మరో వెండితెర విషాదరాణి… మీనాకుమారి -రొంపిచర్ల భార్గవి

ఆలోచిస్తే మన తెలుగు నటి సావిత్రికీ, హిందీ నటి మీనాకుమారికీ ఉన్న పోలికలు… నట జీవితంలో కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండీ… ఆశ్చర్యమనిపిస్తుంది.

ఇద్దరూ తాము నటించిన చిత్రాలలోని పాత్రలతో (1950-60 దశకాలలోని) మధ్యతరగతి కుటుంబ స్త్రీకి నమూనాగా నిలిచారు.

ఇద్దరూ ఎక్కువ విషాద చిత్రాల నాయికలుగానే రాణించేవారు.

ఇద్దరూ విషాద సన్నివేశాలలో గ్లిసరిన్‌ అవసరం లేకుండా (మరీ ఒక్క కంటి నుండే, రెండే కన్నీటి బొట్లు రాల్చడం లాంటి అతిశయోక్తులు కాదు కానీ) కన్నీరు కురిపించగల సహజ నటీమణులుగా రాణించారు.

సంభాషణలు పలకడంలో ఇద్దరికీ మంచి పేరుంది.

అమితాబ్‌ లాంటి సూపర్‌ స్టార్‌ కూడా మీనాకుమారి లాగా ఎవరూ డైలాగ్‌ చెప్పలేరంటాడు. ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌ కూడా మీనాకుమారి ముందు డైలాగ్‌ చెప్పడానికి జడిసేవాడంటారు. మన సావిత్రి విషయానికొస్తే యస్వీ రంగారావు ”అమ్మో సావిత్రితో నటిస్తున్నాం, జాగ్రత్తగా ఉండాలి” అనేవారంటారు కదా.

ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రే మీనాకుమారి నటనను ”సాహిబ్‌, బీబీ ఔర్‌ గులామ్‌”లో చూసి

”ఉన్నత శ్రేణికి చెందిన నటీమణి” అని ప్రశంసించాడంటారు.

విచిత్రంగా ఇద్దరూ రెండు పెళ్ళిళ్ళయి పిల్లలున్న వ్యక్తులనే భర్తలుగా స్వీకరించటమే కాకుండా ఇద్దరూ పెళ్ళయిన తర్వాత కొంతకాలం తమ వివాహాన్ని గోప్యంగా ఉంచారు. మీనాకుమారి తమ వివాహమయిన విషయాన్ని ఒక సంవత్సర కాలం పాటు దాస్తే, సావిత్రి మరి కాస్త ఎక్కువ కాలం మూడు, నాలుగేళ్ళు దాచినట్టుంది.

మరణంలో కూడా ఇద్దరికీ సారూప్యత ఉంది. అదేమిటంటే ఇద్దరూ మద్యపానమనే వ్యసనానికి బలై చిన్న వయసులోనే మరణించడం.

మీనాకుమారి తన 38వ ఏట మరణిస్తే, సావిత్రికి మరణించేటప్పటికి నలభై అయిదేళ్ళ వయసంటారు.

ఇద్దరూ మరణించే సమయానికి భర్తల నుండీ విడిగా జీవిస్తూ ఉండటం కూడా విచిత్రమయిన విషయమే.

ఇద్దరికీ ఒకరితో ఒకరికి పరిచయముంది, ఒకరిపట్ల ఒకరికి గౌరవముంది.

మీనాకుమారి నటించిన హిందీ చిత్రాలు తెలుగులో తీసినపుడు ఆమె పాత్ర సావిత్రి వేస్తే, తెలుగులో సావిత్రి నటించిన చిత్రాలు హిందీలో తీసినపుడు ఆమె పాత్రలో మీనాకుమారి చేసేదట.

ఉదాహరణలు: మిస్సమ్మ – మిస్‌ మేరీ, ఏక్‌ హీ రాస్తా – కుంకుమ రేఖ.

ఒక హిందీ సినిమాకి సావిత్రిని హీరోయిన్‌గా తీసుకోమని మీనాకుమారి రికమండ్‌ కూడా చేసిందట.

ఈ పోలికలన్నీ పక్కనబెడితే ఇద్దరూ చిత్ర ప్రపంచంలోనే కాక నిజ జీవితంలో కూడా విషాద రాణులుగా తయారవ్వడానికి కారణమేమిటి? వారి మనస్తత్వమా, పరిస్థితులా, చిన్నతనం నుండీ కరువయిన ప్రేమాభిమానాలా? వీటన్నింటికీ సమాధానాలు కొంతవరకు వారి జీవిత చరిత్రలను పరిశీలిస్తే అర్థమవుతాయి.

మీనాకుమారి బాలనటిగానే సినిమాలలో ప్రవేశించింది. ఆమెను సినిమాలకు పరిచయం చేసింది సొంత తల్లిదండ్రులే.

మీనాకుమారి తండ్రి పేరు ఆలీబక్ష్‌. ప్రస్తుతం పాకిస్థాన్‌కి చెందిన ”బెహరా” అనే గ్రామానికి చెందినవాడు. చిన్ననాటి నుండీ సంగీతం పట్ల మక్కువ చూపేవాడు. హార్మోనియం వాయించేవాడు. అందరూ మాస్టర్‌ ఆలీబక్ష్‌ అనేవారు. తన అదృష్టాన్ని వెతుక్కుంటూ బొంబాయి చేరి, నాటకాలలో హార్మోనియం వాయిస్తూ సినిమాలలో కూడా చిన్నా చితకా పాత్రలు వేస్తూ, సంగీతం సమకూరుస్తూ ఉండేవాడు. అప్పటికే అతనికి పెళ్ళయి పిల్లలున్నారు.

మీనాకుమారి తల్లి అతనికి రెండో భార్య.

మీనాకుమారి తల్లి వైపు మూలాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీనాకుమారికి ప్రముఖ కవి, రచయిత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌తో బంధుత్వం ఉంది. అదెలాగంటే మీనా అమ్మమ్మ హేమసుందరీ దేవి, రవీంద్రుని సోదరుడైన సుకుమార్‌ ఠాగూర్‌ కుమార్తె. ఆమె మొదటి భర్త చనిపోయాక మీరట్‌ చేరుకుని ప్యారేలాల్‌ అనే క్రిస్టియన్‌ని పెళ్ళి చేసుకుంది. అతను ఒక ఉర్దూ పత్రికకి జర్నలిస్ట్‌గా పనిచేసేవాడు. వారి కుమార్తెలిద్దరిలో ఒకామె మీనాకుమారి అమ్మ ప్రభావతి. ప్యారేలాల్‌ చనిపోయాక ఆ కుటుంబం కొన్నాళ్ళకు కలకత్తా తిరిగి వచ్చి తర్వాత బొంబాయి చేరుకుంది.

ప్రభావతి నాటకాలలో నటిగానూ, డాన్సర్‌గానూ పనిచేస్తుండగా ఆలీబక్ష్‌తో పరిచయం కలిగింది. ఇద్దరూ ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు. ప్రభావతి ‘ఇక్బాల్‌ బేగం’ అయింది. వారికి వరుసగా ఖుర్షీద్‌, మహజబీన్‌, మధు అనే ముగ్గురు ఆడపిల్లలు కలిగారు. ఆ మహజబీనే మన ”మీనాకుమారి”. ఆమెను చిన్నప్పుడంతా ”మున్నా” అని పిలిచేవారట. ఆమెకు ఇంకా రెండు నిక్‌ నేమ్స్‌ ఉన్నాయి. భర్త కమల్‌ అమ్రోహీ ”మంజూ” అనేవాడు. మరో పేరు ”నాజ్‌” అనే పేరుతో ఆమె కవితలు, గజల్స్‌, కథలు రాసేది. సరే మళ్ళీ ఆమె బాల్యానికి వద్దాం. బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమ లభించని వారికి ఆ లోటు జీవితాంతం వెంటాడడమే కాక వారి జీవన గమనంలో కొన్ని బలహీనతలకు లోనయ్యేట్టు కూడా చేస్తుందనుకుంటా. మీనాకుమారి పుట్టుక, పెంపకం, ఆమె అనుభూతులను పరిశీలిస్తే అలాగే అనిపిస్తుంది.

ఆమె తల్లిదండ్రులిద్దరూ మొదటి కూతురు ఖుర్షీద్‌ తర్వాత కొడుకు పుడతాడనుకుంటే నిరాశపరుస్తూ మళ్ళీ ఆడపిల్ల మహజబీన్‌ పుట్టింది. హాస్పిటల్‌ బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆ పిల్లను భారంగా భావించిన ఆలీబక్ష్‌ ఒక అనాధాశ్రమం అరుగుమీద ఆ పాపను వదిలేసి వచ్చాడట. కొంతదూరం వెళ్ళాక ఎందుకో చెవులలో ఆ పాప ఏడుపు వినిపించినట్లయి వెనక్కు వచ్చి చూస్తే ఒంటి నిండా చీమలు పీకుతుంటే ఎర్రగా కందిపోయి ఏడుస్తున్న ఆ పాపను ఎత్తుకుని ఇంటికి తిరిగి వచ్చాడట. ఆ చీమలు చేసిన గాయాలు అప్పుడే మానిపోయాయి. అయితే తల్లిదండ్రులు తనను వద్దనుకున్నారన్న విషయం తెలిసిన తర్వాత అది చేసిన గాయం మాత్రం మానలేదు. తాను ఎంత పెద్దయినా, ఎంత పేరు తెచ్చుకున్నా ఆలీబక్ష్‌, ఇక్బాల్‌ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో పాటు ఇక్బాల్‌ బేగం ఆరోగ్య పరిస్థితి కూడా దిగజారడంతో పెద్ద కూతురు ఖుర్షీద్‌తో పాటు మహజబీన్‌ కూడా బాలనటిగా సినిమాలలో ”బేబీ మీనా” పేరుతో ప్రవేశించింది. అలా స్కూలుకెళ్ళి చదువుకోవాల్సిన నాలుగేళ్ళ వయసులోనే మీనాకుమారి తన కుటుంబానికి సంపాదించి పెట్టే ఒక దిక్కయింది. ఆమెకు మొట్టమొదట అవకాశమిచ్చిన వ్యక్తి విజయ్‌ భట్‌, చిత్రం పేరు ‘లెదర్‌ ఫేస్‌’, పారితోషికం పాతిక రూపాయిలు.

1932 (1933 అని కొన్ని చోట్ల రాసి ఉంది) ఆగస్టు ఒకటిన బొంబాయిలో జన్మించిన మహజబీన్‌ (మీనాకుమారి) బాల్యమంతా దాదర్‌ తూర్పు రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో దాదాసాహెబ్‌ ఫాల్కే రోడ్డులో ఉన్న చిన్న ఒకే ఒక్క కిటికీ ఉన్న ఒంటి గది ఇంటిలో గడిచింది. ఒక పక్క అనాథాశ్రమం, ఇంకో పక్క రూప్‌ తారా స్టూడియో ఉండేవి. ఆ స్టూడియో ఆవరణలో మహజబీన్‌ ఆడుకుంటూ ఉండేది.

ఆమెకు బాల్యంలో మధుర జ్ఞాపకాలేమీ లేవు. తండ్రి ఆలీబక్ష్‌ కరుకుగా, క్రమశిక్షణగా, నిర్దాక్షిణ్యంగా ఉండే మనిషయితే తల్లి ఇక్బాల్‌ బేగం కొంత దయగా, ప్రేమగా, నవ్వుతూ, నవ్విస్తూ ఉండే మనిషి. ఇలాంటి భిన్న ధృవాల్లాంటి మనుషులని బహుశా సంగీతమే కలిపి ఉంటుంది అంటాడు మీనా జీవిత చరిత్ర రాసిన వినోద్‌ మెహతా.

అయితే తల్లిదండ్రులిద్దరూ తాము కోరుకున్న మగ సంతానానికి బదులుగా పుట్టిన మహజబీన్‌ను వివక్షగానే చూసేవారు. ప్రతిక్షణం ఆ విషయం గుర్తు చేస్తూ నీ వల్ల ఏం ఉపయోగం లేదన్నట్లుగా ప్రవర్తించేవారు.

అక్క ఖుర్షీద్‌ అప్పటికే బాలనటిగా సినిమాలలో నటిస్తూ ఉండడంతో ఆమెను ప్రత్యేకంగా చూసేవారు. ఆమె తొడిగి వదిలేసిన బట్టలు తొడుక్కునీ, ఆమె తినగా మిగిలిన మిఠాయిలు తినీ (మిఠాయిలంటే ఆమెకు చాలా ఇష్టం) పెరిగింది మహజబీన్‌.

నిన్న, మొన్నటి రోటీల్లో ఉల్లిపాయా, పచ్చిమిరపకాయ నంజుకుంటూ తినడం అలవాటయి అదే ఇష్టంగా మారి కూర్చుంది. ఆలాంటి రోటీని ”బాసీరోటీ” అంటారట. తర్వాత కాలంలో తాను కూడా సినిమాలలో చేరి సంపాదించడం మొదలుపెట్టాక తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు రావడం, తనను విలువగా చూడడం గమనించింది మహజబీన్‌. ఏ మనిషినీ నమ్మకూడదని ఆనాడే నిర్ణయించుకుందేమో అంటాడు వినోద్‌ మెహతా.

ఆర్థిక ఇబ్బందులతో పాటు, ఇక్బాల్‌ బేగం అనారోగ్యం తోడయి భార్యా భర్తల మధ్య తగాదాలు రేగుతూ ఉండేవి. తల్లిదండ్రుల తగాదాల మధ్య చిన్నపిల్లలెలా నలిగిపోతారో, వారెలా బలిపశువులవుతారో తెలియడానికి మహజబీన్‌ బాల్యమే

ఉదాహరణ.

ఇలాంటి పరిస్థితులలో ఆమె నటిగా ఎలా ఎదిగిందో పరిశీలిస్తే… నిర్మాత, దర్శకుడు, ప్రకాష్‌ స్టూడియో అధినేత అయిన విజయ్‌భట్‌ తొలిసారి ”లెదర్‌ ఫేస్‌” అనే సినిమాలో అవకాశమిచ్చాడని చెప్పుకున్నాం కదా. అందులో జైరాజ్‌ అనే నటుడికి కూతురుగా నటించింది మహజబీన్‌. ఈత నేర్చిన చేపపిల్లలా కెమెరా ముందు భయం లేకుండా నటిస్తున్న మహజబీన్‌ని చూసి ముచ్చటపడి తన సినిమాలలో వరుసగా అవకాశమిస్తూ మహజబీన్‌ పేరును ”బేబీ మీనా”గా మార్చాడు విజయభట్‌.

బేబీ మీనాగా ఆమె నటించిన చిత్రాలు ‘అధర్‌ కహానీ, ఏక్‌ హీ ఫల్‌, పూజా, నయీ రోషనీ, బెహన్‌, కసౌటీ, గరీబ్‌”. వీటిలో విజయ్‌ భట్‌ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఆమెది మధురమైన కంఠం. దానికి తండ్రి శిక్షణ, తల్లి ప్రోత్సాహం కూడా తోడయ్యింది. చిన్ననాటి చిత్రాలలో ఆమె పాటలు చాలావరకూ ఆమే పాడుకునేది. ఆమె సామర్ధ్యాన్ని గమనించిన ప్రముఖ సంగీత దర్శకుడు అనిల్‌ బిశ్వాస్‌ ”బెహన్‌” అనే సినిమాలో ఆమె పాటలు ఆమెతోనే పాడించాడు.

ఆమె మంచి చదువరి కూడా. బడికి వెళ్ళి చదవకపోయినా ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ భాషలను ఇంట్లో ట్యూషన్‌ పెట్టి చదివించాడు అలీభక్ష్‌. దాంతో టైం దొరికినప్పుడల్లా స్టుడియోలో ఒక మూలకెళ్ళి చదువుకుంటూ ఉండేది. అందరూ ఆమెను ”రీడింగ్‌ మహజబీన్‌” అని పిలిచేవారు. ఉర్దూలో చక్కని కవిత్వం, గజల్స్‌, కథలు కూడా రాస్తుండేది. ఆమె కవిత్వం పుస్తకాలుగా వెలువడింది. ఖయ్యూం దర్శకత్వంలో ఆమె గజల్స్‌ను స్వయంగా పాడగా, ఒక ఎల్‌పి కూడా రిలీజయింది.

బాలనటిగా ఆమె చివరి చిత్రం ‘బచ్‌పన్‌ కా ఖేల్‌’. అయితే అక్కడితో ఆమె ‘ఖేల్‌’ ముగియలేదు. ”బేబీ మీనా” మీనాకుమారిగా ఎదిగి పెద్ద పాత్రలలో నటించడం మొదలుపెట్టింది. సాధారణంగా బాలనటులందరూ పెద్దయి ప్రముఖ నటులుగా గుర్తింపబడటం అరుదు. చాలామంది కరిగిపోయే వారి బాల్యంతో పాటు కనుమరుగవుతుంటారు. మీనాకుమారికి అలా కాకుండా వెంట వెంటనే చిత్రాలు రావడం, ఆమె మంచి నటిగా నిరూపించుకునే అవకాశం రావడం అదృష్టం. ఆమెతో పాటు బాలనటులుగా ఉండి పెద్దయ్యాక నటులుగా పేరు తెచ్చుకున్నవారు ”బేబీ ముంతాజ్‌”గా పిలవబడిన అందాల తార ”మధుబాల”, ప్రముఖ నాట్య తార ‘కుకూ’. మీనాకుమారి సంపాదనతో అలీబక్ష్‌ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. దాదర్‌ ప్రాంతం వదిలేసి 1946లో బాంద్రాలో చిన్న బంగ్లా కొనుక్కున్నారు. అందులో ప్రవేశించిన సుమారు పద్దెనిమిది నెలలకు 1947 మార్చిలో ఇక్బాల్‌ ఊపిరి తిత్తుల కేన్సర్‌తో బాధపడి మరణించింది. ఇక ఆ ముగ్గురు ఆడపిల్లలకి ఆలీభక్షే అమ్మా, నాన్న. సుమారు 14 ఏళ్ళ వయసులోనే హీరోయిన్‌గా మారిన మీనాకుమారి, బాల నటి నుండి సీరియస్‌ నటిగా ఎదిగే మధ్య కాలంలో నటించినవన్నీ పౌరాణిక, జానపద చిత్రాలే. ఆ చిత్రాలన్నింటికీ నిర్మాత, దర్శకుడు హోమీ వాడియా. ఆయనకొక స్టూడియో కూడా ఉండేది.

అలా ఆమె ముస్లిం అయినప్పటికీ, ”లక్ష్మీ నారాయణ్‌, వీరఘటోత్కచ్‌, హనుమాన్‌ పాతాళ్‌ విజయ్‌, శ్రీ గణేష్‌ మహిమ” లాంటి చిత్రాలలో చక్కటి హిందూ దేవతల పాత్రలు ధరించి మెప్పించడం విశేషం. చివరగా ఆమె నటించిన జానపద చిత్రం పేరు ”అల్లావుద్దీన్‌ లాంప్‌” – 1950. ఆ చిత్రం పెద్ద హిట్‌, దానికి అందుకున్న పారితోషికం పదివేలు. దాంతో ఆమె ఒక సెకండ్‌ హాండ్‌ ”ప్లిమత్‌” కారు కొని డ్రైవింగ్‌ కూడా నేర్చుకుంది.

ఆ తర్వాత తనను బాలనటిగా ప్రోత్సహించిన విజయ్‌భట్‌ పెద్దయ్యాక కూడా తన సినీ జీవితంలో మంచి బ్రేక్‌కి కారణమయ్యాడు. ఆయన తీసిన ”బైజుబావరా” విజయఢంకా మోగించింది. నటిగా మీనాకుమారినీ, గాయకుడిగా మహ్మద్‌ రఫీని, సంగీత దర్శకుడిగా నౌషాద్‌నీ ఒక స్థాయిలో నిలిపిన చిత్రం అది. తర్వాత మీనాకుమారి విజయ పరంపర కొనసాగింది.

ఆమె జీవితంలో కూడా ఒక తమాషా జరిగింది. అది ఆమె జీవితంలో ముఖ్యమయిన మలుపుకి కారణమయింది. అదేమిటంటే ప్రముఖ రచయిత, దర్శకుడు, సంభాషణల కర్త, పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరొందిన వాడు, అప్పడే తాజాగా సూపర్‌ హిట్‌ అయిన ”మహల్‌”తో ప్రజలందరూ ఆరాధిస్తున్న కమల్‌ అమ్రోహిని మీనాకుమారికి అశోక్‌ కుమార్‌ ద్వారా పరిచయమయ్యాడు. తొలిచూపులోనే ఆమె అతని ఆకర్షణలో పడిపోయింది. ఆ తర్వాత అది ఎలా పరిణమించిందంటే…

అసలు ఈ కమల్‌ అమ్రోహి ఎవరో కొంచెం తెలుసుకుందాం…

అతని అసలు పేరు సయ్యద్‌ అమీర్‌ హైదర్‌ కమాల్‌ నక్వీ. ఇంట్లో వాళ్ళు, దగ్గర వాళ్ళు ”చందన్‌” అని పిలుస్తారు కానీ లోకానికంతటికీ కమల్‌ అమ్రోహి అనే తెలుసు.

ఆయన ఆగస్టు 1వతేదీ 1918న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా దగ్గర ఉన్న అమ్రోహ అనే ఊరిలో జన్మించాడు (అంటే మీనా కుమారి కంటే పదిహేనేళ్ళు పెద్దవాడు). చిన్నప్పటి నుండి హిందీ, ఉర్దూలలో కవితలల్లుతూ ఉండేవాడు. 1938లో పై చదువులకు లాహోర్‌ చేరిన అతని ప్రతిభను గుర్తించిన ప్రముఖ గాయకుడు కుందన్‌లాల్‌ సైగల్‌ అతన్ని బొంబాయి తీసుకువచ్చి షోహ్రాబ్‌ మోడీకి పరిచయం చేశాడు.

అలా షోహ్రాబ్‌ మోడీ ”మినర్వా మూవీటోన్‌” లో చేరి ”జైలర్‌, పుకార్‌, భరోసా” చిత్రాలకు పనిచేశాడు కమాల్‌. ఎ. ఆర్‌. కర్దార్‌ ‘షాజహాన్‌’ చిత్రానికి కూడా పనిచేశాడు. అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. కొన్ని చిత్రాలకు కథనందించాడు. కొన్నింటికి సంభాషణల రచయితగా పనిచేశాడు. కొన్నింటికి పాటలు రాశాడు. కొన్ని సినిమాలకు రచన, దర్శకత్వం కూడా నిర్వహించాడు.

అలా అతను 1949లో బాంబే స్టూడియోస్‌ వారికి రచన, దర్శకత్వం వహించిన చిత్రం ‘మహల్‌’. అది సూపర్‌ హిట్టయి అతనికి ఎనలేని పేరు, ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది. నిర్మాతలు, నటీనటులు అతనితో పనిచేయాలని తహతహలాడసాగారు. మన మీనాకుమారి కూడా అతని గురించి సినీ జనాలు చెప్పుకునే మాటలు విని, అతని ఫోటోను ఒక ఇంగ్లీష్‌ పత్రికలో చూసి ఆరాధనా భావంతో ఉండేది.

కానీ అప్పటికే అతనికి రెండు పెళ్ళిళ్ళయ్యాయి. రెండో భార్య ద్వారా ముగ్గురు పిల్లలున్నారు. అతని మొదటి భార్య బిల్కీస్‌ బేగం, జద్దన్‌ బాయి (నర్గీస్‌ తల్లి) దగ్గర సహాయకురాలిగా ఉండేది. రెండో భార్య మొహమూది, ఆమెకు ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల.

ఆయన తన జీవితకాలంలో రచన, దర్శకత్వం వహించినది నాలుగే సినిమాలు ‘మహల్‌, దాయిరా, పాకీజా, రజియా సుల్తానా’. అతనొక పర్ఫెక్షనిస్ట్‌, ఎంత సమయం తీసుకునైనా సరే సబ్జక్టుకి న్యాయం చేయాలనుకునేవాడు.

తన మీద ఆరాధనతో ఉన్న మీనాకుమారిని అతను పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు కానీ ‘తమాషా’ రషెస్‌ చూశాక తన స్నేహితుడు, సహాయకుడు అయిన బాకర్‌ అలీతో ‘ఈమెపై ఒక కన్నేసి ఉంచుదాం’ అన్నాడు.

కమాల్‌ అమ్రోహి మీనాకుమారి గురించి ‘ఒక కన్నేసి ఉంచుదాం’ అన్నాడు కానీ ‘ఒక చూపు చూద్దాం’ అనలేదు. అందుకే అవకాశం వచ్చినపుడు తన పిక్చర్‌లో అవకాశమిచ్చాడు. మఖన్‌ లాల్‌ అనే నిర్మాత కమల్‌ దర్శకత్వంలో ‘అనార్కలి’ అనే సినిమా తీయాలని ఉత్సాహపడ్డాడు. హీరోయిన్‌గా అంతకుముందు తన ‘మహల్‌’లో నటించిన మధుబాలని బుక్‌ చేశాడు. అయితే ఆవిడ హీరోగా దిలీప్‌కుమార్‌ని బుక్‌ చేయాలని షరతు పెట్టడంతో ఆమెకి ఉద్వాసన చెప్పి ఆమె స్థానంలో మీనాకి అవకాశమిచ్చాడు కమాల్‌ అమ్రోహి.

ఆడబోయిన తీర్థం ఎదురయినంత సంతోషపడి వెంటనే అంగీకరించి మార్చి 13, 1951న అగ్రిమెంట్‌ మీద సంతకం చేసింది మీనా. అలీబక్ష్‌ని కూడా పారితోషికం విషయంలో సంతృప్తి పరిచి, లొకేషన్‌ వెదికే పనిమీద ఢిల్లీ, ఆగ్రాలకు పయనమయి వెళ్ళాడు కమాల్‌. ఈ లోగా జరిగిన సంఘటన వారిద్దరి జీవితాలలో పెను మార్పు తీసుకువస్తుందని బహుశా వారు కూడా ఊహించి ఉండరు.

మీనాకుమారి ఆరోగ్యం ఎప్పుడూ అంతంత మాత్రమేనట. అలాంటిది ఆ సంవత్సరం ఏప్రిల్‌లో మూడు వారాలపాటు వచ్చిన టైఫాయిడ్‌తో చిక్కి శల్యమయితే గాలిమార్పుకని మహాబలేశ్వర్‌ వెళ్ళారట. అక్కడ నుండి తిరిగి బొంబాయి వస్తుండగా వారు ప్రయాణించే కారు ప్రమాదానికి గురయింది. మీనా ఎడమచేయి తీవ్రంగా దెబ్బతింది. తండ్రికి మూడుచోట్ల ఎముకలు విరిగాయి. చెల్లెలు మధు మాత్రం కొద్ది గాయాలతో బయటపడింది. ఆ సందర్శంగా పూనాలోని ‘ససూన్‌ హాస్పిటల్‌’లో నాలుగు నెలలు ఉండిపోవాల్సి వచ్చింది.

మీనాకి తగిలిన గాయం చాలా ఆందోళన కలిగించింది. తిరిగి సినిమాలలో మామూలుగా పనిచేయగలుగుతానా అనే భయాందోళనలకు గురయి నైరాశ్యంలో కూరుకుపోయిన మీనా చివరకు ఎలాగో ఎడమచేతి ఉంగరం వేలు, చిటికెల వేలు వంకరతో బయట పడింది. ఆ తర్వాత నటించిన ప్రతి సినిమాలో ఎడమ చేతి చుట్టూ దుపట్టానో, చీరకొంగునో కప్పి కనపడకుండా జాగ్రత్తపడేది. ఇదంతా జరిగింది మే 21, 1951లో. ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న కమాల్‌ ఢిల్లీ నుండి బయలుదేరి నేరుగా పూనా హాస్పిటల్‌కి వచ్చాడట.

అది మే 24వ తేదీ సాయంత్రం, మీనా చాలా దిగులుగా, నిస్పృహగా ఉంది. తాను మళ్ళీ నటించగలదా, తన కలల ప్రాజెక్ట్‌ అనార్కలిలో తనను ఉంచుతారా అనే ఆలోచనలతో మునిగిన ఆమెకు తన ముందు గుమ్మంలో ప్రత్యక్షమయిన కమాల్‌ని చూసి సంతోషంతో నోట మాట రాలేదు. ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతున్న అతనికి జవాబివ్వలేకపోయింది.

ఇంతలో ఆమె సోదరి మీనా ఏమీ తీసుకోవడం లేదని, చివరికి ఒక గ్లాసు బత్తాయి రసం కూడా తీసుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. కమాల్‌ మాట్లాడకుండా ఆ గ్లాసు తీసుకుని ఆమెకు తాగించాడు. ఆమె మారు మాటాడకుండా తాగేసింది. అలా ఒక గ్లాసు బత్తాయి రసంతో వారి ప్రేమ వర్ధిల్లింది అంటాడు వినోద్‌ మెహతా.

అలా కాబోయే అనార్కలి కోసం దాదాపు ప్రతి వారం అతనికీ, ఆమెకీ మధ్య ప్రేమ చిగురించి గాఢమవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రతిరోజు ఉత్తరాలు రాసుకుని, వారం చివరలో ఒకరికొకరు అందజేసుకునేవారు. ఆమెకు అతనిలో సున్నితత్వం, మానవత్వం, విశ్వాసం నచ్చింది. తన ఆదర్శ పురుషుడు అతనే అనుకుంది. అతనికి ఆమెలోని విద్వత్తు, స్పందించే గుణం, భావుకత నచ్చాయి. వారిద్దరూ ఒకరినొకరు సరిజోడీ అనుకున్నారు.

ఆమె అతనిని ”చందన్‌” అని పిలవసాగింది. అతను ఆమెను ”మంజూ” అని పిలవసాగాడు. చివరకు హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అవుతున్నందుకు మీనా ఒకరకంగా దిగులుపడిందంటే పరిస్థితి ఊహించండి

బొంబాయి నుంచి తిరిగి వచ్చాక ‘అనార్కలి’ షూటింగ్‌ ప్రారంభమయింది. దాంతోపాటే మొదలయ్యాయి వారి మధ్య తెల్లవార్లూ సాగే సుదీర్ఘ టెలిఫోన్‌ సంభాషణలు. అలీభక్ష్‌ నిద్రపోయాక అర్థరాత్రి మొదలయిన సంభాషణ తెల్లవారాక ముగిసేదట.

రెండు షెడ్యూల్స్‌ షూటింగయ్యాక నిర్మాత మఖన్‌లాల్‌ దివాళా తీయడంతో ”అనార్కలి” ఆగిపోయింది కానీ ఫోన్‌ సంభాషణలు ఆగలేదు.

చిత్ర పరిశ్రమ అంతా చెవులు కొరుక్కోసాగారు వీరిద్దరి అఫైర్‌ గురించి. కమాల్‌ మీద అంతకుముందే ”మహల్‌” సినిమాలో పనిచేస్తున్నప్పుడే మనసు పారేసుకున్న మధుబాల ఒకరోజు అతనిని పక్కకు పిలిచి అతని భార్యా బిడ్డలను వదిలేసి తనను పెళ్ళి చేసుకుంటే మూడు లక్షలిస్తానని ఆశ చూపిందట. అయితే ”నేను కథల్ని అమ్ముకుంటానే కానీ, బిడ్డలను అమ్ముకోను” అని కమాల్‌ నిరాకరించాడట. అతనికి కావలసింది కేవలం అందమొకటే కాదు భావుకత, కవి హృదయం నిండి ఉన్న వ్యక్తి. అందుకే మీనా వైపు మొగ్గాడు అంటాడు వినోద్‌.

వీరిద్దరి ధోరణి గమనించిన కమాల్‌ స్నేహితుడు బాకరాలీ పెళ్ళి చేసుకోమని సూచించాడు. ఇటు మీనా వైపు నుండి, ఆమె చెల్లెలు మధు కూడా అదే సలహా ఇచ్చింది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాక ఒక షరతు పెట్టింది మీనా. అదేమిటంటే తండ్రి ఆర్థిక ఇబ్బందులు తీరేదాకా ఈ వివాహం సంగతి రహస్యంగా ఉంచాలని. అలాగే అని ఒప్పుకున్న కమాల్‌ కూడా ఒక షరతు పెట్టాడు రాత్రిళ్ళు టెలిఫోన్‌ సంభాషణలు కొనసాగాలని.

1942 ఫిబ్రవరి 14న కేవలం ప్రేమికుల రోజే కాదు కమాల్‌ అమ్రోహీ, మీనా కుమారిల పెళ్ళిరోజు కూడా. ప్రతి రోజూ సాయంత్రం ఫిజియో థెరపిస్టు దగ్గర చికిత్సకు చెల్లెలు మధుతో పాటు వెళ్ళినట్లే ఆరోజు కూడా వెళ్ళిన మీనా అటునుండీ బయటకు వెళ్ళి పెళ్ళి చేసుకుని మళ్ళీ ఏమీ ఎరగనట్లు క్లినిక్‌కు తిరిగి వచ్చి, ఇంటికి వచ్చేసింది. పెళ్ళికి సాక్షులు చెల్లెలు మధు, కమాల్‌ స్నేహితుడు బాకర్‌ ఆలీ.

కానీ కాలం అన్ని వేళలా సహకరించదు. ఒక సంవత్సరం గడిచాక ఆలీబక్ష్‌కి ఉప్పందింది, వారి టెలిఫోన్‌ సంభాషణలే వారిని పట్టిచ్చాయి. నిజం తెలిసిన తండ్రి నిలదీశాడు, విడాకులిచ్చేయమన్నాడు. అతన్ని కలవవద్దనీ, మాట్లాడవద్దనీ ఆంక్షలు పెట్టాడు. అతను తీస్తున్న ‘దాయిరా’ షూటింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదన్నాడు.

అయితే ఇదంతా లెక్కచేయని మీనా తండ్రిని కాదని భర్త తీస్తున్న ‘దాయిరా’ షూటింగ్‌లో పాల్గొని వచ్చేసరికి పుట్టింటి తలుపులు శాశ్వతంగా మూసుకున్నాయి. వెంటనే ఆమె ‘చందన్‌’ ఉంటున్న ఇంటి (రెంబ్రాంట్‌) తలుపులు తట్టింది. సాదరంగా ఆహ్వానించాడు ‘చందన్‌’ అనే కమాల్‌ అమ్రోహి.

1953 ఆగస్టు 14న కమాల్‌ అమ్రోహితో సంసార జీవితం ప్రారంభించింది మీనాకుమారి. అంతకుముందున్న భార్య అతని ప్రేమ వివాహం తెలిసి తగాదాపడి పిల్లలతో అమ్రోహ వెళ్ళిపోయింది. ఆమె తన జీవితకాలంలో ఎక్కువ కాలం అక్కడే గడిపింది. చందన్‌, మంజూల వివాహ జీవితం మొదటి రెండు, మూడేళ్ళు ”గృహమే కదా స్వర్గసీమ” అన్నట్టు సాగింది. ఖాళీ సమయాలలో ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకోవడం, కవిత్వం చదువుకోవడం, రమ్మీ ఆడుకోవడం, సాయంత్రమయితే అతని బ్యూక్‌ కారులో ఏ ఇంగ్లీష్‌ సినిమాకో వెళ్ళడం… అలా ఆనందంగా గడుస్తున్నాయి రోజులు.

అతను ఆమెకు సోక్రటీస్‌ అంతటి జ్ఞానిలాగా, ఆలీఖాన్‌ అంత అందంగా, ఇందిరాగాంధీ అంత తెలివిగా, రాజేష్‌ ఖన్నా అంత ఆకర్షణీయంగా కనపడేవాడు అంటాడు వినోద్‌ మెహతా.

ఆమె ఎప్పుడూ తనను తాను మార్లిన్‌ మెన్రోతోనూ, కమాల్‌ని ఆర్థర్‌ మిల్లర్‌తోనూ పోల్చుకునేదట.

అతనూ, బాకర్‌ ఆలీ కలిసి ఆమె డేట్స్‌, రెమ్యూనరేషన్‌, చిత్రాల ఎంపిక తదితర విషయాలు చూసేవారు, అంతకుముందు అవన్నీ ఆమె తండ్రి చూసేవాడు.

అలా ఆమె 1952 నుండి 1964 వరకూ తీరిక లేకుండా చిత్రాలలో నటిస్తూనే ఉంది. నటిగా బాగా పాప్యులర్‌ అయింది. నటిగా ఆమె జీవితకాలంలో (బాలనటిగా మినహాయిస్తే) 77 చిత్రాలలో నటిస్తే అందులో 50 చిత్రాలు ఈ కాలంలో నటించినవే. ఆమె నటించిన అన్ని చిత్రాల గురించీ చెప్పడం సాధ్యపడదు కానీ కొన్ని ముఖ్యమయిన వాటిని మాత్రం తలచుకోవాలి.

ఆమె నట జీవితంలో మంచి బ్రేక్‌ ఇచ్చిన చిత్రం విజయ్‌భట్‌ తీసిన ”బైజు బావ్రా”. 1952లో ఈ చిత్రం విడుదలయ్యే నాటికే ఆమెకు పెళ్ళయింది. ఈ చిత్రం ఆమెకు ”తార” హోదా కల్పించింది. దీనికి ఫిల్మ్‌ఫేర్‌ నేలకొల్పిన మొట్టమొదటి అవార్డు (1954) మీనాకుమారికే దక్కడం గొప్ప విషయంగా భావిస్తారు సినీజనాలు.

అంతేకాదు వరుసగా రెండో సంవత్సరం కూడా 1953లో ఆ అవార్డు ఆమె నటించిన ‘పరిణీత’కు దక్కింది. అప్పుడామె చాలా ఆనందించింది. నిజంగా శరత్‌ నవల ఆధారంగా బిమల్‌ రాయ్‌ తీసిన ఆ చిత్రం ఆమెలోని నటనా ప్రతిభను వెలికి తీసిందంటారు. ఆమె జీవితకాలంలో ఆమెకు నాలుగుసార్లు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వచ్చాయి.

1. బైజుబావ్రా (1952), 2. పరిణీత (1953), 3. సాహిబ్‌, బీబీ ఔర్‌ గులామ్‌ (1962), 4. కాజల్‌ (1966)

ఆమె నటించిన చిత్రాలలో చెప్పుకోదగిన చిత్రాలు దక్షిణాది చిత్రాల రీమేక్స్‌ అవడం, దర్శకులు కూడా వారే అవడం విశేషం. ఉదాహరణకి శారద – ‘ఇలవేల్పు – ఎల్‌.వి.ప్రసాద్‌ (నిర్మాత,దర్శకుడు). ఇది సూపర్‌ హిట్టయి ఆమెకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ”ఆజాద్‌”-అగ్గిరాముడు-ఎస్‌.ఎమ్‌.శ్రీరాములు నాయుడు. మిస్‌ మేరీ – మిస్సమ్మ, మై భీ లడ్కీ హు – నాదీ ఆడజన్మే, మై ఛుప్‌ రహూంగీ – మూగనోము, దిల్‌ ఏక్‌ మందిర్‌ – మనసే మందిరం.

ఇలా ఆమె ఒక పక్క తీరికలేకుండా ఉంటే, కమాల్‌ అమ్రోహి 1953లో తీసిన ‘దాయిరా’ బొంబాయిలో రెండు రోజులు మాత్రమే ఆడి అటకెక్కింది. పూనా ఫిల్మ్‌ ఆర్కివ్స్‌లో పాఠ్యాంశం కింద భద్రపరచి ఉంచారని చెప్పారు తాజ్‌దార్‌ అమ్రోహి. అతనికంటూ సినిమాలు లేవు. సినిమా ఫీల్డ్‌లో ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో ఉండడం ముఖ్యం. లేకపోతే ప్రజలు మర్చిపోతారు. తోటివారు విలువనివ్వరు. ఇప్పుడు అతను కేవలం మీనాకుమారి డేట్స్‌ చూసే మేనేజర్‌లాగా అయిపోయాడు.

నెమ్మదిగా వారి సంసారంలో పొరపొచ్చాలు మొదలయ్యాయి. ఆమె పట్ల అతను మొదట చూపినంత ప్రేమ చూపడం లేదనేది ఆమె ఫిర్యాదు. దాంట్లో అర్థంలేదనీ, రెండు మూడేళ్ళుగా కాపురం చేస్తున్న భార్యాభర్తల మధ్య ప్రతిరోజూ ప్రేమ కవిత్వాలు చెప్పుకోనక్కరలేదనీ, అంతా ఆమె అనవసరంగా ఊహించుకుంటోందనీ అతను కొట్టిపారేశాడు. ఆమెకు కావలసిన ”బాసీరోటీ” కూడా ఇంట్లో దొరకడం లేదనేది ఆమె అసంతృప్తులలో ఒకటవడం విచిత్రం.

క్రమంగా వారి వివాహ జీవితం బీటలు వారడం మొదలయింది. సినిమా ఫంక్షన్లలోనూ, పిక్చర్‌ ప్రీమియర్లలోనూ ‘ఈమె మీనాకుమారి భర్త’ అని పరిచయం చేస్తుంటే అభిమానంతోనూ, ఒక రకమయిన గర్వంతోనూ కమాల్‌ న్యూనతపడి అక్కడినుండి వెళ్ళిపోవడం, మీనాకుమారి ఒక్కతే మిగిలిపోవడం జరుగుతూ ఉండేది.

చిత్రాల ఎన్నిక విషయంలో కూడా కొన్ని మంచి సినిమాలు అనుకున్నవి ఆమెకు తెలియకుండానే తిరస్కరించడం, ఆమెకు తర్వాత తెలిసి బాధపడడం జరుగుతుండేవి. అలా చేజారినవే బిమల్‌రాయ్‌ ‘దేవదాసు’ లోని పాత్ర, గురుదత్‌ ”సాహెబ్‌ బీబీ అవుర్‌ గులామ్‌”లో పాత్ర. మొదటిసారి అడిగినప్పుడు కమాల్‌ వీలవదు అంటే, గురుదత్‌ కొంతకాలం షూటింగ్‌ చేసి ఇతరులెవ్వరూ నచ్చక మళ్ళీ నేరుగా మీనాని డైరెక్ట్‌గా కలిసి అడిగితే అంగీకరించి నలభై అయిదు కాల్షీట్లిచ్చింది. అందులోని ”ఛోటీ బహు” పాత్ర ఆమె నటజీవితంలో మైలురాయి లాంటిది.

ఈ విభేదాల గురించి నిలదీసిన మీనాతో ”నువ్వు ఒక నటిగా కాదు మహజబీన్‌గా, ఒక గృహిణిగా నా ఇంట్లోకి అడుగు పెడతానన్నావ్‌” అని గుర్తుచేశాడు కమాల్‌. ”అవును నిజమే. ఇప్పుడు నా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలంటే విడాకులు తీసుకోవాలయితే” అన్న మీనాకి కొన్ని షరతులు పెట్టాడు భర్త.

అవి… సాయంత్రం 6.30కల్లా ఇంటికి రావాలి, తన మేకప్‌ రూమ్‌లోకి ఎవరినీ రానివ్వకూడదు, తన కారులో ఎవరినీ ఎక్కించకూడదు, ఎవరి కారులోనూ తానెక్కకూడదు.

సహజంగా ప్రేమకే కానీ, అధికారాలకు లొంగని స్వభావం కలిగిన మీనా ఆ షరతులకి లొంగినట్లే కనిపిస్తూ వ్యతిరేకంగా ప్రవర్తించి అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ”బెనజీర్‌” సినిమా సెట్స్‌మీద పరిచయమయిన గుల్జార్‌ వలన ఆమెకు కొంత సాంత్వన లభించింది. అతనితో కవిత్వం గురించీ, గజల్స్‌ గురించీ ఆలోచనలు పంచుకుని ఇంట్లోని కలతలు మర్చిపోయేది.

ఒకరోజు ”పింజ్రి కే పంఛీ” సినిమా షూటింగ్‌ ఫిల్మ్‌ స్థాన్‌ స్టూడియోలో జరుగుతుండగా, స్టూడియోలోకి అడుగుపెట్టిన మీనాకి కమల్‌ తనమీద కాపలాగా బాకర్‌ ఆలీని పంపాడనీ, మేకప్‌ రూంలోకి ఎవరినీ రానివ్వద్దన్నాడనీ తెలిసింది. అగ్గిమీద గుగ్గిలమయిన మీనా తన మేకప్‌ రూమ్‌లోకి గుల్జార్‌ని ఆహ్వానించింది. భయం, భయంగా వస్తున్న గుల్జార్‌ని బాకరాలీ అడ్డుకున్నాడు. మీనాకీ, బాకరాలీకి మాటా మాటా పెరిగింది. బాకరాలీ తన చెంపమీద కొట్టాడన్న మీనా అభిమానం దెబ్బతిని మళ్ళీ ”రెంబ్రాంట్‌” (కమాల్‌ నివాసం) లో అడుగు పెట్టనంది.

సాయంత్రం షూటింగయ్యాక చెల్లెలు మధు, మొహమూద్‌ (హాస్యనటుడు) ఇంటికి చేరుకుంది పోలీసు ఎస్కార్టుతో.

ఊరంతా వెతికి వెతికి మధు ఇల్లు చేరుకున్న కమాల్‌ మూసివున్న మీనా గది తలుపుల ముందు నిలిచి అనేక రకాలుగా బతిమాలాడు. బాకరాలీని వెంటనే పనిలోనుండి తీసేస్తానన్నాడు. ”నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చానన్నా”డు. ససేమిరా తలుపులు తెరుచుకోలేదు. ఎంతకూ తెరవని తలుపుల ముందు నిలిచి అభిజాత్యం పుష్కలంగా ఉన్న కమాల్‌ ”ఇదే ఆఖరిసారి ఇక మళ్ళీ రానని” చెప్పి వెళ్ళిపోయాడు. అలా 1964 మార్చి 5న చందన్‌, మంజూల వివాహం విచ్ఛిన్నమయింది.

భార్యాభర్తలిద్దరి మధ్యా విభేదాలు పొడసూపినపుడు రకరకాల ఊహాగానాలు బయలుదేరుతాయి. ఎవరిది తప్పు? అని విచారించి తీర్పులు చెప్పడానికి బయలుదేరిపోతారు కొంతమంది. కానీ వారిద్దరి మధ్యా జరిగినవీ, వారి పడకగది సంగతులూ, వారికీ ఆ పరమాత్మకూ తప్ప వేరే వాళ్ళకి ఎలా తెలుస్తాయి తీర్పు చెప్పడానికి. కమాల్‌ అమ్రోహీకి, మీనాకుమారికీ వచ్చిన విభేదాలు పెరిగి పెద్దవవడానికి చిత్ర పరిశ్రమలోని రెండు గ్రూపులు ప్రధాన పాత్ర పోషించాయంటారు.

అవి… ఒకటి బిమల్‌ రాయ్‌, సలీల్‌ చౌధురీ, అచలా సచ్‌దేవ్‌ గ్రూప్‌, రెండవది మొహమూద్‌, అతని భార్య మధు గ్రూప్‌.

ఈ రెండు గ్రూపులూ మీనాకి కమాల్‌ గురించి చెడ్డగా చెబితే, కమాల్‌కి మీనా గురించి చెప్పడానికి బాకరాలీ తదితరులు కృషి చేశారు. ఏది ఏమైనప్పటికీ కమాల్‌ చివరి వరకూ మీనాకి విడాకులివ్వలేదు.

అతను 1956లో మొదలుపెట్టిన ‘పాకీజా’ సినిమా అతని కలల ప్రాజెక్టు. మీనాకుమారికి తన ప్రేమ కానుకగా అనుకున్నది వీరు విడిపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. మీనాకుమారి అతని మీద కసి తీర్చుకోవడానికి దాన్ని పూర్తి చేయకూడదని అనుకుందని అనుకున్నారు.

1964లో మరిది మొహమూద్‌ ఇల్లు చేరిన మీనా తన జీవిత కాలంలో మూడు ఇళ్ళు మారింది. ఆ తర్వాత ఆగస్టు 1964లో ‘జానకీ కుటీర్‌ (జుహు)’ అనే ఇంటికి మారింది. ఇక్కడ ఆమె చుట్టూ బంధువులు ఈగల్లా మూగారు. ఆమె సవతి సోదరి షమా, సోదరి మధు, కిషోర్‌ శర్మ వగైరా పాతిక మందిదాకా ఉండేవారట.

ఆమె సోదరి మధు, మెహమూద్‌కి విడాకులిచ్చి కిషోర్‌ శర్మని పెళ్ళాడి వచ్చి జానకీ కుటీర్‌లో ఉండసాగింది. అతను మీనాతో కూడా సన్నిహితంగా మెలుగుతూ ఆమె డేట్స్‌నీ చూస్తూ ఉండేవాడు. భర్తతో విడిపోయాక సుమారు అయిదు సంవత్సరాలు అక్కడ గడిపాక చివరగా 1969లో కార్టర్‌ రోడ్‌లోని ”లాండ్‌ మార్క్‌” అనే భవనంలోని పదకొండవ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి, తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకుని చివరిదాకా అక్కడే ఉంది.

భర్తను వదిలేసి బయటకు వచ్చిన ఎనిమిది సంవత్సరాలలో ఆమె జీవితం చాలా మలుపులు తిరిగింది. కమాల్‌తో సుదీర్ఘంగా సాగిన ఫోన్‌ సంభాషణల వల్ల ‘నిద్రలేమి’ అనే వ్యాధికి మందుగా డా||సయ్యద్‌ తిముర్జా ప్రిస్కైబ్‌ చేసిన ఒక పెగ్గు బ్రాందీ ఆమె జీవితాన్ని క్రమక్రమంగా కబళించసాగింది.

భర్త దగ్గరున్నప్పుడే ఆమె డోస్‌ మితిమీరడం గమనించాడు. బాత్రూంలో డెట్టాల్‌ సీసాల్లో డెట్టాల్‌కు బదులు బ్రాందీ

ఉండడాన్ని పసిగట్టి ఆమెను కంట్రోల్‌ చేయడం మొదలెట్టాడు. ఇదంతా జరిగింది సుమారు 1964-65 మధ్యకాలంలో.

అయితే ఆమె ఎప్పుడయితే అతని దగ్గర్నుంచి అడుగు బయట పెట్టిందో అప్పుడే ఆ కంట్రోల్‌ పోయింది. పగలూ, రాత్రీ తేడా లేకుండా రోజుకు రెండూ, మూడూ, ఫుల్‌ బాటిల్స్‌ తీసుకోవడం ఆరోగ్యం మీద అతి తక్కువ కాలంలో ప్రభావం చూపింది. అంటే కేవలం మూడు సంవత్సరాల కాలంలో (1965-68) ఆమె లివర్‌ సిర్రోసిస్‌ అనే వ్యాథికి గురయింది. పదే పదే హాస్పిటల్‌ పాలవడం మొదలయ్యింది.

చివరకు 1968 జూన్‌లో కిషోర్‌ శర్మను తీసుకుని లండన్‌ వెళ్ళి అక్కడ డా|| షీలా షెర్లాక్‌ అనే లేడీ డాక్టర్‌ ఆధ్వర్యంలో మూడు నెలలు చికిత్స పొంది, అటునుండి స్విట్జర్లాండ్‌ వెళ్ళి కొంతకాలం విశ్రాంతి తీసుకుని ఇండియా తిరిగి వచ్చింది. 1968లో సెప్టెంబర్‌లో తిరిగి వస్తున్న ఆమెను చుక్క మద్యం కూడా ముట్టుకోవద్దనీ, వెంటనే పని ప్రారంభించవద్దనీ డాక్టర్లు హెచ్చరించారు.

1968 ఆగస్టులో కమాల్‌ ఆమెకొక లేఖ వ్రాశాడు. సగం ఆగిపోయిన ‘పాకీజా’ పూర్తి చేయాలనీ, ప్రతిఫలంగా ఆమెకు ఏం కావాలంటే అదిస్తాననీ, చివరకు ఆమె కోరినట్లు విడుకులివ్వడానికయినా సిద్ధమేననీ, ఆమెనే మనసులో ఉంచుకుని, ఆమెకు నివాళిగా ప్రారంభించిన పాకీజా ప్రస్తుతం మునిగిపోతున్న ఒక ఓడ అనీ, దానిని దరి చేర్చగలిగింది ఒక్క మీనాయేననీ, ఆలోచించమనీ ఉందందులో.

నర్గీస్‌, సునీల్‌దత్‌, ఖయ్యూమ్‌, అతని భార్య జగజీత్‌ కౌర్‌ కూడా ‘అంత చక్కని సినిమా పూర్తయితే బాగుంటుంది’ అనడంతో మీనా ఆ సినిమా పూర్తి చేయడానికి పూనుకుంది.

అలా ఆగిపోయిన 5 సం||ల పన్నెండు రోజుల తర్వాత ‘పాకీజా’ తిరిగి ప్రారంభమయింది. పారితోషికంగా ఒక నాణెం ఇస్తే చాలంది. కమాల్‌ సంతోషంగా ఒక బంగారు నాణెం ఇచ్చాడు. షూటింగ్‌ ప్రారంభమయిన రోజు ఆమెకిష్టమైన ‘పేఠా’తో ఆమెకు స్వాగతం చెప్పాడు.

అయితే ఆమె ఆరోగ్య కారణాల దృష్ట్యా తాను ఆ పాత్రకు న్యాయం చేయలేనేమోనని భయపడుతుంటే అన్నీ తాను చూసుకుంటానని ధైర్యం చెప్పాడు. శారీరకంగా ఎన్నో మార్పులు వచ్చిన ఆమె క్లోజప్స్‌ మాత్రం తీసుకుని లాంగ్‌ షాట్స్‌లోనూ, నృత్య సన్నివేశాలలోనూ పద్మాఖన్నాను తీసుకుని పూర్తి చేశారు.

1956లో మొదలుపెట్టిన చిత్రం సుమారు పదహారు సంవత్సరాల తర్వాత 1972లో విడుదలయింది. ఈలోగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ గులామ్‌ ఆలీ మరణిస్తే, నేపథ్య సంగీతమూ, అక్కడక్కడా ఠుమ్రీలూ నౌషాద్‌ సమకూర్చారు. సినిమాటోగ్రాఫర్‌ జె.విర్షింగ్‌ (జర్మన్‌) కూడా మరణించారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కొంత సినిమా తీసి మధ్యలో కలర్‌ ఫోటోగ్రఫీ వచ్చాక మొదటిదంతా చెరిపేసి కలర్లో తీశారు. ఆ తర్వాత సినిమా స్కోప్‌ వచ్చాక మళ్ళీ ఆ టెక్నిక్‌ ఉపయోగించారు.

చివరకు సినిమా పూర్తయి ఫిబ్రవరి నాలుగున బొంబాయి ”మరాఠా మందిర్‌”లో రిలీజయ్యింది. ఒకరోజు ముందు ఆ థియేటర్‌లోనే ప్రదర్శించిన ప్రీమియర్‌ షోని మీనా తన భర్త కమాల్‌ పక్కనే కూర్చుని చూసి ఎంతో సంతోషించింది. తన భర్తని చాలా మంచి దర్శకుడని మెచ్చుకుంది, ఇది అతను తనకిచ్చిన నివాళి అంది.

అయితే చిత్రం వసూళ్ళపరంగా ఆశాజనకంగా లేదు. 1972 మార్చి 31న మీనాకుమారి అస్తమించిందన్న వార్త విన్న ప్రజలు తండోపతండాలుగా మీనాకుమారిని చూడ్డానికి ఎగబడ్డారు చిత్రం సూపర్‌ హిట్టయింది. ”మొఘల్‌ ఎ ఆజం” తర్వాత క్లాసిక్‌గా జనాలు చెప్పుకున్నారు.

ఆమె నటించిన 77 సినిమాలలో నాలుగు ఎన్నదగిన చిత్రాలు – బైజుబావరా, పరిణీత, సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్‌, పాకీజా.

వాటిలో సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్‌లో ఆమె నటన అత్యున్నత ప్రమాణాలలో ఉంటుంది. బిమల్‌ మిత్రా రాసిన నవలకి గురుదత్‌, అబ్రార్‌ అల్వీ సినిమా రూపాన్నిచ్చారు. దర్శకుడు అబ్రార్‌ అల్వీ అయినా పాటలు తీసింది గురుదత్‌.

తనకి నటించడానికి కష్టంగా అనిపించిన పాత్ర ఇదని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మీనా. ఈ సినిమాలో నటించేటపుడు నటనకు సంబంధించి కమాల్‌ని కూడా సలహాలు అడుగుతూ ఉండేదట.

భర్తను ప్రేమించి, అతని కోసం ఏమైనే చేసే, చివరకు మద్యమైనా తీసుకునే ”ఛోటీబహు”గా ఆమె నటన మెచ్చదగినది. ”నజావో సయ్యా”లో భర్తను కవ్విస్తూ సున్నితంగా ఆమె చూపే హావభావాలు, శృంగారానికి పరాకాష్టగా కనిపిస్తాయి. ”పరిణీత”లోనూ, ఇందులోనూ ఆమె అచ్చమయిన బెంగాలీ స్త్రీలాగా కనబడడానికి ఆమెలో ప్రవహించే బెంగాలీ రక్తమే కారణమంటారు కొందరు.

నాకు కూడా వ్యక్తిగతంగా ఇష్టమయినది ఈ సినిమా. విచిత్రమేమంటే 1962లో వచ్చిన ఈ సినిమాలో తాగుబోతుగా నటించేటప్పటికి ఆమెకు తాగుడు అలవాటు లేదట. మొహం ఉబ్బినట్లుగా కనిపించడానికి ముక్కు కింద యూ-డి-కొలోన్లో ముంచిన దూది ఉంచుకునేదట.

ఇక ఆమె హాబీలు కవిత్వం రాయడం, పుస్తకాలు చదవడం. ఆమె ”నాజ్‌” అనే పేరుతో హిందీలోనూ, ఉర్దూలోనూ కవితలు, గజల్స్‌ రాసేది. ఆమె మంచం పక్కన అలెస్టర్‌ మెక్లీన్‌, గుల్షన్‌ నందా, ఎమిలీ బ్రాంబే పుస్తకాలు ఉన్నాయని వినోద్‌ మెహతా రాశాడు.

1971లో ఖయ్యామ్‌ దర్శకత్వంలో తాను స్వయంగా పాడి ”ఐ రైట్‌, ఐ రిసైట్‌” నే ఎల్‌.పి. విడుదల చేసింది. దానిలోవన్నీ ఆమె రాసిన కవితలే. అందులో ఆమె గొంతు ఎంత తియ్యగా ఉంటుందో.

గుల్జార్‌తో కవిత్వం గురించి మాట్లాడేదని చెప్పుకున్నాం కదా. తన తదనంతరం తన డైరీలూ, తన కవిత్వాలూ గుల్జార్‌కే అప్పజెప్పాలని వీలునామా రాసిందట. అతను ఆమె కవితలతో ఒక పుస్తకం ప్రచురించాడంటారు. వారిద్దరిదీ కవితానుబంధం మాత్రమేనట. అయితే కమాల్‌తో విడిపోయే నాటికి ధర్మేంద్రతో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉందనీ, అతను పైకి రావడానికి ఆమే కారణమనీ, పైకి వచ్చాక అతను ఆమెను దూరం పెట్టాడనీ అంటుంటారు.

ధర్మేంద్ర తర్వాత రాహుల్‌ అనే అతని పేరూ, సావన్‌ కుమార్‌ తక్‌ అనే దర్శకుడి పేరూ ప్రముఖంగా వినబడ్డాయి. ఈ సావన్‌ కుమార్‌ తక్‌ ”గోమతీ కె కినారె” అనే సినిమా తీశాడు. అతనితో అదే ఆమె చివరి చిత్రం.

1968లో లండన్‌ నుండీ తిరిగి వచ్చాక మద్యం ముట్టలేదని కొందరూ, మద్యం తీసుకుందని కొందరూ అంటారు. సావన్‌ కుమార్‌ మాత్రం ”ఆమె తీసుకోకపోవడమే కాదు నన్ను కూడా చుక్క ముట్టుకోనివ్వలేదు” అంటాడు.

1972 వచ్చేనాటికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. అక్క ఖుర్షీద్‌తోనూ, ఆమె పిల్లలిద్దరితోనూ ‘లాండ్‌ మార్క్‌’లో తన సొంత ఇంటిలో తనకు నచ్చినట్లుగా, ప్రశాంతంగా జీవించసాగింది.

1972 మార్చి 28న తీవ్రమైన అనారోగ్యంతో మలబార్‌ హిల్‌లో ఉన్న సెయింట్‌ ఎలిజబెత్‌ నర్సింగ్‌ హోమ్‌లో చేరింది. మార్చి 31న ఈ లోకాన్ని విడిచి పెడుతూ ”నాకింకా బతకాలని ఉంది” అని ఆక్రోశించింది.

ఆమె తన సమాధిమీద ఇలా రాయమని కోరింది –

”విరిగిన వాయులీనంతో

తెగిన పాటతో

పగిలిన గుండెతో

ఆమె సెలవు తీసుకుంది

అయినా లేదు కించిత్‌ పశ్చాత్తాపం”

ఆమె గురించి ఆమే చెప్పుకుందట ”నాలో చాలా లోపాలున్నాయి, తప్పులున్నాయి, బలహీనతలున్నాయి. కానీ ఒంటరితనంలో వేగిపోయేటప్పుడూ, నా విషాద క్షణాలలో, ఈ లోకం నుండీ దూరంగా పారిపోయి నా మీద నేను జాలిపడేటప్పుడూ, నన్ను నేను తిట్టుకునేటప్పుడూ… అనిపిస్తుంది నేనేమంత చెడ్డదాన్ని కానని… అయినా నేనొక బలహీనతల పుట్టని”…

ఎవరు కాదు?

అల్విదా మీనాజీ!

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.