ఆర్జన వేరు… ఆచరణ వేరు. చదువుతో అంతవరకూ సముపార్జించిన జ్ఞానానికి అనుగుణంగా మనసుని సిద్ధపరచకపోతే మనిషి ఏమవుతాడు, ఏ తీరాలకి చేరతాడో… తెలుసుకోవాలంటే ఒక జీవయాత్ర చేయాలి… ఒక సమర్ధవంతమైన ‘అసమర్ధుని’ పాత్రతో. అలాంటి పాత్ర ఎక్కడ ఉందీ అంటారా… అది మీకందరికీ తెలిసిన పుస్తకంలోనే. ఆ పాత్ర పేరు సీతారామారావు. త్రిపురనేని గోపీచంద్ గారి ‘అసమర్ధుని జీవయాత్ర’ నవలలో ఉంటాడీయన.
తెలుగు సాహిత్య రంగంతో పరిచయమున్న ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం పేరు వినే ఉంటారు కదూ… ఎందుకంటే దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ తన జీవయాత్రని కొనసాగిస్తున్న పాత్ర కాబట్టి.
ముందుగా టూకీగా కథేమిటో చూద్దాం:
సీతారామారావుది బాగా కలిగిన కుటుంబం. వారసత్వంగా వచ్చిన డబ్బుకన్నా కూడా తన వంశ పేరు ప్రతిష్టలే తాను నిలబెట్టాల్సిన ఆస్తి అని నమ్మిన సీతారామారావు అడిగినవారికీ అడగనివారికీ ఇష్టం వచ్చినట్లుగా దానధర్మాలు చేస్తాడు. వాళ్ళ మేనమామ ఇవ్వాల్సిన నలభై వేలకు బదులుగా పదివేలు చేసే పొలం తీసుకుని ఆ బాకీని చెల్లు చేస్తాడు. పెళ్ళంటే ఇష్టం లేని తాను అనుకోకుండా ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంటాడు. ఈలోగా ఉన్న ఆస్తి అంతా హరించిపోతుంది. పిల్లనిచ్చిన మామ చూస్తూ చూస్తూ తనని అలా వదిలేయలేక ఇప్పించిన ఉద్యోగాన్నీ సరిగ్గా చేయకుండా వదిలేశాడు. ఏ పనికీ ఏ సార్థకతా, పరమార్థమూ లేవంటూ ఏ పనీ చేయకుండా కాలం గడిపేస్తూ ఉంటాడు.
తన మేలుకోరే రామయ్య తాత ఎప్పటికప్పుడు ఇచ్చే సలహాలని తలకెక్కించుకోడు. ప్రతిదానిలోనూ ఏదో ఒక వితండవాదం చేస్తూ అసహనం పెంచేసుకుంటూ భార్యనీ, కన్నకూతురునీ కష్టపెడతాడు. వీటన్నింటి మధ్యలో తనమీద దాడి చేస్తున్న ఆలోచనల నడుమ గమ్యం లేకుండా నడుచుకుంటూ పోతూ దారిన కనబడ్డ ఒక బహిరంగ సభలో పిచ్చి కేకలేసి అందర్నీ భయపెట్టి తరువాత ఒకచోట కూర్చుని రామయ్య తాతతో మాట్లాడతాడు. ఆ తర్వాత శ్మశానంలో తనను తానే హింసించుకుని చచ్చిపోతాడు.
అసలు ఇక్కడ కథ ఏం ఉందనీ? ఉన్నదంతా ఒక పాత్ర జీవన స్వభావమే. తన ఆలోచనల విధానమే. ఒక అంతర్ముఖుడు తనలోకి తాను, తన పూర్వీకుల ఆలంబనగా బిగించుకున్న చట్రంలోనికి మరింతగా కూరుకుపోతున్నప్పుడు బయటకు వచ్చే ఉన్మత్తపు జీవన విధానమే అడుగడుగునా ఈ నవలలో మనకి కనిపిస్తుంది.
అసలు సీతారామారావు జీవితమంటేనే నరనరాన జీర్ణించుకుపోయిన కుటుంబ సాంప్రదాయాలకీ… వాస్తవాలకీ పొంతన కుదరని మానసిక సంఘర్షణ.
జన్మతః వారసత్వంగా వచ్చిన కుటుంబ సాంప్రదాయం… వంశ ప్రతిష్టని బాధ్యతగా చేసి వెళ్ళిన పెద్దలు పోషణ నిమిత్తం తన బాధ్యతలేమిటో చెప్పకపోవటంలోనే… ఒక లక్ష్మణరేఖలో తన జీవితాన్ని బందీగా చేసేసుకున్నాడు సీతారామారావు. మేనమామ అంత పెద్ద అప్పునీ 10 ఎకరాల పొలంతో సరిపెడుతూ వయసూ, సంపాదించుకునే అవకాశం ఉన్నవాడివి కనుక దీంతో సరిపెట్టుకోమంటే, సంపాదించుకునే అవకాశం ఉంది కనుక ఇతరులకి సహాయం చేస్తున్నాడు అనుకోబడే భావనే ఈ సీతారామారావుకి నచ్చదు. ఎలా నచ్చుతుంది? సూర్యుని తేజస్సుకి మల్లే, రత్నాల కాంతికి మల్లే దాతృత్వం తన స్వభావం అనుకుంటూ తన విలువని తన వంశప్రతిష్టతోనే ముడి వేసుకుని కూర్చున్న వాడికి? అసలే తాను క్రిందపడ్డా తన చెయ్యి పైన ఉండాలన్న భేషజమే నరనరాన జీర్ణించుకున్న సంప్రదాయమాయె.
పోషణ ఎలాగో నేర్చుకోకుండా కేవలం వంశప్రతిష్ట కోసం తనకు మాలిన ధర్మానికి పోయి, సర్వం కోల్పోయి తన చాతకానితనాన్ని అసంబద్ధ తర్కంతో సమర్ధించుకోవడంలోనే తనని తానూ ధీరువుగా భావించే భీరువు కనిపిస్తాడు. అతనిలో మనకి. అతని ప్రతి అభిప్రాయంలోనూ ద్వైదీ భావనే… ఒక్క క్షణం తప్పు అనిపించనిది మరుక్షణంలోనే తప్పు అనిపిస్తుంది. దీర్ఘంగా ఆలోచించడమే అన్ని సమస్యలకీ మూలం అనుకుంటూనే తనని తాను ఆలోచనల పుట్టగా తయారు చేసుకున్నాడు.
అసలు తన జీవితమంతా జవాబులేని ప్రశ్నలే…
ఎందుకంటే… ప్రధానంగా ఈ సీతారామారావు ఊహాశాలి. ఆ ఊహలకీ, వాస్తవానికీ సమన్వయం ఎక్కడా కుదరదు. ఎలా కుదురుతుంది? తానూ… తన వంశమూ అధికం అన్న భావన ప్రతి ఆలోచనలోనూ ఉట్టిపడుతుంటే?
మరి, అసలు సీతారామారావు లౌకిక జ్ఞానం లేనివాడా అంటే కాదనే అనిపిస్తుంది. బహిరంగ సభలో అక్కడి పెద్ద మనుషుల గురించి మాట్లాడే మాటల్లోనూ… పక్కింటి వాళ్ళ ముందు కూతుర్ని కొట్టి ఆ తరువాత తీరికగా తాను పడిన ఘర్షణలోనూ, చివరిగా స్మశానంలో ముసలి వ్యక్తితో మాట్లాడే మాటల్లోనూ అతనిలోని లౌకిక జ్ఞానం పుష్కలంగా కనిపిస్తుంది. అయితేనేం తన వంశ మూల పురుషుల సిద్దాంతాల నకళ్ళ నుండి ప్రస్తుత సమాజాన్ని అర్థం చేసుకోవడంలోనే విద్యతో తాను నేర్చిన జ్ఞానం పక్కదారి పట్టిందని మనకి అర్థం అవుతూనే ఉంటుంది.
ఎప్పుడైతే కుటుంబ సాంప్రదాయమన్నది తనలోని విచక్షణా జ్ఞానాన్ని పైకి రానివ్వకుండా ఒక ఉన్మాదిత్వపు దశకు చేరుకుందో అక్కడ ఈ అసమర్థుడు కాస్తా ఉన్మత్తుడు అయిపోయాడేమో అని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే సీతారామారావు స్వభావంలో మనకి అర్థమయ్యేది పరుల దగ్గర తన ఔన్నత్యం నిలబెట్టుకోవడం. కానీ కొన్నిచోట్ల ఈ పాత్ర తన పరిధి దాటి బయటికి వెళ్ళి తానో
ఉన్మాదుడేమో అన్న అభిప్రాయం కలిగించేలా అనిపిస్తుంది.
ఆఫీసు నుండి వచ్చేసేటప్పుడు అక్కడ తన ప్రవర్తనలో… బహిరంగ సభలో తను ప్రవర్తించే తీరులో సర్వకాల సర్వావస్థల్లోనూ లోకాన్నౌత్యుడిగా కనిపించాలనుకునే అతని స్వభావానికి విరుద్ధంగా ఉంటాయి ఈ రెండు సంఘటనలు. అదొక లోపమేమో అన్న అభిప్రాయమైతే వస్తుంది చదివే వాళ్ళకి. అసమర్థతకూ… ఉన్మాదతకూ మధ్య ఉన్న లైన్ ఏదో చెరిపివేసిన భావన కలుగుతుంది.
”రైలుకి వెళ్ళడం ముఖ్యం అయినప్పుడు ఘర్షణపడి అయినా టికెట్ తెచ్చుకోవటం సమర్థత అవుతుంది కానీ, అసలు ఘర్షణే పడను అంటే రైలు అందదు” అంటూ మేనమామ సీతారామారావుకి రాసే ఉత్తరంలో ఒక వాస్తవ దృశ్యం మన కళ్ళకి కనపడి మన వీపుమీద ఛెళ్ళున కొట్టిన అనుభవం అవుతుంది.
దాదాపు 75 ఏళ్ళ క్రితం ఈ పుస్తకంలో ఒకచోట నాయకుల గురించిన ప్రస్తావన వస్తుంది. కుర్రతనంలో ఉబలాటం కొద్దీ సంఘసేవ అని బయలుదేరి దానివల్ల ఏమీ లాభం లేదని తెలిసేసరికి అందులోనుండి వెనక్కి తగ్గే అవకాశం లేక, అప్పటికే వచ్చిన గౌరవాన్ని వదులుకోలేక అలా నాయకులుగా కొనసాగుతూ ఉంటారు. అప్పటివరకూ తాము చెప్పినవి తప్పు అని మనసుకి తెలిసినా, దాన్ని బయటకు చెప్పలేకపోగా అదే తప్పుని మరింత బలంగా ప్రచారంలోకి తెచ్చే మనస్తత్వమే కనిపిస్తుంది అక్కడ. ఈ రోజుల్లో మనం ఇలాంటి నాయకులని ఎంతమందిని చూడటంలేదు?
సంఘంలోని భిన్న వర్గాలు ఒకదానికొకటి సంబంధం లేని ముక్కలుగా కాక ఒకదానిమీద ఒకటి ఆధారపడి బతుకబట్టే అది సంఘం అని పిలవబడుతుంది అని రామయ్య తాత పాత్ర చేత సీతారామారావుకి చెప్పిస్తాడు రచయిత. సంఘమైనా… ప్రకృతి అయినా… ఎక్కడైనా ఘర్షణ అన్నది జీవనవికాసానికి తోడ్పడేలా ఉంటేనే ఆదర్శవంతమైన జీవయాత్ర కొనసాగుతుంది అన్న ఆలోచనలని మనలోకి జొప్పించే మాటలని రామయ్య తాత పాత్రద్వారా చెప్తాడు రచయిత గోపీచంద్.
సీతారామారావు ప్రస్థానమంతా తన పూర్వీకులు పెంచి వెళ్ళిన సాంప్రదాయపు బాటలోనే, వాళ్ళు నిర్మించి వెళ్ళిన వాతావరణపు పరిధిలోనే నడిచింది. దాన్ని తప్పు బట్టడానికి తన అంతరంగం మొరాయించేస్తుంది. తిన్నగా ఆలోచించిన కాసేపూ అంతకుముందు తన బుద్దితక్కువతనాన్ని నిందించుకోవడం జరుగుతుంది కానీ ఆ ఆలోచనల నుండి బయటకి రావడానికి ప్రయత్నమంటూ ఉండదు.
మరణానికి ముందు స్మశానంలో, తన ఊహాజనిత ప్రపంచంలో తండ్రితోనూ… తల్లితోనూ మాట్లాడిన మాటలు… ప్రశ్న నేర్చిన కొడుకుని కాక నీడనే తన కొడుకుగా భావించిన తండ్రిని చూశాక తన సిద్ధాంతాలని ఎంత బలంగా తన కొడుకులో నింపి వెళ్ళాడో తెలుస్తుంది.
పుస్తకం అంతా ఒకెత్తు అయితే చివరిగా వచ్చే రామయ్య తాత చెప్పే మాటలు, ఆ తరువాత స్మశానంలోని ఆఖరి ఘట్టం యావత్తు మరో ఎత్తు. తనని తాను హత్య చేసుకున్న తీరు మనసుని దేవేసినంత భీభత్సంగా ఉంటుంది. తనలోని ఆత్మవివేచన మొత్తం చదువుతుంటే… నేటికీ అవన్నీ మన జీవితంలోని ఏదో ఒక పార్శ్వంలో మన మథనంలో నలిగినవే అన్న సంగతి తలపుకి వస్తుంది. అప్పుడనిపిస్తుంది ప్రతి మనిషిలో ఒక సీతారామారావు దాగి ఉంటాడనీ, మన వివేచనని బట్టి తాను బయటకు రావటమూ… రాకపోవటమూ ఉంటుందని.
విభిన్న సామాజిక దార్శనికతల నడుమ ఘర్షణ సహజమనీ… వాటిని ప్రగతిశీల దృక్పథంతో అర్థం చేసుకోవాలని… అలా కానప్పుడు సమాజంలో సీతారామారావులు తయారవుతారనీ ఈ నవల ద్వారా గోపీచంద్ హెచ్చరిస్తాడు.