మొదటి రోజు కథ
అనార్కో ఓ ఆడపిల్ల, ఇది తను వేసుకొనే బట్టల్ని చూసి చెప్పొచ్చు. బట్టలు వేసుకోకపోయినా చెప్పొచ్చనుకోండి. ”నీకు ఎన్ని ఏళ్ళు?” అని ఎవరైనా అడిగితే, ”కావాలనుకుంటే పది, ఇరవై, ముప్పై, నలభై ఏళ్లదాన్ని కాగలను. ఇప్పుడు మాత్రం పదేళ్లే” అని చెబుతుంది. ఆమె గనక మంచి మూడ్‌లో ఉంటే అంతటితో ఆగక ‘నువ్వెప్పుడూ తలంటుకొని, నున్నగాదువ్వుకొనే కనబడతావేంటి? నా కోసం ఒక్కసారంటే ఒక్కసారన్నా జీడీలు తీసుకురావేం? మైదాపిండిని ఉడకబెడితే ‘యాక్’లాగా ఎందుకు వుంటుంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఒక వేళ అనార్కో మూడ్ బాగోకపోతే? మూడ్ బాగోకపోతే మీతో మాట్లాడితేకదా!
అనార్కోని ఇంట్లో వాళ్లు ‘అన్నో’ అంటారు. ”అన్నో నీళ్లు తీసుకురా! ఎండలో తిరగద్దు అన్నో! అన్నో బయట చీకటిగా వుంది ఎక్కడికీ వెళ్లమాకు! వానలో తడవమాక అన్నో!’ అంటూ పెత్తనం చెలాయించడానికి పేరుకూడా చిన్నగా ఉంటే తేలిక కదా! ఇంటికి ఎవరైనా వస్తే ‘ఇది మా అనార్కో, ముద్దుగా అన్నో అని పిలుస్తాం’ అని చెప్పుకుంటారు. హు ముద్దట ముద్దు.
ఈ రోజు అనార్కో మూడ్ బాగోలేదు. అమ్మ పొద్దున్నే నిద్రలేపి గుడికెళ్లి పళ్లూ, పూలూ ఇచ్చిరమ్మంది. దేవుడికి పళ్లూ, పూలూ ఎందుకు ఇవ్వాలి? మొదటి ప్రశ్న వేసింది అనార్కో. ‘అలాగయితే దేవుడు ప్రసన్నమవుతాడు.’ బుజ్జగిస్తూ చెప్పింది అమ్మ.
దేవుడిని ప్రసన్నం చేసుకోవడం ఎందుకు అమ్మా? మళ్లీ అడిగింది అనార్కో. ఈ ప్రశ్న అమ్మకి నచ్చలేదు. ‘ముందు గుడికి వెళ్లిరా’ అంటూ గదమాయించింది. ‘దేవుడు గుడిలోనే ఉంటాడా?’ అంటూ వదలకుండా అడిగింది అనార్కో. అవకాశం దొరికింది కదా అని ‘దేవుడు అన్ని చోట్లా ఉంటాడమ్మా, రాళ్లల్లో, మొక్కల్లో, పాఠాల్లో, ఇంట్లో, పశువుల్లో, పక్షుల్లో అన్నిటిలోనూ ఉంటాడు’ అమ్మ వివరించింది. ‘అయితే ఈ అరటి పళ్లు మన బుజ్జాయికి తినిపించనా?’ అనార్కో ప్రశ్న.
దీనికి అమ్మ నోటితో బదులివ్వక మంచం మీద ఉన్న అనార్కోని కిందకి లాగి చెంపమీద ఒక్కటిచ్చుకుంది. చేసేది లేక అనార్కో పూలబుట్ట తీసుకొని గుడికి బయలుదేరింది.
ఇంటినుండీ సందు మలుపు తిరగ్గానే ఎదురైన కిట్టూవాళ్ళ మేకకి అరటిపళ్లూ, తమలపాకులు తినిపించింది. దారిలో పూజారితాత, కిట్లూ వాళ్ల నాన్న కనిపించారు.
”దేవుడిపైన భారం ఉంచునాయనా, అన్నీ ఆయనే సరిచేస్తాడు. ఆయన శక్తి అపారమైనది. దేవుడి లీలలు చిత్రంగా ఉంటాయి.” అంటూ ఇంకా ఏదో చెపుతూనే ఉన్నాడు పూజారితాత. ఆ మాటలు చెవినపడ్డ అనార్కోకి ‘అపారం’ అంటే ఏమిటో అర్థం కాలేదు. ఆలోచిస్తూనే గుడిదారి వదలి తోటలోకి జారుకుంది. అక్కడ తూగుడు బల్ల పక్కన ఇసకలో పడుకుని ఉన్నాడు కిట్టూ. వాళ్లనాన్న ప్రైవేటుకి వెళ్లమంటే ఎగ్గొట్టి ఇటు వచ్చాడని అర్థమైంది అనార్కోకి. గాల్లో ఎగురుతోన్న దూది పింజల్ని పడుకొని చూస్తున్నాడు కిట్టూ. స్నేహితురాల్ని చూడగానే కిట్టూలో ఉత్సామం పొంగింది. బూరుగ చెట్టు చాటున పూల బట్టని పెడుతూ ‘నిజంగా దేవుడికి చాలా బలం ఉంటుందా చెప్పు కిట్టు’! తన సందేహం బయటపెట్టింది. కాసేపు దీన్ని గురించే ఆలోచించి చివరికి ”దేవుడి బలం ఏమోగాని, నాకు మాత్రం నీడకంటే ఎక్కువ బలం ఉంది.” అన్నాడు కిట్టూ. మాట మారుస్తున్నాడని తెలిసినా పట్టించుకోలేదు అనార్కో. పైగా సన్నగా, పీలగా ఉండే కిట్టూ తనకే ఎక్కువ బలం ఉందని కోతలు కోయటం చూసి నవ్వుకుంది. ‘బలే కోతలు కోస్తున్నావే’ అని ఎగతాళి చేసింది.
‘తూగుడు బల్లమీద నేను ఇటు, నీవు అటు కూర్చుందాం. ఎవరికి ఎక్కువ బలమో చూద్దాం.’ ఉక్రోషంతో పట్టుదలగా అన్నాడు కిట్టూ. వెంటనే ఒప్పుకుంది అనార్కో. ఇద్దరూ చెరోవైపునా కూర్చొని తమ బలాన్ని ఉపయోగిస్తున్నారు. అనార్కో ఎంత బలాన్ని ఉపయోగించినా కిట్టూవైపు బల్లపైకి లేవటంలేదు. గట్టిగా ఊపిరి పీల్చి మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. ఊహూ బల్లఎంత మాత్రం కదల్లేదు. తానే గెలిచానన్న సంబరంతో చప్పట్లుకొడతూ నవ్వుతున్నాడు కిట్టూ. కిట్టూ కూర్చున్న బల్లపైకి లేవకపోడానికి ఏదో కిటుకు ఉందని అనార్కోకి అనిపించింది. కాసేపు ఆలోచించి మనిద్దరం చోటు మారి బలాలు చూసుకుందాం అంది.
ఇది విన్న కిట్టూ మొహంలో నవ్వు మాయమై, జోరు కూడా తగ్గింది. తటపటాయిస్తూనే చోటు మారడానికి ఒప్పుకున్నాడు. స్థలాలు మారడంతోనే కిటుకు ఏమిటో అర్థమైంది అనార్కోకి. ఆ వైపున ఉన్న ఒక కొక్కెం బల్లని పైకి లేవనీయడం లేదు. ఇక తను ఎంత బలం ఉపయోగించీ ఏం లాభం, కిట్టూ శక్తి వెనుక రహస్యం తెలిసిపోయింది. ‘ఇప్పుడు నీ పని పడతానుండు’ మనసులో అనుకుంది. కిట్టూని బల్లమీద కూర్చోనిచ్చి ఒక్కసారిగా తన బలాన్నంతా ప్రయోగించింది. దెబ్బకి కిట్టూ వైపు బల్లమైకి లేచింది. ఆ ఊపుకి కిట్టూ గాల్లో ఎగిరి ఇసకలోకి పిల్లిమొగ్గ వేశాడు. ఇసక దులుపుకుంటూ లేచి నీ దోస్త్ కటీఫ్. నా దగ్గర తీసుకున్న సైకిల్ టైర్ సాయంత్రం ఇచ్చెయ్, ‘కోపంగా అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.
ఇంటికి తిరిగి వెళ్లడానికి అనార్కోకి తొందరేం లేదు. గుడికి వెళ్లడానికే ఇంతసేపు పడుతుందయ్యే. అందుకే వెళ్లి తీరిగ్గా బూరుగచెట్టుకింద కూర్చొంది. స్థలం మారితేగానీ ఎవరికి ఎంత బలం వుందోతెలీలేదు’ అనుకుంటూ నవ్వుకుంది. ఎదురుగా ఎగురుతోన్న రంగు రంగుల సీతాకోకచిలకల్ని గాలిలో తేలుతోన్న దూది పింజల్ని చూస్తూ ఆలోచనలో పడింది. ఆ ఆలోచనలో ఒక ప్రదేశాన్ని చేరుకుంది.
ఆ ప్రదేశంలో ఎదురువైపు నుంచి అమ్మ వస్తోంది. వెనగ్గా నాన్న. ముందు నడుస్తోన్న అమ్మ ఆగిపోవటంలో నాన్నా ఆగిపోయాడు. అమ్మ వెనక్కి తిరిగి నాన్నకేసి చూపింది అరే. ఇదేంటీ అమ్మ అమ్మలానే ఉంది. చూపు మాత్రం నాన్న చూపులా ఉంది. నాన్న కూడా నాన్నలానే వున్నా అమ్మ చూస్తున్నట్టుంది. అమ్మా, నాన్నల రూపంలో తేడా ఏం లేదు. కానీ చూపుల్లో మార్పు ఎందుకు వచ్చిందీ? అనార్కోకి అంతా అయోమయంగా ఉంది. ఇదంతా విచిత్రంగానూ, తమాషాగానూ అనిపించసాగింది.
”అంట్లు తోమి అలసిపోయుంటారు. నేను టీ పెట్టుకొని వస్తాను కూర్చోండి’ సన్నగా గొణుగుతున్నాడు నాన్న.
అమ్మేమో ‘ఇప్పుడు టీ తాగేంత తీరిక లేదు నాకు’ అంటోంది. నాన్న మళ్లీ గొణుగుతున్నట్లుగానే ‘ఏం పని ఉంది? ఎక్కడికి వెల్లాలి? అడిగాడు. దానికి అమ్మ ‘ఏవో మాకు లక్షాతొంబై పనులుంటాయి. పగలంతా ఆఫీసులో కాగితాలు ముందేసుకు కూర్చునే నీకేం తెలుసు’ కోపంగా అంది.
నిముషంలో టీ పెట్టుకొస్తాను ఉండమని బతిమాలుతుండగా కిట్టూ వాళ్ల అమ్మ వచ్చింది. నాన్న ఊడిపోయిన చొక్కా గుండీ వంకా, కిట్టూ వాళ్ల అమ్మనంకా అమ్మ చూసిన చూపుతో గాబరాగా నాన్న గుండీ పెట్టుకున్నాడు. దీని గురించి ఆలోచిస్తూ ఆ ప్రదేశంలోనే రెండో చోటకి చేరుకునే సరికి అమ్మానాన్నల బలాబలాలు అనార్కోకి అర్థం అయినట్టు అనిపించసాగింది.
ఆలోచనల్లోనే తను చేరుకున్న రెండో చోటుని కలియ చూపింది. అది బడే. గోపీ, శాంతా, బండాయ్, కమల, సూర్యం అందరూ ఉన్నారు. మరి మాస్టారు ఏరబ్బా! అరె! మాస్టారు కుర్చీలో ఒంటికాలు మీద నిలబడి, చెవులు పట్టుకుని ఉన్నారు. మొహం చూస్తే ఇంకా సేపట్లే ఏడ్చేసేట్టుంది. ఈ రోజు కూడా అయిదు నిముషాలు ఆలస్యంగా వచ్చావు. బయట తెలుగు మాష్టారితో కబుర్లు చెబుతున్నావేం? నీకు జీతం ఇచ్చేది ఇందుకేనా? ఈ పిరియడ్ అయిపోయేదాకా అలాగే నిలబడు” చేతి బెత్తం ఊపుతూ ఆజ్ఞాపిస్తున్నాడు కిట్టూ. ఇదంతా చూసిన అనార్కోకి నవ్వు ఆగలేదు. అంతకు ముందు నుండీ నవ్వుతున్నారు మిగిలిన పిల్లలూ కిట్టూనూ, చేతిలో బెత్తాన్ని అనార్కో వైపు విసిరాడు కిట్టూ. కానీ అది ఆమెకి తగల్లేదు. దాన్ని చేతిలోకి తీసుకున్న అనార్కోకి మాష్టారిశక్తి వెనక ఉన్న రహస్యం ఏదో తెలిసినట్లు అనిపించింది. మాష్టారివైపు చూసింది అనార్కో. ఆయన పంచె జారిపోతోంది ఒకవైపు. సరిచేసుకుందామంటే చెవులు పట్టుకొని నిలబడమని కిట్టూ అజ్ఞ అయ్యే. ఇదంతా వింత దృశ్యంలా ఉంది. ఆమెకి తెలీకుండానే మాష్టారిపైన జాలి కలిగింది. ఆయనపై జాలి పడుతూనే మూడో చోటుకి చేరుకుంది.
అక్కడ ఆమెకి ఏమీ కనిపించలేదు. చేతిలోని బెత్తాన్ని విరిచి ఆ ఏమీలేని చోటులోకి విసిరేసి ముందుకు కదిలింది. అలా వెళుతూ వెళుతూ నాలుగో చోటుకి చేరుకుంది. అక్కడంతా గందరగోళంగా ఉంది. చేతిలో ఇంజక్షన్‌తో ఒక డాక్టర్. ఆయనకి ఎదురుగా కమల. డాక్టర్ చేత్తో నుదురు కొట్టుకుంటుంటే ”జబ్బు చేసింది నాకా? నీకా? నేనా రోగిని? నీవా? పొట్టలో నొప్పిగా ఉంది నాకా, నీకా? నేను ఇంజక్షన్ చేయించుకోనంటే చేయించుకోను. కమల గట్టిగా అరుస్తోంది. ‘మా అమ్మగా ఈ ఒక్కసారికీ చేయించుకోమ్మా. లేకపోతే నాకు డబ్బులు ఎలా వస్తాయి?’ డాక్టర్ కంఠం ఏడుస్తూ బతిమాలుతూన్నట్టుంది. ససేమిరా ఒప్పుకోవటం లేదు కమల. ఆమెకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తోన్న డాక్టరుకి చెమటలు పడుతున్నాయి. ఇది చూసిన అనార్కోకి నవ్వు అపుకోవడం కష్టమైంది.
నవ్వుతూ, నవ్వుతూనే అయిదో చోటుకి చేరుకుంది. అక్కడ ఒక తోట వుంది. ఆ తోటలో ఒక బూరుగచెట్టు. ఆ చెట్టు చాటున ఒక పూలబుట్ట. గాలిలో ఎగురుతోన్న దూది పింజలు. ఇవన్నీ చూడగానే ఈ చోటు తన ఆలోచనల్లోది కాదని అర్థం అయింది. ఇహ ఇంటికి వెళ్లాల్సిన సమయం అయిందనుకొని పూల బుట్టని చేతిలోకి తీసికొని ఇంటిదారి పట్టింది.
ఇంటికి రాగానే ‘పళ్లూ, పూలు దేవుడికి సమర్పించి వచ్చావా?’ అమ్మ ప్రశ్నించింది. ‘ఇచ్చానమ్మా దేవుడు చాలా సంతోషించాడు. నా బుగ్గమీద ముద్దు పెట్టుకొని రోజూ గుడికి రమ్మని చెప్పాడు. తింటానికి లడ్డూ కూడా ఇచ్చాడు’ లోపలికి వెళుతూ జవాబు చెప్పింది అనార్కో.
ఏమిటో పిచ్చిపిల్ల. ఏ లోకంలో ఉంటుందో. ఏం ఊహించుకుంటుందో! అమ్మ అనుకుంటోంది. మరి లోపలో! లోపల అనార్కో ముసి ముసి నవ్వులు రువ్వుతోంది.
రెండవ రోజు కథ
ఒకదాని తరవాత ఒకటిగా చాలా పిచికలు ఎగురుతున్నాయి. అకాశంలోంచి రంగుల రంగుల పిచికలు లెక్కలేనన్ని వస్తున్నాయి. వాటిని లెక్కబెట్టడం మొదలు పెడితే, లెక్కల్లో పడి పిచికల్ని చూడటమే మర్చిపోతాం…కలగంటున్న అనార్కోని ”అన్నో, అన్నో ఇంకా పడుకొనే వున్నావా? లే! లే!” కుదుపుతూ లేపింది అమ్మ. బద్దకంగా పళ్ళు విరుచుకొని, కళ్లు నులుముకుంటూ లేవబోతోన్న అనార్కోకి ఏదో గుర్తుకు వచ్చింది. సంతోషిస్తూ ”గుడికి వెళ్లాలిగా, పూలబుట్ట ఏదీ?” అంది. ‘ఇవ్వాల్టి నుండీ ఒక్కపూట బడి అని మర్చిపోయావా? తొందరగా తయారయి బడికి వెళ్లాలి” అమ్మ బదులిచ్చింది.
ఇవాళ కూడా గుడి సాకుతో తోటలో అడుకోవచ్చుకదా! అని కలలు కంది అనార్కో. ”దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి కదమ్మా!” అంటూ గుడికి వెళ్ళడానికి ప్రయత్నించింది. అమ్మ ”ఊ…’ అని నిట్టూరుస్తూ’ బడికి వెళ్ళటం దానికంటే ముఖ్యం. బడికివెళ్లకపోతే చదువు ఎట్లా వస్తుంది? గబగబా తయారవు” అంది.
గుడికెళ్లి దేవుడిని ప్రసన్నం చేసుకుంటే చదువు దానంతట అదే వస్తుంది కదా! ఇహ బడికి వెళ్లటం ఎందుకు?” తన అనుమానాన్ని బయట పెట్టింది అనార్కో.
ఈసారి ఇంకొంచెం గట్టిగా ‘ఊ….’ అని నిట్టూరుస్తూ ”అయితే వెళ్లి మీ నాన్నని అడుగు” అంది. ప్రతి చిన్నదానికీ నాన్నని అడగమంటుంది అమ్మ. ఇది నచ్చదు అనార్కోకి. అయినా చేసేదేం లేక నాన్న దగ్గరికి వెళ్లి ”నాన్నా… ఇవాళా… నేనూ బడికి వెళ్ళను” అని చెప్పింది.
”ఏమిటీ? బడికి వెళ్లవా? వెళ్లకుండా ఏం చేద్దామనీ? ఇట్లా అయితే చదువు వస్తుందా?” నెమ్మదిగానే అడిగాడు నాన్న.
ఈ రోజు బడికి వెళ్లాలని లేని అనార్కో. ”చదువు వస్తే ఏమవుతుంది?”అని అడిగింది. ఎదురు చూడని ప్రశ్నకి నాన్న తడబడ్డాడు. ”చదువుకుంటే పెద్దయ్యాక మంచి ఉద్యోగం వస్తుంది.” కాసేపటికి సర్దుకొని చెప్పాడు.
”ఇప్పటి నుండి చదివినవన్నీ పెద్ద అయ్యేసరికి మర్చిపోతాగా” సందేహం అడిగింది. ప్రశ్నల మీద ప్రశ్నలతో సహనం పోయిన నాన్న ”పొద్దున్నే లేచీ లేవగానే వసపిట్టలా వాగి విసిగిస్తావు. పో… పోయి మొహం కడుక్కో” అని కోప్పడడం మొదలు పెట్టాడు.
మొహం వేలాడేసుకొని అక్కడి నుండి కదిలింది అనార్కో. కోపంగా ఎడాపెడా పళ్లు రుద్ది, బండకేసి బరాబరా కాళ్లని రుద్ది
నీళ్లు పోసింది. నిన్నటి నుండి కాళ్లకి అంటుకున్న దుమ్మంతా వదలి మురికి నీళ్లు ధారగా ప్రవహిస్తున్నాయి. అంతలో ఇంకో అనుమానం రావటంతో నాన్న దగ్గరికి పరిగెత్తి ”బడికి వెళితేనే చదువు వస్తుందా నాన్నా?” అని ప్రశ్నించింది. ”అర్థం పర్థంలేని ప్రశ్నలు అడగకుండా తొందరగా అన్నంతిని బడికి వెళ్లు” చిరాగ్గా హుంకరించాడు నాన్న.
”జవాబు చెప్పలేనప్పుడల్లా అర్థం పర్థం లేని ప్రశ్నలు అడగవద్దంటావేంటి?” అని అడగాలని అనార్కోకి ఎంతగానో ఉంది. కానీ ఎదురు ప్రశ్నలు వేయొద్దని రెండు దెబ్బలు కూడా వేస్తారని తెలిసి ఊరుకుంది. డ్రస్ వేసుకొని వంటింట్లో కెళ్లి గబగబా అన్నం తినేసి, పుస్తకాల నుంచి తీసుకొని బడికి బయలుదేరింది.
మట్టిరోడ్డుమీద కాలి బొటన వేలితో గీతగీసుకుంటూ బడికివెళుతోంది. ఇంతలో ఒక విచిత్రమైన పురుగు కనిపించింది. ఒక చీమని పట్టి పురుగు ఉన్న కన్నంలో పడేసింది. దాన్ని పట్టుకోడానికి పురుగుపైకి రాగానే దానిపై తుపుక్కున ఉమ్మి గుప్పిట్లోకి పట్టుకుంది. దుమ్ము, ఉమ్ము, చీమ, పురుగు అన్నీ గుప్పిట్లోకి వచ్చాయి. పురుగని జాగ్రత్తగా పరిశీలించింది. కానీ ఏం అర్థం కాలేదు. దాంతో పురుగుని కింద పారేసి చేతులు దులుపుకొని ముందుకి నడిచింది. అట్లా నడుస్తోంటే కొద్ది దూరంలో రైలు పట్టాలు, పట్టాల వెనక కరెంట్ స్థంభాలు, వాటి వెనక పరిచేలూ, చేల వెనగ్గా తాటిచెట్లువెనక దూరంగా ఏవో కొండలూ కనిపించాయి. ‘ఆ కొండల వెనక ఏముందబ్బా! ఎలా వుంటుందబ్బా!’ అని ఆలోచిస్తున్న అనార్కోకి గణగణమంటూ బడిగంట వినపడింది. మొన్న స్కూల్‌కి ఆలస్యంగా వచ్చినందుకు కిట్టూ తిన్న బెత్తం దెబ్బలు గుర్తొచ్చి పరిగెత్తడంమొదలు పెట్టింది. రొప్పుకుంటూనే బడికి చేరింది. ప్రార్థన చేయడానికి పిల్లలు వరసల్లో నిలబడుతున్నారు. అనార్కో కూడా తన తరగతి పిల్లలతో పాటు నిలబడింది.
”సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతు యే సదా!” అని ఒక్కో వరస ముందు టీచరు చెస్తోంటే. తరవాత పిల్లలు కూడా అంటున్నారు. బడికి ఎగ్గొట్టాలనుకున్న అనార్కోకి ప్రార్థన కూడా చేయాలనిపించలేదు. అంతేకాక మిగిలిన పిల్లలు చేస్తోంటే పెద్దగా తేనెటీగలు రొదపెట్టినట్టు అనిపిస్తోంది. వాళ్ల రొదని వింటూ ”బళ్లో కూడా దేవుడ్ని ప్రార్ధిస్తారన్నమాట”. మొదటిసారిగా అనుకుంది.
‘దేవుడ్ని మెప్పిస్తే చదువొస్తుందని టీచరు కూడా అనుకుంటున్నట్లేగా! ఇది గుర్తుపెట్టుకొని అమ్మకి చెప్పాలి’ అనుకుంది. ఇంతలో ప్రార్థన అయిపోయింది. పిల్లలందరూ నవ్వుతూ, అరుస్తూ, అల్లరిగా తరగతులకి వెళుతున్నారు. టీచర్లు తరగతిలోకి వచ్చేసరికి అంతా నిశబ్దం.
ఆ రోజు ముందుగా తెలుగు క్లాసు వుంది. టీచరు పద్యం బట్టి పెట్టిస్తున్నారు. బెత్తం ఊపుతూ ‘తల్లీ భారతి వందనం’ అని టీచరు చెప్పగానే, పిల్లలు ముందుకీ వెనక్కీ ఊగుతూ ‘తల్లీభారతీ వందనం’ అని గొర్రెల్లా అరుస్తున్నారు. మిగిలిన పిల్లలతో పాటు అరవాలని పించక అనార్కో మెల్లగా తన ఊహలోకాల్లోకి జారుకుంది, అందరి అరుపులూ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎందుకో తెలుసుకొనే లోపే టీచరు అనార్కో చెవి పట్టుకొని లేపి తలుపుదాకా లాక్కెళ్లి ”చదువుకోవాలని లేకపోతే బడికి రావద్దు పో” అని బయటికితోశారు. బిక్క మొహంతో అనార్కో అడుగులో అడుగు వేసుకొంటూ బయటకి నడిచింది.
బడిగేటు దాటగానే ఉత్సాహంగా పరిగెడుతూ తోటలోకి వెల్లింది. మిగతా పిల్లలతో పాటుముందుకీ, వెనక్కీ ఊగుతూ కిట్టూ కూడా పద్యం బట్టీ పడుతుంటంతో తోటలో ఎవరూలేరు. బూరుగ చెట్టుకింద నేలని శుభ్రం చేసింది. దగ్గర్లోనే దొరికిన చిన్న చిన్న రాళ్ళను ఏరి పూలలాగా పేర్చసాగింది. అలా పేర్చుతుండగా సెలవల్లో మాలతితో గడపిన రోజులు గుర్తుకువచ్చాయి. మాలతి అనార్కోకి మామయ్య కూతురు. వాళ్ల ఊరికి దగ్గర్లోనే ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవిలో ఏరు, ఏటి ఒడ్డున ఇసకలో గుంటలు చేస్తే, వాటిలోకి నీళ్లు వస్తాయి. మాలతీ, తనూ ఏట్లో చేపల్ని పట్టి గుంటల్లోకి వేసేవాళ్లు వాటితో కాసేపు అడుకుని మళ్లీ ఏట్లో వదిలేవారు. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్న అనార్కో తనకి తెలికుండానే ఊహల్లో ఒకూరికి చేరుకుంది. ఆ ఊరికి దగ్గరలో పచ్చని అడవి, ఆ అడవిలో ఏరు, ఏట్లో నీరు, నీళ్లలో చేపలు. ” ఈ చేపలు ఎందుకో అటూ ఇటూ తిరగకుండా గుండ్రంగా కూర్చొని ఉన్నాయి. చేపల మీటింగా? అరే ఈ చేపలు మాట్లాడుతున్నాయే!” అనుకుంది అనార్కో. అనార్కోకి వాటి మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి. వాటిలో ఒక చేప మాట్లాడుతోన్న తీరును బట్టి అది చేపల రాజై ఉంటుందనిపించింది.
చేప రాజు ముందు మాట్లాడుతూ ”కొన్ని చేపలు నియమ నిబంధనలు పాటించకుండా, ఇష్టం వచ్చినప్పుడు పాడుతున్నట్లు, గంతులు వేస్తున్నట్టు మాకు తెలిసింది.” అంది. దీనికి మీటింగ్‌లోని చాలా చేపలు తల ఊపుతూ, ”ఔను మహారాజా కొన్ని చేపలు వాటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి తలనొప్పి తెప్పిస్తున్నాయి.” అని వంత పాడాయి.
”అయితే వీటికి తగినట్టు బుద్ది చెప్పాలి” అంది రాజు చేప. ”చిన్నప్పటి నుండి ఇవి ఇలాగే ప్రవర్తిస్తున్నాయి మహారాజా, ఇక బుద్ది ఏం చెబుతాం?” అంటూ సందేహంగా అన్నాయి కొన్ని చేపలు.
”మొక్కై వంగనిది మానై వంగుతుందా?” సందేహం వెలిబుచ్చింది ఒక చేప. ”అందుకని బాల్యానికే గుణపాఠం చెప్పాలి. ఆ… మా
ఉద్దేశం బాల్యం నుంచే గుణపాఠం చెప్పాలని” అంటూ చేప రాజు శాసనం చేసేసింది. ముసలి చేపలు తన బోసి నోటిని చప్పరిస్తూ తల ఊపుతూ ”ఔను మహారాజా, చిన్నప్పటి నుండే చేప పిల్లలకి ఈదటం ఎలాగో ఎక్కడ అగాలో, ఎలా పడుకోవాలో నేర్పించాలి. అంతేకాక ఏది మంచో ఏది చెడో, ఏవి తినవచ్చో. ఏవి తినకూడదో తెలియచెప్పాలి.” అని వివరించింది. అంతసేపు మాట్లాడేసరికి ముసలి చేపకి ఆయాసం వచ్చింది.
దీనికి బదులుగా రెండో చేప ”అసలు చేప పిల్లలన్నీ నిలకడగా ఒకచోట కూర్చుంటేకదా! వాటికి ఏదైనా నేర్పడానికి కుదిరేది. ఈ నిముషానికి ఇక్కడుంటే మరో నిముషానికి అక్కడుంటాయి.” అంది.
”ఏరు దిగువన కొన్ని, ఏరు ఎగువన కొన్ని, మర్రి చెట్టు కింద నీళ్లలో మరికొన్ని చేపలు ఉన్నాయి. ముందు మొత్తం ఎన్ని పిల్లలు వున్నాయో లెక్క తేల్చాలి. ఆ తరువాత వీటన్నిటికి నియమ నిబంధనల్ని ఎట్లా చెప్పగలమో నిర్ణయించాలి.” అంటూ నీళ్ళు గుద్ది మరీ చెప్పింది మూడో చేప.
మెడ తిప్పుకుంటూ, సన్నని కంఠంతో నాల్గో చేప ”అందుకే ముందుగా నియమ నిబంధనల్ని ఒక రాయి మీద చెక్కాలి. వాటికి చెప్పే పాఠాల్లో ఆ విషయాలు ఉంటున్నాయోలేదో మనం గమనిస్తుండాలి.” అంది.
సమావేశం సాఫీగా సాగుతుండటంతో కునుకు తీస్తున్న రాజు చేప నాల్గో చేప చివరి మాటలు విని ”వీటి కోసం తయారు చేసే పుస్తకాల్ని ముందుగా మాకు చూపించాలి” అంటూ తన అధికారాన్ని ప్రదర్శించింది.
ఇందుకు వత్తాసుగా ”ఔనవును, ముందుగా మహారాజుగారు పుస్తకాల్ని పరిశీలించాల్సిందే” అంటూ మిగిలిన చేపలు అన్నాయి. దాంతో చేప రాజు తిరిగి నిద్రలోకి జారుకుంది.
అందరి దృష్టిని ఆకర్షించడం కోసం మెల్లగా నోరు తెరుస్తూ మూస్తూ కూర్చుంది అయిదో చేప. అందరి చూపూ తనపై పడగానే, తెలివినంతా ప్రదర్శిస్తూ ”ఈ పిల్లలు అటు ఇటు పరిగెడతా యనుకుంటే ఒక గది తయారు చేద్దాం. ఆ గదిలో వాటన్నిటినీ కూర్చోపెట్టి, ఏ ఆటంకం లేకుండా మనం చెప్పదలుచుకున్నవన్నీ చెప్పొచ్చు” అంది.
”ఎప్పుడూ గదిలోనే వుంచితే, చేప పిల్లలు విసిగిపోయి, మనం చెప్పే వాటిని బుర్రలోకి ఎక్కించుకుంటాయా?” అనుమానం వ్యక్తం చేసింది. ఆరో చేప దీనికి మీరే మంటారు? అన్నట్లు కళ్ళజోడు సరిచేసుకుంటూ అందరివైపు చూసింది. ఆదేమంత పెద్ద సమస్య కాదన్నట్లు ఏడో చేప తోక సవరించుకొంటూ. ”దానిదేముందీ, పిల్లల్ని మధ్య మధ్యలో కాసేపు బయట తిరగనిద్దాం” అంది.
”ఒకసారి బయటికి వెళ్లనిచ్చాక, తిరిగి లోపలికి వస్తాయన్న నమ్మకం ఏమిటి?” అనుమానించింది ఏనిమిదో చేప.
ఆలోచించి, ఆలోచించి తొమ్మిదో చేప ”మనం ఒక మీటని తయారు చెయ్యాలి. ఆ మీటని నొక్కితే పిల్లలు బయటికి వెళ్లి, మళ్ళీ నొక్కగానే లోపలికి వస్తాయి.” అంటూ వివరించింది. ఆనార్కో చూస్తుండగానే వేలకి వేల మీటలు తయారయ్యాయి. వాటిల్లో ఒక మీట పెద్దగా, గుండ్రంగా తయారై బడిగంట వినిపించసాగింది.
”ధుత్తేరి, చేప పిల్లలకి కూడా బడి పెడతారన్నమాట” అనుకుంటూ లేని బడివైపు పరిగెత్తింఇ అన్నార్కో. అప్పుడే వాళ్ళ తరగతిలోంచి ఇంగ్లీషు టీచరు బయటికి వస్తున్నారు. లెక్కల టీచరు ఇంకా రాలేదు. అనార్కో మెల్లగా లోపలికి వెళ్లి సంచిలోంచి ఎక్కాల పుస్తకం తీసి ”నాలుగు ఒకట్ల నాలుగు, నాల్‌రెళ్ళెనిమిది, నాల్ మూళ్ పన్నెండు, నాల్ నాల్ పదహారు అంటూ బట్టీ పడుతోంది. మిగిలిన పిల్లలు ఏడో ఎక్కంతో కుస్తీ పడుతున్నారన్నది వేరే సంగతి.