జెండర్‌ ఏమిటో తెలుసుకుందాం – కమలా భాసిన్‌

ప్రాకృతిక భేదాల మాటున సామాజిక అసమానతలను, మహిళలపై సాగే దోపిడీని దాచిపెట్టి, లింగం (జెండర్‌)ను సామాజిక చర్చ నుండి, రాజకీయ పరిష్కారం నుండి వెలివేసింది చరిత్ర. అయితే లైంగిక దోపిడీ, సామాజిక అసమానతలను ప్రశ్నించి, లైంగికతను రాజకీయ ఉద్యమంగా మలచడంలో అనేక మంది గళం, కలం విప్పారు. అందులో క్రియాశీల వ్యక్తి కమలా భాసిన్‌

కమలా భాసిన్‌ గారి, ”జెండర్‌” పుస్తకం, లైంగిక (జెండర్‌)పై నున్న అనేక అపోహలను పరిష్కరించి, శాస్త్రబద్ధంగా విశ్లేషించి, అందరి అవగాహన కొరకు, మహిళల సాధికారత, లైంగిక సమానతలను న్యాయ వాదనగా అందించారు.

కమలా భాసిన్‌ ఈ పుస్తకాన్ని, జాగోరి ప్రచురించింది. ఇప్పుడు, గ్రామ్య ఈ పుస్తకాన్ని అనువదించి, తెలుగు పాఠకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, మహిళలు, బాలికలు తప్పనిసరిగా చదివి, బాలికల హక్కులు రక్షించడానికి పూనుకోవాలి.

”జెండర్‌”, పుస్తకాన్ని తెలుగులో అనువదించి ప్రచురించడానికి అనుమతినిచ్చిన, జాగోరి సంస్థకు, కమలా భాసిన్‌ గారికి, గ్రామ్య రిసోర్స్‌ సెంటర్‌ మరియు సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ సాలిడిరిటి సంస్థలకు కృతజ్ఞతలతో…

– మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్‌

జెండర్‌ (లింగం) అనే పదం వ్యాకరణపరంగా మనకు తెలుసు. కానీ ఇప్పుడు దీన్ని వేరే అర్థంలో వాడుతున్నారు. ఈ కొత్త అర్థాన్ని వివరిస్తారా?

జెండర్‌ అనే పదాన్ని సామాజిక శాస్త్రపరంగా ఒక సిద్ధాంత భావనగా ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. దీనికి ఒక ప్రత్యేక అర్థం

ఉంది. ఈ కొత్త రూపంలో జెండర్‌ అంటే స్త్రీ, పురుషుల సామాజిక-సాంస్కృతిక నిర్వచనం. స్త్రీలు, పురుషులను సమాజాలు భిన్నంగా చూసి వారికి విభిన్న సామాజిక పాత్రలను నిర్దేశించే విధానం. స్త్రీ, పురుషులకు సంబంధించిన సామాజిక వాస్తవాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విశ్లేషణా పరికరంగా జెండర్‌ని ఉపయోగిస్తున్నారు.

మహిళల శరీర నిర్మాణానికి సమాజంలో వారికి తక్కువ స్ధానం ఉండడానికి సంబంధముందన్న సర్వసాధారణ ధోరణిని ఎదుర్కోవడానికి ‘సెక్స్‌’, ‘జెండర్‌’ల మధ్య తేడాలను గుర్తించడం మొదలుపెట్టారు. సమాజంలో స్త్రీలు, పురుషులకు నిర్దేశించిన భిన్నమైన లక్షణాలు, పాత్రలు, హోదా-శరీర నిర్మాణ (అంటే సెక్స్‌) కారణంగా నిర్ధారింపబడుతున్నాయని శతాబ్దాలుగా నమ్ముతూ వస్తున్నారు. ఇవి ప్రకృతి సహజమైనవి కాబట్టి వీటిని మార్చలేం అన్న అభిప్రాయం ఉంది.

ఒక రకంగా సమాజంలో మహిళల తక్కువ హోదాకు మహిళలను, వారి శరీరాలను బాధ్యులుగా చేశారు, చేస్తున్నారు. ఇది ప్రకృతి సహజమైనదని అనుకున్న తరువాత సమాజంలో ఉన్న జెండర్‌ అసమానతలు, అన్యాయాలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదు.

‘సెక్స్‌’ వేరు, ‘జెండర్‌’ వేరు అని చెప్పడానికి జెండర్‌ భావన మనకు ఉపకరిస్తుంది.

ప్రతి ఒక్కరు ‘ఆడ’గానో, ‘మగ’గానో పుడతారు. వారి జననాంగాలను బట్టి అది నిర్ణయిస్తారు.

కానీ ప్రతి సంస్కృతికీ ఆడపిల్లల్ని, మగపిల్లల్ని విలువ కట్టే తనదైన విధానం ఉంటుంది. అది వారికి భిన్నమైన పాత్రలు, బాధ్యతలు, లక్షణాలను ఆపాదిస్తుంది.

పుట్టినప్పటి నుంచి బాలికలకు, బాలురకు సామాజికంగా, సాంస్కృతికంగా ఇచ్చే ‘తర్ఫీదు’నే జెండర్‌కి గురి చేయడం అంటారు.

ప్రతి సమాజం ఆడ, మగలను నెమ్మదిగా స్త్రీలు, పురుషులుగా మారుస్తుంది. వీరికి భిన్నమైన లక్షణాలు, ప్రవర్తనా పద్ధతులు, బాధ్యతలు, హక్కులు, ఆశలు కలిగిన స్త్రీత్వాన్ని, పురుషత్వాన్ని తొడుగుతుంది. శరీర నిర్మాణం ప్రకారం సెక్స్‌ నిర్ధారితమౌతుంది. కానీ స్త్రీ, పురుష జెండర్‌ గుర్తింపు మానసికంగా, సామాజికంగా అంటే చారిత్రకంగా, సాంస్కృతికంగా నిర్థారితమౌతుంది.

ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించిన మొట్టమొదటి ఫెమినిస్ట్‌ సిద్ధాంత కర్తలలో ఒకరైన ఆన్‌ ఓక్లే ఇలా అంటున్నారు : ”జెండర్‌” అన్నది సంస్కృతికి సంబంధించినది; స్త్రీలు, పురుషులను ఆడవాళ్ళో, మగవాళ్ళో నిర్ధారించుకోవడానికి శారీరక రుజువులు ఉపయోగపడతాయి. కానీ ‘స్త్రీత్వం’, ‘పురుషత్వం’ కలవారిని అలా గుర్తించలేం. దీని ప్రాతిపదిక సాంస్కృతికమైనది; ఇవి సమయం, స్థలం బట్టి మారుతుంటాయి. ”సెక్స్‌” అనేది మారనిది అని ఒప్పుకోవాలి. అలాగే జెండర్‌ అనేది మారుతూ ఉంటుందని కూడా ఒప్పుకోవాలి. ”జెండర్‌కి శారీరక మూలాలు ఏమీలేవు. ”సెక్స్‌”కీ జెండర్‌కీ మధ్య సంబంధం ప్రకృతి సహజమైనదేమీ కాదు.

ఈ రెండు పదాలలో మధ్య ముఖ్యమైన తేడాలను పరిశీలిద్దాం.

సెక్స్‌ జెండర్‌

”సెక్స్‌” ప్రకృతి సహజమైనది జెండర్‌ సామాజిక-సాంస్కృతికమైనది. దీన్ని పురుషులు సృష్టించారు.

”సెక్స్‌” శారీరకపరమైనది. అది జెండర్‌ సామాజిక-సాంస్కృతిక పరమైనది, అది స్త్రీత్వానికి, పురుష

జననాంగాలలో తేడాలను, దాని త్వానికి సంబంధించిన లక్షణాలు, ప్రవర్తనా పద్ధతులు, పాత్రలు,

ఆధారంగా పునరుత్పత్తి ధర్మాలలో బాధ్యతలు వంటి వాటిని సూచిస్తుంది.

తేడాలను సూచిస్తుంది.

”సెక్స్‌” మార్పు లేనిది, అది అన్నిచోట్లా జెండర్‌ మారుతుంటుంది. అది కాలాన్ని బట్టి, సంస్కృతిని బట్టి,

ఒకే రకంగా ఉంటుంది. కుటుంబాన్ని బట్టి కూడా మారుతుంటుంది.

సెక్స్‌ని మార్చలేం. జెండర్‌ని మార్చవచ్చు.

దక్షిణ ఆసియా భాషలలోకి జెండర్‌ని ఎలా అనువదిస్తారు?

ఇది నిజంగా ఒక సమస్యే. ”సెక్స్‌”, ”జెండర్‌” అన్న రెండు పదాలు ఉండగా చాలా దక్షిణాసియా భాషలలో ఈ రెండింటికీ ”లింగం” అన్న ఒక్కటే పదం ఉంది. అయితే ఈ రెండింటికీ మధ్య తేడాను తెలియచేయడానికి కొత్త పదాలను కనుగొన్నాం. ‘సెక్స్‌’ని ‘ప్రాకృతిక లింగం’ అనీ, ‘జెండర్‌’ని ‘సామాజిక లింగం’ అనీ అన్నాం. ఒక్కొక్కసారి సెక్స్‌, జెండర్‌ కంటే ఈ పదాలే ఎటువంటి వివరణ లేకుండా అర్థమౌతాయి. (తెలుగులో ‘సెక్స్‌’, ‘జెండర్‌’ అన్న పదాలనే ఉపయోగిస్తున్నాం- అనువాదకుడు)

కానీ జెండర్‌కీ, ‘సెక్స్‌’కీ సన్నిహిత సంబంధం ఉంది కదా? లైంగిక తేడాల కారణంగా స్త్రీ, పురుషులకు భిన్న పాత్రలు, ప్రవర్తనలు నిర్దేశించలేదా?

కొంతమేరకే అలా జరుగుతుంది. తమ శరీరాల కారణంగా మహిళలు పిల్లల్ని కంటారు; వాళ్ళు పిల్లలకి స్తన్యమిస్తారు. రుతు చక్రాన్ని అనుభవిస్తారు. ఇవి కాకుండా వాళ్ళు చెయ్యగలిగినవన్నీ పురుషులూ చెయ్యగలుగుతారు. లేదా పురుషులు చేసే పనులు వాళ్ళు చేస్తారు. పిల్లల్ని కనడమంటే వారి సంరక్షణ కూడా మహిళలే చేయాలని ఏమీ లేదు. పురుషులు కూడా పిల్లల సంరక్షణ చెయ్యవచ్చు కాబట్టి ఆడ లేదా మగ శరీరాలు ఉన్నంత మాత్రాన మన లక్షణాలు, పాత్రలు భవితవ్యాలు నిర్దేశించబడనవసరం లేదు.

కానీ ఏది ప్రకృతి సహజమో, ఏది సామాజికంగా నిర్దేశించబడిందో చెప్పటం నిజ జీవితంలో కష్టమైన విషయం. ఎందుకంటే పిల్లలు పుట్టిన మరుక్షణం నుంచి కుటుంబం, సమాజం జెండర్‌కి గురిచేసే ప్రక్రియలను మొదలుపెడతాయి. అనేక దక్షిణ ఆసియా దేశాలలో కొడుకు పుడితే పండగ చేసుకుంటారు. కూతురు పుడితే విచారంలో మునిగిపోతారు. కొడుకులైతే ప్రేమ, గౌరవం, మంచి ఆహారం, మంచి వైద్య సదుపాయాలతో ముంచెత్తుతారు. మగపిల్లల్ని బయటికి వెళ్ళమని, ధైర్యంగా ఉండమని ప్రోత్సహిస్తే ఆడపిల్లలకు బిడియాన్ని, ఇంటిపట్టున ఉండడాన్ని ప్రోత్సహిస్తారు. నిక్కర్లు వేసుకోకుండా, చెట్టు ఎక్కకుండా, సైకిల్‌ తొక్కకుండా నిరోధించే భాగాలు ఏమీ ఆడపిల్లల శరీరాల్లో లేవు. అదేవిధంగా బొమ్మలతో ఆడుకోకుండా, తమ్ముళ్ళు. చెల్లెళ్ళను చూసుకోకుండా లేదా వంట చెయ్యకుండా, ఇల్లు శుభ్రపరచకుండా అడ్డుపడేవి ఏమీ మగపిల్లల శరీరంలో లేవు. ఇవన్నీ జెండర్‌ భేదాలు. వీటిని సమాజం సృష్టించింది. జెండర్‌ ప్రకృతి సహజమైనది కాదనీ, సమాజమూ, సంస్కృతీ నిర్దేశించినదనీ చెప్పడానికి ఇది కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, విభిన్న సామాజిక వర్గాలలో మారుతుండడమే నిదర్శనం. ఉదాహరణకు మధ్య తరగతి ఆడపిల్లలను ఇంటికీ, బడికీ పరిమితం చెయ్యవచ్చు. అదే ఆదివాసీ ఆడపిల్ల అడవిలో స్వేచ్ఛగా తిరగవచ్చు. పశువులను మేపడానికి వెళ్ళవచ్చు. పండ్లు, ఆకుల కోసం చెట్లు ఎ్కవచ్చు. వాళ్ళిద్దరూ ఆడపిల్లలే. వారి శరీర నిర్మాణాలూ ఒకటే, కానీ వారిద్దరూ భిన్నమైన సామర్ధ్యాలు పెంపొందించుకుంటారు. వేరు వేరు ఆశలూ, కలలు కలిగి

ఉంటారు.

అదే విధంగా చాలా కుటుంబాలలో ఆడపిల్లలకు 10-11 సంవత్సరాలు దాటిన తర్వాత బడికి పంపించకపోవడం, బయటకు వెళ్ళనివ్వక పోవడం సంప్రదాయం. రజస్వల కావటంతోనే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పురుషుల విద్య, పాత్రలు, బాధ్యతలు కూడా కొంతమేరకు మారాయి. జెండర్‌ మారుతూ ఉంటుంది అనడంలో మా ఉద్దేశం ఇదే. అది వేర్వేరు కుటుంబాలలో, సముదాయాలలో, ఒకే కుటుంబంలో కూడా వేర్వేరు కాలాలలో వేరేగా ఉంటుంది.

మన శరీరాలను మనం (లేదా సమాజం, సంస్కృతి) కావాలనుకున్నట్లు మలుచుకోవచ్చు. శిక్షణ ద్వారా, అవయవాలు

ఉపయోగించడం, ఉపయోగించకపోవడం ద్వారా శరీర పరిమాణాన్ని, ఆకారాన్ని, బలాన్ని మార్చుకోవచ్చు. ఆడ, మగ వస్తాదులు, కుస్తీదారులు, ఆటగాళ్ళు, నాట్య కళాకారులు, యోగ సాధకులు వంటివాళ్ళు ఇందుకు స్పష్టమైన ఉదాహరణ.

అదేవిధంగా మహిళల శరీరాలు పునరుత్పత్తికి అనువుగా ఉన్నప్పటికీ ఇప్పుడు మనం పిల్లలు కావాలా, వద్దా, ఎంతమంది కావాలి, ఎంత ఎడంతో వాళ్ళను కనాలి వంటివి ఎంచుకునే స్థితిలో ఉన్నాం. ఆడ జంతువులలో తప్పనిసరి అయినట్లు పునరుత్పత్తి మహిళలకు తప్పనిసరి కాదు.

మహిళ వండగలిగితే

పురుషుడూ వండగలుగుతాడు,

ఆమె తన గర్భసంచితో

వంట చేయదు కదా!

దీనర్థం సమాజంలో స్త్రీ, పురుషులు అనుభవించే భిన్న హోదా సామాజికంగా, సాంస్కృతికంగా నిర్దేశించబడింది; ఇది మనుషులు చేసింది, ప్రకృతికీ, దీనికీ సంబంధం ఏమీ లేదు. దాదాపుగా ప్రతిచోటా మహిళలు పురుషుల కంటే తక్కువ అని భావించడానికి జెండర్‌ కారణం, సెక్స్‌ కాదు. మహిళలకు తక్కువ హక్కులు ఉంటాయి. వారి ఆధీనంలో ఉండే వనరులూ తక్కువే. పురుషుల కంటే ఎక్కువ గంటలు వాళ్ళు పని చేస్తారు. కానీ వారి పనికి విలువ తక్కువ, వేతనం తక్కువ. పురుషులు, సమాజం చేతుల్లో మహిళలు తీవ్ర హింసకు గురవుతారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థలలో వారికి నిర్ణయాధికారాలు ఉండవు.

”స్త్రీ పురుషుల మధ్య ప్రకృతి సహజమైన తేడాలను మనం వక్రీకరించినంత దారుణంగా, ఉపయోగించినంతగా చరిత్రలో ఏ సామాజిక వ్యవస్థా చేయలేదు. ఈ సమాజం ముందు సహజమైన ”సెక్స్‌”ని కృత్రిమమైన సామాజిక జెండర్‌గా మార్చింది – అది మగవాళ్ళను ‘పురుషత్వం’ ఉన్నవాళ్ళుగానూ, మహిళలను ‘స్త్రీత్వం’ ఉన్నవాళ్ళుగానూ మార్చింది. అంతేకాకుండా పురుషులను ‘మానవజాతి’గా భావిస్తే, మహిళలను కేవలం ‘సెక్స్‌’కే పరిమితం చేసింది. స్త్రీ, పురుషుల మధ్య ఈ తేడాలను సృష్టించి, వాటిని ఆర్థికంగా దోపిడీకి గురిచేయడానికి అనువుగా ఈ తేడాలు ‘సహజమైనవని’ తిరిగి అదే ప్రకటిస్తుంది” – క్లాడియా వాన్‌ వెర్ల్‌హాఫ్‌.

బాలికలు / బాలురకూ – మహిళలు / పురుషులకూ వేర్వేరు నియమాలను ప్రతి సమాజం నిర్దేశిస్తుంది. ఇవి వారి జీవితాలనూ, భవితవ్యాన్ని శాసిస్తాయి. ప్రస్ఫుటంగా కనపడే కొన్ని నియమాలను చూద్దాం.

బట్టలు

చాలా సమాజాలలో బాలికలు, బాలురు, మహిళలు, పురుషులూ వేసుకునే బట్టలు వేరుగా ఉంటాయి. కొన్ని చోట్ల ఈ తేడాలు చాలా తక్కువ అయితే, కొన్ని చోట్ల కొట్టొచ్చినట్లు ఉంటాయి. కొన్ని సమాజాలలో మహిళలు తమ ముఖంతో సహా తమ శరీరాన్ని పూర్తిగా పై నుంచి కింది దాకా ప్పుకోవాలి. వేసుకునే బట్టలు వ్యక్తుల కదలికలను, స్వేచ్ఛ, గౌరవ భావాలను ప్రభావితం చేస్తాయి.

ఆపాదిత లక్షణాలు

చాలా సమాజాలలో మహిళలు అణకువగా, మృదువుగా, సంరక్షణ, పోషణ చేపట్టే వాళ్ళుగా ఉండాలనీ, పురుషులు బలంగా, హేతుబద్ధంగా, పోటీతత్వం, ఆత్మవిశ్వాసంతో ఉండాలనీ ఆశిస్తారు. జెండర్‌ శిక్షణా కార్యక్రమంలో ప్రముఖ ఫెమినిస్టు అయిన వసంత కన్నాభిరాన్‌ ఇలా అన్నారు. ”పిల్లలకి జన్మనివ్వడం మహిళలకు ఎంత సహజమో పిల్లల్ని పెంచడం కూడా మహిళలకు అంతే సహజమని సమాజం భావిస్తుంది. ఇది మనం కనే పిల్లలకి మాత్రమే పరిమితం కాదు; అవసరమైన వాళ్ళందరి కోసం నాలోని ప్రేమ, మాతృత్వం ప్రవహించడానికి సిద్దంగా ఉంటుందని ఆశిస్తారు. మనం శాశ్వత తల్లులం అవుతాం. కాబట్టి నేను నా పిల్లలకీ, ఇతరుల పిల్లలకీ తల్లినవుతాను. భర్తకి, సోదరులకి, చెల్లెళ్ళకి, నాన్నకు కూడా తల్లినవుతాను! మా నాన్న అయితే నన్ను ‘నా చిట్టితల్లీ’ అని పిలుస్తాడు. అందరికీ నేను అమ్మనవుతాను. మొత్తం ప్రపంచం పట్ల మాతృభావన ఉప్పొంగుతూ

ఉండాలని ఆశిస్తారు! ఇది పనిగా భావించరు. ఊపిరి తీసుకున్నట్లు, ఆహారం తీసుకున్నట్లు, నిద్రపోయినట్లు ఇది కూడా జరిగిపోవాలని ఆశిస్తారు”.

పాత్రలు, భాధ్యతలు

పురుషులు ఇంటి యజమానులుగా, సంపాదించేవాళ్ళుగా, ఆస్తికి అధిపతులుగా, నిర్వాహకులుగా, వృత్తి, వ్యాపార, మత, రాజకీయ అంశాలలో చురుకుగా పాల్గొనేవారిగా భావించబడతారు. ఇందుకు భిన్నంగా మహిళలు పిల్లల్ని కని, సాకాలనీ, వృద్ధులు, బలహీనుల ఆలనా, పాలనా చూడాలనీ, ఇంటి పని మొత్తం చేయాలనీ ఆశిస్తారు. అందుకనుగుణమైన శిక్షణ పొందుతారు. ఇది వారి విద్యకు, ఉపాధికి సిద్ధం కావడాన్నీ, చేపట్టే ఉపాధి వంటి వాటిని ప్రభావితం చేస్తుంది. పురుషుల, స్త్రీల పాత్రల మధ్య తేడాలు అనేక విధాలుగా ఉంటాయి. ఒక్కోసారి నియమాలు అనుకూలంగా ఉండి తాత్కాలికంగా బాధ్యతలు తారుమారైనా ఎవరూ ఆందోళన పడరు.

”కోరా దు బోయిస్‌ ఇలా చెబుతున్నాడు : ఆలోర్‌లో స్త్రీ, పురుషులకు భిన్నమైన ఆర్థిక పాత్రలు ఉన్నప్పటికీ మహిళలు చేసే పని పురుషులూ, పురుషులు చేసే పని మహిళలూ చేపట్టినప్పటికీ వింతగా చూడరు. పైగా అదనపు నైపుణ్యం కలిగి

ఉన్నందుకు మెచ్చుకుంటారు. బతుకు జరుగుబాటుకు అవసరమైన ఆర్థిక కార్యకలాపాలు మహిళల ఆధీనంలో ఉంటాయి; పురుషులు డబ్బుకి సంబంధించిన లావాదేవీలు చూసుకుంటారు. చాలామంది పురుషులు ఎంతో ఇష్టంగా చెట్ల సంరక్షణ చేపడతారు. అలాగే చాలామంది మహిళలకు డబ్బు లావాదేవీలలో నైపుణ్యం ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా కొన్ని సంస్కృతులలో చెట్ల సంరక్షణ మహిళల పనిగా నిర్దేశించి ఉంటే పురుషులు ఆ పని చెయ్యడాన్ని లైంగిక లోపం (సవఙఱa్‌ఱశీఅ) గా పరిగణిస్తారు. స్త్రీ, పురుషులకు వేరువేరుగా కేటాయించిన పనులలో నైపుణ్యం సాధించిన మహిళల కోసం ప్రత్యేక వర్గాన్ని సృష్టించిన సంస్కృతులూ ఉన్నాయి” – ఆన్‌ ఓక్లే.

ఇతర సమాజాలు ఖచ్చితమైన పాత్రలను నిర్దేశిస్తాయి. ఆన్‌ ఓక్లే ప్రకారం మధ్య బ్రెజిల్‌లోని ముండురుకు ఇండియన్లలో ఆడ, మగ పాత్రలు, వారి బృందాలు రెండు ధృవాలుగా కేంద్రీకృతం కావడం ప్రాథమిక సామాజిక అంశంగా మారింది. స్త్రీ, పురుషులను సామాజికంగా, భౌతికంగా పూర్తిగా వేరు చేస్తారు. పురుషులు, మగపిల్లలు ఆడవాళ్ళకు దూరంగా నివసిస్తారు. ప్రతి బృందం (మరీ చిన్న పిల్లలు తప్పించి) తనతోటే అంతఃసంబంధాలు కలిగి ఉంటుంది. స్త్రీ, పురుషుల మధ్య వైరుధ్యాలు అనేక సంప్రదాయ రీతులలోనూ, సందర్భాలలోనూ వెల్లడవుతాయి. అలా వ్యతిరేక ధృవాలలో కేంద్రీకృతం కావడమన్నది సామాజిక పాత్రలు, ఆర్థిక పనులకే కాక మూర్తిమత్వాన్ని (వ్యక్తిత్వాన్ని) కూడా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఇది ఆధిపత్యం, లొంగిపోవటం అనే స్వభావాన్ని సంతరించుకుంటుంది. తమకు నిర్దేశించిన పాత్రలు, వ్యక్తిత్వాలకు లోబడి ఉండగలగడం; వాటిని అధిగమించాలన్న కోరిక, ఊహలు అనేక జానపద కథలలోనూ, సంప్రదాయాలలోనూ వ్యక్తమవుతాయి”.

బయటినుంచి చూసేవాళ్ళకి పాశ్చాత్య దేశాలలో జెండర్‌ తేడాలు పెద్దగా లేవనిపిస్తుంది. కానీ ఆన్‌ ఓక్లే చెప్పేది అందుకు భిన్నంగా ఉంది. ”ఈనాడు సామాజిక నిర్మాణానికి లింగ భేదం ఆధారభూమికగా ఉంది. సాధారణంగా నమ్ముతున్నట్లు కాకుండా సామాజిక పాత్రలను నిర్ణయించుకోవడంలో జెండర్‌ ప్రధాన పాత్ర వహిస్తుంది.

కాబట్టి ముండురుకు ప్రజలలో మాదిరి పాశ్చాత్య సంస్కృతులలో ఆందోళనకు మూలాలు జెండర్‌ నిర్దేశించిన పాత్రలలో ఉండడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ నిర్దేశించిన పాత్రల పరిధిలో ఉండడంతో పెద్దవాళ్ళుగా మనకు ఎంతో భద్రత లభిస్తుందని మనో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం మానసికంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆ పాత్రలకు లోబడి ఉండాలి”.

మహిళలు, బాలికలు శారీరకంగా బలహీనంగా ఉన్న కారణంగా ఈ తేడాలలో కొన్ని ఏర్పడి ఉంటాయా?

ఆప్లే మోంటాగు ”ుష్ట్రవ చీa్‌బతీaశ్రీ ూబజూవతీఱశీతీఱ్‌వ శీట ఔశీఎవఅ” (ది నేచురల్‌ సుపీరియారిటీ ఆఫ్‌ ఉమెన్‌) అన్న పుస్తకంలో సెక్స్‌ సంబంధ జన్యువుల కారణంగా ఏర్పడే 62 లోపాలను గుర్తించాడు. ఇవి ప్రధానంగా పురుషులలోనే కనపడతాయి. ”వీటిల్లో సగం చాలా ప్రమాదకరమైనవి. హీమోఫీలియా (రక్తం గడ్డకట్టకపోవడం), మిస్ట్రల్‌ స్టెనోసిన్‌ (గుండె నిర్మాణంలో లోపం), కొన్ని రకాల మానసిక వైకల్యాలు ఈ జాబితాలో ఉన్నాయి. గర్భంలో పడింది మొదలుకొని జీవితంలో అన్ని దశలలో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువమంది చనిపోతారు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువమంది పుడతారు. మగవాళ్ళు ఎక్కువ సంఖ్యలో పుట్టడం, ఎక్కువ సంఖ్యలో చనిపోవడం రెండూ పక్కపక్కనే కనిపించే సత్యాలు.

(లింగ నిర్ధారణ చేసే) ‘ఎక్స్‌’, ‘వై’ వీర్యకణాలు సమాన సంఖ్యలో ఉత్పన్నమైనట్లుగా అనిపించినా ప్రతి 100 ఆడపిండాలకి 120 మగ పిండాలు ఏర్పడతాయి. అయితే జననం నాటికి మగ, ఆడ నిష్పత్తి అమెరికాలో (శ్వేత జాతీయుల గణాంకాలు మాత్రమే) 106ః100కి, బ్రిటన్‌లో 98ః100 కి పడిపోతుంది. గర్భస్రావం కావడం, చనిపోయి పుట్టడం, ఆడశిశువుల్లో కంటే మగ శిశువుల్లో ఎక్కువ. అలాగే ప్రసవ సమయంలో ట్రామా వల్ల ఆడశిశువుల కంటే మగ శిశువులు ఎక్కువగా చనిపోతారు. మొత్తంగా ప్రసవ సమయంలో ఆడశిశువుల కంటే 54 శాతం ఎక్కువగా మగ శిశువులు చనిపోతారు. పుట్టుకతో వచ్చే లోపాల కారణంగా మగ శిశువులు 18 శాతం ఎక్కువ చనిపోతారు.

”పుట్టినప్పుడు స్త్రీల జీవిత కాల అంచనా ప్రపంచ వ్యాప్తంగా పురుషుల కంటే ఎక్కువ. పుట్టినప్పుడు స్త్రీల జీవిత కాల అంచనా బ్రిటన్‌లో 74.8 సంవత్సరాలు కాగా, పురుషులలో 68.1 సంవత్సరాలు; చైనాలో స్త్రీలకు 65.6, పురుషులకు 61.3; బ్రెజిల్‌లో స్త్రీలకు 45.5 సంవత్సరాలు, పురుషులకు 41.8 సంవత్సరాలు”.

అంటువ్యాధులకు గురి కావడం, వ్యాధులు ప్రాణాంతకంగా పరిణమించడం పురుషులలో ఎక్కువని పరిశోధకుల నుంచి విస్తృతంగా గణాంకాలను ఆన్‌ ఓక్లే అందచేస్తున్నారు. ఆమె ప్రకారం ఈ తేడా ”స్త్రీ పురుషుల క్రోమోజోముల నిర్మాణానికి ప్రత్యక్షంగా ముడిపడి

ఉంది. శరీర రోగాన్ని తట్టుకునే విధానం ‘ఎక్స్‌’ క్రోమోజోమ్‌ ద్వారా అందుతుంది… పురుషులు ఎక్కువగా రోగాలకు గురి కావడానికి స్పష్టమైన జన్యుపర సంబంధాలు ఉన్నాయి”.

స్త్రీలలో జీవశాస్త్ర పరంగా మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ దక్షిణాసియా దేశాలలో వారికి సామాజికంగా, సాంస్కృతికంగా నిర్దేశించిన తక్కువ స్థానం కారణంగా ఈనాడు స్త్రీలు అన్ని రంగాలలోనూ పురుషులకంటే వెనుకబడి ఉన్నారు.

అరిస్టాటిల్‌ పురుష సూత్రాన్ని ‘సక్రియ’ మనీ, స్త్రీని ‘నిష్క్రియ’మనీ పేర్కొన్నారు. అతని ప్రకారం స్త్రీ అంటే ”ఖండిత పురుషుడు”, ఆమెకు ఆత్మ లేదు. అతడి దృష్టిలో స్త్రీ శారీరకంగా బలహీనురాలు, ఫలితంగా ఆమె సామర్ధ్యం, హేతుబద్ధంగా ఆలోచించగలగడం, నిర్ణయాలు తీసుకోగలగటం తక్కువ. పురుషులు ఉన్నతులూ, స్త్రీలు తక్కువ స్థానం వారు కాబట్టి పురుషులు పాలించడానికి, స్త్రీలు పాలింపబడటానికి పుట్టారు. ”పురుషుని సాహసం ఆజ్ఞలను ఇవ్వటంలోనూ, స్త్రీలకు పాటించటంలోనూ ఉంటుంది” అన్నాడు అరిస్టాటిల్‌.

స్త్రీలకు ”శరీర నిర్మాణమే ఆమె విధి” అన్నాడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌. ఫ్రాయిడ్‌ దృష్టిలో సాధారణ మానవుడు అంటే పురుషుడే. స్త్రీ వైకల్యంతో పుట్టిన మనిషి, ఆమెకు పురుషాంగం లేదు. ఈ లోపాన్ని పూరించుకోవడానికి జరిగే సంఘర్షణ చుట్టూ ఆమె మనస్తత్వమంతా కేంద్రీకృతమై ఉంటుంది అని ఫ్రాయిడ్‌ భావించాడు.

స్త్రీల గురించి డార్విన్‌ ఏం చెబుతున్నాడో చూడండి : ”మానసిక స్థితిలో పురుషునికంటే స్త్రీ భిన్నమైనది – ఆమెలో సౌకుమార్యం, స్వార్థరహితం ఉంటాయి. స్త్రీలలో సహజాతం, శీఘ్రగ్రహణ, అనుకరణ వంటివి పురుషులలో కంటే ఎక్కువ. వీటిలో కనీసం కొన్ని గుణాలు తక్కువ జాతులకు చెందినవి కాబట్టి ఇవి గతానికి, తక్కువ నాగరిక స్థాయికి చెందినవి”.

స్త్రీలు, పురుషుల మధ్య ఉన్న శారీరక తేడాల వల్ల ఎటువంటి పరిణామాలు లేవని అంటున్నారా? మహిళలు పిల్లల్ని కంటున్నారన్న వాస్తవానికీ, సమాజంలో వారికి నిర్దేశించిన పాత్రలకీ సంబంధం ఏమీ లేదా?

స్త్రీ, పురుషుల మధ్య శారీరక తేడాలు ఉన్నాయన్నది వాస్తవమే. అయితే స్త్రీ, పురుషులకు ఆపాదించిన జెండర్‌ పాత్రలు ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాబట్టి ఈ పాత్రలకు ఈ తేడాలు కారణం కావు. విజ్ఞాన శాస్త్రంలో ఒక చిన్న నియమాన్ని గుర్తు పెట్టుకోవాలి. మారుతూ ఉన్న వాటిని (జెండర్‌ పాత్రలు) స్థిరంగా ఉన్న వాటి ఆధారంగా (జననాంగాలు, క్రోమోజోమ్‌లు లేదా ‘సెక్స్‌’) వివరించలేం. శరీర నిర్మాణమే మన పాత్రలు నిర్దేశిస్తూ ఉంటే ప్రపంచంలో ప్రతి ఒక్క మహిళ వంట వండుతూ ఉండాలి, బట్టలు

ఉతుకుతుండాలి, బట్టలు కుడుతూ ఉండాలి. కానీ అలా జరగడంలేదు. వృత్తిపరంగా వంటవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, కుట్టేవాళ్ళలో ఎక్కువమంది పురుషులే.

స్త్రీ, పురుషుల మధ్య ఉన్న అన్యాయపూరిత అసమానతలకు శారీరక తేడాలు కానీ, ప్రకృతి కానీ కారణం కాదన్నది మా వాదన. వర్గాలు, కులాలు, జాతుల మధ్య తేడాల మాదిరిగానే ఇవి కూడా మానవ నిర్మితం. ఇవి చారిత్రకంగా నిర్మితమైనవి కాబట్టి వీటిని ప్రశ్నించవచ్చు. సవాల్‌ చేయవచ్చు. మార్చవచ్చు. స్త్రీ పిల్లల్ని కన్నంత మాత్రాన అది ఆమె తక్కువ హోదాకి, అణిగి మణిగి ఉండడానికి కారణం కానవసరం లేదు; అది ఆమె చదువు, శిక్షణను, ఉద్యోగ అవకాశాలను నిర్ణయించనవసరం లేదు. శరీరాలు, శరీర ధర్మాలలో తేడా ఉండటం అసమానతలకు ఎందుకు దారితీయాలి? సమానులుగా ఉండడానికి, సమాన హక్కులు, సమాన అవకాశాలు పొందడానికి ఒకేరకంగా ఉండాల్సిన అవసరం లేదు.

ఃఃుష్ట్రవ ూశీషఱaశ్రీ ూతీఱస్త్రఱఅర శీట ్‌ష్ట్రవ ూవఞబaశ్రీ ణఱఙఱరఱశీఅ శీట కూaపశీబతీఃః అన్న పుస్తకంలో ఫెమినిస్టు కార్యకర్త, మేధావి అయిన మరియా మీన్‌ ఇలా రాస్తున్నారు.

”………….. మగ-తనం, ఆడ-తనం అన్నవి శారీరకంగా నిర్ణయింపబడినవి కావు. ఒక సుదీర్ఘ చారిత్రక ప్రక్రియల ఫలితం ఇవి. విభిన్న చారిత్రక కాలాలలో మగతనాన్ని, ఆడతనాన్ని ఆ కాలపు ప్రధాన ఉత్పత్తి విధానం ఆధారంగా వేరు వేరుగా నిర్వచించారు. కాబట్టి స్త్రీలు, పురుషులు తమ శరీరాలకు గుణాత్మకంగా భిన్నమైన సంబంధాలను అలవరచుకుంటారు. ఉదాహరణకు మాతృస్వామ్య సమాజాలలో జీవ ఉత్పత్తిలో ప్రధాన అంశంగా, అన్ని ఉత్పత్తులకు కేంద్ర బిందువుగా స్త్రీత్వాన్ని గుర్తించారు. స్త్రీలందరినీ ‘తల్లులు’గా నిర్వచించారు. కానీ ‘తల్లి’ అన్న పదానికి అప్పుడు వేరే అర్థం ఉంది. పెట్టుబడిదారీ సమాజాలలో స్త్రీలందరినీ గృహిణులుగా (పురుషులందరినీ సంపాదించేవారిగా) నిర్వచించారు. మాతృత్వం అన్నది ఈ గృహిణి పాత్రలో ఒక అంశం అయిపోయింది. స్త్రీత్వానికీ, మాతృస్వామ్య సమాజం ఇచ్చిన నిర్వచనానికీ, ఆధునిక సమాజం ఇచ్చిన నిర్వచనానికీ చాలా తేడా ఉంది. ఆధునిక నిర్వచనంలో క్రియాశీల సృజనాత్మక, ఉత్పాదక (అంటే మానవీయ) గుణాలన్నీ లోపించాయి”.

ఇది వాస్తవం అయితే సమాజం స్త్రీ, పురుషులని ఆడతనం ఉన్నవాళ్ళు, మగతనం ఉన్నవాళ్ళుగా ఎలా మారుస్తుందో వివరిస్తారా?

ఇది కుటుంబంలోనూ, సమాజంలోనూ నిరంతరం కొనసాగే సామాజికీకరణ (పెంపకం), జెండర్‌కి గురి చేయడం ప్రక్రియల ద్వారా జరుగుతుంది.

కొత్తగా పుట్టిన బిడ్డను లింగ ఆధారంగా వర్గీకరించడమే కాకుండా జెండర్‌ కూడా ఆపాదించబడుతుందని మనందరికీ తెలుసు. కొన్ని సంస్కృతులలో పుట్టినది బాబా, పాపా అన్నదాన్ని బట్టి చేసుకునే సంబరాలలో తేడా ఉంటుందన్నది చూశాం. దీంతో మొదలైన తేడాలు వాళ్ళను సంభోదించడంలో, ఆడించడంలో, వ్యవహరించడంలో, వస్త్రధారణలో కొనసాగుతాయి. ఈ నియంత్రణ ద్వారా తమ చుట్టూ ఉన్న సమాజంలో ఎలా ప్రవర్తించాలో వాళ్ళు నేర్చుకుంటారు. దీనినే సామాజికీకరణ (సమాజంలో భాగమయ్యేలా పెంచటం) అంటారు. పిల్లలకు తమ తమ జెండర్‌ పాత్రలను నేర్పే ప్రత్యేక ప్రక్రియలను జెండరింగ్‌, లేదా జెండర్‌కి గురి చేయడం అంటారు. వ్యక్తిత్వంలోని స్త్రీత్వం, పురుషత్వాలను పిల్లలకు వివిధ పద్ధతుల ద్వారా నేర్పించి ఆయా ప్రవర్తనలు, దృక్పథాలు, పాత్రలు అంతర్గతం చేసుకునేలా చేస్తారు.

రూథ్‌హార్ట్లే ప్రకారం ఈ సామాజికీకరణ అన్నది నాలుగు ప్రక్రియల ద్వారా జరుగుతుంది. అవి: మానిప్యులేషన్‌, కానలైజేషన్‌, వెర్బల్‌ అపెల్లేషన్‌, యాక్టివిటి ఎక్స్‌పోజర్‌. వీటి ఈ నాలుగు ప్రక్రియలు సాధారణంగా ఆడ, మగకు వేరుగా ఉంటాయి. పుట్టిన నాటి నుంచి పిల్లల సామాజికీకరణలో ఇవి భాగమవుతాయి.

మానిప్యులేషన్‌ – అంటే మూసపోత పోయడం. ఇది పిల్లలతో వ్యవహరించే తీరు. చిన్నప్పటి నుంచే మగపిల్లల్ని బలశాలులుగానూ, స్వతంత్ర వ్యక్తులుగానూ చూస్తారు. కొన్ని సంస్కృతులలో తల్లులు ఆడపిల్లల జుట్టు గురించి, బట్టల గురించి చాలా శ్రద్ధ చూపుతారు. ఆడపిల్లను నువ్వు ఎంతో అందంగా ఉన్నావంటారు. చిన్నప్పటినుంచి ఎదురయ్యే ఈ అనుభూతులు ఆడపిల్లలు, మగపిల్లల ఆత్మ చిత్రీకరణలో ప్రధాన పాత్ర వహిస్తాయి.

రెండవ ప్రక్రియ కానలైజేషన్‌ – ఇది ఆడ, మగ పిల్లల దృష్టిని కొన్ని వస్తువులు, లేదా వస్తువుల అంశాలపైకి మళ్ళించడం. ఉదాహరణకు ఆడపిల్లలకు బొమ్మలు, లక్కపిడతలు ఇస్తే మగపిల్లలకు తుపాకులు, కార్లు, విమానాలు ఇస్తారు. దక్షిణాసియాలోని కార్మిక వర్గాలలోని ఆడపిల్లలైతే ఆడుకునేది బొమ్మలతో కాదు. చాలా చిన్నప్పటినుంచే వారితో నిజమైన కుండలు, గిన్నెలు కడగడం, నిజమైన ఇళ్ళు శుభ్రం చేయడం, నిజమైన పిల్లల ఆలనాపాలనా చూడడం మొదలు పెట్టిస్తారు. అదే మగపిల్లల్ని బడికి పంపిస్తారు లేదా బయట పనికి పంపిస్తారు.ఈ రకంగా భిన్నంగా ప్రవర్తించడం వల్ల ఆడపిల్లలు, మగ పిల్లల ఆసక్తులు భిన్న విషయాలలోకి మళ్ళింపబడతాయి. ఫలితంగా వాళ్ళు భిన్న సామర్ధ్యాలు అలవరచుకుంటారు. వస్తువులతో సాన్నిహిత్యం పెరగటం వాళ్ళ ప్రాధాన్యతలను నిర్దేశిస్తాయి.

ఆడపిల్లలకు, మగ పిల్లలకు ఉపయోగించే వెర్బల్‌ అపెల్లేషన్స్‌ కూడా తేడాగా ఉంటాయి. ఉదాహరణకు ఆడపిల్లలతో ”నువ్వు చాలా అందంగా ఉన్నావు” అంటాం. మగపిల్లలతో ”నువ్వు పెద్దగా, బలంగా ఉన్నావు” అంటాం. ఇటువంటి వ్యాఖ్యానాలు ఆడపిల్లలు, మగపిల్లలు, స్త్రీలు, పురుషులుగా తమను తాము గుర్తుంచుకునే ప్రక్రియని నిర్దేశిస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇతర పురుషులు, స్త్రీలతో మెలిగేటప్పుడు ఎలా ఉండాలి అనేదాన్ని ఇది నిర్దేశిస్తుంది. పిల్లలతో మాట్లాడే తీరులో పెద్దలు నిరంతరం జెండర్‌ పాత్రకు సంబంధించిన లక్షణాలను బదిలీ చేస్తుంటారు. వారికిచ్చే ప్రాధాన్యాన్ని బట్టి కూడా ఈ విషయం తెలియచేస్తారు.

చివరి ప్రక్రియ యాక్టివిటీ ఎక్స్‌పోజర్‌ – చిన్నప్పటి నుంచే ఆడ, మగ పిల్లలను సాంప్రదాయబద్ధమైన స్త్రీత్వ, పురుషత్వ పనులకు గురిచేస్తారు. ఆడపిల్లలను ఇంటి పనులలో తల్లికి సహాయం చేయమంటారు. మగపిల్లలు తండ్రితో బయటకు వెళ్తారు. ఆడ, మగవాళ్ళు వేరుగా ఉండే సంస్కృతులలో ఆడపిల్లలు, మగపిల్లలు వేర్వేరు ప్రాంతాలలో పెరుగుతారు. భిన్నమైన పనులు చేస్తారు. ఈ ప్రక్రియల ద్వారా పిల్లలు స్త్రీత్వం, పురుషత్వాలను అర్థం చేసుకుంటారు, అచేతనంగా (తమకి తెలియకుండా) వాటిని అంతర్గతం చేసుకుంటారు.

ఈ సామాజికీకరణ నిరంతరంగా జరుగుతున్నదైతే ‘ప్రకృతి’ , ‘పెంపకం’ అన్న చర్చ ఇంకా ఎందుకు కొనసాగుతోంది? ఆడపిల్లలు, మగపిల్లల్లో తేడాలకు పెంపకమే కారణమన్నది స్పష్టంగా లేదా?

చిత్రమయిన విషయమేంటంటే మన పిల్లలకు ఏం చేస్తున్నామో చాలామందిమి గుర్తించం. ఆడపిల్లలు, మగపిల్లల మధ్య తేడా ఉన్న కారణంగానే వాళ్ళని భిన్నంగా చూస్తున్నామని అనుకుంటున్నాం. బదులు, చుట్టుపక్కల సమాజం, మన ప్రవర్తన కారణంగా ఆడపిల్లలు, మగపిల్లల్లో తేడాలు ఏర్పడతాయన్నది ఒప్పుకోం.

మూసపోతకు గురవుతున్నామని తెలియకుండానే పిల్లలు కూడా ఈ పాత్రలు అలవరచుకుంటారు. ఆడపిల్లల్లో, మగపిల్లల్లో తేడాలు లేకపోతే, అన్నిచోట్లా ఆడపిల్లలందరూ ఒకేలాగా, మగపిల్లలందరూ ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉంటే సెక్స్‌ ఆధారంగా జెండర్‌ పాత్రలు రూపొందాయని మనం అనుకోవచ్చు.

జెండర్‌ పాత్రలకు భిన్నంగా ప్రవర్తిస్తే ఆమోదించకపోవడం, ఆంక్షలు విధించడం వంటివి ఆశించిన స్త్రీ, పురుష ప్రవర్తనకు వారిని లోబరిచేలా చేయడానికి బలమైన ఆయుధాలుగా ఉపయోగపడతాయి. ఇందులో సామాజిక హేళనకు గురిచేయడం తరచూ ఉపయోగిస్తుంటారు.

భిన్నంగా ప్రవర్తించిన స్త్రీల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించిన సంఘటన కేరళలోని ఓ గ్రామంలో జరిగింది. తమతోటి పురుష కార్మికులు స్థానికంగా ఉండే పబ్‌ (బీరు అమ్మే స్థలం) కి రోజూ వెళ్ళడం ముగ్గురు మహిళా కార్మికులు చూశారు. ఒకరోజు సరదాగా, తామూ వెళ్దామని నిర్ణయించుకున్నారు. దాంతో చాలామంది పురుషులు తమ లైంగిక కోర్కెలు తీర్చమంటూ వాళ్ళని వేధించసాగారు. ‘మంచి’ స్త్రీలు అడుగుపెట్టని చోటుకి వాళ్ళు అడుగుపెట్టే సాహసం చేసినందుకు గాను వాళ్ళని ‘చెడ్డ’వాళ్ళుగా జమకట్టేశారు. ‘ఒక స్త్రీ పబ్‌లోకి ప్రవేశించిందంటే తమ లైంగిక కోర్కెలు తీర్చడానికి కూడా ఆమె అందుబాటులో ఉంటుందన్న’ భావనన దీని వెనుక ఉంది. దీని తరువాత వేధింపులు, సామాజిక హేళనలకు తట్టుకోలేక వారిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

సామాజిక నిర్బంధాలకు తోడు ‘ఆర్థిక నిర్బంధాలు’ కూడా ఉంటాయి. ఒంటరి మహిళలు, వారి పిల్లలు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు, సమాజం వారిని ఆమోదించకపోవటాన్ని సూచిస్తుందని ఆన్‌ ఓక్లే అంటారు. సమాజం నిర్దేశించిన నియమాలు, సూత్రాలను ఉల్లంఘించిన పిల్లలకు ఆర్థికంగా సహాయపడబోమని కుటుంబం హెచ్చరిస్తుంది.

కొన్ని గుణాలు ‘పురుషత్వాన్ని’, కొన్ని గుణాలు ‘స్త్రీత్వాన్ని’ సూచిస్తాయని ముద్రలు వేసే విషయాన్ని వివరిస్తారా?

కొన్ని వైరుధ్యాలను, అవసరం లేకపోయినప్పటికీ పురుష, స్త్రీ గుణాలుగా నిర్వచించారు. ఉదాహరణకు ః

శరీరం మనస్సు

ప్రకృతి సంస్కృతి

ఉద్వేగం హేతుబద్ధత

విషయం వస్తువు

వ్యక్తిగతం సామాజికం

పై వాటిలో ఎడమవైపు ఉన్నవి ‘స్త్రీ’ గుణాలు కాగా కుడివైపున ఉన్నవి ‘పురుష’ గుణాలుగా భావించబడతాయి.

పై వాటిని పరస్పర విరుద్ధ ధృవాలుగా నిర్వచించారు. అంతేకాకుండా వాటిల్లో తారతమ్య బేధాలు కూడా సృష్టించారు. శరీరం కంటే మనస్సు ఉన్నతమైందనీ, ప్రకృతి మీద విజయమే సంస్కృతి అనీ భావిస్తారు. ఉద్వేగాలకు లోనయ్యే వారికంటే హేతుబద్ధంగా ఆలోచించేవారినీ, విషయగతంగా ఆలోచించే వారికంటే వస్తుగతంగా ఆలోచించేవారినీ ఉన్నతులుగా పరిగణిస్తారు. స్త్రీ అంటే శరీరం, ప్రకృతికి చేరువగా ఉంటారు (జంతువుల మాదిరి పిల్లల్ని కంటారు). పురుషులు అంటే మేధస్సు, ఆలోచనాపరులు, హేతుబద్ధులు, కార్యాచరణపరులు. వాళ్ళు ప్రకృతి మీద పనిచేసి ‘దానిని’ సంస్కృతిగా మలుస్తారు. కాబట్టి పురుషులు ప్రకృతికి మించిన దానికంటే ఉన్నతులైనవాళ్ళు. తమ ఇష్టం వచ్చినట్లు ప్రకృతితో వ్యవహరిస్తారు.

పైన పేర్కొన్న అంశాలలో ఎడమవైపు వాటిలో స్త్రీలనే కాకుండా స్థానిక పేద ప్రజలను కూడా జమచేర్చారు. అందుకే స్త్రీల మాదిరిగానే ఆదివాసీలు, పేద రైతాంగం, మత్స్యకారులను అభివృద్ది ప్రణాళికాకారులు పట్టించుకోరు. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ సమ్మతి లేకుండా వాళ్ళ అడవులను నరికివేయవచ్చు. ఈ విధంగా వాళ్ళు ”అభివృద్ధి కాందిశీకులు”గా మారి పట్టణాలలో జీవనాధారం కోసం అత్యంత దారుణ పరిస్థితులలో పాకులాడుతూ మురికివాడలలోకి చేరతారు.

ప్రపంచ స్థాయిలో చూస్తే మూడవ ప్రపంచం లేదా దక్షిణ ప్రాంతం శరీరం కాగా మొదటి ప్రపంచం మనస్సు; మూడవ ప్రపంచం ప్రకృతి అయితే మొదటి ప్రపంచం సంస్కృతి; మూడవ ప్రపంచం ఉద్వేగపూరిత, అసంబద్ధమైనది కాగా మొదటి ప్రపంచం హేతుబద్ధమైనది, శాస్త్రీయమైనది, ఆధునికమైనది.

జెండర్‌కీ వర్గ, కుల, జాతి, మొదటి ప్రపంచం – మూడవ ప్రపంచం వంటి ఇతర తరతమ అంతరాలకీ మధ్య సంబంధం అర్థం చేసుకోవటం ముఖ్యం.

వలస చరిత్రలో మూడవ ప్రపంచంతో పాటే మంత్రగత్తెల వేటా సాగింది. ఈ సమయంలోనే స్త్రీల నుంచి అధికారాన్ని, ఆర్థిక శక్తిని, విజ్ఞానాన్ని లాక్కుని ఈ నాటికీ వారిని ‘గృహిణి’గా, ‘వెనుకబడినవారిగా’ తయారుచేశారు. మనం ఊహించలేనంత హింసాపూరిత అభివృద్ది – దీని పునాదిపైనే ఆధునిక వ్యవస్థల ఆర్థిక విధానం, చట్టం, రాజ్యం, విజ్ఞానం, కళలు, రాజకీయాలు, కుటుంబ, వ్యక్తిగత ఆస్తి వంటివన్నీ నిర్మింపబడ్డాయి. ఫలితంగా ఒక కృత్రిమ ఉత్పత్తిగా గృహిణి ఆమెతో పాటు ‘వెనుకబడిన తనం’ తయారయ్యాయి. ఆ పోలికలో చూస్తే ఈనాటి మూడవ ప్రపంచం ఆనాటి మంత్రగత్తె కాగా మూడవ ప్రపంచ పురుషులతో సహా అది ‘ప్రపంచ గృహిణి’గా మారింది. భార్యాభర్తల మధ్య సంబంధమే మొదటి, మూడవ ప్రపంచాల మధ్య పునరావృతమౌతోంది”.

(ఇంకా ఉంది)

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.