‘ఏమిటీ ఎంగిలి కాఫీ కప్పు టీపాయ్ మీద వదిలేసిందెవరూ? అసహ్యంగా ఈగలు ముసరడంలా?” భర్తమీద ఇంతెత్తున లేచింది లోకేశ్వరి. ”ఇప్పుడే పెట్టానోయ్ పేపర్ చదువుతూ, తీసేస్తాలే కొంచెంసేపాగి” తాపీగా సమాధానమిచ్చాడు సంజీవరావు. ”చెప్పంగానే ఎందుకు చెయ్యరు ఏ పనైనా? నేనంటే ఇంట్లో ఎవరికీ లెక్కలేదు. ఈ నిర్లక్ష్యం నేను భరించలేను. నేను మా పుట్టింటికి పోతా” ఒక్కసారిగా భర్తమీద విరుచుకుపడింది లోకేశ్వరి.
సంజీవరావుకి అర్థం కావడంలేదు. ఈ మధ్య కొన్ని రోజులుగా లోకేశ్వరి ధోరణి మారిపోయింది. చీటికీ, మాటికీ చిరాకు పడడం, కోపగించుకోవడం, ఏడవడం ఎక్కువయిపోయింది. ఎంతో సౌమ్యంగా, ఏ పనీ ఎవరినీ చేయనీయకుండా, శాంతంగా, ఓపికగా తన పని తాను చేసుకునే లోకేశ్వరికేమయింది?
గత పాతికేళ్ళ వివాహ జీవితంలో ఆమెనిలా ఎప్పుడూ చూడలేదు. ఒకసారి డాక్టర్ని చూస్తే బాగుంటుందేమో? అనుకున్నాడు సంజీవరావు. డాక్టర్ ఆమెని కొన్ని ప్రశ్నలడిగి, పరీక్షించి ఇదంతా ”మెనోపాజ్” ప్రభావం అని చెప్పి సంజీవరావుని కొంతకాలం సంయమనంగా ఉండమని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్పి, కొన్ని మందులు రాసిచ్చి కొంతకాలంలో అంతా సరవుతుందని చెప్పాడు. ఇక్కడిలా ఉంటే…
ఇంకోచోట యాభయ్యో వడిలో పడిన ఇందిరకి నెలసరులు సరిగా రావడం లేదు సరికదా, దాంతోపాటు గుండె దడ, నీరసం, ఉన్నట్టుండి ఒళ్ళంతా మంటలు, ఏదో ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో నిద్రపట్టక పోవడం. తీరా డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకెళ్తే, అన్ని రకాల పరీక్షలు చేసి జబ్బేమీ లేదని, ఇదంతా బహిష్టులాగి పోయే ముందు వచ్చే సమస్యనీ, దీనినే ”పెరిమెనోపాజ్” అంటారనీ, పూర్తిగా బహిష్టులు ఆగిపోతే ”మెనోపాజ్” అంటారనీ, ఇది తాత్కాలికమేనని కొన్ని మందులూ, ఆహార నియమాలూ, ఎక్సర్‌సైజులూ చెప్పాడు.
మరో కాపురంలో కథ మరోలా ఉంది..
అప్పటికి దాదాపు ముప్ఫయ్యేళ్ళుగా ”స్వీట్ హోం”లో విమల, బుచ్చిబాబుల్లాగా అన్యోన్యంగా కాపురం చేస్తున్న జంట సరిత, రాంబాబు ఈ మధ్య ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. చివరికి విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నారని విని స్నేహితులు సోంబాబు, రాణి వచ్చారు విషయం కనుక్కుందామని. రాంబాబు ”తనకి నేనంటే ఇష్టం పోయింది. ముట్టుకోనివ్వడంలేదు, రానివ్వడం లేదు” అని ఫిర్యాదు చేశాడు. సరితేమో ”యాభయ్యేళ్ళొచ్చాయి ఇద్దరికీ. పిల్లలు పెళ్ళీడుకొస్తున్నారు. ఇంకా ఈ వయసులో కూడా ఈ యావ ఏమిటీ? నాకిదంతా బాధాకరంగా, చిరాగ్గా ఉంటోంది” అని చెప్పింది రాణికి.
అలాక్కాదు మీరిద్దరూ ఒకసారి డాక్టర్ని కలవండి. సరితకేమయినా మెనోపాజ్ సమస్యేమో? అని సలహా చెప్పారు సోంబాబు, రాణి. వారిని పరీక్షించిన డాక్టర్ ఇదంతా మెనోపాజ్ వలన జనన మార్గం పొడిబారి, కలయిక బాధాకరంగా మారిందనీ, దానివల్ల దాంపత్య సంబంధం పట్ల విముఖతా, నిరాసక్తతా ఏర్పడ్డాయని చెప్పాడు.
తగిన మందులు, పై పూతలూ వాడితే వారి దాంపత్య సంబంధాలు మెరుగుపడి కాపురం సజావుగా సాగుతుందని చెబుతూ, మెనోపాజ్ వచ్చినంత మాత్రాన మహిళ దాంపత్య జీవితం ముగిసిపోయిందని భావించనక్కరలేదనీ, మూడో వంతు జీవితం అప్పటినుండే మొదలవుతుందని బోధపరిచాడు.
మరో కాపురంలో ఇంకో సమస్య… బహిష్టులాగిపోయి సంవత్సరం గడిచాక శాంతకుమారికి మళ్ళీ ఎర్రబట్ట కనబడింది. వేడిచేసి ఉంటుందిలే అనుకుని రెండునెలల పాటు ఊరుకుంది. తర్వాత అది పెరిగిపోతుంటే, వాళ్ళమ్మాయి కోప్పడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. డాక్టర్ పరీక్ష చేసి దాన్ని గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చిన కేన్సర్‌గా నిర్ధారించి ఆలస్యంగా వచ్చినందుకు కోప్పడింది. బహిష్టులాగిపోయే సమయంలో ప్రతి స్త్రీ కేన్సర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలనీ, ముఖ్యంగా బహిష్టు ఆగిపోయిన ఆరు నెలల తర్వాత రక్తస్రావం కనబడితే అశ్రద్ధ చేయకూడదనీ, అది కాన్సర్ వల్ల కాదని నిర్ధారించుకోవడం ముఖ్యమనీ హెచ్చరించింది.
ఇలా మహిళలలో శారీరకమైన, మానసికమైన సమస్యలను కలుగజేసే ఈ ”మెనోపాజ్” అంటే ఏమిటో, దానికి కారణాలేమిటో చూద్దామా?
మెనోపాజ్ అంటే: ప్రతి స్త్రీకి 45-50 సంవత్సరాల వయసులో వరుసగా పన్నెండు నెలలపాటు బహిష్టులు రాకుండా ఆగిపోతే దాన్ని ”మెనోపాజ్” అంటారు. ఇది శాశ్వతమైన, సహజమైన మార్పు. ఇది జబ్బు కాదు, ఇది ఒక దశ. మన దేశంలో ఏటా పది మిలియన్ల మంది ”మెనోపాజ్” దశకు చేరుకుంటున్నారు.
ఏ వయసులో వస్తుంది: సాధారణంగా ఒక కుటుంబాన్ని తీసుకుంటే, ఆ కుటుంబంలో పెద్దవాళ్ళయిన వ్యక్తులకి ఏ వయసులో బహిష్టులాగిపోతాయో దాదాపు అదే వయసులో తర్వాత వాళ్ళకి కూడా ఆగిపోతాయి. 45-50 ఏళ్ళ మధ్యలో ఎప్పుడయినా ఆగిపోవచ్చు. నలభై ఏళ్ళకి ఆగిపోతే ”ప్రిమెచ్యూర్ మెనోపాజ్” అంటారు. చిన్న వయసులో గర్భసంచీ తొలగించిన వారికి కూడా తొందరగా అంటే తొలగించిన సంవత్సరానికే ”మెనోపాజ్” లక్షణాలు కనబడతాయి.
”మెనోపాజ్”కి కారణం: అండాశయం నుండీ అండాలు విడుదల కాకపోవడం, అందువలన హార్మోన్ల సమతుల్యత దెబ్బ తినడం, బహిష్టులాగిపోవడం జరుగుతుంది. అండం విడుదలవ్వని కారణంగా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. కానీ అరుదుగా ఎక్కడో ఒకసారి ఎప్పుడయినా ఒక అండం విడుదలయి గర్భం రావచ్చు. అయితే ఇది చాలా అరుదుగా జరిగే విషయమని గుర్తుంచుకోవాలి.
అండం విడుదలవ్వడం ఎందుకాగిపోతుంది?
ప్రతి స్త్రీకీ గర్భాశయానికి ఇరుపక్కలా రెండు అండాశయాలు అమర్చబడి ఉంటాయి. అవి పుట్టుకతోనే నిర్ణీత సంఖ్యలో ఉన్న అండాలను కలిగి ఉన్న బుట్టల్లాగా ఉంటాయి. యుక్తవయసు వచ్చాక నెలకొకటి చొప్పున పక్వమయి, విడుదలయి, ఫెలోపియన్ ట్యూబ్‌ను చేరుకుంటాయి. అక్కడ వీర్యకణంతో కలిస్తే ఫలదీకరణం చెందుతుంది లేని పక్షంలో బహిష్టు రక్తస్రావంతో పాటు విసర్జించబడుతుంది.
ఈ కార్యక్రమమంతా ఠంచన్‌గా జరగడానికి, మెదడులోని హైపోథలామస్ అనే భాగమూ, పిట్యుటరీ గ్రంథి, ఓవరీలనుండి స్రవించే హార్మోన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. దీనినే ”హైపోథలామో, పిట్యుటరీ, ఒవేరియన్ యాక్సిస్” అంటారు.
హైపోథలామస్ నుండీ వచ్చే హార్మోన్లు, పిట్యుటరీ గ్రంథిని ఉత్తేజితం చేస్తే, పిట్యుటరీ నుంచి వచ్చే హార్మోన్లు ఓవరీని ఉత్తేజితం చేస్తాయి. ఓవరీ నుండి అండంతో పాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్లు విడుదలయి గర్భాశయం మీద పనిచేసి గర్భాశయంలో పిండం ఎదుగుదలకి కావలసిన మార్పులు జరిగేటట్లుగా చేస్తాయి.
మెనోపాజ్ దశలో అండాలు పూర్తయిపోయి విడుదల కాకపోవడం వల్ల మొదట ప్రొజెస్టిరాన్ హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతుంది. ఈ రెండింటి స్థాయీ తగ్గడంతో పిట్యుటరీ నుండి FSH అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈస్ట్రోజన్‌ని ఫెమినైన్ హార్మోన్ అంటారు. ఇది తగ్గిపోవడం వలన స్త్రీలలో కొన్ని శారీరకమైన, మానసికమైన మార్పులు వస్తాయి. మెనోపాజ్ లక్షణాలకి ఇవే కారణం. ఇవీ సూక్ష్మంగా మెనోపాజ్‌లో జరిగే హార్మోన్ల మార్పులు. మెనోపాజ్‌లో కనబడే లక్షణాలు.
బహిష్టులో అసమానతలు:
కొంతమందిలో బహిష్టులు హఠాత్తుగా ఆగిపోతాయి. కొంతమందిలో క్రమేణా ఆగిపోతాయి.బహిష్టుకీ, బహిష్టుకీ మధ్య గ్యాప్ ఎక్కువవుతుంది. కొంతమందిలో అధిక రక్తస్రావం కనబడుతుంది. కొంతమందిలో రక్తస్రావం తక్కువగా ఉంటుంది. ఒక సంవత్సరంపాటు బహిష్టు కనబడకుండా ఆగిపోతే ”మెనోపాజ్” వచ్చినట్లు భావించాలి. దానికి రెండు, మూడు సంవత్సరాలు ముందూ, వెనకా పెరిమెనోపాజల్ దశగా భావించాలి. 40 సంవత్సరాలకి ముందే వస్తే ”ప్రికారియస్ మెనోపాజ్” అంటారు. 50 సంవత్సరాలు దాటినా రక్తస్రావం కనబడుతుంటే, ఇతర వ్యాధులేమైనా కారణమేమో పరీక్షించుకోవాలి.
ఇతర లక్షణాలు:
తొందరగా అలసిపోవడం; ఒళ్ళంతా వేడి ఆవిర్లు రావడం (హాట్ ఫ్లషెస్); ఒళ్ళంతా చెమటలు పట్టడం; రాత్రిళ్ళు నిద్రలో ఒళ్ళంతా చెమటలు పట్టి మెలకువ రావడం (నైట్ స్వెట్స్); గుండె దడ; నిద్రపట్టకపోవడం; మానసికమైన ఆందోళన, చిరాకు, డిప్రెషన్, కారణం లేకుండా ఏడుపు రావడం; తలనొప్పులు.
శరీరంలో వచ్చే మార్పులు:
స్థూలకాయం;
జనన మార్గమూ, జననావయవాలూ ఎండిపోయినట్లు పొడిబారడం;
కణజాలాలు కుచించుకుపోవడం- ఈ మార్పుల వల్ల తొందరగా ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అంతేకాక జనన మార్గం పొడిగా ఉండడం వలన దురద, మంట ఉండడంతో దాంపత్య జీవితం పట్ల విముఖత, నిరాసక్తత ఏర్పడతాయి;
జుట్టు రాలిపోయి పల్చబడడం;
మూత్ర సమస్యలు… తొందరగా వెళ్ళాల్సి రావడం;
దగ్గినా, తుమ్మినా మూత్రంతో బట్టలు తడిసిపోవడం (స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్);
తరచుగా మూత్రంలో ఇన్‌ఫెక్షన్లు;
గర్భసంచిని దాని స్థానంలో పట్టి నిలిపే లిగమెంట్లలో పటుత్వం తగ్గి గర్భసంచి జారిపోయే అవకాశాలు ఎక్కువవడం.
మెనోపాజ్‌లో వచ్చే కాంప్లికేషన్స్:
ఈస్ట్రోజన్ ఒక రక్షణ హార్మోన్, రక్తనాళాల సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడయితే దాని స్థాయి తగ్గుతుందో అప్పుడు రక్తనాళాల గోడలు మందంగా మారి ఎథిరో స్క్లీరోసిస్ అనే వ్యాథి రావడం వలన హార్ట్ ఎటాక్స్, బ్రెయిన్‌లో స్ట్రోక్ వచ్చే ప్రమాదావకాశాలు పెరుగుతాయి. ఆస్టియో పోరోసిస్ – ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల ఎముకల్లో కాల్షియం తగ్గి, అవి గుల్లబారి తొందరగా విరిగిపోతుంటాయి. ముఖ్యంగా వెన్నుపూస, తొడ ఎముక, మణికట్టులలో ఎముకలు విరగడం ఎక్కువగా కనబడుతుంది. మూత్రాశయ సమస్యలు, గర్భాశయం జారిపోవడం, బ్రెస్ట్ క్యాన్సర్‌కు, గర్భాశయ క్యాన్సర్‌కూ గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.
నిర్ధారణ:
ముఖ్యంగా ఇది వ్యాధి కాదనీ, ప్రతి స్త్రీ జీవితంలోనూ వచ్చే ఒక దశ అనీ గుర్తించాలి. ఆమె వయసూ, ఆమెలో కనబడే లక్షణాలూ, బహిష్టులలో కనబడే అసమానతలూ…అది మెనోపాజ్ అనే నిర్ధారణకి రావడానికి ఉపయోగపడతాయి. హార్మోన్ పరీక్షలు… పిట్యుటరీ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది (FSH). ఒవేరియన్ హార్మోన్ల స్థాయి తగ్గుతుంది (ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్). ఈ మధ్యనే తెలుసుకున్న విషయం ”యాంటీ ముల్లేరియన్ హార్మోన్” స్థాయి మెనోపాజ్‌లో గణనీయంగా పెరుగుతుందని.
మెనోపాజ్ దశలో స్త్రీలు చేయించుకోవలసిన పరీక్షలు:
ప్రతి మహిళా నలభై సంవత్సరాలు దాటాక గర్భాశయ క్యాన్సర్‌కీ, రొమ్ము క్యాన్సర్‌కీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. అవి పాప్‌స్మియర్… అవసరమైతే గర్భాశయ ద్వారం నుండీ బయాప్సీ.డి అండ్ సి ద్వారా గర్భాశయం లోపలి పొరను తీసి బయాప్సీకి పంపడం. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌తో గర్భాశయంలోనూ, ఓవరీల్లోనూ గడ్డలున్నాయేమో చూడడం. మామోగ్రఫీ కరోనరీ యాంజియో,గ్రాఫ్ థైరాయిడ్ పరీక్షలు, మూత్ర పరీక్షలు, కాల్షియమ్, విటమిన్-డి స్థాయిని పరీక్షించుకోవడం, బి.పి, షుగర్ రెగ్యులర్‌గా చెక్ చేయించుకోవడం.
మెనోపాజ్ లక్షణాలకు చికిత్స:
ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పని వ్యాయామం… ఈ లక్షణాల వలన ఎక్కువ బాధ పడకుండా చేస్తాయి. ఆహార నియమాలు… మితమైన సమతులాహారం అంటే, ఆకు కూరలు, తాజా పళ్ళు, సోయా ఉత్పత్తులు, ఫ్లాక్ సీడ్స్ (అవిశ గింజలు) ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
ఒమేగా త్రీ ఫాటీ యాసిడ్స్ లభించే ఆయిలీ ఫిష్ ఆహారంలో ఉండేలా చూసుకుంటే, మెనోపాజ్‌లో వచ్చే మానసిక సమస్యలని అధిగమించవచ్చని వైద్యశాస్త్రం చెబుతోంది. కెఫీన్, స్మోకింగ్, ఆల్కహాలు, మసాలాలు సమస్యలని ఎక్కువ చేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
వ్యాయామం:
ఆహారం పరిమాణం తగ్గించడం, వ్యాయామం సమయం పెంచడం వలన రక్త సరఫరా వృద్ధి అవడమే కాక మానసిక సమస్యలని తగ్గించి శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. రోజుకి నలభై అయిదు నిమిషాలపాటు బ్రిస్క్ వాక్, ధ్యానం, యోగా వంటివి కొన్ని… మెనోపాజ్‌లో వచ్చే సమస్యలకు చక్కని నివారణ అని వైద్యులు భావిస్తున్నారు. ‘కెగెల్స్ ఎక్సర్‌సైజులు’ అనేవి జననేంద్రియాల దగ్గర కండరాలని గట్టిపరుస్తాయి. ఇవి చేయడం వలన మూత్ర సంబంధిత సమస్యలను అదుపులోనికి తీసుకురావచ్చు.
మందులు ఎవరికి ఇవ్వాలి:
మెనోపాజ్ లక్షణాలైన హాట్ ఫ్లషెస్, నైట్ స్వెట్స్ అధికంగా ఉండేవారికి, చిన్నవయసులో మెనోపాజ్ వచ్చిన వాళ్ళకీ, చిన్న వయసులో గర్భసంచీ తొలగించినవారికీ డాక్టర్ సలహాతో నోటి మాత్రలూ, పై పూత మందులూ వాడవలసి ఉంటుంది. జనన మార్గం పొడిబారిన వారికి పైపూత మందులు, ఈస్ట్రోజన్ క్రీములూ, ఇతర లూబ్రికెంట్ క్రీములూ డాక్టర్ సలహాపై వాడడ వలన దాంపత్య సంబంధాలలో ఇబ్బందులు తొలగడమే కాక ఇన్‌ఫ్షెన్లు రాకుండా నివారించవచ్చు. కాల్షియం మాత్రలు మెనోపాజ్ తర్వాత ప్రతి స్త్రీ జీవితాంతం వాడవలసి ఉంటుంది. అవసరాన్ని బట్టి విటమిన్ డి త్రీ మాత్రలు వాడాలి. థైరాయిడ్, డయాబెటిస్, బీపీ లకు మాత్రలు వాడుతూ అదుపులో ఉంచుకోవాలి.
హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ:
మెనోపాజ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడూ, చిన్నవయసులోనే మెనోపాజ్ వచ్చినపుడూ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ నోటి మాత్రలను తక్కువ మోతాదులో సాధ్యమయినంత తక్కువ కాలం వాడతారు.
ఎక్కువ కాలం హార్మోన్లు వాడితే కలిగే ఇబ్బందులు:
రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి హార్ట్ ఎటాక్స్‌కీ, బ్రెయిన్ స్ట్రోక్‌కీ గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. లివర్ మీద ప్రభావం చూపడం, బ్రెస్ట్ కాన్సర్‌కి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హార్మోన్లను తక్కువ కాలం అంటే ఒక ఆరు నెలలో, సంవత్సరమో మాత్రమే వాడి జీవితంలోనూ, శరీరంలోనూ వచ్చే మార్పులను హుందాగా స్వీకరించాలి.
చివరగా తెలుసుకోవలసిందేంటంటే మెనోపాజ్ లేక బహిష్టులు ఆగిపోవడం అనేది ఒక సహజ దశ, అది జబ్బు కాదు, ఎంతో కాలం బాధించదు. అంతటితో స్త్రీ తన జీవితం అయిపోయిందనీ, దాంపత్య జీవితానికి పనికిరాననీ భావించనవసరం లేదు. మూడో దశ జీవితం అప్పుడే మొదలవుతుంది. ఆ సమయంలో ప్రశాతంగా, ధైర్యంగా ఉండి సరైన ఆహారం తీసుకుంటూ, సరైన వ్యాయామం చేస్తూ, బరువు పెరగకుండా చూసుకుంటూ, డాక్టర్ సలహా మీద అవసరమైతే మందులు వాడుతూ, ఇతర వ్యాధుల గురించి అవగాహనతో జీవితం గడిపితే మెనోపాజ్ వలన వచ్చే బాధలు చాలావరకు తగ్గుతాయి.
ఆ సమయంలో కుటుంబసభ్యులు కూడా ఆమె సమస్యలని సానుభూతితో అర్థం చేసుకుని కావలసిన విశ్రాంతినీ, మానసిక ధైర్యాన్నీ ఇస్తే ఆమె ఈ దశని విజయవంతంగా దాటుతుంది.