ఆ రోజు… సత్య నా చేతికీ పుస్తకాన్నిచ్చి అద్భుతమైన పుస్తకమోయ్! చదువు. వీలైతే సమీక్ష రాయి అని ఏ క్షణంలో ఇచ్చిందో కానీ, నా వెంటే నడుస్తోందీ పుస్తకం. పల్లె గంపనిండా కతల్ని ఎత్తుకొచ్చింది భారతి. నిజానికివి కతలు కావు. జీవన సజీవ దృశ్యాలు. మూడు తరాల స్త్రీల జీవితాలను వెలికితీసిన అరుదైన పుస్తకం. మనకు బాగా నచ్చిన రచన చదువుతున్నప్పుడు, ఆయా పాత్రలన్నీ మన నీడలా మనతోనే నడుస్తుంటాయ్. అదే అనుభూతికి లోనయ్యాను. తన జీవితానుభవాలన్నీ, తన భాషా సోయగంలో నిజాయితీగా నడిచిన అక్షరాలివన్నీ. నిజానికి పి.సత్యవతిగారి ముందు మాట తర్వాత, భారతికి స్వాగతం చెప్పాక, ‘అడుగుకొక మలుపు’ అని భారతి చెప్పుకున్నాక నేను కొత్తగా చెప్పేందుకేమీ మిగల్లేదు. కానీ ఒక పాఠకురాలిగా నేను పొందిన అనుభూతిని మాత్రం వ్యక్తీకరించాలన్పించింది. చదవండి. అందరూ వీలైనంతగా చదవండి. ఎద ఆరిపోయిన స్త్రీల బతుకు చిత్రాలు కన్పించాయి. ఎలెక్స్ హేలీ రాసిన ‘ఏడు తరాలు’ గుర్తొచ్చింది. భారతి సామాన్యంగా కన్పిస్తున్న అసాధారణమైన రచయిత్రి. నా ఫేవరెట్ హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ. ఎంత కష్టజీవో, నాకంత ఇష్టజీవిగా మారిపోయింది. ముఖచిత్రం కూడా ముచ్చట్లలో సేదతీరుతున్న స్త్రీల భంగిమల్తో ‘కిరణ్‌కుమారి’ అద్భుతంగా చిత్రించారు.
‘ఇత్తడి బిందె కోసం అమ్మ పడిన కష్టం, తాపత్రయం, అంత చిన్న కోరిక తీరడం కోసం ఆమె పడిన శ్రమ, చివరికి తాగుబోతు మొగుడి పాలైన తర్వాత ఆమె దుఃఖం అందరిళ్ళలో జరిగే సామాన్యాంశం. వస్తువు మారుతుండొచ్చు కానీ స్త్రీల శ్రమ దోపిడీ ఎలా జరుగుతుందో వాస్తవంగా చెప్పింది. బిందె కొన్న రోజే ఆమె మురిపం చూసి అనుకున్నాన్నేను. ఈ ఆనందం ఆమెకు ఎన్నాళ్ళో ఉండదని.
‘అవ్వ తలపులు’ కూడా ఆమె డైరీనే. తన జీవితంలో మర్చిపోవాలని ఇన్నాళ్ళూ నిక్షిప్తం చేసుకున్న విషయం కూడా మనవరాలితో కడుపారా చెప్పుకుంటుంది. ఆ కాలంలోని సామాజిక పరిస్థితులన్నీ, చరిత్రగా నమోదయ్యాయి.
‘సావుబియ్యం’ కత కూడా కన్నీటి కుండే. ఆకలి, అవసరం మనిషినెంత కోత కోస్తాయో చెప్పిన కత. ఎప్పుడో నే రాసిన కవితొకటి గుర్తొచ్చింది. రోజుల తరబడి ఆకలితో అలమటిస్తున్న గుడిసె బతుకులవి. పక్కింట్లో మనిషి చనిపోతే, ఊరంతా తలా కొంత బియ్యం, ఉప్పు, పప్పు తెచ్చి ఆ శవాన్ని సాగనంపుతారు. అది చూసిన చిన్న పిల్లవాడు వాళ్ళమ్మతో ఇలా అంటాడు కవిత చివర్లో, ‘అమ్మా! మనింట్ల సావెన్నడొస్తదే’ – అని. అది గుర్తొచ్చింది.
‘దప్పి’ కతలో తల్లి తన పిల్లల కోసం తాపత్రయపడే స్థితి మనని కన్నీటిపాలు చేస్తుంది.
చాలావరకు పిల్లల చదువులు ఆగిపోవడానికి ప్రధాన కారణం పేదరికం, కుల వివక్ష. ఈ రెండింటి వల్లనే ‘అన్న సదువు’ ఎట్లా ఆగిపోయిందో విషాద స్వరంతో చెప్పింది. మాదిగోళ్ళందరికీ మజ్జిగ కవ్వంలా నిలిచిన గంగులవ్వను అక్షరీకరించి, ఆమె దయా స్వభావాన్ని కళ్ళముందుంచింది. ఈ కథల్లో ఎక్కడా రాజకీయ ప్రస్తావనలు, అధికార దుర్వినియోగాలను దుయ్యబట్టడం, సిద్ధాంత చర్చలూ, మాటలు కనబడవు. వినబడవు. కానీ అంతస్సూత్రమే అవన్నీ. జీవితాల్నలా పరుచుకుంటూ పోయిన అద్భుతమైన శిల్పం భారతిది. దేశంకాని మీరూ చదవండి. చదివిన ప్రతి ఒక్కరూ భారతిని అభిమానించక మానరు.
‘ఎండపల్లి బారతి’ కథలకు పి. సత్యవతిగారు ముందుమాట రాసారు. ఈ ముందుమాట అద్భుతంగా ఉంటుంది. భారతి రచనా సామర్థ్యాన్ని వెలికి తీసిన మాటలివి.
‘జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, కొన్ని భయంకరమైన అనుభవాలను ఎవరితో చెప్పకుండా దాచుకున్న, గరళకంఠి అయిన అమ్మమ్మ లచ్చుమమ్మ పెంపకంలో పెరిగి, ఐదోక్లాసు వరకే చదువుకోగలిగి, పన్నెండేళ్ళకే పెళ్లి చేసుకుని, ఆపైన అవ్వాతాతల్ని కూడా పోగొట్టుకున్న భారతి, ఇవాళ ఒక పత్రికా విలేఖరిగా ఎదిగింది. నీడల నుంచి వెలుగులోకి పాకివచ్చిన ధీర ఈ భారతి.
భారతి కథలు అభివృద్ధి చెందుతున్న భారతదేశపు క్రీనీడలను చూపించిన కాగడాలు. నగర మధ్య తరగతి భద్ర జీవుల కథలు కానివి. కులం రీత్యా వర్గం రీత్యా సమాజపు అంచులలోంచి ఇంకా నడి మధ్యకు రావడానికి పెనుగులాడుతున్న జనం వెతలు తన అమ్మ నుడిలోనే చెప్పుకున్న ఈ కథలను, భ్తాఇ వర్ణించి వర్ణించి మాజిక్కులు చేసి ఏమీ చెప్పదు. నెత్తిమీద మొట్టీ చెప్పదు. ఉపన్యాసాలు ఇవ్వదు. కబుర్లు చెప్పినట్టు చెప్పి ఉలిక్కి పడేలా చేస్తుంది. చివర్లో కొన్ని జీవిత సత్యాలను అలవోకగా మనమీదకి విసురుతుంది చాలా ఒడుపుగా ఇది ఒక్క దిగువ బురుజుకతలేకావు. భారతదేశపు కథలు. భారతి చెప్పిన వెతలు’.
ముఖ చిత్రంలోనే నలుగురు స్త్రీలు కుర్చొన్న తీరుతోనే భారతి తాను చెప్పబోతున్న కథలన్నీ చెప్పేసింది. తాగుబోతు, పూలపెట్ట, సమేదాసరి, పసావు, మొగుని పొటుకులు, నక్కాముట్టి తడిక తోసింది ఎవరు? సచ్చినోళ్ళ గౌపకం, నల్లడబ్బు, ఇలా కతల పేర్లు చెప్పుకుంటూ పోతుంటే, ఒకటిని మించిన మరొకటి కనబడతాయి ఈ మధ్య కాలంలో నేను చదివిన పుస్తకాల్లో ఇదొక అద్భుతమైందని నాకు అన్పించింది.