నవల నా మొదటి కూతురు – యుద్ధనపూడి సులోచనా రాణి

నేను పల్లెటూర్లో పుట్టాను. మాది సంప్రదాయమైన సమిష్టి కుటుంబం. మా నాన్నగారే అన్నీ చూసుకునేవాళ్ళు. ఆయనొక్కరు సంపాదిస్తే ఇరవైమందిమి తినేవాళ్ళం. నేను పెద్దయ్యేసరికి మా ఊరికి హైస్కూల్‌ వచ్చింది. నా చదువు హైస్కూల్‌తోనే ఆగిపోయింది. ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండేవి. మా నాన్నగారు డబ్బులు ఇబ్బంది ఉన్నా కూడా ప్రభ, పత్రిక లాంటి పుస్తకాలు చందా కట్టించి తెప్పించేవారు. అలా మాకు చదవటం చిన్నప్పటి నుంచే అబ్బింది. ఇంకా చాలా పుస్తకాలు కొని తెచ్చేవారు. మా నాన్నగారి ఆదరణ, అమ్మగారి ఆప్యాయత చూసి చాలామంది చుట్టాలు సెలవులయితే చాలు మా ఇంటికి వచ్చే

వాళ్ళు. మేం ఎక్కడికీ వెళ్ళేవాళ్ళం కాదు.

మా అన్నయ్యకు కథలు రాయడం చాలా ఇష్టం. కథలు రాసి పత్రికలకు పంపితే అవి తిరిగి వస్తుండేవి. ఆయన రాత బాగుండేది కాదు. నా చేతివ్రాత బాగుంటుంది. అందుకే ఆయన డిక్టేట్‌ చేస్తుంటే నేను రాసేదాన్ని. సెలవులు వస్తే ఇంకా ఎక్కువగా రాసేదాన్ని. అలా నాకు రాయడం అలవాటయింది. ఆ రోజుల్లో కరెంట్‌ ఉండేది కాదు. దీపం పెట్టుకుని రాసేవాళ్ళం. ఊళ్ళో మాది పెద్ద ఇల్లు. గడపమీద దీపం పెట్టి ఒకవైపు అన్నయ్య ఇంకొక వైపు నేను కూర్చుని రాసేవాళ్ళం. మా నాన్నగారు రేడియో కూడా కొన్నారు. రేడియో బాగా వినేవాళ్ళం. అన్నయ్య రాసినవి పత్రికల వాళ్ళు వేసుకోకుండా తిప్పి పంపడంతో ఆయన రాయడం మానేసాడు.

అపుడు నేను ఎందుకు రాయకూడదు అనుకొని ఒక కథ రాశాను. రేడియో కోసమని రాశాను. ‘చిత్రనళనీయం’ అనే కథ. అది పత్రికకు పంపాను. రెండు మూడు వారాలలోనే దానిని ప్రచురించారు. అది కూడా సెంటర్‌ స్ప్రెడ్‌లో యద్ధనపూడి సులోచనారాణి అని తాటికాయంత అక్షరాలతో ప్రచురించారు. అది చూసి చాలా సంతోషమేసింది. ఇంట్లో వాళ్ళందరూ అన్నయ్య రాసింది పంపిందేమో అంటే నేను బాగా ఏడ్చాను. నేను రాసానంటే ఎవరూ నమ్మలేదు. నేను రాయలేదు, పాపే రాసిందండి అన్నాడు అన్నయ్య. ఇంట్లో నన్ను పాప అని పిలుస్తారులెండి. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న ఊళ్ళో నా పేరు వెతుక్కుంటూ పోస్ట్‌మేన్‌ 15 రూపాయలు ఎమ్‌.ఓ. తెచ్చాడు. ఎన్నో సినిమాలకు కథలు రాసి ఎంతో రెమ్యునరేషన్‌ తీసుకున్నాను కాని, మొదటి కథకు నాకు వచ్చిన 15 రూపాయలు నిజంగా నాకెంతో ఆనందాన్నిచ్చాయి. ఇప్పటికీ తలుచుకుంటే చాలా సంతోషమనిపిస్తుంది. ఆ జ్ఞాపకం నా మైండ్‌లో ఇంకా ఫ్రెష్‌గానే ఉంది. ఆ డబ్బులతో మా మామయ్యతో రహస్యంగా తెల్లని జరీ పంచెలు తెప్పించి నాన్నగారికి ఇచ్చాను. ఆయన చాలా సంతోషపడ్డారు. నాకు ఎమ్‌.ఓ. రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ తరువాత వరుసగా కథలు పబ్లిష్‌ అయ్యాయి.

1959లో అనుకుంటాను. ‘ఐ లవ్‌ యు’ కథ రాశాను. ఆ కథ ఏంటంటే ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఎవరో అమ్మాయి ఫోటో ఎక్కడో చూసి ఆమె కోసం ఇండియా వస్తాడు. అప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళయిపోతుంది. అయినా ఇద్దరి మధ్యా ప్రేమ పుడుతుంది. కానీ అతను కొన్ని రోజుల తర్వాత తిరిగి అమెరికా వెళ్ళడానికి విమానం ఎక్కుతాడు. ఆ విమాన ప్రమాదంలో అతను చనిపోతాడు. అది విన్న ఆ అమ్మాయి పిచ్చిదయిపోతుంది. నిజమైన ప్రేమను పొందినవాళ్ళు అది అందకుండా పోతే పిచ్చివాళ్ళవుతారు అనే ఉద్దేశ్యంతో ఆ కథ రాశాను. నా ఉద్దేశ్యం అప్పుడు, ఇప్పుడు కూడా అంతే.

నా మొదటి నవల రాయడం చాలా తమాషాగా జరిగింది. జ్యోతి ఎడిటర్‌గా లీలావతి రాఘవయ్య గారు పనిచేస్తుండేవారు. రమణ, బాపు గార్లు వచ్చి నవల రాయమని నన్ను అడిగారు. నేను నవలలు రాయలేను, కథలయితే రాస్తాను అంటే పెద్ద కథ రాయి అదే నవలవుతుంది అన్నారు. నాకు బాపు, రమణ గార్లంటే చాలా ఇష్టం. వారి మాట కాదనలేక రాసాను. అలా బాపుగారు నా చేత ‘సెక్రటరీ’ నవల రాయించారు. పెద్ద కథ కాస్తా పెద్ద నవల అయిపోయింది. ఆ తర్వాత నార్ల వెంకటేశ్వరరావు గారు వచ్చి అడిగినపుడు ”మీనా” రాసి ఇచ్చాను. ఆ తర్వాత జీవన తరంగాలు పెద్ద సక్సెస్‌ అయింది. ఈ నవలలు పాఠకుల ఆదరణ పొందాయి. పాఠకులకు నచ్చుతుందో లేదో అని ఆలోచించేదాన్ని కాదు. నాకు తోచింది రాయడం నా అలవాటు. నార్ల వెంకటేశ్వరరావు గారు జీవనతరంగాలు వస్తున్నప్పుడు ”ూష్ట్రవ ఱర ్‌ష్ట్రవ శీఅశ్రీవ షతీఱ్‌వతీ” అనేవారు.

నా నవలలు 17 సినిమాలుగా వచ్చాయి. చెప్పానుగా మాది చాలా సంప్రదాయబద్ధమైన కుటుంబమని. మగవాళ్ళు ఎవరైనా ఇంటికొచ్చి మాట్లాడుతుంటే మేం పక్కకు తొలగిపోవాలి కానీ వాళ్ళకు ఎదురుపడకూడదు. అలాంటి వాతావరణంలో నుంచి వచ్చిన నేను పబ్లిషర్లు, సినిమా ప్రొడ్యూసర్లతో మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉండేది. క్రమంగా అన్నీ నేర్చుకున్నాను. ఏదైనా త్వరగా నేర్చుకునేదాన్ని. నేను పబ్లిషర్‌ నుంచి ఇంకో పబ్లిషర్‌కు మారినపుడు కూడా ఎలా మేనేజ్‌ చేయాలో కూడా నేర్చుకున్నాను..

ఎల్‌.వి.ప్రసాద్‌, ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్‌ లాంటి వాళ్ళు మా ఇంటికొచ్చారు. చాలా బాగా మాట్లాడారు నాతో. అయితే వాళ్ళెవరో నాకు తెలియదు. అందరూ నిజంగా వాళ్ళు వచ్చారా అని

అడిగేవాళ్ళు. అలాంటి వాళ్ళతో కూడా భయం లేకుండా మాట్లాడేదాన్ని. నాకెంతో పేరు వచ్చింది అయితే దీని వెనుక నా కృషి ఎంతో ఉంది. ఇలా రాయాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా నాకు తోచింది రాసుకుంటూ పోయేదాన్ని. పాఠకులు ఆదరిస్తూ ఉన్నంతకాలం రాయడం జరుగుతూనే ఉంటుంది. అప్పట్లో చదువుకున్న ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఏదో అసంతృప్తి ఉండేది. బహుశ వీళ్ళే నా నవలలు ఎక్కువ చదివేవాళ్ళు. వాళ్ళ మనసుల్లోని అసంతృప్తులు ఎలా తీర్చుకోవాలో అర్థంకాని స్థితిలో

ఉండేవాళ్ళు. వీళ్ళే నా సీరియల్స్‌ ఎక్కువ చదివేవాళ్ళు.

నా స్టయిల్‌ అనేది స్వతహాగా వచ్చింది. దీన్ని నేను పనిగట్టుకుని సాధించలేదు. మనుషులకు ఫ్యామిలీ కావాలి. ఈ రోజుల్లో ఒంటరిగా కూడా ఉంటున్నారు. కష్టానికి, సుఖానికి ఒక తోడు ఉండాలి. అది నా నమ్మకం కావొచ్చు. మనిషికి మనిషి తోడు కావాలి. అది మనం ఏర్పర్చుకోవాలి. దాదాపు 45 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. మేము నాణేనికి ఒకవైపు చెబుతున్నాం. స్త్రీవాదులు ఇంకొక వైపు గురించి మాట్లాడుతున్నారు. రెండూ ఒక్కటే కానీ చెప్పే పద్ధతే వేరు. స్త్రీ వాదులు హింస గురించి మాట్లాడతారు. నిన్ను హింసిస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలుండొచ్చు. మానసిక, శారీరక బలం ఉంటే దాన్ని ఎదురించు, లేకుంటే అక్కడినుండి వెళ్ళిపో. ముందుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించు. నీ లైఫ్‌ గురించి ఆలోచించు. దాని తరువాతే మొగుడు, పిల్లలు అని చెపుతాను.

ఆడవాళ్ళకు ఇల్లు అనేది ఓ భద్రతనిస్తుంది. ఇంట్లో భర్తే భార్యను హింసిస్తే ఆమె ఎక్కడికి వెళ్ళాలి. బయటకు వెళితే చాలా కష్టం. ఇక్కడ హింస, అక్కడ హింస. అపుడు స్త్రీ జీవచ్ఛవం కావాలి. అంతేకాదా, మనం స్వేచ్ఛగా ఉండాలి. మన స్వంత దారిలో మనం ప్రయాణించాలి. కొన్ని విప్లవాలకు నిశ్శబ్దం కావాలి. భర్త హింసిస్తే బయటకు వెళ్ళి ఏదైనా ఫైన్‌ఆర్ట్స్‌లో చేరి ఏమైనా నేర్చుకోవచ్చు. మైండ్‌ డైవర్ట్‌ చేసుకోవాలి. అలా ఎవరి జీవితాన్ని వాళ్ళు సరిచేసుకోవచ్చు. ‘పెళ్ళి, పిల్లలు జీవితం’ అనే కథలో ఒక అమ్మాయి సింగిల్‌గా ఉండి లైఫ్‌ను ఎదుర్కొంటుంది అని రాశాను. కలల రాణి సులోచన రాణి అంటారు కొంతమంది. నాకేం కోపం రాదు. అలాంటి వాళ్ళను అసలు పట్టించుకోను.

నేను చాలా కుటుంబాలు చూశాను. ఒకావిడ చాలా బాగా పాటలు పాడేది. ఆమె భర్త పాడనిచ్చేవాడు కాదు. నాకు చాలా బాధనిపించేది. మంచి భర్త దొరకలేదు ఆవిడకి అని బాధపడేదాన్ని. ‘మీనా’లో పల్లెటూరి వాతావరణం చిత్రించాను. ఎందుకంటే నేను ఊర్లో పెరిగాను. ఆ ఆత్మ సౌందర్యం ఉంటుంది కదా. మా ఊర్లో చాలా బాగుంటుంది. చెరువు నిండా కలువలు ఉండేవి. ఆ ఊరి వాతావరణం ‘మీనా’లో లాగా బాగా కన్పిస్తుంది. ప్రస్తుతం మా ఇంటిలో అందరం కలుస్తాం, కబుర్లాడుకుంటాం. నాకు ఒకత్తే అమ్మాయి. అమెరికాలో ఉంటుంది. అప్పుడప్పుడూ వెళ్తాను. ఒకసారి అమెరికాలో ఒక ప్రైజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నాను. అక్కడ నా ముందు వరుసలో కూర్చున్న పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. కొంచెంసేపయ్యాక వాళ్ళకు తెలిసింది నేనక్కడ ఉన్నానని. వాళ్ళు వచ్చి యద్ధనపూడి సులోచనారాణి మీరేనా? అంటూ బాగా మాట్లాడారు. ఇంకొకావిడ వచ్చి మా అబ్బాయికి రాజశేఖర్‌ అని పేరు పెట్టాను అని అంటే నాకు చాలా సంతోషమేసింది.

నేనేదో గొప్ప రచయిత్రిని అని అనడం కాదు కానీ నేను మా అక్కయ్య, అన్నయ్య దగ్గర ఎంత ఆత్మీయత పొందానో నా పాఠకుల దగ్గర అంతే పొందాను. వాళ్ళు అంత ఆత్మీయంగా చూస్తారు. నా మైండ్‌ ఎలాంటిదంటే అదే నా గురువు. నాకు నేనే గురువును. ఏదైనా చూస్తే అది నేర్చుకోవడం చిన్నతనం నుండే అలవాటు. ఒకసారి ఏమైందంటే ‘జీవనతరంగాలు’ రాస్తున్న రోజులు. మా ఇల్లు చాలా చిన్నదిగా సింపుల్‌గా ఉండేది. చాలా మొక్కలు, గులాబీల్లాంటివి పెంచాను. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. అప్పుడు ఒకరోజు ఒకావిడ నన్ను చూడడానికి వచ్చి ముఖం చిట్లించి, మీరు ఇంత చిన్న ఇంట్లో ఉంటారా? అని అన్నది. ఆ రోజు కొంచెం బాధపడ్డాను. అదేరోజు సాయంత్రం ఇంకొక అమ్మాయి వచ్చింది. రాగానే మీ ఇల్లు పర్ణశాలలాగా ఉందండీ, చాలా బాగుంది అంది. అప్పుడు ఆలోచించాను. మొదటొచ్చిన ఆమె అనగానే తక్కువదాన్ని కాదు, ఈమె చెప్పగానే ఎక్కువదాన్ని కాను. ఎవరి దృష్టితో వాళ్ళు చూస్తారు అనుకున్నాను. ఒకసారి ఒక విందుకు వెళ్ళాను. అక్కడ వంటచేసే ఆవిడ చాలా బాగా వండింది. నేను ఫుడ్‌ను చాలా ఎంజాయ్‌ చేశాను. ఆవిడ నా దగ్గరికి వచ్చి మీరు చాలా బాగా రాస్తారు అంటూ పొగిడింది. నేను వెంటనే నా పనిలో నేను గొప్ప అయి ఉండొచ్చు నీ పనిలో నీవు గొప్ప అన్నాను. నేనలా అనగానే నవ్వింది. ఆవిడ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఇపుడు నేను ‘సెక్రటరీ’ నవల రాస్తే జయంతి పాత్ర చాలా షార్ప్‌గా వస్తుంది. జయంతి డాక్టర్‌గానో, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గానో రాసేదానినేమో. రాజశేఖర్‌ను పెళ్ళి చేసుకుంటుందో లేదో అనుమానమే.

1980లో స్త్రీ వాదం మొదలయింది అంటున్నారు. నేనంటాను మాలోనే అన్ని వాదాలున్నాయి. ఎలా అంటే మేం జనరల్‌ ఫిజిషియన్‌లం అనుకోండి. స్త్రీ వాదులు స్పెషలిస్ట్‌లు అయ్యారు, జనాభా పెరిగింది, సమస్యలు పెరిగాయి. ఇల్లు అంటి పెట్టుకున్న ఉద్దేశ్యమే మారిపోయింది, చెరసాల అయింది. స్త్రీకి స్త్రీ వాదం వలన కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. నిజమే! మొదట్లో సాహిత్యంలో ఆడవాళ్ళు కనిపించలేదు. మగవాళ్ళే ఉండేవాళ్ళు. తరతరాల నుండి ఆడవాళ్ళు బాగా రాస్తున్నారు. మొదట్లో వంటింటి కథలు రాశారు అనేవాళ్ళు. కొంతమందికి విమర్శించడమే పని. అటువంటి వర్గాన్ని పట్టించుకోవద్దు. ఇటువంటి విమర్శ వస్తే కొంతమంది రచయిత్రులు సెన్సిటివ్‌గా ఉండి ముడుచుకుపోతారు. ఎవరో విమర్శించారని రాయడం మానేయకూడదు. పాఠకులు ఆదరించినంత కాలం మనం రాస్తూనే ఉండాలని నా నమ్మకం.

శ్రీదేవి, కౌసల్యాదేవి, రంగనాయకమ్మ… వాళ్ళు నాకంటే ముందు నుండే రాశారు. 4, 5 ఏళ్ళ తర్వాత నేను ఎస్టాబ్లిష్‌ అయ్యాను. ఎవరి స్టయిల్‌, పంథా వారిది. ఒక్కొక్కసారి నేను నవలలు రాయడానికి పుట్టానేమో అనిపిస్తుంది. ఇప్పుడు వెనక్కు చూసుకుంటే ఫలానా నవల బాగా రాయలేదు, ఇంకా బాగా రాయాల్సింది అనిపిస్తుంది. నవల నాకు మొదటి అమ్మాయి. నాకిద్దరమ్మాయిలు అంటుంటాను. మాది సంప్రదాయ పద్ధతిలో ఉన్న కుటుంబమవడంవల్ల మొదట్లో బ్యాలెన్స్‌ చేయడం కష్టంగా ఉండేది. తర్వాత అన్నీ నేర్చుకున్నాను. పేరు కోసం ఏ రోజూ ఆలోచించలేదు. నా కుటుంబ సభ్యులు చాలా సహకారం అందించారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందుండడం నాకు చాలా సంతోషమన్పిస్తుంది.

మన దేశంలో చదువుకున్న ఆడవాళ్ళు కూడా ఇల్లు, కుటుంబం, భర్త, పిల్లలు… అదే ప్రపంచం అనుకుంటున్నారు. ఈ దృష్టి మారాలి, సమాజం మారాలి, మన అభిప్రాయాలు మారాలి. మేం స్వతంత్ర భావాలతో పెరిగాం. కానీ ఈ కాలం పిల్లలు అలా ఆలోచించడంలేదు.

సినిమావాళ్ళతో నాకే సమస్య రాలేదు. సినిమా కోసం రాసిన కథను నిర్మాతలు మార్చుకుంటారు. సినిమా వేరు, నవల వేరు. డైరెక్టర్‌ని బట్టి ఉంటుంది. దర్శకుడు సంస్కారవంతుడైతే కథను బాగా మలుచుకుంటాడు. అయితే అగ్రిమెంట్‌లోనే ఉంటుంది, కథను సినిమాకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని. కాబట్టి ఆ విషయంలో మనమేమీ చేయలేం.

‘ఆత్మకథ’ను రాయాలని ఏ రోజూ అనుకోలేదు. రాసేంత గొప్పదాన్ని కాను. చాలామంది మన దేశం కోసం సర్వస్వం అర్పించిన వాళ్ళు రాసుకోలేదు. అలాంటి వాళ్ళు ఆత్మకథలు రాసుకుంటే బాగుంటుంది. నేను ఏం చేశాను? నేనేం త్యాగం చేయలేదు. సమయాన్ని, నా కృషిని పెట్టాను అంతేకదా.

ఈ కాలంలో చదివేవాళ్ళ సంఖ్య చాలా తగ్గింది. ఇపుడు నేను రాస్తే పాఠకులు పెరుగుతారని అనుకోవడం లేదు. అయినా ఇప్పుడు కూడా ఒక వర్గం వాళ్ళు చదువుతారు. ఈ రోజుల్లో పిల్లలను తెలుగుకు దూరం చేస్తున్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలుగు అలవాటు చేయాలి. అలా చేయకపోవడం వల్ల మన ఐడెంటిటీని కోల్పోతున్నాం.

ప్రపంచీకరణ వల్ల ఆడవాళ్ళపై హింస పెరుగుతోంది. ముందు ముందు మరింత కష్టమవుతుంది. ప్రపంచీకరణ స్త్రీలనే కాదు పురుషుల్ని కూడా సమస్యల్లోకి నెట్టివేస్తుంది. ఎప్పుడో ఎక్కడో మార్పు వస్తుంది, కానీ టైం పడుతుంది. చీకటి వెనుక వెలుగు వస్తుంది కదా. గృహి హింస పెరిగిపోయింది. హింసను అనుభవిస్తున్న ఆడవాళ్ళు పెళ్ళి అవసరం లేదనే స్టేజికి వస్తారేమో అనిపిస్తోంది.

నిజానికి గ్రామాల్లో ఉన్న ఆడవాళ్ళు చాలా ముందుకెళుతున్నారు, కానీ నగరాలలో మాత్రం అంతగా సక్సెస్‌గా లేదు.

నాకు వచ్చిన అవార్డులంటారా –

నా రీడర్స్‌ నన్ను ఇష్టపడతారు. అదే నాకు పెద్ద అవార్డు. సుశీలా నారాయణరెడ్డి అవార్డు వచ్చింది. కీర్తి కిరీటాలకు సాహిత్య అకాడమీ వచ్చింది. నేను రాసే నవలలకు పేర్లు అవంతట అవే వస్తాయి. నేను ఎక్కువగా ఆలోచించను. ఎప్పుడు పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేస్తానా అనే ఉంటుంది. ప్రస్తుతం ఏమీ రాయడం లేదు. చాలా హాయిగా ఉన్నాను. ఇప్పటికే చాలా ఎక్కువ రాసేశాను. ఇంకేమీ రాయదలచుకోలేదు. జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను.

ఇరవై ఏళ్ళ క్రితమే కోకిల పేరుతో ఆడియో క్యాసెట్‌ మాగజైన్‌ తీసుకువచ్చాను. మంత్లీ, మంచి ఐడియా. నేను ప్రొడ్యూసర్‌, ఎడిటర్‌. చాలా మంది అప్రిషియేట్‌ చేశారు. మార్కెటింగ్‌లో ఫెయిలయ్యింది. హైదరాబాద్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఊరికి 1958లో వచ్చాము. ఈ ఊళ్ళోనే నేను పేరు, డబ్బు సంపాదించాను. అందుకే ఈ ఊరి కోసం ఏమైనా చేయాలని మాన్యుమెంట్స్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌ తీశాను. దూరదర్శన్‌లో 13 ఎపిసోడ్స్‌ వచ్చింది. అదీ అంతే, ఆ తర్వాత విన్‌ (విమెన్‌ ఇన్‌ నీడ్‌) పేరుతో ఒక ఆర్గనైజేషన్‌ స్టార్ట్‌ చేసి… మా ఇంకో ఇల్లు ఉంది, అక్కడ బ్లైండ్‌ పిల్లలను అడాప్ట్‌ చేసుకుని ఉంచాను. బాగా పేద అమ్మాయిలను చేర్చుకుని కుట్టుపని నేర్పడం, చదువు చెప్పడం లాంటివి చేసేవాళ్ళం. రెండు మూడేళ్ళు నడిచింది. నాకు మేజర్‌ ఐ ఆపరేషన్‌ అయింది. ఆపరేషన్‌ కొంత ప్రాబ్లం కావడం… నేను డిప్రెషన్‌ లాంటి స్థితికి వెళ్ళాను. దాంతో ఆ యాక్టివిటీ కూడా ఆగిపోయింది. నేను దాదాపు 75 నవలలు రాశాను. వాటిలో 17 సినిమాలుగా వచ్చాయి. జాహ్నవి నవలకు ఫస్ట్‌ టైమ్‌ పెద్ద మొత్తం 50 వేల రూపాయల రెమ్యూనరేషన్‌ వచ్చింది. జీవనతరంగాలు ఆంధ్రజ్యోతిలో సీరియల్‌గా వేసినపుడు 1000 రూపాయల రెమ్యూనరేషన్‌ ఇచ్చారు. నేనెప్పుడూ డబ్బుల కోసం డిమాండ్‌ చేయలేదు. ఎడిటర్లు, పబ్లిషర్లు వారే క్రమంగా పెంచుకుంటూ వెళ్ళారు.

ప్రపంచంలో నేను లక్కీయెస్ట్‌ రైటర్‌ అనుకుంటాను. అన్నీ నా ముంగిట్లోకే వచ్చాయి. నా గ్రాఫ్‌ ఎప్పుడూ తగ్గలేదు. మొదట సీరియల్స్‌, తర్వాత సినిమాలు. టీవీ సీరియల్స్‌లో ఋతురాగాలు చాలా హిట్‌ అయింది. జీవితంలో పూర్తి తృప్తి ఉంది. ఆత్మానందం, డబ్బు, పేరు. ఈ మూడు కూడా హయ్యర్‌ లెవల్‌లో నాకు దొరికాయి. ఏదీ మిస్‌ అయిన ఫీలింగ్‌ నాకు లేదు.

ఇంటర్వ్యూ: కె.సత్యవతి, పి.శైలజ

(భూమిక రచయిత్రుల ప్రత్యేక సంచిక నుంచి)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.