శబరిమలై గుడిలోకి వెళ్ళే మహిళా భక్తులకున్న నిషేధాల్ని సుప్రీంకోర్టు ఎత్తేస్తూ తీర్పివ్వడం సంతోషం. ఇది ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితము. రిట్ పిటిషండ్ల మీదొచ్చిన రిజల్ట్స్. ఆడవాల్లను అంటే 10 సం|| వయసు నుంచి 50 సం||ల వయసుదాకా శబరిమలై ఆలయానికి వెళ్ళగూడదనే నిషేధాల మీద అనేక మహిళా ఉద్యమాలు, రిట్ పిటిషండ్ల మీద రిట్ పిటిషండ్లు వేసి సుప్రీంకోర్టును స్పందింపజేసినయి. మగాధిపత్యం గాకుంటే దీరట్లో ఇంకో అంశమే లేదు. అదీ హిందూ ఆధిపత్య మగాధిపత్య నిషేధాలివి. ముస్లిమ్ మగాధిపత్యాలు కూడా మహిళల్ని మసీదులకు రానివ్వయి. ఆడ, మగ కలిపి నమాజు జేసే సమానత్వాలు లేవు అక్కడ. నిషేధాలను ఎత్తేస్తూ సుప్రీంకోర్టు చేసిన వాదన చాలా బాగుంది. అయితే అది దళితుల ఆలయ ప్రవేశమ్మీద, ముస్లిం మహిళల మీద గూడా ఉంటే బాగుండనిపిచ్చింది.
శబరిమలలో పూజలకు మహిళలక్కూడా హక్కుంది. మహిళలు శబరిమలకు వెళ్ళగూడదని చట్టంలో లేదు. పురుషుడికో చట్టం, మహిళలకో చట్టం లేదు. చట్టమ్ముందు అందరూ సమానమేననీ, ఆలయ ప్రవేశం రాజ్యాంగం కల్పించిన హక్కనీ, ఆర్టికల్ 25, 26 ప్రకారం అందరూ ఆలయంలోకి పోవచ్చనీ కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించడం గొప్ప విషయము. ఇంకా సమాజంలో ఏ నియమాలైనా రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండాలనీ, మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన (25, 26) ఆర్టికల్స్ ప్రజారోగ్య, ప్రజాభద్రత, నైతికత ఆధారంగా మాత్రమే ఒక వ్యక్తిని నియంత్రించవచ్చనీ, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం రాజ్యాంగానికి లోబడి ఉండాలని సుప్రీంకోర్టు చాలా మంచిగా వర్ణించింది.
కానీ ఇవి అమలు కాని, ఈ చట్టాలు దరి చేరని సమాజాల్లోని అణగారిన కులాల పట్ల, జెండర్‌ల పట్ల, న్యాయస్థానాలు మౌనాలు వహించడమే అన్యాయమనిపిస్తది. భారత సమాజానికి, భారత రాజ్యాంగానికి వైరుధ్యముంది. చట్టం ముందు అందరూ సమానులేననే ఆర్టికల్ 14 చెప్తది. కానీ భారత సమాజము సమానంగా ఉందా! భారత సమాజం కుల అంతరాల్ని, అంటరానితనాల్ని, జెండర్, ఆధ్యాత్మికత వివక్షల్ని అమలు జరుపుతుంది. మాదిగ దండోరా నేత కృపాకర్ మాదిగన్నట్లు ”అట్లా అంటరానితనాన్ని, వివక్షల్ని అమలు జరుపుతున్న బలమైన సామాజిక కులాలకు సంబంధించిన వ్యక్తులు, గుంపులే అధికారంలోకొచ్చి వాస్తవ సామాజిక, కుల అంతరాలను కదిలించకుండా రాజ్యాంగం పాట పాడ్తున్నయి.
గుడికి మట్టి మోస్తే అంటులేదు, రాల్లు మోస్తే అంటులేదు, గుడి కట్టితే అంటు లేదు కానీ గుడిలోకి రావడమే అంటు, మైల అని దూరం గొడ్తరు అంటరానివాల్లను. ఈ అంటు, మైల జబ్బునే శబరిమలకు మహిళల్ని నిషేధించారు. ఆడవాల్ల మైల నుంచే పుట్టిన హిందూ మగ సమాజం మహిళలు, అదీ 10 సం|| నుంచి 50 సం|| వయసున్న మహిళలు శబరిమల ఆలయానికి పోయే అనుమతి లేదు అని ఆంక్షలు బెట్టిండ్రు. ఆడవాల్లు 10 సం|| ల వయసు నుంచి 50 సం||ల దాకా ముట్టయితరు గనక గుడి నిషేధమట. ముట్టు కాకుంటె ఈ మానవకోటి ఉండదు అనే ఇంగిత జ్ఞానం లేదు ఈ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుకు.
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు మీద, దళితుల ఆలయ ప్రవేశ నిషేధాల మీద పోరాటాలు వందల ఏండ్ల నుంచి నడిచినయి. వైకోమ్ సత్యాగ్రహాలు వచ్చినయి. గుడి ఎవరి చెమట సొత్తు? అయినా ఈ హిందూ దేవస్థాన బోర్డు ఇది ప్రజల విశ్వాసమనీ, ప్రజల విశ్వాసాల ప్రకారంగానే నిషేధాలు నడుస్తున్నయనీ, నమ్మకాలను సంప్రదాయాలను చెడగొట్టి కొత్త సమస్యలతో సమాజాల్ని అల్లకల్లోలం జెయ్యొద్దని మాట్లాడ్తుంది. ఏ ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు, సంప్రదాయాలు? హిందూ ఆధిపత్య పూజారి కుల మగవాల్ల విశ్వాసాలు, నమ్మకాలు, సంప్రదాయాలు. వాటి అజమాయిషీని కొనసాగించడానికే అంటరానివాల్లనీ, ఆడవాల్లని ఇట్లాంటి నిషేధాలు అమలు చేస్తున్నరు. ఈ మధ్య రాష్ట్రపతి దళితుడని గుడి బైటనే ఉంచి గుడి లోపలికి రానియ్యని వార్త, పెద్ద సంగతి కూడా కాని పరిస్థితులున్నయి.
ఒకవైపు దళితుల్ని గుడిలోకి రానివ్వని నిషేధాలు అమలు చేస్తూ ఇంకోవైపు దళిత గోవిందం, మునివాహన సేవ పేరుమీద హిందూ కార్యక్రమాలు. మతం మత్తు మందు అనే సిద్ధాంతాలతో
ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా బోనాలెత్తుకోవడాలు, భగవద్గీత పారాయణాలు చేయడం ఎంత బాధ్యతా రాహిత్యమో. ప్రజా పక్షాన అందులో అణగారిన పక్షాన నిలిచి ప్రజల్లో శాస్త్రీయ అవగాహనా దృక్పథాల్ని పెంపొందించే కార్యక్రమాల్ని విస్మరించి మతం మత్తు మంచిదే అని చెప్పదలిచారేమో!
జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్రతి నెల 30న పౌరహక్కుల దినంగా నిర్వహించి దళితుల మీద రకరకాల వివక్షల్ని రూపుమాపే దిశగా సమాజాన్ని చైతన్యపర్చాలనే కార్యక్రమాలు అమలు చేసే ప్రభుత్వాలున్నాయా! హిందూ మత కుల జెండర్ వివక్షలే కాదు, అన్ని మతాల్లో సమానత్వ ప్రజాస్వామ్యాలు రూపుదిద్దుకోవాలి అనేవి కూడా రాజ్యాంగ పరిధులే.