కర్టెన్లు మారుస్తుంటే పక్క ఫ్లాట్ కిటికీలు తీసి ఉండడం కనిపించింది. గత నెలరోజులుగా ఖాళీగానే ఉందది. ఎవరో అద్దెకు తీసుకున్నారు కానీ ఇంకా దిగలేదని చెప్పింది పనిమనిషి. అంటే అద్దెకు తీసుకున్నవాళ్ళు వచ్చి ఉంటారనుకున్నాను. తూర్పు వేపున్న ఫ్లాట్లలో మాది మొదటిది, చివరగా ఒకటి ఉంది. అలాగే ఎదురుగా రెండు ఫ్లాట్‌లు. అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చాక ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలియకపోయినా చిరునవ్వుల పలకరింపులో మోహ పరిచయాలూ ఇంకా మిగిలే
ఉన్నాయి.
పక్కన ఎవరో దిగారనగానే నేనే ఎక్కువ సంబరపడ్డాను. పిల్లలిద్దరూ విదేశాల్లో స్థిరపడిపోయాక ఎంత పుస్తకాలు చదువుకున్నా, ఎంత టీవీ చూసినా ఆరునెలలకోమారు పిల్లల దగ్గరకు వెళ్ళి వచ్చినా, ఎంతయినా మనిషి సంఘజీవి కదా, పక్కవారితో మాట్లాడితే కానీ తోచదు. ఈ మధ్యన పిల్లలు ఇంకా ముద్దు వస్తున్నారు. గ్రాండ్ కిడ్స్‌ను తలచుకుని కాదు, ఆ వయసులో నా కొడుకు ఇలా మాట్లాడేవాడు, ఇలా ఉండేవాడు అన్న తలపులు, నా కూతురు ఇలా పనులు చేసేది ఇప్పుడెలా మారిపోయిందో అన్న ఆలాపన.
కిటికీలకు పరదాలు లేవు. పాపం ఇంకా సర్దుకోలేదేమో అనుకున్నాను. నా ఆరాటం మా పనిమనిషి వస్తే కానీ తీరదు. దానికి ప్రపంచంలో ఉన్న వార్తలన్నీ ఎలా తెలుస్తాయో కానీ బీబీసీ కన్నా వేగంగా సమాచారం సేకరిస్తుంది.
అయినా అది వచ్చేలోగా నా ఆలోచన దాని కథలు అది అల్లుకుంటూనే ఉంది.
పక్కింటో దిగినవాళ్ళు మాలా వయసు మళ్ళిన వారయితే… అవనీ మంచిదే కదా నాకూ, జెపీకీ కూడా మంచి కాలక్షేపం. జేపీ అతన్ని తనతో ఉదయం వాకింగ్‌కి, మధ్యాహ్నం ఎప్పుడయినా సినిమాలకి, సాయంత్రాలు కాలక్షేపం అంటూ క్లబ్‌కి లాక్కెళ్ళడం ఖాయం.
నాకు మాత్రం టీవీ సీరియళ్ళ గురించి చర్చించుకుందుకూ, వంటలూ వార్పులూ షేర్ చేసుకుందుకు, షాపింగ్‌లకూ… ఒకటేమిటి అన్నింటికీ ఆవిడని చేదోడు వాదోడుగా చేసుకోనూ.
అలాకాకుండా మధ్య వయస్కులైనా ఓకే. పిన్నిగారూ, బాబయ్యగారూ అంటూ పెద్దలు అమ్మమ్మ అనో, నానమ్మ అనో పిల్లలు ఇంట్లో తిరిగితే ఎంత సందడిగా ఉంటుంది.
లేదూ కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే…
అన్నట్టు ఆ పిల్ల కొత్తగా కాపరానికి వచ్చిందేమో అలాగైతే తప్పకుండా వాళ్ళమ్మ కడుపు చలవ అని చలిమిడి ఇచ్చే ఉంటుంది. చలిమిడి ఎంత ఇష్టమో… ఏ నాటి మాట. చంటిదాన్ని ఎత్తుకుని వచ్చినప్పుడు అమ్మ ఇచ్చిన చలిమిడి…
మధ్యలో అక్కడో ఇక్కడో దొరికినా ఆ రుచి మళ్ళీ రాలేదు. ఇప్పుడు చేసుకునే ఆసక్తీ లేదు. కొనాలన్న కోరికా లేదు.
అవును గాని, అయినా ఇప్పుడు తన చలిమిడి రుచి కోసం ఆ పిల్ల తెస్తుందన్న నమ్మకం ఏమిటి?
ఆ రోజులన్నీ పోయి ఏనాడయింది. ఇప్పుడంతా రెడీమేడ్‌లూ, మొగుళ్ళతో సహా. అసలు పెళ్ళవగానే సగం మంది విమానం ఎక్కెయ్యడమే కదా. ఇహ అక్కడ జీరో సైజులూ, డైటింగ్‌లూ, బాలీ ఫిట్‌లూ, జిమ్ములూ… ఇహ సారే, చలిమిడీ ఎక్కడ? మహా అంటే కాజూ బర్ఫీలు, కరాచీ బిస్కెట్లేగా మహా ప్రసాదాలు.
అయినా నా పిచ్చి కాని ఆ రోజులూ మారిపోయి సహజీవనాలు వచ్చాయి కదా.
వెంటనే ఉలిక్కిపడి నా వెన్ను నేను చరుచుకున్నాను.
ఛీ ఛీ తథాస్తు దేవతలు తిరుగుతుంటారట పైన… ఎందుకిలాంటి పిచ్చి ఊహలు వస్తున్నాయి.
ఒద్దొద్దు ఎక్కడయినా రానీ గాక భగవంతుడా ఇక్కడ మాత్రం…
గుమ్మానికి కర్టెన్ మారుస్తుంటే వచ్చింది మా సౌభాగ్యం, అదే మా పనిమనిషి.
కళ్ళకు నల్ల కళ్ళజోడు, హైహీల్స్ పైకి కట్టిన చీర, సన్నగా ఐటమ్ సాంగ్ హీరోయిన్‌కి తీసిపోకుండా ఉంటుంది.
కుడి చేతిలో స్మార్ట్ ఫోన్, ఎడం చేత్తో అసలే పైకున్న చీరను మరికాస్త పైకి ఎత్తి పట్టుకుని…
వస్తూ వస్తూనే ఫోన్ ఛార్జింగ్‌కి పెడుతుంది. బాల్కనీలో బకెట్ పెట్టి నల్లా సన్నగా తిప్పి వాషింగ్ మెషీన్ అప్పటికే ఆన్ చేసానా లేదా చూసి ”మిషన్ ఆన్ చెయ్యండి” అంటూ నన్ను కేకేసి బయట ఇంటిముందు తుడిచేందుకు మాప్ తీసుకు వస్తుంది.
ఈ లోగా నేను కాఫీ చేయాలి.
అన్నట్టు నాకు మతిమరుపు ఎక్కువైంది. అదేదో హోమియో మందు తీసుకుంటోందట కాఫీ, టీలు సరిపడవట. ఎప్పుడో చెప్పింది ఒక గ్లాస్ పాలు ఇవ్వమని.
హడావిడిగా పాల ప్యాకెట్‌లు తీసుకుని కాచడానికి వెళ్ళినా ఎప్పుడు దాన్ని పక్కింటి వాళ్ళ గురించి అడగడమా అని మనసు పీకుతూనే ఉంది.
ధనాధన్ ఇల్లు ఊడ్చి తుడిచేసరికి పాలు కాగాయి. దానికి పాలు, నేను ఫిల్టర్ కాఫీ తీసుకుని హాల్లోకి వచ్చాను.
జేపీ ఉదయం నిమ్మరసం, తేనె వేడినీళ్ళతో తాగి వాకింగ్‌కి వెళ్ళాడు ఎప్పటిలా.
నేను సోఫాలోనూ, అది పక్కన చిన్న స్టూల్ మీద కూచున్నాం.
ఇప్పటి పనివాళ్ళు కింద కూచోరు మరి.
ఊదుకుంటూ రెండు గుక్కలు తాగి ఓపిక వచ్చినట్టు మొదలుపెట్టింది.
”పక్కింట్లో వాళ్ళు రాత్రి దిగినారు”.
”అవునా, చప్పుడే వినబడలేదు”.
”పది దాటింది లెండి. మీరు పడుకుని ఉంటారు”.
అన్నట్టు చెప్పలేదు కదూ మా సౌభాగ్యం మా సెక్యూరిటీ చీఫ్ భార్య. కిందే ఉంటారు.
”అవునా చెప్పు, చెప్పు.”
”ఏం చెప్పను? నా మొహం… రెండు సూట్‌కేసులట్టుకు దిగారు”.
అదిరిపడ్డాను. నా కుడి కన్ను అదిరింది. అపశకునం.
”అదేంటో పదిహేను రోజుల క్రితం ఆఫీసు పెళ్ళి అయిందట. ఆ వెంటనే మారిషస్సో, మాల్దీవులో పోయినారట. ఇదిగో నిన్న రాత్రి విమానం దిగి వచ్చేసినారు”.
పోన్లే సామాన్లు వెనకాల వస్తాయేమో అనుకున్నాను.
”సరిగ్గా తొమ్మిదింటికి వెళ్ళి పని చెయ్యాలట… అటు ముందూ ఇటు వెనకా వద్దట”.
”మరింట్లో సామాన్లు….” నాన్చాను.
జవాబు రాలేదు. గబగబా పాలు తాగేసి అంట్లు తోమడానికి వెళ్ళిపోయింది.
నిట్టూర్చి లేచాను.
… … …
గడిచిన నెలరోజుల్లో పక్కింటి అమ్మాయిని ఏ ఐదుసార్లో చూసాను.
జీన్స్ పాంట్, లూజ్ లూజ్‌గా ఉన్న టాప్, దువ్వి వదిలేసిన జుట్టు, టకటకలాడించే హైహీల్స్, కోలగా ఉన్న మొహం, డార్క్ పింక్ లిప్‌స్టిక్… తలుపు తీసి ఉంటే వచ్చేప్పుడో, వెళ్ళేప్పుడో హాయ్ ఆంటీ అనేది.
నా ఆశలన్నీ అడియాసలైనా సరిపెట్టుకున్నాను.
వారి గురించి వివరాలు ఏమైనా తెలిస్తే అవి సౌభాగ్యం ద్వారానే. అది వెళ్ళేసరికి ఒక్కోసారి అతను, ఒక్కోసారి ఆమె నిద్రపోతూ ఉంటారట.
ఇంతకీ వాళ్ళ పేర్లే తెలియవట. అతనొకసారి హనీ అనీ, ఒకసారి బంగారం అనీ, మరోసారి మై గర్ల్ అని నానా రకాలుగా పిలుస్తాడట.
ఆమె కూడా అతన్ని కన్నా అనీ, బుజ్జీ అనీ, మై డియర్ అనీ, ఒక్కోసారి డెవిల్ అని కూడా పిలుస్తుందట.
ఏం వండుకుంటారో ఏమో గానీ రెండు గిన్నెలకన్నా ఎక్కువ ఉండవట.
అసలు సగం రోజులు ఆమె, సగం రోజులు అతను టూర్లు తిరుగుతారట.
మధ్యలో ఒకసారి ఆవిడ పుట్టినరోజట. ఆ ఫ్లోర్లో అందరికీ సౌభాగ్యతో కేక్ పంపింది.
మరో గత్యంతరం లేక మేమూ దానితోనే గ్రీటింగ్ కార్డ్, చిన్న గిఫ్ట్ పంపాము.
రెండు నెలల తర్వాత కాబోలు సౌభాగ్య హడావిడిగా వచ్చి ”ఆ అమ్మాయి ఏడుస్తోంది” అని చెప్పింది.
క్షణంసేపు నాకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. వెళ్ళాలా వద్దా అని తెలియని స్థితి.
వెళ్తే ఏమంటారో? అలాగని వెళ్ళకపోతే ఏదైనా అఘాయిత్యం జరిగితే…
చివరికి నేనూ, జేపీ కలిసి వెళ్ళాం.
తలుపు దగ్గరగా వేసి ఉంది. మా సౌభాగ్యం తలుపు తోసి లోనికి వెళ్ళాక దాని వెనకే మేమూ వెళ్ళాం.
హాల్లో న్యూస్‌పేపర్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విసురుకున్నట్లున్నారు. సోఫామీద అడ్డదిడ్డంగా దిళ్ళు.
సౌభాగ్యం వాటిని సర్దిపెట్టాక అక్కడ కూర్చున్నాం.
సౌభాగ్యం లోనికి వెళ్ళి ఏదో చెప్పింది. ముందుగా అతను బయటకు వచ్చాడు. మంచి అందగాడు. కళ్ళు ఎర్రబారాయి.
‘హలో’ జేపీతో షేక్‌హ్యాండిచ్చి కూర్చున్నాడు.
”ఏదైనా చిన్న మిస్ అండర్‌స్టాండింగా” నెమ్మదిగా అడిగాడు జేపీ.
”లేదంకుల్ పెద్ద మిస్టేకే” గట్టిగా అన్నాడతను. అదిరిపడ్డాను.
”అవునంకుల్. ఇద్దరం ఇష్టపడ్డాం నిజమే. అయినంత మాత్రాన నా వాళ్ళ నీడైనా సోకరాదట. అదీ ఓకే. ఇది మాత్రం రోజుకోసారి దాని అమ్మనీ, నాన్ననూ చూసుకోవాలి. నేను మాత్రం నా వాళ్ళను మర్చిపోవాలి. చూసొచ్చినప్పుడల్లా పెద్ద రాద్దాంతం…” అతని మాటలు పూర్తి కాకముందే రయ్యిన లోపలినుండి దూసుకువచ్చింది ఆ పిల్ల.
”ఒక్క మాటంటే ఒక్క మాట మీద ఉన్నావా? నీ అమ్మా నాన్న నాకు నచ్చలేదు. అయినా నీకు వాళ్ళు కావాలి. నీ చెల్లెలి పతివ్రతా వాలకం నాకు రోత. దాని నీడ కూడా సోకదు నాకు. అయినా నీకు అదే ఎక్కువ. భుజం మీద టాటూ వేసుకోమంటే వేసుకోవు. అమెరికాలో లాగా షార్ట్స్ వేసుకోవు. చొంగమొహమ్ నువ్వూ. ఐ హేట్ యూ…” మ్రాన్పడిపోయాను.
నిన్న మొన్నటివరకు పిల్లల పెళ్ళిళ్ళయ్యాక కూడా నన్ను సాధించే ఆడబడుచులు, అత్తగార్లతో నా రాజీ గుర్తుకు వచ్చింది.
చిన్నారికి సంబంధాలు చూసేముందే ”ఒక్క ఇంట్లో పుట్టి పెరిగిన వారికీ, కన్నవారికీ, పిల్లలకే అభిప్రాయ భేదాలు తప్పవు. అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. అలాగని వ్యక్తిత్వం వదులుకోమని చెప్పను కానీ కొంచెం అటూ సర్దుబాటు అవసరం. సుఖం అనేది ఆ సర్దుబాటుతోనే వస్తుంది” అని చెప్పలేదూ.
దాని పెళ్ళి చేసి కూడా పదహారేళ్ళు.
ఇప్పుడిక ఈ నవతరానికి ఏం చెప్పను?
జేపీ ఇద్దరికీ ఏదో సర్దిచెప్పాలని చూశాడు.
”ఇట్స్ ఇంపాజిబుల్ అంకుల్. నాకే మాత్రం నచ్చలేదు. వీడు కాకపోతే మరొకడు. ఇహ నావల్ల కాదు వాడి మొహం చూడడం” అంటోందామె.
”పోనీ అంకుల్! ఇది కాకపోతే మరొకత్తి దొరకదా నాకు. ఇహ నా దారి నాది” అంటున్నాడు అతను.
ఇద్దరూ లోనికి వెళ్ళి ఎవరి సూట్‌కేసులు వాళ్ళు సర్దుకుంటున్నారు.
ఇప్పటికీ ఒక్కోసారి నన్ను జేపీ మీరనే పిలుస్తాడు కానీ ఒక్క రోజు కూడా ఇలా అలగా భాష మాట్లాడుకోలేదు.
ప్రేమగా జేపీ అన్నా, ఆయన అనీ, మీరనే అంటాను నేను జేపీ నాకన్నా రెండేళ్ళు చిన్నవాడైనా. ఈ అల్ట్రామోడర్న్ తరానికి ఏం చెప్పాలి. స్వేచ్ఛ, వ్యక్తిత్వం నిర్మాణాత్మకం కావాలి కానీ వినాశకానికి కాదని వీళ్ళకెలా తెలవాలి?
మేం అక్కడ ఉండగానే ఇద్దరూ ఎవరి దారిన వారు సూట్‌కేసులు లాక్కుని వెళ్ళిపోయారు. సౌభాగ్య ఉన్నా కూడా తటపటాయించకుండా జేపీ నా చేతులందుకుని కళ్ళకద్దుకున్నాడు.