”ఏయ్ కదలకు.. క్లిక్”… సాగర్
”వావ్ మా…సూపర్ సారీ”… నా ఎనిమిదేళ్ళ పాప.
”ఓకే రా… ఫంక్షన్‌కి వెళ్ళొస్తాం నువ్వు నానమ్మను సతాయించకుండా ఆడుకో”
”సరే మా… బై బై నాన్నా”
బయటకొచ్చి కారు ఎక్కబోతున్నా… ఫోన్… మహేశ్వరి… స్టూ… అంటే స్టూడెంట్ అని. కట్ అయింది.
ఈ అమ్మాయి ఎందుకు కాల్ చేసింది. తనకు… పెళ్ళై ఫోర్ మంత్స్ అయి ఉంటుంది అనుకున్నా.
సాగర్ ఒకటే హార్న్. నేను తిరిగి డయల్ చేస్తూ కార్ ఎక్కాను. ”హలో మేడం… నేను మహేశ్వరిని గుర్తుపట్టింరా”.
”హలో మహేశ్వరి… బావున్నావార. ఎక్కడ… చెప్పు”
”మేడమ్… మీకు చందానగర్ దగ్గరైతద. ఇప్పుడు ఇక్కణ్ణే ఉన్న… హాస్పిటల్‌ల. ఒకసారి ఒస్తర మేడం ప్లీస్” గొంతు వీక్‌గా అనిపించింది.
”హాస్పిటల్లో నా… ఏమైంది, ఏ హాస్పిటల్”
సాగర్ ఏమైందని కళ్ళెగరేశాడు.
”మేడం… మైత్రి హాస్పిటల్‌ల ఉన్న… ఏం గాలే… మీరు ఒస్తర.”
”ఓకే ర… ఇప్పుడు కొంచెం పనిమీద బయటకు వెళ్తున్న… వచ్చేటప్పుడు వస్తా… వన్ అవర్‌లో కాల్ చేస్తా… సరేనా.. అర్జెంటా.”
”సరే మేడం… గంటల రండి.”
… … … …
ఎంగేజ్మెంట్ ఫంక్షన్. ఉన్న ఒక్క సండే ఫంక్షన్స్ అంటే ఇద్దరికీ చిరాకే… కానీ దగ్గరివాళ్ళు… మరీ మరీ చెప్పాక తప్పలేదు. బొకే… పూలదండలు తీసుకున్నాం. ఫంక్షన్‌హాల్‌లోకి వెళ్ళి అందరినీ గ్రీట్ చేసి… భోజనాల దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ మిస్డ్ కాల్ మహేశ్వరి నుంచి. నా మనసంతా ఆ అమ్మాయి మీదే ఉంది. పెద్ద కళ్ళతో, నల్లటి బారెడు జడలో ఎప్పుడూ కనకాంబరాల దండ పెట్టుకునేది. ఇంటర్ పాస్ అయి డిగ్రీ కూడా జాయిన్ ఐనట్టుంది. ఒకసారి పెళ్ళి కార్డు తీసుకుని వచ్చింది. సర్
వాళ్ళు కొందరు వెళ్ళినట్లున్నారు. నాకెందుకో కుదరలేదు. తర్వాత ఒకసారి మెహదీపట్నంలో బస్‌లో కనబడింది. భర్తతో… అబ్బాయి కూడా బావున్నాడు. ఏదో కంపెనీలో చిన్న ఉద్యోగం. సంతోషించాను. నా నంబర్ అడిగి తీసుకుంది.
భోజనం అయిందనిపించి రిటర్న్ గిఫ్ట్ తీసుకుని బయల్దేరాము. హాస్పిటల్ లోపలికి వెళ్ళి రిసెప్షన్‌లో మహేశ్వరి పేషేంట్ అన్నాను. ఎవరూ లేరన్నారు. ఇంతలో ఒక నడివయసు ఆవిడ వచ్చింది. మహేశ్వరి అమ్మనేమో… ఒకసారి చూసినట్టు గుర్తు. ”మీరు మహేశ్వరి అమ్మన.”
”అవునమ్మ… మేడం కద నువ్వు. నీకోసమే చూస్తుంది. ఇప్పుడు దీపిక అని పిలుస్తున్నరు. పెండ్లయినంక… పేరు మార్శింరు గదా”.
”మ్మ్…. ఏమైంది…ఏ రూమ్” సాగర్ వైపు సందేహంగా చూసింది. ”ఐ విల్ వెయిట్ హియర్. యూ గో…” అన్నాడు.
”మస్తు రక్తం బోయింది కదమ్మ… గీడికి ఎస్కచ్చినం…” ”డాక్టర్ ఉన్నారా…” ”ఉన్నదమ్మ మాట్లాడు…” కేబిన్‌లోకి వెళ్ళాము. ”నేను మహేశ్వరి… అదే దీపికకు కాలేజి లెక్చరర్‌ని”.
”కూర్చోండి…” ”వాట్ హ్యాపెండ్ మేమ్. ఈజ్ ఇట్ యంపిటి ఆర్ డిఎన్‌సి” అడిగాను.
”నైథర్ వీళ్ళు అబార్షన్ అనుకుంటున్నారు. కానీ కాదు. హర్ హస్బెండ్ ఫోర్స్‌బ్లీ అటెంప్టెడ్ ఆనల్ ఇన్సర్షన్… హర్ పీవీ సెరియోస్లీ డేమేజ్డ్. వీళ్ళకు ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. ఎవరైనా చదువుకున్న వాళ్ళుంటే పిలవమన్నాను.” నాకెలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు.
”విల్ షి బి ఆల్‌రైట్ మేమ్… ఐ మీన్ నథింగ్ టు వర్రీ నో”
”ఓకే… తొందరలోనే కోలుకుంటుంది. రేపు డిశ్చార్జ్ చేసేస్తాను. వి నీడ్ టు కౌన్సిల్ దట్ బాయ్”.. వాళ్ళకు అర్ధం కాకూడదని ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నాము. ”ఓకే మేమ్… వాళ్ళను అలాగే అనుకోనివ్వండి… నేను మహేశ్వరిని చూస్తాను” అని రూమ్‌లోకి వెళ్ళాను.
నన్ను చూడగానే కళ్ళ నిండా నీళ్ళు. పక్కన కూర్చొని చెయ్యి పట్టుకున్నా… ”ఓ పొద్దటి సంది గిదే ఏడుపమ్మా… పూసిన పిందెలన్నీ కాయలైతాయి… జర ఊకోవెట్టు షిష్టరమ్మ…”
”అమ్మ, నువ్వు బో. నేను మేడంతోని మాట్లాడాలే.”
అమ్మ బయటికి వెళ్ళింది.
”పెద్ద డాక్టర్‌తోని మాట్లాడింరా మేడమ్… పెండ్లయినంక కొన్ని రోజులు బానే ఉన్నడు… బ్లూ ఫిలింలు జూసుడు నేర్శిండు. అందరు లోకంలో గట్లనే చేస్తారట. దాన్ని ఐస్‌క్రీం లెక్క నోట్లో వెట్టుకొని …. కెఎస్‌లగూడ ఉన్నదట మేడం” ఏడుస్తోంది. నాకూ దుఃఖంతో మాటలు రావడంలేదు.
”కెఎస్ ఏంటి…”
”కామ సూత్ర మేడం. పెండ్లంటే ఇంత నరకమా మేడం. తాగకుంటే మంచిగనే ఉంటాడు. తాగితే మనిషిగాడు. వీనికి తగ్గట్టు వీని దోస్తులు… దావతులు… తాగుడు… తినుడుకు ఎగవడ్డరు”
ఆ అబ్బాయి వచ్చాడు మీసాలు మెలితిప్పుకొని, చేతికి స్టీలు కడియంతో మొరటుగా ఉన్నాడు. అతన్నే సీరియస్‌గా చూశాను. బెడ్ దగ్గరగా వచ్చి తలొంచుకున్నాడు. ”ఏమయ్యా… మంచిగా ఉద్యోగం చేస్తున్నావ్. చదుకున్న పిల్ల. ఇట్లా చెయ్యొచ్చా… ఆ అడ్డమైన వీడియోలల్ల చూపించేటియ్యి నిజంగాదు. అట్లైతే భూమ్మీద సగం మంది ఆడోళ్ళు సదుచ్చేపోతుండె. ఉత్తగ జీవితాల్ని కరాబు చేసుకుంటారా. జరైతే ప్రాణం బోతుండె కదా. మంచిగా పనిచేసుకుని మంచిగ బతకాలయ్యా”.
”ఒట్టు పెట్టుకోమనండి మేడం. ఇంకొకసారి అట్ల చేస్తే నేనైతే ఉరి వెట్టుకుంట…”
”తప్పైపోయిందే. ఇక ఊకో”.
”ఇంక పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. పిచ్చి పనులు చెయ్యకు బాబు. మంచిగా చూస్కో”.
గబగబా కొబ్బరి బొండాం తెచ్చాడు. వద్దని మహేశ్వరి చేతిలో కొంత డబ్బు పెట్టి బయటకు వచ్చేశాను.
…. …. ….
సాయంత్రం ఫ్రెష్ అయ్యి డిన్నర్ కోసం చపాతీలు చేస్తున్నా. పాప వచ్చి చిన్న చిన్న పిండి ముద్దలతో చిన్ని రొట్టెలు చేస్తానని విసిగించింది. ఒకటే ఆలోచనలు… ఎంగేజ్మెంట్ అయిన సున్నితమైన అమ్మాయి గుర్తొచ్చింది. కొన్నేళ్ళు పోయాక నా చిట్టి తల్లి… ఒళ్ళు జలదరించింది. పాపని గట్టిగా అదుముకున్నాను… కళ్ళ నిండా నీళ్ళు.