సృజనాత్మకత, తాత్వికతలే నా కలం బలం – అబ్బూరి ఛాయాదేవి

 

మనసుల్ని మెలిపెట్టేలా జీవితపు మరో పార్శ్వాన్ని చూపకనే చూపే యదార్థ జీవన దృశ్యాలు వారి రచనల్లో ఇతివృత్తం. అనుభవాలే అక్షరరూపంగా గుండెల్ని కదిలించే కమనీయ బాధాతప్త కథనం ఆమె స్వంతం.

అనేక సందర్భాల్లో ఆయా స్త్రీలు అనుభవించే మానసిక భావోద్వేగాల చిత్రణ వారి కథల్లో సర్వసాధారణం. క్లిష్టమైన వ్యథలతో నిండిన కథలను సరళమైన భాషలో సూటిగా, స్పష్టంగా చెప్పగలగడం ఆమె విశిష్టత.

సనాతన సాంప్రదాయాలు అడుగడుగునా అణచివేతకు గురి చేసినా తిరుగుబాటు బావుటా రెపరెపలాడలేకపోయింది అక్కడ. ఆచార, వ్యవహారాలు… అణువణువునా వివక్షతను చూపినా ఆ సాహితీ వెలుగుల ప్రకాశాన్ని, అవేవీ తమ అరచేతులతో అడ్డుకోలేవక్కడ. అందుకే…

”తెలుగు వచనా రచయిత్రిగా ఆమె అత్యంత ప్రతిభావంతురాలు” అని చేరాగారన్నా…

”తెలుగుమాట పూర్తిగా సంకరమై వంకరటింకర దారిలో విలవిలలాడుతున్న ఈ కృష్ణపక్షంలో ఒక పున్నమి చందమామ శ్రీమతి అబ్బూరి ఛాయాదేవిగారి వ్యాససంకలనం” అని ప్రఖ్యాత సాహితీవేత్త కీ.శే. వాకాటి పాండురంగారావు గారన్నా…

”చేదు వాస్తవాన్ని తీయగా చెప్పటం ఆమె తత్వం. అందుకే ఆమె కథలు చైతన్యాన్నిచ్చే షుగర్‌ కోటెడ్‌ పిల్స్‌…” అని ప్రముఖ సాహితీవేత్త శ్రీ కప్పగంతుల మల్లిఖార్జునరావుగారన్నా…

ఇవన్నీ ఆమె రచనా ప్రతిభకు కొలమానాలే…! ఆమె కీర్తికిరీటంలో పొదగబడ్డ వజ్ర, వైఢూర్యాలే…!

నిజమే…!

ఆమె భావాలు పదునైనా మృదు, మధురమైనవే.

మామూలు సంభాషణల్లో కూడా మనసుని కదిలించే మాటల అల్లికలూ, సంభాషణల మధ్యలో… ఉన్నట్టుండి చురుక్కుమనే చమక్కుల్ని ఆసువుగా చమత్కరించటం, అలవోకగా ఆమె మాట్లాడే ప్రతి మాటా… తన అనుభవమేనన్న భావన ఎదుటివాళ్ళల్లో కలిగేలా మృదువుగా హాస్యాన్ని జోడించి మరీ చెప్పగలగటం వారి ప్రత్యేకత.

ఎన్నెన్నో అనుభవాలను, అనుభూతుల్ని నిక్షిప్తం చేసుకున్న జీవితం వారిది.

ఒక రకంగా చెప్పాలంటే ఉదారవాదం, మానవతావాదం, సంస్కరణవాదం, స్త్రీ వాదం తనదికాని, తాను సృజించని వాదమంటూ ఏదీలేని కథా, కథనశిల్పి ఆమె.

వారే…

”నా పుట్టుక విధి నాతో ఆడిన ఒక నాటకం. మా తల్లిదండ్రులు రెండవసారి కూడా అబ్బాయే కావాలని సూర్యుడ్ని స్తుతిస్తూ అబ్బాయే పుడితే నీ పేరే పెడతామని సూర్యుణ్ణి ప్రార్ధిస్తూ సూర్యనమస్కారాలు చేస్తే అమ్మాయిని నేను పుట్టానని ఆ ముల్లోకనాయకుడికి ఇచ్చిన మాట ప్రకారం సూర్యుని భార్య అయిన ఛాయాదేవి పేరు నాకు పెట్టారంటూ” నిష్కల్మషంగా తనకి తానే ఎన్నోసార్లు చెప్పుకున్న, తెలుగు సాహితీ ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని, సాహితీరంగంలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అగ్రశ్రేణి రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవిగారు.

”బోన్సాయ్‌ బ్రతుకులు” ”సుఖాంతం” ”శ్రీమతి ఉద్యోగిని” లాంటి కథల్లో పురుషాధిపత్యాన్నే కాదు, ఆంధ్ర యువతి మండలి నేతృత్వంలో వెలువడే ”వనిత” పత్రికకూ సంపాదకత్వం వహించి తన రచనలతో అసమానతలనూ నిలదీసిన అసమాన రచయిత్రి ఆమె.

అత్యంత పరిణతితో వారు రచించిన అనేక కథలూ, వ్యాసాలూ, కాలమ్స్‌, వర్తమాన సమాజంలో స్త్రీ స్థితిగతులకు అద్దం పట్టేవే. నేను మానవతావాదిని అనిపించుకోవటం కంటే స్త్రీవాదిని అనిపించుకోవటమే నాకిష్టం అని స్వయంగా వారే చెప్పారంటే స్త్రీల పట్ల, ఎల్లెడలా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, ఆమె స్థితిగతుల పట్ల వారి నిబద్ధతను తెలియచేస్తాయి.

స్త్రీవాదం అంటూ ప్రత్యేకంగా ఒక ధోరణి ఉందని తెలియని రోజుల్లోనే ఆమె మహిళల సమస్యలపై అనేక కథలు వ్రాశారు.

”స్త్రీ వాదం అంటే అదే పనిగా మగవారిని వ్యతిరేకించటం కానే కాదని, స్త్రీలపై జరుగుతున్న దాడులు, అణచివేత, స్త్రీ పట్ల చూపుతున్న వివక్షతకు వ్యతిరేకంగా పనిచేయటమే. హక్కులూ, అవకాశాలూ అందరికీ సమానం కదా” అంటూ స్త్రీ వాదానికి తనదైన నిర్వచనం ఇచ్చిన ఛాయాదేవిగారు ‘తను రాసిన కథల్లో ఎక్కువ స్త్రీ వాద కథలేనని, నన్ను నేను ఫెమినిస్టుగా చెప్పుకునేందుకే ఎక్కువ ఇష్టపడతానని, నిజానికి తనకొచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్త్రీవాదులందరికీ వచ్చిన అవార్డు అని సగర్వంగా చెప్పుకునే అబ్బూరి ఛాయాదేవి గారు సృజించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు.

ప్రపంచీకరణ నేపథ్యంలో అనుభవాల విస్తృతి పెరిగి వైవిధ్యంతో కూడిన రచనలు అనేకం వెలువడుతున్నా, వాటిలో అనుభూతి సాంద్రత లోపం వల్ల మనసుల్ని ఆకట్టుకోలేకపోతున్నాయని చెప్పకనే చెబుతున్న… ప్రఖ్యాత రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారిని ”రాజాచంద్ర ఫౌండేషన్‌” తరపున ఇంటర్వ్యూ చేసినపుడు అనేక ఆసక్తికరమైన విషయాలు వారి మాటల్లోనే…

మీ బాల్యం గురించి చెబుతారా?

నేను రాజమండ్రిలో 1933 అక్టోబర్‌ 13న పుట్టాను. మా నాన్నగారు మద్దాలి వెంకటాచలంగారు. అప్పట్లో గొప్ప న్యాయవాది. వీరేశలింగంగారి వీథిలో మద్దుల వారింట్లో అద్దెకుండేవాళ్ళం వారున్న ఇంటిపక్కనే. మా సందు తిరగ్గానే దామెర్ల రామారావుగారిల్లు

ఉండేది. ఇటుపక్క వీథికి ఒక చివర సరస్వతీ పవర్‌ ప్రెస్‌, మరో చివర గోదావరి ఒడ్డూ ఉండేవి.

మా అన్నయ్య తర్వాత నాకంటే ముందు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అయిదారేళ్ళు పెరిగాక రెండవ పిల్ల పోయింది. ఈ సారి కొడుకు పుట్టాలని మా నాన్నగారు కోరుకునేవారట. అందుకు రోజూ ”సూర్య నమస్కారాలు” కూడా చేసేవారట. కానీ నేను పుట్టాను. అబ్బాయి పుడితే సూర్యుడి పేరు పెట్టుకుందామనుకున్న మా నాన్నగారు అమ్మాయి పుట్టేసరికి సూర్యభగవానుని భార్య పేరైన ”ఛాయాదేవి” పేరు నాకు పెట్టారట. మొదట్లో నన్ను ముద్దుగానే చూసేవారు. పాతకాలపు పడక కుర్చీలో మా నాన్నగారు నన్ను తమ గుండెలపై కూర్చోబెట్టుకుని ”గజేంద్ర మోక్షం” వంటి పురాణ కథలూ, విక్రమార్కుడి వంటి జానపద కథల చెప్పేవారు. కానీ, ”ముకుందమాల” శ్లోకాలు మా అన్నయ్యలా నేను స్పష్టంగా అప్పజెప్పలేకపోతున్నానని నన్ను తన గుండెలమీద నుంచి దించేశారు.

నా బాల్యం గుర్తొచ్చినప్పుడల్లా నాకు ముందుగా గుర్తొచ్చే సంఘటన అది (నవ్వుతూ…)

ఇలాంటి సంఘటనలు మీ విద్యాభ్యాసం మీద ఏమైనా ప్రభావం చూపించాయా? ఉద్యోగం కూడా చేశారు కదా…! అదెలా సాధ్యమైంది…?

మా పక్కవీథిలో మిషనరీ స్కూలు ఉండేది. ప్రతిరోజూ చాలామంది పిల్లలు మా ఇంటి ముందు నుంచి ఆ స్కూలుకి వెళుతూ

ఉండేవారు. వాళ్ళందర్నీ రోజూ గమనిస్తూ ఉండేదాన్ని. కొంతకాలానికి నేనూ స్కూలుకు వెళతానని పేచీ పెట్టడం మొదలెట్టాను. దాంతో మా నాన్నగారు నన్ను ఆ స్కూల్లో చేర్చారు. కానీ, కొంతకాలానికి ఆ స్కూల్లో క్రైస్తవ మతప్రచారం బాగా జరుగుతోందని గమనించి నన్ను స్కూలు మాన్పించేసి ఇంట్లోనే చదివించారు.

తర్వాత నా ఎనిమిదో ఏట 5వ క్లాసులో బాలికల స్కూలులో చేర్పించారు. గోదావరి ఒడ్డున ఉండేదా స్కూలు. ఒక్కదాన్నీ నడిచి వెళ్ళేదాన్ని. ఈ రోజుల్లోలాగా అప్పట్లో ఇంతింత భయాలు ఉండేవి కావు కదా…! కానీ ఆ స్కూలు కూడా నచ్చక మరుసటి ఏడాది అందులోంచి తీసేసి మా ఇంటికి పక్కనున్న ”టౌన్‌ మిడిల్‌ స్కూల్లో” ఫస్ట్‌ ఫాంలో చేర్పించారు. ఇంకో విషయం…

నేను ఆడపిల్లనైనా నా చిన్నప్పటినుంచీ కూడా మగపిల్లల దుస్తులు వేసేవారు. అయితే థర్డ్‌ఫాంలో మా హెడ్‌ మాస్టర్‌ పెమ్మరాజు రామారావుగారని ఉండేవారు. మా నాన్నగారి స్నేహితులే. క్లాసులో నన్ను ”ఇంకా ఎన్నాళ్ళు వేస్తావే ఈ పొట్టి లాగులు?” అంటూ ఎగతాళి చేశారు ఒకరోజు. క్లాసులో అందరూ నవ్వారు. ఇంటికొచ్చి చెప్పాను ఏడుస్తూ. దాంతో పరికిణీలు కుట్టించారు. పరికిణీలు వేసుకున్నా వాటిమీద కూడా చొక్కాలే. తెల్లటి పాప్లిన్‌ బాగా దొరికేది అప్పుడు. వద్దని చెప్పే ధైర్యం కానీ, నాకివి కావాలి అని అడిగే చనువు కానీ

ఉండేవి కావు.

ఆ తర్వాత వీరేశలింగం హైస్కూల్లో ఫోర్త్‌ఫాంలో వేశారు. అక్కడ భమిడిపాటి కామేశ్వరరావు గారూ, పిలకా గణపతి శాస్త్రి గారూ, కృత్తివాస తీర్ధులుగారు… మొదలైనవారు టీచర్లుగా ఉండేవారు. అక్కడే నాకు సాహిత్యం పట్లా, హాస్యం పట్లా అభిరుచి కలిగింది. కానీ ఇంట్లో గట్టిగా నవ్వటం నిషిద్ధం.

నేను ఉద్యోగం చేస్తానని కలలో కూడా అనుకోలేదు. అసలు కాలేజీలో చేరతానని కూడా అనుకోలేదు. అప్పట్లో మా అన్నయ్య ఇంగ్లండ్‌లో పిహెచ్‌.డి. చేస్తుండేవాడు. నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని తెలిసి ”పధ్నాలుగో ఏటే దానికి పెళ్ళేవిటి? కాలేజిలో చేర్పించండి” అని రాయడంతో… ఉన్న ఒక్క కొడుకూ దగ్గర లేకుండా పెళ్ళి చేయటం ఎందుకని మా అన్నయ్య ప్రోద్బలంతోనే నన్ను గవర్నమెంటు కాలేజీలో చేర్పించారు మా నాన్నగారు. అది 1947వ సంవత్సరం. ఆ సంవత్సరమే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ సందర్భంగా మొదటిసారి ఖద్దరు చీర కట్టుకున్నాను.

మీ వారు అబ్బూరి వరద రాజేశ్వరరావు గారు… వారి తండ్రిగారు శ్రీ అబ్బూరి రామకృష్ణరావు గారు కూడా పేరెన్నికగన్న రచయితలు. మీ వివాహానికి ఈ నేపధ్యం ఏమైనా కారణమైందా? మీ వివాహ నేపధ్యం గురించి చెప్పండి.

అలాంటిదేమీ లేదు. బి.ఎ. పరీక్షలైపోగానే నాకో సంబంధం చూశారు మా నాన్నగారు. కానీ ఆ పెళ్ళికొడుకు (పైలట్‌ ఆఫీసర్‌) తండ్రి బలవంతం మీద నిశ్చితార్దానికి ఒప్పుకున్నా, తిరిగి పూనా వెళ్ళాక తాను ప్రేమించిన సింధీ అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు.

అప్పట్లో హైదరాబాద్‌లోని రిసెర్చి ల్యాబ్స్‌లో పనిచేస్తున్న మా అన్నయ్య నేను ఎక్కడ దిగులుపడతానోనని తన దగ్గరికి రప్పించుకుని నిజాం కాలేజీలో ఎం.ఎ.(పొలిటికల్‌ సైన్స్‌)లో చేర్పించాడు.

రాజమండ్రిలో మా ఇంట్లో రేడియో కూడా ఉండేది కాదు. ఇక్కడ మా అన్నయ్య ఇంట్లో రేడియో ప్రోగ్రామ్స్‌ వింటుంటే సాహిత్యాభిలాష పెరిగి నాటకాల్లోనూ, వనితా కార్యక్రమాల్లోనూ పాల్గొనడం మొదలుపెట్టాను. అప్పట్లో భాస్కరభట్ల కృష్ణారావుగారు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవారు. నన్ను బాగా ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఎం.ఎ. పరీక్షలు అయిపోగానే ”భర్తను ఎన్నుకోవడం ఎలా?” అనే అంశంమీద రేడియోలోని స్త్రీల కార్యక్రమంలో ప్రసంగించమన్నారు. సరేనన్నాను. అయితే, ప్రోగ్రాం అయిపోగానే కృష్ణారావుగారు చెక్కు ఇస్తూ ”నీ పెళ్ళెప్పుడు?” అనడిగారు. ”మంచివాడు దొరకాలి కదా…!” అన్నాను. దానికి వారు ”చూపిస్తే చేసుకుంటావా?” అని అడిగారు. ”కట్నం తీసుకోని వాడైతే చేసుకుంటాను” అన్నాను ”నవ్వించేవాడు నవ్వనిచ్చేవాడూ అయితే బాగుంటుంది” అని మనసులో అనుకుంటూ. అలాగే దొరికారు…! భాస్కరభట్ల గారూ, రాయప్రోలు రాజశేఖర్‌ గారూ, ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారూ కుదిర్చిన సంబంధం మాది.

రచయిత్రిగా మీ మొట్టమొదటి రచన? అందుకు ప్రేరేపించిన అంశాలు.

నేను ఎం.ఎ. చదువుతున్నప్పుడు మా వదిన రుక్మిణీగోపాల్‌ కథలు వ్రాస్తూ ఉండేది. అప్పటికే తన కథలు కొన్ని వారపత్రికలలో అచ్చయ్యాయి. ఒకసారి నా అనుభవం గురించి చెప్పాను మా వదినతో. దాన్ని కథగా వ్రాసింది. అది పత్రికలో అచ్చయ్యింది. దాంతో నాకూ ఉత్సాహం కలిగి నేనూ ఒక కథ రాశాను. ”అనుబంధం” ఆ కథ పేరు. నిజాం కాలేజి మేగజైన్‌ ”విద్యార్థి”లో అచ్చయ్యింది. అదే నా మొదటి కథ.

మా నాన్నగారు ఆ కథ చదివి, ఆయన నియంతృత్వాన్ని గురించి వ్రాసిన కథ అయినా, ముగింపు బాగుందని మెచ్చుకున్నారు.

రచనా వ్యాసంగాల పట్ల మీకు అభిరుచి ఎలా కలిగింది?

హైస్కల్‌లోనూ, కాలేజీలోనూ ఉన్న పాఠ్యగ్రంథాల్లో ఉన్న కొన్ని భాగాలు నన్ను ఆకట్టుకొనేవి. ఆర్‌.కె.నారాయణ్‌, రుడాల్ఫ్‌ బీజియర్‌, షేక్స్‌పియర్‌ వంటి రచయితల ఆంగ్ల రచనలూ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, గురజాడ అప్పారావు మొదలైన వారి తెలుగు రచనలూ నాకు స్ఫూర్తిని కలిగించాయి. రాజమండ్రిలోనూ, హైదరాబాద్‌లోనూ, మా కాలేజి స్టేజ్‌ నాటకాల్లో కూడా పాల్గొన్నాను. నేను చదువుకుంటున్న కాలంలోనే ”బేరెత్స్‌ ఆఫ్‌ వింపోల్‌ స్ట్రీట్‌” అనే నాటకాన్ని సంగ్రహంగా అనుకరణ చేసి ”పెంపకం” అనే నాటికగా రాశాను. అది ఆలిండియా రేడియోలో ప్రసారమయింది. పెళ్ళయ్యాక మా వారి సాహచర్యంలో ఎన్నో తెలుగు, ఇంగ్లీష్‌ పుస్తకాలు చదివి నా సాహిత్యాభిరుచిని పెంపొందించుకున్నాను. మా వారి ప్రోత్సాహంతో కవితారంగంలో కూడా అభిరుచి ఏర్పడింది.

మధ్య తరగతి కుటుంబాల్లోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల నేపథ్యంలో మీరు రాసిన కథలకు ప్రేరణ ఏమిటి? ‘బోన్సాయ్‌ బ్రతుకు’లాంటి కథలు వ్రాయటానికి నేపధ్యం చెప్పండి.

నా మొదటి కథలోనూ, నా మొదటి రేడియో నాటికలోనూ కూడా పురుషాధిక్యతనూ, కుటుంబంలో తండ్రి నియంతృత్వాన్ని సున్నితంగా చూపించాను. నా కథలకి చాలావరకు నా పుట్టింట్లోనూ, నా అత్తింట్లోనూ, నా బంధుమిత్రుల ఇళ్ళల్లోనూ చూసిన, విన్న సంఘటనలు, ఉద్యోగరీత్యా గమనించిన విషయాలూ, మూలాలూ వాటికి కొంత కల్పనను జోడించి కథలుగా మలిచాను.

ముఖ్యంగా ‘బోన్సాయ్‌ బ్రతుకు” అనే కథ మా అక్కయ్య గురించి వ్రాసినదే అయినా, నిజానికి మా అక్కయ్య ఎప్పుడూ ఢిల్లీ రాలేదు. నేను బోన్సాయ్‌ చెట్లను పెంచలేదు. మా మరిది ఆర్టిస్ట్‌. అతను ఇంట్లో బోన్సాయ్‌ చెట్లను చిన్న చిన్న కుండీల్లో పెంచుతున్న విధానం చూసినప్పుడు, ఆడవాళ్ళను కూడా సాంప్రదాయం పేరుతో ఎలా ఎదగకుండా ఇతరుల మీద ఆధారపడేటట్లు చేశారో స్ఫురించి, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మా అక్క ఢిల్లీకి వచ్చినట్లు కల్పించి వ్రాశాను. నిజానికి మా అక్కయ్య చాలా ఏళ్ళు మల్లవరం అనే పల్లెటూళ్ళోనూ, తర్వాత నరసాపురంలోనూ గడిపింది. నేను దాదాపు పాతికేళ్ళపాటు ఢిల్లీలో ఉన్నా ఎప్పుడూ రాలేకపోయింది.

”ఆయన కీర్తి వెనక” అనే కథ మా అత్తగార్ని దృష్టిలో పెట్టుకుని వ్రాశాను. ఆవిడ కూడా దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ గారిలా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనాలనుకున్నారట. కానీ సంసార బాధ్యతల వల్ల కుదరలేదనీ, లేకపోతే తనకీ కీర్తి దక్కేదని బాధపడేవారు రేడియోలో కొన్ని వార్తలు విన్నప్పుడు. ఆ కథలో తక్కినవన్నీ కల్పనే.

ముఖ్యంగా ”సుఖాంతం” అనే కథ మా అమ్మ, అక్క, అత్తగారు, మా రెండవ ఆడపడుచు మొదలైన వాళ్ళ అనుభవాలకు నా చిన్నప్పటి అనుభవాలను జోడించి రాసిన కథ. చివరన కొంత కల్పన జోడించి, మొత్తం నా అనుభవంలా రాశాను.

మీ కథల నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతకి మీరు చేసిన సాధన ఏమిటి?

సాధారణంగా నాకు చిన్న కథలు, మామూలుగా కబుర్లు చెబుతున్నట్లు రాయడమే అలవాటు, ఇష్టం. వర్ణనలూ అవీ పెట్టి పొడిగించడం ఇష్టంలేదు. రెండు మూడు కథలు మాత్రం పెద్దవి రాశాను. నేను అనుసరణ చేసిన ”స్టెఫాన్‌త్స్వైక్‌” కథలు పెద్దపెద్దవి. ఆ ప్రభావంతోనేమో రెండు మూడు కథలు మాత్రం పెద్దవిగా రాశాను.

”శ్రీమతి-ఉద్యోగిని” అనే కథ మధ్యమధ్యలో కొద్దిగా కథనం జోడించి ఒక ఇంటర్వ్యూలా రాశాను. ఆంగ్లంలో వచ్చిన ఒక పరిశోధనా గ్రంథంలో చివర ఇచ్చిన ప్రశ్నావళిని (పరిశోధన కోసం కొందరిని ప్రశ్నించడానికి తయారు చేసినది) ఆధారంగా చేసుకుని, నేనైతే ఎలా సమాధానాలు చెబుతాను అనుకుని సమాధానాలు రాసి, దాన్ని కథగా రూపొందించాను. దానిని మెచ్చుకుంటూ ”జ్యోతి” పత్రిక ఎడిటర్‌ నన్ను తమ పత్రిక కోసం అటువంటి రకం ఏదైనా రాసి పంపించమన్నారు. ఆమె కోరిన ప్రకారం ”ఎవర్ని చేసుకోను?” అనే కథ రాశాను. అది సీరియల్‌గా వచ్చింది.

ఎంత గంభీరమైన సమస్య అయినా, అక్కడక్కడా కొంత హాస్యస్ఫోరకంగా వ్రాస్తే కథనం ఎక్కువ ఆకట్టుకుంటుందని గ్రహించాను. మా వారి సంభాషణల్లో హాస్యధోరణి నన్ను కొంత ప్రభావితం చేసింది. ఉదాహరణకి ”నలుగురి కోసం”, ”ఎవరి ఏడుపు వారిదే” అనే కథల్తో, భర్త పోతే ఆ స్త్రీని పరామర్శ చేయడంలో జరిగే తతంగం గురించీ, వచ్చేవారి గురించీ హాస్యస్ఫోరకంగా రాశాను.

వ్యాసం, అనువాదం, కథ, నవల ఈ నాలుగు ప్రక్రియలనీ మీరు సృజించారు. వీటిలో ఏ ప్రక్రియ అంటే మీకు ఎక్కువ ఇష్టం? కారణం ఏమంటారు?

కథ, అనువాదం, వ్యాసం. ఈ మూడింటిలో ”కథ” అంటే ఎక్కువ ఇష్టం. క్లుప్తంగా, శక్తిమంతంగా, స్మృజనాత్మకంగా చెప్పే మాధ్యమం కనుక. ఇకపోతే ”నవల”ను సృజించాను. అంతే. నేను రాసిన ”మృత్యుంజయ” మామూలుగా వచ్చే నవలల్లా లేదు అనుకుని, అట్ట వెనుక ”ఓ తండ్రి కథ” అని రాయడం జరిగింది. దాన్ని రెండవసారి ముద్రించిన ”భరాగో” గారు దాన్ని ”నవల” అన్నారు.

తెలుగు సాహిత్యంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితంచేసిన ఇతర రచయితలూ, రచయిత్రులూ, వారి రచనలు…

మా వదిన ”రుక్మిణీ గోపాల్‌”, నా భర్త వరద రాజేశ్వరరావు, రా.వి.శాస్త్రి, మాలతీ చందూర్‌, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, వాకాటి పాండురంగారావు, ఓల్గా, కొండవీటి సత్యవతి, మొదలైన వారు… వారి రచనలు..

ఆంగ్ల రచయితల జీవన దృక్పథానికీ, భారతీయ రచయితల జీవన దృక్పథానికి తేడా ఏమిటంటారు? మీకు బాగా నచ్చిన ఆంగ్ల రచయిత ఎవరు?

ఎవరి జీవన విధానం, సంస్కృతి వారిది. వారి దృక్పథాల్ని అర్ధం చేసుకుని, రచయితలైనా, పాఠకులైనా మానవత్వంతో కూడిన ఆధునికతని అలవర్చుకోవాలి. షేక్స్‌ఫియర్‌…

రచనల్లో తప్పకుండా ఏదైనా సందేశం ఉండాలంటారా?

ఉండాలి. కానీ పాఠం చెబుతున్నట్టో, ఉపదేశిస్తున్నట్టో ఉండకూడదు. సూచనప్రాయంగా, పరోక్షంగా ఆకట్టుకునేట్లుగా

ఉండాలి.

రచన సూటిగా పాఠకులను తాకాలంటారు? అసలు రచన ఎలా ఉండాలని మీరు భావిస్తారు? రచయితకూ, పాఠకులకూ మధ్య

ఉండాల్సిన సంబంధం ఎలా ఉండాలని మీరు భావిస్తారు?

”తాకడం” అంటే షాక్‌ కొట్టినట్లుగా కాకుండా, స్పందింపజేసేటట్లుగా, ఆలోచింపచేసేటట్లుగా ఉంటే రచనల ప్రయోజనం కొంతైనా నెరవేరుతుంది. ఆర్ద్రత కలిగించేటట్లో, ఆనందాన్ని కలిగించేటట్లో ఉంటే పాఠకుల్ని ఆకట్టుకోవచ్చు.

మీలో మీరు గమనించినది ఏమిటి?

ఏదైనా నేను తాదాత్మ్యం పొందేటట్లు చేసినప్పుడు, నాకూ రాయాలని తీవ్రంగా అనిపించినపుడూ మాత్రమే రాయడం జరిగింది. అందుకే నేను చాలా తక్కువ కథలు రాశాను. నాకే జరిగినట్లు చాలా తీవ్రంగా అనిపించినప్పుడు మాత్రమే రాయడం జరిగింది. అందుకే నేను చాలా తక్కువ కథలు రాశాను. నాకే జరిగినట్లు చాలావరకు ”నేను” అనే ఉత్తమ పురుషలో వ్రాసింది కూడా అందుకే.

వ్రాయాలని అనుకుని మీరు వ్రాయలేనిది ఏదైనా ఉందా?

లేదనుకుంటాను.

మీరు, మీ శ్రీవారు అబ్బూరి వరదరాజేశ్వరరావుగారి రచనల్ని సంకలనాలుగా, సంపుటాలుగా ప్రచురించారు కదా…!

అవును. మా వారు రాసిన వాటిలో కొన్నింటిని (లేఖలూ, వ్యాసాలు మొదలైనవి) ఇతరులు ఆయనకీ, ఆయన గురించి రాసిన వాటిని సంకలనం (శీలా వీర్రాజు, కుందుర్తి సత్యమూర్తి గార్ల సహకారంతో) చేసి ”వరదస్మృతి” అనే గ్రంథాన్నీ, కొన్ని ఇతర సంకలనాలనూ, సంపుటాలనూ ”అబ్బూరి ట్రస్ట్‌” తరపున ప్రచురించాను. మేమిద్దరం విడివిడిగా ఇతర రచయితల రచనల్ని ఆంగ్లం నుంచి అనువదించాం, అనుకరణ చేశాం. సంకలనాలుగా ప్రచురించాం.

మీరు వ్రాసిన కథల్లో స్త్రీ వాద కథలే ఎక్కువ. అయితే, సాహిత్య విస్తృతికి స్త్రీవాదం ఏ విధంగా దోహదం చేసిందంటారు? వివాహ వ్యవస్థే హింసకు కారణమంటూ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ సమూలంగా ధ్వంసం కావాలన్న స్త్రీ వాదంలోని ఒక ధోరణిని మీరు ఆమోదిస్తున్నారా?

స్త్రీలపై అణచివేతలు బాగా పెరిగాయి. అది పురుషాధిపత్యం గురించి స్త్రీలు ఇదివరటికన్నా ఎక్కువ చైతన్యంతో రాయటానికి స్త్రీవాదం తోడ్పడింది. ఆడవాళ్ళు తమ తమ ఇష్టాఇష్టాలపైనే ఆధారపడాలన్న భావం, ఇంటిపనిలో మగవారు భాగం పంచుకోవాలన్న అభిప్రాయాలూ, స్త్రీలు ప్రత్యేకంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలూ ఇప్పటి సాహిత్యంలో భాగం కావటానికి స్త్రీవాదం కారణం. స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను ప్రత్యేకమైన ఇతివృత్తాలుగా రచనలు చేయడం సాహిత్యంలో పెరిగింది. స్త్రీవాదం ఒక సిద్ధాంతంగా భావించని కాలంలోనే చలం, శ్రీపాద ఎక్కువగా స్త్రీల సమస్యల గురించి వ్రాశారు. స్త్రీవాదం వచ్చాక స్త్రీల సమస్యల గురించి స్త్రీలే కాక వాళ్ళతోపాటు వాళ్ళ సమస్యల గురించి అర్థం చేసుకున్న మగవాళ్ళు కూడా స్త్రీల సమస్యల గురించి వ్రాస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.

మనిషిలోనే స్వార్థం ఉంది. అది దోపిడీకి అసలు కారణం. అది పోవాలి. మనిషి మారాలి. అతను అంతర్ముఖుడై తనలోని స్వార్థాన్ని విడనాడాలి. అంతేకానీ కుళ్ళునీ, కల్మషాన్నీ అంతటా నింపుకుని వివాహ, కుటుంబ వ్యవస్థ ధ్వంసం కావాలంటే ఎలా కుదురుతుంది? అసలు ఆ రెండు వ్యవస్థలూ లేని సమాజాన్ని ఊహించలేము.

మీ దృక్పథం గురించి వివరిస్తారా?

నాది స్త్రీవాద దృక్పథం, మానవతావాద దృక్పథం. చొరవగా ఉద్యమాలలో పాల్గొనడం నాకు అలవాటు లేదు.

సమకాలీన సాహిత్యంలో ఎవరి రచనలంటే ఎక్కువ ఇష్టపడతారు?

నాతోటి స్త్రీవాద రచయిత్రులందరివీ ఇష్టపడతాను. హాస్యస్ఫోరకంగా వ్రాసే డా.సి.మృణాళిని, డా. సోమరాజు సుశీల, శ్రీరమణ మొదలైన వారి రచనలంటే మరీ ఇష్టం.

జిడ్డు కృష్ణమూర్తిగారి ఫిలాసఫీతో మీ పరిచయం…?

మా నాన్నగారు థియోసాఫిస్ట్‌. ఆయన కృష్ణమూర్తిగారి పుస్తకాలు ఎక్కువ చదివేవారు. ఎమ్మే పూర్తయి నా పెళ్ళయ్యాక ”ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ ఫ్రీడం”, ”కామెంటరీస్‌ ఆన్‌ లివింగ్‌” అనే పుస్తకాలను ఆయన ప్రోద్బలంతోనే చదివి బాగా ప్రభావితమయ్యాను. చదివేకొద్దీ వారి పుస్తకాలను అనువాదం చెయ్యాలనే తపన పెరిగి 1980ల తర్వాత అనువాదం చేయడం మొదలుపెట్టాను.

జిడ్డు కృష్ణమూర్తిగారి ”కామెంటరీస్‌ ఆన్‌ లివింగ్‌” అనే మూడు సంపుటాల్ని అనువాదం చేశాను. ఆయనే వ్రాసిన ”ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ ఫ్రీడం” అనే గ్రంథాన్ని మా నాన్నగారు గ్రాంధికంలో అనువదిస్తే, మా నాన్నగారి మరణానంతరం దానిని ఖఖీI వారి సూచనతో వ్యవహారంలోకి అనువదించాను.

మీ రచనలపై జిడ్డు కృష్ణమూర్తిగారి ఫిలాసఫీ ప్రభావం ఏమైనా పడిందంటారా? మార్క్సిజానికి దగ్గరగా ఉండే స్త్రీవాదాన్ని సమర్ధించే మీరు కృష్ణమూర్తిగారి ఫిలాసఫీని అంగీకరించడంలో వైరుధ్యం లేదా?

జిడ్డు కృష్ణమూర్తిగారి రచనల ప్రభావం నేను రాసిన ”ప్రయాణం” కథలో కనిపిస్తుంది.స్వేచ్ఛ, దృక్పథం, ప్రేమల గురించిన వ్యాసాలను ఆయన ప్రభావంతోనే రాశాను. ఇకపోతే జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీకి, మార్క్సిజానికి పెద్దగా విభేదం లేదు. రెండు ఫిలాసఫీలూ కూడా సమానత్వాన్నే చాటి చెబుతున్నాయి.

తేడా అల్లా కమ్యూనిజంలోని నియంతృత్వ ధోరణిని కృష్ణమూర్తిగారు వ్యతిరేకిస్తారు. సమానత్వం సాధించాలంటే హింసాత్మక పద్ధతులు సరైనవి కావు అంటారు కృష్ణమూర్తి. ఇవి తప్ప మార్క్సిజంతో పెద్దగా విభేదం లేదు.

ఇక స్త్రీవాదాన్ని సమర్థించడంలో వైరుధ్యం ఏముంటుంది?

జిడ్డు కృష్ణమూర్తిగారు కాకుండా ఇంకా ఎవరైనా మీకు నచ్చిన ఫిలాసఫర్స్‌ ఉన్నారా?

ఉన్నారు. బెర్ట్రాండ్‌ రస్సెల్‌, ఆల్డస్‌, హక్స్‌లీల ఫిలాసఫీలు కూడా నాకు ఎంతో నచ్చుతాయి. రామకృష్ణ మఠానికి చెందిన రంగనాధానంద ఉపన్యాసాలు కూడా.

సాహిత్య ప్రయాణంలో, అనువాద, అనుసృజనల్లో శ్రీ వదరరాజేశ్వర రావుగారి పాత్ర, వారి ప్రభావం…

అనుకరణ (అనుసృజన) నేను చదువుకుంటున్న రోజుల్లోనే ”బేరెట్స్‌ ఆఫ్‌ వింపోల్‌ స్ట్రీట్‌” అనే నాటకానికి ”పెంపకం” అనే పేరుతో చేసినది రేడియోలో వచ్చిందని చెప్పాను కదా. తర్వాత మా వారి దగ్గరున్న ”స్టెఫాన్‌ త్స్వైక్‌ (స్టిఫాన్‌ జ్విగ్‌) కథలు” కొన్నింటిని (అపరిచిత లేఖ, ఇతర కథలు) చేశాను. మా వారి కొలీగ్‌ ఇంట్లో ఉన్న ”వరల్డ్‌ ఫోక్‌ స్టోరీస్‌” అనే పుస్తకం చూసి, అందులోని కొన్ని కథల్ని అనుసృజన చేసి ”అనగా అనగా” పేరుతో కొన్ని జానపద కథల్ని పుస్తకంగా తీసుకువచ్చాను. దానిని ‘మంచి పుస్తకం’ అధినేతలు పునర్ముద్రణ చేశారు.

సాహిత్యం తాలూకు ప్రభావం సమాజం మీద ఎంతవరకూ ఉంటుంది? అసలు సమాజానికి సాహిత్యం అవసరమంటారా?

భాషా జ్ఞానాన్ని, సామాజిక పరిణామాల అవగాహననీ పెంచడానికే కాదు, అజ్ఞానాన్ని తొలగించడానికీ, మూఢవిశ్వాసాలనీ, సంకుచిత భావాలనీ తొలగించడానికి కూడా సాహిత్యం ఉపయోగిస్తుంది. ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం తప్పక ఉంటుంది. కాబట్టి సాహిత్యం సమాజానికి అత్యంత ఆవశ్యకం అని నేనంటాను.

రచనలకు మాండలికం ఎంతవరకూ అవసరం అంటారు?

మాండలికాన్ని, పాత్రోచితంగానూ, సందర్భోచితంగానూ వాడటం అవసరమే. కానీ కేవలం పట్టుదలతో, దురభిమానంతో వాడటం జరుగుతోంది. మా వారిది గుంటూరు జిల్లా, మాది తూర్పు గోదావరి జిల్లా. నన్ను కొన్ని సందర్భాలలో ఆయన వెక్కిరిస్తూ

ఉండేవారు. రచనలో ”ఇంగ్లీషు పదాల్ని ఎక్కువగా వాడవద్దు” అనేవారు. కానీ క్రమంగా మన ఆధునిక జీవితంలో చూడండి. ఎన్ని పదాలు తెలుగు వాడుకలో కలిసిపోయాయో…! ఫోన్‌, సెల్‌ మొదలైనవి తెలుగు పదాలే కదా అన్నంతగా వాడుతున్నాం…!

మీ ఈ సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో మీరు పొందిన అవార్డులూ, రివార్డులూ ఎన్నో…! వాటి గురించి వివరించండి.

తప్పకుండా…

1. 1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహితీ పురస్కారం – తెలుగు విశ్వవిద్యాలయం వారి ద్వారా

2. 1996లో శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం.

3. 1996లోనే ”మృత్యుంజయ” నవలకి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ”రచయిత్రి-ఉత్తమ రచనా పురస్కారం”

4. 1997లో అభినందన – దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ అవార్డు (సాహిత్యం)

5. 2000లో కళాసాగర్‌ – పందిరి సాహిత్య పురస్కారం

6. 2004లో పులికంటి సాహితీ సత్కృతి పురస్కారం

7. 2005వ సంవత్సరానికి గాను 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌

8. 2006లో పి.వి.నరసింహారావు స్మారక పురస్కారం

9. 2009లో కలైంజర్‌ ఎమ్‌.కరుణానిధి పోర్షలీ అవార్డు

10. 2010లో రంగవల్లి స్మారక – విశిష్ట మహిళా పురస్కారం

11. 2011లో సనాతన ధర్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ – ప్రతిభా పురస్కారం

12. 2011లో అజో-విభో-కందాళం ఫౌండేషన్‌ – జీవితకాల సాధన పురస్కారం

మీ ఈ సుదీర్ఘ సాహితీ ప్రయాణంలో మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా ఉంటే చెప్పండి.

న్యూఢిల్లీకి తరలి వెళ్ళిన కొత్తలో, 1958 నవంబర్‌ 14న పండిట్‌ నెహ్రుకి మా వారు తను సంకలనం చేసి ప్రచురించిన ”వీశీసవతీఅ Iఅసఱa ూశీవ్‌తీవ” (వివిధ భాషల నుంచి ఎంపిక చేసిన కవితల ఆంగ్లానువాదాల సంకలనం) అనే గ్రంధాన్ని ప్రధానమంత్రి నివాసంలో బహూకరించిన తరువాత, అంతకు ముందే హైదరాబాద్‌లో ఉండగా ”సంపాదకురాలు”గా నా పేరుతో మా వారు ప్రచురించిన ”వీశీసవతీఅ ువశ్రీబస్త్రబ ూశీవ్‌తీవ” సంకలనాన్ని నెహ్రుకి ఇవ్వమన్నారు నన్ను. నేను సిగ్గుపడి ఇందిరా గాంధీకి ఇచ్చాను. ఆవిడ ఆ పుస్తకాన్ని తండ్రి చేతికి ఇస్తూ ”ూష్ట్రవ ష్ట్రaర వసఱ్‌వస ఱ్‌” అన్నారు. నెహ్రు ఆ పుస్తకాన్ని తెరచి, లోపల పేజీలను తిప్పి ”ఇస్‌ లడకీనే కియా” అన్నారు ఆశ్చర్యంగా. ”నా సంపాదకత్వం” రహస్యం ఆయన కనిపెట్టేశారని సిగ్గుపడిపోయాను. నిజానికి ప్రూఫ్‌రీడింగ్‌ తప్ప అసలు పనిచేసిందంతా మావారే కదా…! ఈ అనుభవాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ తరువాత ఒక పాములవాడు అక్కడే ”నెహ్రు మెడలో పాము” వెయ్యడం గురించి నేను రాసిన ”నా జ్ఞాపకాలు” శీర్షికతో ”వార్త” పత్రికలో వచ్చింది.

ఖాళీ సమయాన్ని విసర్జిత వస్తువులను ఉపయోగించి అనేక రకాలైన వస్తువుల్ని తయారు చేయడమే కాక ”బొమ్మలు చేయడం” అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. ఏ మాత్రం సృజనాత్మకత ఉన్నవారికైనా ఎంతో ఉపయోగపడే పుస్తకం అది. ఈ నేపథ్యంలో, తమ అమూల్యమైన సమయాన్ని సినిమా హాళ్ళల్లో, రెస్టారెంట్లలో వృధాగా గడిపే నేటి యువతకు మీరిచ్చే సందేశం?

తమలోని సృజనాత్మకతని ఎలా పెంపొందించుకోవచ్చో – ఒక్క యువతకే కాదు, పిల్లలకు, గృహిణులకూ కూడా నేను చేసిన వాటిని చూపించి, వాటి గురించి వివరిస్తూ ఉంటాను. ఇటువంటి ”కళ”ను అలవరచుకుంటే, జీవితంలో ”బోర్‌డమ్‌”, ”తోచకపోవడం” అనే మాటలకి తావుండదు. సమయం సద్వినియోగం అవుతుంది. చెత్తబుట్టలోకి వెళ్ళే వస్తువులు కళారూపాన్ని పొంది అందలం ఎక్కుతాయి. అందరినీ ఆకట్టుకునే ఇటువంటి వ్యాపకాలతోనే, నాకు పిల్లలు లేరన్న లోటుతో నేనెప్పుడూ బాధపడలేదు.

ఒక సీనియర్‌ రచయిత్రిగా నేటి తరం రచయితలు, రచయిత్రులకు మీరిచ్చే సలహా…!

కేవలం పేరుకోసం, డబ్బు కోసం కాకుండా, రచన చేయడం ద్వారా ఆనందాన్ని, ఏదైనా ప్రయోజనాన్ని స్వయంగా ఆశిస్తూ, దాన్ని చదివినవారికి కూడా ఆనందాన్ని, మనం ఆశించిన ప్రయోజనాన్నీ పొందాలనే ఉద్దేశ్యంతో రాయడం మంచిది.

”జీవితంలో అడుగులు వేసేటప్పుడు తప్పటడుగులు అవుతాయేమో, విమర్శలొస్తాయేమో అని సంకోచిస్తూ కూర్చుంటే అడుగు ముందుకి వెయ్యలేవు. ధైర్యంగా అడుగు ముందుకి వేస్తేనే అభివృద్ధి సాధ్యం. విజయం తథ్యం” అనే అబ్బూరి ఛాయాదేవి గారి మాటలు ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా అభివృద్ధి సాధకులకు మార్గదర్శకాలనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇంటర్వ్యూ : కన్నెగంటి అనసూయ
(నవ్యంద్ర సాహిత్య ప్రత్యేక సంచిక నుంచి … )
Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.