బాలికా విద్యకు బలమైన పునాది వేసిన తొలి ఉపాధ్యాయురాలు
బడులెన్నింటినో నెలకొల్చి బతుకునిచ్చిన మహనీయురాలు
చదువే సంపదగా ముందుకు సాగమని ప్రబోధించిన విద్యావేత్త
చెప్పిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన కార్యకర్త
సత్యశోధక సమాజాన్ని నిర్వహించిన నాయకురాలు
ప్రతిఘటనలెన్నింటికో ఎదురొడ్డి నిలిచిన సమర్థురాలు.
సాంఘిక దురాచారాలను తిప్పికొట్టిన గొప్ప సంస్కర్త
సామాజిక మార్పు కోసం కృషి చేసిన ధీర వనిత
స్త్రీల హక్కుల పోరాట యోధురాలు
పీడిత ప్రజల పక్షాన నిలిచిన ప్రజ్ఞావంతురాలు
అస్పృశ్యతా భావాన్ని సహించలేని తత్వం
సమానత్వ సాధనయే ఆమె సిద్ధాంతం
చదువుల తల్లి ఆ త్యాగమూర్తి
దళితుల బతుకుల్లో వెలుగులు నింపిన విజ్ఞాన జ్యోతి
అన్నార్తుల ఆకలి బాధలు తీర్చ బూనిన మనసున్న వ్యక్తి
బాధాతప్త హృదయాలకు బాసటగా నిలిచిన మానవతామూర్తి
పితృస్వామిక భావజాలాన్ని పెకిలించ బూనిన కార్యశీలి
కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి.
ఆత్మగౌరవ చేతనంతో కూడిన ఆమె వ్యక్తిత్వం
బానిసత్వ బంధనాలను తెంచుకొని కదలండని పిలుపునిచ్చిన ఆమె కవిత్వం
తరగని ఆత్మ విశ్వాసమే సదా ఆమె ఆయుధం
తరతరాలకు నిలిచి ఉండే ఆమె ఆదర్శం
సావిత్రిబాయి ఫూలే ఆమె పేరు
కర్తవ్య దీక్షలో ఆమెకెవరూ సాటిరారు.