని కథలు మనసుకన్నా వేగంగా పరిగెత్తిస్తాయి.

తెలుగు సాహిత్యంలో ముస్లింల జీవితాలను చిత్రించడమనేది చాలా అరుదు. గత రెండున్నర దశాబ్దాలుగా ముస్లిం రచయితలు తెలుగులో వారి సాధక బాధకాలను రాయడం అభినందించదగిన విషయమే, స్వాగతించాల్సిన పరిణామమే. అయితే ముస్లిం జీవితాలను కథలుగా మలిచే రచయితలను వేళ్ళపై లెక్కగట్టవచ్చు. ముస్లిమేతర కథా రచయితలు ముస్లిం జీవితాలను కథలుగా మలిచేవారు అరుదులో అరుదు. సురవరం ప్రతాపరెడ్డి-బీబీ, ఆళ్వారుస్వామి-కాఫీర్లు, నెల్లూరు కేశవస్వామి-యుగాంతం కథలు వచ్చాయి. ఈ కథల తర్వాత గీతాంజలి వెలువరించిన ‘పహెచాన్‌’ కథా సంపుటిని చెప్పవచ్చు. గీతాంజలి ముస్లిం జీవితాలను వాస్తవ రీతిలో ఇంత నిక్కచ్చిగా రాయడమనేది తెలుగు ముస్లిం మైనారిటీ కథా సాహిత్యానికి ఒక అదనపు బలంగా చెప్పవచ్చు.

గీతాంజలి పహెచాన్‌ కథా సంపుటిని ఏప్రిల్‌ 2007న ప్రచురించారు. ఈ కథా సంపుటిలోని 17 కథలు బాధిత ముస్లిం స్త్రీల అస్తిత్వ పోరాట కథలు. ముస్లిం స్త్రీల అంతర్గత-బహిర్గత సామాజిక వాస్తవికతే ఈ కథలకు ప్రతిబింబం. ‘ఉనో నహీ మాన్తే’ అనే మొదటి కథ నుంచీ ‘మై అమీనా బాత్‌ కర్తై’ అనే చిట్టచివరి కథ వరకు ఎంచుకున్న ప్రతి వస్తువు పాఠకుడిని ఆలోచింపచేస్తుంది. ప్రతి కథ కూడా రాలిపోయిన ముస్లిం స్త్రీల బతుకులకు కొత్త ప్రాణాన్ని అందిస్తుంది. ముస్లిం సమాజాన్ని సంస్కరిస్తుంది.

ముస్లిం స్త్రీల వెనుకబాటుతనాన్ని, అణచివేతను ప్రశ్నిస్తూ గీతాంజలి రాసిన మొదటి కథ ‘ఉనో నహీ మాన్తే’. ఈ కథలో సామాజిక వెసులుబాటునే కాక, ముస్లిం పురుష స్వామ్య వ్యవస్థ విధించిన ఆచార సంప్రదాయాలు స్త్రీలపై రుద్దడం వలన వాటిని అనుసరిస్తూ జీవితాంతం అణచివేతకు ఎలా గురవుతున్నారో గీతాంజలి తెలియజేస్తుంది. అంతేకాక ముస్లిం స్త్రీలు అమన్‌ (కడుపు)లతో పడే కష్టాల్ని, వారి మనోవేదనని మగతనపు ధీమా నాలుగు గోడల మధ్య బందీగా చేసి శారీరకంగా, మానసికంగా, లైంగికంగా కట్టడి చేసే విధానంపై కొరడా ఝుళిపించిన తీరు మెచ్చుకోదగింది. ఒక ముస్లిం స్త్రీనే కాక ముస్లిమేతర స్త్రీ కూడా తరతరాలుగా ఎందుకు అణచివేతకు లోనవుతుందంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో పెరగడం, పెళ్ళయ్యాక భర్త సంరక్షణలో పెరగడం, వృద్ధాప్యంలో పిల్లల సంరక్షణలో పెరగడం వలన స్త్రీ ఆర్థికంగా, సామాజికంగా ఎదగలేక అణచివేతల్లోనే కొట్టుమిట్టాడడమనేది జరుగుతోంది.

మిగతా మతాల కన్నా, మిగతా సమాజాల కన్నా, మిగతా వర్గాల కన్నా ముస్లిం స్త్రీలు తీవ్రమైన అణచివేతకు, ఒత్తిడికి, బాధకు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రత్యక్షంగా వారి పేదరికమైతే, పరోక్షంగా వారి మతం విధించిన కొన్ని ఆచార సంప్రదాయాలు వారిని వెనక్కి నెట్టి అంధకారంలో పడేస్తున్నాయి. ఈ రీతిలో సాగిన కథ ‘కాలీ బదరియా’. ఈ కథలో ప్రధాన పాత్ర పేరు బదరియా. వీరి తల్లిదండ్రులు పాషా అనే గూండా మాటలు విని మిగతా కూతుళ్ళ మాదిరిగా కాక, తానైనా సంతోషంగా

ఉంటుందనే నమ్మకంతో బదరియాను అరబ్‌ షేక్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఎక్కడైతే అట్టడుగు జీవితాన్ని సాగిస్తూ ముస్లింల కుటుంబాలు ఉంటాయో, అటువంటి కుటుంబాల దగ్గరికి పాషా లాంటి వ్యక్తులు అరబ్‌ షేక్‌లు ఇచ్చే దీనార్‌లకు ఆశపడి, వారికి ఎంతో కొంత డబ్బు ఎరవేసి, ముస్లిం యువతులను అరబ్‌ షేక్‌లకు ఇచ్చి నిఖా చేసేవారు కోకొల్లలు. పెళ్ళిళ్ళు చేసుకున్నా యువతుల యవ్వనాన్ని పీల్చేసి వారిని రోడ్డున పడేసే అరబ్‌ షేక్‌లు కొందరు ఉండగా, భార్యల్ని ఉన్నతంగా చూసుకునే వారూ లేకపోలేదు. అయితే గీతాంజలి రోడ్డున పడేసే వ్యక్తుల గురించి ఈ కథలో చర్చించింది.

పహెచాన్‌ కథా సంపుటిలో ఏ కథను చదివినా పాఠకుడిని కంటతడి పెట్టించడమే కాక మనసును కూడా గాయపరుస్తుంది. ఎందుకంటే గీతాంజలి రాసిన తీరు అటువంటిది. అందుకే పాఠకుడు ప్రతి కథతో మమేకమైపోతాడు. గీతాంజలి రాసిన ‘ఔలాద్‌’ అనే కథ 2003 నవంబరు 2న ఆదివారం నాడు ‘వార్త’ పత్రికలో ప్రచురితమైంది. ఈ కథలో ఆర్ఫాజ్‌ (భర్త), నఫీజ్‌ (భార్య) ప్రధాన పాత్రలు. వీరికి షాజిదా, అమీనా అనే ఇద్దరు ఆడపిల్లలు. అత్త నూరున్నీ షా, నఫీజ్‌కు మగబిడ్డ పుట్టలేదనే నెపంతో కోడలిని రోజూ చీవాట్లు పెడుతూనే ఉంటుంది. ఇటువంటి సంఘటనలు మనకు ఆవేశం తెప్పిస్తూ

ఉంటాయి. కానీ నఫీజ్‌కు ఆపరేషన్‌ అయిన సంగతి ఆర్ఫాజ్‌కు తప్ప మరెవరికీ తెలియదు. ఈ విషయం అత్త నూరున్నీ షాకు తెలియగానే అగ్గిమీద గుగ్గిలం కాగా నఫీజ్‌ను చితకబాదుతుంది. నఫీజ్‌ అంటే ఆర్ఫాజ్‌కు అమితమైన ప్రేమ. కానీ నువ్వు నఫీజ్‌కు విడాకులిచ్చి మరొక పెళ్ళి చేసుకోవాల్సిందేనని నూరున్నీ షా చేతిలో విషం పెట్టుకుని బెదిరించడంతో ఆర్ఫాజ్‌ మరొక పెళ్ళి చేసుకుంటాడు. దీంతో నఫీజ్‌ తన ఇద్దరు కూతుళ్ళతో కలిసి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆడవారు మరొక ఆడదానికి చేయూతనివ్వకపోవడం సిగ్గుచేటు, పనికిమాలిన తనం. ఇది పక్కన పెడితే భర్త బుద్ధి ఏమైందని గీతాంజలి ఖండిస్తూ రాసిన కథే ‘ఔలాద్‌’. ఒక్క ముస్లిం సమాజమే కాదు సమాజంలోని ఇతరులు కూడా మగబిడ్డే కావాలని ఉబలాటపడడమనేది బంధాల విలువల్ని మసిగల్పినట్లే. అసలు స్త్రీనే లేకపోతే మనిషి మనుగడ సాధ్యపడదు అనే విషయాన్ని మరువకూడదని గీతాంజలి తెలియచేసిన విధానం సమంజసనీయమైనది.

పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తమే ‘సైతాన్‌’ కథ. ఈ కథ మొత్తం దుఃఖభరితంగా సాగుతుంది. కథలో ప్రధాన పాత్రలు అఫ్జల్‌, అక్తర్‌ బేగం, షంషాద్‌ బేగం. అఫ్జల్‌ మొదటి భార్య అక్తర్‌, రెండవ భార్య షంషాద్‌. అఫ్జల్‌ చదువుకునే రోజుల్లో తన సీనియర్‌ విద్యార్థి బిడ్డ అయిన షంషాద్‌ బేగంతో ప్రేమలో పడతాడు. నువ్వు అక్తర్‌ బేగంతో తెగతెంపులు చేసుకుంటేనే షంషాద్‌ బేగంతో నిఖా పక్కా అవుతుందని ఆ సీనియర్‌ అఫ్జల్‌తో అంటాడు. కానీ షంషాద్‌ బేగం బి.ఎ. చదువుకున్న అమ్మాయి. ఆధునిక భావాలు గల షంషాద్‌ బేగం చుట్టూనే అఫ్జల్‌ మనసంతా తిరిగేది. అక్తర్‌ ఈ విషయాలన్నీ పసిగట్టి నువ్వు రెండో పెళ్ళి చేసుకుంటే చేసుకో కానీ నన్ను మాత్రం విడిచిపెట్టకు, మీ ఇంట్లో పనిమనిషిగా అయినా ఉంటానని భర్తను బతిమాలింది. ఇక్కడ అక్తర్‌ యొక్క సున్నితమైన మనసు పాఠకుడిని బాధిస్తుంది. కానీ అక్తర్‌ మాటలు లెక్కచేయక ఆమెను వదిలేసి షంషాద్‌ బేగంను నిఖా చేసుకుని వేరు కాపురం పెడతాడు అఫ్జల్‌. తర్వాత అక్తర్‌ దిక్కులేనిది అవడంతో దీనమైన జీవితం గడుపుతుంది. అఫ్జల్‌ షంషాద్‌ బేగంతో పెళ్ళయిన 18 సంవత్సరాల తర్వాత భార్యా పిల్లలతో కలిసి హడీ షరీఫా దర్గా వద్దకు వెళ్తాడు. అక్కడ బగారన్నం వండి అందరికీ వడ్డించారు. అక్కడున్న ఒక పిచ్చి పిల్ల వారి వద్దకు వచ్చి నిలబడింది. ఆ పిల్లను చూడగానే షంషాద్‌ బేగం కొంచెం అన్నం పెడుతుంది. కానీ ఆ పిల్ల తినదు. తర్వాత షంషాద్‌ బేగమే ఆ పిచ్చిపిల్లకు అన్నం తినిపిస్తుంది. కానీ అన్నం నోట్లోకి వెళ్ళినట్లే వెళ్ళి కింద పడుతుంది. దర్గా దగ్గరే కసువు నూకుతున్న పిచ్చిపిల్ల తల్లిని పిలిచి షంషాద్‌ చెడామడా తిట్టేస్తుంది. ఆ సమయంలో షంషాద్‌ పక్కనే ఒకవైపు అఫ్జల్‌ నిల్చుని ఉంటాడు. ఆ తల్లి అఫ్జల్‌ ముందు నిలబడి కోపంతో చూస్తూ ఒక్కసారిగా బురఖా తీస్తుంది. ఆమెను చూడగానే అఫ్జల్‌ గుండె మూడింతలు వేగంగా కొట్టుకుంటుంది. ఆమె ఎవరో కాదు అఫ్జల్‌ మొదటి భార్య అక్తర్‌. ఆ క్షణం నుంచి అఫ్జల్‌కు నిద్ర పట్టదు. తలంతా భారంగా, మనసంతా బాధతో నిండిపోతుంది. తాను ఎంత పెద్ద తప్పు చేసానో అని ప్రతిక్షణం మధన పడేవాడు. అఫ్జల్‌ మళ్ళీ ఎన్నోసార్లు అక్తర్‌ను కలిసి క్షమించమని అడిగినా ఆమె క్షమించదు, ఆమె మనసు కరగదు. కానీ అఫ్జల్‌ రోజూ తన మొదటి భార్య, పిల్లలు ఇంత దీనావస్థలో ఉన్నారా అని ఆలోచిస్తూ రోజురోజుకీ పిచ్చివాడిలా మారిపోతాడు. ఇది గమనించిన షంషాద్‌ అక్తర్‌ దగ్గరకు వెళ్ళి తనను, తన భర్తను క్షమించమని ప్రాధేయపడుతుంది. మనకు పెద్ద బంగళా ఉంది అక్కడికి వచ్చేయి అంటుంది. ఇకనుంచయినా మనమందరం సంతోషంగా ఉందామని అక్తర్‌ను కోరుతుంది. కానీ అక్తర్‌ మనసు కరగదు.

వీరి జీవితం ఇలా కొనసాగడానికి ప్రధాన కారణం అఫ్జల్‌ అక్తర్‌కు తలాఖ్‌ ఇవ్వడం. తలాఖ్‌ అంటే విడాకులని అర్థం. ఈ తలాఖ్‌ను ఇస్లాం సాంప్రదాయ ప్రకారం రెండు రకాలుగా ఇస్తారు. అందులో ఒకటి తలాఖ్‌. రెండు ఖులా. భర్త భార్యకు ఇచ్చే విడుకులను తలాఖ్‌ అంటారు. భార్య భర్తకు ఇచ్చే విడాకులను ఖులా అంటారు. 99% భర్తలే భార్యలకు విడాకులు ఇస్తున్నారు. కేవలం 0.5% కూడా భార్యలు భర్తలకు ఖులా ఇవ్వడం లేదు. ఎందుకంటే స్త్రీ ప్రధానంగా ఆర్థికంగా ఎదగలేక పోవడమే. విడాకులు పొందిన తర్వాత నష్టానికి ఎక్కువగా గురయ్యేది స్త్రీలే. ఒకవేళ ఆమెకు పిల్లలుంటే వారి యాతన అంతా ఇంతా కాదు. వారి మనోవేదనను మాటల్లో చెప్పలేము. మరింత ఆర్థికంగా చితికిపోయి దుర్భర జీవితాన్ని అనుభవిస్తుంటారు. పిల్లల భవిష్యత్తు అంధకారమై పోతుంది. అఫ్జల్‌ కూడా అక్తర్‌కు విడాకులివ్వడం వలన ఆమె ఆర్థికంగా పతనమై తన ఇద్దరు కూతుళ్ళలో నూర్‌ అనే ఒకరిని సౌదీ షేక్‌కు ఇచ్చి నిఖా చేయడం వలన తర్వాత నూర్‌ జీవితం బుగ్గిపాలవుతుంది. సరైన పోషణ లేక తన రెండవ కూతురు పిచ్చిదవుతుంది. అక్తర్‌ గుండెల్లో ఇంత బడబాగ్ని

ఉండడంతో అఫ్జల్‌ను క్షమించలేకపోతుంది. చివరికి అఫ్జల్‌ చనిపోయినా అక్తర్‌ కంటిలోనుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలలేదు.

‘దోఝక్‌’ అంటే ‘నరకం’ అని అర్థం. పహెచాన్‌ కథా సంపుటిలోని ఐదవ కథ దోఝక్‌. ఈ కథ మొత్తం 16 సంవత్సరాల జన్నత్‌ బేగం చుట్టూ నడుస్తుంది. భారతీయ ముస్లిం సమాజం వెనకబడడానికి ప్రధాన కారణం సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధికి నోచుకోక పోవడమే. దాదాపు ముస్లిం సమాజం పాతకాలపు తాతల గొప్పల్ని నెమరు వేసుకుంటూ, ప్రస్తుత వెనుకబాటు తనాన్ని కప్పిపుచ్చుకుంటూ మరింత వెనుకబడుతున్నారు. కొన్నిచోట్ల పిల్లల ఆలనా పాలనా చూసుకోవడమే గగనమై, రోజుకి ఒక్క పూట కూడా తిండి దొరకక అల్లాడే ముస్లిం కుటుంబాలు అనేకం. అలాంటి కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల జన్నత్‌ బేగం. జన్నత్‌ తల్లిదండ్రులు పూట గడవడమే కష్టంగా ఉండడంతో ఎవరో దుబాయ్‌ షేక్‌ సంబంధం తెస్తే అతనికిచ్చి ఆమెకు పెళ్ళి చేస్తారు. కూతురయినా మూడుపూటలా తిని సంతోషంగా ఉంటుందన్న చిన్న ఆశతో జన్నత్‌ తల్లిదండ్రులలాగా తమ పిల్లలను అరబ్‌ షేక్‌లకిచ్చి నిఖాలు చేసేవారు కోకొల్లలు. కానీ దుబాయ్‌ షేక్‌ జన్నత్‌ బేగంతో శారీరక ఆనందాన్ని పొంది తర్వాత ఆమెను 20 వేల రూపాయలకు మరొకరికి అమ్మేసి వెళ్ళిపోతాడు. చివరికి జన్నత్‌ బేగం ఎలాగో కష్టపడి తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటుంది. చలి జ్వరంతో దీనస్థితిలో వచ్చి పడిపోయిన కుమార్తెను చూసి ఆమె తల్లిదండ్రులు నివ్వెరపోతారు. ఆ సమయంలో జన్నత్‌ బేగం తన తల్లిదండ్రులకు చెప్పే మాటలు హృదయ వికారంగా

ఉంటాయి. తన చిన్న చెల్లెలైనా ఏ రిక్షా వాడికో, ఏ కూలీ వాడికో ఇచ్చి నిఖా చేయి అమ్మీ, కనీసం అతను ఒక పూట కాకపోయినా మరొక పూటయినా కడుపు నిండా అన్నం పెడతాడు అని జన్నత్‌ తన బాధను వ్యక్తం చేస్తుంది. ఇటువంటి సంఘటనలు నేటికీ అనేకంగా చోటుచేసుకుంటున్నాయని గీతాంజలి ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎంతోమంది జన్నత్‌ బేగంలు అరబ్‌ షేక్‌ల కామదాహానికి బలయ్యారని వాటిని వెలికితీసే క్రమంలో ముస్లిం సమాజాన్ని ప్రశ్నించిన తీరు సమంజసనీయమైనది.

మానవీయ సంబంధాలు, కుటుంబ సంబంధాలు సమాజంలో నానాటికీ కొరవడుతున్నాయి. ఈ పార్శ్వంలో సాగే కథ ‘పత్థర్‌’. పత్థర్‌ అంటే రాయి అని అర్థం. ఈ కథలో ఖాద్రి (తండ్రి) తన కన్న కూతురినే (ఆస్త్రా) పదేళ్ళ వయసు నుంచీ పదిహేడేళ్ళ వయసు వచ్చేవరకూ లైంగికంగా, క్రూరంగా హింసించి పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. ఆస్త్రా బాధతో పాఠశాలలో ఒక మూలన ఉండడాన్ని గమనించిన టీచర్‌ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళి మొత్తం విషయాన్ని తెలుసుకుని ఆస్త్రాను తీసుకుని వెళ్ళి మహిళా సంఘాలను కలిసి ఖాద్రిని కారాగారంలో ఊచలు లెక్కబెట్టేలా చేస్తుంది. అలా చేసిన ఆస్త్రాపై సమాజం జాలి చూపించాల్సింది పోయి రాళ్ళు రువ్వడం శోచనీయం. నిజానికి రాళ్ళు రువ్వాల్సింది తండ్రి ఖాద్రిపైన, తండ్రిని వదిలి తననెందుకు ఈ సమాజం శిక్షిస్తోందని ఆస్త్రా బాధపడుతుంది. చివరికి జైలు నుంచి విడుదలైన ఖాద్రి కొద్దిరోజులు బుద్ధిగానే మెలిగాడు. కానీ కుక్క తోక వంకర అన్నట్లు మరల తన రెండో కూతురైన 14 ఏళ్ళ షబానాను ఈడ్చుకు వెళ్తుండగా మూడవ కూతురు రుక్సానా గమనిస్తుంది. చివరికి తన పరిస్థితి కూడా ఇలానే ఉంటుందేమోనని భయపడుతుంది, కోపంతో రగిలిపోతుంది. తన కళ్ళెదుటే ఈ రాక్షస తండ్రి తన పెద్ద అక్క అస్త్రాను ఎన్నిసార్లు ఇలా గుంజుకుని వెళ్ళాడో కదా అని బాధపడుతుంది. శిక్ష అనుభవించి వచ్చినా ఇంకా ఇదే పని చేస్తున్నాడని, ఇటువంటి తండ్రి ఉన్నా లేకపోయినా ఒకటేనని రుక్సానా రోకలి బండ తీసుకుని తన తండ్రి ఖాద్రిని చితక్కొట్టి చంపేస్తుంది. ఇటువంటి సంఘటనలు ముస్లిం సమాజంలో మాత్రమే కాదు మిగతా సమాజాల్లోనూ లేకపోలేదు. తండ్రుల మాటున, మామయ్య, బాబాయ్‌ల మాటున, కుటుంబ బాంధవ్యాల చాటున అస్త్రాల్లా ఎంతోమంది చితికిపోయారు. ఈ సంఘటనను గీతాంజలి కళ్ళకు కట్టినట్లుగా రాసిందంటే, ఆ సమాజంలోని మహిళలతో ఎంత దగ్గర సంబంధం ఉందో చెప్పవచ్చును.

మిగతా సమాజాలతో పోల్చుకుంటే, ముస్లిం సమాజంలో ‘ఖులా’ అనే పద్ధతి ఉండడమనేది గర్వించదగినదే. పహెచాన్‌ కథా సంపుటిలో ఖులా పద్ధతి గురించి, ఖులా వలన జరిగే నష్టాల గురించి గీతాంజలి ‘ఖులా’ అనే కథను రాసింది. ఏ మతంలోనైనా వివాహమైన తర్వాత కుటుంబ బాధ్యతను, పిల్లల బాధ్యతను సర్వసాధారణంగా పురుషులే చూడడమనేది విదితమే. కొందరు పురుషులు తమ కుటుంబాన్ని, భార్యాబిడ్డల్ని పట్టించుకోకుండా వారి విలాసానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అటువంటి పంథాన నడిచిన వాస్తవ జీవిత చిత్రణే ‘ఖులా’ కథ. ఈ కథలో తాగుబోతు భర్త (ఇమ్రాన్‌) ప్రతిరోజు మద్యం సేవించి భార్య (జహంగీర్‌ బి)ను సతాయించేవాడు, కొట్టేవాడు, నరకయాతన చూపించేవాడు. భార్య ఎదురు తిరిగితే తలాఖ్‌ ఇస్తానని బెదిరించేవాడు. పిల్లల కోసం భార్య కష్టపడి తెచ్చిన కూలీని లాక్కెళ్ళేవాడు. చివరికి భార్యే భర్తకు విడాకులిస్తుంది. కానీ ముస్లింలో భార్య భర్తకు విడాకులిచ్చే సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. భార్యల్ని హింసిస్తూ, పిల్లల ఆలనా పాలనా సరిగా పట్టించుకోని ఇటువంటి భర్తలు నేటి సమాజంలో కోకొల్లలు.

వివాహమైన తర్వాత స్త్రీలు మగబిడ్డను కాక ఆడబిడ్డకు జన్మనిస్తే, కొందరు మూర్ఖత్వంతో భార్యలకు విడాకులిచ్చే సంఘటనలు భారతీయ సమాజంలో నిత్యం ఎక్కడో ఒకచోట కనబడుతూనే ఉంటుంది. ఇది ఫలానా మతంలో ఉంది, ఫలానా మతంలో లేదనీ చెప్పలేం. ఇటువంటి ఒక వాస్తవ సంఘటననే గీతాంజలి ‘ఫాతేహా’ అనే కథ ద్వారా తెలియచేసింది. ఈ కథలో మాలస్‌ బీ అనే మహిళ వరుసగా ఆడపిల్లలకు జన్మనివ్వడం భర్త అఫ్సర్‌కు కోపాన్ని కలిగిస్తుంది. అతను ప్రతిరోజూ తాగి భార్యను కొట్టడం, మగబిడ్డను ఇవ్వకపోతే విడాకులిస్తానని బెదిరించడం, అతని తల్లి అతనికి వత్తాసు పలకడం జరిగేది. మాలన్‌ బీ మరో బిడ్డకోసం ఆరోగ్యం సరిగ్గా లేకున్నా భర్త, అత్తల సూటిపోటి మాటలు పడలేక మగబిడ్డ కోసం ప్రయత్నించి చివరికి ప్రాణాలు కోల్పోతుంది. పహెచాన్‌ కథా సంపుటిలో ప్రతి కథ కూడా ముస్లిం సమాజంలో చోటు చేసుకున్న సంఘటనలే. తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందని, పురుషులకన్నా స్త్రీలకు ఒకింత గౌరవం, హోదా ఎక్కువని ఇస్లాం చాటుతుంది కదా! మరి ఈ వివక్షలు, ఈ అణచివేతలు ఏమిటని స్త్రీల వైపున నిలబడి ప్రశ్నించడమనేది మెచ్చుకోదగిన విషయం.

గాయబీ లద్దాఫ్‌ కథలో గీతాంజలి ఒకేసారి రెండు విభిన్నమైన పార్శ్వాలను తెలియచేస్తుంది. గీతాంజలి అచ్చం తాను నడిచొచ్చిన దారిలా, పుట్టి పెరిగిన వాతావరణంలా దూదేకుల జీవన స్థితిగతులను వ్యక్తపరుస్తుంది. మెజారిటీ అగ్ర వర్ణ భావజాల నిచ్చెన మెట్ల వ్యవస్థలో చతికిలబడి బడికి, గుడికి దూరమై అంటరానివారిగా అణచివేతకు, వెలివేతలకు గురైనవారు, ఆ వివక్ష నుండి విముక్తి కోసం వేచి చూసే క్రమంలో వారిని సూఫీతత్వం గుండెలకు హత్తుకుంది. కాసింత సమానత్వాన్ని, మానవత్వాన్ని, ప్రేమను ఇవ్వడమే కాక వారి మంచి, చెడుల్లో కూడా భాగమైంది. అలా వారి మనసులు కరిగి ఇస్లాంను స్వీకరించారు. వారిలో దూదేకుల వారు కూడా ఒకరు. అయితే గతంలో మతం మారక ముందు దూదేకులు పొందిన వివక్షనే, మతం మారినప్పటికీ మొదట్లో వివక్ష కనబడకపోయినా, తర్వాత ఆ వివక్ష, వెలివేతలు నేటికీ స్పష్టంగా కనబడుతున్నాయి. ఇరు మతాల సంస్కృతులకు దగ్గరై, ఇరు మతాల నుంచి తగినంత గౌరవం పొందలేక పోతున్నారు. ఇరు మతాల నుంచి సగం తురకోడు, సగం సాయిబు గాడు, పింజారీలు అనే సూటిపోటి మాటలకు గురవుతున్నారు. దాదాపు వీరు ఐదుపూటలా నమాజు, ఉపవాసాలు, రంజాన్‌, బక్రీద్‌ పండుగలను అచ్చం ముస్లింలలాగే చేస్తారు. ఆచార సంప్రదాయాలలో ముస్లింలకు ఏ మాత్రం తీసిపోరు. అయినప్పటికీ వీరితో సంబంధాలు కలుపుకోవడానికి ముస్లింలు వెనకడుగు వేస్తారు. నూటి మందిలో ఏ ఒక్కరికో తగిన అవకాశం దొరుకుతుంది.

ఈ కోణంలో ఒక దూదేకుల మహిళ వాస్తవ జీవితాన్ని ‘గాయబీ లద్దాఫ్‌’ అనే కథ ద్వారా గీతాంజలి తన వ్యధను వ్యక్తపరుస్తుంది. గాయబీ లద్దాఫ్‌ అంటే మాయమైన దూదేకులు అని అర్థం. ఈ కథలో ప్రధానమైన పాత్రలు ఫైమీనా, సలాం భాషా. ఫైమీనాకు దాదాపు 26 దాకా ముస్లిం సంబంధాలు వస్తాయి. కానీ ఫైమీనా దూదేకుల వర్గానికి చెందినదనే ఒకే ఒక కారణంతో ఏ ఒక్క సంబంధమూ కుదరదు. చివరికి అదే వర్గంలో ఇంటర్మీడియట్‌ చదువుకున్న సలీం భాషాతో ‘నిఖా’ చేస్తారు. పెళ్ళయిన కొద్ది రోజుల వరకు వారి జీవితం బాగానే సాగుతుంది. ఆ తర్వాత సలీం భాషాకు ఇద్దరు పిల్లలు పుడతారు, వారి ఆలనా పాలనా కష్టమవుతుంది. చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం లేక, జీవనోపాధి లేకపోవడంతో అతను మానసికంగా కుంగిపోతాడు. కొద్ది రోజుల తర్వాత ‘హిస్టీరికల్‌ అమ్నీషియా (మానసిక ఒత్తిడితో వచ్చే మతిమరుపు)’ అనే వ్యాధికి గురవుతాడు. దీంతో ఫైమీనా జీవితం, వారి ఇద్దరి పిల్లల జీవితం ఛిన్నాభిన్నమై అగమ్యగోచరంగా మారిపోతుంది. భర్త మతిమరుపుతో ఇల్లు విడిచి నెలల తరబడి ఏదో ఒక రాష్ట్రంలో తిరుగుతూ ఉండేవాడు. మతిమరుపు ఎప్పుడు వదిలితే అప్పుడు ఇల్లు గుర్తుకువచ్చి ఇంటి బాట పట్టేవాడు. ఈ మధ్య కాలంలో తాగుడుకు బానిసై అనేక వ్యసనాల బారిన పడతాడు. అలా పోవడం, రావడం జరిగేది. ఫైమీనా ఏదో కూలీ నాలీ చేసుకుని పిల్లలను చూసుకునేది. భర్త వచ్చినప్పుడు ఇంట్లో అన్నం సరిపోయేది కాదు. అదీకాక మళ్ళీ అతను భార్యను కొట్టి ఆమె దగ్గర ఉన్న చిల్లరంతా తీసుకుని తాగేవాడు. ఇలా ఒక ఫైమీనా జీవితమే కాదు, ఆ వర్గంలో దాదాపు సగం బతుకులు ఇలానే ఉంటున్నాయి. భారతీయ సమాజంలో మిగతా వర్గాల కన్నా దూదేకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వెనకబడి

ఉన్నారు. వీరి సామాజిక స్థితిగతులను గాయబీ లద్దాఫ్‌ కథలో చిత్రించిన తీరు పాఠకుడిని కట్టడి చేసి, ఆలోచన కలుగచేస్తుంది.

గీతాంజలి ‘బిఛ్‌ డా చమస్‌’ (తప్పిపోయిన తోట) కథ ఎత్తుగడలో హిందూ-ముస్లిం సంస్కృతి గురించి, వారి మధ్య అల్లుకుపోయిన లౌకికతను, ఆత్మీయతను గాఢంగా వ్యక్తం చేసింది. ఈ కథ హైదరాబాద్‌ వయా గుజరాత్‌ నడుమ సాగింది. రంజాన్‌ నెల వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలు, గల్లీలంతా నెల పొడవునా ఉపవాసాలతో అల్లాహో అక్బర్‌ అని అజా గొంతుతో కమ్మగా వినిపిస్తుంది. పండుగ చివర్లో దుకాణాలు చెమ్కీ బుట్టలతో, జుబ్బాలతో, రంగు రంగుల వస్త్రాలతో మెరిసిపోతుంటాయి. ఒకవేళ వినాయక చవితి వచ్చిందంటే అవే గల్లీలు గణేశుని బొమ్మతో, రంగులతో గణపతి బప్పా మోరియా అనే పాటలతో దద్దరిల్లుతాయి. దీపావళి వస్తే గల్లీలన్నీ టపాసులతో మోత మోగుతాయి. ఈ విభిన్నమైన సంస్కృతి దేశంలో ఒక్క హైదరాబాద్‌లోనే ఉంటుంది, అది దేశం నలుమూలలా ఇలానే అల్లుకుపోయింది. ఒక్కసారిగా ఈ లౌకికతను 2002 గుజరాత్‌ సంఘటన ధ్వంసం చేసిందని గీతాంజలి ఆవేదన వ్యక్తం చేసింది. అదెలాగంటే దేశంలోని ముస్లింలందరినీ అభద్రతా భావంలోకి నెట్టేసి ఒక భయాందోళన వాతావరణంలో పడేసింది. కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని సంస్థల్లోని వ్యక్తులు, మత భావజాలాన్ని పిచ్చిగా కలిగిన వ్యక్తులు కలిసి ముస్లింలపై కొనసాగించిన హింసాత్మక హత్యా దమనకాండ గుజరాత్‌ సంఘటన. ఈ ఘటనలో ఒక తల్లి చంకన బిడ్డను ఎత్తుకుని రక్షించమని రక్షక భటులను ప్రాధేయ పడగా, వారే అటు వెళ్ళమని చెప్పి వారిపై పెట్రోల్‌ వేసి సజీవ దహనం చేశారు. ఒక పిల్లవాడు దాహమని అడిగితే పెదాలపై పెట్రోల్‌ పోసి అంటించారు. అన్నల ముందు చెల్లెళ్ళని, తమ్ముళ్ళ ముందు అక్కలను, తల్లిదండ్రుల ముందు కూతుళ్ళను, భర్తల ముందు భార్యలను మానభంగం చేయడం, సాక్షాత్తు ఒక ఎం.పి. కూతురిని అతని కళ్ళెదుటే అత్యాచారం చేసి తర్వాత ఆ ఎం.పి.ని ముక్కలు ముక్కలుగా నరకడం, ఒక గర్భిణీ గర్భాన్ని చీల్చి పిండాన్ని బయటికి తీసి మంటల్లో వేయడం… యావత్ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో ఎందరో మహిళల ప్రాణాలు, శీలాలు మంట కలిశాయి. ఆ సంఘటనను కళ్ళారా చూసిన, దాడికి గురైన మహిళలను కలిసి, పరిసర ప్రాంతాలు తిరిగి వారి బాధలను, కన్నీళ్ళను తెలుసుకుని గీతాంజలి వారివైపు నిలబడి పై సంఘటనలను బిఛ్‌ డా చమన్‌ కథగా మలిచింది. ఈ కథను ఫైమీనా, జుబేదా, నూర్జహాన్‌ మొదలైన పాత్రల్లో వ్యక్తపరచిన విధానం పాఠకులకి కంట తడి పెట్టిస్తుంది.

‘పహెచాన్‌’ కథ కూడా బిఛ్‌ డా చమన్‌ కథకు కొనసాగింపే. పహెచాన్‌ అంటే అస్తిత్వం, గుర్తింపు అని అర్థం. గుజరాత్‌ సంఘటనలో ముస్లింల అస్తిత్వం ఛిన్నాభిన్నమై ఈ దేశంలో వారిని రెండవ పౌరులుగా చిత్రించి, ముస్లింలను అభద్రతా భావనలోకి ఏ విధంగా నెట్టివేసిందో గీతాంజలి ‘పహెచాన్‌’ అనే కథ ద్వారా తెలియచేసింది. ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఎస్‌6 బోగీలో చెలరేగిన మంటల్లో 59 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో ఎక్కువ మంది అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులు. ఈ ఘటన అనంతరం గుజరాత్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. మత కల్లోలాలు దావానలంలా వ్యాపించాయి. రాష్ట్రంలో 25 జిల్లాలుండగా అందులో 16 జిల్లాలు అ్లలర్లతో అతలాకుతలం అయ్యాయి. దాడులు, ప్రతిదాడులు, మారణాయుధాలతో వీథుల్లో స్వైరవిహారాలు, గృహ దహనాలు, లూఠీలు, హత్యలు, అత్యాచారాలు, సజీవ దహనాలతో 150 పట్టణాలు, వేలాది గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి బుగ్గి పాలయింది. వేలాదిమంది తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. స్వాతంత్య్రానంతరం మతకలహాల ముసుగులో ఈ స్థాయిలో గుజరాత్‌లో కొనసాగిన విధ్వంసంపై జాతి యావత్తూ దిగ్భ్రాంతికి గురైంది. అహింస, శాంతి, పరమత సహనం ప్రబోధించిన మహ్మాతులు పుట్టిన నేలపై రక్తం ఏరులై పారడంతో ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఆ సంఘటన నుంచి కోలుకోలేని బాధితులు నేటికీ ఉన్నారు. అల్లర్ల కారణంగా తమ స్వస్థలాలను వదిలి వెళ్ళిన కుటుంబాలు కొన్ని ఇప్పటికీ తిరిగి రాలేదు. ఆ ఉదంతం జరిగిపోయి 15ఏళ్ళు గడచిపోయినా సొంత గూటికి రాకపోవడం చూస్తుంటే వారెంత భీతిల్లిపోయారో అర్థమవుతుంది. పెద్దలను కోల్పోయిన అనేక కుటుంబాల జీవనం ఛిన్నాభిన్నమైంది. అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురైన యువతులు, మహిళలు ఇంకా కౌన్సిలింగ్‌ తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ అనేక కుటుంబాలు భయాందోళనల మధ్య జీవనం గడుపుతూనే ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ గీతాంజలి పహెచాన్‌ కథలో వ్యక్తపరచారు. బిఛ్‌ డా చమన్‌ కథలు చదివేవారికి గుండె ఉంటే సరిపోదు. ఆ గుండె రాతి గుండెలా రాటుదేలినట్లయితేనే చదివి తట్టుకోగలదు. ఈ సంఘటన మీద తెలుగు సాహిత్యంలో అనేక కథలు, కవితలు, విమర్శ వ్యాసాలు కోకొల్లులుగా వచ్చాయి.

ఏ సమాజంలో అయినా స్త్రీ దగ్గరికి వచ్చేసరికి ఆంక్షలు, కట్టుబాట్లు ముళ్ళకంచెలా తరతరాలుగా దాపురిస్తూనే ఉన్నాయి. ముస్లిం స్త్రీలలో ఈ ఆంక్షలు, కట్టుబాట్లు మరింత ఎక్కువ. పురుష స్వామ్య వ్యవస్థ ప్రతి మతంలోని స్త్రీలను కట్టడి చేసి, స్త్రీని కేవలం ఇంటికి, పడగ్గదికి, పిల్లలు కనడానికి మాత్రమే పరిమితం చేసి వారి స్వేచ్ఛను బందీ చేశారు. గీతాంజలి ముస్లిం స్త్రీ చైతన్యాన్ని కాంక్షిస్తూ, స్త్రీ విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ, స్త్రీల హక్కుల కొరకు పరితపిస్తూ రాసిన కథ ‘పడ్‌ నా యా మర్‌ నా’. దీని అర్థం చదవాలి లేదా చావలి అని అర్థం. ఈ కథ మొత్తం ఒక ముస్లిం మహిళ ఇంటర్మీడియట్‌ విద్యను అభ్యసించాలి అనే పట్టుదలతో అత్త, మామలను పోట్లాడి, భర్తను సర్ది చెప్పి చివరికి ఇంటర్మీడియట్‌ను ఎలా పూర్తి చేసిందనే కోణంలో సాగిన కథే ‘పడ్‌ నా యా మర్‌ నా’. మిగతా మతాల వారిలో కన్నా ముస్లిం మతంలో విద్యనభ్యసించే వారి శాతం చాలా తక్కువ. అందున ముస్లిం స్త్రీల విద్య అంతంత మాత్రమే.

గీతాంజలి కథల్లోని స్త్రీ పాత్రలేవీ భావకవుల ఊహల్లో మాదిరిగా ఆమె ఊహల్లోంచి పుట్టుకొచ్చినవి కావు. నిజ జీవితంలో తన కళ్ళముందు, తన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ముస్లిం మహిళలు అనుభవిస్తున్న మానసిక క్షోభను, హృదయ విదారకమైన యదార్థ సంఘటనలనే సామాజిక బాధ్యతగా కథలుగా మలిచింది. కాకపోతే ఒకటి, రెండుచోట్ల కొన్ని సహజత్వ పాత్రలకు కొంతమేర ఊహా శక్తిని జోడించింది అనే విషయాన్ని పక్కనబెడితే, గీతాంజలి కథల ద్వారా ఇచ్చిన సందేశం మాత్రం అక్షర సత్యం. ఈ సామాజిక బాధ్యతే గీతాంజలి నిబద్ధతకు తార్కాణం. ఏ సమాజంలోనైనా స్త్రీకి ఆటంకంగా నిలిచిన వాటిపై తిరగబడి ప్రశ్నిస్తేనే, తిరగబడి పోరాడితేనే ఆ సమాజంలో స్త్రీ అభివృద్ధి పంథాలో పయనించేదనే ధైర్యాన్ని

గీతాంజలి తన కథల ద్వారా తెలియచేసింది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.