లలిత, జానపద సంగీతాలకి ఆద్యురాలను నేనే – వింజమూరి అనసూయ దేవి

– ఇంటర్వ్యూ : కొండవీటి సత్యవతి

ప్రముఖ జానపద గాయకురాలు వింజమూరి అనసూయాదేవి ఇటీవల తన 99వ ఏట అమెరికాలో మరణించారు. ఈ సందర్భంగా, 2006 ఏప్రిల్‌, మే భూమికలో ప్రచురించిన అనసూయా దేవి గారి ఇంటర్వ్యూని పాఠకుల కోసం తిరిగి ప్రచురిస్తున్నాం. ఇది ఆ అసమాన లలిత, జానపద గీతాల గాయనికి భూమిక ఇచ్చే నివాళి…

నమస్కారమండి.

నమస్కారమమ్మా

మీ పాటలంటే నాకు చాలా ఇష్టం. ఇంటర్నెట్‌లో వింటుంటాను. మీ నేపథ్యం గురించి, మీరెక్కడ పుట్టారు, మీ బాల్యం గురించిన వివరాలు భూమిక కోసం చెప్పండి.

తప్పక చెబుతానమ్మా! 1920 మే నెలలో మంచి వసంత ఋతువులో అన్నమాట కాకినాడలో పుట్టాను. నాకు ఇప్పుడు 85 ఏళ్ళు. నా సంగీత త్రివేణి గురించి చెప్పాలి. మూడు రకాల సంగీతం. క్లాసికల్‌ మ్యూజిక్‌, లైట్‌ మ్యూజిక్‌, ఫోక్‌ మ్యూజిక్‌ ఈ మూడు నా జీవితంలోకి ఎలా వచ్చాయో చెబుతాను. అయిదో ఏట నుంచి నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. నాకు అక్షరాభ్యాసం బదులు శాస్త్రీయ సంగీతం మొదలుపెట్టారు. ఆ రోజునే హార్మోనియం ఒకటి చిన్నది మా మేనత్త గారిది ఉండేది. ఎవ్వరూ చెప్పకుండానే ఆ హార్మోనియం మీద పాట వాయించుకునేదాన్ని. మా గురువుగారెంతో సంబరపడిపోయి, ఈ చిన్నపిల్ల వాయించేస్తుందని అంటే మా నాన్నగారు మెచ్చుకున్నారు. అన్ని పాటలు నేనెవర్నీ అడక్కుండానే హార్మోనియం మీదే వాయించుకుంటూ పాడేదాన్ని. శాస్త్రీయ సంగీతం నా పునాది.

నా తల్లిదండ్రులు, నాకు ఐదవ ఏట నుంచీ కర్ణాటక సంగీతం, సంస్కృతం అందులో శబ్దమంజరి, అమరకోశం, కావ్యాలు నేర్పించారు. కొన్నాళ్ళు వీణ, హిందీ కూడా నేర్పించారు. హార్మోనియం మాత్రం నాకు ఎవరూ నేర్పకుండానే వచ్చిన విద్య. ఐదవ ఏట నుంచీ వాయించాను. ఏడవ ఏట నుంచీ కచేరీలు చేశాను. ఎనిమిదవ ఏట మొదటి గ్రామఫోను రికార్డు ‘అయ్యో కొయ్యోడ’ ఇచ్చాను. తొమ్మిదో ఏట సంగీతంలో నూతన పంథా త్రొక్కి, మ్యూజిక్‌ కంపోజర్నయ్యాను. దాదాపు నవ్య సాహిత్యంతోటే నా నవ్య సంగీతం కూడా పుట్టింది. అలా ఆంధ్రాలో భావగీతాల ఆవిర్భావం జరిగింది.

70 ఏళ్ళ పూర్వం మాట! అప్పటి జీవితం వేరు. నా చిన్నప్పుడు, కాకినాడ నుంచి పిఠాపురం రెండెడ్ల బండీలో వెళ్ళేవాళ్ళం. బస్సులూ, రైళ్ళూ లేవప్పుడు. తోవలో పొలాల్లోని కోతల పాటలు, కుప్పనూర్పుల పాటలు, యాతాం తోడుతూ పాడే పాటలు వింటూ, కొండ మల్లెపూల గుబాళింపు తోవ పొడుగునా అనుభవిస్తూ, పండూరు చెరువు దగ్గర, వేప పుల్లలో, గానుగ పుల్లలతోనో పళ్ళు తోముకుని, కానీకి కట్ట తామరపూలు కొనుక్కుని, చిత్రాడ రైతు ఇంటి అరుగుమీద కూర్చుని, ఎదురు కొట్టులో నేతి పెసరట్లు వేయించుకుని తిని పిఠాపురం చేరేవాళ్ళం. ఇంటికి చేరాక తోవలో విన్న జానపదాలను అనుకరించి పాడేదాన్ని.అదే నా జానపద సంగీతానికి బాట.

నా చిన్నప్పుడు వేడుకలు, వినోదాలు రకరకాలు. ఇప్పుడవి కరువయ్యాయి. విప్ర వినోదులూ, పగటి వేషగాళ్ళూ, కూచిపూడి భాగవతాలూ ఇంటింటికి వచ్చి వారి కళను ప్రదర్శించి డబ్బు తీసుకుని వెళ్ళేవారు. వీరేకాక జంగం దేవరలూ, బుడ బుక్కల వారూ, కాశీపట్నం, సోదె, మల్లేలమ్మల వారు, డప్పులు, గరగలు, పెద్ద పులి ఆటలు మంచి కాలక్షేపంగా ఉండేవి. ఆ రోజుల్లో, కాకినాడ నాడాల సాయిబు బండీ పెద్దపులి ఆట చాలా ప్రసిద్ధి. జాతర్లలో వేడుకలు వేరు. కత్తిసాములూ, కోలాటాలూ, చెక్క భజనలూ, బుట్టబొమ్మలూ, భోగం మేళాలూ, ముఖ్యంగా ఉండేవి.

జానపద సంగీతం మీద నాకు చిన్నప్పటినుంచే మక్కువ ఉంది. ఇదలా ఉండగా లలిత సంగీతం నన్ను వరించి నా దగ్గరికొచ్చింది. అదెలా వచ్చిందంటే, మా మేనమామ కృష్ణశాస్త్రి అద్వితీయమైన కవి. నవ్యసాహిత్యోద్యమ రోజులవి. నేనా రోజుల్లోనే పుట్టాను.

మామయ్య కృష్ణశాస్త్రి ప్రభావం నా మీద చాలా ఉంది. పోలిక కూడా ఉందంటారు. మామయ్య ”నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు! నా ఇచ్చయేగాక నాకేటి వెరపు! నిలిచిపోవును సత్యమొకటే, గెలిచి తీరును ప్రేమ ఒకటే, భయము కన్నా వేరు బానిసత్వము లేదు. భరత జాతికి ధర్మబలమిదే” మొదలైన పాటలు, చిన్నతనం నుంచీ నా జీవితంలో ఎన్నో మార్పులకి దారితీశాయి.

పిఠాపురం మహారాజుగారి కొడుకు పెళ్ళికి మా మామయ్య పాటలు రాశాడు. ఎవరో ఒక సంగీతం మాస్టారు ట్యూన్‌ చేశారు. నాకు ఆ ట్యూన్స్‌ నచ్చలేదు. నాకప్పటికి ఎనిమిదేళ్ళుంటాయి.ఆ పాటల్ని తీసుకుని నేను ఇంకో విధంగా ట్యూన్‌ పెట్టి ‘మామయ్యా ఇలా పాడితే బావుంటుంది’ అన్నాను. మామయ్య ‘అందరూ రండి’ ఇది పాడుతోంది అని అందర్నీ పిలిచాడు గమ్మత్తుగా. అందరూ మెచ్చుకున్నారు. చాక్లెట్లు ఇస్తే చిన్నపిల్లలు సరదాపడి చెప్పిన పని చేసేసినట్లు వాళ్ళు మెచ్చుకుంటుంటే అన్ని పాటలూ ట్యూన్‌ చేశాను. అందరూ బావున్నాయని మెచ్చుకున్నారు. పిఠాపురం రాజాగారి కొడుకు పెళ్ళిలో నాచేతే కచేరీ చేయించి, పెళ్ళి పాటలన్నీ నాచేతే పాడించారు. నాకు నూట పదహారు కాసులు వెండి పళ్ళెంలో అలంకరించి రాణిగారు బహుమతిగా అందజేశారు. పరికిణీ గుడ్డ కూడా ఇచ్చారు. అలాగే లలిత సంగీతం నా జీవితంలోకి వచ్చింది. భావగీతాలు అనేవారు ఆ రోజుల్లో. ఈ భావగీతానికి ట్యూన్‌ ఎందుకు పెట్టాను అంటే అలా పెట్టబుద్దేసింది. మా మామయ్య కవి అవబట్టో తను చదువుతుంటేనో ట్యూన్‌ వచ్చేది. అది మా మామయ్య పాటల్లో ఉన్న మాధుర్యమే. మా మామయ్య కవిత్వంలో పదాలు మనకు సంగీతాన్నందజేస్తాయి. మ్యూజికల్‌ వర్డ్స్‌ అన్నమాట. ఇంకా చాలామంది పెద్ద కవుల గీతాలకు కూడా నేను ట్యూన్స్‌ చేశాను. కానీ మా మామయ్య కృష్ణశాస్త్రి పాటలంటే నాకు ప్రత్యేక అభిమానం. పాటల్ని అర్థం చేసుకునే వయస్సు కాదు కానీ వాటికి బాగున్నాయనిపించేలా ట్యూన్స్‌ కట్టేదాన్ని. అలా అనుకోకుండా మ్యూజిక్‌ కంపోజర్‌ని అయ్యాను.

మామయ్య తనతోపాటు నవ్య సాహిత్య పరిషత్తులకు, బ్రహ్మసమాజ ఉత్సవాలకు కూడా తీసుకెళ్ళి నాచేత పాడించేవారు. ఓ పక్కన శాస్త్రీయ సంగీతం సాగుతూనే ఉంది. అదేమో గట్టి పునాదన్నమాట. గట్టి పునాదిపైన ఏం చేసినా నిలబడుతుంది. జానపద సంగీతానికి శాస్త్రీయ, ఔన్నత్యాన్నిచ్చి నాకు సహాయం చేసింది నా గాత్రం. ఇంకా చెప్పాల్సిందేంటంటే ఇందాక సంగీత త్రివేణి అన్నాను. ఈ మూడూ ఐక్యం అయిపోయి, ఒక్కోటి సముద్రంలో ఒక్కోచోట చేరే ఉపనదుల్లాంటివన్నమాట.

అన్ని సంగీతాలు ఒక్కటే, పాడే విధానాలు వేరు. కానీ ఏ సంగీతాన్ని పాడితే ఆ టైప్‌లో ఉండాలి. నేను ఆంధ్రాలో లలిత సంగీతం అనబడుతున్న భావగీతాన్ని ప్రథమంగా ప్రవేశపెట్టి పాడి ప్రచారం చేసిన వ్యక్తిని. అంతకుముందు లలిత సంగీతం మనకు లేదు. నాటక సంగీతం ఉండేది. పల్లెలకే పరిమితమై జానపద సంగీతం ఉండేది. కానీ ఈ లలిత సంగీతం లేదు. ఆ లలిత సంగీతం మొదలుపెట్టిన ప్రథమ వ్యక్తిని నేనే. మొదట జానపద సంగీతం, జానపద సంగీతానికి ఒక ప్రిస్టేజ్‌, సభార్హత, సభాగౌరవం తీసుకొచ్చినదాన్ని నేను. ఇంతకుముందు ఎవరైనా పాడారా? ఎవరైనా సభల్లో పాడారా? లేదు కదా?

నా చిన్నతనంలో కాకినాడలో మ్యూజిక్‌ కాంపిటీషన్స్‌ జరిగాయి. అప్పటికే బాగా పాడేదాన్ని. అప్పటికే కచేరీ లెవల్లో అన్నిచోట్లా పాడేసేదాన్ని. ఆ కాంపిటీషన్‌ పెట్టినపుడు ‘నిధి చాలా సుఖమా’ త్యాగరాయ కీర్తనని నాచేత బాగా ప్రాక్టీసు చేయించింది మా అమ్మ. మా అమ్మ వెంకటరత్నం. 80 ఏళ్ళ క్రిందటే ”అనసూయ” అనే స్త్రీల మాసపత్రిక నడిపింది.ఆ కాలపు కవయిత్రులు- కొటికలపూడి సీతమ్మగారు, ఆమె కుమార్తె చంద్రమతి, పాణకా కనకమ్మ, గుడిపూడి ఇందుమతీదేవి, జూలూరి తులసమ్మ, జ్ఞానాంబ, పిఠాపురం మహారాణి చిన్నమాంబ మొదలైనవారు, స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలు – గృహాలంకరణ, శిరోజాలంకరణ, వంటలు, కుట్టుపనులు, సాముద్రికం, ముగ్గులు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు మందులు, చిట్కాలు, పూజలూ, పునస్కారాలూ, రకరకాల అంశాలన్నీ ”అనసూయ” పత్రికలో ఆ రోజుల్లోనే ప్రచురించబడ్డాయి. కృష్ణశాస్త్రి పాటలు మేన్యుస్క్రిప్ట్‌గా ఉన్నప్పుడు, ఈ పత్రికలోనే ముందు ప్రచురించారు. ఆ కాలపు మరొక స్త్రీల మాసపత్రిక, బాలాంత్రపు శేషమ్మగారి ”హిందూసుందరి”.

మా అమ్మ జానపద సంగీతం అనుకుంటాను. మా నాన్నగారు శాస్త్రీయ సంగీతం. మా మామయ్య లలిత సంగీతం, వీళ్ళ ముగ్గుర్నీ అలా సంగీతంతో పోల్చుకుంటాను. సరే కాకినాడ ఫెస్టివల్‌లో ఏం జరిగిందంటే మా పక్కింట్లో నాకొక స్నేహితురాలు ఉండేది. వాళ్ళింట్లో గ్రామఫోన్‌లో ‘మొగుడొచ్చి పిలిచె…..’ పాట విని నేర్చుకున్నాను. నాకు ఏకసంధాగ్రాహి అని పేరుంది అప్పుడు. ఆ పాట నేర్చేసుకుని కొత్తపాటలంటే సరదా కదా ‘నిధి చాలా సుఖమా’ పాట మర్చిపోయి వాళ్ళడగ్గానే ఈ ‘మగడొచ్చి పిలిచెను’ పాడాను. జడ్జీలు అడిగారు అమ్మా నీకు త్యాగరాయ కీర్తన రాదా అని. అదీ వచ్చునండి అన్నాను. అయితే అది పాడు అన్నారు. సరే అది పాడాను. తర్వాత ప్రైజు వచ్చిందనుకోండి. కానీ ఈ ‘మగడొచ్చి పిలిచె’ పాట విని ప్రేక్షకుల్లో ఉన్న నండూరి జగన్నాధదరావుగారని జానపద పితామహుడు, నా గురువుగారు, మా నాన్నగారి దగ్గరకొచ్చి ‘నీ కూతురు పిట్ట కొంచెం కూత ఘనం. ఈ పిల్లకు నేను కొన్ని జానపదగీతాలు నేర్పించి పాడించుకుంటానయ్యా. నేను ఒక గ్రామఫోన్‌ రికార్డు కంపెనీ వారి కోసం పనిచేస్తున్నాను. మీ అమ్మాయిని నాతో మద్రాసు పంపించాలి.’ అని అడిగారు. మా నాన్న అన్నారట, చాలా చిన్నదండీ వాళ్ళమ్మ లేనిదే ఉండలేదు అంటే, సర్లే అందర్నీ తీసుకెళ్తా అన్నారట. మా నాన్నగారిని, మా అమ్మగార్ని, మా అన్నయ్యని, మా చెల్లెలు చిన్నపిల్ల, నన్ను అందర్నీ తీసుకెళ్ళాడాయన మద్రాసుకి. ‘అయ్యో కొయ్యోడా’ అని చాలా ఫేమస్‌ జానపద గేయం గ్రామఫోన్‌ రికార్డులో. ఆ పాటలో ఆయన కొయ్యోడు, నేను చిట్టెమ్మ. మాకు ఎంతో మంచి పేరు తెచ్చిన పాటది. ఈ పాటతోనే రోజులు మారాయి సినిమాలో వహీదా రెహమాన్‌ ”ఏరువాకా సాగారో” పాటతో పైకొచ్చింది.

అది నా మొదటి జానపద గేయం. ఆ తర్వాత ఎన్నో సోలోస్‌… అప్పుడు సీత లేదు. నేనే పాడేదాన్ని. నా జానపద గేయాలెన్నో చిన్నతనంలోనే రికార్డు చేశారు. అప్పుడు వాటిని జానపద గేయాలు అనేవారు కాదు. కామిక్‌ సాంగ్స్‌ అనేవారు. కానీ నా కలెక్షన్‌లో

ఉన్నవన్నీ జానపద గేయాలు. పండిత పిఠాపురం జగన్నాధరావు గారు నాకు పాటలు నేర్పించి పాడిస్తుండేవారు. చుట్టుపక్కల, మా పనివాళ్ళు, మా ముసలమ్మలు పాడే పాటలు, పెళ్ళిపాటలు, ఇవన్నీ నేర్చేసుకుని పాడేదాన్ని. అవన్నీ సరదా అన్నమాట. అంతేకానీ కచేరీల్లో పాడతానని గాని సభాస్థానం కల్పిస్తానని కానీ నేను అప్పుడు అనుకోలేదు. అలాంటిది అలా దాన్నొక ఉద్యమంగా చేపట్టాను. ఒక ప్రెస్టేజియస్‌ లెవెల్‌కి తీసుకువచ్చిన వ్యక్తిని నేను. ఓ 20 ఏళ్ళు సోలోగా పాడిన తర్వాత మా చెల్లెల్ని కలుపుకున్నాను. కలుపుకుని దానికి నేర్పించాను. 1961-62లో జానపద విభాగం ఆలిండియా రేడియోలో మొదలుపెట్టారు. నన్నడిగారు ప్రొడ్యూసర్‌గా ఉండమని. ఎంతిస్తారండి జీతం అని అడిగాను. 350 ఇస్తామన్నారు. ఒక కచేరీకి ఒక గంటసేపు పాడితే వెయ్యినూటపదహార్లు ఇస్తారండీ. నేనేమో నెల్లాళ్ళు కష్టపడి పనిచేస్తే 350 ఇస్తారా, నేను ఉద్యోగం చేయనండీ. నా టెంపర్‌మెంట్‌కి ఉద్యోగం సూట్‌ కాదని చెప్పా. తర్వాత నేనే మా చెల్లికివ్వండి అని సజెస్ట్‌ చేశా. మా చెల్లికిచ్చారనుకోండి. జానపద గేయాల్లో పాడే విధానాన్ని సృష్టించాను నేను. జానపద గీతాలు తీసుకుని మెరుగులు దిద్ది దాని నైజం చెడకుండా అందంగా పాడి విన్పించి, ప్రజలచేత బావుందనిపించుకున్నా.

లలిత సంగీత కచేరీల్లో మా నాన్నగారికేమో నాకు క్లాసికల్‌ వచ్చని తెలియపరచాలని ఉండేది. అందుకని రెండు కీర్తనలు ముందు పాడేదాన్ని. తర్వాత అంతా మా మామయ్య భావగీతాలు ఇతర కవుల పాటలు పాడేసేదాన్ని. ఇలా పాడుతున్నప్పుడు నాకు జానపదం గెయం ఎందుకు పాడకూడదు అనిపించింది. క్లాసికల్‌ సంగీతంలో జావళీలు పాడతారు. హిందుస్తానీ వాళ్ళేమో తుమ్రీలు పాడతారు. నేనొక జానపద ఎందుకు పాడకూడదు అనుకున్నాను. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. 1930-31లో రాజమండ్రిలో ఇది చాలా ముఖ్యమైన విషయమమ్మా. నాళం వారి సభలు జరిగేవి. నాళం కృష్ణారావుగారు అంటే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ నాన్నగారు. అప్పుడు నాళం లక్ష్మీకాంతమ్మగానే తెలుసు నాకు. ఆ రోజుల్లో నాళం కృష్ణారావుగారు సభలు జరిపేవారు. ఆ సభలో నా పాట కచేరీ పెట్టారు. లలిత సంగీతం కచేరీ. అప్పుడు క్రింద చాపలమీద కూర్చోవడమే, మైకుల్లేవు. నేను చాలాకాలం మైకుల్లేని రోజుల్లోనే పాడాను. క్యాసెట్‌ రికార్డింగ్‌ సిస్టమ్స్‌ లేవప్పుడు. అందుకే నా మంచి పాటలన్నీ రికార్డు అవలేదు. ఆ కచేరీలో మొదటిసారిగా ఒక జానపద గేయం పాడాను. ‘కోటిరత్నం ముద్దు కోమలాంగి’ అనే పాట పాడాను. ఆ సభలో కూర్చున్న ఒక కవయిత్రి, పేరు అవసరం లేదు లెండి. ఆవిడ లేచి మా అమ్మగారిని ఉద్దేశించి ”వెంకటరత్నమ్మగారూ, గొప్ప కవి కుటుంబంలో పుట్టిన మీరు మీ అమ్మాయి ఇంత అసభ్యమైన పాట పాడడానికి ఎలా ఒప్పుకున్నారు. మీరే దగ్గరుండి మీ అమ్మాయిచేత ఇలాంటి పాటలు పాడిస్తారా?” అంటే మా అమ్మ ముక్తసరిగా మాట్లాడడం తప్ప ఎక్కువ మాట్లాడదు. బుర్ర వంచుకునే ‘ఈ పాటలో నాకు జావళీలోనో, అష్టపదుల్లోనో, ఉన్నంత శృంగారం కూడా కనపడలేదు. చాలా మర్యాదగా చెప్పిన మాటలే అన్పిస్తున్నాయి’ అని చెప్పింది. ఇలా మా అమ్మ ఎప్పుడైతే నాకు బలమైన సపోర్టు ఇచ్చిందో ఆ ప్రోత్సాహంతోటి ఆ జానపద గేయాలు అప్పటి నుంచీ ఇప్పటివరకూ వదలలేదమ్మా. అంతేకాకుండా నాళం వారి సభ, కోమటి బోణి అంటారు. ఈ మాట అనొచ్చో లేదో తెలీదుగానీ వారి బోణి, వారి చలవ ఆ సభ. అప్పటినుంచి నేను వెనక్కి తిరగలేదు. ప్రతి సభలోనూ పాడేదాన్ని. ఒక్క సాంగ్‌తో మొదలుపెట్టిన నేను చాలా పాటలు పాడాను. తర్వాత మూడు గంటలు ఏకధాటిగా జానపద సంగీతంలోనే కచేరీ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ విధంగా చాలా ఏళ్ళు పాడిన తర్వాత మా చెల్లిని కలుపుకున్నాను. సంగీతంలో నేను పాడిన కచేరీలన్నీ అప్పటినుంచి ఇప్పటివరకు అన్నింటిలో పాటలు నేను ట్యూన్‌ చేసినవే. ఇంక జానపద గేయాలంటారా, నా స్టయిల్లో పాడిన పాటలు. నేను దానికొక ప్రత్యేక స్టైల్‌ సృష్టించాను. మా చెల్లికి కూడా అదే నేర్పాను. నాతో కూడా పాడిందంటే నా దగ్గర నేర్చుకునే పాడింది.

నేను లలిత సంగీత కచేరీలు చేయడానికి ఎన్నో ఊళ్ళు తిరిగేదాన్ని. అలా వెళ్ళిన ప్రతిచోటా జానపద గేయాలు సేకరించేదాన్ని. సరదాకే నేను పాడుకోవడానికి, నా ఇష్టం కొద్దీ. అందుకనే నేను ఊకదంపుడు పాటలొదిలేసి మ్యూజికల్‌గా ఉన్నవి మాత్రమే తీసుకునేదాన్ని. అందులో సంగీతం బాగా ఉండి ఇవి అనుకరించడానికి బావున్నాయి అని అనుకున్నవే తీసుకునేదాన్ని. అలా తీసుకున్న పాటల్ని అలంకరించి నా స్టైల్‌లో పాడేదాన్ని. నా గొంతుక ఫోక్‌ సాంగ్స్‌కి బాగా సూటవుతుంది. నేనిలా జానపద గీతాలు పాడుతుంటే మా మామయ్య అంతటి వాడికి కోపం వచ్చింది. తన పాటలు పాడడం తగ్గించి జానపద గేయాలు ఎక్కువ పాడుతున్నానని ఫీలయ్యేవాడు.

అప్పట్లో జనాలకు ఫోక్‌ సాంగ్స్‌ కొత్త. అలా వాళ్ళకి కొత్తగా ఉండేవి. కొత్తల్లో వాటిని ప్రజలు కోరుకుంటూ ఉంటారు కదా! శ్రీశ్రీ గారొచ్చేటప్పటికి విప్లవం పాటలు, మరో ప్రపంచం కవితని మహా ప్రస్థానం ఇంకా మాన్యుస్క్రిప్టుగా ఉన్నప్పుడే నేను ట్యూన్‌ కట్టి పాడాను. హెచ్‌.ఎం.టి. వాళ్ళు నా పాటల్ని గ్రామఫోన్‌ రికార్డు చేశారు నా ట్యూన్‌తో. 1935 ప్రాంతాల్లో అన్ని సభల్లో పాడేదాన్ని. మా కృష్ణశాస్త్రి మామయ్య గీతాలే కాకుండా నవ కవులందరి గీతాలు పాడేదాన్ని. విశ్వనాథ, అబ్బూరి, గురజాడ, రేగుల, శ్రీశ్రీ వంటి వారందరివీ పాడేదాన్ని. నాయని సుబ్బారావు పాటలూ పాడాను. తర్వాత నండూరి సుబ్బారావుగారు వీళ్ళందరి పాటలు తీసుకొచ్చి ట్యూన్‌ చేయమని నాకిచ్చేవారు. నేను వాళ్ళ పాటలకి ట్యూన్‌ కట్టి పాడేదాన్ని.

నా చదువు గురించి చెప్పాలంటే అదొక ఘట్టం నా జీవితంలో. సి.ఆర్‌.రెడ్డిగారు ఆంధ్రా యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌గా ఉండేవారు ఆ రోజుల్లో. ఆయనకి నా గొంతు, నా పాట చాలా ఇష్టం. పి.యు.సి.లో మ్యూజిక్‌ గ్రూప్‌ ఇవ్వమని అడిగాను ఆయన్ని. కుదరదు, ఈ గ్రూపులో ఇంకెవ్వరూ చేరరు, ఇవ్వను అన్నారాయన. ఆయన్ని ఎంతో ప్రాధేయపడి ఒప్పించి, ఆ గ్రూప్‌ సంపాదించుకున్నాను. ఆ గ్రూప్‌ ఇస్తూ నెక్స్ట్‌ ఇయర్‌కి స్టూడెంట్స్‌ ముగ్గురైనా లేకపోతే ఆ గ్రూప్‌ తీసేస్తానని అన్నారాయన. ఇంటర్మీడియట్‌లో కూడా మళ్ళీ మ్యూజిక్‌ అడిగాను. స్టూడెంట్స్‌ ఎవరూ లేకపోయినా ఒప్పుకున్నారు. అలా ఇంటర్మీడియట్‌లో మ్యూజిక్‌తో పాసయ్యాను. బి.ఎ.లో కూడా అడిగాను కానీ ఇవ్వలేదు. ఎకనామిక్స్‌, పాలిటిక్స్‌ తీసుకుని బి.ఎ. కంప్లీట్‌ చేశాననుకోండి.

అలా నేను మ్యూజిక్‌లో బి.ఎ. చేయలేకపోయాను. కాని నా దగ్గర బోలెడన్ని ఫోక్‌ సాంగ్స్‌

ఉన్నాయి. క్షేత్రయ్య పదాలు కూడా నా దగ్గర చాలా కలెక్షన్‌ ఉంది. నాకు ఆ రోజుల్లోనే క్షేత్రయ్య పదాల్లో గాని, జానపద గేయాల్లో గాని రిసెర్చి చెయ్యాలని ఉండేది. మద్రాసు యూనివర్శిటీ ప్రొఫెసర్‌ సాంబమూర్తి గారిని కలిసి నా రిసెర్చి గురించి చెప్పాను. ఆయన ఇంతవరకెవ్వరూ వీటిల్లో రిసెర్చి చెయ్యలేదు. దానిమీద చెయొచ్చు కదా అన్నారు. నువ్వు మ్యూజిక్‌ బి.ఎ. చేశావా అని అడిగారు. కాదండి నేను అడిగినా నాకివ్వలేదండి అని చెప్పాను. మ్యూజిక్‌ బి.ఎ.కు అనుమతి ఇవ్వలేదా! కొన్ని వందల సాంగ్స్‌ ఉన్నాయి. నీ దగ్గర స్పెషల్‌ ప్రొవిజన్‌ ఇవ్వలేదా అని అడిగి నువ్వు మళ్ళీ బి.ఎ.రాయి బావుంటుంది అని సలహా ఇచ్చారు. మా నాన్నగారు, అమ్మ ఏమన్నారంటే నువ్వు చాలా చేశావు. నీ చెల్లికి కూడా ఏదైనా చెయ్యి. దానిచేత బి.ఎ. చేయించు అన్నారు. నా సబ్జెక్ట్‌ సబ్జెక్ట్‌ అంతా దానికి దానమిచ్చాను. పిల్లని దత్తత ఇచ్చినట్లుగా సబ్జెక్టు అంతా సీతకిచ్చేశాను.

జానపద గేయాలు అంటే సీతే అనుకుంటారు తెలియని చాలామంది. కానీ జానపద గేయాలు ఫస్ట్‌ తీసుకొచ్చింది, సభల్లో ప్రవేశపెట్టింది నేను. తర్వాత జానపద గేయాలను ఆలిండియా రేడియోలో పరిచయం చేసినదాన్ని నేనే. 1938లో ఆలిండియా రేడియో ఓపెనింగ్‌కి పాడిన వ్యక్తిని నేను. అప్పుడు మా మామయ్య రాసిన పాటలు ‘అనార్కలి’ అనే నాటకంలో పాడాను నా మ్యూజిక్‌తో. ఆలిండియా రేడియోలో లలిత సంగీతం పాడింది నేను. నన్ను ఎంకరేజ్‌ చేసినవారు బాలాంత్రపు రజనీకాంతం గారు. ఆయన ప్రోత్సాహంతోనే ‘గోలకొండోయ్‌ గొలుగాకు పుల్ల’ అనే పాట తొలిసారిగా రేడియోలో పాడాను. అంతకు ముందు జానపద గేయాలను రేడియోలో ఎవ్వరూ పాడలేదు. ఆ తర్వాత ఎన్నో కచేరీలు చేశాను. యునెస్కో కోసం పాడిన పాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పాటలు నేను, మా చెల్లి కలిసి పాడాం. జానపద గేయాలకి మనుష్యులు కావాలి, గ్రూప్‌ కావాలి, వంత పాట కావాలి, పక్కన అనుకరిస్తూ ఉండాలి. నేనన్నది రిపీట్‌ చేస్తూ ఉండాలి. అంచేత దానికి మా చెల్లెలు సీత అవసరంగా ఉండేది.

ఆ తర్వాత 1977 నుంచి మా చెల్లెల్ని వదిలేసి నేనొక్కదాన్నే పాడుతున్నాను. అంటే 27 ఏళ్ళయింది మేమిద్దరం కలిసి పాడి. అంతే తప్ప మా చెల్లి విడిగా ఎప్పుడూ పాడలేదు.

రెండెళ్ళ క్రితం నాకు 80 ఏళ్ళు వచ్చిన సందర్భంగా నేను పాడకుండా ఇంకొకరిచేత పాడిస్తే ఎలా ఉంటుందో అని ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, మనోల చేత పాడించాను. పి.సుశీల చేత పెళ్ళి పాటలు ట్రై చేశాను. నేను ఇప్పటికి కూడా పాడగలను. మేము విజయవాడలో ‘హేమా పరిమి’ వాళ్ళ స్కూల్లో ‘జాబిల్లి పొదరిల్లు’ ప్లేస్‌ నాకు చాలా ఇష్టం. ఆ పొదరింట్లో ఒక కచేరీ చేసాను. నేను యాక్టివ్‌గానే

ఉన్నాను.

సంసార జీవితం, కళా జీవితం సమన్వయం కుదరడమనేది ఇంపాజిబుల్‌ ఎవరూ రెండింటినీ సక్రమంగా నడిపించలేరు. నేను కొంతవరకు సక్సెస్‌ఫుల్‌గా నడిపించగలిగానేమో అని అనుకుంటున్నాను. మా ఆయన పెద్దగా ఎంకరేజ్‌ చేయనూ చేయలేదు, డిస్కరేజ్‌ కూడా చేయలేదు. నేను అనుకున్నది సాధించుకోగలను. నాలాంటి ఒక ఆర్టిస్ట్‌ని తయారు చేయడానికి ఒక పదేళ్ళ నా జీవితం ధారపోస్తే నా కూతుర్ని తయారు చేయగలిగాను. రత్నపాప, తను డాన్సర్‌. ఇంటర్నేషనల్లీ ఫేమస్‌ డాన్సర్‌.

కొంతమంది అడుగుతున్నారు మీ ఇద్దరూ కలిసి ఎందుకు పాడడంలేదని. ఈ సమస్యను నేను పరిష్కరించదలచాను. ఈ పాటలన్నింటి ట్యూన్స్‌ నావి. అలాంటి నా పేరు బ్రాకెట్‌లో వేసి వాళ్ళు జానపద సంగీతం పాడారు అంటున్నారు. ‘వాళ్ళు’ కాదు నేను. ఆ మాట నేనెప్పుడూ గట్టిగా చెప్పుకోలేదు. తప్పు నాదై ఉండొచ్చు, కానీ ఇప్పుడు పోయే వయసొచ్చింతర్వాత నిజాన్ని బయట పెట్టాలని అన్పించింది మనసుకి. ఎందుకంటే ఇటీవల జరిగిన ఒక మీటింగులో నారాయణ రెడ్డి అంతటివారు సీతా అనసూయ కూతురు రత్నపాప అన్నారు. ఈ లలిత సంగీతం చేసినవాళ్ళు కూడా వాళ్ళే అన్నారు. అయితే కలిసి పాడామేమో తప్ప లలిత సంగీతాన్ని ప్రారంభించిందాన్ని నేను. జానపద సంగీతాన్ని ప్రారంభించిందాన్ని నేను. ముప్ఫై ఏళ్ళు నేను పాడింతర్వాత కదా ఈ విభాగం వచ్చింది. నా పాటలన్నింటినీ అన్ని సినిమాల్లోను అనుకరించారు. జానపద గేయాలు బంగారు గని లాంటివి. ఎంత తవ్వినా దొరుకుతూనే ఉంటాయి. వాటిని ఎన్ని రకాలుగానైనా మలుచుకోవచ్చు. అలాగే నేను ఎలా పాట పాడాలనుకుంటే అలా ట్యూన్‌ చేసుకుని సీతకు నేర్పేదాన్ని. నేను క్రియేటివ్‌ పర్సన్‌ని. నాకిష్టమైనట్లు పాటను మలచుకోగలను. అయితే సీతకు నేర్పడంవల్ల నాకు చాలా పరిమితులేర్పడేవి. ఇప్పుడలా కాదు, హాయిగా నాకిష్టమైనట్లు పాడుకోగలుగుతున్నాను. అంతేకాదు, అప్పటి రోజుల్లో కూడా రాగం పాడాలంటే నేనే, హమ్మింగ్‌ పాడాలంటే నేనే. పాట భాగంలో మాత్రమే సీత జాయినయ్యేది. అయితే విచిత్రం ఏమిటంటే, ఎక్కడ నేనిలా విడదీయాల్సి వచ్చిందంటే ఈ ఊళ్ళోనే చాలాచోట్ల నేను చేసిందానికి సీతకి క్రెడిట్‌ ఇచ్చారు. ‘మొక్కజొన్న తోటలో’ హమ్మింగ్‌ నేను పాడితే ఎంత బాగా పాడారండీ సీతగారూ అంటూ సీతకి ఒక సభవాళ్ళు ఆ హమ్మింగ్‌కి అవార్డు ఇచ్చారు. అప్పుడు తను మా అక్కయ్య పాడింది, నేనుకాదు అని అది చెప్పాలి కదా. చెప్పలేదు. సరే నేను పాడుకోలేకపోతే కదా. వాళ్ళకి నేను ఎస్సెట్‌, కానీ నాకెవరూ అక్కర్లేదు. నేను కావాలంటే వంత పాటకు లక్షమందిని తయారు చేసుకోగలను. ఇందుకోసమే నేను విడిగా పాడుకోవాల్సి వచ్చింది. అంతేకానీ దెబ్బలాటేమీ లేదు. ఆ తర్వాత కూడా తను చేసేవి తను చెప్పుకునేది. కలిసి చేసినవి మేము అని చెప్పుకునేది. రత్నపాప సీతా అనసూయల కూతురు అన్నారు నారాయణరెడ్డి గారు. నయమండి ఇంకేమీ అనలేదు కలిపి అందామనుకున్నాను. ఎప్పుడో అంటాను కూడా. అమెరికాలో ఇలాంటి సమస్యలొస్తున్నాయనే ట్విన్స్‌ ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు ఒక హెయిర్‌ స్టయిల్‌ పెడితే ఇంకొకళ్ళు ఇంకొక స్టైల్‌ పెడుతున్నారు. అంతా డిఫరెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు తప్పితే ఒకేలాగా ఉండాలనుకోవడం లేదు. ఇండియాలో అంతకు ముందు కూడా రాధాజయలక్ష్మి లాంటివాళ్ళు ఉన్నారు. అయితే సమానంగా, సమ ఉజ్జీలుగా, నువ్వో సగ భాగం పాడతావు, నేనో సగభాగం పాడతాను, స్వరకల్పన నువ్వోసారి వేస్తావు, నేనోసారి వేస్తాను అన్నట్లుండాలి.. అలా కాకుండా ఉత్తినే సగం క్రెడిట్‌ ఇచ్చేయడం కొంతకాలం నడుస్తుందలా. ఇష్టంకొద్దీ చేయడం, అభిమానం కొద్దీ, జాలి కొద్దీ చేస్తాం కానీ జీవితాంతం చేయడమనేది సాధ్యం కాని విషయం. దటీజ్‌ ద క్విజ్‌.. నేను సాల్వ్‌ చేసి చెప్పానిప్పుడు. ఈ విషయం మీరు రాయండి. ఇంతకుముందు కూడా ఎవరికో చెప్పాను, మీకు ధైర్యముంటే రాయండి అని. ఇది బయటకు రావాలి, రాయండి.

అమెరికాలో కూడా ఊరికే లేను. సంగీతం నేర్చుకోవడానికి చాలామంది వస్తుంటారు. పుస్తకాలు రాస్తున్నాను కదా! అదో జబ్బులా పట్టుకుంది రాయాలని. నిజం చెబుతున్నా. ఇటువంటివన్నీ జీవితంలో రకరకాల ఒత్తిడులు, దెబ్బలు తిని, ఒక ఇన్‌స్పిరేషన్‌ కలిగి, ఒక ఫైన్‌ మార్నింగ్‌ రాయాలన్పించేసింది. లేకపోతే ఎప్పుడైనా రాశానా నేను. నో, కానీ మామయ్య అనేవాడు వాసాలకి, దూలాలకి కూడా కవిత్వమబ్బుతుందే అని. అదేమిటో నాకు తెలియదు కానీ, ఆ వాతావరణంలో పెరగడం వల్లో ఏమో రాయాలనిపించి మొదలుపెట్టా. నేను రాసింది బావుందని అందరూ ఎంకరేజ్‌ చేశారు. నా పుస్తకాన్ని మా పెద్దల్లుడు (రత్నపాప భర్త) మెచ్చుకున్నాడు. వంగూరి చెట్టెన్‌ రాజు కూడా బాగా మెచ్చుకుని అతనే ఆ పుస్తకం పబ్లిష్‌ చేశాడు. ఇప్పుడు ఒక కొత్త పుస్తకం రాస్తున్నాను. ‘గతానికి స్వాగతం’ పేరుతో. జీవితంలో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చెప్పలేనివి, చెప్పగలిగినవి, జీవితంలోని పాలిటిక్స్‌ని రాయాలి. ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళ జీవితంలో ఎలా జరుగుతాయో, చెయ్యాల్సిన పనులు ఎందుకు చేయలేకపోతున్నామో రాయాలి. అందుకే ఆటోబయోగ్రఫీ అంటూ వేరుగా రాయడం లేదు. చిన్నకథల్లా పెట్టి రాస్తున్నాను.

హ్యూస్టన్‌లో మా పిల్లలందరూ కలిసి నా ఎనభయ్యవ పుట్టినరోజును చేశారు. అందరూ మాట్లాడి ‘అమ్మా నువ్వు కూడా మాట్లాడు’ అన్నారు. నేను చెప్పాను. ”నాకు పంచరత్నాలు నా పిల్లలు. కానీ అప్పుడప్పుడూ వీళ్ళు పంచభూతాలై పీడిస్తుంటారు. వాళ్ళు పుట్టకపోతే నేనూ మీరాబాయిలాగా సంగీతంలోనే ఉండిపోయేదాన్ని. ఎన్నో పుస్తకాలు రాస్తుండేదాన్ని. ఇంకెంతో చేసుండేదాన్ని’ అన్నాను. మర్చిపోయానమ్మా. నేను ఏడు పుస్తకాలు మ్యూజిక్‌ నొటేషన్‌తో చేశాను. ఎవ్వరూ చేయలేదు. ఇంత చేసినా ఎవరూ ఎందుకు నన్ను గురించి చెప్పరో, నా గురించి ఎందుకు రాయరో, నన్నెందుకు బ్రాకెట్‌లో పెడతారో, ఈ నిజాలెందుకు చెప్పరో నాకు అర్థం కావడం లేదు. బాలమురళీకృష్ణ ‘నీలో ఘనత చూసి అందరూ జెలస్‌గా ఫీలవుతున్నారు’ అని అన్నారు. అవునో కాదో నాకు తెలియదు కానీ నేను చేసిన మంచి పనుల గురించి ఎవ్వరూ సరిగ్గా రాసినవాళ్ళు లేరు. గిన్నిస్‌ బుక్‌లోకి రావలసిన వ్యక్తినమ్మా నేను. జానపద గేయాలు ఏడు పుస్తకాలు రాశాను. మ్యూజిక్‌ నొటేషన్స్‌తో రాశాను. సీతలాంటి వాళ్ళు రేడియో వాళ్ళ పుణ్యమా అని పాటలు సేకరించి పుస్తకాలు వేశారు. నాది అలా కాదు కదా, ట్యూన్స్‌తో ప్రిజర్వ్‌ చేయాలంటే ఆ నోటా ఈ నోటా విన్న పాటల్ని సేకరించి మ్యూజిక్‌ నొటేషన్స్‌తో, ఆ పాటలు ఏ రాగంలో ఉన్నాయి, ఏ తాళంలో ఉన్నాయి ఇవన్నీ చూసి రాయాలి. ఇదంతా పెద్ద రిసెర్చి గ్రంథం. ఈ రిసెర్చీకి నాకు సెంట్రల్‌ గవర్నమెంటు వాళ్ళు ఫెలోషిప్‌ కూడా ఇచ్చారు. స్త్రీల పాటల మీద వాళ్ళ కోసం ఐదు పుస్తకాలు రాశాను.కమలాదేవి ఛటోపాధ్యాయ నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ చైర్‌ పర్సన్‌గా ఉన్నప్పుడు నాకీ ఫెలోషిప్‌ను మూడేళ్ళు ఇచ్చారు.

ఎన్నోసార్లు నేను చేసిందానికి సీత పేరు వేసేవారు. డెబ్భై ఏళ్ళ క్రితం నేను చేసిన ‘జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ’ పాట నేనే చేశాననడానికి సాక్షులు నా క్లాస్‌మేట్‌, ఆంధ్ర మహిళా సభ సుగుణమణి, బాలాంత్రపు రజనీకాంతరావు, పాలగుమ్మి విశ్వనాథం వీళ్ళంతా సాక్ష్యమున్నారు. ఈ పాట నా పాటలన్నింటిలోకి చాలా పాప్యులర్‌. 70 సంవత్సరాల నుండీ ఇదే ట్యూన్‌తో పాడుకుంటున్నారు. నాకెంతో గర్వకారణం. ఇళయరాజా కూడా తన సినిమాలో ఈ ట్యూన్‌ని వాడుకున్నాడట. జానకి పాడిందట. నేను అతనిమీద కేసు వేద్దామనుకున్నాను కానీ ఆయనే నా ట్యూన్‌ చాలా బావుందనీ, అందుకే సినిమాలో కి తీసుకున్నామని థాంక్స్‌ చెబుతూ లెటర్‌ రాశారు. ఆయన అలా అన్న తర్వాత నేనింకేం మాట్లాడతాను. అలాంటి నా ట్యూన్‌ని కూడా సీతకు ఆపాదించిన పత్రికలున్నాయి. పయనీర్‌ సీతాదేవి, పయినీర్‌ ఇన్‌ లైట్‌ అండ్‌ ఫోక్‌ మ్యూజిక్‌ అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వాడు రాశాడు. నేను చాలా గొడవ కూడా చేశాను దీనిమీద. వాళ్ళచేత క్షమాపణ కూడా చెప్పించాను. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒకసారి మా సంగీతం గురువుగారు నువ్వు పాటలకి ట్యూన్స్‌ పెడతావట కదా! నేను స్వరస్థానాలిస్తాను. దానిలో ట్యూన్స్‌ పెట్టు. నాకెలా నమ్మకం, నా ఎదురుగా కూర్చుని పెట్టు, నీ కెంత సమయం కావాలో తీసుకో అన్నారు. శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మద్యమం, పంచమం, శుద్ధ దైవతం, శుద్ధ నిషాదం, వీటిని తీసుకుని ఏ పాటైనా ట్యూన్‌ చేయమన్నారు. అన్నీ శుద్ధమంటే అవన్నీ కోమల స్వరాలు… పేథటిక్‌గానైనా ఉండాలి, లేదంటే విన్నవించుకున్నట్టయినా ఉండాలి. చిన్న వయసైనా ఇవన్నీ నా మనస్సుకు అలవడ్డాయి. భావానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని. అది నాకొక గిఫ్ట్‌ అయిపోయింది. అలాంటి పాట కోసం మామయ్య పుస్తకాలన్నీ తిరగేశాను. అప్పటికే అన్నీ ఎగ్జాస్ట్‌ అయిపోయాయి. బసవరాజు అప్పారావు గారి పాటల పుస్తకం తిరగేస్తే ”యశోధర విలాపమని ‘లేపనైనా లేపలేదే, మోము చూపనైనా చూపలేదే’ అనే పాట కనబడింది. తక్షణం ఈ స్వరస్థానాలను ఉపయోగించి, అది ఏ రాగమో నాకు తెలియదు, అప్పటికి అంత నాలెడ్జి లేదు నాకు, ఒక ట్యూన్‌ పెట్టేశాను. అప్పుడు మా మాస్టారు చెప్పారు నేను ట్యూన్‌ చేసింది ‘కనకాంగి’ అని, మొదటి రాగమని. దిసీజ్‌ వన్‌ ఆఫ్‌ మై బెస్ట్‌ ట్యూన్స్‌.

నా ఎనభయ్యవ పుట్టిన రోజున నా కొడుకు బహుమతిగా టేప్‌ రికార్డరిచ్చి నా పాటలన్నీ రికార్డు చేయమన్నాడు. మొదలుపెట్టాలి. ఇంకో విషయం కూడా చెప్పాలమ్మా. మన మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ గారు మంచి సంస్కృత పండితులు. నేను ఢిల్లీలో అన్ని ఎంబసీల్లోను కచేరీలు చేశాను. రాష్ట్రపతి భవన్‌లో కచేరీ ఉంది. మా మామయ్యని సంస్కృతంలో ఒక పాట రాసివ్వమని అడిగాను. మామయ్య ఈ విషయంలో చాలా ఫేమస్‌. ఒక పట్టాన రాయడు. ఏడిపించుకు తింటే కానీ పాట పంపించడు. మేము రాష్ట్రపతి భవనానికి బయలుదేరుతుంటే పోస్ట్‌మేన్‌ ఆ పాట తెచ్చిచ్చాడు. ‘భారత రాష్ట్రపతీ, మీరు ధృతీ, సుకృతీ, మహామతి’ అనే పాట. అది చదువుతుంటేనే కారులో వెళ్తున్నప్పుడే నాకు ట్యూన్‌ వచ్చేసింది. సీతకు నేర్పించాను. ఊరికే నన్ను అనుకరించవే అన్నాను. సీత ట్యూన్‌ పట్టుబడితే పాడడమే కానీ మెయిన్‌ ట్యూన్‌ నేను పాడేదాన్ని. తీరా మేము రాష్ట్రపతి భవన్‌కి వెళ్ళాక మమ్మల్ని చాలా నిరుత్సాహపరిచారు. రాజేంద్ర ప్రసాద్‌ గారికి ఆస్త్మా ఉందట. ఆయనకి పాట నచ్చకపోయినా, ఆస్త్మా ఎటాక్‌ వచ్చినా లేచిపోతారట. నీకు ముందే చెప్తున్నాం అని చెప్పారు. అందుకని నేనేం చేశానంటే ప్రార్థన మానేసి భారత రాష్ట్రపతి పాట ముందే పాడేశాను. ఆయన ముఖం కళకళలాడిపోయింది. నవ్వుతూ ఆనందంగా విన్నారు. ఆయనకి దగ్గు రాలేదు. లేచి వెళ్ళిపోలేదు. మొత్తం ప్రోగ్రామంతా ఉన్నారు. చివరన మళ్ళీ ఆ పాట పాడించుకున్నారు. బ్రహ్మాండమైన ట్యూనొచ్చింది ఆ పాటకి.

సంసార బాధ్యతల వల్ల నేను చాలా పనులు చెయ్యలేకపోయాను. ఎన్నో చేసుండొచ్చు, కానీ చేయలేదు. ఇప్పుడు తొందరపడుతున్నాను. నా స్పాన్‌ ఆఫ్‌ లైఫ్‌ ఈజ్‌ వెరీ షార్ట్‌. ఐ లవ్‌ టు డు సబ్‌స్టాన్షియల్‌ వర్క్‌. నాకు ఒక్క నిమిషం వేస్ట్‌ అయితే లైఫ్‌ వేస్ట్‌ అయిపోతున్నట్టుంటుంది. టైమ్‌ ఈజ్‌ ప్రిషియస్‌ ఫర్‌ మి నౌ. టైంని సద్వినియోగం చేసుకోవాలి. నా పిల్లలేమో అమ్మా నువ్వు చాలా చేశావు. ఇంకా ఎందుకు తాపత్రయం. బయటకు వెళ్తావెందుకు. ఎక్కడైనా పడితే మేము చాలా బాధపడాల్సి వస్తుంది అంటారు. నాకేమో పాడాలని, మాట్లాడాలని ఇష్టం. ఇందుకోసం నాకు ఎక్కడలేని ఓపిక వస్తుంది. వాళ్ళకు తెలియదు. ఇట్స్‌ ఫుడ్‌ ఫర్‌ మి అని. ఐ గెయిన్‌ స్ట్రెంత్‌. వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు. వాళ్ళకు నేను తల్లిని మాత్రమే. ఆర్టిస్టుని కాదు.

నా దగ్గర 60 ఏళ్ళ నుంచి జాగ్రత్త చేసిన కరపత్రాలు, ఫోటోలు, కవుల పాటలు, రాజకీయ నాయకుల ఆటోగ్రాఫుల కలెక్షన్‌

ఉంది. నా మీద రాసిన పద్యాలు చాలా ఉన్నాయి. నా అవార్డులు కూడా ఒక రూమ్‌ రూమంతా పిడకలు వేసినట్లు నింపేసుకున్నాను. నా పిల్లలకు నా చివర కోరికగా ఏం చెప్పానంటే, నన్ను బాగా అలంకరించండి, నాకు ఎరుపంటే చాలా ఇష్టం. పర్‌ఫ్యూమ్స్‌ అంటే కూడా చాలా ఇష్టం. అటు, ఇటు తంబూరాలు మోగుతుండగా నన్ను ఆ అవార్డుల మధ్య పడుకోబెట్టమని, నేను వాటి మధ్యే పోవాలని పిల్లలకు చెప్పాను. ఇదే కాదు ఒకవేళ పళ్ళు గాని ఆర్టిఫిషియల్‌వి పెట్టుకోవలసిన అగత్యం వస్తే, నలుగురూ చూసేలోగా నా పళ్ళు తగిలించేయండి అని కూడా చెప్పాను (నవ్వు) పళ్ళు లేకుండా కనబర్చకండి, అసహ్యంగా ఉంటుంది అని ఆ కోరిక కూడా చెప్పేశాను.

నాది లవ్‌ మ్యారేజ్‌ కాదు కానీ, పెళ్ళి చేసుకోబడ్డాను కానీ నేను చేసుకోలేదు, నాకిష్టమైనవాడు, నాకు తగినవాడు ఇంతవరకు నాకు ఎదురుపడలేదు. సరదాకి నేను లవ్‌ చేద్దామన్నా ఎవరూ కనబడలేదు. నన్ను కోరుకుని పెళ్ళి చేసుకున్నారు, మా ఆయన నా వెంట పదేళ్ళు తిరిగి. ఎంతైనా మగాడు మగాడేనమ్మా! నా సంగీతం నచ్చి నా కచ్చేరీలలో ముందు వరుసలో కూర్చునేవాడు నా భర్త గిరి. వాహినీ వారి మొదట హీరో అతను. ఆయన బాగా పాడేవారు. నా పెళ్ళికి ముందు నా దగ్గర పాట నేర్చుకున్నారు. నా శిష్యుడాయన. ఆయన గొంతు చాలా బావుండేది. ఆంధ్రా సైగల్‌ అనేవారాయన్ని. పెళ్ళయిన తర్వాత మా గురువుగారు మునుగంటి వెంకట్రావు గారి దగ్గర రాగం, తానం, పల్లవి నేర్చుకునేదాన్ని. ఆయన దగ్గర కూర్చుని ప్రాక్టీసు చేస్తుండేదాన్ని. మా మాస్టారు రెండేళ్ళు నాతోనే ఉండి నాకు నేర్పించారు. నేను తంబూరా తీసుకుని కూర్చోవడమేమిటి, వెంటనే మా ఆయన డిస్టర్బ్‌ చేసేసేవారు. ‘కమాన్‌, కమాన్‌, లే, తయారవ్వు, పార్టీకెళ్ళాలి’ అని పిల్చేసేవారు. నేను వెళ్ళకపోతే కోపం వచ్చేసి రాత్రి 12 గంటలదాకా ఇంటికొచ్చేవారు కాదు. ఓ సందర్బంలో ‘నేనెక్కువా సంగీతమెక్కువా’ అని అడిగారు కూడా. ‘సంగీతమే ఎక్కువ’ అని చెప్పాలనిపించినా చెప్పలేకపోయాను. ధైర్యం చాల్లేదు. అంత సెల్ఫిష్‌ అయిపోతారు మగవాళ్ళు పెళ్ళయ్యాక. నేనెక్కువా, సంగీతమెక్కువా అని అడిగారంటే చూడండి. పైగా నా సంగీతం విని నన్న పెళ్ళిచేసుకుని కూడా. ఇటువంటి చిక్కులుంటాయమ్మా ఆర్టిస్టులకు. జీవితంలో నేనే కాదు నాలాంటి ఆర్టిస్టులెందరో వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు, కట్టడులు అనుభవించారు. ఆర్టిస్టులకు ఇదొక శాపం.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో