ప్రియమైన సల్మా! ఎలా ఉన్నావ్? నువ్వు గుర్తొస్తే, పడిలేచే కెరటం వెంటనే మనసులో మెదుల్తుంది. ఎంత తెగువ, ఎంత ధైర్యం, ఎంత పోరాటం, ఎంత ఆత్మవిశ్వాసం అని ముచ్చటేస్తుంది. తమిళ అమ్మాయివైన నీవు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నావంటే, దాని వెనుక నువ్వు రాసిన అద్భుతమైన రచనలే కారణం.
రాస్తూ రాస్తూ పోయావు. నీలోని రచనా శక్తే నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళింది. నువ్వు నా స్నేహితురాలివి అని గుర్తొచ్చినప్పుడు ఒకింత గర్వంగా కూడా ఉంటుంది. సాహిత్య అకాడమీ సభల్లో కేరళలోని కొచ్చిన్, అలహాబాద్, తిరువనంతపురంలలో జరిగిన సభల్లో మనమెన్నోసార్లు కలుసుకున్నాం. మనం ఎక్కువ మాట్లాడుకోకపోవచ్చు. కరస్పర్శతోనే వేల వేల సంభాషణలు ఒదిగున్నాయ్. ఆ తర్వాత ‘కవి సంగమం’ నిర్వహించిన సభలో మరింత దగ్గరయ్యాం. నీపై తీసిన డాక్యుమెంటరీని చూసానప్పుడు. సల్మా! నీ చిరునవ్వు వెనక, ఆత్మ విశ్వాసం వెనక ఎంతటి పోరాటముందో ఆ రోజు ఇంకా స్పష్టంగా తెలిసింది. ఒక అమాయకపు పక్షి రచననే ప్రాణంగా భావించే తీరులో జీవితంలో ఎదురైన ఎన్నెన్నో మలుపులు చాలా స్పష్టంగా కన్పించాయి. రచయిత్రులకు నువ్వొక స్ఫూర్తి ప్రదాతవు. అందుకే నీ మీదొక కవిత రాశానప్పట్లో. తెలుగులోనే రాసినా దాని ట్రాన్స్‌లేషన్ కూడా నీకు పంపుతున్నాను.
ఈ పుట్టుక ఆమె స్వంతం
మళ్ళీ పుట్టిన కమలాదాసు
రజతీ, రొక్కయ్యా, సల్మా
జీవితమంతా మూడు అంచుల కోతే
త్రిముఖ జీవనంలో నెత్తురోడుతున్న శకలాలే
బాధల రంగులు అలుముకున్న సీతాకోకల రెక్కలే
మాట కోసం
మంచి కోసం
స్వేచ్ఛ కోసం
చదువు కోసం
గాలి పీల్చడం కోసం
స్త్రీల సహభాగత్వం కోసం
లైంగిక స్వేచ్ఛ కోసం
నిరంతరం పోరాటమే జీవితం.
ఎండమావిలా మారిన చదువు కోసం
ఎడారిని తవ్వే నిరంతర యత్నం
పదకొండో ఏటనే నల్లపూసల ఉరి
శరీరమే ప్రధానమైన చోట
మనసు విలువను విరిచేసి
రజతిని రొక్కయ్యను చేసిన రోజులు
పుట్టింట్లో రాసే స్వేచ్ఛన్నా ఉండేది
నట్టింట్లో అక్షరమే శాపమైంది.
ఊపిరాడని సల్మా
ఉద్వేగ భరిత అయింది.
చదివిన రష్యన్ సాహిత్యమంతా
అక్షరమై కదిలేంతవరకూ
పొలమారుతూనే ఉంది.
అక్షరం కనపడగానే
మనో శరీరాలు రెండూ గాయాల నదులై ప్రవహించేవి
ఇంట్లో కాగితం కనుమరుగైంది
‘టాయ్‌లెట్’ పేపర్లే మేమున్నామని భరోసానిచ్చాయి
ముస్లిమ్ స్త్రీ ప్రశ్నించడమే ఒక నేరమైంది
ఎటు చూసినా, ఎటు తిరిగినా
మాట్లాడే హక్కు కూడా లేదన్న వాదనలే
వండడం, తినబెట్టడం, శరీరాన్ని అందివ్వడం,
సంతానాన్ని కనివ్వడమే స్త్రీల పని
సల్మాకు ఇవన్నీ మానని పుండ్లయ్యాయి
కొడుకులు సైతం తండ్రికి నకలయ్యారు
రసి కారుతున్న వ్యవస్థపట్ల నెత్తుటి సంతకమయింది.
రాస్తే ఛస్తావన్న బెదిరింపులకు ఘనీభవించింది.
రెక్కలు విరిగిపోతున్నా
మనస్సును శిలోపేతం చేసుకుంది
రొక్కయ్య రాయలేదులే ఇక అనుకున్న
సాహితీ గగనంలో ఫీనిక్స్ పక్షిలా కొత్త జన్మనెత్తింది.
దేహాన్నిచ్చినవారు రజతిని చేస్తే
దేహాన్ని వాడుకున్న వాళ్ళు రొక్కయ్యను చేస్తే
దేహమంతా మనసును నింపుకుని ‘సల్మా’గా మళ్ళీ పుట్టింది.
ఈ పుట్టుక ఆమె స్వంతం.
ఒక స్త్రీగా రాయడమంటే
కలాన్ని ఆయుధంగా చేయడమంటే
ఎంత హింసాధిపత్యాల పెనుగులాటలో!
అణచివేతా, సెన్సార్‌షిప్‌ల నియంత్రణో
సల్మా బతుకు చిత్రమే నిదర్శనం.
శిరసెత్తిన ఆమె ధైర్యం ముందు
ఇల్లు తలవంచక తప్పలేదు.
కుదించిన కిటికీ బయటి ఆకాశం కోసం
పెనుగులాడి రాజకీయ అడుగులేసి
తానే ఒక నిప్పురవ్వై, వెలుగు తునకై
ఎగిసిన నెత్తుటి గుడ్డు ఆమె.
జగమెరిగిన సల్మా, డాక్యుమెంటరీ నేనే చిరునామా అయింది.
బతుకు గుండాన్ని బద్దలు కొడుతూ
‘టాయిలెట్’ పేరుతో కొత్త నవల రాశావు.
మెత్తని చిరునవ్వుతో
గాజుకన్నా పదునైన అక్షరాలతో
ప్రశ్నలన్నింటికీ జవాబుగా నిలబడిన
మొలకెత్తిన విత్తనం సల్మా!
‘సల్మా’ – నీకిదే నా సలామ్!!
ఒక స్త్రీగా, రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నాయకురాలిగా నువ్వెదిగిన తీరు, నువ్వెక్కిన మెట్లు ఎంతో విలువైనవి. రోజురోజుకీ నీ మీద ప్రేమ రెట్టింపవుతోంది. ప్రస్తుతానికి ఉండనా మరి.