‘ఆల్ ఇండియా దళిత మహిళా అధికార్ మంచ్’ వాల్లు ఈ మద్య సావిత్రి బాయి పూలే పూణె యూనివర్శిటీలో దళిత్ వుమెన్ స్పీక్ ఔట్ (దళిత మహిళ మాట్లాడుతున్నది) క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వుమెన్స్ స్టడీస్ సెంటర్‌తో కలిసి సదస్సు నిర్వహించడం చాలా గొప్ప విషయము. భారతదేశములో నుండి చాలా రాష్ట్రాల దళిత మహిళల్ని, వారి నాయకత్వాన్ని, వారి పోరాటాల్ని అస్తిత్వాలు, వారు నిర్మించుకుంటున్న ఆధునిక దార్శనికతలు చాలా అద్భుతమైనవిగా కనిపించినవి. ఇవన్నింటి దశ దిశ రాజ్యాధికారమైన దృష్టి కూడా చాలా ఆదర్శనీయము.
ఇన్నాల్లు మాట్లాడే అవకాశము లేక ఇంట్ల బైట కేవలం సేవక, ఎట్టి పనుల్లో మగ్గిపోయిన అంటరాని మహిళలచే మాట్లాడించడం మంచి విషయము. దళిత మహిళల గొంతులు విస్తరించాలి, శక్తులు కూడగట్టుకోవాలి, జీవితాల్ని మార్చుకోవాలి. దేశమంతా విభిన్న భాషల్తో, సంస్కృతులతో బతుకుతున్నా… అంటరానితనాలు, వెట్టి జీవితాలు మాత్రము ఒక్కటిగానే వున్నయి. భిన్నగొంతుల్ని అల్లుకుంటూ, అలుముకుంటూ రాజకీయాధికారాలవైపు మల్లుదాము అనే ఎజెండాలతో సాగిన ఈ సదస్సు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ తాత్వికంగా అంటరాని జెండర్ దృక్పథాలతో పునాది ఆధునిక మిళితగా సెషన్స్ నడిచినయి.
తరతరాలుగా మా దళిత మహిళలు కేవలం చాకిరి, వెట్టిజేసుడే గాని మాకు మాట్లాడే అవకాశమే లేదు. ఈ కులస్వామ్య, మగస్వామ్య వ్యవస్థలో పురాణాల్నించి, ఇతిహాసాలు, కావ్యాల నుంచి యిప్పటి ఆధునిక, అభ్యుదయ, విప్లవ సాహిత్యాలదాకా, యింకా దళిత, ఫెమినిస్టు ఉద్యమ సాహిత్యాలదాకా మా అంటరాని జెండర్‌లను అంటుకోలే. ఎవరి గోస వారిదే. ఎవరూ ఎవర్నీ ఉద్దరించాలని చూడ్డం, ఎదురు చూడకూడదని అర్థమైంది. అందుకే ఎవరి అస్తిత్వాలు వారే నిర్మించుకోవాలి, మాట్లాడాలి ఎవరి హక్కుల కోసం వారే పోరాడాలి యితర ఉద్యమ, సామాజిక శక్తుల సంఘీభావాలను కూడగట్టుకోవాలి అని అర్తమైంది.
ఇప్పటిదాకా వచ్చిన పురాణాల సాహిత్యాల నుంచి ఇప్పటిదాకా రికార్డులుగా వచ్చిన సాహిత్యాల్లో దళిత మహిళలు ఎట్లా బత్కిండ్రు అనేది చూడము. మా దళిత మహిళలము ఏమి తిన్నము, ఏమి తాగినం, ఏం బట్ట గట్టినము, ఏమాడుకున్నము, ఏంపాడుకున్నము, మా వ్యతిరేకతలు మా నిరసనలు ఏంటియి, మా పోరాటాలేంటియి, మా భాషేంటి, యాసేంటి, మా నుడికారాలు, మా బత్కులు, భాగ్యాలు అన్ని, అన్నింటిని అవాచ్యం చేసినయి అన్ని
ఉద్యమాలు, అన్ని రకాల సాహిత్యాలు.
మా మాటలు పబ్లిగ్గా రావాలి. అది గూడెం పబ్లిక్, ఊరు పబ్లిగ్గా మా మాటలు బైటికి దాటాలి. కొండలు గుట్టలు కోటలు దాటాలి అనే నినాదంతో దళిత మహిళలు మాట్లాడుకున్నరు. అదే సదస్సుకు ఆంధ్ర తెలంగాణ నుంచి దాదాపు 20 మందిమి పోయినము పూణేకి. ‘పూణే’ అనంగానే మొదటి మహిళా టీచర్ మాకు చదువు నేర్పిన చదువులమ్మ సావిత్రిబాయి పూలే సంస్కరణలన్ని ఆ పూణేలో పరుచుకున్నట్టుగా కనిపించింది. జ్యోతిరావు పూలేతో కల్సి ఆమె నిర్మించిన ఆధునిక దార్శనికతలు ఎంతగా విస్తరించినయో సావిత్రిబాయి పూలే మహిళా అధ్యయన కేంద్రం చెప్పింది. నిజానికి దేశంలో ఉన్న యూనివర్శిటీల్లోని మహిళా అధ్యయన కేంద్రాలు దాదాపు సవర్ణ మహిళాధిపత్యములోనే ఉన్నయి. ఏవో ఒకటి అరా ‘బహుజని’ చేతిలో ఉన్నయి.
ఈ సదస్సులో బన్వారీదేవి కనిపించడం ఒక ఉద్వేగం. ప్రభుత్వంలో ఎఎన్‌ఎమ్‌గా పంజేస్తూ… బాల్యవివాహాల రిపోర్టులో రాజపుత్రుల సంఖ్య కూడా చేర్చి ఇచ్చినందుకు రాజపుత్‌లచే సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన తర్వాత విశాఖ గైడ్‌లైన్స్ నుంచి పనిచేసే స్థలాల్లో మహిళా రక్షణ చట్టం వచ్చింది.
తర్వాత అమెరికాలో పుట్టి భారతదేశ పరిశోధకురాలిగా వుంటూ… కుల, జెండర్ వివక్షలకు వ్యతిరేకంగా
ఉద్యమిస్తూ రచనలు చేసిన గెయిల్ ఆమ్‌విత్, మరాఠి రచయిత్రి ఊర్మిళా పవార్, బుద్ధిస్టు రచయిత్రి రమా పాంచాల్, రాష్ట్రీయ దళిత మహిళా ఆందోళన్ రజినీ తిలక్, ముప్పయ్యేండ్లనుంచి దళిత మహిళల కోసం పనిచేస్తున్న రూత్ మనోరమ, ఆశాకొత్వాల్, బెర్నాడ్‌ఫాతిమా, ఫూలే, అంబేద్కరిస్టు వుమెనిస్టులు రేఖారాజ్, దమ్మసింగిని రమాగోక్, గ్రేస్‌బాను, మోనికా విన్సెంట్, సింథియా స్టీఫెన్‌లాంటి అనేకమంది దళిత మహిళా నాయకులొచ్చారు. యంగ్ దళిత మహిళలు, రీసెర్చి స్కాలర్స్ పెద్ద ఎత్తున వచ్చారు. రచయిత్రులు, కళాకారులు వాల్ల వాల్ల స్థానిక కళలతో, గ్రూపులు గ్రూపులుగా హాజరై వాల్ల కళల్ని, సినిమాలనీ, డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. కాని రెండు రోజులు మాత్రమే జరగడం వల్ల అన్ని సెషన్స్ కళలు, వారి డాక్యుమెంటరీలను, వారి స్పీక్ అవుట్స్‌ను అన్నింటిని చూడలేకపోయాము. ఓ 10 రోజులైనా జరిగితే బాగుండేది. చివరికి సావిత్రిబాయి, జ్యోతిరావుపూలే వాల్ల సామాజిక కుటీరాన్ని చూడడం ఒక గొప్ప అనుభూతి. ముక్తసాల్వే బాగ యాదొచ్చింది. సదస్సంతా
ఉద్వేగభరితం.