పజల నినాదమై ప్రతిధ్వనిస్తున్న గౌరీలంకేశ్‌ – అనిశెట్టి రజిత

గత డెబ్బై రెండేళ్ళుగా మనం కంటున్న అందమైన కల మన దేశంలో ప్రజాస్వామ్యం, పౌరస్వేచ్ఛ, సంక్షేమం వికసించాలని. అవి ఇప్పటికీ సాకారం కాలేదు కానీ నిరాకారంగా మారి వెక్కిస్తున్నవి అనుకునేకన్నా అవి కలలో కనిపించినప్పుడల్లా మన ఆకాంక్ష విషాదంగా కళ్ళు తుడుచుకుంటున్న దృశ్యం చూస్తున్నదే.

ఈ దేశాన్నీ, దేశంలోని ప్రజాస్వామ్యాన్నీ, ఒక స్త్రీగా ఎన్ని అభద్రతలున్నా భద్రత కూడా ఉన్నదన్న నమ్మకం కలిగిన గౌరీలంకేశ్‌ రాజ్యాంగాన్ని విశ్వసించింది. రాజ్యాంగబద్దంగా సగటు సామాన్యులు భావించినట్లుగానే తాను తన ప్రజాస్వామ్య స్వప్నం సాకారమయ్యేందుకు తన శక్తులన్నీ కూడదీసుకుని యుద్ధం చేసింది.

కానీ ఆమె లౌకికత్వం, ప్రజాపక్షం నిలిచిన పోరాటతత్వం, నిత్యం కళ్ళలో నిండిపోయి కవ్వించే అందమైన ప్రజాస్వామ్య స్వప్నం ఆమెను దగా చేసాయి. తనతో పాటుగా తను ప్రేమించే ప్రజల ఆకాంక్షలు, ఆమె ఆశించిన ఆచరించిన విలువలు, ఆమెలోని నిత్యఅసంతృప్తి, తొలిచే అలజడి, సమాజంతో రాజీపడలేని అసమ్మతి, ఆమె కొలిమిగా మారి నిత్యం నిప్పురవ్వలు రువ్వే అన్నీ తిరగబడి ఆమెను పొట్టనపెట్టుకున్నాయి. భౌతికంగా ఆమెను ఈ కుళ్ళు ప్రపంచం నుండి వెళ్ళగొట్టాయి. నష్టం ఈ సమాజానికి తీరని లోటై ఏర్పడితే, ఆమె మాత్రం బలవంతపు విశ్రాంతిలోకి నెట్టబడింది. ఆమెకు ఏ మాత్రం సరిపడని నిశ్శబ్దంలోకి ఆమె పంపించబడింది.

ఆమెను అటువైపు తోసేసిన ఉన్మాది కూడా తానెవరిని ఎందుకు చంపానో అప్పుడు తెలియదనీ. కానీ అట్లా చేయకుండా

ఉండాల్సింది అని ఒప్పుకున్నట్లుగా ఆమె గొంతును మూగగా చేయాలనుకున్న ఆ తొందరపాటు దుశ్చర్య ఎందుకో?

ఒక దేశ పౌరులుగా ఆ దేశ రాజ్యాంగాన్ని విశ్వసించడం. ప్రజాస్వామ్య కల నిజమవుతుందని నమ్మడం, నమ్మి నడుం కట్టడం ఎంత నేరమో మనకు తరచూ రక్తసిక్త దాడిగా పాలక మత భావజాలకులు చూపిస్తూనే ఉన్నారు, బెదిరిస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం గుర్తించలేని దౌర్భాగ్యం ఏమిటంటే మనం కోరుకోకూడని అంశాలనే కోరుకుంటున్నాం. మన ఆకాంక్షలను కోట్లాది జన శ్రేణులకు ముడిపెట్టుకొని లక్ష్యాలకోసం గొంతులు చించుకుంటున్నాం. ధ్వనిస్తూ ప్రతిద్వనిస్తూ గొడవ చేసే ఆ గొంతులు ఈ వ్యవస్థకు ప్రధాన శత్రువులు.

శంకర్‌గుహ నియోగి, నరేంద్ర దిబోల్కర్‌, యం.యం.కల్బుర్గి, గోవింద్‌ పన్సారే, గౌరీలంకేశ్‌, ఎవరైనా ఒక్కటే… వాళ్ళెవ్వరూ ఒక్కొక్క అస్తిత్వం కాదు సామూహిక చైతన్యానికి నిదర్శనం.

ఓటేస్తేనే ప్రజాస్వామ్యం, ఓటుతో గెలిస్తేనే అధికారం అనుకుంటూ అజ్ఞానపు పాలకులు త్రిశంకు స్వర్గాన్ని నిర్మించుకుంటుంటే ప్రజలు ఓటు నోటు ఊబిలో పడి కొట్టుకులాడుతుండటం నిత్యం ఎదురయ్యే పాత వాస్తవమే. విలువల కోసం నిలబడటం పెద్ద తప్పిదం. నిలబడి నిలదీస్తే పెద్ద నేరం. సాంఘిక శక్తిలామారడం మరింత అపాయం. అసాంఘికశక్తులకున్న చెల్లుబాటుతనం. సామాజిక శాంతికాములకెక్కడిది? సమత, సమానత్వం, సమ సమాజం గుంభనంగా గుట్టుగా పేలి ఆరిపోతున్న నిప్పురవ్వలు… శత్రువులు ఊచకోత కోస్తారు మిత్రులు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారు. శత్రువు ప్రత్యక్షం, పరోక్షం, అజ్ఞాతం, ఏ విధంగా ఉన్నా ఆయుధం అణిచివేత.

చిత్రంగా అనిపించేదేమంటే ఇక్కడ మాటను మాటతో ఎదుర్కోలేని బలహీనులదే రాజ్యం. మాటను తూటాతో మట్టుబెట్టాలనే చేతగానితనమే వెనకనుంచి దాడిచేస్తుంది. మరి తరతరాలుగా ప్రశ్నను ఎదుర్కోలేకనే కదా అసహనం హింసకు దిగబడుతూ వస్తున్నది. యుగాలుగా రక్తతిలకాలు దిద్దుకుంటూ కనిపించని దేవుళ్ళను వత్తాసుగా వాడుకుంటూ నరమేధం చేస్తున్నది సత్యం మింగుడుపడకనే కదా.

నేరం చేసినవాళ్ళు తాము చంపినవాళ్ళందరూ లేనట్టేనని భావించడం అతిపెద్ద అజ్ఞానం. పోయినోళ్ళందరినీ మనం క్షణమైనా మర్చిపోలేదే, వారి ధైర్య సాహసాలను చెప్పుకోవడం మానలేదే. వారి స్ఫూర్తిని ఏ మాత్రం తగ్గించుకోలేదే, చైతన్యాన్ని చాపలా చుట్టేసి మూలకు నిలబెట్టలేదే. మనిషిని భౌతికంగా చంపితే భావజాలం కూడా నశిస్తుందనుకుంటే భావజాలం భయపడి పారిపోతుందనే పోవాలనే కదా హంతకుల్ని పెంచిపోషిస్తున్న వ్యవస్థ ఆశించేది.

ఈ అంశం మీద నాకు ఒక పాటలోని వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. ”నమ్మిన సత్యం కోసం ఒకరు ప్రాణాలర్పిస్తే / నీవది మరణం అన్నావు / నీవది మరణం అన్నావు / నేనది జననం అన్నాను / నేనది జననం అన్నాను”. గౌరీలంకేశ్‌ కొన్ని విశ్వాసాలనేర్పర్చుకొని జీవించింది. ఆ విశ్వాసాల కోసమే ఆమె ప్రాణాలనర్పించింది. ఆమె ప్రభావం ఆమెను తెలియని, తెలుసుకున్నవారి గుండెల్లో గువ్వపిట్టలా ఒదిగిపోయింది.

ఇంతకీ దేశంలో ఎన్నో దుర్మార్గాలా.. దౌర్జన్యాలూ జరుగుతున్నాయి. వాటిపట్ల ఉదాసీనంగా, నిర్లిప్తంగా ఉండేవాళ్ళ సంఖ్య తక్కువేమీకాదు. కానీ ఆ ఘోర నేరాలను సహించని, క్షమించని వాళ్ళూ ఉన్నారు. వాళ్ళు ఆ దుర్మార్గాలను ఎప్పుడూ నిరసిస్తూ ఉంటారు. భారతదేశ సమాజంలో జరిగే క్రూరత్వాలను క్షమించకుండా శిక్షించాలని ఉద్యమిస్తుంటారు. కొంచెమైనా అలాంటి భారతదేశం బతికే

ఉందని నమ్మవచ్చా… ? నమ్ముదాం.. అయితే కానీ మనల్ని బలహీనపరుస్తూ గాయపరిచే నిజం కూడా ఉంది. అది మన సమాజం పూర్తిగా బతికి లేదన్నది. రోజు రోజుకూ పాకుడు తేలుతూ మురుగుపట్టిన నిలువనీరై కంపుగొడ్తూ కుళ్ళిపోతుదన్నది ఒక వైపు కృంగదీస్తూనే ఉంటుంది.

ఇంత నిరాశా అని అనిపిస్తుంది. ఒక క్షణం నిర్వేదం ఆవహిస్తుంది.. కానీ లోకాయత చార్వాకుల నుండీ నేటి హేతువాద జనపక్షం వహించే గొంతుకలు మూగవోనందుకు వారు జీవితాలను అర్పించి నిలబెడున్న విలువలు జనాన్ని తల్లికోడిలా రెక్కల కింద కమ్ముకొని కాపాడుతున్నందుకు లోలోపల చైతన్య కాంతిపుంజాల వెచ్చదనం ఆశను వెలిగిస్తుంది. అకాంక్షలకు జీవంపోస్తుంది.

గౌరీలంకేశ్‌ కొలిమి రవ్వల్లాంటి తన రాతలూ, చేతలతో ప్రతి నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉండటానికి కారణం ఆమెలో ఎగిసిపడిన మిలిటెన్సీ. ఎవరినీ దేన్నీ ఖాతరు చేయని మొండి ధైర్యం. జర్నలిస్టు అయిన ఆమె ఆక్టివిస్టుగా కూడా చెందిన రూపాంతరం. ఆమెను జనపక్షం వహించే ఆక్టివిస్ట్‌ రచయితగా తీర్చిదిద్దిన క్రమం.

గౌరీలంకేశ్‌లో అపారమైన తెగువ ఉన్నా ఆమెలో ఎక్కడో అమాయకత్వం నిక్షిప్తమై ఉన్నదనిపిస్తుంది. ఆమెలోని అమాయకత్వ కోణం ‘అభద్రత’ను ఆమె దృష్టిలో పడనియ్యలేదు. చుట్టూ మోహరిస్తున్న ప్రమాదాల్ని పసిగట్టనీయలేదు. న్యాయానికి నేస్తం కావడమంటే అన్యాయానికి శత్రువు కావడమే అని ఆమెకు తెలిసినా, తెలియనితనంలోనే ఉండిపోయిందేమో అనిపిస్తుంది. ఆక్టివిస్టులందరికీ ఉన్న నిర్భీతి.. అధికార ఆధిపత్యాలను ధిక్కరించే సాహసం ఆమెను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయి. ఆమెలోని మానవతావాదం నైతిక పరిస్థితులపట్ల సానుకూలంగా వ్యవహించేట్టుగా చేసింది. ఈ అంశాలన్నీ ఒక ఎత్తు. తాను మహిళ కావడమే తనకున్న భద్రత అని ఒక ఇంటర్వ్యూలో తానే చెప్పడంలో ఆమె అమాయకత్వ కోణం తెలియవస్తుంది.

ఆమె భౌతికదాడులకు భయపడలేదు. బెదిరింపులకూ లొంగలేదు. తన తండ్రి ‘లంకేష్‌ పత్రిక’ నడుపుతుంటే చంపుతామన్న బెదిరింపులూ, కేసులూ, తిట్లూ ఎదుర్కొన్నాడు. తండ్రి తనంతరం ఆ పత్రిక నడపవలసిన బాధ్యత తీసుకొని ఒంటరి మహిళగా తాను కట్టుబడిన సాంస్కృతిక నేపథ్యాన్ని కొనసాగించాలనీ, తాను కూడా దాడులకు గురకావలసి వస్తుందనీ తెలుసు. అందుకే భయాన్ని తన జీవితపు నిఘంటవు నుండి తొలగించింది. గౌరి తనను బ్లాక్‌మెయిల్‌ చేసిన దినపత్రికలకు ఆమె ‘నేను భయపడే తప్పు ఏమీ చేయలేదు నా గురించి ఏమైనా’ రాసుకొండని జవాబిచ్చారు.

గౌరీలంకేశ్‌ ఉద్యమాలలో పాల్గొంటూ అరెస్టులూ, జైళ్ల పాలయినా ఆమెలోని ఉత్సాహం ఆత్మవిశ్వాసం తగ్గిలేదు. పోరాటాలపై ఆమెకున్న నమ్మకమూ పోలేదు. మత సామరస్యం, కులాల చీలికలు లేని ఒకే కులం ఒకే జాతి భావనలు ఆమె ప్రగతిశీల స్వభానికి దారి దీపాలుగా ఉన్నాయి. యాభై ఏళ్ళ ఆమె జీవిత ప్రయాణంలో రాజీలేని లౌకికవాదిగా, మానవతావాదిగా, సామాజిక కార్యకర్తగా పత్రికా రచయితగా గౌరిది రాజీలేని ప్రస్థానం.

కఠిక నేలపైనా పడుకున్నది. మాడ్చే ఎండల్లో ఉత్త పాదాలతో నడిచింది. దుషణలూ, తిట్లూ, దాడులూ చేస్తామన్ని బెదిరింపులనూ ఎదుర్కొనది. ఆమెలోని నిరాశలు, బాధలు, ఆమె కోరుకునే న్యాయ సమాజం పట్ల నిబద్ధతను తగ్గించలేకపోయాయి. ప్రజాస్వామ్య సుందర స్వప్నం పట్ల విశ్వాసం సడలకుండా ఆమె కలల ఉద్యానవనాల్ని పెంచడం మానలేదు.

అణిచివేతకు గురయినవారి పక్షానచేరి ఆమె చేసిన గళ గర్జనలు ఆగిపోయాయనే అనుకుందామా? ఏ క్షణమూ గౌరిని మరిచిపోయి అలవాటైనా హత్యాచారమే అనే మరుపులోకి జారిపోలేదు మనం. ఆమె నిరంతర పోరాటం నిప్పు కణికల్లా ఎర్రగా సెగలు విసురుతూనే

ఉన్నది.

ఈ యధాతథ సమాజంలో, అసమ వ్యవస్థలో ఒకరిని ఏమిటి, స్త్రీలూ – పురుషులూ, ట్రాన్స్‌జండర్‌, వివిధ మతాలవారూ, అణగారిన కులాలవాళ్ళూ, సమస్యలూ, కష్టాలూ ఎదుర్కొంటున్న వాళ్ళూ, సమాజ వ్యతిరేకమైన ఏ విషయమూ ఏ అంశమైనా గౌరి దృష్టికి వస్తే దానిపై విశ్లేషణ, చర్చతో కూడిన సంపాదకీయలూ, వ్యాసాలూ రాస్తూపోయేది. ఆమె హృదయాన్ని తాకే రాళ్ళూ, కళ్ళను మండించే దృశ్యాలూ తప జీవన మార్గంలో నమోదు చేసుకున్న అనుభూతులు ”కొలిమి రవ్వల” ఈదరగాలులై మన మనోవరణాలను వేడిగా తాకుతూనే ఉంటాయి.

ఆమె ప్రేమించిన అంశాలు ; ప్రజాస్వామ్యం, పౌరస్వేచ్ఛ, లౌకికత్వం, సామరస్యం, సత్యాన్వేషణ, వాస్తవికత, మానవత. ఆకాశమంత విశాలం ఆమె హృదయం. కల్లోలిత సముద్రాలను తన గర్భంలో దాచుకోగల సామర్ధ్యం కలిగిన ధీరత్వం, ఆలోచనా దృఢత్వం ఆమె సొంతం.

ప్రజల నినాదమై నిరంతరం ప్రతిధ్వనిస్తున్న గౌరికి నీరాజనాలు! మరణంలోంచి జన్మించి జనఘోషై మోగుతున్న ఆ గళకలానికి సలాములు!

Share
This entry was posted in గౌరవ సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో