నాలుగు తాళ్ళు కట్టిన గూడ డబ్బాతో…
కోడి కుయ్యనే లేదు
సూర్యకిరణాలు భూమిని తాకనే లేదు
అమ్మనోటి నుంచి ఒక పిలుపు వినిపించింది
ఆ పిలుపు విని నేను కంగారుగా లేచాను
మా గోడ పక్క గడియారం చూస్తే
చిన్నముల్లు ఒకటి దగ్గర
పెద్దముల్లు పన్నెండు దగ్గర వున్నాయి
దట్టమైన పొగమంచు
కళ్ళు కనిపించట్లేదు
అమ్మా నాన్న నన్ను లేపి
గూడ డబ్బా పట్టుకోమన్నారు
నాలుగు వైపులా నాలుగు తాళ్ళు కట్టి పట్టుకున్నాను
అర్థ రాత్రి వేళ శ్మశానం దాటి పోతున్నాం
మా దగ్గర ఏం లేదు
వున్నదంతా
నాన్న చేతిలో టార్చిలైట్
అమ్మ చేతిలో తువ్వాలు
నా చేతిలో గూడ డబ్బ
ఆ అర్థరాత్రి వేళ
నాన్న గూడ డబ్బాను పట్టుకుని గూడ వెయ్యమన్నాడు
నాన్న పొలంలో వరిచేను చూసి వస్తానన్నాడు
ఆ అర్థరాత్రి వేళలో
అమ్మ, నేను
చెరువులో వున్న నీటిని
పొలంలోకి తోడుతున్నాం
పొద్దు పొడవనే పొడిసింది.
పొలంలో నీరు కలవనే కలిసింది
అప్పుడు అమ్మ వరిచేను వైపు చూసి
దండం పెడుతుంది
”అమ్మా! వరిచేనా…
నీవు మా కడుపు నింపుతావు,
మాకు తెలుసు
మేం చేసిన అప్పులు నీతోనే వున్నాయి
మా నంద నిండేలా పొట్టు వెయ్యు… తల్లీ!”
అమ్మ దండం పెడుతుంది
కొన్ని రోజులు పోయాక తెలియాలి
మా అమ్మ దండం ఫలితం
సూర్యుణ్ణి ధరించాలని
ఆమె కళ్ళల్లో ఒక అద్భుతం వుంది
ఆమె కళ్ళల్లో ఒక లక్ష్యం వుంది
ఆమె కళ్ళల్లో ఆమె జీవితం వుంది
కోడి కూసిన వేళ
ఆమె వీధి వీధి తిరుగుతుంది
ఆమె నడుస్తుంది
ఆమెను నడవనివ్వండి
ఎర్రని ఎండలో ఆమె
ఒట్టి కాళ్ళతో నడుస్తుంది
ఆమె ఏదో పోగొట్టుకున్నట్టు వెతుకుతుంది.
ఆమెను వెతకనివ్వండి
ఆమె వెతుకుతూ వెతుకుతూ
కళ్ళతో ఆకాశాన్ని, భూమిని చూస్తుంది
చూడనివ్వండి
ఆమె చూపులో ఆమెకు ఏదో కావాలి
ఆకాశాన్ని అద్దంలా చేసి చూడాలని
చందమామని ఆటబొమ్మని చేసి ఆడుకోవాలని
సూర్యుణ్ణి తన నుదట బొట్టుగా పెట్టుకోవాలని
ఆమె చూస్తూ వుంది
ఆమెను చూడనివ్వండి
ఆమె చూపుకు అర్థం వెతుకుతుంది
వెతనివ్వండి.