రాజుల మధ్య, రాజ్యాల మధ్య పూర్వకాలం నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. 19వ శతాబ్దంలో జపాన్‌లోని నాగసాకి, హిరోషిమాలపైన అమెరికా హైడ్రోజన్ బాంబుల వర్షం కురిపించింది. 20వ శతాబ్దంలో నేటికీ అక్కడ పచ్చని మొక్క మొలవలేదు. ఏ జీవరాశీ ఆ నేలలో జీవించలేదు. వియత్నాం (నేటి కాంబోడియా) యుద్ధం, ఇరాన్-ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ మొదలైన దేశాల్లో 19వ శతాబ్దంలో రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలు, నేడు మత ప్రాతిపదికన జరుగుతున్న యుద్ధాలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. మత రక్కసి జడలు విప్పి వికటాట్టహాసంగా కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. యుద్ధాల వల్ల మానవ సమాజం కోలుకోలేని, పూడ్చలేని అష్టకష్టాల అగాధంలోకి నెట్టివేయబడుతోంది. అమాయక ప్రజలు బలిపశువులవుతున్నారు. మొగ్గల్లాంటి, పువ్వుల్లాంటి పసివారు మాడి మసైపోతున్నారు. పిల్లలు తల్లిదండ్రులు లేని అనాధలవుతున్నారు. మహిళలు భర్తలను కోల్పోయి నిరాధారులు, నిస్సహాయులవుతున్నారు. తల్లులు కడుపు శోకంతో తల్లడిల్లుతున్నారు.
మన దేశం స్వతంత్రమై రెండు ముక్కలైన రోజున మతకలహాలు చెలరేగాయి. జాతిపిత బాపూజీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకుండా మతకలహాలు చెలరేగిన ప్రాంతాలకు వెళ్ళి శాంతి స్థాపనకు కృషి చేశారు. తాలిబన్లు, లష్కరే తొయిబా, తెహ్రిక్-ఎ-తాలిబన్లు, జైషె, సిమి, మిలిటెంట్లు మొదలైన మత సంస్థలు పుట్టగొడుగుల్లాగ పుట్టుకొచ్చాయి గల్ఫ్ దేశాల్లో. భారత్‌లో ఇండియన్ ముజాహిదీన్, శివసేన, రామసేన, భజరంగదళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ మొదలైనవి మత సంస్థలే. అన్నింటికన్నా ప్రమాదకరమైనది ఐఎస్ ఉగ్రవాద సంస్థ. ప్రపంచాన్నంతా ఇస్లామిక్ స్టేట్‌గా మార్చే దురాచనలో ఉంది. భయంకరమైన దాడులకు పాల్పడుతూ భీభత్సాలకు పాల్పడుతోంది. సిరియాను కేంద్రంగా చేసుకుని పనిచేస్తోంది. తలనుంచి పాదాల వరకు బురఖా ధరించి, సూర్యరశ్మి కూడా సోకకుండా, పరపురుషుని నీడ కూడా పడకుండా నాలుగ్గోడల మధ్య బ్రతకాలన్న మిలిటెంట్ల నెదిరించి ధీర ముస్లిం యువతులు, మహిళలు ఎందరో ఆ కిరాతకులకు ఎరయై అమరులయ్యారు.
ఐఎస్ సిరియాలోని కొంత భాగాన్ని ఆక్రమించుకుని స్థావరం ఏర్పరచుకున్న తర్వాత రక్కా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి దాడులు మొదలుపెట్టింది. రక్కా వాసులు ముందుగానే రక్కాను వదిలి వలస వెళ్ళారు. కానీ రఖియా హుస్సేన్ అనే జర్నలిస్టు మాత్రం తాను పుట్టి పెరిగిన రక్కాను వదిలి వెళ్ళలేదు. రఖియా తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయారు. ఒక్కతే ధైర్యంగా నిలబడింది. రఖియా అలెప్పొ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం చదివింది. ఐఎస్ భూతం రకాలో ప్రజల దైనందిన జీవితంతో చెలగాటమాడడం మొదలయింది. రఖియా ఐఎస్ అరాచక చర్యల గురించి, దురాగతాల గురించి ఇబ్రహీం అనే మారుపేరుతో పత్రికలకు వ్యాసాలు రాసి ఎండగట్టింది. అక్కడ ప్రజల దుర్భర, భయంకర, దయనీయ స్థితిని తన వ్యాసాలలో కళ్ళకు కట్టినట్లుగా విపులంగా, వివరించి వ్రాసింది. అంతకుముందే రక్కాలోని తన అనుభవాలను ఎన్నింటినో ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. తన తల్లిదండ్రులను, రక్కా వాసులను గురించి తెలుసుకోవడానికున్న ఒకే ఒక ఆధారమైన ఇంటర్నెట్‌ను ఐఎస్ ఎలా స్వాధీనం చేసుకుందన్న విషయాన్ని పత్రికలకు వ్యాసాలు రాసింది. ఎవరీ ఇబ్రహీం? మన గుట్టును రట్టు చేస్తూ వ్యాసాలు రాసే ఇబ్రహీం కోసం వేట మొదలుపెట్టింది ఐఎస్. గట్టి నిఘా ఏర్పాటు చేసింది. వారి ప్రయత్నం ఫలించి రఖియా వారి దృష్టిలో పడింది. సిరియా స్వతంత్రసేనతో సంబంధం కలిగి ఉన్నదన్న నేరారోపణ ఆమెపై మోపింది. సెప్టెంబర్ 2015లో ఆ ముష్కర మూకలు రఖియాను హత్య చేశారు. ఈ దురాగతం జనవరి 2016లో వెలుగులోకి వచ్చింది. ఒక్క రఖియానే కాదు ‘వెంటా’ మాసపత్రిక సంపాదకుడు నాజీ జేర్స్‌ను, రక్కాలో మానవ హక్కుల ఉల్లంఘనపై డాక్యుమెంటరీ రూపొందించిన ఒకతన్ని కూడా డిసెంబర్ 2015లో ఐఎస్ హతమార్చింది.
జొన్నా పలని గల్ఫ్ దేశాల్లో ఒక శరణార్ధుల శిబిరంలో పుట్టింది. తర్వాత తల్లిదండ్రులు డెన్మార్క్‌కు వెళ్ళి స్థిరపడ్డారు. జొన్నా పలని అక్కడే పెరిగి విద్యాభ్యాసం చేసింది. పలని కాలేజీలో చదువుతున్న సమయంలో ఐఎస్ దురాగతాల గురించి పత్రికలలో చదివి చలించి చదువుకు స్వస్తిచెప్పి తుపాకీ చేతబూనింది. అమెరికా, కుర్దిష్ సేనలతో కలిసి ఐఎస్‌పై జరిగిన యుద్ధాల్లో పాల్గొంది. ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆమె తలకు వెలకట్టింది. 8.80 కోట్ల రివార్డు ప్రకటించింది. డెన్మార్క్‌కు చెందిన పోలీసులు శరణార్ధులపై విధించే ట్రావెల్ బ్యాన్‌ను ఉల్లంఘించిందని జొనాల్ పలనిని అరెస్టు చేసి జైలులో పెట్టారు.
తాలిబన్ల చెరనుండి విముక్తి చెందిన ఆఫ్ఘాన్‌లో బాలికలు పాఠశాలలకు, మహిళా ఉద్యోగినులు వారి వారి కార్యాలయాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఇది సహించలేని తాలిబన్ ముష్కరులు బాలికలపై దాడి చేయడం ప్రారంభించారు. మలాలా వారి దాడికి గురైన నంగతి ప్రపంచానికి తెలిసిందే. జకియాజ్‌కీ అనే సాహస జర్నలిస్టు తుపాకీ నీడల్లో భయం భయంగా బ్రతుకుతున్న ఆఫ్ఘాన్ మహిళల జీవితాలలో వెలుగు తేవాలని నిశ్చయించుకుంది. దీంతో జకియా స్వంత రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. రేడియో ప్రసారాల ద్వారా చదువురాని మహిళలలో కూడా చైతన్యం కలిగించవచ్చని భావించింది. మహిళల్లో చైతన్యం కలిగించేవాటిని ప్రసారాల ద్వారా తెలియచేయడం మొదలుపెట్టింది. ఆ పని మానుకోమని, తేకపోతే భయంకరమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని తాలిబన్లు ఆమెకు పలుమార్లు హెచ్చరికలు పంపారు. కానీ జకియా జంకలేదు. వెనకడుగు వేయలేదు. తన పనిని కొనసాగిస్తూనే ఉంది. ఒకనాటి రాత్రి జకియా నిద్రిస్తున్న సమయంలో ఆమె ఇంటిలోకి ప్రవేశించారు. 9 నెలల బిడ్డను పక్కలో పెట్టుకుని నిద్రపోతున్న జకియాజీకీపై శక్తివంతమైన మెషిన్‌గన్లతో గుండ్ల వర్షం కురిపించి హతమార్చారు. జకియాజీకీకి, రక్కా రఖియా హుస్సేన్‌కు జోహార్లర్పిద్దాం… జిందాబాద్ అని నినదిద్దాం.