ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు – వసంత్ కన్నబిరాన్

ఇళాభట్‌ (పుట్టుక :1933) ప్రవృత్తి రీత్యా గాంధేయవాది. శిక్షణ రీత్యా న్యాయవాది. సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ వుమెన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ ఇ డబ్ల్యు ఏ – సేవా) వ్యవస్థాపకులు ‘ఉమెన్స్‌ వరల్డ్‌ బ్యాకింగ్‌’ వ్యవస్థ సంస్థాపకుల్లో ఒకరు. 1985లో పద్మశ్రీ, 86లో పద్మభూషణ్‌ అందుకున్నారు. సామాజిక నేతృత్వానికిగానూ 1977లో మెగసెసె అవార్డ్‌ లభించింది. 1984లో రైట్‌ లైన్‌ రీ హూడ్‌ అవార్డు అందుకున్నారు.

మీ వివాహం గురించి చెప్పండి

ప్రయత్నిస్తాను. నేనంత మాటకారిని కాదు. నా ఆలోచనలూ, అనుభూతులూ, భావాలను వ్యక్తపరచడానికి కష్టపడుతూ ఉంటాను. ఎవరైనా నా వ్యక్తిగత విషయాలు అడిగితే దాటవేస్తూ ఉంటాను.

అవునవును. అప్పుడప్పుడు మనతో మనమే తలబడటానికి తడబడుతూ ఉంటాం. కానీ ‘పని’ అంటే మన నియంత్రణలో ఉంటుంది కదా!… పోనీ విషయాలను పని కోణం నుంచి చెప్పండి.

అహ అదికాదు. నేను పదిమందిలో మాట్లాడటం గురించి చెపుతున్నాను. స్నేహితులతో మాట్లాడేటపుడు ఏ సమస్యా ఉండదు. పబ్లిక్‌ ఇంటర్వ్యూలంటే గొంతు పట్టేస్తుంది. మీకు ఇష్టమైన దుస్తులేంటి? బ్రేక్‌ఫాస్ట్‌ ఏం తిన్నారు? – ఇలాంటి విషయాల్లోకి వెళ్ళలేను. మేమిద్దరం కలిసి చదువుకున్నాం.

కాలేజీలోనా?

కాదు. నేను కాలేజీకి వెళ్ళక ముందు నుంచీ అతను నాకు తెలుసు. ఇదిగో ఈ ఇలాకా మనిషే. మా ఇంటిమీదుగా వెళ్తుండేవాడు. నేను గమనిస్తూ ఉండేదాన్ని. అతని సైకిల్‌ గంటను గుర్తుపట్టేదాన్ని. ఏదో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. నేనూ చేస్తూ

ఉండేదాన్ని. మా కుటుంబాల్లో ఎవరింట్లోనో ఓ రోజు భోజనాలు జరిగాయి. అతను వచ్చాడు. మళ్ళా చూశానన్న మాట. ఊరికే చూశాను. అంటే అతనూ మా కులం వాడేనని గ్రహించాను. ఆ తర్వాత మేము కాలేజీలో చేరాం. ఆ రోజుల్లో సూరత్‌ పట్టణంలో ఒకే ఒక కాలేజ్‌

ఉండేది. ఎమ్‌.టీ.బీ. ఆర్ట్స్‌ కళాశాల. మధ్య తరగతి విద్యార్థుల కళాశాల అది. అక్కడ మేము కలిసి చదువుకున్నాం. కాలేజీలో మొదటి ఏడాది నుంచీ అతను మహా పాప్యులర్‌. పదిమందికీ తెలిసిన మనిషి. విద్యార్థి నాయకుడు. కాలేజీ కార్యక్రమాల్లో తన కవితలు చదివేవాడు. కాలేజీకి రావడమే తాను – ‘వివధ్‌’ అన్న నాటకం మీద రాసిన పుస్తకం చేతబట్టుకుని వచ్చాడు. మొత్తం కాలేజీ అంతటికీ జనరల్‌ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. మంచి కార్య నిర్వాహకుడు. అమ్మాయిలంతా అతని కవిత్వం చదువుతోంటే ఆసక్తిగా చూసేవారు. నేనూ ఆ ఆకర్షణలో పడ్డాను. నేనప్పటిలో బాగా బిడియస్థురాలిని. పదమూడేళ్ళు నిండేలోగానే మెట్రిక్‌ పాసయ్యాను కదా – బాగా చిన్నదాన్నన్న మాట. అగ్రవర్ణ కుటుంబంలో పుట్టి పెరిగాను. మా అమ్మావాళ్ళది జాతీయోద్యమ కుటుంబం. మా తాతయ్య ఉప్పు సత్యాగ్రహపు యాత్రలో పాల్గొన్నారు. మా మేనమామ, మరి కొంతమంది స్వాతంత్య్ర సమరంలో జైలుకు వెళ్ళారు.

మీరూ పాల్గొన్నారా?

లేదు. నేనప్పటికింకా స్కూల్లోనే ఉన్నాను. దేశం స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమయమది. 1947లో కాలేజీలో చేరాను. అప్పుడే మనకు స్వాతంత్య్రం వచ్చింది. మా టీచర్లందరూ జాతీయ వాదులు. ‘గ్రామాలకు తరలి వెళ్ళండి. అక్కడ గడపండి. అక్కడే నివసించండి’ అని బోధించేవారు. అదీ అప్పటి వాతావరణం. ముషాయిరాలూ, అంతర్‌ కళాశాల కవి సమ్మేళనాలు కూడా దేశభక్తి విషయాల మీదే ఉండేది. అలాంటి ఒక వాతావరణంలో అతను ఒక నాయకుడిగా ఎదిగాడు. అతగాడిని నేను ఒక యువనేతగా పరిగణించానో – నవ యువకుడిగానో, నాకే తెలియదు! ఆ రోజుల్లో అతనికి పిలక ఉండేది (చిన్న నవ్వు). అది ఇంకో చెప్పుకోదగ్గ విశేషం. అతను రాసిన వాటిని చదవడం మీద నాకు ఆసక్తి కలగసాగింది. వాళ్ళది చాలా నిరాడంబర కుటుంబం. ఘనత వహించిన 1856 నాటి కరువు రోజుల్లో వాళ్ళ కుటుంబం ఉత్తర గుజరాత్‌లోని సబర్‌ కంఠా ప్రాంతం నుంచి సూరత్‌ నగరానికి వలస వచ్చింది. అతనో మిల్లు కార్మికుని కొడుకు. వాళ్ళ నాన్నా వాళ్ళ మిల్లు అడపాదడపా మూతబడుతూ ఉండేది. పాఠ్య పుస్తకాల కోసం అతను మా కాలేజి గ్రంథాలయం మీద బాగా ఆధారపడేవాడు. అప్పుడప్పుడు నేనూ లైబ్రరీకి వెళ్ళేదాన్ని. చదవడానికి పుస్తకాలు ఇచ్చేవాడు. గాంధీజీ భావజాలంతో నా పరిచయం అలా మొదలయింది. జేసీ కుమరప్ప, స్వామి వివేకానందల పుస్తకాలు కూడా ఇచ్చేవాడు. ఆ రోజుల్లో కాలేజి వాతావరణం అలా ఉండేది. మేం కలిసి మెలిసి తిరిగేవాళ్ళం. మా అనుబంధం అలా వృద్ధి చెందింది. మేమింకా ఇంటరు రెండో సంవత్సరంలో ఉండగానే అతగాడేదో మాట పద్య రూపంలో అడిగాడు. నేను సరేనన్నాను (నవ్వు).

ఏం పద్యమదీ?

‘మారి విని, ఝని, జీవ్‌ పాన్‌ ఖడి, స్వీకర్షి-నే’ (నా జీవితంలోచి ఓ చిగురుటాకును సమర్పిస్తున్నా-స్వీకరిస్తావా?) అప్పటికి నేనింకా రెండేళ్ళు చదవవలసి ఉంది. అతనూ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేయడానికి మరో రెండేళ్ళు చదవాలి. ఆ తర్వాత ఎమ్మే. చదువుతున్నంత కాలం అతను ఏవేవో

ఉద్యోగాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నా వాళ్ళ మిల్లు మూత బడింది గదా, అతనూ పని చేసి తీరాలి. రాత్రిపూట ఓ న్యూస్‌ పేపర్‌ ఆఫీసులో పనిచేసేవాడు. పగటి పూట ఓ మగపిల్లల స్కూల్లో రోజంతా పాఠాలు చెప్పేవాడు. ఉదయం ఎల్‌ఎల్‌బీ క్లాసులు. ఎకనమిక్స్‌, హిస్టరీ సబ్జెక్టులతో పట్టా పుచ్చుకున్నాడు. అతడిని వాళ్ళ అత్తయ్య ఫోయ్‌ పెంచింది. ఆవిడకు వయసు మళ్ళుతోంది. అంచేత పెళ్ళి చేసుకోమని అతని మీద విపరీతమైన వత్తిడి. వాళ్ళ అత్తయ్యకు సాయంగా ఓ ఇంటి కోడలు కావాలి మరి.

ఎవరు?

ఫోయ్‌ వాళ్ళ నాన్నగారి అక్క. ఆయన భార్య పోయాక ఆయన కుటుంబం బాగోగులు ఆవిడే చూసుకుంటోంది. ఇద్దరు చంటి పిల్లల్నీ పెంచింది. అంచేత వాళ్ళ నాన్నగారికి తన అక్క అంటే ఎంతో కర్తవ్య బాధ్యత ఉంది. రమేష్‌ తన పెళ్ళి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాడు. వద్దంటే వద్దన్నాడు. అలా చెప్పడం నిజంగా చాలా కష్టమయిన పని అయి ఉండాలి. మా వైపు నుంచి నా మీద ఎలాంటి ఒత్తిళ్ళూ లేవు, అయినా మా అమ్మావాళ్ళను నాకు కావలసింది అడిగే ధైర్యముండేది కాదు.

పెళ్ళి చేసుకోమనే వత్తిడి ఉండేదా?

లేదు. నా మీద పెళ్ళి విషయంలో ఎలాంటి వత్తిడి ఉండేది కాదు అప్పటికి నేనింకా చిన్నదాన్ని. చదువుకొంటున్న దాన్ని. అయినా నా మనసులోని మాట అమ్మా వాళ్ళకు చెప్పాలనుకున్నాను. కాలేజి రోజుల్లో నాకో ఆకుపచ్చ సైకిల్‌ ఉండేది. మేమిద్దరం సైకిళ్ళ మీద కలిసి తిరిగేవాళ్ళం. పుస్తకాలు చదివేవాళ్ళం. మాట్లాడుకునేవాళ్ళం. రోజంతా మాటలే మాటలు. మీకు తెలుసా – నేను కొంచెం నత్తిగా మాట్లాడేదాన్ని కానీ అతని ముందు ఆ తడబాటే ఉండేది కాదు. ఎంత ఆశ్చర్యం! అంటే నేను…అతను నా జీవిత… అతనిలో ఒక మేధావీ ఉన్నాడు, సృజనశీలీ ఉన్నాడు. అతనితో కలిసి తిరుగుతున్నానన్న మాట మా అమ్మ వాళ్ళ చెవిన పడనే పడింది. ఆ రోజుల్లో అది మహా నిషిద్ధం. అలాంటి పనులు చెయ్యనే చెయ్యకూడదన్న మాట. అసలా రోజుల్లో చాలా కొద్దిమంది ఆడపిల్లలే సైకిల్‌ తొక్కేవారు.

భారతదేశపు జనాభా లెక్కల బృహత్‌ కార్యక్రమానికి నాందీ ప్రస్థావనగా 1949లో బహుశా మా కాలేజీ వాళ్ళను ఒక ప్రాథమిక సర్వే చేయమని అడిగినట్లున్నారు – రమేష్‌ విద్యార్థి నాయకుడు కాబట్టి మిగిలిన విద్యార్థులను కలుపుకొని ఆ పనిచేసే బాధ్యతను అతనికి అప్పగించారు. ‘మా బృందంలో చేరతావా?” అని అడిగాడు. జాలారి వాళ్ళ మురికివాడల్లో పని, వెళ్ళాను. రోజూ ఆ పని ముగించుకొని ఆలస్యంగా ఇంటికి చేరుతూ ఉండేదాన్ని. మురికివాడల గురించి చెప్పేసరికి మా అమ్మా వాళ్ళకు కొంచెం ఆందోళన కలిగింది. పేదరికంతో నా మొదటి పరిచయమది. దేశానికీ, పేద ప్రజానీకానికీ సేవ చేయాలని బోధించారు కదా మా టీచర్లు. మొదట్లో ఆ వాడల్లో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. కానీ రమేష్‌కి అదేం లేదు. అక్కడివాళ్ళతో మహా సులువుగా కలిసిపోయేవాడు. వాళ్ళతో మాట్లాడడం, సమాధానాలు రాబట్టడం. నేను కొంచెం బిడియపడే మనిషినే కానీ మొత్తానికి ఆ వాడల్లో వాతావరణం బావుండేది. ఎలాంటి భయాలూ

ఉండేవి కాదు. ఉత్తేజకరంగా ఉండేది. అలా ఆ వాడలకు వెళ్ళడం, రోజూ ఆలస్యంగా ఇంటికి రావడం. ఇదంతా మా ఇంట్లో చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ‘నీకసలు పేదరికం అంటే తెలుసా? ఈ మనిషిని పెళ్ళి చేసుకుని జీవితాంతం ఆ పేదరికంలో గడపగలవా’ అని నాన్న అడిగారు. ఆ విషయం నేను అప్పటికే ఆలోచించలేదని కాదు. నిజానికి నిరాడంబరంగా, కనీసావసరాలు కూడా లేకుండా బ్రతకడానికి నేను మానసికంగా సిద్ధపడే ఉన్నాను. అప్పట్లో నేను సకల సౌకర్యభరిత జీవితం గడుపుతునానన్న మాట. నిజమే కానీ ఆ రోజుల్లో వాతావరణం ఎలా ఉండేదంటే మంచి బట్టలు కూడా వేసుకునేవారు కాదు. చిరిగిన బట్టలే వేసుకునేవారు. అందులోనే దేశ ప్రేమ ఉండేది. అంచేత ఆ రోజుల్లో ఆదర్శవాదిగా

ఉండడం అంత కష్టమేమీ కాదు. ఫిర్‌భీ – మా అమ్మా వాళ్ళకు నేను అలా ఉండగలనని నిరూపించదలచాను. అందుకోసం ఓ గ్రామంలో ఏడాది పాటు ఉన్నాను. అలా ఏడాదిపాటు ఉండిపోయాను. నా జీవితంలోని ఈ ఘట్టం గురించి ఇప్పటిదాకా వివరంగా ఎవరికీ చెప్పలేదు. ఎక్కడా రాయను కూడా రాయలేదు. ఇప్పుడు వింటే అదంతా ఓ కట్టుకథ అనిపించవచ్చు. నా అగ్రవర్ణం, మంచి ఆరోగ్యం, చదువు, భాష – వీటన్నిటి పుణ్యమా అని ఆ గ్రామస్థులందరూ నా పనులు చేసి పెట్టడానికి ఎప్పుడూ సంసిద్ధంగా

ఉండేవారు. నీళ్ళు తెచ్చుకోవడం, వంట వండుకోవడం, ఏదో ఒక పని… అవన్నీ నేను చేసుకునేదాన్ని… అయినా… నేను ఏనాడూ రేపటి సంగతి ఏమిటి? అనే చింతకు గురి అవలేదు. పేదవాళ్ళను అనునిత్యం వేటాడి వేధించే ఆ ఇన్‌సెక్యూరిటీ నన్ను ఏనాడూ బాధించలేదు. గ్రామీణ జీవితం గురించీ, రమేష్‌ను పెళ్ళి చేసుకోవడం గురించీ నేను కృత నిశ్చయంతో ఉన్నాను. గట్టిగానే ఆలోచించాను. ‘చూడు… నేను పేదరికంలో కూడా బ్రతికి చూపించగలను’ అని మా నాన్నకు నిరూపించాలని నా పట్టుదల. అయినా మా అమ్మా, నాన్నా కొంత సమయం కావాలన్నారు. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు. వాళ్ళను ఒప్పించే ముందుకు సాగాలన్నది నా ఆలోచన. అప్పటికల్లా రమేష్‌ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. ఎకనమిక్స్‌లో ఎమ్మే పాసయ్యాడు. లాయరు ప్రాక్టీసు పెట్టవచ్చు కానీ అందుకు అసరమయిన దన్ను లేదు. మా నాన్న తీరిక లేని లాయరన్న మాట నిజమే కానీ మేమిద్దరమూ ఆయన సహాయం ఏ మాత్రం తీసుకోకూడదనుకున్నాం. అక్కడితో ఆ ఆలోచన ముగిసింది. రమేష్‌ టీచరు ఉద్యోగంలో చేరారు. అటు మా నాన్న జిల్లా జడ్జి అయ్యారు. సెషన్స్‌ జడ్జి అయ్యారు. చివరికి హైకోర్టు జడ్జి అయ్యారు. మేమంతా అహ్మదాబాద్‌కు మారాం. నిజానికి అహ్మదాబాద్‌ మా సొంతూరు. అంటే మా నాన్న న్యాయ వ్యవస్థలో ఎంతో పెద్ద పదవి చేపట్టి తన స్వంత ఊరు తిరిగి చేరారన్నమాట. ఓ పెద్ద బంగళాలో ఎంతో మంది పనివాళ్ళ మధ్య మా జీవనం. ఇక అమ్మకు వంట చేయవలసిన అవసరమే లేకపోయింది. రమేష్‌ కూడా అహ్మదాబాద్‌లో లెక్చరర్‌గా చేరాడు. అలా కాలం గడిచిపోయింది. చివరికి అమ్మా వాళ్ళు ఒప్పుకున్నారు.

అప్పటికి మీ చదువైపోయిందా?

అయిపోయింది. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చేశాను. మిల్లు కార్మికుల సంఘం వారి లీగల్‌ విభాగంలో చేరాను. నా కాళ్ళమీద నేను నిలబడుతోన్న సమయమది. ‘ఈ అమ్మాయికి పట్టుదల ఉంది. జీవితంలో ఒక ఖచ్చితమైన ధ్యేయం ఉంది’ అని మా అమ్మా నాన్నా గుర్తించారు. అమ్మాయి ఇక ఇటు నిలవదనీ గ్రహించారు. అందరిలానే మా తల్లిదండ్రులకీ మా స్థాయికో, ఇంకా పై స్థాయికో చెందిన వరుడ్ని ఎంపిక చేసి వివాహం జరిపి దాని ద్వారా తమ తమ సామాజిక స్థాయిని ఉన్నతీకరించుకోవాలన్న ఆకాంక్ష లేకపోలేదు. అయినా వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకున్నారు. ప్రేమ, అభిమానం ఉన్న వ్యక్తులు వాళ్ళు.

అంటే ఏ రకమైన వత్తిడీ లేనట్టేనా?

చాలా తక్కువ. ఆ వత్తిడి ఫోయ్‌ – మా నాన్న వాళ్ళ అక్కయ్య – నుంచి ఎదురయింది. ఇంకా కొంతమంది దగ్గర బంధువులు కూడా ‘ఏ ఠీక్‌ నహీ హై’ అన్నారు. కానీ రమేష్‌ను కలిసాక ప్రతి ఒక్కరూ అతడ్ని ఇష్టపడేవారు. అతని వ్యక్తిత్వం అలాంటిది. సూక్ష్మబుద్ధి, మృదు స్వభావి, విజ్ఞాన ఖని, మర్యాద తెలిసినవాడు. అవన్నీ చూసి అందరూ సమాధానపడ్డారు కీ నై, లడ్కా అచ్ఛా హై – (కాదులే కుర్రాడు మంచాడు). నాకు నా ఉద్యోగముంది. అతనికీ అతని ఉద్యోగముంది. ఇక రంగం సిద్ధమయింది. మా పెళ్ళి అహ్మదాబాద్‌లో జరిగింది. ‘పెళ్ళి నిరాడంబరంగా జరగాలి మొర్రో’ అని నేను మా వాళ్ళతో తెగ మొత్తుకున్నాను. వినలేదు. మా నాన్న ఎంత అట్టహాసం చేశారంటే, ఇప్పటికీ అందరూ ఆ విషయాలు చెప్పుకుంటుంటారు. కానీ, ఇచ్చి పుచ్చుకోవడాల ప్రసక్తి లేనేలేదు. పెళ్ళిలో నేను తెల్లని ఖద్దరు చీర కట్టుకున్నాను. నగలు పెట్టుకోలేదు. అప్పట్నుంచీ ఏనాడూ నేను నగలు పెట్టుకోలేదు.

మీరేమో ఖద్దరు చీర… పెళ్ళేమో ధూమ్‌ ధామ్‌గా జరిగింది!

మా నాన్న బాగా పెద్ద పదవిలో ఉన్నారు కదా! అహ్మదాబాద్‌ నిండా సేఠ్‌లే సేఠ్‌లు… ఇహ మా నాన్నకు తెలిసిన వాళ్ళంతా గవర్నమెంటులో పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు. మా పెళ్ళి విందులో సూరత్‌ మిఠాయి పెట్టాం. సూరత్‌ స్వీట్లు ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన మిఠాయిలు. అవి చేయడానికి సూరత్‌ నుంచి వంటవాళ్ళను రప్పించాం. అందరూ బాగా ఆనందించారు. అలా ఇద్దరం కలిసి జీవితంలోకి అడుగుపెట్టాం. గాంధీ బాణీ జీవన సరళి మా దైనందిన జీవితంలో అంతర్భాగమయింది. మేము విద్యాపీఠ్‌లో ఉండేవాళ్ళం. అక్కడ పరిసరాలు, ఆ ఆశయాలు, జీవనసరళి, ఆఫీసు వాతావరణం… అంతా గాంధీతత్వం. ఎటు చూసినా ఖాదీ… గ్రామోద్యోగం. నూలు వడకడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, టాయిలెట్లు కడగడం, బాత్రూంలు కడగడం… అన్ని పనులూ అందరం సంతోషంగా చేసుకునేవాళ్ళం. మేం కాపురం పెట్టిన కొద్దికాలానికే మా నాన్నకు బొంబాయి బదిలీ అయింది. మా అమ్మకు నా గురించి బెంగగా ఉండేదనుకుంటున్నాను. అప్పట్లో అవేమీ నాకు తెలియరాలేదు. నా వరకూ నేను సంతోషంగా ఉన్నాను.

ఆ రోజుల్లో మీరు ఎక్కడ ఉండేవారు? విడిగానా… లేకపోతే ఇంకెవరితోనైనా…

అహ్మదాబాద్‌లో గుజరాత్‌ విద్యాపీఠ్‌లో మాకు క్వార్టర్లిచ్చారు. విద్యాపీఠ్‌ మా మొట్టమొదటి మజిలీ. అక్కడ రమేష్‌ గాంధియన్‌ ఆర్థిక శాస్త్రం బోధించేవాడు. అదో విలక్షణ పాఠ్యాంశం. నేను మజ్దూర్‌ మహాజన్‌ సంఘ్‌… మిల్లు కార్మికుల సంఘంలో పనిచేస్తూ ఉండేదాన్ని. ఆ సంఘాన్ని గాంధీజీనే స్థాపించారు. రమేష్‌ పనిచేసే విద్యాపీఠ్‌నూ గాంధీనే స్థాపించారు. చాలా బావుంది కద!! ఈ రెండు సంస్థలు గుజరాత్‌ రాష్ట్రపు శాంతి సౌభాగ్యాల పరిరక్షణలో ప్రముఖ చారిత్రక పాత్ర పోషించాయి.

అమి మా మొదటి బిడ్డ. జీవితం మహా వేగవంతంగా సాగిపోయిన సమయమది. జీవితం మహా వేగంగా సాగింది. పదమూడేళ్ళకు మెట్రిక్‌. పదిహేడేళ్ళకు బియ్యే, ఎల్‌ఎల్‌బీ పందొమ్మిదేళ్ళకు, పెళ్ళి ఇరవై ఏడేళ్ళకు, మొదటి బిడ్డ ఇరవై రెండేళ్ళకు. రెండో బిడ్డ ఇరవై మూడేళ్ళకు… ఫటాఫట్‌ వేగమే వేగం. రోజులు సంతోషంగా గడిచిపోయిన మాట నిజమే కానీ ఒక రకంగా కష్టకాలమది. విద్యాపీఠ్‌లో బొత్తిగా జీతాలు తక్కువ. గర్భిణీని అయిన రెండుసార్లూ నేను ఉద్యోగం వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇద్దరు చంటిపిల్లలు. ఇంటి పని బోలెడంత బాధ్యత. ‘పాపను నా దగ్గర వదిలిపెట్టు. నీకు కాస్త సులువుగా ఉంటుంది’ అంది అమ్మ. ‘మేము ఎలాంటి పరిస్థితుల్లో

ఉన్నామో మా పిల్లలు కూడా అలాంటి పరిస్థితుల్లోనే పెరగాలి’ అన్నాను. అవి గడ్డు రోజులే అయినా చాలా సంతోషం నిండిన రోజులు కూడా. మొట్టమొదట్లో నాకు ఇంటి పని అంత బాగా వచ్చేది కాదు. నాకు వంట వండడం రమేష్‌ నేర్పించాడు. మా ఫోయ్‌ మాతో పాటు ఒక అత్తగారిలా నివసిస్తూ ఉండేది. ఇంటిపనుల్ని క్రమబద్ధంగా చేసుకోవడం నేర్పింది ఆవిడ. బ్రాహ్మణ పూర్వ సువాసినులు ఎంత ఖచ్చితంగా ఉంటారో తెలుసు కదా… ఇంటి పనికి కానీ, వంట పనికి కానీ బయట మనుషుల్ని పెట్టుకోవడానికి ఆమె అంగీకరించేది కాదు. అలా ఏ చేతి సాయమూ లేకుండా కుటుంబాన్ని నడపడం చాలా కష్టంతో కూడిన విషయమే కానీ నేను ఏనాడూ ఫిర్యాదు చేయలేదు. మా ఫోయ్‌ నా విషయంలో ఏమంత సానుకూలంగా ఉండేది కాదు. అది నాకు బాగా చిరాకు కలిగించేది కానీ, నేను ఏ చింతనూ దగ్గరకు రానివ్వలేదు.

ఆవిడ ఆయన అత్తయ్యా?

అవును. వాళ్ళ నాన్న వాళ్ళ అక్కయ్య. ఫోయ్‌ రమేష్‌నూ, వాళ్ళ చెల్లినీ చాలా చిన్నప్పటినుంచే పెంచి పెద్ద చేసింది. అప్పుడావిడకు వయసు మళ్ళుతోంది కాబట్టి ఆవిడను కడదాకా చూసుకోవడం మా బాధ్యత అనుకొన్నాం. చివరి రోజుల దాకా చూసుకున్నాం. ఇంటిని చక్కబెట్టుకునే నైపుణ్యం ఆవిడ దగ్గరే అలవరచుకున్నాను. పొదుపరితనం, శుభ్రత, పౌష్టికాహారపు మెళకువలు, పదార్ధాలను తిరిగి తిరిగి ఉపయోగించడం, ఇల్లు శుభ్రంగా సర్దుకోవడం… అన్నీ ఆవిడ పుణ్యమే. రోజంతో ఓ టైమ్‌ టేబుల్‌ ప్రకారం సాగినట్లు సాగిపోయేది. మా రమేష్‌ నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. మా పెళ్ళికి ముందు ఇంటి పనులూ అతనే చేసేవాడు. ఆవిడకు వయసు మళ్ళుతోంది కదా పైగా నెలల తరబడి ఆవిడ వాళ్ళ స్వగ్రామానికి వెళ్తూ ఉండేది. అప్పుడు ఇల్లు నడపడం రమేష్‌ పనే. అంచేత ఇంటి పనులూ, వంట పనుల్లో అతనికి మంచి ప్రవేశం ఉండేది. గాంధీ భావజాలం ప్రకారం కూడా అతన్ని అలా తీర్చిదిద్దింది. నా సంగతి అలా కాదు. అయినా నేనూ చాలా త్వరగానే అంతా నేర్చేసుకున్నా. చిన్న వయసులో అన్ని పనులూ చాలా తొందరగా నేర్చేసుకుంటాం. ప్రేమనేది ఉంటే ఎన్ని పనులైనా చేసేస్తాం. పిల్లలు పుట్టాక మరి ప్రేమ పరవళ్ళు తొక్కదూ!

మెల్లగా అతని జీతం పెరగసాగింది. విద్యాపీఠ్‌ నుంచి ఊళ్ళోని ఓ కాలేజికి లెక్చరర్‌గా మారాడు. అప్పట్లో నేను

ఉద్యోగం చెయ్యడం లేదు. అయినా పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చేర్పించాం. మంచి చదువు ఒక్కటే మా పిల్లలకు మేము సమకూర్చగలిగింది అనుకున్నాం. మాకు ఆర్థికంగా ఏదున్నా లేకపోయినా వాళ్ళ చదువుల విషయంలో మా ఆలోచన చాలా స్పష్టం. మాపెద్ద బిడ్డ… కూతురు అమిని మౌంట్‌ కార్మెల్‌ స్కూల్‌లో చేర్పించాం. ఒకరోజు స్కూల్లో పిల్లల్ని తాము బ్రేక్‌ఫాస్ట్‌ ఏమి తింటున్నారో రాయమన్నారు. ‘మేము బ్రెడ్‌, వెన్న, చేపలు, గుడ్లు తిన్నాం’ అనే సమాధానం కూడా వాళ్ళే నేర్పించారు. కానీ అమి ‘మేము మాంసం, చేపలు, గుడ్లు తినం’ అని రాసింది. వాళ్ళు దానికి గుండు సున్నా పెట్టారు. నోట్‌ బుక్‌ చూశాక ‘ఓరి దేవుడా’ అనిపించింది. రమేష్‌కు చూపించాను. ‘వీల్లేదు… మన పాప ఇక ఈ స్కూల్లో చదవడానికి వీల్లేదు’ అన్నాడు. ‘శ్రేయస్‌’ అన్న మరో స్కూల్‌ చూశాడు. బాగా ఖరీదైన స్కూలది. మా రెండో బిడ్డ మిహిర్‌ అప్పటికే ఆ స్కూల్లో చదువుతున్నాడు.

పిల్లలు కూడా ఇంట్లో పనులు చేసేవాళ్ళు. నేను చేస్తూ ఉంటా కదా – అది చూసి వాళ్ళూ చేసేవాళ్ళు. నా దృష్టిలో మన తర్వాత తరాల వారికి ఇదో గొప్ప నష్టం. ఇంట్లో పనివాళ్ళూ, వంటవాళ్ళే అంతా చేయడం, తల్లులు వంట గది దరిదాపులకు వెళ్ళకపోవడం.. కుటుంబ జీవితానికి అవసరమైన అతి ముఖ్యమైన నైపుణ్యాలు మనం కోల్పోతున్నాం. ఇప్పుడు రోజులు బాగా మారాయి. ఒకప్పుడు ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కునేవాళ్ళు… రమేష్‌, పిల్లలు, చుట్టాలు కూడా. (నవ్వు) ‘నువ్వు టీ తాగావూ అంటే ఆ కప్పు కడిగి దాని స్థానంలో

ఉంచాలి’ అనేది అప్పటి నియమం. నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో ఇంట్లో నాలుగు కప్పులు ఉండేవి. రోజూ అవే వాడేవాళ్ళం. మా పాపకి పందొమ్మిదేళ్ళు వచ్చి చదువుల కోసం ఢిల్లీ వెళ్ళేదాకా అవి అలానే ఉండిపోయాయి. ఇరవై ఏళ్ళుగా రోజూ వాడినా ఒక్కటైనా పగిలిపోలేదు. పిల్లల బాగోగులు నేను చూసుకునేదాన్ని. స్కూలుకు తయారుచేసి నేనే పంపేదాన్ని. హోమ్‌వర్క్‌ చేయించేదాన్ని. కానీ రాత్రిళ్ళు పిల్లలకు మెలకువ వస్తే మాత్రం అది అతని డ్యూటీ, నా పని కాదు. అతని కాలేజి పని ఉదయం పూటే ఉండేది. పన్నెండున్నరకల్లా ఇంటికి వచ్చి భోజనం చేసి, చిన్న కునుకు తీసి, ఆ తర్వాత తన ఇతర పనులు చూసుకునేవాడు. మా పిల్లలు ఉదయం ఎనిమిదింటికల్లా స్కూలుకు వెళ్ళేవారు. వాళ్ళు మళ్ళీ రెండింటికల్లా తిరిగి వచ్చేసరికి నేను నా పని నుంచి ఇంటికి తిరిగివస్తూ ఉండేదాన్ని. అప్పటిదాకా ఇంట్లో మా ఫోయ్‌ ఉంది కదా… అలా అంతా చక్కగా సర్దుబాటుగా సాగిపోయేది. ఏ క్షణమూ మా ఇంట తలుపులు మూతపడవు. పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఫోయ్‌ ఉండనే ఉంది. సాయంత్రాలు రమేష్‌ వాళ్ళని బయటకు తీసుకు వెళ్ళేవాడు. సరళమైన జీవనం,

రాత్రిళ్ళు రేడియో వినడం.

”మాకు పెళ్ళయిన రోజునే అప్పుడే కొత్తగా మొదలవుతోన్న ఒక కో-ఆపరేటివ్‌ సొసైటీ నుంచి ఇంటి స్థలం తీసుకునే అవకాశం వచ్చింది. డబ్బులు కట్టాం. వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డబ్బులతో కొన్నామది. అప్పట్లో అయిదు వేలయింది. అంటే మేమిప్పుడుంటోన్న ఇల్లు ఎప్పుడో 1959లో కట్టినప్పుడు ఇరవై ఆరు వేలయింది. దానికి మేము టాయ్‌ హౌస్‌… బొమ్మరిల్లు అని పేరు పెట్టుకున్నాం. అదిగో అలా మా మా జీవితాలనూ, పిల్లలనూ నిభాయించుకుంటూ వచ్చాం. ఒక మాట చెప్పాలి… మొదట మాకు పాప పుట్టినప్పుడు మా ఫోయ్‌ నిరసన ప్రదర్శించింది. మరుసటి ఏడాది బాబు పుట్టాక ఆవిడ ధోరణి మారింది!

మీ మిగతా కుటుంబం సంగతేంటి?

రమేష్‌ వాళ్ళ కుటుంబం చాలా చిన్నది. అతను కావాలని తన బంధుగణంతో తెగతెంపులు చేసుకున్నాడు. ఎప్పుడో ఏదో జరిగింది. వాళ్ళ కుటుంబాల వాళ్ళ సామూహిక భోజనాల్లో వాళ్ళ నాన్నగారిని ఆయన ఉన్న చోటు నుంచి లేచి ఆ చోటు మరో ధనిక బంధువుకి ఇవ్వమన్నారట. మనసు బాగా గాయపడడంతో రమేష్‌ వాళ్ళ నాన్నగారిని, ఫోయ్‌నీ తక్షణం ఆ చోటు వదిలి పెట్టమన్నాడట. వెంటనే రైలు పట్టుకొని ఇంటికొచ్చేసారట. అంతే… మళ్ళీ అలాంటి విందులకి వెళ్ళలేదు, చుట్టాలను కలవలేదు. అందువల్లేననుకొటాను… రమేష్‌ తరఫు నుంచి మాకంతటి బంధుగణం లేదు. వాళ్ళ చెల్లెలు కైలాష్‌ ఒక్కటే మినహాయింపు. మా అత్తగారు ఆవిడ కాన్పు సమయంలోనే పోయారట.

… మెల్లగా మేమంతా మా మా కార్యకలాపాల్లో నిమగ్నమైపోయాం. ఫోయ్‌ తన తొంభై ఏళ్ళ వయసులో పోయింది. ఇంట్లో పనులు ఇంకాస్త గాడిన పడ్డాయి. అవసరాన్ని మించి ‘ఇంటిపని’ భారం ఆడవాళ్ళు చేపట్టనే కూడదన్నది నా ఖచ్చితమైన భావన. అది సాగే పని కాదు. అడుగులేని బావి బాపతది. ఇంటి పనుల్ని ఎంతో సరళంగా ఉంచుకోవాలి. ఇది రమేష్‌ దగ్గర్నుంచి నేర్చుక్ను విషయం. అతనికి ఆడపనులు… మగ పనులు అన్న సంకోచాలు లేవు.

… మీకో విషయం చెప్పనివ్వండి. ఓసారి ఒక చెప్పు రిపేరుకొచ్చింది. సాయంత్రం పిల్లల్ని షికారుకి తీసుకు వెళ్ళినప్పుడు నా చెప్పులు కూడా మార్కెట్‌కు తీసుకువెళ్ళి రిపేర్‌ చేయించి తీసుకువచ్చాడు. మా ఫోయ్‌ అది చూడనే చూసింది. బాప్‌రే! మిన్ను విరిగి మేను మీద పడింది.

ఆ రోజుల్లో భార్య చెప్పులు వీథిలోకి మోసుకువెళ్ళడం అనేది వింతే కదా!

అతనికి నేనంటే గౌరవం. నాకు అతనంటే గౌరవం. మా పుట్టింట్లో మా అమ్మే కేంద్ర బిందువు. ముఖ్యమైన వ్యక్తి. కుఛ్‌ భీ కరో (ఏ పని చేసినా సరే) అన్ని విషయాలలోనూ… ఇక్కడ మా ఇంట్లో కూడా అదే జరిగింది. మెల్లమెల్లగా నేను ప్రజల మధ్యకు వెళ్ళడం మొదలుపెట్టాను. రమేష్‌ సంతోషపడ్డాడు. నా పనే తన పని అని భావించాడు… అది అలా మా ఇద్దరి పనీ అయింది. దాదాపు నా పనే అతని జీవితం అయిపోయింది. అలా అని అతడు ఏనాడూ అనవసరపు జోక్యం చేసుకోలేదు. అది చెప్పుకోదగిన ఒక విషయం. నా కార్యరంగంలో ఏనాడూ అతను కాలు పెట్టలేదు. అయినా నేను చేస్తోన్న పనుల విషయంలో అతను మహా ఉత్తేజం పొందేవాడు. ఎంత మమేకం చెందేవాడంటే ఒక్కోసారి అతను మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్నది నేనే అనిపించేది. నాకు మెగనెసే అవార్డు వచ్చినపుడు మాకు మనీలా వెళ్ళడానికి రెండు టిక్కెట్లు పంపించారు. ‘వద్దు! ఈ విషయం పూర్తిగా నీదే’ అన్నాడు. ఆ విషయాల్లో అతనిది ఖచ్చితమైన ఆలోచన. ‘సింహాసనమూ నీదే-శిలువా నీదే’ అన్నాడు.

‘సేవ’ పనులు మొదలెట్టినపుడు అందులో ఆయన సలహాల పాత్ర ఎంత?

ప్రాథమికంగా మేమిద్దరం ఆదర్శవాదానికి అంకితమైన వాళ్ళం. అంచేత మేము మా వైవాహిక జీవితానికి ఎంత కట్టుబడి ఉన్నామో మేము నమ్మిన విసయాలకూ అంతగానూ కట్టుబడి ఉండేవాళ్ళం. నేనే ఏ సామాజిక బాధ్యతలు లేని సామాన్య గృహిణిని అయి ఉండిఉంటే అతనికి చాలా ఇబ్బందిగా ఉండి ఉండేది. భౌతికంగానూ – భావాలు అనుభూతులు పరంగానూ మేము ఒకరికొకరం బాగా సన్నిహితులం. ఏది సవ్యం – ఏది కాదు అన్న విషయం మేము స్పష్టంగా ఆలోచించగలుగుతూ ఉండేవాళ్ళం. మాలో ఇంకా బలంగా ఆదర్శాలు మిగిలి ఉన్నాయి కాబట్టి సరి అయిన రీతిలో మేము జీవించాలని కోరుకునేవాడతను. అలా జీవించే ప్రయత్నం చేసేవాడు.

ఇపుడు తిరిగి చూసుకుంటే అతని జీవితంలో మరింకెన్నో విషయాల మీద గాఢమైన అనురక్తి కలిగి ఉండేవాడని స్ఫురిస్తుంది. కలిసి ప్రయాణాలు చేయడం, కవితలు రాసుకోవడం, పాటలు పాడుకోవడం, స్నేహితులతో గడపడం – ఎన్నెన్నో విభిన్న అనుభవాలను మూటగట్టుకునేవాళ్ళమే. కానీ అవి ఏనాడూ అంత ముఖ్యం కాదు. మా మా పనుల్లో మేము నిరంతరం మునిగి తేలుతూ ఉండేవాళ్ళం. అంచేత మాకు ఇష్టమైన ఇతర పనుల గురించి ఆలోచించే వ్యవధే ఉండేది కాదు. అసలవి కోల్పోతున్నామన్న స్పృహే

ఉండేది కాదు. మా పనే మాకు ముఖ్యం అని మేము నమ్మాం. ఓసారి బద్రీనాథ్‌ వెళ్దామనుకున్నాము. వెళ్ళి ఉండాల్సింది. ఇప్పుడు ఆలోచిస్తే ఆలాంటి వాటిల్ని పదే పదే ఎందుకు వాయిదా వేసామా అని ఆశ్చర్యంగా ఉంటుంది. ‘ప్రతి దానికీ ఓ సమయమంటూ ఉంటుంది’ అన్నది అతని అభిమాన ప్రవచనం. నేను ఒక పని చేద్దాం అంటే ‘తప్పకుండా చేద్దాం. సమయమూ సందర్భమూ వచ్చినప్పుడు తప్పకుండా చేద్దాం’ అనేవాడు.

ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి జనరల్‌ మేనేజర్‌గా రిటైర్‌ అయిన తరువాత అతని కంటి చూపు మందగించసాగింది. నేనారోజుల్లో రాజ్యసభ సభ్యురాలిగా ఢిల్లీలో ఉండేదాన్ని. ఢిల్లీలో ఓ మంచి ఆసుపత్రి ఉంది. ‘నీ కంటి ఆపరేషన్‌ ఢిల్లీలో చేయిద్దాం’ అన్నాను. ‘ఉహూ, అహ్మదాబాద్‌లో మా స్నేహితుడి ఆసుపత్రిలో చేయించుకుంటాను’ అన్నాడు. ‘ఇది కంటికి సంబంధించిన వ్యవహారం. మంచి డాక్టర్‌ దగ్గర చేయించుకోవాలి’ అన్నాను. బొంబాయిలో మా అన్నయ్యతో మాట్లాడాను. ఓ మంచి సర్జన్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాడు. ఆపరేషన్‌ అక్కడే జయప్రదంగా జరిగింది. అదో అతి చక్కని ఆస్పత్రి. సముద్రాభిముఖంగా సుందరమైన గది. మరీ చిన్న గదేం కాదు, గాలీ, వెలుతురూ ధారాళం. ఆపరేషన్‌ కూడా విజయవంతంగా జరిగింది కదా… రమేష్‌తో పాటు నేనూ ఆ గదిలో ఉండేదాన్ని. పుస్తకాలు చదివి వినిపించమనేవాడు. పాటలు పాడమనేవాడు. అతను ఎక్కువగా మాట్లాడకూడదన్నారు. అంచేత నేనే చదివేదాన్ని, పాడేదాన్ని. అతని కోరికమీద ఆది శంకరుని కవితలు వినిపించాను. ఋగ్వేదపు ఋక్కులు వినిపించాను. అద్భుతమైన కాలమది. ఏకధాటిగా ఏడు రోజులు. బొంబాయి మెరైన్‌ లైన్స్‌లో ఇద్దరం కలిసి ఎన్నో ఏళ్ళ తర్వాత ఇలా…

కలసి మెలసి ఆటవిడుపు అన్నమాట… (నవ్వు)

అతడిని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేశారు. నేపియన్‌ సీ రోడ్డులో ఉన్న మా అన్నయ్యా వాళ్ళ అపార్ట్‌మెంట్‌కి మారాం. మర్నాటి ఉదయం వరండాలోని ఉయ్యాల బల్లమీద టీ కప్పులు చేతబట్టుకొని కూర్చొని ఉన్నాం. మా ఇద్దరి మధ్యా ఆనాటి దినపత్రిక, దానిమీద నా కళ్ళజోడు. నా కంటద్దాల గుండా ఆయన ఏదో వార్తలు చదవగలిగాడు. స్పష్టంగా, ప్రస్ఫుటంగా కనిపించాయి. బ్రహ్మాండం, మహా సంబరపడ్డాం. ‘ఛలో… ఆపరేషన్‌ సఫల్‌ హోగయా’ అనుకున్నాం. అహ్మదాబాద్‌ ఇంటికి వెళ్ళాక ఒక నలుపు, తెలుపు టీవీ కొన్నాను. అప్పటిదాకా మాకు టీవీ చూసే సమయమే ఉండేది కాదు. ఇప్పుడు టీవీ తోడుంటే రమేష్‌ సాయంత్రాలు ఒంటరితనపు బాధ లేకుండా ఉంటాడు కదా అనిపించింది. యధాప్రకారం మొదట్లో టీవీ వద్దన్నాడు. ఆ రోజుల్లో నేను ‘శ్రమ శక్తి నేషనల్‌ కమిషన్‌’ వాళ్ళ పనుల్లో తీరిక లేకుండా

ఉండేదాన్ని. దేశమంతా పర్యటిస్తూ ఉండేదాన్ని. నేనే ఛైర్‌పర్సన్‌ని. తప్పించుకోవడం ఎలా? ఆ రోజుల్లో మా పిల్లలూ ఇంట్లో ఉండేవారు కాదు. ఒంటరితనపు రోజులవి. అబ్బాయి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళాడు. మా అమ్మాయి చైనాలో… తనూ అక్కడ చదువుతూ ఉండేది. రమేష్‌ను ఇంట్లో ఒంటరితనం బాగా బాధపెట్టి ఉండాలి. పాపం చాలా కష్టపడి ఉంటాడు. నాకేమో క్షణం తీరిక లేదు. నిస్సహాయత. ఆపరేషన్‌ నుంచి పూర్తిగా కోలుకున్నాక మళ్ళీ తన పనుల్లో చురుకయ్యాడు. ఆ తర్వాత తన జీవితాన్ని మరింత ప్రణాళికా బద్ధంగా మలచుకొని అనేకానేక కార్యక్రమాల్లో బాగా చురుగ్గా పాల్గొన్నాడనుకొంటాను. నేను రాజ్యసభ సభ్యత్వం ముగించుకొని వచ్చాక…

ఎప్పుడొచ్చారు?

1998లో తిరిగి ఇంటికి చేరాను.

ఆయన ఢిల్లీ వద్దామనుకోలేదా?

వస్తూ ఉండేవాడు. అడపాదడపా వచ్చి పదిహేను రోజులు గడుపుతూ ఉండేవాడు. కానీ తన

ఉద్యోగంతోనూ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఉద్యమంలోనూ తనూ తీరిక లేకుండా ఉండేవాడు కదా.. నేను ప్లానింగ్‌ కమిషన్‌లో ఉన్నప్పుడు ఖాన్‌ మార్కెట్‌ ఎదురుగా చక్కని బంగళా ఇచ్చారు. రిలాక్సవుతూ కాస్తంత సమయం గడపడానికి అది అనుకూలంగా ఉండేది. రమేష్‌ కాస్తంత తోట పని కూడా చేస్తూ

ఉండేవాడు. నేను రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పుడు నార్త్‌ ఎవెన్యూలో ఓ ఫ్లాట్‌లో ఉండేవాళ్ళం. కానీ ఆ రోజుల్లో ఇద్దరం తీరిక లేకుండా ఉండేవాళ్ళం.

ఒక ఉమ్మడి ధ్యేయంతో మీరు తీరిక లేకుండా ఉన్నారు. మీ అమ్మగారు మీ పుట్టింట్లో అన్ని కార్యకలాపాలకూ కేంద్ర బిందువు అన్నారు కదా! ఇక్కడ మీ ఇంట్లో మీరూ మీ కుటుంబానికి కేంద్ర బిందువే కదా! ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో… మీరు పర్యటనల్లో ఉన్నా, తీరిక లేని పనుల్లో మునిగిపోయి ఉన్నా, మీరు కేంద్ర బిందువు. మరి ఆయన పోయాక సంగతి ఏంటి?

ఇంచుమించు అదివరకటి పరిస్థితే. ఇప్పుడు కూడా నేనూ, మా అబ్బాయి కుటుంబమూ దాదాపు కలిసే ఉంటున్నాం. మా అబ్బాయి, కోడలు, వాళ్ళ ఇద్దరు పిల్లలు… పక్క పక్క ఇళ్ళు మావి. రెండిళ్ళకూ ఒకటే ఆవరణ. నా వంటా, భోజనం అంతా వాళ్ళింట్లోనే. చదువుకోడానికి, నిద్రపోడానికీ మాత్రం ఈ ఇంటికి వస్తాను. మేం ఒకరకంగా చూస్తే విడివిడిగా ఉంటున్నాం, ఇంకో రకంగా చూస్తే కలిసి

ఉంటున్నాం. ఈనాటికీ… మా అబ్బాయికీ, కోడలికీ నేనే మొట్టమొదటి ప్రాధాన్యం. మళ్ళీ మా అందరికీ వాళ్ళ పిల్లలు కేంద్ర బిందువులు. నేను చాలా అదృష్టవంతురాలిని. అయినా నేను చాలా జాగ్రత్తగా

ఉంటాను. ఎవరిమీదైనా పక్షపాతం చూపిస్తున్నానని ఎవరూ అనుకోకుండా జాగ్రత్తగా మసలుకుంటూ

ఉంటాను. కానీ ఒక్కమాట… నేను ప్రేమించబడడాన్ని ఇష్టపడతాను.

మన పిల్లలు మన పెద్ద వయసులో మన బాగోగులు చూస్తున్నారూ అంటే మనం చాలా అదృష్టవంతులమన్నమాట. తమ తమ జీవితాలలో నిరంతరం తీరిక లేకుండా ఉండే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. కొంతమంది స్నేహితుల్ని చూస్తూ ఉంటాను. తమ తమ రోజుల్లో ప్రజా జీవితంతో పెనవేసుకుపోయి గణనీయమైన కృషి చేసిన వాళ్ళు కూడా వయసు మళ్ళాక వాళ్ళ వాళ్ళ పిల్లల జీవితాల్లో ఒక మారుమూలకు నెట్టివేయబడుతున్నారు.

అలా జరిగే అవకాశం ఉంది. యుక్త వయస్సు, జీవితంలో ఎదుగుతోన్న దశ, తీరిక లేని తనం, కొంత గందరగోళం, తికమక, అలజడి, ఉద్యోగ భారాలకూ పిల్లల పెంపకానికీ మధ్య నలిగిపోవడం, వాళ్ళ కళ్ళముందు ఎన్నో అవకాశాలు కనబడుతూ ఉంటాయి. అందిపుచ్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగాల్లో పోటాపోటీలు. వీటన్నింటి మధ్యా సతమతమవడం. అదీకాక వాళ్ళ వాళ్ళ సోషల్‌ లైఫ్‌ ఉండనే ఉంది… స్నేహితులు, ఇంటికి వచ్చిపోయేవాళ్ళు. అదృష్టవశాత్తు మిహిర్‌కి కానీ, రీమాకు కానీ ఇలాంటి సోషల్‌ లైఫ్‌ లేదు. అసలు వాళ్ళకు అందుకు సమయమే చిక్కదు. అయినా వాళ్ళ వత్తిళ్ళు వాళ్ళకు ఉండనే ఉంటాయి. కష్టపడి నెగ్గుకొస్తున్నారు. మీటింగులు, ప్రయాణాలు, రిపోర్టులు… వాళ్ళకీ జీవితంలో పైకెదగాలనే ఆశ ఉంది. మరి దానికి తగిన మూల్యం చెల్లించాలి కదా! నేను రెండు విధాలుగా అదృష్టవంతురాలిని. మా అందరిదీ ఇప్పటికీ సరళమైన జీవనసరళి. మా ముగ్గురి కార్యక్షేత్రాలూ… పాక్షికంగానే అయినా కలుస్తాయి. నేనూ మా అబ్బాయి బాగా కలిసిపోతాం. నా భావాలూ, సందిగ్ధతలూ అతనితో పంచుకోవడం చాలా సులభం. కానీ అతనిది మరీ స్వేచ్ఛా ధోరణి. తన స్వ విషయాలూ, ఆరోగ్యం అంతగా పట్టించుకోడు. అంచేత నేను ఎప్పుడూ మందలిస్తూ ఉండాలి. ఏ కొడుకూ దాన్ని ఇష్టపడడు కదా! మా ఇద్దరి మధ్యా రీమా మళ్ళీ సంధాన కర్త. చాలాసార్లు తనే నన్ను బాగా అర్థం చేసుకుంటుంది.

మనమేదో వాళ్ళ జీవితాలకు కేంద్ర బిందువులవాలని కాదు నా భావం. కొంతమంది పిల్లలకు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు పూర్తిగా వృధా అయిపోయాయన్న భావన, అపోహ, ఉంటూ ఉంటుంది. ఎవరమూ ‘కేంద్ర బిందువు’ దగ్గర అంటిపెట్టుకొని కూర్చోగూడదు. నిజమే. పిల్లలకు వాళ్ళ వాళ్ళ జీవితాలు ఉంటాయన్న మాటా నిజమే. అయినా మన కోసం కాస్తంత సమయమన్నా వెచ్చించగలిగితే బావుంటుంది కదా. అది కనీస గౌరవం కదా!

నిజానికి మా అబ్బాయి కూడా వాళ్ళ నాన్నలాగే… ఎన్నో విషయాల్లో రమేష్‌ నెమ్మదస్తుడు, మృదు స్వభావి, సొంపైన మనిషి, దృఢమైన వ్యక్తిత్వం, విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణి, అవసరమైతే బెబ్బులిలా రౌద్రమూర్తి కాగలడు. నేను అలా కాదు. నాకు ఘర్షణ, పోరాటాలంటే గిట్టదు. మరీ అవసరమైనపుడు విభిన్నంగా, నిర్మాణాత్మకంగా పోరాటం సాగిస్తాను. తద్వారా నా లక్ష్యం చేరుకొంటాను. ఒక్కోసారి నాకూ, తనకూ తీవ్రమైన భేదాభిప్రాయాలు వచ్చేవి. నన్ను రాజకీయాల్లోకి వెళ్ళమన్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి పేద ప్రజల ప్రతినిధిగా నిలబడమన్నాడు. ఆదర్శ వ్యక్తిగా రూపొందమన్నాడు. వాళ్ళ ఘోష రాజకీయాల ద్వారా ప్రపంచానికి వినపడేలా చెయ్యమన్నాడు. పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన నాకు ఏ మాత్రమూ లేదని నాకు తెలుసు. అప్పటికే నేను చేపట్టిన కార్యక్రమాలు ఒక విధంగా రాజకీయ చర్యలే అనీ తెలుసు. అలాగే రమేష్‌, నేను సంఘటిత కార్మిక వర్గాల బాగోగులు చూస్తే బావుంటుందనుకొన్నాడు. నాకేమో అసంఘటిత వర్గ ప్రయోజనాలంటే ఆసక్తి. నేను చెయ్యదలచుకొన్న పనే అది.

అంటే ఆయన మిమ్మల్ని…

ఆహా… అడగలేదు. ఏనాడూ అడగలేదు. ఆయన బాణీయే వేరు. ఇలాంటివి ఏనాడూ సూటిగా అడగడు, చెప్పడు. ఓ విలక్షణ సంస్కారి…

సర్లెండి… సర్లెండి… (నవ్వులు)

మైతో ఫటాఫట్‌ బోల్తాహు (నేను టకటకా చెప్పేస్తూ ఉంటాను).

ఆయన సూటిగా అడగకపోయినా ఆ భావన మీరు గ్రహించగలిగారా?

అవును. వాళ్ళంతా ముందస్తుగా ఆయనతో మాట్లాడి ఆ తర్వాత నా దగ్గర ఆ ప్రస్తావన తెచ్చేవారు. ఉదాహరణకు, చాలా కాలం క్రితం, 1980-84ల మధ్య. జనతా ప్రభుత్వం సమయంలో, కాంగ్రెస్‌ కీ టైమ్‌ మే… అంతకు ముందు కూడా మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చెయ్యమన్నారు. ఎన్నికల్లో నిలబడాలా వద్దా అన్నది ప్రశ్న. ఆ తర్వాత లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ప్రస్తావన వచ్చింది. ప్రతిసారీ నేను టిక్కెట్‌ తిరస్కరించాను. 1984, 1986ల్లో ఒకసారి నేను ఇంటికి వచ్చేసరికి ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించాడు. నన్ను చూసి ఫోన్‌ అందించాడు. కాంగ్రెస్‌ వాళ్ళు జనరల్‌ ఎలక్షన్లలో నాకు సీటు ఇవ్వడం గురించి ఆ ఫోను. నేను వెంటనే వద్దన్నాను. నేను ఒప్పుకోవాలని అతనికి బాగా ఉందని నాకు తెలుసు. కానీ ఆ మాట బయటకు అనడు. ఆ తర్వాత ఆ విషయం మేము ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ‘నీకు ఇష్టంలేని పని ఏనాడూ నువ్వు చెయ్యకూడదు’ అనే అంటాడు. ఆ తర్వాత ఓసారి నేను రాజకీయాల్లోకి వెళ్ళడం ఎందుకు అవసరమో కూలంకషంగా చర్చించుకున్నాం. నన్ను టీఎల్‌ఏ నుంచి సాగనంపే ప్రయత్నం జరిగినపుడు దానినుంచి వైదొలగవద్దని సలహా ఇచ్చాడు. ఆ ప్రయత్నాలను అడ్డుకొని టీఎల్‌ఏ వ్యవహారాలను సరిదిద్దడమే సరైన పని అన్నాడు.

టీఎల్‌ఏ?

టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌. ఏదో ఒకరోజు నేను దాని నాయకత్వం చేపట్టాలని ఆశించాడు. ‘టీఎల్‌ఏతో ఎదిగే క్రమంలో ముందు మిల్లు కార్మికుల సమస్యలు చేపట్టు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని మిగతా యూనియన్ల సంగతి చూడు. వాటన్నింటినీ గాంధీ మార్గంలో నడిపించు’ అన్నాడు. కానీ నాకు సంఘటిత రంగంలో ఉన్న టీఎల్‌ఏ అంటే ఆసక్తి లేదు. ఆ రాజకీయాలూ, ఎత్తుగడలూ నడపలేననీ, నాకంత శక్తి లేదనీ అనుకోవడం వల్లనేమో. లేదా, మరింత నిర్మాణాత్మకమైన, సానుకూలమైన కార్యక్రమాలు చేపట్టాలన్న అభిలాష వల్లనేమో… ఏదేమైనా అసంఘటిత రంగంలోనే నేను పనిచేస్తానన్నది నాకు ఖచ్చితంగా తెలుసు. అంచేత ఆ విషయంలో మా ఇద్దరికీ అభిప్రాయాలు కలవవు అని తెలుసు. నేను రాజకీయాల్లో చేరడం ఎందుకు ముఖ్యమో, ఆ విషయం మీద అనేక చర్చలు. కానీ నేను ఆ తర్వాత అంతిమ నిర్ణయం తీసుకున్నప్పుడు అతనేమీ అప్‌సెట్‌ అవలేదు. రాజీవ్‌గాంధీ పిలిచి నన్ను రాజ్యసభలో నామినేటెడ్‌ మెంబర్‌గా చేరమన్నప్పుడు ఈయన ఏమనుకున్నాడో తెలియదు. నేను మా ‘సేవ’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్లను సలహా అడిగాను. రమేష్‌ అప్పుడు దేశంలో లేడు. బ్రెజిల్‌ వెళ్ళాడు. నేను ఫోన్‌ చేసి ఇదిగో ఇలా జరిగింది అన్నాను. అభినందనలు తెలిపాడు కానీ ‘నువ్వు మొదటి మెట్టు మిస్సయ్యావు’ అన్నాడు. అరెస్టయ్యి జైలుకెళ్ళే మెట్టన్నమాట. ముందు జైలుకు వెళ్ళాలి, ఆ తర్వాతే రాజకీయ పదవులు (నవ్వు). నేను అవసరమయినంత మేరా పోరాటం చేయలేదని బహుశా అతని అభిప్రాయం. నేను ఎన్నికల యుద్ధ రంగంలో పోరాడి

ఉండవలసిందని అతని భావన.

చాలా సంవత్సరాల పాటు ఒక దినపత్రకలో ఆయన వారం వారం కాలమ్‌ రాసేవాడు. వ్యంగ్యంగా చీల్చి చెండాడుతూ రాసేవాడు. కాలేజ్‌ టీచర్లను సంఘటితపరిచాడు. గుజరాత్‌ యూనివర్శిటీ సెనేట్‌ సభ్యుడిగా ఉన్నాడు. వినియోగదారుల సంఘం స్థాపించాడు. తన నడివయస్సు సమయంలో ప్రజల సమస్యల విషయంలో చాలా చురుగ్గా పనిచేశాడు. ఇంకా చాలా చెయ్యగలిగి ఉండేవాడే. కానీ కుటుంబం నడవడానికి సంపాదన కూడా కావాలి కదా… నేనేమో ఏనాడూ సంపాదించి ఎరుగను. ఇప్పటిదాకా ఒక్క పైసా సంపాదించి ఎరుగను. కుటుంబం నడిపే బాధ్యత అతనిదే. అధికార గణానికి అతనెప్పుడూ ప్రీతి పాత్రుడు కాదు.

అంటే?

ఆయన్ను అలా అభిమానించేవారు. నిజమే! వెంట నడిచేవారు. కానీ దూరం దూరంగానే ఉండేవారు. గౌరవ ప్రదమైన దూరం. అంతా ఆయన ప్రభావపు తాకిడిలో మునిగిపోయేవారు.

అది జెండర్‌కు కూడా సంబంధించిన విషయమేమో… చాలామంది మగవాళ్ళు అలానే ఉండరూ? వాళ్ళను గౌరవిస్తాం, అనుసరిస్తాం, ఆరాధిస్తాం. కానీ ఆ దగ్గరితనం మాత్రం ఉండదు.

అలా అనే కాదు. ఆయనంటే కొంతమంది కొంచెం విముఖత చూపేవాళ్ళు. పనులకు అడ్డం పడేవాళ్ళు. తన ఋజువర్తనకు ఆయన చెల్లించిన మూల్యం అది. సర్వ సాధారణంగా అతను సవ్య మార్గాన్నే ఉండేవాడు. నిజానికి అదే అతని సమస్య. అతని ఆలోచనా విధానమే సవ్యమని పదే పదే ఋజువయ్యేది. ఉమాశంకర్‌ జోషి(1) ఈయన్ని సహదేవ్‌ జోషి అని పిలిచేవాడు. భవిష్యత్తులోకి తొంగి చూడగల శక్తి ఉన్న మనిషి అని ఆయన భావన. (సహదేవునికి జరగబోయేవన్నీ ముందే తెలుసుకునే శక్తి ఉందని ప్రతీతి – అమనాదకుడు) నిజమే. మా అబ్బాయికీ ఆ లక్షణాలు వచ్చాయి. కాకపోతే ఇతను మరింత ఉల్లాసంగా ఉంటాడు. అయినా జ్ఞాన బోధలు చేస్తే ఎవరు మాత్రం వింటారు? నేనే నా భవిష్యత్తుకు సంబంధించి ఆయన సలహాలను అన్నిసార్లూ పాటించేదాన్ని కాదు. తర్వాత అందరూ అనేవాళ్ళు… అవునవును, రమేష్‌ భాయ్‌ ఇది ముందే చెప్పాడు అని. ఇప్పుడు ‘సేవ’లో నేను అలాంటి స్థితిలోనే ఉన్నాను. భవిష్యత్తులో ఏం జరగనుందో చూడగలుగుతున్నాను. మరో పదేళ్ళపాటు ఏ దిశలో వెళ్ళాలో స్పష్టంగా ఆలోచించగలుగుతున్నాను. కానీ ఇది అందరికీ వివరించి చెప్పడం కష్టం. అంచేత ఇలాంటి విషయాల్లో ఓర్పు, సహనం ముఖ్యం. వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళను చెయ్యనివ్వాలి. నేను అనుకొంటున్నది నేను చెప్పాలి. అది నా ధర్మం. అది చెప్పాక వాళ్ళతో కలిసి అడుగు వెయ్యాలి. అతనికి అంత సహనం ఉండేది కాదు. నేను కార్యపరంగా తీవ్ర ఉద్వేగాలకు అంతగా గురవను. అందర్నీ తక్షణం ఒప్పించేసి నా మార్గంలోకి రప్పించాలని ఆత్రపడను.

అతని ‘ఉద్వేగాలు’ మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాయా?

ఇబ్బంది అంటే… అతను అలాగే ఆలోచిస్తాడని నాకు తెలుసు. నేనూ అలాగే ఆలోచించే మాట నిజమే. కానీ నేను ఆయనలా

ఉండలేను. గభాలున ‘పోరాటాల్లోకి’ దూకలేను. భయమని కాదు… ఇష్టం లేక, ప్రత్యామ్నాయాలు వెదుకుతాను. నాకు పోట్లాటలంటే విముఖత. అది ఎందుకో ఆయనకు అర్థం కాదు. నిజానికి నేను అను నిత్యం పేదరికంతో పోరాడడం లేదా? మా సభ్యులంతా పేదవాళ్ళని తెలుసు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళగలరో తెలుసు. వాళ్ళెంత దూరం వెళ్ళగలరో నేనూ అంతే దూరం వెళ్ళాలి. వాళ్ళ అడుగుల్లో నేనూ అడుగులు వెయ్యాలి. సర్వదా వాళ్ళతో పాటే ఉండాలి. ఒక్కోసారి దూసుకువెళ్ళాలి. మరోసారి నింపాదిగా వెళ్ళాలి. నేను ‘విజయం సాధించానా లేదా’ అన్న విషయం అంతగా పట్టించుకోను. ఒక రకంగా ‘విజయం’ నాకు ముఖ్యం కాదు. నా చర్యలు మా వాళ్ళను ఎంత బలోపేతం చేస్తున్నాయి అన్నది అన్నింటికన్నా ముఖ్యం. వయసు, అనుభవం వచ్చాక మనం నిలకడగా చేపట్టే చర్యలు, ప్రయత్నాలూ, అవి నిర్వహించే పద్ధతీ – వీటిల్లోంచి మనకు బలం సమకూరుతుందనే విషయం అర్థమవుతోంది. విజయవంతం అవడం అన్నది ఏమంత ముఖ్యం కాదు. ఆ విషయం మేము తరచూ చర్చించేవాళ్ళం. ఆయన పోయాక ఈ విషయాన్ని నేను మరింతగా ఆలోచించాను. ఆయన ఉన్నంత కాలం ఆయన మీదే ఆధారపడి ఉండేదాన్ని. ఏ విషయంలోనైనా దాని బాగోగులు చూపించడానికీ, వాటి గురించి ఆలోచించడానికీ ఆయన మీద ఆధారపడేదాన్ని. కానీ కార్యాచరణ దగ్గరికి వచ్చేసరికి చాలాసార్లు నాకు చేతనయినంత మేరకే పనిచేసేదాన్ని. ఇదిగో ఇలాంటి సమయాల్లో నేను కొంచెం ఇబ్బంది పడేదాన్ని. సమస్యలుండేవి… నా వ్యక్తిగత సమస్యలు కాదు, పరిస్థితులకు సంబంధించినవి, ఇతరులకు సంబంధించినవి. ఒక్కోసారి పనివాళ్ళతో సమస్యలు, మాంచి గంభీరమైన సమయాల్లో నేను ఎవరో ఒకరి పక్షాన నిలబడవలసి వచ్చేది.

వసంత్‌, మా అబ్బాయితో కూడా అదే జరుగుతోంది (నవ్వు). ఒక్కోసారి మళ్ళీ అది మహా అద్భుతంగా అనిపిస్తుంది. పోల్చి చూడకుండా ఉండలేం. మన పిల్లల్లో మన సహచరుల ఛాయలు కనిపిస్తాయి. ఒకే రకపు అలవాట్లు, విలక్షణమైన అలవాట్లు… మంచివీ, మంచివి కానివీ. ఆ తర్వాత మా అబ్బాయి పిల్లలు… మనవడు, మనవరాలు. రమేష్‌ మా అబ్బాయితో ఎలా ప్రవర్తించాడో మా వాడూ తన పిల్లలతో అలాగే ప్రవర్తించడం… భలే బావుంటోంది చూడ్డానికి. ఇదంతా చూడగలుగుతోన్నందుకు నాకు ఎంత సంతోషంగా, ఎంత సంతృప్తిగా ఉంటోందో (నవ్వు). ఒకే ఇంట్లో… నిరంతర పరంపర. కానీ మా ఆయన నిరాడంబరతకు నిలువుటద్దం. నేను అతని అంత నిరాడంబరంగా ఉండలేను. నిరాడంబరత కాదు అతనిది నిర్మోహత అనాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా కాస్త ఎక్కువ చెల్లించాల్సి వస్తే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. నా అవసరాలు పరిమితం, నా డబ్బు అవసరమూ అంతే పరిమితం. అంచేత నా అవసరాలకు సరిపడా ఖర్చు పెట్టేదాన్ని. డబ్బుల కోసం ఏనాడూ ఇబ్బంది పడింది లేదు. నేను ఏది కోరుకున్నా… అది విలాసమో, అవసరమో… అది నాకు సులభంగా లభించేది. నాకు నిజానికి వస్తు వ్యామోహం లేదు. వస్తువులు ఎక్కువయితే మళ్ళీ వాటిని నిభాయించుకోవడం కష్టం. ఇంటిని కానీ, మనసును కానీ, జీవితాన్ని కానీ అనవసరపు విషయాలతో నింపి పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను నిరాడంబరంగా బతికే మాట నిజమే కానీ అలా అని మరీ నిర్మోహత రకపు మనిషిని కాను.

అతని నిర్మోహత లక్షణపు ఉదాహరణ నివ్వగలరా?

దుస్తులు. అవి తడవడం అతనికి సుతరామూ ఇష్టముండదు. వర్షమంటే, తడవడమంటే ఎంత విముఖత అంటే అప్పుడప్పుడు వర్షం పడినపుడు దారిలో ఏ షెడ్డు కిందో ఓ అరగంట అలా నిలబడిపోయేవాడు. వర్షం పూర్తిగా తగ్గాకే బయటకు నడిచేవాడు. తన బట్టలు తానే ఉతుక్కుని చక్కగా ఆరవేసేవాడు. అవి ఎండాక తానే ఇస్త్రీ చేసుకొనేవాడు. అన్నివేళలా శుభ్రమైన చక్కని దుస్తులు వేసుకొనేవాడు… మొరార్జీ దేశాయ్‌ లాగా. ఉదయపు కళాశాలలో పాఠాలు చెప్పేవాడు కదా… ‘మరో రెండు చొక్కాలు కొనుక్కోకూడదూ! పొద్దున్నే హడావిడి ఉండదు అనేదాన్ని. వినేవాడు కాదు. ఫర్లేదులే. మూడు, నాలుగు ఉన్నాయి. వారానికి అవి చాలు అనేవాడు. ఆయన పోయినపుడు బీరువాలో చక్కగా ఇస్త్రీ చేసి పెట్టిన నాలుగు జతల బట్టలున్నాయి. ఇంట్లో వేసుకొనేవి మరో రెండు… విదేశాలకు వెళ్ళినపుడు వాడిన రెండు జతల ఉన్ని దుస్తులు, మేజోళ్ళు. బస్‌ అంతే. నా విషయానికొస్తే ఆయన నాకు ఈ ఇంటినీ, ఆణిముత్యాల్లాంటి ఇద్దరు పిల్లల్నీ వదిలి వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయాక సర్ది ఉంచడానికి కానీ, ఇంకెక్కడికైనా పంపించడానికి కానీ, ఎవ్వరికైనా ఇవ్వడానికి కానీ ఏమీ లేవే. ఏ లాలసలూ లేని సుఖ త్యాగ జీవితం. నిర్మోహత. అనవసరపు వస్తువులు లేవంటే లేవు. అలా అని అతని అతి నిరాడంబర జీవితం ఎవరికీ ఏ విధమైన ఇబ్బందీ కలిగించలేదు. తాను ఎంతో స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో బతికాడు. నేను ఒక విముక్త స్థితిని అనుభవించాను.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.