-
వేములపల్లి సత్యవతి
పత్రిక చదువుకుంటున్న సుశీలమ్మకి పనిమనిషి యదమ్మ ‘అమ్మా’ అని పిలిచిన పిలుపు చెవిన బడింది. ఇంతకు ముందేవచ్చి పనిచేసిపోయిన యదమ్మ మళ్లీ ఎందుకొచ్చిందబ్బా అనుకుంటూ కుర్చీలోనుంచి లేచివెళ్లి తలుపు తీసింది. ఎదురుగా దిగాలుబడి నిలబడివున్న యదమ్మను చూచి ఏదో కష్టమొచ్చినట్లున్నదనుకొని ”ఏంది? యదమ్మా! ఏమైనా పనివుండి వచ్చినవా” అని అడిగింది. యదమ్మ కళ్లనీళ్లు తుడుచుకుంటూ, అవునమ్మా. మా మామ చచ్చిపోయిండని మావూరునుంచి ఫోన్ వచ్చిందమ్మా. నేను, పిల్లలు అందరం పోతున్నం. పెద్దదినమయిందన్క రాను. సెప్పి పోదమని వచ్చిన అనింది. పెద్దవయసా? ఏమైనా జబ్బు చేసిందా అని సుశీలమ్మ అడిగింది. అవునమ్మా. ఎనబయి ఏల్లకు పైనే వుంటయి. రెండుదినాలు జరమొచ్చినాదంట అని చెప్పింది యదమ్మ. సరే, వెళ్లిరా అంది సుశీలమ్మ. కాని యదమ్మ కదలలేదు. ”ఏందీ! యదమ్మ! పొమ్మని చెప్పాగా. ఎందుకు నిలబడ్డావని అడిగింది సుశీలమ్మ. యదమ్మ ”అమ్మా! పెద్దదినాన శాన కరుచు వుంటాది. యటపోతును కొయ్యలె. కల్లు పోయించాలె. మా సుట్టాల బలగం శానామంది వుండిండ్రు. వచ్చినానిక పనిలో కట్టుకుందురుగాని. ఈ నెల జీతం కూడ యియ్యండమ్మగారు” అని అడిగింది. అదేమిటి? మూడురోజుల నాడేకదా జీతం తీసుకున్నవు. ఈవాళ అయిదవ తారీఖేగా అన్నది సుశీలమ్మ. నాలుగేల్లసంది పనిసేస్తున్న. కట్టమొచ్చినాదని అడిగిన. నామీద నమ్మకం లేదా అమ్మగారు అని అడిగింది యదమ్మ. ఆ మాట విన్న సుశీలమ్మ ఏమనుకుందో గాని లోపలకెళ్లి జీతం తెచ్చి యదమ్మకిచ్చి జీతంలో కట్టుకోనులే వెళ్లిరా అని అన్నది. యదమ్మకి ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక మగపిల్లవాడు. మూడు-నాల్గు సంవత్సరాలు వరుసగా వానలు కురవనందున వున్నవూళ్లో చేసుకోవటానికి పనిదొరక్క పట్నం వచ్చి వుంటున్నారు. బిల్డింగ్‌లు కట్టేచోట యదమ్మ భర్త ఉప్పరపని సంపాదించుకొని రోజుకు వందరూపాయల వరకు తెస్తున్నడు. యదమ్మ యిండ్లలో పనిచేస్తున్నది. యదమ్మ భర్తకు పనిచేసేచోటున పరాయి స్త్రీతో అక్రమ సంబంధం ఏర్పడింది. అప్పటినుండి యింటికి రావటం మానివేసిండు. భార్యాపిల్లలను చూడటంలేదు. పట్నమొచ్చేనాటికే ముగ్గురు ఆడపిల్లల పెండ్లిండ్లు అయినయి. భర్త యింటికి రావటం మానివేసిన తర్వాత యదమ్మ అద్దె కట్టవలసి వస్తుందని యిల్లు ఖాళీ చేసి అంతకు ముందునుంచి యిక్కడే వుంటున్న కూతురు-అల్లుడు వున్న యింటిలో వుంటూ, యిండ్లల్లో పనిచేసుకుంట పిల్లవానిని చదివించుకుంటున్నది.
పదిహేనురోజులు దాటిపోయినయి. మే నెల ఎండలు మాడు పగలగొడుతున్నవి. ఆ రోజు సుశీలమ్మకి చాలా నీరసంగా వున్నట్లనిపించింది. ఉదయం మంచంలో నుంచి లేవబుద్ధి కావటం లేదు. ఏడు పదులు నిండిన వయసు. సుశీలమ్మ భర్త చనిపోయి పది సంవత్సరాలయింది. భర్త పోయినపుడు కూతుళ్లు-కొడుకులు తీసుకెళ్లారు. కొన్ని మాసాలు వున్న తర్వాత తన యింటికి వెళతానంది సుశీలమ్మ. ఒక్కదానివి అక్కడెందుకు? అది మన స్వంతయిల్లా ఏమన్నానా? మాలో నీ యిష్టమొచ్చిన వారి దగ్గర వుండమన్నారు కొడుకులు. చేతగాని రోజున మీ దగ్గరకు రాక ఎక్కడకు పోతాను? అంతవరకు అక్కడే వుంటానని కొడుకులకు చెప్పి వచ్చింది. భర్త వుండగానే ఆయన రిటైరయిన తర్వాత రెండుగదుల యింటిలోనికి మారారు. భర్త పెన్షన్‌తో పొదుపుగా వాడుకుంటూ ఒక్కతే వుంటున్నది. ఇప్పటినుండే కూతుళ్ల యిండ్లలో గాని, కొడుకుల యిండ్లలో గాని వుంటే కొంత ‘స్వేచ్ఛ’ను కోల్పోవలసి వస్తుందని, అలాగే తన చేరిక వలన వాళ్లకు కొన్ని యిబ్బందులు తప్పక కల్గుతయాని సుశీలమ్మ అభిప్రాయం. ముసలివారికి తేలికగా అరిగే పోషక విలువలున్న ఆహారం కావాలి. తనలాగ ఎలర్జీలున్నవారికి అన్ని పడవు. పడుచువారికి పోషకవిలువలున్న వాటితోపాటు పుష్టినిచ్చే బలమైన ఆహారం కావాలి. చిన్నపిల్లలకు వేరే రకమైన పదార్థాలు చేయలి. ఇవన్ని ఉదయం పూట అవసరమైనవే. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లలు, ఆఫీసుకో, లేక జీవనోపాధికి పనికివచ్చే వేరేపనికి వెళ్లే భర్తకు వుదయం పూట తినటానికి, మధ్యాన్నం తినటానికి తయరుచేసి టిఫిన్స్ కట్టాలి. ఒకవేళ ఆ యింటి యిల్లాలు కూడా వుద్యోగస్తురాలైతే ఇక ఆమెకు ఉరుకులు-పరుగులే. ఒక ప్రక్క కుళాయిలో నీళ్లు వచ్చినవో రాలేదో చూసుకోవాలి. ఆమె కళ్లు గోడ గడియరం మీదనే వుంటవి ఏ పనిచేసినా. స్కూలుకుగాని, ఆఫీసుకుగాని సరైన సమయానికి వెళ్లగలవ లేదా అనే ఆదుర్దా. ఒకటే టెన్షన్. ఇంతా చేస్తే యింటిపనికి గుర్తింపుగాని, విలువగాని వుండదు. ఎవరికి ఏ కొంచెం లోపం జరిగినా ఒకటే రుసరుసలు. అమ్మ-నాన్నగాని, అత్త-మామగాని వుంటే వారిని చూసుకోవాలి. సమిష్టి కుటుంబాలయితే ఉదయం పూట చిన్నసైజు భారతయుద్ధం తలుపుకు వస్తుందనిపిస్తుంది. అయితే రానురాను సమిష్టి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. భార్యాభర్తలిరువురు వుద్యోగస్తులైతే పెద్దవారిని చూచుకొనే వెసులుబాటు లేక కొంతమంది వారిని వృద్ధాశ్రొమాలలో చేర్పిస్తున్నారు. ఒక విధంగా అది మంచిదే అనిపిస్తుంది సుశీలమ్మకి. పిల్లలు ్ స్కూళ్లకు, కాలేజీలకు, కొడుకు-కోడలు ఆఫీసులకు వెళితే వృద్ధజంటలో ఒకరు మిగిలితే యింటిలో ఒంటరిగా వుండి ఎవరితో వట్లాడాలి? టి.వి. వుందిగా చక్కగా కాలక్షేపానికంటారు. టి.విలో ఎంతవరకు వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడేవి, పోట్లాడేవి వినవలసిందేగా! వాళ్ల పాటలు, ఆటలు, నృత్యాలు చూడవలసిందేగా! మనం వాళ్లతోగాని, వాళ్లు మనతో గాని నేరుగా మాట్లాడలేముగా. ఆశ్రమాలలోనైతే దాదాపు అందరు సమవయస్కులే వుంటారు. ఒకరి కష్టసుఖాలు ఒకరితో చెప్పుకుంట, సుఖములోను, సంతోషంలోను, కష్టంలోను, దుఃఖంలోను పాలుపంచుకోవచ్చు. కాని మనుమరాండ్ర, మనుమల ఆటపాటలు ్చూస్తే మనసుకు గలిగే ఆనందం, వాళ్లతో ముచ్చట్లు పెడితే మనసుకు కలిగే తృప్తి అక్కడ లభించవు. ఆ ఆనందాన్ని, ఆ తృప్తిని దేనితోను పోల్చలేము. ఒకటి కావాలనుకుంటే మరొకటి వదులుకోక తప్పదు. సైన్స్ దినదినాభివృద్ధి చెందుత మనిషికి కావలసిన సకల సదుపాయలు (డబ్బువుంటే) చిటికెవేస్తే అందుబాటులోకి వస్తున్నవి. దేశాలకు-దేశాలకు మధ్యదూరం తగ్గిపోతున్నది. కాని మనిషికి-మనిషికి మధ్యదూరం పెరిగిపోతున్నది. సామీప్యత తగ్గిపోతున్నది. మనసు కుంచించుకుపోయి చిన్నదవుతున్నది. ఈ ఆలోచనలలో వున్న సుశీలమ్మకి తలుపు చప్పుడు వినిపించింది. యదమ్మ వచ్చి వుంటుందనుకున్న సంతోషంతో వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా యదమ్మ కూతురు తులసి కనిపించింది. ”ఏమి? తులసి! యదమ్మ యింకా రాలేదా? అని అడిగింది. అమ్మ యిప్పుడే రాదవ్మ. దవాఖానాలో వుంది. మీరు పెద్దవారు చేసుకోలేరని, మీ ఒక్క యిల్లు చేయమని వూరినుండి ఫోన్ చేయించిందని చెప్పి పనిలో చొరబడింది తులసి.
తులసి అయిదవ తరగతి వరకు చదువుకున్నది. తర్వాత పెండ్లయింది. భర్త వెంట పట్నం వచ్చింది. ప్రయివేట్ పాఠశాలలో ఆయగా పనిచేస్తున్నది. ఇద్దరు పిల్లలు. బడికి పోతున్నరు. భర్త ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నడు. తెల్లవారేసరికి యింటిపని, వంటపని చేసుకొని అందరు తిని, పగటిపూట తినటానికి కట్టుకొని పోవాలె. అందుకని తులసికి ఎవరి యిండ్లలోను పనిచేయటానికి సమయం చిక్కదు. ఏదో ఆదరాబాదరా చేసిపోతంది. ఒకోసారి తులసి కడిగిన పాత్రలను మరల కడగవలసి వచ్చేది సుశీలమ్మకి. ఒకరోజు సాయంకాలం వేళ యింటిముందు మంచం వేసుకొని పడుకుంది సుశీలమ్మ. మసక మసక చీకటి వ్యాపిస్తూ వుంది. లోపలిగదిలో లైట్ వెలుగుతున్నది. బయట లైట్ ఎందుకులే? కరంట్ దండగని అలాగే పడుకుంది. ఆ మసక చీకటిలో తలకు గుడ్డ కట్టుకొని యదమ్మ వచ్చి నిలబడింది. సుశీలమ్మ లేచి లైట్ వేసి యదమ్మను చూచి ”అదేమిటి యదవ్మ! దినం చేసినవాళ్లు గుండు చేయించుకుంటారు. మగవారే ఆ పనిచేస్తారు (ఈరోజుల్లో కొడుకులు లేనివారికి కొంతమంది కూతుళ్లు తలగొరివి పెడుతున్నారు.) మరి నీవు మీ ఆయనకు బదులు దినం చేశావా?” అని అడిగింది. యదమ్మ నోటితో జవాబు చెప్పకుండ తలగుడ్డ విప్పింది. తలపై వెంట్రుకలున్నవి. కాని కుడిచెవికి కొంచెం పైభాగాన పెద్ద వేలంత పొడవున గుడ్డ పట్టీ వేసి వుంది. ఏమిటా పట్టి? అక్కడ దెబ్బ ఎట్లా తగిలిందని అడిగింది సుశీలమ్మ. ఆ దెబ్బ ఎట్లా తగిలిందో యదమ్మ మాటల్లో విందాము.
మా వూల్లో మాకు యిల్లు తప్ప సెలకలు గాని, వేరే భూములు గాని లేవు. ొమా మామకు నా పెనిమిటి ఒక్కడే కొడుకు. ఆడబిడ్డలకు పెల్లిల్లయి పోయిండ్రు. మా అత్త శానా ఏల్లకిందనే సచ్చిపోయినాది. మేము పట్నం వచ్చినాన్క మా మామ ఒక్కడే వుండు గతింటుండు. మాతానికి రమ్మన్నం. వూరును, యిల్లును వదలి రానన్నడు అనింది. పెద్దదినమయినానిక యిల్లు అమ్ముతననిండు మా ఆయన. నేను అమ్మవద్దన్న. గా పంచాయితితో మూడు నాల్గు దినాలు అయిపోయినయి. మూడు-నాలుగేల్లసంది వానలు లేక పనులు లేక పట్నం పోయినం. ఎప్పుడ గక్కడే వుంటవ? మనవూరు రావ? వచ్చినప్పుడు ఏడుండాలె? నీవు వచ్చినా రాకపోయినా నేను నా కొడుకుని తోలుకొని వచ్చివుంటానన్న. ఇది మా అయ్య యిల్లు. నా యిష్టమొచ్చినట్లు చేసుకుంటా. నీ అయ్య సొమ్ము ఏమైనా తెచ్చినవా? అమ్మవొద్దనటానికి అనపట్టిండు. నేను చదువుకున్నోరిని అడిగి తెలుసుకున్నా, మా మామ యింటి మీద నా కొడుక్కు కూడ అక్కు (హక్కు) వుంటదని, పిల్లోడు మైనోరు (మైనరు) కాబట్టి అమ్మినా చెల్లదని, ఎవరొ తెలిసినోళ్లు కొనరని సెప్పిండ్రు. నేను గప్పుడు బాగా ఎదురుతిరిగి గా ్మాటలన్ని అడిగిన. ఎట్ట అమ్ముతవని గట్టిగనే తండ్లాట (కొట్లాట) పెట్టుకున్న. గా కసికి కోపంతో చేతికందిన పేడుతో తలమీద కొట్టబోయిండు. తప్పించుకున్నగాని జర పక్కకు తగిలింది. బలబల రకతం కారింది. ఆడపిల్లలు ఏడ్చబట్టిండ్రు.
మా అయ్య-అన్నలు జల్దీ దవాఖానాకు పోవాలని తోల్కపోయిండ్రు. నా పెనిమిటి కూడ వచ్చిండు. పయివేటు దవాఖానాలో సేరుసుకొమనిండు. పైసలిచ్చి సర్కారు దవాఖానాలో సెరిసింరు. మా ఆయనే డబ్బులు కట్టిండు. నాఎంటె దవాఖానాలో వుండిండు. మందులు తానే కొనితెచ్చిండు. ఇంటి కొచ్చిందాక నాతోనే వుండిండు. యింటికొచ్చిన నాలుగయిదు దినాలకి నేను పట్నం పోత. పదిరోజులని సెప్పివచ్చిన. నెలదినాలు దాటినయి. నేను చేసే యిండ్లు వున్నయ్యె? లేవో? వేరేవాల్లను పెట్టుకుంటె మల్లొ కొత్త యిండ్లు పట్టుకోవలెనన్న. నాతోపాటు తాను వస్తనన్నడు. బస్సు ఎక్కటానికి మావూరు నుండి కొంచెం లెక్క నడవాలె. నీవు జల్దీ నడవలేవు. మీ అయ్యని తోలుకొని ముందు నడువుండ్రి. నేను వెనకాలె వస్తనని నమ్మబలికిండు. నేను యింటికి బీగం (తాళం) వేసి మా అయ్యను తోలుకొని బస్కు ఎక్కేదానికి వచ్చి నిలబడిన. ఎంతసేపు సూసిన పత్తా (జాడ) లేడు. గింతలో బస్సు వచ్చినాది. నేను ొమా అయ్యని తోల్కోని ఈదినమే వచ్చిన. రేపటిసంది పనిలోకాస్త అమ్మగారు అని చెప్పింది. ఆ మాటలన్ని విన్న సుశీలమ్మ యదమ్మతో ”అదికాదు యదవ్మ! తలమీద అంతదెబ్బకొడితే నీకుగాని, మీ అయ్య, అన్నలకుగాని నీపెనిమిటి మీద కోసం రాలేదా? పూర్వంలాగ నా పెళ్లాం నేను కొడతా తిడతా వాతులపెడతా చంపేస్తా. మీరెవరు? అడగటానికని అనే రోజులు పోయినయి. తప్పించుకోవటానికి నీవెంట వచ్చి డబ్బులు ఖర్చుపెట్టి యింటికి వచ్చేవరకు దవాఖానాలో నీతోనే వుండి నాటకమాడాడు. మీరెవరైనా పోలీసు స్టేషన్‌కెళ్లి రిపోర్టు యిచ్చివుంటే మీ ఆయన ఈపాటికి జైలులో వుండేవాడని” సుశీలమ్మ అన్నది. దానికి యదమ్మ ”నేనేమి సేతు అమ్మగోరు. ఓ దిక్కున ఆడపిల్లలు ఏడ్చబట్టిరి. కొట్టినోడు ఏడ్చపట్టె. కులపెద్దలు కోపంలో తెలవక కొట్టిన అని ఏడ్చబట్టిండు. తప్పయినాదని ఒప్పేసుకున్నాడు. నీ మొగుడేగా కొట్టింది. మొగుడు-పెళ్లాలు కొట్టుకోకుండ, తిట్టుకోకుండ జరుగుద్దా. వదిలెయ్యరునబట్టిరి. మీబోటి తెలిసినోరు గప్పుడే పోలీసుటేసన్‌కెళ్లి పిరియదు రాయించకుపోవాలెనని తొల్కపోయిండ్రు.” అని చెప్పి వెళ్లిపోయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత సుశీలమ్మ యదమ్మని మధ్యలో ఎప్పుడైనా మీ ఆయన చూడటానికి వచ్చాడా అని అడిగింది. ఇంకెందుకొస్తడు అమ్మగారు. నమ్మబట్టేలాగ నాటకొమాడిండు. ఇంతకు బమ్మదేవుడు నారాత సక్కంగ రాయలేదు అనింది.
యదమ్మ మాటలిన్న సుశీలమ్మకి ఎప్పుడో రెండు-మూడు సంవత్సరాల క్రితం పత్రికలో చదివిన వార్త గుర్తుకొచ్చింది. అమెరికాలో వుంటున్న భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీయరు, బ్యాంక్ వుద్యోగస్తురాలైన భార్యను ముక్కలు-ముక్కలుగ నరికి పాలథిన్ సంచిలో వేసుకొని కారులో వెళుతు దారిలో కనిపించిన డస్టుబిన్నుల్లో ఒక్కో ముక్క వేసుకుంట వెళ్లాడంట.
మొన్న ఈ మధ్యనే పత్రికలో మరో వార్త చదివింది. అది అమెరికాలోనే జరిగింది (మనదేశంలోనైతే రోజు పత్రికల్లో అనేక రకాల వార్తలు ఆడవారివి చదువుతనే వుంటుంది) భార్యాభర్తలిరువురు భారతీయులే. భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్. భార్య డాక్టరు. అతని జీతం కన్న భార్య జీతం ఎక్కువ. జీతం తీసుకొని యింటికి రాగానే భార్య జీతం తీసుకొని బ్యాంక్‌లో తన ఎకౌంట్‌లో వేసుకునేవాడు. నెమ్మదినెమ్మదిగా ఆమె దగ్గర వున్న (ధనానికి సంబంధించినవన్ని) వన్ని తన పేరును మార్పించుకున్నాడు. నయన-భయన ఆ పనులన్ని పూర్తిచేసుకొని చివరకు బలవంతంగా విడాకుల పత్రం మీద సంతకం చేయించుకొని ఇండియ విమానం ఎక్కించాడు. ఎదురుతిరిగితే ఏమి చేస్తాడో నన్న భయంతో ఆమె కిక్కురుమనకుండ అతను చేయమన్నట్లల్లా చేసింది. ఇండియ వచ్చిన తర్వాత యిప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమయింది. యువకులతో పాటు దీటుగా చదువుకొని వారితో సరిసమానంగా సంపాదిస్తున్న విద్యావంతులైన యువతులే ఈలాంటి ఫతుకాలకు గురవుతుంటె, చదువుసంధ్యలులేని, రెక్కల కష్టంతో బ్రతికే యదమ్మ ఏమి చేయగల్గుతుందిలే అనిపించింది సుశీలమ్మకి. ఆ చదువుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీయర్ల కన్న యదమ్మ భర్త ఎన్నోరెట్లు మేలన్న భావం కూడా కలిగింది. అయినా పని చేయటానికి వచ్చిన యదమ్మను చూచినపుడు ”నీ మొగుడేగా కొట్టిందన్న” ొమాట గుర్తుకొచ్చి మనసుకు ముల్లులాగ గుచ్చుకున్నట్లు వుంటుంది. గృహహింస చట్టాల్ని గురించిన విషయం నూటికి పదిమంది గ్రామీణ మహిళలకన్న తెలిసిందా? లేదా? అన్న అను్మానం కూడా కల్గుతుంది. మీడియలు, పత్రికలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘ్హాలు గృహహింస చట్టాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags