అవును… యుద్ధానికి పిలుపు…
కణకణమండే కాగడాలతో రుద్రమూర్తులై ఉరకండి…
మనుష్యులైతే లేలెండి! రండి… రండి…
వినబడలేదా! – పగిలిన చిరుగుండెలు పలకలేని భాషలు…?
దిక్కులేని అనాధకూనల కన్నీటి ఘోషలు!
అడుగడుగో! భయంకర మానవాకార పిశాచులు
అభం శుభం ఎరుగని పసికూనలపై పైశాచిక కృత్యాలు
ఇదేమి వికృత భారతమో? మీరే చెప్పండి…?
దుర్యోధన, దుశ్శాసన, కీచక, శిశుపాల, సైంధవ ఇతిహాసాల్లో వినలేదే…కనలేదే!?
ఆ చిరునవ్వుల సవ్వడులను, చిరుదివ్వెల రవ్వలను ప్రభవించకుండా చిదిమేస్తున్న
ఈ ఆధునిక కర్కోటక కాలకూట నాగులు-
ఈ వీథి కుక్కల వింత వింత స్వైర విహారాలు…
క్రూర, ఘోర ఘాతకాలకి ఎరవేస్తున్న ఈ ఆక్టోపస్‌ల దాడి నుండి…
ఆ లేలేత పసిడి మొగ్గలను రక్షించాలి…
కదలలేక మెదలలేక కుర్చీనే అంటిపెట్టుకుని-
విశ్వాన్నే మైమరపించిన -‘స్టీఫెన్ హాకింగ్’ను తలచుకోండి వ్యర్ధజీవులారా!
మీదీ మానవ జన్మమేనా…!?
‘సంస్కరణ’ నీడలో చేస్తోన్న మీ ‘వికార-కరాల’ను ముక్కలు ముక్కలుగా ఖండించాలి.
నృసింహాలై సమరానికి రారండి! యువకుల్లారా!
భారతీయ యువకుల్లారా! నవభారత నిర్మాతల్లారా! మిమ్మల్నే! గుడ్లప్పగించి-
చేతులు ముడుచుకు చూస్తున్నారా!
ఇదేనా! ఇదేనా! మీ శౌర్యం, క్రోథం, ఆక్రోశం…
యుద్ధభూమిలో రథంలాగలేని అశ్వం
అశ్వమేథయాగంలో కదలలేని తురంగం
త్యజించడమే తక్షణ కర్తవ్యం…!
ఈ కర్మభూమికి, స్వర్ణభూమికి, ధర్మభూమికి…
పంచభూతములు సాక్షిగా
‘పంచమ వేదం’ సాక్షిగా
పంచపాతకాలు చుట్టు ముట్టుతున్నాయి.
మనుష్యులనే మృగాలు చేస్తోన్న ఈ ”మహామహా పాపకార్యం”.
అదేమి పాపమో! ”ఈ మహాకూపం”లో-
మరిడమ్మలు, దెష్టాదేవి పెద్దమ్మలు ”మేము సైతం”
అంటున్నారట ట ట ట ట ట ట ట ట …
ఎవరైనా! ఎంతటివారైనా – వీళ్ళ ”అమ్మ కడుపులు మాడా”
పంచబ్రహ్మాస్త్రాలు సంధించి ఆ మహా మహా దోషులను తుద ముట్టించాలి…
ఇది వ్యవస్థీకృత లోపమా…!? కానేకాదు…!
‘తిరగలి’లా తిరుగుతోన్న కులకుష్ఠి ‘మురుగు’ నుండి పుట్టుకు వస్తోన్న
పుట్టగొడుగుల విష ఫలాల ‘ఫలితాలు’
ముమ్మాటికీ ‘నాసిరకం’ మనుష్యులు చేసే పరమ నాసిరకం నిర్వాకాలు…
ఖైనీ, గుడుంబా, మందుబాబుల చెలగాటాలు…
దుర్హతి, దుర్మతి, దుర్మృతి, దుర్విధుడు, దుర్హృదుడు, దురాధర్షుడు-
మరిడమ్మలు, మహాంకాళులు – యావత్తు మందిని ద్రుఘణముతో
ఒక్కటంటే ఒక్క వేటుతో మట్టు బెట్టాలి..
రండీ కదలిరండి! దారుణ దానవ సంహారానికి…
సప్త సముద్రాల ఘోషతో హృదయం తల్లడిల్లి…
ఆక్రోశ తరంగాలు తురంగాలుగా పరిగెడుతున్నాయి.
‘వీరుల కోసం పడిగాపులు గాస్తోన్న’ భూమిపై
ప్రతి ఒక్కడు…భరత్‌సింగ్ వీరావేశం…
సుభాష్ చంద్రబోస్ ఉద్వేగంతో…
ధీరులై… శూరులై…”మేమున్నాం… మేమున్నామంటూ”
ప్రచండమైన ‘ప్రతిన’ బూని
ఆ మానవాకార ‘తిర్యక్’ జంతువులపై మరణ మృదంగం మ్రోగించండి…
మరణ శాసనము వ్రాయండి…
ఇదే నా ప్రళయ రచన ‘మహాఘోష’.
(2018… బీహార్-ముజ్‌ఫర్‌పూర్ అనాథ బాలికల వసతిగృహంలో జరిగిన సంఘటన ఆధారంగా)