నేస్తమా!
ఎంత పని చేశావు?
అంత తొందర ఏమొచ్చిందని?
అర్థంతరంగా అలా వెళ్ళిపోతే
యుగాలుగా కప్పెట్టిన
లోపలి రహస్యాలన్నీ
కమలిపోయి విలపిస్తూ
ఒదిగిపోతున్నాయి కదా!
పేర్చిన చేదు జ్ఞాపకాలన్నీ
సమాధిపై పుష్పగుచ్ఛాల్లా
వేదనతో వడలిపోయి రాలి
కనుమరుగైపోతున్నాయి కదా!
ఎన్ని అక్షరాలను కూర్చి
ఎన్ని తలపులను ఏమరచి
పూల మాలలు కట్టావో కదా!
ఆ మాలల లోపల దాగిన
దారపు ముడులను విప్పకుండానే
ఏమీ చెప్పకుండానే… అలా వెళ్ళిపోయావేంటి?
గుండె నిబ్బరం చేసుకునేందుకు
ఎన్ని నిద్రలేమి రాత్రులను
గడిపావో… మర్చిపోయావా?
ఒక్కొక్క మధుర స్మృతి
గుర్తుకు వచ్చినప్పుడల్లా…
వేయి ఏనుగుల బలాన్ని
పుంజుకుంటామన్న సంగతీ
నువ్వు చెప్పేదాకా… నాకూ
తెలియలేదు… సుమీ!
రోగం ఏదైనా మందు మాత్రం
చేదుగానే ఉంటుందిగా నేస్తం!
నీకు నువ్వు ముసుగేసుకుని
మౌనంగా… నిష్క్రమిస్తే!
పిల్లికూతల మనువాదం
ఓ మెరుపు దండను
అతి వినయంగా… నీ మెడలో
నివాళీలు అర్పిస్తూ… కళ్ళు మూసుకు నిలబడింది
దప్పిక తీరని దుప్పి
భూమంతా తిరిగినట్లు
నిన్ను మాయం చేసిన… ఆ ముదనష్టపు మాయదారి రోగం
మరే మహిళకు రాకుండా
ఉండాల్సిన అవసరం
ఎంతైనా ఉందన్న… నినాదాన్ని
ఒక్కసారైనా ఇవ్వకుండా…
చెప్పాపెట్టకుండా అలా
నువ్వే వెళ్ళిపోతే!
మౌనపు ముద్దలు
కరగకుండా ఇంకా కఠినమౌతాయని తెలియదా?
ఎలా… నేస్తం… ఇలా…!
రహస్యాలన్నింటినీ కప్పుకుని
ఎవరికి వారు వెళ్ళిపోతే…
రేపు… ఎవరి చావైనా…
నిశ్శబ్ద వారధి కావల్సిందేనా…?
లోపలి పొరలను విప్పకపోతే
చరిత్ర ప్రొఫైలులో చివరిపేజీన
తగిలించబడ్తామన్నది… మరచిపోతే ఎలా?
పూవు తావిని అంటుకుని ఉన్నట్లుగా
కుటుంబం మొనలేని మనలని
నిర్బంధహస్తాలతో బంధించి ఉంచుతుంది
సూది మనోహరంగా మనల్ని గుచ్చుతూ
దండను పేర్చి రమ్యంగా నాట్యం చేయిస్తుంది
గజమాలలా గుమ్మానికి వేళ్ళాడదీయబడి
లోపలి రహస్యాలను దాచ కాపలా పెడుతుంది
నేస్తమా! ఇంకాస్త నువ్వు ఓపిక పట్టాల్సింది…!
చీకటి దుప్పటిని వదిలి వెళ్ళవల్సింది…!
తెల్లనివి మాత్రమే కాదూ నల్లని ద్రాక్షలు కూడా
పూర్తితీపిని అందించలేవన్న నిజం
చెప్పి వెళ్ళాల్సింది!
మరచిపోని ముచ్చట్లు మళ్ళీ చెప్పి తీరాల్సిందీ!
గుండెనిండా నింపుకున్న గాయాల తెర తెరచి
నస్త్రీ స్వాతంత్య్ర మర్హతీ! అన్న వాదాన్ని
బద్దలుకొట్టి వెళ్ళిపోవాల్సిందీ కదూ మిత్రమా!