రష్యన్‌ జానపద కథలు – స్వేచ్ఛానువాదం – పూదోట శౌరీలు

ఉమ్మడి కుటుంబాలున్న రోజుల్లో తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు రాత్రిళ్ళు కథలు చెబుతూ పిల్లలను నిద్రబుచ్చేవాళ్ళు. పిల్లలు కూడా ఆ కథలు వింటూ ఊహాలోకంలో విహరిస్తూ, కమ్మని కలలు కంటూ నిద్రపోయేవాళ్ళు. ఆ కథల్లో ఎక్కువ నీతి కథలే

ఉండేవి. ఆ నీతులను కూడా ఎక్కువగా జంతువులు, పక్షులు, ప్రకృతి పాత్రలుగా చేసుకుని చెప్పేవాళ్ళు. లేదా భేతాళ మాంత్రికుడు, పేదరాశి పెద్దమ్మ కథలుండేవి. విష్ణుశర్మ కూడా రాజకుమారులకు రాజనీతి బోధించడానికి ఎక్కువగా జంతువులు, పక్షులు పాత్రధారులుగా చేసుకునే ”పంచతంత్రం” రాశాడు గదా. పిల్లలు చిన్న వయసులో ఇలాంటి కథలు వినటం వలన వారిలో మానవతా విలువలు, సత్ప్రవర్తన అలవడుతాయి. ఇళ్ళలో ఇలాంటి కథలు చెప్పడానికి ఇప్పుడు పెద్దవాళ్ళూ కరువైనారు, తల్లిదండ్రులకూ అంత తీరిక లేదు. పిల్లలకు టీవీలు, స్మార్ట్‌ ఫోన్‌లు అలవాటు చేసి కథలు చెప్పే పని నుండి తల్లిదండ్రులు తప్పించుకుంటున్నారు. వీటితోనే అనేక సమస్యలు. ఈ మధ్య మరీ 10, 12 ఏళ్ళ పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా కాకుండా పిల్లలకు కథల పుస్తకాలు చదివే అలవాటు చేస్తే చదివే అలవాటూ పెరుగుతుంది, కథల ద్వారా మానసికానందం పొంది ఉల్లాసంగా ఉంటారు. పిల్లలు ఎక్కువగా జంతువులు, పక్షుల బొమ్మలున్న పుస్తకాల పట్ల ఆసక్తి చూపిస్తారు. అలాంటి పుస్తకమే ”రష్యన్‌ జానపద కథలు”. ఈ కథలను అనిల్‌ బత్తుల గారు తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేశారు.

పిల్లలు ఎక్కడైనా పిల్లలే, వారి తత్వాలూ ఎక్కడైనా ఒక్కటే. ఇవి రష్యన్‌ కథలైనా ఆ కథల్లోని పాత్రలన్నీ అన్ని దేశాల్లో ఉండేవే. చూడగానే వెన్నముద్దలా మెరిసిపోతూ వెంటనే చేతుల్లోకి తీసుకోవాలనిపించే వెన్నముద్దలాంటి పుస్తకం. అట్టమీద బొమ్మలో ఒక పిల్లవాడు కొండలమీదుగా ఆకాశంలోకి ఎగిరి సీతాకోకచిలుకల్లాంటి నక్షత్రాలను అందుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఒరిజినల్‌ రష్యన్‌ బొమ్మల్ని ఆర్ట్‌ పేపర్‌మీద ముద్రించటం వలన పిల్లలకు ఆ బొమ్మల్ని తడిమి చూడాలనే కోరిక కలుగుతుంది.

ఈ పుస్తకంలో మొత్తం ఇరవై కథలున్నాయి. ప్రతి కథా పిల్లల చేతికొక ఆణిముత్యమే. పిల్లలు చదవటానికి ఇష్టపడే విధంగా పెద్ద సైజ్‌ అక్షరాలతో, వరుసల మధ్య ఎక్కువ నిడివితో, చిన్న చిన్న వాక్యాలతో, చిన్న చిన్న పేరాలతో, చక్కని, చిక్కని రంగులతో ఉన్న బొమ్మలతో, కథలు మరీ పెద్దవిగా లేకుండా రెండు, మూడు పేజీలతో ముగించడం, ఇన్ని మంచి అంశాలుండటం వలన పిల్లలు విసుగుతో పుస్తకాన్ని అవతలకు గిరాటేయ్యకుండా చక్కగా చదవగలుగుతారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చదివి చెప్పగలిగే మంచి కథలున్న పుస్తకమిది.

మొదటి కథే ”బుజ్జి పిచ్చుక”. పిచ్చుకలకు మనుషులతో అవినాభావ సంబంధం ఎక్కువ. మన ఇళ్ళల్లో మనతో పాటు సహజీవనం చేసే పిట్ట ఇది. ఈ కథలో బుజ్జి పిచ్చుక ”పూడిక”కి అన్నీ సందేహాలే. ”అమ్మా మనలాగా మనుషులకెందుకు రెక్కలుండవు? ఎందుకెగరరు?” పూడికకి అన్నీ తొందరగా నేర్చుకోవాలని ఆరాటం. ఆ తొందరలో పిల్లికి ఆహారం కాబోతుంది పూడిక. వాళ్ళ అమ్మ పిచ్చుక దాన్ని కాపాడి ”పిల్లలు పెద్దల మాట వినాలమ్మా” అని సందేశమిస్తుంది. అలాగే ”అన్నదమ్ముల కథ”లో పిచ్చుకలు తమ ముక్కులతో పొడిచి మంచుగది తాళం తీయటంలో పెద్దోడికి సాయం చేస్తాయి. పిచ్చుకలు, ఇతర పక్షులు, జంతువుల సాయంతో చిన్నోడిని కాపాడుకుంటాడు పెద్దోడు. ”మేలు మరవని పిచ్చుక” కథలో పిచ్చుకలు కాకులతో యుద్ధం చేసి అవి దొంగిలించిన గాజుపూల గుత్తిని సిండ్రెల్లా పాత్రలో నటిస్తున్న మాషా వాళ్ళ అమ్మకి అందిస్తాయి.

పావెల్‌ రాసిన ”వెండి గిట్ట” కథలో వెండిగిట్ట ఉన్న మేక పిల్లల్ని ఊహా లోకంలోకి తీసుకెళ్ళి ఆనంద డోలికల్లో ఊపుతుంది. వెండిగిట్ట మేక కోసం పాప అన్వేషణ.. ఆ మేక తన గిట్టతో ఇంటి చుట్టుపక్కల, ఇంటిమీద రంగురంగుల వజ్రాలను రాల్చడం, ఆ వజ్రాలను రాల్చడంలో పిల్లి సాయం, బోలెడన్ని వజ్రాలు ఏరుకున్న పాప, పాప తాత… ఈ కథలోని వెండిగిట్ట మేకను చూస్తూ పిల్లలు కాసేపు అక్కడే ఆగిపోతారు.

పిల్లలెప్పుడూ ముదురు రంగుల్నే ఇష్టపడతారు. అవి కంటికి అనువుగా ఉంటాయేమో. అందుకే వాళ్ళు ఆడుకునే బొమ్మలన్నీ ముదురు రంగుల్లోనే ఉంటాయి. ఇంద్రధనుస్సులో ఉన్నట్టే ఉన్న ”ఏడురంగుల పువ్వు”ల రేకలతో పాప మేడలు, మిద్దెలు, అష్టైశ్వర్యాలు కోరుకోలేదు. కోరికలు తీర్చే ఏడురేకలతో చిన్న చిన్న కోరికలే తీర్చుకుంది, ఆఖరి లేత నీలపు రేకతో కుంటివాడైన స్నేహితునికి కాలిమ్మని కోరుకుంది. ”పన్నెండు నెలలు” కథలో నెలలన్నీ కూడబలుక్కుని సవతి తల్లి చేతిలో కష్టాలు పడుతున్న పాపకి మంచు బిందువులిచ్చి సాయం చేస్తాయి. పిల్లలు పుస్తకాలలో చదివినవాటిని, టీవీల్లో, సినిమాల్లో చూసిన సాహసాలను చేయాలనుకుంటారు. అలాంటి కథే ”చెట్టు రహస్యం”. అలాగే జంతువులు ప్రధాన పాత్రలుగా ఉన్న కథలు: నక్క (శీతాకాలపు కథ-12), ఒంటె (పిల్లవాడు-ఒంటె-13), కుందేలు (బుజ్జి కుందేలు ఇక సెలవ్‌-15), ఉడుత (మాయా ఉంగరమ్‌-17), కుక్క (ఇసుక తుఫాన్‌-18), ఆవు (బుల్‌ ఫైట్‌-19), గుర్రం (గుర్రపు స్వారీ-16) – ఇవన్నీ పిల్లలకు ఆనందం కలిగించే కథలే.

ఈ ”రష్యన్‌ జానపద కథల”ను అనువాదం చేసిన అనిల్‌ బత్తుల గారు ప్రతి కథ చివర మూల రచయిత వివరాలు, ఫోటోతో సహా వేసి వారిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అలాగే ఇంగ్లీష్‌ అనువాదకుల పేర్లు, చిత్రకారుల గురించి కూడా రాశారు. ప్రపంచ సాహిత్యంలో ఉన్నత స్థానాన్ని పొందిన గోర్కీ, ఐత్మాతోవ్‌, పావెల్‌ లాంటి రచయితలు కూడా పిల్లల స్థాయికి దిగి వారికోసం మంచి కథలు రాశారు. ఈ ఇరవై కథలూ పిల్లలకు నీతులు బోధించేవే. మంచి ఆలోచనలు, మానవతా విలువలు, సామాజిక సేవ, సృజనాత్మకత, సమయస్ఫూర్తి లాంటివి పెరగాలంటే పిల్లలకి ఇలాంటి పుస్తకాలు ప్రధానంగా కనిపించాలి. అందుకే అనిల్‌ గారు ఈ పుస్తకానికి స్వల్పధరనే పెట్టారు. కేవలం రూ.100 మాత్రమే. ఇది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల లైబ్రరీలలో తప్పక ఉండాల్సిన పుస్తకం.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.