లింగ వివక్షతను అధిగమించిన భారతదేశపు భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త – అన్నా మణి -చాగంటి కృష్ణకుమారి

 

యూ.ఎస్‌.లోని Massachusetts Institute of Technology లో పరిశోధకురాలైన అభా సుర్‌ భౌతిక రసాయన శాస్త్రవేత్త, ఆధునిక వైజ్ఞానిక చరిత్ర కారిణి. భారతీయ మహిళా శాస్త్రవేత్తల చరిత్రను రచించే సందర్భంలో 1992లో బెంగళూరులోని రామన్‌ పరిశోధనా సంస్థకు వెళ్ళింది. అక్కడ ఒక మహిళా శాస్త్రవేత్తను కలుసుకుని, ఆమె గురించిన వివరాలను మౌఖికంగా తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వెళ్ళింది. ఆధునిక వైజ్ఞానిక చరిత్ర కారిణిగా అభా సుర్‌ జిజ్ఞాస చాలా సబబైనది. ఎందుకంటే రామన్‌ పరిశోధనా సంస్థలోని శాస్త్రవేత్తగా పనిచేస్తున్న అన్నా మణి లింగ వివక్ష, వృత్తి పరమైన ఆమోదాలకు సంబంధించిన అనేకానేక సమస్యలను లెక్కచేయని మనస్తత్వంతో వాటిని ఎదుర్కొంటూ, అధిగమిస్తూ, విజ్ఞాన శాస్త్ర పరిశోధన, అధ్యయనాలకే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసింది.

”ఎందుకు నాతో నీకు ఇంటర్వ్యూ? నేను స్త్రీగా పుట్టడానికి, నా జీవితంలో నేను చేయదల్చుకొన్న పనులకీ ఏమీ సంబంధం లేదు. విజ్ఞాన శాస్త్రాలు – మహిళలు అంటూ ఏమిటి ఈ గడబిడంతా? ఈనాటి మహిళలకు విజ్ఞాన శాస్త్రాలలో కృషి చేయడం నానాటికీ కష్టమవుతూ ఉంది. మా కాలంలో మాకిలాంటి సమస్యలు లేవు”.

తన ఈ కామెంట్‌ వల్ల వైజ్ఞానిక చరిత్రకారిణిలో కనిపించిన ఇబ్బంది కదలికలను వినోదిస్తూనే, ధైర్యశాలి అయిన ఆ మహిళా పరిశోధకురాలు అభా సుర్‌కి గల లింగపరమైన ఆసక్తులను ప్రశ్నించింది.

”తన కాలంలో ఉన్న సాంస్కృతిక, భౌతిక అవధులను మీరు పురోగమించినా, భారతదేశపు తొలి స్త్రీ వాదులలో ఒకరిగా, గొప్ప వ్యక్తిత్వం గల మహిళామణిగా వైజ్ఞానిక రంగం అన్నా మణిని అమితంగా గౌరవిస్తూ ఆరాధిస్తుంది” అని అభా సుర్‌ ఆ భౌతిక, వాతావరణ మహిళా శాస్త్రవేత్తను కొనియాడింది.

దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని పీరుమేడులో 23 ఆగస్టు 1918లో అన్నా మణి జన్మించింది. ఈమె తండ్రి సివిల్‌ ఇంజనీర్‌. వీరు యాలకుల పంట పండించే భూస్వాములు. బాగా ఆస్తిపరులు. వీరి కుటుంబాలలో పెద్ద చదువులు చదవడానికి, వైద్యం వంటి ఉన్నత వృత్తులను చేపట్టడానికి మగపిల్లలను ప్రోత్సహించేవారు. ఆడపిల్లలు వివాహితులై, గృహిణులుగా స్థిరపడాలనే భావనతో వారిని అందుకు తగిన రీతిలో పెంచేవారు. వారి తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు, అయిదుగురు మగపిల్లలలో ఏడవ సంతానం అయిన ఈమె విలక్షణంగా ఉండేది. చదువు సంధ్యలలో అసాధారణ ఆసక్తి కనబరచేది. చాలా గొప్ప చదువరి. ఎనిమిదేళ్ళ వయసులోనే పౌరగ్రంథాలయంలో దొరికిన ప్రతి మళయాళం పుస్తకాన్ని చదివింది. ఆడపిల్లకి ఎనిమిదేళ్ళు నిండితే డైమండ్‌ చెవి రింగులను బహూకరించడం వారి ఇంటి ఆనవాయితీ. ఈమె తనకు చెవి రింగులు వద్దని చెబుతూ, అందుకు బదులుగా ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానిక’ పూర్తి సంపుటాలు కావాలని కోరింది. నగలు పెట్టుకోమంటే చిరాకు పడేది.

”స్త్రీ విలువను ఆమె ధరించే నగలతో కొలవాలనుకుంటే, మన ప్రాచీనులు, వారికి గల సంపద వివరాలను భూర్జ పత్రాలపై లిఖించి దాచుకొన్నట్లుగా స్త్రీ తనకున్న నగల గురించిన అటువంటి చిట్టానొకదాన్ని మెడకి తగిలించుకుంటే సరిపోదా? అది బాగా సులువైన పద్ధతి” అని ఒక సందర్భంలో వెటకారంగా తన తలంపును బయటపెట్టింది. (భూర్జ వృక్షాలు హిమాలయ సానువుల్లో పెరిగే పొడవాటి వృక్షాలు. తాటిచెట్టునే తాళ వృక్షమంటారు. కాగితం రాకముందు మన పూర్వీకులందరూ తాళ పత్రాల మీద భూర్జ వృక్షాల బెరడుతో తయారుచేసుకున్న పత్రాలపైన వారి రచనలు వ్రాసుకొనేవారు.)

అవి భారత జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులు. మన జాతిపిత మహాత్మాగాంధీ వీరి ఊరికి వెళ్ళినపుడు విదేశీ వస్తు బహిష్కరణ, ముఖ్యంగా బ్రిటిష్‌ వారి మిల్లు బట్టల బహిష్కరణ, స్వావలంబనల ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తూ ఉత్తేజభరితంగా ఉపన్యసించారు. ఉపన్యాసం విని ప్రభావితురాలైన ఆ పాప ఖాదీ బట్టలనే ధరిస్తానని గట్టి శపధం చేసింది. ఆమెలో జనించిన ఈ జాతీయవాద ఔత్సుకత సహజసిద్ధమైనది. మనఃపూర్వకమైనది. ఈ ఔత్సుకత వలనే ఆమె జీవితాంతం ఖాదీనే ధరించింది, అందుకు చాలా గర్వపడేది. జాతీయోద్యమం ప్రభావం వల్ల ఆమెలో చాలా తీవ్రంగా వ్యక్తిగత స్వేచ్ఛను కోరే లక్షణం అలవడింది. ఆమె తోబుట్టువులిద్దరూ చాలా చిన్న వయసులో పెద్దలు ఆశించినట్లుగా వివాహితులయ్యారు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. పై చదువులు చదువుకొంటానంది. అందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం లేదు, అలా అని చెప్పి వారామెను నిరుత్సాహపరచనూలేదు.

మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకొని 1940లో హానర్స్‌ డిగ్రీ పొందింది. భౌతిక శాస్త్రంలో పరిశోధన చేయడానికి పొందిన ఉపకార వేతనంతో బెంగుళూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో చేరింది. ఒక గ్రాడ్యుయేట్‌ విద్యార్థినిగా ప్రతిష్ఠాత్మకమైన రామన్‌ ప్రయోగశాలలో నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఆచార్య సి.వి.రామన్‌ గారి పర్యవేక్షణలో పరిశోధన చేసే అమూల్యావకాశం పొందగలిగింది.

డైమండ్‌, రూబీల వర్ణపట శాస్త్రంపై పరిశోధించింది. 32 డైమండ్‌ల ప్రతిదీప్తి, శోషణ, రామన్‌, వర్ణపటాలను నమోదు చేసి వాటిని విశ్లేషించింది. వీటి వర్ణ పటాలపై ఉష్ణోగ్రత, పోలరైజేషన్‌ల ప్రభావాలెలా ఉంటాయో ప్రయోగాలు చేసి చూసింది. ఈ ప్రయోగాలు చాలా సుదీర్ఘమైనవి. అత్యంత శ్రమతో కూడుకొన్నవి. స్ఫటికాలను గాలి ద్రవస్థితిలో ఉన్నప్పటి ఉష్ణోగ్రతల దగ్గర అనగా -1890 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుండి 1930 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంచాలి, కొన్ని డైమండ్‌లకు దీప్తి బలహీనంగా ఉంటుంది. ఇటువంటి తక్కువ దీప్తి ఉన్న స్ఫటికాలను 15 నుండి 20 గంటలపాటు కాంతికి ప్రత్యక్షరీకరించాల్సి (expose) ఉంటుంది. అప్పుడే వాటి వర్ణ పటాలు ఫోటోగ్రాఫిక్‌ పలకపై నమోదవుతాయి. మద్రాస్‌ విశ్వవిద్యాలయానికి ఆమె ఆగస్ట్‌ 1945లో పిహెచ్‌.డి థీసిస్‌ను సమర్పించింది. కానీ ఆ విశ్వవిద్యాలయం ఆమెకు పిహెచ్‌.డి. పట్టాను ప్రదానం చేయలేదు. అందుకు వారు చెప్పిన కారణం ఆమెకు ఎం.ఎస్‌.సి. డిగ్రీ లేదని! ఈనాటికి కడా ఆమె థీసిస్‌ రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గ్రంథాలయంలో మూలుగుతూ ఉంది.

పిహెచ్‌.డి పట్టా లభించకపోవడం వల్ల ఆమెకు జరిగిన నష్టమేమీ లేదు. వైజ్ఞానిక పరిశోధనా సామర్ధ్యం గల వ్యక్తికి విశ్వవిద్యాలయాల వారి పట్టాలతో పని ఏముంది? మద్రాస్‌ విశ్వవిద్యాలయం పిహెచ్‌.డి. డిగ్రీ ఇవ్వనందుకు ఆమె కృంగిపోలేదు. 1945లో లండన్‌ ఇంపీరియల్‌ కళాశాలలో ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రభుత్వం నుండి ఉపకార వేతనం పొందింది. భౌతిక శాస్త్రంలో మరింతగా అనుభవం గడించడానికి అక్కడి ఆ విభాగంలో చేరాలనుకుంది. కానీ అప్పుడు అక్కడ ఖాళీ లేదు. వాతావరణ శాస్త్ర ఉపకరణాల (meteorological instrumentation) విభాగంలో చేరింది. ఆ విభాగంలో ప్రావీణ్యతను సంపాదించింది.

1948లో పూణెలోని Indian Meteorological Department (IMD) లో చేరింది. అక్కడి రేడియేషన్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాన్ని నడిపే బాధ్యతను ఆమెకు అప్పచెప్పారు. స్ఫూర్తివంతమైన ఆమె పర్యవేక్షణలో వైజ్ఞానికులు, ఇంజనీర్ల బృందం విశేషంగా కృషి చేసింది. వాతావరణ ఉపకరణాల తయారీలో ఎప్పుడూ నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చేది. నాసిరకం పనిముట్లు ఎన్ని ఉంటే ఏమి ప్రయోజనం? ”నిక్కమైన ఆణిముత్యంబొక్కాటి చాలు, తళుకుబెళుకురాళ్ళు తట్టెడేల?” అన్నట్లుగా ”రాశి కన్నా వాసినే” కోరుతూ తనకింద పనిచేస్తున్న వారితో ఎప్పుడూ ”ఇంతకంటే మంచి విధానాన్ని రూపొందిచగలరేమో చూడండి” అనేది. ప్రతి ఒక్కరిలో నిద్రాణమై ఉన్న నాణ్యమైన నైపుణ్యాన్ని వికసింపచేయడంలో ఆమె నాయకత్వం తిరుగులేనిది.IMD వారు 1953లో 121 మంది పురుషులు పనిచేస్తున్న విభాగానికి అధిపతిగా పదోన్నతినిచ్చారు. IMDలో మూడు దశాబ్దాలపాటు పనిచేసింది. అంతర్జాతీయ ఉపకరణాలను పోల్చి చూడడం, జాతీయ వాతావరణ ఉపకరణాల ప్రామాణీకరణం, వాతావరణ ఓజోన్‌ వంటి పలు అంశాలపై పరిశోధనా పత్రాలను ప్రచురించింది. దాదాపుగా ఒక వంద వాతావరణ ఉపకరణాల రేఖా చిత్రాలను ప్రామాణీకరించింది. వాటి తయారీని ప్రారంభించగలిగింది. అంతర్జాతీయ భూ భౌతిక సంవత్సరమైన (The International Geophysical Year) 1957-58లో సోలార్‌ రేడియేషన్‌ను కొలవగల కేంద్రాల నెట్‌వర్క్‌ను భారతదేశంలో నెలకొల్పింది.

ఓజోన్‌ సోన్డె అనే ఓజోన్‌ను లెక్కకట్టే పరికర నిర్మాణంలో మార్గదర్శకత్వాన్ని వహించింది. దీనివల్ల భారతదేశం ఓజోన్‌ పొర గురించిన విశ్వసనీయ సమాచారాన్ని సేకరించగలిగింది. ఈ పరికరపు గొప్పదనాన్ని గుర్తించిన ప్రపంచ వాతావరణ సంఘం వారు అంతర్జాతీయ ఓజోన్‌ కమిషన్‌లో ఆమెను సభ్యురాలిగా చేర్చుకున్నారు. ఓజోన్‌ సోన్డె పరికరం గల అతి కొద్ది దేశాల్లో భారతదేశం కూడా ఒకటి కావడానికి ముఖ్యంగా ఈ మహిళా శాస్త్రవేత్తే కారణమయింది, ఆ ఘనత ఆవిడదే. ఒక వాతావరణ శాస్త్ర వేదశాలను నెలకొల్పమని 1963లో విక్రమ్‌ సారాబాయ్‌ కోరిన మీదట వాతావరణ శాస్త్ర వేదశాలను, ఇన్‌స్ట్రుమెంట్‌ టవర్‌ని, తుంబా రాకెట్‌ లాంచింగ్‌ను తుంబా దగ్గర నెలకొల్పింది.

1962 IMD డిప్యూటీ జనరల్‌గా రిటైరయిన తర్వాత రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా మూడు సంవత్సరాలు పనిచేసింది. బెంగుళూరులోని నందికొండల దగ్గర మిల్లీమీటర్‌-వేవ్‌ టెలిస్కోప్‌ను అమర్చింది. బెంగుళూరు పారిశ్రామిక వాడలలో గాలి వేగాన్ని, సౌరశక్తినీ కొలిచే ఉపకరణాలను తయారుచేసి ఒక చిన్న కంపెనీకి అధిపతి అయ్యింది. అక్కడ ఆమె వహించిన ఆధిపత్యంలో 30 మంది పనిచేసేవారు. అందరూ మగవారే. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి రాగానే ఉల్లాసంగా ఒక్క ఉదుటున లేచి నిలబడినట్లు వారంతా ఆమె రావడంతోనే లేచి నిలబడేవారు.

1980లో The Handbook for Solar Radiation for India, 1981లో Solar Radiation over India పుస్తకాలను ప్రచురించింది. భారతదేశంలోని సౌర ఉష్ణ వ్యవస్థలలో పనిచేసే వారికి ఈ రెండు సంపుటాలు సంప్రదింపు పుస్తకాలుగా వాడుకలోకి వచ్చాయి. తన మాతృదేశమైన భారతదేశంలో వాయుశక్తి ఉత్పాదనకి గొప్ప అవకాశముందని గ్రహించి 1983లో Wind Energy Data for India పుస్తకాన్ని రచించి ప్రచురించింది. దేశవ్యాప్తంగా వాయుశక్తి ఉత్పాదన కేంద్రాలు ఏర్పడుతున్నాయంటే అందుకు పరపత్తెం కొంతమేరకు ఈ మహిళామణికి దక్కుతుంది. విద్యా విషయక రంగాలకీ, పారిశ్రామిక రంగాలకీ మధ్య వంతెన వేసిన కొద్దిమంది శాస్త్రవేత్తల్లో అన్నా మణి ఒకరు.

అడవి దారుల వెంట సుదీర్ఘమైన పాదయాత్రలను, పక్షులను పరిశీలనగా చూడడాన్ని ఆమె బాగా ఇష్టపడేది. పర్యావరణ సమస్యలపట్ల ఉత్సుకతతో ఉండేది. కానీ ఎప్పుడూ తానొక పర్యావరణవేత్తగా చెప్పుకొనేది కాదు.

Indian National Science Academy (INSA) 1977లో ఆమెను కౌన్సిల్‌ మెంబర్‌గా ఎన్నుకొంది. ఆబాధ్యతలో ఆమె 1982 నుండి 84 వరకు వ్యవహరించింది. Indian Meteorological Society, royal Meteorological Society, Institution of Electronics and Telecommunication Engineers, International Solar Energy Society వంటి అనేక అంతర్జాతీయ సంఘాలలో ఫెలో మెంబర్‌ అయింది. వాతావరణ ఓజోన్‌పై చేసిన పరిశోధనకు గాను 1987లో INSA నుండి KR Ramanathan మెడల్‌ని అందుకుంది.

సాంఘిక, భౌతిక అవధులను మీరి, లింగ వివక్షతకు తలొగ్గక ఎదురొడ్డి, అధిగమించి నిలబడింది. ప్రయోగశాలలో పరికరాల వాడుకలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అది ఆడవారి చేతకానితనంగా మగవారు హేళన చేయడాన్ని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న రోజుల్లోనే, సి.వి.రామన్‌ వంటి శాస్త్రవేత్తతో కలిసి పనిచేసినప్పటికీ, మహిళ అయినందువల్ల పురుష శాస్త్రవేత్తల శాస్త్రీయ చర్చలలో పాల్గొనే అవకాశాన్నిచ్చేవారు కాదు. ఆ విధంగా వృత్తిపరమైన ఒంటరితనాన్ని అనుభవించింది. విజ్ఞాన శాస్త్రాలు, జాతీయత, లింగ సంబంధిత భావజాలాల సంగమంలో నిలవగలిగిన బహు కొద్దిమంది ఛాంపియన్‌లలో ఈ నారీమణి ఒకరు. 1994లో ఆమెకు తొలిసారి గుండె పోటు వచ్చింది. ఆ తర్వాత ఆమె జీవితంలో చురుకుతనం పోయింది. 2001 ఆగస్టు 16న తిరువనంతపురంలో చనిపోయింది. ఈ మహిళా రత్నం విజయవంతమైన జీవితం ఆడవారికే కాక మగవారికి కూడా స్ఫూర్తి దాయకమే.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.