మహిళలు, పిల్లల కోసం భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న సపోర్ట్‌ సెంటర్స్‌ -భూమిక టీం

 

స్పెషల్‌ సెల్‌, మహిళా కారాగారం, చంచల్‌గూడ

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ నవంబరు 2015 నుండి చంచల్‌గూడ మహిళా కారాగారంలో స్పెషల్‌ సెల్‌ నిర్వహిస్తోంది. ఈ సెల్‌ ద్వారా వివిధ కారణాలతో, పరిస్థితులతో కారాగారానికి వచ్చిన మహిళలకు కౌన్సిలింగ్‌ అందించడం ద్వారా వారి వారి పరిస్థితులను అర్థం చేసుకోవడం, చట్ట, న్యాయపరమైన సలహాలను అందించటంతో పాటు మహిళలకు అవసరమైన సమాచారం కోసం నిపుణులు, లాయర్ల సహకారం అందించటం జరుగుతోంది. అలాగే అనుకోని పరిస్థితుల కారణంగా ప్రిజన్‌కు వచ్చిన మహిళలకు జైలులోని వాతావరణాన్ని, పరిస్థితులను అర్థం చేసుకునేలా, మానసికంగా సిద్ధపడేలా కౌన్సిలింగ్‌ అందించడం, తద్వారా వారికి వారి జీవితం/పరిస్థితుల పట్ల ఆశావహ దృక్పథాన్ని పెంపొందించుకునేలా చేయడం, దాంతోపాటు హఠాత్తుగా ఏదైనా సంఘటన జరిగి జైలుకి వచ్చిన తర్వాత అతలాకుతలమైన వారి కుటుంబాన్ని, ఒకవేళ పిల్లలుంటే వారి సంరక్షణ వంటి విషయాల పట్ల కూడా భూమిక ద్వారా పనిచేస్తున్న సిబ్బంది శ్రద్ధ వహిస్తారు. వారిలో ముఖ్యంగా వారి చిరునామాను బట్టి వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబసభ్యులను కలిసి పరిస్థితిని వివరించడంతోపాటు వారి అవసరాలను గుర్తించి తదనుగుణమైన చర్యలు చేపడతారు. దానిద్వారా జైలుకు వచ్చిన పరిస్థితులు, వారి కుటుంబ నేపధ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. అంతేకాక జైలుకు వచ్చి వెనక్కు వెళ్ళిన తర్వాత తన కుటుంబంతో, చుట్టుపక్కలవారితో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తిరిగి తన జీవితాన్ని సాధారణంగా గడపగలిగేలా కుటుంబసభ్యులకు, చుట్టుపక్కలవారికి, అలాగే జైలుకు వచ్చిన స్త్రీకి కౌన్సిలింగ్‌ చేయడం జరుగుతుంది. తద్వారా ఆయా మహిళలకు ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు సాయపడతారు. అలాగే నెలకు రెండుసార్లు జైలులోని మహిళలకు చదువు ప్రాముఖ్యత, ఆరోగ్య సంబంధిత అంశాలు, చట్టాలపై అవగాహన, జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పరచుకునేలా ఆయా రంగాలలో నిపుణులైన మహిళలచేత రెండు గంటలపాటు సెషన్స్‌ నిర్వహించబడతాయి. జైలులోని మహిళలు శారీరకంగా, మానసికంగా సంతోషంగా ఉంచగలిగేలా వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ఆటలు ఆడించటం, పాటలు పాడించటం, స్త్రీల అంశాలపై చర్చించటం వంటి కార్యక్రమాల ద్వారా అందరూ తమ తమ జీవితాలను విశ్లేషించుకుని తమ భవిష్యత్తు పట్ల నమ్మకంతోపాటు సరైన నిర్ణయాలు తీసుకోగలిగేలా అవకాశం కల్పించబడుతుంది.

అంతేకాక ప్రతి ఒక్కరితోను వ్యక్తిగతంగా మాట్లాడటంతో పాటు వారికి కుటుంబపరమైన, ఆరోగ్యపరమైన సహాయం అందించబడుతుంది. వారి పిల్లల సంరక్షణ, చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే వారి చదువుకు అంతరాయం కలగకుండా వారిని సంబంధిత వసతిగృహాలలో, రైయిబో హోంల వంటి సంస్థలలో చేర్పించడంతో పాటు పిల్లలను ములాఖాత్‌కు జైలుకు తీసుకువచ్చి తల్లులతో సమయం గడిపేలా చేయడం వంటి కార్యక్రమాలను సిబ్బంది చాలా నిబద్ధతతో చేపడతారు. అంతేకాక జైలులో ఉన్న మహిళలతో వారి అనుభవాలను, వారి సృజనాత్మకతను వెలికితీసేలా ప్రతినెలా ఒక న్యూస్‌లెటర్‌ (Photo Newsletter) తయారుచేస్తారు. జైలులో ఉన్న రోజులలో వారి వారి అభిరుచికి తగినట్లు నైపుణ్యాలు పెంచుకునేలా భూమిక సిబ్బంది వారిని ప్రోత్సహిస్తారు. దీనిద్వారా వారు జైలునుంచి బయటికి వెళ్ళాక గౌరవప్రదమైన జీవితం గడపటానికి ఉపయోగపడుతుంది. ఇందుకుగాను NIRMAN అనే సంస్థ సాయం అందిస్తోంది. వీరితోపాటు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించేందుకు ఆవాహన్‌ అనే సంస్థ సాయపడుతోంది.

మహిళా పోలీస్‌స్టేషన్‌ – సరూర్‌నగర్‌

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్‌.బి.నగర్‌ జోన్‌లో ఉన్న పోలీస్‌ స్టేషన్లలో నమోదైన గృహ హింస కేసులు ఈ స్టేషన్‌కు వస్తాయి. అంతేకాక ఇతర ప్రాంతాలలో నివాసముండే బాధిత స్త్రీల తల్లిదండ్రుల నివాసం ఈ పరిధిలో ఉంటే వారు కూడా ఈ పోలీస్‌ స్టేషన్‌కు వస్తారు.

ఈ మహిళా పోలీస్‌స్టేషన్‌ డిసెంబర్‌ 2016లో భగత్‌నగర్‌, సరూర్‌నగర్‌లో ప్రారంభించ బడింది. ఈ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభించిన నాటి నుంచి భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ ద్వారా ఒక కౌన్సిలర్‌ తన సేవలనందిస్తున్నారు. ఈ స్టేషన్‌ 24 గంటలూ స్త్రీల సహాయం కోసం నిర్వహించ బడుతోంది. ఈ స్టేషన్‌కు ప్రతిరోజూ సమస్యలలో ఉన్న స్త్రీలు సుమారు పది మంది వరకు వస్తుంటారు. ఈ స్టేషన్‌లో ఒక ఇన్‌స్పెక్టర్‌, ముగ్గురు ఎస్‌.ఐ.లు, నలుగురు ఎ.ఎస్‌.ఐ.లు, ఆరుగురు కానిస్టేబుల్స్‌, పదిమంది NCW, పదిమంది హోంగార్డులు ఉన్నారు. కౌన్సిలర్‌ జీతాన్ని రాచకొండ కమిషనరేట్‌ చెల్లించడం ద్వారా స్త్రీల సమస్యల పట్ల పోలీస్‌ వ్యవస్థ సానుకూలంగా వ్యవహరించడం విశేషం. వివిధ రకాల కుటుంబ సమస్యలతో ఇక్కడకు వచ్చే స్త్రీలకు తగిన సలహా, సహాయం అందించడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం కలిగేలా వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. వచ్చేవారి సమస్యలను బట్టి వారికి డివిసెల్‌, సఖి సెంటర్‌, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ వివరాలతో పాటు, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైనవారికి ఆ అలవాటును మార్చుకునేందుకు సాయం చేసే డీ అడిక్షన్‌ సెంటర్లు, మానసికంగా బాధపడే వారికి మానసిక చికిత్సా కేంద్రాల అడ్రస్‌లు ఇచ్చి పంపుతారు.

సమస్యతో వచ్చిన మహిళ ఫిర్యాదునిచ్చినపుడు అందులో సూచించిన పేర్ల ఆధారంగా వారిని కౌన్సిలింగ్‌కు రమ్మని ఫోన్‌ ద్వారా తెలియపరుస్తారు. ఒకవేళ వారు రావడానికి ఇష్టపడకపోయినా, సరైన విధంగా స్పందించకపోయినా వారే స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారిని కౌన్సిలింగ్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు. అవసరాన్ని బట్టి, కేసును బట్టి మూడుసార్లు కౌన్సిలింగ్‌ నిర్వహించబడుతుంది. భార్యాభర్తలకు, వారి కుటుంబ సభ్యులకు విడివిడిగాను, కలిపి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. అయినా సయోధ్య కుదరకపోతే వారి కోరిక మేరకు సంబంధిత కుటుంబసభ్యులపై 498ఐ కేసు రిజిస్టర్‌ చేస్తారు.

భూమిక తరపున కౌన్సిలర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఈ స్టేషన్‌కు వచ్చే బాధిత స్త్రీలకు కౌన్సిలింగ్‌ నిర్వహించడంతో పాటు, సంబంధిత (మహిళా) చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. అంతేకాక ఆయా స్త్రీల పరిస్థితిని, అవసరాన్ని బట్టి తాత్కాలిక, శాశ్వత ఆశ్రయం కల్పించటం, వారు స్వయంశక్తితో జీవనోపాధి పొందేలా ఏర్పాట్లు చేయటం, వారి పిల్లలను హాస్టల్‌లో చేర్పించటం ద్వారా వారి చదువుకు ఆటంకం కలగకుండా చూడటం, వైద్య సదుపాయం అవసరమైతే సంబంధిత ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళటం, వారి సమస్య ఈ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి రానట్లయితే సంబంధిత స్టేషన్లలో కేసు నమోదు చేయటం, ఎప్పటికప్పుడు కేస్‌ను ఫాలోఅప్‌ చేయడంటోపాటు బాధిత స్త్రీలకు అన్నిరకాలుగా అండగా నిలబడడం జరుగుతోంది.

సపోర్ట్‌ సెంటర్‌ – గచ్చిబౌలి మహిళా పోలీస్‌స్టేషన్‌

హైదరాబాద్‌ నగరంలో సైబర్‌ సిటీగా పేరొందిన గచ్చిబౌలి ప్రాంతంలో మహిళలపై హింస రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో గచ్చిబౌలి ప్రాంత పోలీస్‌స్టేషన్‌లో మహిళలకు బాసటగా నిలిచేందుకుగాను మహిళా సపోర్ట్‌ సెంటర్‌ను ప్రారంభించాలనే

ఉద్దేశ్యంతో భూమిక ద్వారా మహిళా సపోర్ట్‌ సెంటర్‌ను నిర్వహించాలని పోలీసులు కోరారు. అందులో భాగంగా 2015 డిసెంబరు 5న భూమిక ఆధ్వర్యంలో సెంటర్‌ మొదలుపెట్టడం జరిగింది.

ఈ సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు ధైర్యం కల్పించడంతో పాటు సమస్యను అధిగమించడానికి అవసరమైన కౌన్సిలింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అంతేకాక చట్టాల గురించి, సహకార వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ సమస్యను అధిగమించగలిగే మనఃస్థైర్యాన్ని అందిస్తున్నారు. ఈ సెంటర్‌లో ఇద్దరు సుశిక్షితులైన కౌన్సిలర్లు తమ సేవలనందిస్తున్నారు.

ఈ సెంటర్‌కు స్థానిక పోలీస్‌స్టేషన్లనుండి, భూమిక హెల్ప్‌లైన్‌ నుండి, ఇతర సపోర్ట్‌ సెంటర్లనుండి కేసులు రిఫర్‌ చేయబడతాయి. అంతేకాక సమస్యలో ఉన్న మహిళలను స్వయంగా సంప్రదించడం జరుగుతుంది. ఈ కేసులలో ప్రధానంగా భర్తల నుండి, కుటుంబసభ్యుల నుండి జరుగుతున్న హింస, తాగుడు వంటి వ్యసనాలకు బానిసలైన వ్యక్తుల నుండి జరుగుతున్న హింస, సహజీవనం, ప్రేమ సంబంధాలు, వరకట్న సంబంధిత సమస్యలు, పని ప్రదేశంలో జరిగే లైంగిక హింస వంటి సమస్యలు, వివాహేతర సంబంధాలకు సంబంధించినవి

ఉంటాయి.

సమస్యతో వచ్చిన మహిళకు ముందుగా ధైర్యం చెప్పి సమస్యను అధిగమించటానికి కావలసిన నమ్మకాన్ని కలిగించటం కౌన్సిలింగ్‌ ప్రక్రియలో మొదటి భాగం. తన సమస్యను సామరస్యంగా వినటం ద్వారా మహిళకు కొంత ఊరట కలుగుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి, కేసుయొక్క పరిస్థితిని బట్టి కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని కోరి వారికి ముందు విడివిడిగాను, తర్వాత కలిపి కౌన్సిలింగ్‌ చేయటం ద్వారా సమస్యను అర్థం చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. దాంతోపాటు చట్టాలపైన అవగాహన, సంబంధిత కేసుకు సంబంధించిన చట్టంపైన అవగాహన అందిస్తారు. అంతా జరిగాక సమస్య ఉన్న మహిళ తన సమస్యపై తాను నిర్ణయించుకున్న విషయాన్ని బట్టి ఆమెకు అవసరమైన న్యాయ సహాయం అందిస్తారు.

భూమక హెల్ప్‌లైన్‌

సమస్యల్లో ఉన్న, హింసకు గురౌతున్న మహిళలకు సలహా, సమాచారం కోసం

సమస్యల్లో ఉన్న మహిళలకు సాంత్వననిచ్చి, వారికి భద్రతాభావాన్ని పెంచే హెల్ప్‌లైన్‌ను 2006 సంవత్సరంలో డిసిపి సౌమ్యామిశ్రా చేతులమీదుగా ప్రారంభమైన భూమిక హెల్ప్‌లైన్‌ 1800 425 2908 టోల్‌ఫ్రీ నంబర్‌తో మొదలైంది. ప్రారంభంలో 8 గంటలపాటు టోల్‌ఫ్రీ నంబర్‌ నిర్వహించబడేది. సమస్యల్లోని మహిళల అవసరార్థం ఈ సేవలు 24 గంటలపాటు విస్తరించాయి. 3 షిఫ్టులలో సుశిక్షుతులైన కౌన్సిలర్లచే ఇది నిర్వహించబడుతోంది. ఈ హెల్ప్‌లైన్‌ సేవలను రెండు తెలుగు రాష్ట్రాల బాధిత స్త్రీలతోపాటు దేశం నలుమూలల నుంచి వినియోగించుకుంటున్నారు. ఈ ఫోన్‌ టోల్‌ఫ్రీ కాబట్టి ఫోన్‌ చేసినవారికి బిల్లు పడదు. కొంతమంది ఫోన్‌కాల్‌తో పాటు ఈ మెయిల్‌ ద్వారా కూడా తమ సమస్యలను తెలియపరుస్తారు. ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా –

– గోప్యత పాటించడం హెల్ప్‌లైన్‌ ముఖ్య ఉద్దేశ్యం.

– బాధిత స్త్రీల సమ్యలను సానుభూతితో వినడం, అవసరమైన సమాచారంతో సమస్యను పరిష్కరించుకునే మార్గాలను తెలియచేయటం.

– సమస్యల్లో ఉన్న స్త్రీలకు ధైర్యాన్ని అందించడం, తద్వారా సరైన నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహించడం.

– స్త్రీల కోసం పనిచేస్తున్న సంస్థలతో అనుసంధానం చేయటం.!

– సమస్యల్లో ఉండి డిప్రెషన్‌లో ఉన్న స్త్రీలకు మానసిక వైద్య నిపుణుల సహాయాన్ని పొందేలా ప్రోత్సహించటం, ఎక్కడికి వెళ్ళాలో సూచించటం.

– న్యాయపరమైన సలహాలు/సూచనల కోసం కోర్టు పద్ధతులను, కోర్టు పని విధానాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రతి శనివారం హెల్ప్‌లైన్‌లో న్యాయవాదులచే సలహాలు ఇవ్వబడతాయి.

– స్త్రీ సహాయార్ధం ఉన్న సహాయ సదుపాయాల వివరాలను ఎప్పటకప్పుడు తెలుసుకుంటూ, బాధిత స్త్రీలకు తెలియపరచటం, సహాయాన్ని అందచేయడం.

– స్త్రీలు మరియు ఇతర సామాజిక అంశాలపై, హెల్ప్‌లైన్‌ ద్వారా అందించే సేవలు, టోల్‌ఫ్రీ నంబరు వివరాలు, స్త్రీల చట్టాలు వంటి అంశాలపై కళాశాలల్లోనూ, పాఠశాలల్లోనూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించటం.

– 2006 సం||లో హెల్ప్‌లైన్‌ సేవలు ప్రారంభమైనప్పటినుండి ఇప్పటివరకు 34,336 మంది బాధిత స్త్రీలకు కౌన్సిలింగ్‌ అందించటం ద్వారా, సమస్యను అన్ని వైపుల నుండి ఆలోచించగలిగే విధంగా అవగాహన కల్పించటం ద్వారా సహాయం అందించగలిగారు.

– హెల్ప్‌లైన్‌ నిర్వహణ ద్వారా సమస్యల్లో ఉన్న స్త్రీలకు అందుతున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం 9వ తరగతి ”సాంఘిక శాస్త్రం” పాఠ్యపుస్తకంలో హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నంబరును ”స్త్రీలు మరియు పిల్లల చట్టాలు” అనే పాఠంలో ప్రింట్‌ చేశారు.

భూమిక ద్వారా నిర్వహించబడే హెల్ప్‌లైన్‌ 24 గంటలపాటు నిరంతరాయంగా సేవలు అందిస్తోంది.

విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ – సిఐడి ఆఫీసు

సిఐడి ఆఫీసులో ప్రత్యేకంగా మహిళల రక్షణ కోసం విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సెల్‌లో మహిళలు, పిల్లలకు సంబంధించిన అంశాలపై కౌన్సిలింగ్‌ నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థల సహాయంతో సపోర్ట్‌ సెంటర్‌ నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా 2013 సం|| నుండి భూమిక సహకారంతో సపోర్టు సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్‌ ద్వారా సమస్యతో వచ్చిన మహిళలు, బాలికలు, పిల్లలకు సంబంధించిన అంశాలపై సలహాలు, సూచనలు అందించడంతో పాటు, సమస్యకు పరిష్కారం సూచించటంతో పాటు న్యాయ సహాయం అందిస్తారు.

సపోర్ట్‌ సెంటర్‌కు సమస్యతో వచ్చిన మహిళలను మొదటిగా వారు వెలిబుచ్చే, అందించే సమాచారం, వారు పడుతున్న వేదనను అర్థం చేసుకోవడానికి గాను వారితో స్పష్టంగా మాట్లాడి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత సమస్యలో ఉన్న మహిళలు ఉన్న పరిస్థితి గురించి ఆలోచించడం, తగిన నిర్ణయం తీసుకోవడానికిగాను దశలవారీగా కనీసం రెండు, మూడు సెషన్లతో కౌన్సిలింగ్‌ నిర్వహించబడుతుంది. సమస్యలో ఉన్న మహిళలు, సమస్యకు కారణమైన వ్యక్తులు/కుటుంబ సభ్యులతో కలిపి, విడివిడిగా చర్చించడంతో పాటు, వారికి కొన్ని యాక్టివిటీలను ఇచ్చి వారితో చేయించడం వలన వారు సమస్యను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి పరిష్కారాలను వెతుక్కోవడంలో వారికి కొంత ఆలోచన వచ్చేలా చేస్తారు. సమస్య పరిష్కారంగా కుటుంబం నుండి విడిగా ఉండాలని మహిళ నిర్ణయించుకుంటే వారికి ఉన్న షెల్టర్‌ హోంలకు సంబంధించిన వివరాలను ఇస్తారు. సంబంధిత పోలీస్‌స్టేషన్‌ వివరాలు, హెల్ప్‌లైన్‌ ద్వారా సేవలందించే న్యాయవాది ద్వారా న్యాయపరమైన సలహాలు అందిస్తారు. భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా ప్రతి శనివారం న్యాయవాదిద్వారా న్యాయ సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ సెంటర్‌లో ఇద్దరు కౌన్సిలర్లు

ఉంటారు. ఈ సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు, పిల్లలకు సమస్య యొక్క సమాచారం అందించడంతో పాటు ఇతర అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా కళాశాలల్లో, హైస్కల్‌ పిల్లలకు జెండర్‌ అంశాలపై సెన్సిటైజేషన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అంతేకాక స్త్రీల సమస్యలపై పనిచేసే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో సమన్వయంతో పనిచేస్తారు.

సమస్యతో సెంటర్‌కి వచ్చిన స్త్రీల యొక్క కుటుంబ పరిస్థితి, సమస్య పూర్వాపరాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకుగాను గృహ సందర్శనలు చేస్తారు. అంతేకాక మా ద్వారా వేర్వేరు షెల్టర్‌హోమ్‌లలో వసతి పొందుతున్న వారి పరిస్థితిని సమీక్షించుకునేందుకు ఆ షెల్టర్‌ హోమ్‌ల సందర్శనకు వెళ్తారు. అవసరమైన వారికి ఉపాధి అవకాశాలను తెలియపరుస్తారు. వీటి వలన సమస్యలో సెంటర్‌కు వచ్చిన మహిళలకు పూర్తిస్థాయి సేవలను అందించగలుగుతున్నారు.

భూమిక సపోర్ట్‌ సెంటర్‌ , విజయవాడ

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో స్పెషల్‌ సెల్‌ డిసెంబర్‌ 13, 2017 నుంచి పనిచేస్తోంది. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గారు టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో (ప్రస్తుతం) స్థలం కేటాయించడంతో ఈ స్పెషల్‌ సెల్‌ విజయవాడలో పనిచేయడం ప్రారంభించింది.

ఈ స్టేషన్‌ పరిధిలో విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వలస వచ్చి చిన్న చిన్న పనులు, కూలి పనులు చేసుకుంటూ బ్రతికేవారే ఎక్కువగా ఉంటారు. కొత్తపేట పరిధిలో ఉండే కుటుంబాలలోని మగవారి కంటే మహిళలే ఎక్కువ బాధ్యతతో వ్యవహరిస్తుంటారు. మగవాళ్ళు కూడా పనులే చేస్తారు కానీ ప్రతిరోజూ తాగి ఇంటికి వచ్చి భార్యను చాలా హింసిస్తారు. భార్యను అనుమానించటం, పేకాటలు, భార్య పనిచేసే ప్రాంతానికి వెళ్ళి గొడవ చేయడం, తన తల్లి, సోదరిల మాటలు విని భార్యను హింసించడం వంటి సమస్యలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటున్నాయి.

ఈ ప్రాంతంలోని మగవారు పగలంతా పనిచేసి వచ్చిన కూలీ డబ్బులతో మద్యం తాగి ఇంటికొచ్చి భార్యను అనుమానించి కొడతారు. అలాంటి పరిస్థితిలో ఇంటికి ఆదాయం రాకపోగా, తనపై జరిగే మానసిక, శారీరక హింసను భరించలేక ఆ మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కేసు పెడతారు. ఆ రాత్రి సమయంలోనే పోలీసులు అలాంటి వ్యక్తిని అరెస్ట్‌ చేస్తారు. మర్నాడు ఉదయం అతని భార్యను రప్పించి ఆమె ద్వారా తమ సమస్యను విని అతన్ని అవసరాన్ని బట్టి కౌన్సిలింగ్‌కు పంపుతారు. కౌన్సిలింగ్‌కు వస్తూనే వాళ్ళు ‘అమ్మా! ఇకనుండి కొట్టను, ఒకవేళ తాగినా కొంచెమే తాగుతాను’ అంటారు. వచ్చిన వారి పరిస్థితులు తెలుసుకుని భార్యను కొట్టడం వల్ల చట్టపరమైన శిక్షలను వివరిస్తూ, తాగడం వల్ల వచ్చే అనారోగ్య పరిస్థితులు, శరీరం ఎలా క్షీణిస్తుంది అనే వివరాలను కౌన్సిలింగ్‌ ద్వారా ఆలోచింప చేయడం జరుగుతుంది. ఈ విధంగా కౌన్సిలింగ్‌కు వారంలో ఒకసారి, అవసరాన్ని బట్టి కనీసం రెండు, మూడు సార్లుగా, కొన్ని కేసులలో ఎక్కువసార్లు వ్యక్తిగత మరియు ఒక్కొక్కరికి, ఇద్దరికి లేదా ఆ కేసు అవసరాన్ని బట్టి గ్రూప్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించబడుతుంది. ఈ విధంగా చేస్తున్న కౌన్సిలింగ్‌ను బట్టి కొన్ని కేసులలో భార్యాభర్తలు కలిసే ఉండడానికి నిర్ణయించుకుని వెళ్తుంటారు. కొన్ని కేసులలో వారి పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి రక్షణాధికారికి, న్యాయ సేవా సదన్‌కి వెళ్ళమని సలహా ఇవ్వడం జరుగుతుంది.

కౌన్సిలింగ్‌ తర్వాత కొన్ని కేసుల పరిస్థితిని బట్టి వారికి ఫోన్‌ చేసి పరామర్శించడం, ఇంకా హింస ఉన్నట్లయితే మీరు మళ్ళీ రావచ్చని తెలియచేస్తాం. వాళ్ళను పలకరించడానికి ఫోన్‌ చేస్తే సర్వైవర్స్‌ చాలా సంతోషిస్తూ ”మా కోసం మీరిలా ఫోన్‌ కూడా చేస్తారా? చాలా సంతోషంగా ఉందమ్మా” అని చెప్తుంటారు. మరి కొన్ని కేసులను బట్టి వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం చేస్తాం. ఈ విధంగా ఇప్పటివరకు భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ద్వారా నిర్వహించబడుతున్న సపోర్ట్‌ సెంటర్‌లో 69 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఇప్పటికి 31 కేసులకు కౌన్సిలింగ్‌ నిర్వహించాము. అడ్వకేట్‌ బి.వి. శేషవేణి విజయవాడ, రాజమండ్రి సెంటర్‌లలో బాధితులకు వారానికొకసారి ప్రత్యక్షంగా న్యాయ సలహాలు ఇవ్వడం, అవసరమైతే కేసులు ఫైల్‌ చేయడం చేసారు. పోలీసుల సహకారంతో ఈ సెంటర్‌ బాధితుల కోసం పనిచేస్తుంది.

భూమిక సపోర్ట్‌ సెంటర్‌ , రాజమహేంద్రవరం

ఆంధ్రప్రదేశ్‌ ధాన్యాగారంగా పేరుపొందిన రాజమహేంద్రవరంలో మహిళల పట్ల హింస తీవ్రంగా ఉంది. కనుక ఈ ప్రాంతంలో భూమిక సపోర్ట్‌ సెంటర్‌ నిర్వహించాలనే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్‌.పి. గారిని కలిసి భూమిక ద్వారా అందిస్తున్న సేవలను వివరించాము. ఇందులో భాగంగా సమస్యలలో ఉన్న స్త్రీలకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు సమస్యను అర్థమయ్యేల్లా వివరించి సలహాలు, సూచలనతో పాటు చట్టాలపై అవగాహన అందించబడుతుందనే విషయాలను ఎస్‌.పి. గారికి వ్రాతపూర్వకంగా తెలియపరుస్తూ లెటర్‌ ఇచ్చాము. ఎస్‌పి గారు వెంటనే స్పందిస్తూ మహిళా పోలీస్‌స్టేషన్‌ డి.ఎస్‌.పి.ని పిలిచి భూమిక గురించి చెప్తూ భూమిక సెల్‌ ఏర్పాటుకు అవసరమైన అన్ని విధాలా సహకారం అందించమని చెప్పారు. డి.ఎస్‌.పి. గారు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో స్పెషల్‌ సెల్‌ కోసం స్థలం లేదు కనుక ప్రస్తుతం స్టేషన్‌కు దగ్గరలో ఉన్న రెడ్‌క్రాస్‌ బిల్డింగ్‌లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌లో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారని, అందువల్ల పగలు భూమిక సపోర్ట్‌ సెంటర్‌ నిర్వహణ చేసుకోవచ్చని అంగీకరించడం జరిగింది. దాంతో 12, డిసెంబర్‌ 2017న భూమిక సపోర్ట్‌ సెంటర్‌ను ప్రారంభించి సేవలందిస్తున్నాము. ఇక్కడ ఇప్పటివరకు 142 మందికి కౌన్సిలింగ్‌ నిర్వహించాము. కౌన్సిలింగ్‌లో భాగంగా సమస్యలతో వచ్చిన స్త్రీలకు ముందు వ్యక్తిగతంగా సమస్యను అర్థం చేసుకుని వారికి సమస్యపట్ల అవగాహన కల్పించడం, సలహాలు, సూచనలు అందించడం జరుగుతుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కుటుంబ సభ్యులతో విడివిడిగాను, సమిష్టిగాను చర్చించడం జరుగుతుంది. సెంటర్‌కు వస్తున్న సమస్యల్లో ఎక్కువగా భార్యాభర్తల గొడవలు, సహజీవనం, వివాహేతర సంబంధం, పిల్లలు, కుటుంబాల పట్ల బాధ్యత లేకపోవడం, మద్యపానం, తాగివచ్చి కొట్టడం, కట్నం సమస్యలు వంటివి ముఖ్యమైనవి. స్త్రీలకు సమస్యలపట్ల న్యాయపరమైన సలహాలు, సూచనలు, సమాచారం అందించే విషయాలకు సంబంధించి సెంటర్‌లో లీగల్‌ అడ్వయిజర్‌ను నియమించాము. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం స్పెషల్‌ సెల్‌కు లాయర్‌ వచ్చి కేసులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చి న్యాయపరమైన హక్కులను పొందేలా ఎటువంటి ప్రయత్నాలు చేయాలో వివరిస్తారు.

సమస్యల్లో సెంటర్‌కు వచ్చే స్త్రీలకు అవసరాన్ని బట్టి షెల్టర్‌ సపోర్టును అందించేందుకు గాను రాజమహేంద్రవరంలో ఉన్న సపోర్ట్‌ వ్యవస్థల గురించి సమాచారం సేకరించాము. సెంటర్‌కు వెళ్ళి చూసి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నాము. సెంటర్‌ నిర్వహణలో స్త్రీలకు అన్ని విధాలా సహకారాన్ని అందించేలా ఇతర ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నాము.

భూమిక సపోర్ట్‌ సెంటర్‌ , కరీంనగర్‌

తెలంగాణలో అత్యధికంగా మహిళలపై నేరాలు నమోదవుతున్న జిల్లాలలో కరీంనగర్‌ మొదటిది. కరీంనగర్‌ మహిళలకు ఆసరాగా ఉండేందుకుగాను, హింసకు గురవుతున్న మహిళలకు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఒక వేదికగాను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంచుకునేందుకు ఒక సెంటర్‌ నిర్వహించాలనే ఉద్దేశ్యంతో మహిళా పోలీస్‌స్టేషన్‌లో భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ద్వారా మహిళా సపోర్ట్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాము. ఈ సెంటర్‌ 2015 వ సం|| నుండి తన సేవలను అందిస్తోంది. ఇందుకు గాను ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. ఈ సెంటర్‌ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటలవరకు నిర్వహించబడుతోంది.

సమస్యల్లో ఉన్న, హింసకు గురవుతున్న మహిళలు ముందుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి కేసు వివరించగా వారు కౌన్సిలింగ్‌ కోసం భూమిక సపోర్ట్‌ సెంటర్‌కు రిఫర్‌ చేస్తారు. భూమిక సపోర్టు సెంటర్‌కు కేసు వచ్చాక కౌన్సిలర్లు కేసును నమోదు చేసుకుని ముందుగా వివరాలు తెలుసుకుంటారు. సమస్యతో వచ్చిన మహిళలకు వారి సమస్యకు సంబంధించిన వివరాలతో పాటు అందుబాటులో ఉన్న సహకార వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని తెలియచేస్తారు. సమస్యను అధిగమించడానికి ఉన్న న్యాయ, చట్టపరమైన సలహాలు, సూచనలు అందిస్తూ హింసకు లోను కాకుండా ఉండేందుకు అవసరమైన ధైర్యాన్ని అందించడానికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. ఈ సెంటర్‌ 18 సం|| నుండి 45 సం|| వయసు కలిగిన మహిళలు మద్యపానం, వివాహేతర సంబంధాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, భర్త, అత్తమామల వల్ల హింసకు గురికావడం, పిల్లలు లేరని భర్త మరో పెళ్ళి చేసుకోవడం, అధిక కట్నం కోసం వేధింపులు వంటి సమస్యలతో సెంటర్‌కు వస్తారు. చదువుతో, ఆర్థిక స్థితితో, చేసే పనితో సంబంధం లేకుండా అన్ని వర్గాల మహిళలు సెంటర్‌కు వస్తారు. ఉన్నత విద్యావంతులతో పాటు నిరక్షరాస్యులు, ఉద్యోగస్తులైన మహిళలు, రోజువారీ పనిచేసుకునే మహిళలు, ఇంటి బాధ్యతలు నిర్వహించే మహిళల వరకు హింసకు గురైన వారందరూ సహాయం కోసం వస్తారు.

అందరికీ వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులతో కలిపి, విడివిడిగా ఒకటి నుండి మూడు సెషన్లు కౌన్సిలింగ్‌ నిర్వహించడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్‌లో హింసను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడం ద్వారా పరిస్థితిని మార్చుకునేందుకు ఉన్న అవకాశాలను తెలియచేస్తారు. హింస యొక్క రూపం, స్థాయిని బట్టి, అందుకు

ఉన్న చట్టాలను, సహకార వ్యవస్థలకు సంబంధించిన సమాచారం, సఖి సెంటర్‌ గురించి 498-ఎ, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, షెల్టర్‌ హోమ్స్‌ వంటివి తెలియపర్చడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి, సర్వైవర్‌ యొక్క కోరిక మేరకు తనవైపు నుండి విన్న సమస్యకు కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్‌ ఇవ్వాలని అడిగితే ఆమె కుటుంబ సభ్యులను కూడా పిలిచి కౌన్సిలింగ్‌ నిర్వహించడం జరుగుతుంది. ఈ సెషన్స్‌ ద్వారా సమస్య తీరిపోతే ఒకటి, రెండుసార్లు మళ్ళీ ఫోన్లు చేసి పరిస్థితిని తెలుసుకుంటారు. సంతోషంగా ఉన్నారనే సమాచారంతో కేసు క్లోజ్‌ చేస్తారు. కానీ, సమస్య తీవ్రంగా ఉంటే లీగల్‌గా కేసును ముందుకు తీసుకువెళ్ళేందుకు సహాయం అందిస్తారు. ఆ విధంగా కోర్టు ద్వారా విడాకులు, సఖి సెంటర్‌ ద్వారా భరణం పొందడం, 498-ఎ చట్టం ప్రకారం పోలీస్‌ స్టేషన్లలో కేసు నమోదు చేయడం వంటి విషయాలలో న్యాయ సహాయాన్ని అందిస్తారు. ఇప్పటి వరకు 788 కేసులు ఈ సెంటర్‌కి వచ్చాయి.

‘షీ టీమ్స్‌’ తో కలిసి చేస్తున్న కార్యక్రమం

తెలంగాణా రాష్ట్రంలో బాలికలు, యువతులు, మహిళల రక్షణ కోసం దేశంలోనే ప్రప్రథమంగా నిర్వహించబడుతున్న కార్యక్రమం షీ-టీమ్స్‌. 350 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి (ఎక్కడైతే మహిళలు ఎక్కువగా సంచరిస్తారో అలాంటి ప్రదేశాలు) బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురిచేసే వ్యక్తులను పట్టుకునేందుకు వీలుగా 60 టీమ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే వేధింపులకు గురయ్యే మహిళలు వెంటనే సహాయం కోరుతూ 100 నంబరుకు ఫోన్‌ చేసేలా, వాట్సప్‌ మెసేజెస్‌ పంపించేందుకు 9490617444, ఫేస్‌బుక్‌ ద్వారా, రష్ట్రవ్‌వaఎ.షవపవతీaపaసఏస్త్రఎaఱశ్రీ.షశీఎ కు మెయిల్‌ ద్వారా సమాచారం అందించవచ్చు.

మహిళలపై వేధింపులు జరిగే అవకాశమున్న ప్రదేశాల్లో స్పై కెమెరాలను ఏర్పాటుచేసి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు కనెక్ట్‌ చేశారు. వేధింపులకు గురిచేస్తూ పట్టుబడిన నిందితులపై సెక్షన్‌ 70 (6)/(సి) ఆఫ్‌ సైబరాబాద్‌ సిటీ పోలీస్‌ యాక్ట్‌ లేదా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయబడుతుంది. నిందితులు తప్పనిసరిగా కౌన్సిలింగ్‌ సెషన్‌కి తల్లి/తండ్రి లేదా భార్యతో కలిసి హాజరు కావాలి. షీ టీమ్స్‌ వారు నిందితుల యొక్క ఫోటో, ప్రింగర్‌ ప్రింట్‌, ఇంటారాగేషన్‌ రిపోర్ట్‌, ధృవీకరణ పత్రాలు, ఫోన్‌ నంబర్లు సేకరిస్తారు. ప్రతి శనివారం ఈ నిందితులకు సైబరాబాద్‌, రాచకొండ కమీషనరేట్‌లలో వారి తల్లి/తండ్రి లేదా భార్య సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. ఈ నిందితులను కోర్టులో ప్రొడ్యూస్‌ చేయటం, ఫైన్‌ వేయటం లేదా జైలు శిక్ష విధించబడుతుంది.

ఈ కార్యక్రమంలో భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ద్వారా డిసెంబర్‌, 2015 నుండి షీ టీమ్స్‌ ద్వారా పట్టుకోబడిన నిందితులకు భూమిక కౌన్సిలర్ల ద్వారా కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. వీరు ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ కేసులకు కౌన్సిలింగ్‌ చేస్తారు.

ఈ కౌన్సిలింగ్‌కు సంబంధించిన సమాచారం ముందుగానే ఆయా కమీషనరేట్‌ల టీం నుండి భూమిక కౌన్సిలర్లకు అందుతుంది. ఒక్కో సెషన్‌లో సుమారు 45 మంది నిందితులు ఉంటారు. ఈ సెషన్స్‌కు హాజరయ్యే నిందితులు తప్పనిసరిగా తల్లిదండ్రులలో ఎవరన్నా ఒకరు లేదా భార్యతో కలిసి రావాలి. తల్లిదండ్రులు, భార్య సమక్షంలో నిందితులకు కౌన్సిలింగ్‌ నిర్వహించటం ద్వారా అదే తప్పు మరలా చేసే అవకాశాలు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో వారిని తప్పనిసరిగా హాజరు కావాలని కోరతారు.

ముందుగా నిందితులతో ముఖాముఖి సంభాషణ జరుపుతారు. తర్వాత తల్లి/తండ్రి లేదా భార్య సమక్షంలో సమస్యను, నిందితుడు చేసిన చర్యలను, వారిపై మోపబడిన ఆరోపణలను తెలియచేస్తారు. వారి కుటుంబ సభ్యులకు కూడా వారి బాధ్యతను, పిల్లలు, వారి ప్రవర్తనలపై ఎలాంటి అజమాయిషీ ఉండాలనే విషయాలపై తెలియచేస్తారు. ఈ చర్యలవల్ల చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశాలున్నాయో, నిర్భయ చట్టం, పోక్సో చట్టం గురించిన సమగ్ర సమాచారాన్ని ఇస్తారు. మొదటిసారి నిందితుడిగా పట్టుబడితే చట్టప్రకారం శిక్షలు, సమాజంలో గౌరవం, చదువు యొక్క ప్రాముఖ్యత వంటి అంశాలపై సమాచారం ఇస్తారు. శిక్షలు పడితే దాని ప్రభావం జీవితంపై ఏ విధంగా పడుతుందో, ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియచేస్తారు. ఈ విషయం అంత సులువుగా తీసివేయవద్దని, సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ఇకముందు మరలా అలా జరగకుండా చూడాలని, వారికి ఆ విషయం అర్థమయ్యేలా చెప్పాలంటూ నిందితుని తల్లి/తండ్రి లేదా భార్యకి చెప్తారు. ఒకవేళ నిందితులు వారి తల్లి/తండ్రి లేదా భార్యని తీసుకురాకపోతే నిందితుడిని మరలా కౌన్సిలింగ్‌కి రావాలని, కుటుంబసభ్యులను తప్పకుండా తీసుకురావాలని సూచిస్తారు. ఇక్కడికి కౌన్సిలింగ్‌కి వచ్చే నిందితులలో 13 నుండి 65 కు పైబడిన వయస్సు కలిగిన పురుషులు… ముఖ్యంగా స్టూడెంట్స్‌, ప్రైవేటు ఉద్యోగులు, అసంఘటిత రంగంలోని కార్మికులు, ఐటి ఉద్యోగస్థులు ఉంటారు. ముఖ్యంగా బస్‌స్టాప్‌లలో, స్కూళ్ళు, కాలేజీల దగ్గర వేధింపులకు పాల్పడేవారు, సోషల్‌ మీడియా ద్వారా వేధింపులకు గురిచేసేవారు నిందితులుగా కౌన్సిలింగ్‌కు హాజరవుతారు.

వేధింపులకు గురైన మహిళలు, యువతులు వాట్సప్‌ నంబర్‌ ద్వారా రిపోర్టు చేస్తారు. అలాగే సంఘటన సమయంలో షీ టీమ్స్‌ ద్వారా పట్టుకోబడినవారు, స్పై కెమెరాల ద్వారా పట్టుబడిన వారు ఎక్కువగా ఉంటారు.

ఈ కౌన్సిలింగ్‌ సెషన్స్‌ నిర్వహించడంపై తల్లిదండ్రులు చాలా కృతజ్ఞతలు తెలియచేస్తారు. నిందితులు కూడా చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి మళ్ళీ అలాంటి తప్పు చేయమని, తమకొక అవకాశం ఇవ్వమని కోరతారు. ఈ ప్రయత్నం ద్వారా మహిళలు, యువతుల మీద వేధింపులు తగ్గాయని చెప్పవచ్చు.

సైబరాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలో ఇప్పటివరకు 999 మందికి కౌన్సిలింగ్‌ నిర్వహించటం జరిగింది. అలాగే రాచకొండ కమీషనరేట్‌ పరిధిలో 2016 డిసెంబర్‌ నుండి ఇప్పటివరకు 634 మందికి కౌన్సిలింగ్‌ నిర్వహించడం జరిగింది.

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా

భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు, దామరగిద్ద మండలాల్లోని 102 గ్రామాలలో జులై 2015 నుండి పనిచేస్తోంది. బాల్య వివాహాల నిర్మూలన, యుక్తవయసు బాలబాలికలను స్వశక్తివంతులను చేయటం, బాల్యవివాహాలపై పనిచేసే సంస్థలు/వ్యవస్థలను బలోపేతం చేయటానికి గాను కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మద్దూరు మండలంలోని 67 గ్రామాల్లో, దామరగిద్ద మండలంలోని 35 గ్రామాల్లో మొత్తంగా 102 గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోని స్కూలు పిల్లలతో, యుక్తవయసు బాలబాలికలతో, యూత్‌, స్వయం సహాయక సంఘం సభ్యులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సభ్యులతో, కుల పెద్దలతో బాల్యవివాహాల వలన కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలు, బాలబాలికల చదువు, వారి భవిష్యత్తు వంటి అంశాలతోపాటు, 2013-బాల్య వివాహ నిరోధక చట్టంపై అవగాహన కల్పించడం జరుగుతుంది. మండల స్థాయిలో విద్యాధికారులు, పోలీసులు, పురోహితులతో బాల్యవివాహాల నిర్మూలనలో వారి బాధ్యత గురించి చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా బాల్యవివాహాల నిర్మూలన, పిల్లల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం, జెండర్‌ స్పృహను పెంపొందించడం, బాలబాలికలు వారి అభిప్రాయాలు వ్యక్తపరచడానికి, వారు స్వశక్తివంతులయ్యేలా కృషి చేయడం జరుగుతోంది.దామరగిద్ద, మద్దూరు మండలాల్లో కలిపి 72 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. వీటి ముఖ్య ఉద్దేశ్యం గ్రామాల్లో జరుగుతున్న బాల్యవివాహాలను అంచనా వేసి విశ్లేషించడం, గ్రామస్థాయిలో బాల్యవివాహాలపై పనిచేస్తున్న సంస్థలు/వ్యవస్థలు పూర్తి బాధ్యత వహించే విధంగా చేయడానికి గాను గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో 72 గ్రామాల నుండి 7513 మంది సభ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల వల్ల గ్రామంలో 18 సం||లోపు ఆడపిల్లలకు, 21 సం||లోపు మగపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే చట్టపరమైన చర్చలు తీసుకోబడతాయని దండోరా వేయిస్తామని తెలియచేశాం. గ్రామంలో చిన్నపిల్లలకు పెళ్ళి చేయాలని సంబంధాలు మాట్లాడుకుంటే భూమిక హెల్ప్‌లైన్‌కు తెలియపరచాలని చెప్పాం. కళ్యాణలక్ష్మి పథకానికి చట్టపరమైన వివాహ వయస్సు వారే అర్హులని, చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తే ఆ పథకం వర్తించదని తెలియచేశాం.

మద్దూరు, దామరగిద్ద మండలాల్లోని గ్రామాల్లో జరుగుతున్న బాల్య వివాహాలపై అవగాహన కల్పించడానికి గాను మండలాధికారులు, భూమిక టీం కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీని ఫలితంగా రెండు మండలాల్లో కలిపి 9 గ్రామాలలో అవగాహన కార్యక్రమాల ద్వారా 31 మంది బాలికల పెళ్ళిళ్ళు ఆపడంతో వారు చదువును కొనసాగిస్తున్నారు.

గ్రామస్థాయి సామాజిక జెండర్‌ కమిటీ సమావేశాలు:-

గ్రామస్థాయిలో IKP ద్వారా ఏర్పాటు చేయబడిన సామాజిక జెండర్‌ కమిటీలను బలోపేతం చేయడానికి గాను, చట్టంపై అవగాహన కల్పించేందుకు గ్రామ, మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

గ్రామ పంచాయతీ పరిధిలో GP సమావేశాలు, గ్రామ సభలు ఏర్పాటు చేసి సర్పంచ్‌, వార్డు మెంబర్లు, ఎంపిటిసి., ఉపసర్పంచ్‌, పంచాయతీ సెక్రటరీ, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, ఎఎన్‌ఎం, వీఆర్‌ఓ, గ్రామ కానిస్టేబుల్స్‌, IKPVO లీడర్‌, కులపెద్దలు, యూత్‌ సభ్యులు, పూజారులు, సాక్షర భారత్‌ కో ఆర్డినేటర్‌, బుక్‌ కీపర్‌, స్కూల్‌ హెడ్‌మాస్టర్‌, స్కూల్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌, NREGS ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు అందరూ కలిసి మద్దూరులు 7 గ్రామాలలో, దామరగిద్దలో 6 గ్రామాలలో గ్రామ బాల్య వివాహ నిరోధక కమిటీలు ఏర్పాటు చేశారు. వీరు ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు.

2 మండలాల్లోని 62 గ్రామాలలో బాలదండు సభ్యులు, భూమిక టీం, మండలాధికారులు, ఎమ్మార్వో, ఎస్‌.ఐ, స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ కలిసి 238 బాల్యవివాహాలను వాయిదా వేయడం జరిగింది. యుక్త వయస్సు బాలబాలికలకు, బాలదండు సభ్యులకు మండల స్థాయిలో జెండర్‌ ట్రైనింగ్‌, పియర్‌ ఎడ్యుకేటర్స్‌ ట్రైనింగ్‌, జీవన నైపుణ్యాలపై శిక్షణనివ్వడం జరిగింది. అలాగే మద్దూరు, దామరగిద్ద మండలాల్లోని 23 గ్రామాలలో బాలదండులు ఏర్పాటు చేయడం జరిగింది.

పల్లెర్ల గ్రామంలో బాల్యవివాహాలను వాయిదా వేయడం, వాటి అనర్థాల గురించి ‘మల్లెమొగ్గ’ అనే నాటికను ప్రదర్శించడం ద్వారా అవగాహన కల్పించడం వల్ల 2016-17 సం||గాను బాలదండు బృందం TV9 నవీన అవార్డును, రూ.10000 చెక్కును అందుకున్నారు. బాలదండు పిల్లలు రెండు బృందాలుగా ఏర్పడి 40 గ్రామ పంచాయతీలలో మల్లెమొగ్గ నాటకాన్ని కళాజాత రూపంలో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రామ స్థాయిలో బాల్యవివాహాలపై అవగాహన ఏర్పడడంతో పాటు యుక్తవయస్సు బాలబాలికలకు బాలల హక్కులపైన, జెెండర్‌ అంశాలపైన అవగాహన కలుగడంతో పాటు రెండవ తరంగా ఎదగడానికి అవకాశం ఎంతైనా ఉంది.

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.