విమర్శ చేస్తే తిడతాం అంటే అది పక్కా ఫ్యూడల్‌ -దేవి

కులం పేరు టైటిల్‌గా రెండు సందర్భాల్లో వస్తుంది.

కుల ఆధిపత్యం చూపదల్చుకున్నప్పుడు లేదా ఆధిపత్యంపై తిరుగుబాటు చేసినపుడు. ‘అర్జున్‌రెడి’్డకి కొనసాగింపుగా దేశ్‌ముఖ్‌ కూడా చేరింది. ఎక్కువ సందర్భాల్లో ఆ బిరుదు తెలంగాణా ప్రజలకు క్రూర అణచివేతకు సంబంధించిన చేదు జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఈ చిత్రం అన్నిరకాలుగా ఒక ఆధిపత్యాన్ని పూర్తిగా వ్యక్తి కేంద్రిత సంబంధాల్ని సరైనవే అని చెప్పడానికి, అదే యవ్వనం, అదే సూటిగా ఉండే సాహసం అని ప్రకటిస్తుంది. ఒక వ్యక్తి అతని కోరికలు, అతని ఆకాంక్షలు, అతని కోపం, అతని అద్భుత తెలివి, అతని దిగజారుడు చివరికి అన్నీ అతనే…. అతను కోరిన అమ్మాయి ఒక సాధనం. మిగిలిన వారంతా నీడలు మాత్రమే.

గతం అంతా జెండర్‌ స్టీరియో టైప్స్‌ వలన స్త్రీ పురుషుల విభజన ఉంది. ప్రస్తుతం స్థిరీకరించబడిన శారీరక మూసల వల్ల ఆడ, మగ మధ్య విభజనను కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది.

మతం, కులం, చట్టం, ఆర్థికత వంటివన్నీ కలిసి ఎంతగా ప్రయత్నించినా ఉద్యమాల వల్ల స్త్రీ పురుషులను దూరం ఉంచే వైఖరులు నిలవలేకపోతున్నాయి. ఆధిపత్యాలకి ఇష్టం లేనంతగా స్త్రీ పురుషులు చేరువగా మసలుతున్నారు. గతంలో ప్రేమ, పెళ్ళి, లైంగిక సంబంధాలు, స్త్రీలు పురుషులపై పూర్తిగా ఆధారపడి ఉండడంపై నిలబడి ఉండేవి. కాని అభ్యుదయ, స్త్రీ వాద ఉద్యమాలు సమానుల మధ్య ఏర్పడే ప్రేమ, ఆకాంక్షల భావనను ముందుకు తెచ్చాయి. అయితే ఈ భావన కొద్దిమందికే పరిమితమై ఉంది. స్త్రీ పురుష సంబంధాల్లో అన్ని రకాల సమానత్వం అనేది సమాజంలో బలంగా కొనసాగే ఆధిపత్య ప్రయోజనాలకు శత్రువు.

తనకంటే తక్కువ ధనం, తక్కువ తెలివి, తక్కువ వయస్సుగల అమ్మాయిని ”మార్క్‌” చేసి నా పిల్ల అనడంతో మొదలయ్యే ఈ సినిమా పురుషుడి లైంగిక ఆధిపత్యాన్ని స్థిరీకరించే ప్రయత్నం. తన పిల్లని ఎవరూ ర్యాగింగ్‌ చేయకూడదు. మిగిలిన అమ్మాయిలకు లైనేసుకునేందుకు అందరికీ అనుమతి. వారిని బట్టలూడతీయించవచ్చు. తన పిల్లని ముట్టుకోకూడదు. తను మాత్రం వేరేవాడి కాబోయే భార్యతో హింసాత్మక రిపో సెక్స్‌కి సిద్ధపడవచ్చు. ”పిల్ల” శరీరం అతని ఆస్తి… ఎవరూ చూడను కూడా చూడకూడదు. అలా జరిగితే అతను వాడిని చితక్కొడతాడు. దాదాపు అన్ని సినిమాల్లోనూ ఇదే ధోరణి, కానీ ఈ సినిమా ఏ ముసుగులు లేకుంగా దాన్ని ప్రకటిస్తుంది.

లైంగిక నమూనాలు తద్వారా మూసల మద్దతుతో బతికే వినిమయ సంస్కృతిలో ‘మగాడి’కి స్త్రీలు లైంగిక వస్తువులుగా కావాలి. దానికి ఏదో విజయం సాధించిన లేదా కష్టపడి పొందిన భావన కోసం ఎగ్రెసివ్‌ మేల్‌, తన లైంగిక శూరత్వాన్ని బహిరంగంగా ప్రకటించే ఒక హీరో ఇమేజ్‌ కావాలి. ఆ వస్తువును ఎంత కష్టంతో సాధించాడో అంత ఎక్కువగా దానికి విలువ ఉంటుంది. ఇక ఈ కోర్కెకు తన ఇష్టప్రకారం వస్తువుగా మారే స్త్రీ కావాలి. అతను ”అంత గొప్పవాడు”, అంత బీభత్సంగా తనను కోరడం వల్లనే ఆమె తన ఆకర్షణ, ఇష్టం, వ్యక్తిత్వం అనేవి లేని వస్తువుగా అతని చుట్టూ తిరగాలి. మరీ పచ్చి ఫ్యూడల్‌గా తీస్తే ‘యువత’ ఆమోదించడం కష్టం కాబట్టి ఇద్దరి మధ్యా తట్టుకోలేని కాంక్ష అని పేరుపెట్టడం.

”తన పిల్ల” పట్ల అందరూ గౌరవం చూపాలనే ఆ వ్యక్తి పాత్రకు మిగిలిన స్త్రీల పట్ల మాటల్లో తప్ప ప్రవర్తనలో ఎక్కడా కనీస మర్యాద కనబడదు. బహిష్టు చర్చ కూడా తన సౌకర్యాన్ని కోరుకుంటూనే నడుస్తుంది, ఒక ఉదాహరణగా. అతను చేసే దుందుడుకు వ్యవహారాలన్నీ అణచుకోలేని కోపం లేదా అతని ప్రేమ అనే వంకతో సమర్థించడం మాత్రమే కాదు అవి చాలా గొప్పగా చూపించడం. అతనికి అతని చేష్టల పరిణామాలతో కానీ, ఇతరులు ఏమౌతారు అనే దాంతో కాని కించిత్తు కూడా నిమిత్తం లేదు. అతనికి పదహారు, ఆమెకు పన్నెండు. ఇది వారు భావోద్వేగాలలో ఉండే వయస్సు. పెళ్ళికి ముందు చట్టపరిమితి వయస్సు దాటిన వాళ్ళు పరస్పర ఇష్టంతో ఏ సంబంధంలో ఉన్నా పెద్ద విషయమేమీ కాదు. అదో పెద్ద సాహసంలా చూడం… ఈ రకమైన సంబంధాలు పుంఖాను పుంఖాలుగా నిత్య జీవితంలో జరుగుతూనే ఉన్నాయి.

ఆ అమ్మాయి దూరమయ్యాక తీవ్రమైన కోరికతో అది ఏదో ‘దాహం వేసింది గ్లాసెడు నీళ్ళిస్తావా’ అనడిగినట్టు ‘నా శారీరక కోర్కె తీరుస్తావా?’ అని అడగటం. అతని లైంగిక యిచ్ఛ ఒక ఘనకార్యం… స్త్రీలకు లైంగిక సంబంధం ఎప్పుడూ గ్లాసెడు నీళ్ళుకాదు, ఆంబోతులయిన మగాళ్ళకి తప్ప. శారీరక సంబంధాల్ని పచ్చిగా, మొరటుగా తయారుచేయడం ద్వారా (ఈ ఇమేజెస్‌ అన్నీ అది టివి, నెట్‌, సినిమా… ఏదయినా) స్త్రీ పురుషుల మధ్య సమానమైన లైంగిక అభివ్యక్తీకరణ లేకుండా పోతోంది.

ఇటీవలి కాలంలో స్త్రీలు విశ్వాసంతో స్వీయ వ్యక్తిత్వంతో ఎదుగుతున్న తీరుని దారి మలచి, వాళ్ళని వస్తువులుగా చేసి లేదా స్త్రీల కోరికల్ని చౌకబారుగా చూపే దిగజారుడు శృంగారం ద్వారా వారిని అవమానించి దెబ్బతీయడం జరుగుతోంది. స్త్రీ, పురుష సంబంధాల్లో విలువల సమతుల్యత అవసరం. వాటిని అభద్రత, అసమానతలతో అస్తవ్యస్తం చేయడం ఆధిపత్యపు కొనసాగింపే.

దేవదాసుకు సీసా, చంద్రముఖి, కుక్క… ఇతనికి డ్రగ్స్‌, అమ్మాయిలు, కుక్క… వాస్తవం నుండి పలాయనం. దేవదాసులో ఆర్థిక అంతరాలు, ఆనాటి సామాజిక పరిస్థితులు, స్వాభిమానం అడ్డంకి. ఇక్కడ కేవలం వాళ్ళిద్దరి ప్రవర్తనలే కారణం. తీవ్రమయిన ఆకాంక్ష ఉంటే ఆ పాత్ర ఆమెతో కలిసి బతికే అవకాశాలు వెతుకుతుంది. మానసిక రుగ్మత గల పాత్రలకు కూడా ఒక తార్కికత, పాత్ర తాలూకాకు స్వభావంలో సమగ్రత ఉండాలి. ఇద్దరూ డాక్టర్లు… శుభ్రంగా బయటికి పోయి పెళ్ళి చేసుకోవచ్చుగా (ఇది ఇవాళ పల్లెటూళ్ళ వాళ్ళకి కూడా తెల్సు). పాత్ర ఔచిత్యం లేకుండా కథాగమనంలో అతుకులు పడడానికి కారణం దేవదాసుని ఆధునీకరించే ప్రయత్నమే. లాజిక్‌ ప్రకారం జరిగితే డ్రగ్స్‌, అమ్మాయిలపై ఎగబడటం, ప్యాంటులో ఐస్‌ వేసుకోవడం వంటి సాహసోపేత సీన్లు ఉండవు. సిన్మాల్లో లాజిక్కు అడగడం మతిమాలినతనం కావచ్చు.

ఒక సాపత్యం ఉంది. దేవదాసు సీసా ఇక్కడ డ్రగ్స్‌ అయ్యింది… అక్కడా ఇక్కడా కూడా కథానాయిక ‘మత్తు’ జోలికి పోదు. అక్కడ అనుమతించే పరిస్థితులు కావు. ఇక్కడ డాక్టర్‌ కాబట్టి బిడ్డకు హాని కాబట్టి మత్తు తీసుకోలేదా! లేదా ఇతనంత గాఢత లేకపోవడం వల్లనా? పోనీ అతని లాగానే పరపురుషులని ట్రై చెయ్యొచ్చుగా! అలాగే జరిగితే అసలు ఈ సినిమా అంతర్గత ప్రయోజనం కుప్పకూలిపోతుంది. అతను మగాడు. అతని బాధని డ్రగ్స్‌లో, తిరుగుబోతుతనంలో సమాజం ఆమోదించింది. స్త్రీకి ఆ అవకాశం లేదు… ఉండకూడదు. కనుకనే పెళ్ళాడినవాడిని ముట్టుకోనివ్వలేదని చెప్పించి మధ్య యుగాల మిల్స్‌ అండ్‌ బూన్‌ ముగింపు. ”నేనూ ట్రై చేశా ఇతర మగాళ్ళతో కానీ నీపైన ప్రేమ వలన వర్కవుట్‌ కాలేదు” అంటే ఏమయినా కాపట్యాన్ని ద్వంద విలువల్ని బ్రద్దలు కొట్టినట్టుండేది.

అహఁ! ఆమె శీలం ఏ మాత్రం చెడకుండా అంటే అతని ఆస్తిపై ఎవరూ దురాక్రమణ చేయలేదని చెప్పించి పురుషాధిక్య విషాదాన్ని సంతోషంగా ముగించారు.

డ్రగ్స్‌ వాడేవాడు, తాగుబోతు పాసుపోసుకుంటాడు. ఇంకా చాలా జరుగుతాయి. మిత్రుడి మేడపైన ఆ పనిచేయడం అతని సంస్కారం. ఈ దేశంలో 50 శాతం మంది మలవిసర్జన బయటే చేస్తారు… గతిలేక. ఇది బోల్డ్‌నెస్‌ కాదు విషాదం. జనసమ్మర్దం ఎంతున్నా పట్టించుకోకుండా చెట్టుకీ, కరంటుపోల్స్‌కీ, పేవ్‌మెంట్‌కీ పోసే ప్రతివాడు ఇప్పుడు బోల్డ్‌. శాలువాలు కప్పాలా?

బూతులు … నీయమ్మతో మొదలుపెట్టి ”తన పిల్ల” మర్యాద కాపాడ్డం. బూతులు జనం రొటీన్‌గా వాడతారు. కానీ ఈ హీరో రొటీన్‌ కాదుగా… అసామాన్యుడు… బ్రిలియంట్‌ డాక్టరు…డాక్టర్లు వాడటం లేదా! వాడుతుండొచ్చు. కాని వారు గాని, విన్నవారు గాని అహ ఇతనికి హిపోక్రసీ లేకపోవడం వలన బూతులు తిడుతున్నారని భావిస్తారా? అట్లయితే గల్లీల్లో చిల్లర గూండాల భాష గొప్పది. డాక్టరయితే మనిషి కాదా? మనిషే. కోపం రావచ్చు కాని సమాజంలో కోపం ప్రకటించడం వారి వారి సంస్కార స్థాయిని బట్టి ఉంటుంది. బ్రిలియంట్‌ డాక్టర్‌తో పచ్చిగా తిట్టించడం అతుకుపడదు.

వృత్తిపట్ల గాఢమైన ఆవేశం ఉంటే ప్రేమ వైఫల్యపు నిరాశను వాస్తవంలో అది తగ్గిస్తుంది, స్వాంతన ఇస్తుంది. అద్భుత ప్రతిభగల ఈ డాక్టరు అది తన లక్ష్యం అని చెప్పుకున్న డాక్టరు (దేవదాసుకి వృత్తి లేదు) డ్రగ్స్‌ను ఆశ్రయిస్తాడు. పోనీ అది బలహీనత అనుకుందాం. ‘కేసు’ విచారణలోగాని తాను చేసిన ప్రతిజ్ఞ గుర్తుకు రాదా? (అది కూడా డ్రగ్స్‌ మత్తులోనే) రోగుల నమ్మకాన్ని వమ్ము చేశానని అప్పుడు చెప్పడం… ఏ నిజాయితీ! అబద్ధం చెప్పి తప్పించుకోగలిగినా చెప్పకపోవడమా? ఆపరేషన్స్‌ ఫెయిల్‌ కాలేదుగా అంటే రోగి చస్తే తప్ప డాక్టరు ఎట్లా అయినా ప్రవర్తించవచ్చా? ప్రేమ వైఫల్యంతో డ్రగ్స్‌కి బానిసవ్వడం ఓ గొప్ప విషయంగా గ్లోరిఫై చేయడంతో ఆగలేదు, డ్రగ్స్‌ తీసుకుని వైద్యం చేసినా వారి నైపుణ్యం చూసి వారిపై సానుభూతి కలిగించడం… మరీ దుర్మార్గం.

”ఒక flow లో గర్భం వచ్చేయాలి అలా జరిగిపోవాలి” ఇదో అద్భుత ప్రేమ… ప్రేమించిన స్త్రీ పట్ల బాధ్యత… ఆమెకు కావాలో వద్దో తెల్సుకోనవసరం లేదు… ఇతని ఆస్తి కదా ఆమె శరీరం… ఇది నైతికమా అనైతికమా అని కాదు… ఈ సిన్మాను ఎగబడి చూస్తున్న యువత ఎట్లాంటి భావనలకు లోనవుతుంది. ప్రేమిస్తే శారీరకంగా కలవాలనే కోరికతో అమ్మాయిలను వశపర్చుకుంటున్న వారు ఇక టశ్రీశీష లో జరిగిపోవాలి గర్భాలు అని సాహసోపేతంగా తమ ప్రేమ లోతు నిరూపించదలిస్తే? సహజీవనం అని, కులం, కట్నం కోసం వదిలేశాడనే కేసులకు ఇప్పుడు బిడ్డలు తోడవుతారు. ”పోతే పోయాడులే నీ బతుకు నువ్వు బతుకు” అని అమ్మాయిలకు ధైర్యం చెప్పడం మానేసి… ఆ కోరుకోని బిడ్డల పోషణ గురించి ఆలోచించాలి కామోసు. హీరో ఆరడుగులు, తెల్లరంగు, కండలు, సామర్ధ్యం గల అగ్రత్వం, నల్లరంగు, తక్కువ ఎత్తు, బహుశా తక్కువ కులం, తక్కువ తెలివి గల మిత్రుడు… దేవదాసుకి నమ్మకస్తుడయిన నౌకరు. కాని ఇక్కడ అగ్రత్వం… వర్ణంలో సామీప్యత ఉండాలి. ఈ తక్కువ వారు తిట్లు, చీవాట్లు, తిరస్కారాలు తింటూ అతని వెర్రివేషాల్ని విశ్వాసంతో భరించాలి. ఇది ఏ ఆధిపత్యం… మిత్రుల మధ్యా ఆధిపత్య సంబంధాలే.

నేటి సమాజంలో లైంగిక వాంఛల పట్ల ఉండే హిపోక్రసీని నిజానికి ఏమయినా బ్రద్దలు కొట్టిందా ఈ సినిమా? లేదు. వాటిని తిరిగి రుద్దింది. టీనేజీ పోరగాళ్ళ మనసుల్లో ఉండే మగాడితనం దూకుడు వంటి ఫాంటసీలను పోషించింది. ఇదో సెక్సు బజారు. సెక్స్‌ బజారంటే అరకొర బట్టలతో, మాటలతో రెచ్చగొట్టడమే కాదు, అది అందరికీ తెల్సిపోతుంది, ఇది మురుగు అని. కానీ ఈ సెక్స్‌ బజారులో స్త్రీలు ఎసెర్టివ్‌గా ఉండడం మగతనానికి సవాలుగా భావించే వాళ్ళంతా ఈ డబ్బు చెల్లించి పదే పదే వారిలో దాగిన కోరికల్ని తెరపై కొనుక్కుని మరీ మూల్యం చెల్లించుకుంటారు. ఈ ప్రతిబింబాలు వారి సహజ లైంగికతలో జోక్యం చేసుకుని దాన్ని చిందరవందర చేస్తాయి. అమ్మాయిల శరీరాలు, ఫోర్‌ ప్లే డాన్సులే కాదు అబ్బాయిల శరీరాల్ని లైంగిక సరుకుగా మార్చడం కూడా అశ్లీలమే, దుర్మార్గమే.

సమాజంలో రకరకాల క్రూరత్వాలు, నీచత్వాలు, ఆధిపత్యాలు, కపటత్వాలు ఉన్నాయి. అవి మానవ విలువలు కాదని… ఏ కథ ద్వారా, ఏ తీరులో, ఏ ఘర్షణలో చెప్పినా ఆహ్వానించాలి. ఈ కథ ఆధిపత్యాన్ని నిలిపే రకరకాల హింసల్ని సమర్థించింది (అనేక సినిమాల్లాగే). ఆధిపత్యాల్ని కొనసాగించడానికి ప్రేమ భావనని కొత్త పద్ధతిలో బలంగా వాడుకుంది. కనుకనే దీనిపై మాట్లాడాలి. డబ్బు చెల్లించి సినిమా చూశాక అది పబ్లిక్‌లోకి వచ్చాక… అభిప్రాయాల్ని చెప్పే హక్కు ప్రతివారికీ ఉంది. విమర్శ చేస్తే తిడతాం అంటే అది పక్కా ఫ్యూడల్‌. (సంచలనం కోసం వ్యూహం కూడా కావచ్చు). దేవదాసు ఫ్యూడల్‌ అసమానతలకి బలయిన ఒక బలహీన వ్యక్తిగత విషాదం. ఈ సినిమా హింసలేని సమాన లైంగిక సంబంధాలవైపు కాకుండా స్త్రీని ఆస్తిగా పరిగణించే ఆధునిక ఆధిపత్య సంబంధాలను నిలబెట్టేందుకు ప్రయత్నించిన ఒక ప్రారంభం. అన్ని సిన్మాల్లో ఇదే ఉన్నా ఇది పచ్చిగా సమర్ధించింది కనుకా… ఇది యువత బాగా చూస్తున్నారు కనుకా… ‘లాభం వస్తే చాలు అదేం చెప్పినా సరే… జనం పట్ల మాకేం బాధ్యత’ అని సిన్మా వాళ్ళు మాట్లాడుతున్నారు

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.