పారిజాత పరిమళం లాంటి సినిమా – భవాని భవాని ఫణి

అందమైన రూపంలో చుట్టుపక్కల తిరుగుతున్నంతసేపూ, డ్యాన్‌ కు షూలీపై ఎటువంటి అభిప్రాయమూ కలగనేలేదు. కన్ను వాచిపోయి, ముఖమంతా చెక్కుకుపోయి, ఇంచుమించు నిర్జీవంగా, మంచంపై పడున్న ఆ అమ్మాయిపై అతనికి వాత్సల్యం కలిగింది.

ఒక్క మంచి సినిమా, ఒకే ఒక్క మంచి సినిమా… కదిలించగలిగే సినిమా. నిజంగా నవ్వించి, ఏడిపించగలిగే సినిమా అంటూ ఇటీవల మనసు మరీ సినిమా ఫక్కీలో కొట్టుమిట్టాడింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ల కొద్దిపాటి వెతుకులాటల తర్వాత, అదే వెతుక్కుంటూ వస్తుందిలే అని విసుక్కుని వదిలేసాక కనిపించింది ‘అక్టోబర్‌’ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో. అదీ మన హిందీ సినిమా, మనసు దాహాన్ని తీర్చిన సినిమా.

నిజానికిది సినిమా కాదు, ఒక సుదీర్ఘమైన కవిత. ఓ చెయ్యి తిరిగిన చరిత్రకారుడు, కళను దైవంలా ఆరాధించే సృజనకారుడు, పూల రెక్కల వంటి మనసు కలిగిన భావోద్వేగి, అందరినీ సమదృష్టితో చూడగలిగే వేదాంతి… అందరూ కలిసి ఒకేచోట ప్రాణం పోసుకున్నట్లుగా, తమ పంచ ప్రాణాలనూ ధారపోసి సృష్టించినట్లుగా ఉందీ సినిమా. దీని అణువణువులోనూ సౌందర్యం తొణికిసలాడింది. సౌందర్యమంటే కంటికి కనిపించే అందం కాదు, జీవితంలోని అన్ని కోణాల్నీ ఉన్నవి ఉన్నట్లుగా చూడగలిగే స్పృహ నుండి పుట్టుకొచ్చే అందం. ఒక స్పందనను స్పందనలా పట్టుకోగలిగిన నైపుణ్యంలో నుండి తొంగిచూసే అందం.

అందరూ డ్యాన్‌ అని పిలిచే డానిష్‌ వాలియా అనే పాతికలోపు వయసున్న కుర్రాడు, ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ట్రైనీగా పనిచేస్తుంటాడు. కొంచెం అమాయకత్వం, కొంచెం అసహనం, ఇంకొంచెం కోపం, చాలా ఎక్కువ ముక్కుసూటి తనం కలిగి ఉన్న ఈ అబ్బాయి, మర్యాద ముసుగులు కప్పుకున్న ఈ లోకం పోకడలకు ఇంకా పూర్తిగా అలవాటుపడి

ఉండడు.

అలా అందరిలా మారిపోయే క్రమంలో చెప్పలేనన్ని తిప్పలు పడుతుండగా, అతని జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఎప్పుడూ ఎదురుగా కనిపించీ, అప్పుడప్పుడూ అలవాటుగా పలకరించీ, అప్పుడో ఇప్పుడో – పార్టీనో, పిక్నిక్‌నో అందరితోపాటుగా కలిసి పంచుకున్న తోటి ట్రైనీ ‘షూలీ’ అనే అమ్మాయి, హోటల్‌ మూడో అంతస్తు నుండి క్రిందికి పడిపోయి కోమాలోకి జారుకుంటుంది.

చూడడానికి వెళ్ళిన డ్యాన్‌ వంటినిండా ట్యూబులతో, వాచిపోయిన ముఖంతో స్పృహ లేకుండా పడి ఉన్న షూలీని చూసి, మొదట్లో అందరిలానే స్పందిస్తాడు. కానీ మెల్లమెల్లగా అతనికే తెలియకుండా అతనిలో మార్పు మొదలవుతుంది. హాస్పిటల్‌కి వెళ్ళి షూలీని చూసి రావడం, అక్కడ ఎక్కువ సమయాన్ని గడపడం, అతడికి ముందు అలవాటుగా తర్వాత వ్యసనంగా మారిపోతుంది. తనలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అతనికే అర్థం కాక, కారణాల కోసం వెతుక్కుంటాడు.

షూలీ తనని ఇష్టపడి ఉండవచ్చనీ, అది తనకు అప్పట్లో తెలియకపోయి ఉండవచ్చనీ, అందుకే ఇప్పుడిలా అనిపిస్తోందనీ నమ్మే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ప్రయత్నం పెద్దగా ముందుకు సాగకపోయేసరికి తన మామూలు ధోరణిలో, ఎవరేమన్నా పట్టించుకోకుండా నచ్చింది నచ్చినట్టు చేయడాన్ని కొనసాగిస్తాడు. హోటల్‌ పని వేళల్నీ, హాస్పిటల్‌లో ఎక్కువ సమయాన్ని గడపాలన్న కోరికనూ సమన్వయపరచుకోలేక, రెండు పడవల మీదా కాళ్ళేసి కాలాన్ని నడిపిస్తాడు. ‘షూలీ ఎప్పుడు కోమా నుండి బయటకు వస్తుందా’ అని ఆశగా ఎదురుచూసే ఆమె కుటుంబ సభ్యులలా కాకుండా ఎటువంటి ఆకాంక్షలూ, ఆపేక్షలూ లేకుండా, అతడు అక్కడ సమయాన్ని గడుపుతూ, తోచిన సహాయం చేస్తూ ఉంటాడు.

ఆమె మేలుకుని కళ్ళు తెరిచి చూసినప్పుడు ఉప్పొంగిపోయి, సంతోషంతో తలక్రిందులైపోడు. అలా అని, అతడ్ని సరిగ్గా గుర్తైనా పట్టకుండానే ఆ అమ్మాయి ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతే పిచ్చివాడూ అయిపోడు. చివరికి ఆమె డెత్‌ సర్టిఫికెట్‌ కూడా అతనే తెచ్చి పెడతాడు. ‘మనం చేయగలిగింది మనం చేయాలి, వచ్చే ఫలితాన్ని మాత్రం ఎటువంటి పేచీ లేకుండా స్వీకరించాలి’ అన్నదే డ్యాన్‌ తత్వం. ‘తను మమ్మల్ని గుర్తుపట్టకపోతేనేం, మనం తనని గుర్తుపడతాం కదా’ అంటాడొకచోట. అతడి అతి తక్కువ మాటల్లో ఒకటైన ఈ వాక్యమే, అతని తత్వాన్ని పట్టిస్తుంది.

అందమైన రూపంలో చుట్టుపక్కలే తిరుగుతున్నంతసేపూ, డ్యాన్‌కు ష్యూలీపై ఎటువంటి అభిప్రాయమూ కలగనేలేదు. కన్ను వాచిపోయి, ముఖమంతా చెక్కుకుపోయి, ఇంచుమించు నిర్జీవంగా, మంచంపై పడున్న ఆ అమ్మాయిపై అతడికి వాత్సల్యం కలిగింది.

అప్పుడప్పుడూ ప్రియురాలితో మాట్లాడినట్లు మాట్లాడినా, జెలసీ వంటి భావాలను ప్రదర్శించినా, దానిని ప్రేమ అని ఏ మాత్రం అనలేం. ఆ భావం ఏమిటీ, ఎందుకు అలా కలిగిందీ అనే తర్కాల జోలికి పోకుండా, లోకానికి వెరవకుండా, తనకు తోచినట్లుగా ప్రవర్తించడమే డ్యాన్‌ గొప్పతనం. అది సరైన పనని చెప్పలేం కానీ సహజమని మాత్రం ఒప్పుకోగలం.

దర్శకుడు షూజిత్‌ సర్కార్‌ సినిమాలు, వికీ డోనర్‌ తప్ప మరేవీ చూడలేదు. జీవితాన్ని ఉన్నదున్నట్లు చూపించడం కోసం అతడు పడే తపన ఈ ఒక్క సినిమాలోనైనా పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఫ్రేంలోనూ ఓ కథను ఇముడుస్తాడు. అత్యంత కీలకమైన సంఘటనలనైనా సామాన్యంగానే పట్టుకుంటాడు. అతి సామాన్యమైన క్షణాలకూ సమానమైన గౌరవాన్ని కల్పిస్తాడు. షూలీ, తడికి చేతులు జారి, పిట్టగోడ మీదనుండి పడిపోవడమనే సంఘటన ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా అతి మామూలుగానే జరిగిపోతుంది. ఆ సమయానికి అక్కడ పార్టీ జరుగుతుండడంతో, వెనకనుండి వస్తున్న ఉత్సాహభరితమైన సంగీతం, ఆమె పడిపోయాక కూడా కొనసాగుతూ ఉంటుంది.

కొందరు మనుషుల్లోని ఆశావహ దృక్పథాన్నీ, మరి కొందరిలో నిత్యమూ నివాసముండే నిరాశావాదాన్నీ కూడా సహజాతంగా చూపించాడు షూజిత్‌. అవకాశవాద ధోరణిని మాత్రం, డ్యాన్‌ అమాయకత్వం ద్వారా ప్రశ్నించాడు.

అంతేకాక, కోమా వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారి బంధువులు, సన్నిహితుల మానసిక, ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఏ విధంగా అల్లకల్లోలమైపోతాయో చెప్పే ప్రయత్నం చేశాడు. షూలీ తండ్రి చనిపోవడంతో ఒంటరిగానే ముగ్గురు పిల్లల్ని పెంచుతున్న ఆమె తల్లి ఒక పక్క హాస్పిటల్‌లో ఉంటూనే, మరోపక్క కాలేజీకి వెళ్ళి పాఠాలు చెబుతూ ఉంటుంది. దాచింది కాస్తా షూలీ ట్రీట్‌మెంట్‌ కోసం ఖర్చు చేసేందుకు వెనకాడదు. ‘ఇదంతా ఇకమీదట మా జీవితాల్లో జరుగుతూ ఉండేదే’ అంటూ అంతటి దుఃఖాన్నీ కూడా, నిందలేని మనసుతో స్వీకరిస్తుంది. పువ్వు పూయడం, రాలిపోవడం ఎంత సహజమో, జీవన్మరణాలూ అంతే సహజమని చెప్పే వేదాంత ధోరణిలో సాగుతుంది సినిమా మొత్తం. పెద్ద పెద్ద మాటలు చెప్పకుండానే, భారీ భారీ దృశ్యాలను చూపకుండానే మనసునూ, కళ్ళనూ కూడా మాటిమాటికీ తడి చేస్తుంది ‘అక్టోబర్‌’. షూలీ అంటే బెంగాలీలో పారిజాత పుష్పమని అర్థమట. షూలీకి పారిజాత పూలంటే ఇష్టం కావడం, అవి పూయడం అక్టోబర్‌ నెలలో మొదలు కావడం – ఈ సినిమా పేరు వెనుకనున్న కథ.

నిట్టనిలువుగా రాలి నేలను ముద్దాడే పారిజాత పుష్పాలూ, మాయలా కమ్ముకునే పొగమంచూ, నగరం నడుమన వంగి నిలబడ్డ పచ్చన చెట్లూ, చెట్లను వదిలి ఎగిరిపోయే తెల్లని పక్షులూ… ఇటువంటి అందమైన దృశ్యాలు కొన్ని అక్కడక్కడా కనిపించి, మనసును ఆహ్లాదభరితం చేస్తాయి. పాటల్లేని ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ముఖ్యంగా అక్టోబర్‌ థీమ్‌, విచిత్రమైన హాయిని కలిగిస్తుంది. చూస్తున్నంతసేపూ మనల్ని మననుండి వేరుచేసి, తెర లోపలి జీవితంలోకి తీసుకెళ్ళిపోతుందీ సినిమా. తేరుకుని చూస్తే, ముందు కాసేపు నిలబెట్టేసే నిశ్శబ్దమూ, ఇక తర్వాత తెరిపిలేని ఆనందమూనూ.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.