సముద్రం అల్లకల్లోలమవుతుంది
అనంతమైన కల్మషంతో
కొట్టుమిట్టాడుతోంది
భూమి వేడెక్కి బీటలు వారుతోంది
రోడ్లతారు కరిగిపోతోంది
అంతా నిర్మానుష్యం
భానుడు నడిరోడ్డుమీద నిద్రిస్తున్నాడు
కుళాయిలో వస్తున్న నీరు కూడా కాలిపోతోంది
పెదాలు పగిలి నెత్తురు చారలు కడుతున్నాయి
మత్తుపానీయాలు కాలేయానికి చిల్లులు వేస్తున్నాయి
మనిషి ఏదో ఒక మత్తులో బ్రతకాలని చూస్తున్నాడు
తన్నుతాను మోసం చేసుకోవడానికి ఆరాట పడుతున్నాడు
డ్రగ్స్ తీసుకొన్నవారు ఇంద్రలోకాల్లో తిరుగుతున్నారు
పబ్బుల్లో ఆడ మగ తేడా లేకుండా గంతులేస్తున్నారు
గుక్క గుక్కకి కిక్కెక్కి తూలిపడిపోతున్నారు
యుక్తవయసులోనే ఓడ్కాలు, విస్కీలతో శరీరాన్ని
విషయుక్తం చేసుకొంటున్నారు
సంతానోత్పత్తిని కూడా విచ్ఛిన్నం చేసుకొంటున్నారు
శని, ఆది వారాలంటే వినోదించే రోజులా!
జీవితానికి నిర్మాణం లేదా!
ఎవ్వరితో జీవితం పంచుకొంటున్నారో!
వారి మీద విశ్వాసం కాదు
జీవితం పంచుకొనే వారు ఒకరు
పెళ్ళి మరొకరితోనా!
సంపదను సృష్టించడానికి
శరీరం పణంగా పెట్టడం ధర్మమా!
ఖండాంతరాలు దాటి షాపింగ్ లెందుకు?
జీవితం ధ్వంసం అయ్యాక
బంగారం ఎంత ఉంటే ఏమిటి?
అవును రంగు రంగుల వలయాల్లో
చిరిగి పోతున్న కాగితాలు
ఎన్ని సుఖాలు పొందినా
ఏదో ‘ఫ్రస్టేషన్’లో బ్రతుకుతున్నారు
అందరిని చిరాకు పెడుతున్నారు
వ్యామోహాన్ని, ప్రేమను కొంటున్నారు
దేన్ని కాదంటున్నారో, దాని వెనుక పడుతున్నారు
మానసిక రోగాలు పెరుగుతున్నాయి
మత్తు పోగొట్టే సెంటర్లు పెరుగుతున్నాయి
గ్రంథాలయ సంస్కృతిని ధ్వంసం చేశారు
జ్ఞాన జ్యోతులను ఆర్పేస్తున్నారు
నాలుగు అక్షరాలు బట్టీపట్టడం
చదువు అంటున్నారు
అవును! తల్లి ఎవరి కోసం
ఆందోళన చెందుతోంది?
ప్రతి మనిషిలో ఓ వివేచన ఉంటుంది
దానికి పదును తగ్గుతోంది
ధనం పెరిగే కొద్దీ వ్యసనాలు పెరుగుతున్నాయి
వేరులు బలహీనంగా ఉండి చెట్లు కూలుతున్నాయి
నదుల నడిబొడ్డులో విషం పారుతుంది
పూలు కూడా దుర్గంధాన్నే చిమ్ముతున్నాయి
ఆ సందిగ్ధంలో మనుషులు బ్రతుకుతున్నారు
ఎవరిమీదా నమ్మకం లేదు
ఏ విషయం మీదా సమగ్రత లేదు
ఏ విషయం వినే అలవాటు లేదు
ఏ అంశాన్నీ తేల్చుకోలేరు
మనుషులు ద్వంద్వత్వంలో ఉన్నారు
నిజమే! మరో ప్రక్క చైతన్యం వెల్లి విరుస్తోంది
హిమాలయాలను అలవోకగా ఎక్కుతున్నారు
సామర్ధ్యానికి నిరంతరం పదును పెడుతున్నారు
కక్ష్య, కార్పణ్యాలు దాటి కారుణ్య సముద్రులవుతున్నారు
సేవా సంస్కృతిలో ఉజ్వల భవితవ్యాన్ని నిర్మిస్తున్నారు
అవును! ఎప్పటికైనా మనిషే విజేత
మానవత్వమే జీవన సత్యం
పూలు సుగంధాలే చిమ్మాలి
అప్పుడే మనిషి ప్రకృతికి వికాసం.