హేమక్క లేదు అన్న విషయం తెలిసి జీర్ణించుకోలేకపోయాను. ఇది నిజమేనా? అని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి తెలుసుకున్నాను. మా అత్తమ్మకు ఆరోగ్యం బాగాలేక పోవడం వల్ల నేను ప్రరవే మహాసభలకు వైజాగ్ వెళ్ళలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు ఎంతో బాధగా ఉంది. నేను వైజాగ్ వెళ్ళి ఉంటే హేమక్కతో ఆ రెండు రోజులూ గడిపేదాన్ని కదా! నేను నా జీవితంలో మళ్ళీ హేమక్కతో కలిసి గడిపే రోజులు, ఆమెతో కలిసి ఆప్యాయంగా మాట్లాడుకునే అవకాశం రాదు కదా! నేనెంత దురదృష్టవంతురాలిని అని ఎంతో విచారించాను. ఆమె జ్ఞాపకాలు, ఆమె నాపై చూపించిన ప్రేమ, అభిమానం మాటల్లో చెప్పలేనివి.
నాకు హేమలతగారు మొదటిసారి హైదరాబాద్‌లో కలిశారు. అవినీతి నిర్మూలించడం పైన ప్రభుత్వం ఒక వర్క్‌షాప్ నిర్వహించింది. అప్పుడు హోటల్‌లో రూమ్స్ ఇచ్చారు. ఆ హోటల్‌లో సాయంత్రం టీ కోసం అందరం కూర్చున్నాం. అప్పడు కాలిపాక శోభారాణి గారు నాకు పుట్ల హేమలతగారిని పరిచయం చేశారు.
హేమలత గారిలో ఏదో చెప్పలేని ఆప్యాయత, అనురాగం నాకు కనిపించాయి. అప్పటికే నేను ప్ర.ర.వేలో సభ్యురాలిని కానీ హేమక్క పరిచయం ఆ రోజే జరిగింది. ఆ రోజు అక్క తన ఫోన్ నంబర్, మెయిల్ అడ్రస్ ఇచ్చారు. విహంగకు రచనలు పంపించమని చెప్పారు. నేను అప్పుడప్పుడూ హేమక్కకు ఫోన్ చేస్తుండేదాన్ని. ఆమె బిజీగా ఉంటే కాల్ చూసుకొని తర్వాత చేసేవారు. ఎప్పుడూ అమ్మా! చెప్పమ్మా సుజాతా! అంటూ ఎంతో ప్రేమగా పిలిచేవారు. నేషనల్ సెమినార్స్, ఇంటర్నేషనల్ సెమినార్స్ గురించి ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని ఫోన్ చేసి చెప్పేవారు. ఆ తర్వాత ప్రరవే సభలలో అనేకసార్లు మేము కలుసుకున్నాం. పెనుగొండ, ఒంగోలు, తిరుపతి, రాజమండ్రి, పోలవరం ముంపు గ్రామాలలో సర్వే (క్షేత్ర పర్యటన) కోసం వెళ్ళినపుడు… ఇలా అనేకసార్లు కలిసి కార్యక్రమాలలో పాల్గొన్నాం. ఎప్పుడూ ఆమె ముఖంలో చెరగని చిరునవ్వే ఆమెకు పెట్టని ఆభరణం. ప్రరవేలో ఆమెతో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభవం. రాజమండ్రి సెమినార్‌కు వెళ్ళినపుడు హేమలత అక్క వాళ్ళింటికి వెళ్ళాం. అక్కడ ఆమె, తన కుటుంబసభ్యులు మాపై చూపిన వాత్సల్యం జీవితంలో మరువలేని మధురానుభూతి. ఆమెలేని లోటు వేరెవ్వరితోనూ తీర్చలేనిది.
హేమక్క గురించి నాలుగు మాటలు…డా.పుట్ల హేమలతగారు మృదుభాషిణి, మంచి వక్త, గొప్ప రచయిత్రి, స్నేహశీలి, నిరాడంబరంగా ఉండే గొప్ప మనీషి ఆమె. ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా తీసుకున్నారు. ‘విహంగ’ అనే తొలి తెలుగు మహిళా వెబ్ పత్రికను ప్రారంభించి నడుపుతున్నారు. ‘అంతర్జాల పత్రికలు, సాహిత్యం’పై జాతీయ సదస్సు నిర్వహించి దాన్ని పుస్తకరూపంలో ముద్రించారు. పరిశోధకులకు ఉపయుక్తంగా తెలుగు పరిశోధనా వ్యాసాలను ‘లేఖన’ పేరుతో రెండు సంపుటాలుగా వెలువరించారు. లేఖన-3 ముద్రణలో ఉంది.
డా.పుట్ల హేమలత గారు నైతిక విలువలు బోధించే కథలు మొదట్లో రాశారు. పరివర్తన, కరకుగుండె, కల్వరివాణి, హరప్పా, హృదయజ్యోతి, తిరిగిరాని పయనం, కనలేని కనులు మొదలైన కథలు. మిస్ పవిత్ర వీరు రాసిన నవల. తర్వాత కవితా ప్రస్థానం మొదలుపెట్టారు. ‘నీలిమేఘాలు’ కవితా సంకలనంలో హేమలతగారి కవిత్వం ఉంది. దళిత స్త్రీల కథలు, దళిత స్త్రీల సాహిత్యం మీద వీరు ప్రరవే కథల ఈ-బుక్ రూపొందించారు. అనేక ఆకాశాలు కథా సంపుటికి, బోల్షెవిక్ విప్లవ స్ఫూర్తి వ్యాసాల సంకలనానికి ఆమె సహ సంపాదకురాలు.
‘స్త్రీ సాధికారత’ గురించి ఆమె చక్కగా వివరించారు ఒక ఇంటర్వ్యూలో. అలాగే తనచుట్టూ ఉన్న వాళ్ళను ఎంతో సున్నితంగా, ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసేవారామె. తాను ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటిని లెక్క చేయకుండా నిరంతరం సాహిత్య, సామాజిక సేవలో గడిపిన ‘సాహితీ పిపాస’ ఆమె. వారు లేని లోటు అటు సాహితీ లోకానికి, ఇటు స్త్రీ జాతికి, సామాజిక బంధువులకు తీర్చలేనిది. ఇక వారి కుటుంబం విషయం మాటల్లో చెప్పలేము. డా.ఎండ్లూరి సుధాకర్ గారు ఆమె సహచరులు. మానస, మనోజ్ఞ వారి పుత్రికలు. వారికి ఆ దేవుడే ధైర్యాన్నివ్వాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆమె పేరు హేమలత కానీ ఆమెకు తెలిసిన, ఆమె తెలిసిన వారందరి హృదయాలలో చెరగని ముద్ర వేసిన హేమంతం ఆమె. ఆమె పంచిన స్నేహ పరిమళాలను, మమతానురాగాలను ఎప్పటికీ మరువలేను నేను. హేమక్కకు కన్నీటితో హృదయపూర్వక నివాళులను అర్పిస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి మనసా, వాచా, కర్మణా కోరుతున్నాను.
హేమక్కా సెలవు…
”మీకు లేదు మరణం మీ జన్మమమరం”