శిలాలోలిత
కవిత్వం, ప్రతిమ ఉద్వేగ హృదయ కెరటం. కథ, నిశిత ఆలోచనాధార. ఇలా రెండింటి తేడా ఆమె రచనలో ఉంది.
అందుకనే, తన కవిత్వ సంకలనానికి ‘రెండు భాగాలు’ అని పేరు పెట్టారు. ఆమెలోని వైవిధ్య రచనా పార్శ్వాల్ని
చూపించిందిది. స్త్రీ జీవితంలో అనునిత్యం ఏకకాలంలో రెండుగా విడిపోవడం, ఇద్దరుగా జీవించాల్సి రావడం వెనక స్త్రీలకుండే
ఘర్షణను చాలా ప్రతిభావంతంగా ఈ కవిత్వం తెలియ చెబుతుంది.
ప్రతిమగారికి కవిత్వమంటేనే ఇష్టమని, కవిత్వాన్నే తొలిరోజుల్లో రాసుకున్నానని, ఆ తర్వాత కథలు రాయడం
ప్రధానమై పోయి కవిత్వం వెనక్కెళ్ళిపోయిందని అన్నారు. కానీ, పరిశీలిస్తే, ఆమె కథావాక్యాలు చాలామట్టుకు
కవిత్వపాదాలుగా భావోద్వేగాన్ని చుట్టచుట్టుకొనే కన్పిస్తుంటాయి.
స్త్రీల వ్యక్తిత్వాన్ని ఏ మాత్రం సహించని స్థితే యింకా కొనసాగుతూ వుందనే నిజాన్ని చాలా వ్యంగ్యంగా ‘డు…డ…డు’
కవితలో ‘ప్రశ్నించడం చేతగాని పిల్లకోసం’ వెతుకుతున్నానని పురుషుడి నోట పలికించారు.
మంచి కథారచయిత్రిగా ‘పక్షి’, ‘ఖండిత’ కథాసంకలనాల ద్వారా సాహిత్యలోకానికి ప్రతిమ చిరపరిచితురాలు.
అనేక అవార్డులను ఆమె రచనా నైపుణ్యం గెలుచుకొంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ‘నాయుడుపేట’లో నివసిస్తున్నారు.
‘ఏదో ఒక రోజు నేను మూడోకన్ను/తెరవక తప్పదు’ అనే కవిత్వపాదం ద్వారా పోరాటమొక్కటే స్త్రీల హక్కుల్ని
సాధించగలవన్న వాస్తవాన్ని గుర్తుచేస్తారు. ‘పక్షి’ అనే కవితలో ‘సంకెళ్ళెప్పుడ తమంతట తాముగా విచ్చుకోవు/బద్దలు కొడ్డట
మొక్కటే కర్తవ్యం’ అని దిశానిర్దేశం చేస్తారు. ‘పిల్లల్ని స్కాలర్లను చేయడానికి/ఆక్టోపస్ ఐ అహర్నిశలు శ్రమించే’ – స్త్రీలను,
పిల్లల నిరాదరణకు గురై, విషాదపు అంచున తొణికిసలాడే తల్లుల్ని, లైంగిక హింసలకు గురయ్యే మహిళలను, ప్రశ్ననే
కరవాలంగా ధరించాల్సిన స్థితినీ, సామాజిక అసమానతలు పోవాలంటే కావాల్సిన తీవ్రమైన స్వరాల్నీ, సహజీవన సాఫల్యాన్ని
పొందాలంటే మెలగాల్సిన రీతినీ, తన స్వంత అనుభవాలుగా కవిత్వాన్ని చెప్పే పద్ధతినీ, ఎంతో ప్రతిభావంతంగా ఈ
సంకలనంలో చూస్తాం.
అంతేకాకుండా, గ్లోబలైజేషన్ వల్ల స్త్రీలపైన పెరిగిన హింసను, వ్యాపారవస్తువుగా, కేంద్రంగా స్త్రీలు మలచబడ్డ
స్థితినీ, అన్ని విధాల దోపిడీకి స్త్రీలు గురవుతున్న వైనాన్నీ, ఎంతో ఆవేదనతో, ఆగ్రహంతో, బిగించిన స్వరపేటికకున్న
మౌనగొళ్ళాలను తెగ్గొట్టాలన్నా, కదలని రాత్రిలా నిశ్చలంగా నిలిచిపోయున్న సమాజపు స్థితిని, రాతి హృదయలను,
కరుణరసాప్లావితం చేయలంటారు.
‘సృజనంటే నన్ను నేను విధ్వంసం చేసుకోవడమే కదా/…మిగిలిన మూడు ముఖాల్లో నేను పీడితని/నాలుగో
ముఖంలో మాత్రం విజేతని/’ అనే నిర్ణయ ప్రకటనలో స్త్రీల ఆత్మవిశ్వాసం కనబడుతోంది. ఈ ‘నాలుగోముఖం’ కవిత విభిన్నంగా
సాగి, అందరికీ ఎల్లకాలం గుర్తుండిపోయే కవిత. మూడు ముఖాల్లో పీడితగా చెప్పుకోవడం వెనక స్త్రీ ఎదుర్కొంటున్న
స్వేచ్ఛారాహిత్యం, అభద్రత, పెనుగులాటను ధ్వనించడమూ, ‘నాలుగోముఖాన్ని తొడుక్కుంటాను’ అని చెప్పడంలో
గెలవవలసిన, లేదా గెలుస్తున్న సందర్భాలకు నాలుగోముఖాన్ని ప్రతీకగా ఎన్నుకున్నారు. విజేతగా స్త్రీ నిలబడే దశకు
‘నాలుగోముఖం’ వ్యక్తీకరణ. ఇంత పటిష్టంగా కవిత్వాన్ని చెప్పడం ఈ కవితలో బాగా కుదిరింది. ఇలా మరెన్నో కవితలు
చిరకాలం గుర్తుండి, వివేచనకు దోహదం చేస్తాయి.
అనుభవం, అవగాహన, ఆర్తి నిండిన చైతన్యస్పూర్తితో స్త్రీల జీవితాలు గొప్ప వెలుగురేఖలైన తడిపాదాల
జీవితాలలో, గొప్ప అరుణోదయ పుష్పాల కోసం, వాటి తాలకూ పరిమళాల కోసం స్వప్నిస్తూ, ఘర్శిస్తూ తపిస్తున్న ఆరాట
జ్వాలాకేతనమే ప్రతిమ కవిత్వం.