పత్తిలాంటి తెల్లని వెంట్రుకలు, ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండే ఎనభై మూడేళ్ళ జ్ఞానశేషంను చూస్తే ఆమె ఒక విశేష వ్యక్తని చెప్పడానికి అవకాశమే లేదు. కానీ, శ్రీలంక దేశపు ప్రజలు ప్రేమతో ‘గెత్సీ’ అని గుర్తించే ఈమె తాను చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి 2017లో ప్రతిష్టాత్మకమైన ‘మెగనెసే’ అవార్డును అందుకున్నారు.
1934లో నవాల పిటియాలో జన్మించిన జ్ఞానశేషం (గెత్సి) విద్యాభ్యాసం క్యాండీలో జరిగింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన గెత్సి వివాహానంతరం జాఫ్నాకు వెళ్ళి తన సంసార జీవితాన్ని సాగించింది. మూడు దశాబ్దాల క్రితం శ్రీలంకలో శీతల యుద్ధం నిత్యపు కథగా ఉండేది. ప్రత్యేక తమిళ రాష్ట్రమన్న తమ అంతిమ గురిని సాధించడానికి బలవుతున్నవారు మాత్రం అక్కడి పల్లెల్లోని ముగ్ద మనుషులు. అందులోనూ ముఖ్యంగా బయట ప్రపంచంలో కష్టపడుతున్న మగవారు పేరుకు కనబడకుండా మాయమయ్యేవారు. యుద్ధ పరిణామం ప్రతి ఒక్కరికీ భీకరమని అనిపించినప్పటికీ మహిళలు, పిల్లల పరిస్థితి చింతాజనకంగా ఉండేది.
బయటి ప్రపంచంతో ఎలాంటి సంపర్కం లేకుండా తమ పాటికి తాము ఉంటున్న మహిళలకు హఠాత్తుగా సంపాదించే భర్త కనుమరుగై పోవడంతో జీవితం గడపడమెలా అని చింతించాల్సిన పరిస్థితి. చదువు లేదు, వ్యవహార జ్ఞానం శూన్యం. మరి సంసారం నడిచేదెలా? సరిగా దుఃఖించడానికి కూడా సమయం లేక హఠాత్తుగా సంసార భారం నెత్తినపడడంతో ఆ మహిళల పాట్లు చెప్పనలవి కాదు. భర్తల చావుకు కారణం తెలియని బాధ, భయం, అభద్రత, ఖిన్నత. ఇలా జీవితమంతా అనేకమైన మానసిక సమస్యలతో విలవిల్లాడేవారు. దానికి తోడు సామాజికంగా వారు బహిష్కృతులు. వితంతువులన్న పేరుతో వారిని అశుభులని పరిగణించేవారు. అలా భర్తలను పోగొట్టుకున్న మహిళలు రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి లేదు, నొసటిపై కుంకుమ పెట్టుకోవడానికి లేదు. సాయంత్రానంతరం ఎవరైనా అలాంటివారి ఇంటికి వస్తే ఆ మహిళల గురించి అపోహలు, అనుమానాలు. పరపురుషులతో మాట్లాడితే అనైతిక సంబంధాలు కల్పిస్తారు. ఇలా అడుగడుక్కూ అపవాదాలతో, మొత్తంగా ఎవరికీ పనికిరాని, ఎవరికీ అక్కరలేని వస్తువులుగా పడివుండే స్థానం అలాంటి మహిళలది.
ఇక తండ్రులను పోగొట్టుకున్న పిల్లలు ఎప్పుడూ కోపంగానూ, దుఃఖంగానూ ఉండే తల్లులతో జీవితం గడపాల్సిన వారి గతి ఇంకా హీనాతిహీనం. తల్లుల అత్యంత కఠినమైన రక్షణ కనబరచే మనోభావం, తండ్రిలేని బిడ్డలన్న కారణంతో చుట్టుపక్కలవారు అనే పరుష మాటలు, జీవితాన్ని ఎలా గడపడమా అన్న ఆ తల్లుల వేదన, చాలా చిన్న వయసులోనే పాఠశాల చదువులకు స్వస్తి చెప్పి శారీరక శ్రమ చేయవలసిన అనివార్యత. ఇలా ఒకే విధమైన ఒత్తిడులతో కూడిన పరిస్థితి ఆ అమాయక బాలబాలికలది. ఇలాంటి క్లిష్ట సందర్భ సమయాల్లో ఆప్త సమాలోచనరాలుగా (కౌన్సిలర్‌గా) వృత్తి జీవితం గడుపుతూ పాఠశాల, కాలేజీలలో చదువుతున్న విద్యార్థులతో కలిసి పనిచేస్తుండే గెత్సి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (ఎన్జీఓ) ద్వారా యుద్ధ సంబంధమైన అఘాతంలో చిక్కుకొన్న మహిళలు, పిల్లల గురించి అధ్యయనం జరిపి వివరాలను సంగ్రహించింది. వీథి పిల్లలు, ఇల్లు విడిచి పారిపోయినవారు, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న పిల్లల పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించి, బాధ చెంది యుద్ధపీడిత ప్రజలకు కౌన్సిలింగ్ ఇవ్వడమే కాక అలాంటి పిల్లలకు విద్యావసతులను కల్పించారు. గ్రామ సమాజంలో ఉన్న ఇలాంటి పిల్లలను ఒకచోట చేర్చి వారిని పాలించి పోషించడమే కాక వారితోపాటు ఆ పిల్లల తల్లులకు సహాయపడేలా ప్రణాళికలను రూపొందించారు గెత్సి.
యుద్ధ సంబంధమైన ప్రభావాలు ఎక్కువగా ఉన్న శ్రీలంకలోని ఉత్తరం, అలాగే తూర్పు ప్రాంతాలలోని గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆయా గ్రామాలలోని ప్రజల మనసులను ఈ ప్రణాళికల వైపు మళ్ళించి వారిని అంగీకరింపచేయడంలో గెత్సి నిర్వహించిన పాత్ర చాలా మహత్తరమైనది. యుద్ధం-పోరాటాల సందర్భాలలో పిల్లలు, వారి తల్లుల సహాయానికి వెళ్తున్న గెత్సి వ్యక్తిగతమైన అపాయాలను కూడా లెక్కచేయక పల్లె పల్లెకూ ఒంటరిగా సంచరిస్తుండేది.
యుద్ధంలో భర్తలను పోగొట్టుకున్న మహిళలను వితంతువులని పిలిచే విషయంలో గెత్సి వ్యతిరేకత వ్యక్తం చేస్తుండేది. భర్తలను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న స్త్రీలను ఈ అవమానకరమైన పేరు చాలా బాధపెెడుతుంది, అందువల్లే ఇలాంటి నిర్భాగ్యులను ‘అమ్మ’ అని
పిలవాలని అంటారు గెత్సి. కష్టాలతో రోసిపోయి హృదయంలేని రాళ్ళలాగా తయారైన మహిళలను ప్రేమతోనూ, ఆత్మవిశ్వాసం పెంపొందించే మాటలతోనూ, అలాంటి నడవడితోనూ వీరిని సమాజపు ముఖ్యవాహినిలో చేర్చే ప్రయత్నం చేశారు గెత్సి. దాంతోపాటు ఈ మహిళలకు ఆర్థిక స్వావలంబన మార్గం చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దశలో ప్రభుత్వం సహాయంతో వారి ఇళ్ళలోనే బొమ్మలు తయారుచేయడం, పళ్ళరసం చేయడం, గోళించిన కారపు పదార్ధాలు తయారుచేయడం, కుట్టుపని లాంటి వ్యాపకాలను మహిళలకు నేర్పారు. వీరు తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెట్‌ను సమకూర్చారు. తమలో అంతర్గతంగా ఉన్న బాధను మహిళలు బయటకు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని తెలుపుతూ, ఇతర మార్గాలకు తోడుగా నృత్యం చేయడం ఒక మంచి మార్గమని అంటారు గెత్సి. సామాన్యంగా ఇలాంటి మహిళలు ఇల్లు విడిచి తమకు తాముగా నృత్యం చేయడాన్ని సమాజంలో తప్పుగా భావిస్తారు. నృత్యంలో కలిగే చలనాలు ఇలాంటి తప్త హృదయుల మనసులను తేలికపరుస్తుందని సూచించి గెత్సి వారికి మద్దతునిచ్చారు.
ఆప్త సమాలోచనలు (కౌన్సిలింగ్) చేయడం చాలా సులభమని, దాని ఫలితం వెంటనే కలగాలని జనాలు కోరతారు. కానీ, అది సజావుగా నెరవేరాలంటే అది చాలా సమయాన్నే కోరుతుంది. ఎవరంటే వారు కౌన్సిలర్లు కావడం సాధ్యం కాదు. ఆ పనికి సిద్ధంగా
ఉండే మూల సూత్రాలు లేవు. ఆ పనిని సరిగా చేయాలంటే అలాంటి మనుషుల జీవితాలను బాగా అర్ధం చేసుకోవాలి. కౌన్సిలింగ్ వృత్తిని చేపట్టిన వారు ఎదుటివారి ఆత్మను తమ ఆత్మతో స్పర్శించినపుడే కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. మహిళా కౌన్సిలర్ల సంఖ్య బాగా పెరగాలని గెత్సి అభిప్రాయపడతారు. తనకు లభించిన ‘మెగనెసే’ అవార్డు అనిరీక్షితమని ఆమె అంటారు. 2017 ఆగస్టులో మనీలాలో ఆ అవార్డు మహోత్సవం జరిగింది. సమాజంలోని అతి క్రింది వర్గాలలో పనిచేస్తున్న తనది ఏమంత గొప్ప సాధన కాదని, నిజానికి ఈ గౌరవం పూర్తిగా శ్రీలంక దేశానికి లభించినటువంటిదని ఆమె అన్నారు. 80 ఏళ్ళ ఈ వయసులో మహిళలు, పిల్లలతో తాను చేస్తున్న పని తనకు తృప్తిని, సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపిన గెత్సి తనకు లభించిన మెగనెసే అవార్డు గౌరవాన్ని ఇనుమడింపచేశారు.