డా|| పి. శర్వాణ
ఈ ప్రక్రియ నృత్య గాన రూపంలో ఉంటుంది. ఆ కాలంలో పరిపాలించిన రాజులు రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు వంటివారు యక్షగానాలు రచించి ప్రోత్సహించారు.
తంజావూరు నాయకరాజుల కాలంలో చివరి రాజకవి విజయ రాఘవ నాయకుని కుమారుడు మన్నారు దేవుడు. ఆయన ‘హేమాబ్జ నాయికా స్వయంవరము” అనే యక్షగానాన్ని రచించారు. అది తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయంలో పొందు పరచబడింది. దానిని విఠలదేవుని సుందరశర్మ 16-7-1956లో పరిష్కరించారు.
దక్షిణాంధ్ర యుగంలో వచ్చిన ఒక యక్షగానాన్ని సమగ్రంగా పరిశీలించాలని రాళ్ళపల్లి సరస్వతీదేవి ఎం.ఫిల్.కి పరిశోధనాంశంగా ”మన్నారు దేవుని హేమాబ్జ నాయికా స్వయంవరము – పరిశీలన” తీసుకుని పరిశోధించారు. పట్టా పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారి ఆర్థిక సహాయంతో ఫిబ్రవరి, 2008న పుస్తకరూపంలోకి తీసుకువచ్చారు.
రాళ్ళపల్లి సరస్వతీదేవి తల్లిదండ్రులు వరలక్ష్మీ, లక్ష్మీనారాయణ. ఎమ్.ఎ. తెలుగు ఆంధ్రవిశ్వకళాపరిషత్, విశాఖపట్టణంలో చేసారు. ఎం.ఫిల్ పట్టా ”మన్నారు దేవుని హేమాబ్జ నాయికా స్వయంవరము-పరిశీలన” హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ద్వారా అందుకున్నారు. పర్యవేక్షకులు డా|| జి. అరుణకుమారి. ప్రస్తుతం ”ఆధునిక తెలుగు కవిత్వంలో అభివ్యక్తి – అధ్యయనం” అనే అంశంలో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు. పర్యవేక్షకులు డా|| జి. అరుణకువరి.
మన్నారుదేవుని హేమాబ్జ నాయికా స్వయంవరము – పరిశీలనను నాలుగు అంశాలుగా విభజించుకున్నారు.
ప్రథమ అధ్యాయంలో ‘హేమాబ్జ నాయికా స్వయంవరము’ కర్త అయిన మన్నారుదేవుని జీవితం, చారిత్రక నేపథ్యాన్ని చర్చించారు.
ద్వితీయ అధ్యాయంలో తంజావూరు నాయకరాజుల కాలంనాటి యక్షగానాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ మన్నారుదేవుని యక్షగాన స్థానాన్ని గుర్తించి చర్చించారు.
తృతీయ అధ్యాయంలో ‘హే్మాబ్జ నాయికా స్వయంవరము’ ఇతివృత్తాన్ని పరిచయం చేసి, నాటక స్వరూపం, రసం, సంగీతానికి సంబంధించిన వర్గదేశీ కవితాంశాలను, భాషా విశేషాలను చర్చించారు.
చతుర్థ అధ్యాయంలో హే్మబ్జ నాయికా స్వయంవరాన్ని యక్షగాన లక్షణాలకు సమన్వయపరచి, ఈ యక్షగానంలో ఉన్న ఆచారాలు-వేడుకలు, అలంకరణ, సామాజికాంశాలను పరిశోధించారు.
ముగింపుతో నాలుగు అధ్యాయల పిండితార్థాన్ని పొందుపరిచారు.
మన్నారు దేవుని జీవితం, చారిత్రక నేపథ్యం –
శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలంలో నాయకరాజులు సామంతులుగా ఉండేవారు. రాయల అనంతరం అచ్యుత దేవరాయల కాలంలో తంజావూరులో అనుకూలంగా లేవు. పరిస్థితులు చక్కదిద్దడం కోసం తంజావూరు ప్రాంతం వాడైన చెన్నప్ప నాయకుడ్ని తంజావూరు పాలకుడిగా నియమిస్తాడు. అతను 1550 నుండి 1580 వరకు పరిపాలించాడు.
చెన్నప్ప నాయకుడి కుమారుడు అచ్యుతప్ప నాయకుడు 1580 నుండి 1600 వరకు పరిపాలించాడు. అతని కుమారుడు రఘునాథ నాయకుడు 1600 నుండి 1630 వరకు పరిపాలించాడు. అతను పధ్నాలుగు రచనలు చేసాడు. అందులో నలచరిత్ర, వాల్మీకి చరిత్ర, రావయణము, శృంగార సావిత్రి మాత్రం లభ్యం.
రఘునాథనాయకుని కుమారుడు విజయ రాఘవ నాయకుడు 1633 నుండి 1673 వరకు పరిపాలించాడు. అతను 50కి పైగా రచనలు చేసినప్పటికీ ఏడు రచనలు మాత్రమే లభిస్తున్నాయి. ఇతని కుమారుడు మన్నారుదేవుడు. తండ్రి తరువాత పట్టాభిషిక్తుడు కావలసినవాడు. 1673లో మధుర చొక్కనాథుని చేతిలో మరణించాడు. విజయరాఘవ నాయకుడు ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకపోవడంతో ప్రజల అభిమానాన్ని పొందలేకపోయడు. ఉద్యోగులకు విజయ రాఘవుడంటే గౌరవం లేకపోవడంతో మధుర చొక్కనాథుడు దండెత్తి వచ్చినప్పుడు అందరి నిరాదరణకు గురై మన్నారుదేవుడ్ని యుద్ధానికి తీసుకెళ్తారడు. సుఖభోగాలకు అలవాటుపడి, కత్తిపట్టడం మానేసిన విజయ రాఘవుడు, కారాగారంలో ఉన్న మన్నారుదేవునికి రాజకీయ పరిస్థితులు అంతగా అవగాహన లేక సరైన సైన్యం లేక యుద్ధంలో చనిపోతారు. మన్నారు దేవుడ్ని ఎందుకు కారాగారంలో బంధించాడో సరైన కారణం తెలియదు.
మన్నారుదేవుడు ‘విజయ రాఘవాభ్యుదయము’ అనే ప్రబంధం, ‘హేమాబ్జ నాయికా స్వయంవరము’ అనే యక్షగానం రాసాడు.
తంజావూరు నాయకరాజుల కాలంలో వచ్చిన యక్షగానాలు
తంజావూరు నాయక రాజులలో మొదటివాడైన చెవ్వప్ప నాయకుడు, అతని కుమారుడు అచ్యుతప్ప నాయకుడు రాజకీయ పరిస్థితులు చక్కదిద్దడంలో మునిగి ఉండడం వల్ల సాహిత్య పోషణ చేయలేకపోయరు. రఘునాథ నాయకుడు రాసిన వాటిలో ఐదు మాత్రం లభ్యం. విజయ రాఘవ నాయకుడు ఇరవై మూడు యక్షగానాలు రాసాడు. అందులో రఘునాథాభ్యుదయము, పూతనాపహరణము, విప్రనారాయణ చరిత్ర, కాళీయ మర్దనము, కృష్ణవిలాసము, ప్రహ్లాదచరిత్ర మాత్రం లభ్యం. ఇంకా విజయ రాఘవుని ఆస్థానకవులు కూడా యక్షగానాలు రచించి తమ వంతు కృషి చేసారు.
విజయరాఘవుని కుమారుడు మన్నారుదేవుడు 1669లో ‘హేమబ్జ నాయికా స్వయంవరము’ అనే యక్షగానాన్ని రచించాడు. ఇందులో ఇతివృత్తం పౌరాణికం. క్షీరసాగర మథనం, నాయిక అవతరణ, నాయికా నాయకులు పరస్పరం ఒకర్నొకరు ఇష్టపడడం, వీరి విరహవేదన, చివరకు విరహంతో కథ సమాప్తమవుతుంది. శృంగారం అంగిరసం, హాస్యం అంగిరసం.
హేమాబ్జ నాయికా స్వయంవరము – పరిశీలన
‘హేమాబ్జ నాయికా స్వయంవరము’ అనే యక్షగానాన్ని మన్నారుదేవుడు ‘శ్రీరమణీ సముజ్జృంభవన కటాక్ష’మనే సీసపద్యంతో ప్రారంభించాడు.
దక్షిణ ద్వారకాపురంలో సభలో ఆసీనుడై ఉన్న రాజగోపాలుడి దగ్గరకు దేవతలు వచ్చి పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని పోయమని కోరగా రాజగోపాలుడు అంగీకరిస్తాడు. పాలసముద్రం నుండి హేమాబ్జ నాయిక అవతరించి, పరస్పరం ప్రేమించుకోవడం, ఆపై విరహంతో బాధపడడం జరుగుతుంది. హేమాబ్జ నాయిక స్వయంవరములో రాజగోపాలున్ని వరించడం, వివాహం ఇతివృత్తం.
హేమాబ్జ నాయికా స్వయంవరములో కథ పురాణేతి వృత్తం. కాబట్టి ఇది ప్రఖ్యాతం. నాయకుడు ధీరోదాత్తుడు. అంగిరసం శృంగారం. అంగరసం హాస్యం. ఈ నాటకంలో కవే భరతవాక్యం చెప్పాడు.
హేమబ్జ నాయికా స్వయంవరములో సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఇందులో రాగతాళాలు రెండూ ఉన్నాయి. వైరిపదాలు, సామెతలు, జాతీయలు, నిఘంటువులో లేని పదాలు, జంటపదాలు, పాత్రోచిత భాషా ప్రయెగాలు ఈ యక్షగానంలో కనిపిస్తాయి.
‘హేమాబ్జ నాయికా స్వయంవరము’ యక్షగానం సాహిత్యం – సంప్రదాయం
‘హేమాబ్జ నాయికా స్వయంవరము’ యక్షగానం పాడడానికి అనువుగా గేయరపంలో ఉండి వివిధ దేశీ ఛందస్సులతో కూర్చిన పాటల సంపుటీకరణ. ఈ యక్షగానంలోని కథ పౌరాణికేతివృత్తం. ఇందులో ఛందోవైవిధ్యం, భాషావైవిధ్యం ఉంది.
మన్నారుదేవుడు తన రచనను మొదట సీసపద్యంతో ప్రారంభించి, ఇష్టదైవం, కులదైవం అయిన రాజగోపాలుడ్ని చెంగలమ్మను కీర్తించాడు.
మన్నారుదేవుడు హేమబ్జ నాయికా స్వయంవరములో పెళ్ళి వేడుకకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఆనాటి వివాహ వ్యవస్థను, వివాహం జరిగే తీరును ఇందులో చిత్రించాడు. ఇవి మన్నారుదేవుని కాలంలో జరిగే వేడుకలు, ఆచారాలు తెలుసుకోవడానికి ఉపయెగపడతాయి.
వధువు అలంకరణ
”కురులు దువ్వి మిటారి కొప్పమరించి
సరిలేని యరివిరి సరములు జుట్టి…”
అని వర్ణించాడు.
పూబంతి, మల్లి, పారిజాతము, పొన్నపూలు, విరజాజులు, సన్నజాజులు, కమ్మవిరులు, సంపంగి సరులు.
యక్షగానం లోకవృత్త ప్రదర్శనకు అనువైంది అవడం వల్ల మానవుని నిత్య జీవితానికి సంబంధించిన అనేక విషయలు ఉంటాయి. ‘మారకవీంద్రులు మెచ్చ వసుమతి దిరముగా నమరావతీపురం బనగ’ అనే ద్విపద పద్యంలో దక్షిణ ద్వారకాపురంలో ఉన్న కోటలు, మేడలు, రాజ్యసంపదలు వంటి విశేషాలన్నీ వర్ణించి అప్పటి రాజుల విలాసవంతమైన జీవితాన్ని, వారనుభవించే సుఖభోగాలను వివరించాడు.
ముగింపు –
మన్నారుదేవుడు రచించిన ఈ యక్షగానం ద్వారా ఆ కాలంనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల అవగాహనతో పాటు, రాజుల విలాసాలు, భోగలాలసత్వం, బహుభార్య ప్రియత్వం, ఆనాటి వివాహవ్యవస్థ తీరుతెన్నులు, ఆచారాలు, సంప్రదాయలు, వేడుకలు, అలంకరణలు వంటి విషయలతో పాటు బ్రాహ్మణ వ్యవస్థ పతనావస్థ, వ్యవహారిక భాషా విశేషాలు, సంగీతానికి గల ప్రాధాన్యత వంటి అంశాలు తెలుసుకోవచ్చు.