భూమిక మిత్రులకు నమస్తే!
‘సాధికారత చిహ్నాలు’ అంటూ వచ్చిన ముఖచిత్రం చాలా బావుంది గాని, ఆ స్త్రీలు తెలుగువారై ఉంటే ఇంకా బావుండేది. మహిళా కమిషన్ కానీ, మరే కమిషన్ కానీ నిజానికి ఇండిపెండెంట్ వ్యవస్థలు కానీ పార్టీల వ్యవస్థ వల్ల వాటి తీరుతెన్నులనే ప్రదర్శిస్తాయి. పార్టీల వ్యవస్థలాగా కాక ప్రజలకు అవి చేసే మేలు కూడా ఏమీ
ఉండదు. రేపు ప్రభుత్వాలు మారి, మరొక కమిషన్ వచ్చినా ఇంతే, వాళ్ళకి ఊడిగం చేయాల్సిందే. ఏ పార్టీకీ చెందని, స్వతంత్ర దృక్పథం ఉన్న మహిళలు, అదీ కూడా వారి స్వతంత్ర అధికారం నిర్వహించినప్పుడే మేలు జరిగేది. నన్నపనేని రాజకుమారిలాంటి వాళ్ళు పార్టీ వ్యవస్థకి వేసిన చెమ్కీ దండల్లాంటివారు. అంతే.
వెండితెర రాణి – మీనాకుమారి జీవిత చరిత్రను ఒక్క వ్యాసంలోనే ఎంతో ఆత్మీయంగా, సహజంగా, మానవీయంగా, కవితాత్మకంగా అందించారు, రొంపిచర్ల భార్గవి గారు. ఈ వ్యాసాన్నే ఇంకొన్ని ఆత్మీయ ఘటనలు కలిపి నవలగా రూపొందించిన భార్గవిగారూ, ఇక మీ పేరు కోసం చూస్తాము చదవడానికి. గతుకుల బాటల ఎంపిక – వసంత కన్నాభిరాన్ రాసిన జీవితానుభవాలను, ఆమే నేరుగా చెబుతున్నంతగా తెలుగు చేశారు పి.సత్యవతి గారు. స్త్రీలు చేసే అనువాదంలో ఒక నెమ్మదితనం, పొందిక కనిపిస్తాయి. ఈ నిబ్బరం పురుషులు చేసే అనువాదాల్లో కనిపించదు. అనువాదకుడే కనిపిస్తుంటాడు చాలా సందర్భాల్లో.
పురుడు విషయంలో ‘ఏ తల్లి నీకు పురుడు పోసిందో?’ అన్న మాట కూడా జనశృతిలో ఉంది. నా రచనలో, ‘డాక్టర్ మాన్‌సింగ్ మా అమ్మకు పురుడు పోసింది, నేను పుట్టాను’ అని రాస్తే అది చదివిన కృష్ణాబాయి గారు, ‘నటరాజ్ నీ తల్లికి పురుడు పోసిన మాన్‌సింగే నాకూ పురుడు పోసింది’ అని జ్ఞాపకం చేసుకున్నారు. ఇది స్త్రీలు మాత్రమే చేయగల గొప్ప విద్య. సూలగిత్తి నర్సవ్వకు పద్మశ్రీ రావడం చాలా సంతోషం కల్గించే విషయం. అందించిన జూపాక సుభద్ర గారికి అభినందనలు.
‘ఈశ్వరి’ విషాదాంతాన్ని కన్నీరు చిలికేలా శిలాలోలిత అందించారు. వారికి తెలిసి ఉంటే, తర్జని – వనజ గారి గురించి కూడా రాయవలసిందని విన్నపం.
డి నటరాజ్, విశాఖపట్నం