ప్రపంచమంతా… ముందు… ముందుకు
పరుగెత్తుతున్నది…
అందిపుచ్చుకుందామన్న ఆరాటం
నిలువనీయని ఆత్రం
ఇంటా బయటా సహకరించని
అననుకూలతలు
మధ్యతరగతి బతుక్కు
నిర్ణీత నిర్దేశిత పరిధి…లోనే కుంచించుకు
ఒదిగొదిగి… వినయంగా
నంగి… నంగిగా… గొణుక్కుంటూ సణుక్కుంటూ
కనిపించని సంకెళ్ళు అనుమానపు నిఘా
నరనరాన ఇంకిపోయిన మనువాదం
వ్యసనపు ఉక్కు పిడికిట్లో
చిక్కి గిజ గిజ లాడుతున్న జీవితం
వెయ్యిన్నొక్కసారిగా ప్రయత్నించినా
మూడడుగులు ముందుకైతే
ఆరడుగులు వెనుకకు
పిల్లాపీచును సంచకారికట్టుకొని
వాలుకమొలె ఉన్న ఇంటి పెద్ద
బతుకంతా బిగ్గీత పట్టుకొని
దమ్మునంతా గుండిగలో నింపి డగ్గుత్తికగా
జర్రన జారకుంట… పట్టీ… పట్టీ అడుగులేత్తున్న
ముందు ముందుకు ఉర్కుతున్న
ప్రపంచాన్ని అందుకోకున్నా
బిడ్డలకు అందియ్యాలని
ఆశగా…