ఎండాకాలపు తీవ్రతకు చిక్కిపోయి మందగమన అయిపోయిన గోదావరి వర్షాలకి ఒళ్ళు చేసి, గట్లమీద నిండుగా పూసి తనకోసం చూస్తున్న తురాయి, నిద్రగన్నేరు మిత్రులని ఆప్యాయంగా తాకుతూ ఉప్పొంగి అవి రాల్చిన ఎర్రని పూలతో ఒడి నింపుకొని నిండుగా వడివడిగా సాగిపోతున్న ఎర్రగోదారి…
ఈ అందాలన్నీ ఆస్వాదిస్తూ కిల కిలలాడుతూ జ్యేష్ఠ పౌరుల కేంద్రంలోని అతిధులని, వారికి ఆసరాగా ఉన్న విశ్రాంత ఉద్యోగ జ్యేష్ఠ పౌరుల్ని కలవడానికి పోలవరంలోని వివియస్ కేంద్రం ట్రస్ట్‌కి చేరుకున్నారు శాంతి, సత్య. దాదాపు ముప్పై మంది పెద్దమనుషులు… ఎండిన తమ డొక్కల్ని నింపుకోడానికి ఆతృతగా వస్తూంటే… ఆనందంగా, ఆరోగ్యంగా, సంతృప్తిగా… వారికి మధ్యాహ్న భోజనం వడ్డిస్తుంటే వారి ముఖాల్లోని సన్నటి నవ్వు వెనక, వారి పొడిబారిన కళ్ళ వెనక, చల్లగా ఉండాలంటూ ఎత్తిన చేతుల కంపనల వెనక దుఃఖాన్ని నెట్టేస్తూ తోసుకొస్తున్న సంతోషపు ఘర్షణ కనిపిస్తోంది. వారికి అండగా ఉన్న పదిమంది పెద్దమనుషుల చల్లని చూపులో, నవ్వులో, స్పర్శలో సంతృప్తి స్పష్టమౌతోంది. ఇంతటికీ కారణమైన సత్య మాత్రం
ఉద్వేగంతో వెల్లువెత్తిపోతోంది. ఇటువంటి మరో మూడు కేంద్రాల్ని ప్రారంభించబోతున్న ఉద్వేగం…
పచ్చటి కొండల్లో, ప్రశాంతమైన ప్రకృతిలో, అక్కడక్కడా ఏర్పడిన కోయగూడేలు. రణగొణ ధ్వనుల్తో, క్షణం తీరికలేని జీవితాల్లో నిమ్మలంగా గడిపే క్షణాలు తెలియని పట్టణవాసులకి ఇలాంటి చోట హాయిగా చచ్చిపోయినా బానే ఉండని పిస్తుంది… ఆ గిరివాసులతో మాట్లాడనంత వరకూ. అభివృద్ధి పథకాలుగా చెప్పబడేవేవీ అక్కడికి చేరలేకపోతున్న… చేర్చదల్చుకుని అధికారులున్న… చేరినా బినామీ పేర్లమీద తన్నుకుపోతున్న బడాబాబులు, దళారీలు ఏలుతున్న రాజ్యం అది. ఆ గిరి ప్రజల నమ్రత, అమాయకత్వం, ఆప్యాయతలు వారి మండే ఎర్రని గుండెల్ని, చెదిరిన వారి కలల్ని కనబడనియ్యట్లేదు. పోలవరం ప్రాజెక్టు ప్రభావం వారి బతుకుల్లో సుడి గుండాలు లేపింది. వారి అస్థిత్వానికి గొడ్డలి పెట్టయింది. గుండెలు మండుతున్నా చల్లని నవ్వుల్ని చిందిస్తున్న ఆ గిరిప్రజని చూస్తుంటే గుండె తడి దావానలమౌతోంది. వారి జీవితాల్ని వింటూ, వారి దుఃఖాల్ని అనుభూ తిస్తూ, వారి మాటల లోతుల్ని కొలుస్తూ… చినుకు చినుకు తోడై ప్రవాహమైనట్లు, మండె గుండెలు, కాలే కడుపులు తోడైతే
ఉద్యమమే అవుతుందనుకుంటూనే వారికి సాంత్వన చేకూరేలా నాలుగు మాటలు చెప్పి వెనక్కొచ్చేసారు శాంతి, సత్య.
మనసు రగులుతూనే ఉంది… ఎలాగైనా కూల్చేసిన ఒక్క ఊరైనా చూడాలని భీష్మించిన ఎవ్వర్నీ రానివ్వట్లేదని వారంతా చెప్పడంతో దూరంనుంచైనా చూడాలని పోలవరం ప్రాజెక్టు ఏరియాకి వెళ్ళారు వాళ్ళిద్దరు. అక్కడ అప్పటికే కొండల్ని పిండి చేసేసారు. బండల్ని గులకరాళ్ళుగా మార్చే సారు, మట్టిని తరలించేసారు, చెట్లని వృక్షాల్ని నరికేసేశారు. పిట్టల్ని, జంతువుల్ని, మను షుల్ని కూడా తరిమేసేశారు. ఊళ్ళకి ఊళ్ళని రాత్రికి రాత్రే దిబ్బలుగా మార్చేసేశారు.
మామిడిగొంది గ్రామం… మొండి గోడలు మాత్రమే నిల్చున్నాయి. పొద్దువాలు తుండగా అలవాటు ప్రకారం ఊరికి చేరిన పశువులు మోరలెత్తి మొండి గోడల్ని చూస్తూ కదలకుండా నిలబడ్డ దృశ్యం… స్మశాన నిశ్శబ్దం… ఆ ఏరియల్ వ్యూ… ప్రాణాన్ని చిలికినట్టైంది.
సరిగ్గా ఏడాది తరువాత అదే ప్రాంతానికి మరోసారి… ఇప్పుడు ఆ మొండి గోడలు కూడా మిగల్లా … అంతటా ఇసక దిబ్బలు, కంకర గుట్టలు… ఊరి మొదట్లో సొరంగ త్రవ్వకపు పనుల్ని పర్యవేక్షించే వారి కోసం కూల్చకుండా ఉంచేసిన మూడు, నాలుగు ఇళ్లు మాత్రం తమ వారు కాని వారికి సేవ చేస్తున్నట్లున్నై. ఆ కొండలు, లోయలు, అడువులు గాయాల పాలై, ముఖాలు చెక్కుకు పోయి, అవయవాలు తెగిపోయి, చిందరవందరగా అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. ఆ ఎలుగులు, జింకలు, నక్కలు, పిట్టలు, పురుగు పుట్ర ప్రాణాలరచేత పట్టుకుని, కొండల్ని పేల్చేసే బాంబుల మోతలు, బండల్ని పిండిచేసి నిర్విరామంగా, నిర్వికారంగా పనిచేసుకుపోతున్న ఆ యంత్రాల మోతలకి భయబ్రాంతులై ఎటు పారిపోయాయో!
‘ఇళ్ళైతే కట్టిచ్చారు కానీ అవి మా అవసరాలకి తగ్గట్టు లేవు, మేమెలా ఉండేది? సల్లని భూతల్లిని లాగేసుకుని రాళ్ళకుప్ప లిచ్చారు పంటలెలా పండించాలి? మా కడుపులకి బువ్వెక్కడొస్తాయి? యువకు లందరికీి ఉద్యోగాలన్నారు అయ్యెటు పోయినై? మాది కాని ఊరికి వలస పోయిన ట్లున్నాది. మాదే ఈ ఊరని మమ్మల్ని మేము నమ్మించుకోవాలి. ఏణ్ణర్ధంగా మావూళ్ళల్లో పెళ్ళిళ్ళే జరగలా… కడుపుకి బువ్వ లేదు… కంటికి నిద్రలేదు… గంగమ్మని కట్టేస్తా రంటా… ఉగ్రమవ్వదా!! ఆ గోదారమ్మ మమ్మల్ని మింగేస్తాదని మా వూళ్ళనించి లేపేసారు. ఇళ్ళల్లో మేముండగానే కొక్కెర్లతో ఇళ్ళని పొడిచేసారు… మమ్మల్ని అప్పుడే సంపేశారు. ఈ జీవుడు పొయ్యేదాకా నిల బడాలగందా! రెక్కల కష్టం చెయ్యగలోళ్ళు ఎగిరిపోయారు. మేం మిగిలాం!! ఈయమ్మ బువ్వతో నిలుస్తున్నాం అంటూ సత్యని చూపిస్తున్న నరాలు తేలిన ఆ సుతిమెత్తని చేతుల్ని చటుక్కున అందుకుని గుండెల కానించుకుంది శాంతి. ఉద్వేగంతో సత్య, శాంతిలు వారందర్నీ చేతుల్తో చుట్టేసి దగ్గరగా పొదువుకున్నారు.
తర్వాతి తరాలకందబోయే అమృత ఫలాల ఎరకు చిక్కుకునో, చిక్కుకోకనో ఈ తరం మనుషులు గరళాన్ని మింగి చావ లేక… కక్కి బతకలేక నానాయాతన అనుభ విస్తున్న దృశ్యం అధికారులకి కనిపించట్లేదా? వారి ఆకలి పొలికేకలు, మెల్లమెల్లగా చావు దుప్పట్లో దూరుతున్న జ్యేష్ఠ పౌరుల కీచుకేకలు నాయకుల మూసుకున్న చెవులకి చేరేదెలా? స్థానభ్రంశమైన గిరి ప్రజల బ్రతుకుల్లో కల్లోలాలు సర్దుకునేదెపుడో? పునరావాసం పేర జరుగుతున్న దోపిడీని నిలువరించేదెవరు?