పుట్ల హేమలత గారిని నేను ప్ర.ర.వే సమావేశంలో కలిశాను. కాత్యాయని మేడం గారు పుట్లా జీ అని నాకు ఆమెను పరిచయం చేశారు. ఆమెతో నా పరిచయం స్వల్పమే అయినా లోతైనది. పదేళ్ళ ప్రరవే సమావేశంలో మరింత దగ్గరయింది. ”రచయిత్రులకు టెక్నికల్ వర్క్ షాప్ విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ పెడదాం. తిరుపతిలో అయితే మీరు ఏర్పాట్లు చూడగలరా” అన్న ఆలోచన నాకు నచ్చింది. గత సంవత్సరం తిరుపతిలో సమావేశానికి వచ్చినపుడు ప్రరవే ఆంధ్ర శాఖకు అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. సంస్థ అభివృద్ధి గురించి ఆమె ఆరాటం నన్ను విస్మయానికి గురిచేసింది. వెబ్ సైట్‌లో సంస్థ గురించిన సమాచారాన్ని, సభ్యుల వివరాలను ఎలా పొందుపరచాలో తెలిపారు. జరపబోయే సమావేశాల గురించి చర్చించారు.
రచయిత్రులకు ఆధునికమైన సాంకేతిక నైపుణ్యం తెలియవలసిన అవసరాన్ని వివరించారు. ఎంతోమంది రచయిత్రులు తాము రాసిన కథలను, కవితలను ప్రచురణకు పంపకుండా పక్కన పడేస్తున్నారు. ఒకప్పుడు తమ రచనను అందంగా చేత్తో రాసి పోస్టులో పంపితే పత్రికల వాళ్ళు ముద్రించేవారు. కానీ ఇప్పుడు చేతివ్రాత పనికిరాదు. టైప్ చేయించి ఆన్‌లైన్‌లో పంపండి అంటున్నారు. అది కూడా ‘అను’ ఫాంట్‌లో, ‘పి.డి.ఎఫ్’, ‘ఓపెన్ ఫైల్’ లో పంపాలి అంటున్నారు. చాలామంది ఈ సాఫ్ట్‌వేర్ గందరగోళం తెలియక తమ రచనలను టైప్ చేయించేంందుకు కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లకు వెళ్ళలేక నిరాశతో పక్కన పడేస్తున్నారు. ఈ విషయాన్నే నేను ఆమెతో చర్చించాను. ఆ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం వారికి అందించగలిగితే మూలనబడ్డ ఎన్నో రచనలు వెలుగు చూసే అవకాశం ఉంటుందని, అందుకే ‘టెక్నికల్ వర్క్‌షాప్’ను వీలైనంత త్వరగా పెట్టాలని అవసరమైన క్లాసులను తానే తీసుకుంటానని ఆమె సంకల్పించారు. మీ సత్సంకల్పాన్ని ప్రరవే సభ్యులు వ్యర్థం కానివ్వరు. అభ్యుదయ భావాల్లోనే కాదు, సాంకేతిక అభివృద్ధిలో కూడా ప్రరవే ముందంజలో ఉంటుంది. అందుకు కొండంత అండగా హేమలతగారి సంకల్పం ఉంటుంది.