జెండర్‌ ఏమిటో తెలుసుకుందాం -కమలా భాసిన్‌

(గత సంచిక తరువాయి)

ఇంతకుముందు అందరూ ”అభివృద్ధిలో స్త్రీలు” అనేవారు. ఇది ”జెండర్‌, అభివృద్ధి”గా ఎందుకు మారింది?

మొదట చాలామంది అభివృద్ధిలో స్త్రీలను సమగ్రపరచాలని అనేవారు. ఇది అభివృద్ధిలో స్త్రీల విధానం అని పిలవబడింది. స్త్రీల మౌలిక అవసరాలను తీర్చడం, అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి స్త్రీల సంప్రదాయ నైపుణ్యాలను, సామర్ధ్యాలను ఉపయోగించుకోవడం దీని ఉద్దేశం. అయితే అభివృద్ధిలో స్త్రీ విధానాలు, కార్యక్రమాలు స్త్రీల పరాధీనత, అణచివేతలను ఎదుర్కోవడం లేదనీ, అభివృద్ధి ఆలోచనలోనూ, కార్యక్రమాలలోనూ పేదలకు వ్యతిరేకమైన ధోరణులను ప్రశ్నించడం లేదనీ వెల్లడయింది.

1980లలో దృష్టి స్త్రీల నుండి జెండర్‌కి మారింది. స్త్రీల సంక్షేమం, మౌలిక అవసరాలు, సామర్ధ్యాల నుంచి స్త్రీల సాధికారీకరణకు విధానం మారింది. స్త్రీల పరాధీనతకు మూలకారణమైన పితృస్వామ్య వ్యవస్థను ఎదుర్కోవడం దీని ఉద్దేశం. కేవలం స్త్రీలపై దృష్టి కేంద్రీకరించడం సరిపోదు, అందులోను సమస్యలున్నాయని వాదించారు. స్త్రీలపై దృష్టి కేంద్రీకరించడంతో స్త్రీలే సమస్య అన్న భావం కలిగించింది; ఆ సమస్యను సరిచేస్తే పరిస్థితులు మెరుగుపడతాయ్న భావం కలిగింది. స్త్రీల పరిస్థితి, హోదా మెరుగుపరచాలన్నా, అభివృద్ధిలో వారిని భాగస్వాముల్ని చేయాలన్నా స్త్రీల పరాధీనతకు కారణాలు అర్థం చేసుకోవడం తప్పనిసరని; స్త్రీలను పరాధీనులుగా అణిచివేయబడి ఉంచుతున్న సామాజిక వ్యవస్థను (పితృస్వామ్యాన్ని) పరిశీలించాలని తరువాత భావించసాగారు. సమస్య స్త్రీలు కాదనీ, స్త్రీ, పురుషుల హక్కులు, బాధ్యతలు; వారి పని, అవకాశాలు వంటి వాటిని నిర్ణయించే సామాజిక, సాంస్కృతిక నిర్వచనమని జెండర్‌ సిద్ధాంతం నొక్కి చెప్పింది. స్త్రీలు ఇలా ఉండడానికి సామాజిక వ్యవస్థ కారణం. స్త్రీల హోదా పెరగాలంటే సామాజిక వ్యవస్థ, అది ఇచ్చిన నిర్వచనం మారాలి. జెండర్‌ని చూడడం అంటే పురుషులను కూడా చూడాలి; స్త్రీలను విడిగా అర్థం చేసుకోవడం సాధ్యంకాదు. విభిన్న సమాజాలలో జెండర్‌ ఎలా నిర్మితమయ్యిందో, ఎలా కొనసాగుతుందో పరిశీలించాలి; జెండర్‌ సంబంధాలను, జెండర్‌ ఆధారిత పని విభజనను, జెండర్‌ తారతమ్యాలను పరీక్షించాలి. అన్నింటికంటే ముఖ్యంగా జెండర్‌ సంబంధాలలోని అధికారాలను పరిశీలించి, ఎదుర్కోవాలి.

”అభివృద్ధి అన్నది జెండర్‌ న్యూట్రల్‌ కాదని గుర్తించడంతో సైద్థాంతిక అవగాహన స్త్రీ నుంచి ‘జెండర్‌’కి మారింది. శారీరక నిర్మాణంలోని తేడాలను చూడటం కంటే సమాజ నిర్మిత అసమానతలను పరిశీలించాలంటూ జెండర్‌ సిద్ధాంతం ముందుకు వచ్చింది. స్త్రీలు, పురుషులను విడివిడిగా చూడడం నుంచి జెండర్‌ సిద్ధాంతం అసమాన సామాజిక వర్గాలుగా విభజింపబడిన సామాజిక సంబంధాలను చూడడానికి ద్ణృష్టి మళ్ళింపచేసింది. జెండర్‌ సంబంధాలనేవి విస్తృత సామాజిక సంబంధాలలో భాగం. అన్ని సామాజిక సంబంధాలలో లాగానే ఇవి కూడా నియమ నిబంధనలు, ఆచరణల ద్వారా, వనరుల కేటాయింపు ద్వారా, పనులు, బాధ్యతలు కేటాయించడం ద్వారా, విలువలను ఆపాదించడం ద్వారా, అధికారాన్ని సమీకరించడం ద్వారా నిర్మితమవుతాయి. కుటుంబంలోనూ, సమాజంలోనూ ముఖ్య అంశాలైన అధికార తారతమ్యాలైన జెండర్‌ సంబంధాలు పరిగణనలోకి తీసుకుంటాయి” – మధు సరీన్‌.

”జెండర్‌ నిపుణులు” అందరూ దాన్ని అనుసరించకపోయినప్పటికీ జెండర్‌ అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఈ కింది అంశాలకు ప్రాముఖ్యతనివ్వాలని మేం భావిస్తున్నాం.

స్త్రీ, పురుషుల భాగస్వామ్యం, వారు సాధించిన అంశాలు శారీరక తేడాల వల్ల కాకుండా సమాజం నిర్దేశించిన జెండర్‌ పాత్రల ఫలితం.

కేవలం స్త్రీలను పరిశీలించి, మారిస్తే సరిపోదు. జెండర్‌ సంబంధాలను, జెండర్‌ ఆధారిత పని విభజనను కూడా పరిశీలించి మార్చాలి. స్త్రీల పరిస్థితి, స్థాయి మార్చాలంటే ఆ మేరకు పురుషుల పరిస్థితి, స్థాయి, పాత్రలు కూడా మారాలి. ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వాటి మధ్య అధికార సంబంధాలు కూడా ఉన్నాయి.

స్త్రీల స్థితిని మార్చాలంటే పితృస్వామ్య నిర్మాణాలను, సిద్ధాంతాలను సవాలు చెయ్యాలి. జెండర్‌ పరాధీనత కారణంగా స్త్రీలపై ప్రత్యేక దృష్టి కొనసాగాలి.

జెండర్‌ సంబంధాలను, తారతమ్యాలను వేరుగా అధ్యయనం చెయ్యలేం. కులం, వర్గం, జాతి, ఉత్తర-దక్షిణ (ప్రపంచ) సంబంధాల నేపథ్యంలో వీటిని అర్థం చేసుకోవాలి.

స్త్రీలు సాధికారీకరణ చెంది, వారిని పరాధీనులుగా ఉంచే సిద్ధాంతాలు, వ్యవస్థను నిర్మూలించాలని ఇప్పుడు అంతటా గుర్తించారు. అన్ని స్థాయిలలో అన్ని సంస్థలలో నిర్ణయాలు తీసుకోవడంలో స్త్రీలు సమాన భాగస్వాములుగా ఉండాలి. అభివృద్ధి కార్యక్రమాలు, విధానాలలో వాళ్ళు కేవలం లబ్దిదారులుగా ఉంటే సరిపోదు.

స్త్రీలకి, అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలో ఈ మార్పును (ప్రధానంగా) మహిళా పరిశోధకులు, అధ్యయనకారులు విశ్లేషించి, వర్గీకరించి పేరు పెట్టారు. గత మూడు దశాబ్దాలలో అనుసరించిన విధానాలను ”అభివృద్ధిలో స్త్రీ”, ”స్త్రీలు-అభివృద్ధి”, ”జెండర్‌ అభివృద్ధి”గా పేరు పెట్టారు. ప్రపంచంలోని అత్యధిక సంఖ్యాకుల పట్ల, ప్రకృతి పట్ల లోతైన విశ్లేషకులు, ప్రణాళికాకారులు, విధాన నిర్ణేతలు వ్యవహరిస్తున్న తీరుతో అసంతృప్తి చెందిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది స్త్రీ, పురుషులు కింది నుంచి ప్రభావితం చేసిన ధోరణులను ఈ పేర్లు తెలియచేస్తాయి. అధిక సంఖ్యాకులకు వారి ముందున్నది మరింత ‘ప్రగతి’ కాదు, మనుగడ. 1980, 90లలోని వ్యవస్థాగత మార్పుల కార్యక్రమాలు, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వల్ల పేదల మనుగడకు ఆధారంగా ఉన్న కొద్దిమాత్రపు ప్రకృతి వనరులపైన కూడా వాళ్ళు నియంత్రణ కోల్పోయారు. ప్రపంచ సహజ సంపద అధిక సంఖ్యాకుల చేతుల్లో కాకుండా అతి కొద్ది కంపెనీల చేతుల్లో ఉంది. వాటిని నియంత్రించి, దోచుకునే అధికారం, లాభాలు దండుకోవడమే ఈ కంపెనీల ఉద్దేశ్యం. 1960లతో పోలిస్తే చాలా దేశాల్లో ప్రస్తుతం పేదల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ‘ప్రణాళికా బద్ధ అభివృద్ధి’ సాధించిపెట్టిన ఫలితం ఇది.

గత రెండు దశాబ్దాల కాలంలో దాదాపు 100 దేశాలలో ఉంటున్న 16 కోట్ల ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయింది.

ప్రగతి అంటే చాలామందికి ఉద్యోగం లేకపోవడం, గళం విప్పలేకపోవడం, మూలాలు లేకపోవడం, భవిష్యత్తు లేకపోవడంగా మారింది. – యు.ఎన్‌.డి.పి., మానవ అభివృద్ధి నివేదిక, 1996.

ప్రజాసంస్థలు, ఉద్యమాలు (స్త్రీలు, పర్యావరణం, మానవహక్కులు, స్వచ్ఛంద సంస్థల ఉద్యమాలు వంటివి) అభివృద్ధి ఆలోచనా విధానాన్ని ప్రశ్నిస్తున్నాయి. కుల, వర్గ, జాతి, జెండర్‌ తారతమ్యాలను సవాలు చేస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఆలోచనా విధానాలను, ఆచరణలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. అభివృద్ధిలో స్త్రీల సిద్ధాంతాన్ని తిరిగి రూపొందించడం వీటిల్లో ఒకటి. నికారుగ్వలో విప్లవం తర్వాత స్త్రీల ఆచరణాత్మక జెండర్‌ అవసరాలను తీర్చడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ వ్యూహాత్మక ప్రయోజనాలు తీర్చే ప్రయత్నం జరగలేదని ఫెమినిస్ట్‌ పరిశోధకురాలైన మాక్సిన్‌ మాలిన్యూక్‌ పేర్కొంటున్నారు. ఫలితంగా స్త్రీల పరిస్థితులలో మార్పు వచ్చినప్పటికీ, పురుషులతో సంబంధాలలో మార్పు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరిశీలన కారణంగా స్థితి, స్థాయి, ఆచరణాత్మక జెండర్‌ అవసరాలు, వ్యూహాత్మక జెండర్‌ ప్రయోజనాలు, పరాధీనత, సాధికారీకరణ, స్వతంత్ర ప్రతిపత్తివంటి సిద్ధాంతాలు రూపొందాయి.

పోషణ స్థాయి, ఆరోగ్యం, మౌలిక అవసరాల అందుబాటు, విద్య వంటి భౌతిక పరిస్థితులను స్త్రీల స్థితి తెలియజేస్తుంది. ఆహారం, ఆరోగ్య సేవలు, విద్య వంటివి అందించటం వల్ల దీనిని మెరుగుపరచవచ్చు.

స్త్రీల స్థాయి అంటే సమాజంలో పురుషులతో పోలిస్తే వారికి ఉండే హోదా, స్థాయిని అంచనా వేయటానికి సమాజంలో జెండర్‌ సంబంధాలను, లేదా స్త్రీ,పురుషుల మధ్య అధికార సంబంధాలను పరిశీలించాలి. స్త్రీల స్థాయి మెరుగు పడాలంటే ప్రస్తుతం ఉన్న నియమాలు, నిర్మాణాలు, స్త్రీ-పురుషుల మధ్య అధికార సంబంధాలు మారాలి.

ఆచరణాత్మక జెండర్‌ అవసరాలు అంటే స్త్రీల స్థితికి సంబంధించినవి. వీటిని తేలికగా గుర్తించగలం. (ఆహారం, పరిశుభ్రమైన నీరు, మందులు, గృహనిర్మాణం); ఇవి ప్రస్తుత జెండర్‌ ఆధారిత పని విభజనకు సంబంధించినవి. స్త్రీలు పిల్లల సంరక్షణ, గృహ అవసరాలు, పశువుల బాధ్యతలు చేపడతారు కాబట్టి నీళ్ళు, వంట చెరకు, పశుగ్రాసం వంటివి అవసరమని చెబుతారు. ఆచరణాత్మక జెండర్‌ అవసరాలు ప్రస్తుత అధికార సంబంధాలను మార్చాలనుకోవు కాబట్టి వాటికి ఉద్దేశించిన కార్యక్రమాలు, పనులను ఎవరూ అభ్యంతర పెట్టరు.

వ్యూహాత్మక జెండర్‌ ప్రయోజనాలు సమాజంలో స్త్రీల పరాధీన స్థాయికి సంబందించినవి; ప్రస్తుతం ఉన్న తారతమ్యాలను తొలగించి వాటిని మరింత సమానంగా మార్చడానికి ఉద్దేశించినవి. స్త్రీలు సంఘటితం కావటం ద్వారా నిర్ణయాలు తీసుకునే స్థాయిలోకి ప్రవేశించడం ద్వారా, వివక్షత చూపే ఆచరణలను, నియమ, నిబంధనలను మార్చడం ద్వారా జెండర్‌ సంబంధాలను మార్చడం వ్యూహాత్మక జెండర్‌ ప్రయోజనాల ఉద్దేశం. విద్య, చైతన్యం పెంచడం, సమీకరించడం, సంఘటితపరచడం, నాయకత్వ, యాజమాన్య నైపుణ్యాలను పెంపొందించడం వంటివి స్త్రీల వ్యూహాత్మక జెండర్‌ ప్రయోజనాలను సాధిస్తాయి. పురుషాధిపత్యాన్ని సవాలు చేసి, జెండర్‌ సంబంధాలలో దీర్ఘకాలిక మార్పులను కోరతాయి. కాబట్టి ఈ ప్రయత్నాలకు వ్యతిరేకత ఉంటుంది. అయితే ఈ పనులు సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. స్త్రీల స్థితిని మార్చేదాన్ని బట్టి వారి స్థాయిలో జెండర్‌ సంబంధాలలో మార్పు తీసుకురావచ్చు.

చెప్పటం తేలికే! తరతరాలనాటి ఆలోచనలు, దృక్పథాలు, ప్రవర్తనా తీరులను ఎలా మారుస్తారు? స్త్రీ, పురుషుల మధ్య అధికార పునః విభజన ఎలా జరుగుతుంది?

వీటన్నింటినీ, ప్రత్యేకించి అధికార సంబంధాలను మార్చటం నిజంగానే తేలిక కాదు. మార్పు కోసం ప్రణాళిక తయారుచేసి, మార్పును తీసుకురావలసిన సంస్థలే – అవి ప్రభుత్వ సంస్థలైతేనేమి, స్వచ్ఛంద సంస్థలైతేనేమి చాలా వరకు పితృస్వామ్యంగా ఉంటాయి. ఈ సంస్కృతి ప్రభావంతో ఏర్పడినవే కాబట్టి స్త్రీల సంఘాలు – స్త్రీలు కూడా పితృస్వామ్య ఆలోచనా ప్రభావం నుంచి తప్పించుకోలేరు. నిజమైన సామాజిక మార్పులు రావాలంటే ఆలోచనా విధానంలో, సంస్థల నిర్మాణంలో, విధానాలలో, అభివృద్ధి ప్రణాళికల తయారీలో, అమలులో తీవ్ర మార్పులు రావాలి.

పితృస్వామ్య ఆలోచనలను, దృక్పథాలను, నిర్మాణాలను, సంస్థలను మార్చడానికి విభిన్న స్థాయిలలో ప్రపంచ వ్యాప్తంగా ఎందరో స్త్రీ, పురుషులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.

– పాఠశాలలో బోధనాంశాలను విశ్లేషించి వాటిని మరింత జెండర్‌ సమానంగా మార్చారు.

– ప్రసార సాధనాలలోని పితృస్వామ్య వివక్షతలను ఎత్తిచూపి మీడియాలో సెక్సిజంను ఏరివేయడానికి చట్టాలు, నిబంధనలు, మార్గదర్శక సూత్రాలను తయారుచేశారు; అలాగే స్త్రీల అవసరాలు, ఆశయాలు, విజయాలు మీడియా ప్రతిఫలించేలా చేశారు.

– చట్టాలను సునిశితంగా పరిశీలించి వాటిని మరింత జెండర్‌ సమానంగా చేశారు.

– జెండర్‌ దృష్టితో పరిశోధన చేపట్టేలా స్త్రీల దృక్పథం నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను విశ్లేషించేలా స్త్రీ, పురుషులను తయారుచేసే ఉద్దేశంతో స్త్రీ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేశారు.

– జాతీయ లక్ష్యాలు, జెండర్‌ అంశాలను దృష్టిలో పెట్టుకునేలా ప్రయత్నాలు చేశారు; జెండర్‌ సంబంధాలలో మార్పుల కోసం ప్రణాళికలు తయారుచేసేందుకు వీలుగా స్త్రీల ప్రత్యేక గణాంక వివరాలను సేకరించారు.

– జెండర్‌ అసమానతలను అర్థం చేసుకునేందుకు, జెండర్‌ అంశాలకు స్పందించేలా చేసేందుకు, జెండర్‌ అసమానత పట్ల నిబద్ధత కలిగించేందుకు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రణాళికలు తయారు చేసేవారికి, మేనేజర్లకు, శిక్షకులకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు వందలాది శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించారు. ఇటువంటి వర్క్‌షాప్‌లను పోలీసు సిబ్బంది, మీడియా వ్యక్తులు, న్యాయాధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నిర్వహించారు.

– జెండర్‌ అంశాలను గుర్తించేలా, జెండర్‌ సంబంధాలను మార్చేలా కార్యక్రమాలు, ప్రణాళికలను విశ్లేషించడానికి మార్గదర్శక సూత్రాలు, చెక్‌లిస్టులు, చట్రాలు తయారుచేశారు.

– సమానత్వం వైపు పయనంలో ప్రగతికి ప్రణాళికలు తయారు చేయడానికి, దాన్ని పర్యవేక్షించడానికి ఐక్యరాజ్య సమితి, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక యూనిట్లను, కేంద్రాలను, శాఖలను, కమీషన్లలను ఏర్పాటు చేశాయి. 1985 నాటికి 90 శాతం సభ్య దేశాలు స్త్రీల స్థాయిని పెంపొందించడానికి వ్యవస్థాపక సంస్థలను, విధానాలను రూపొందించాయి.

– జెండర్‌కి సంబంధించిన పలు అంశాలపై పనిచేయడానికి దాదాపు అన్ని దేశాలలో స్త్రీల సంఘాలు ఏర్పడ్డాయి. అనేక దేశాలలో స్త్రీల ప్రచురణలు, సినిమాలు, కళలు, నిర్మాణ కళ, వార్తా పత్రికలు, పత్రికలు విజయవంతమయ్యాయి.

కొన్ని ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కీలకమైన బాధ్యతలలో స్త్రీలను నియమించి, అందుకు వారికి శిక్షణనివ్వడానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చాయి. తమ సంస్థలు, విధానాలు, నియమాలు, పని సంస్కృతి, స్త్రీలకు అనుకూలంగా ఉండేలా కృషి చేశాయి. జెండర్‌ సమానత, స్త్రీల సాధికారీకరణకు ఉద్దేశించిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయనటానికి ప్రత్యేక జెండర్‌ సూచికలు తయారుచేశారు.

జెండర్‌ అవసరాలకు అభివృద్ధి, మరింతగా స్పందించడానికి ప్రభుత్వ విధానాలు ప్రస్తుతం స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, తమ హక్కుల గురించి చైతన్యం కలిగించడం, ఆర్థిక కార్యక్రమాలకు, ఉపాధికి శిక్షణ ఇవ్వడం వంటి గుణాత్మక అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. రుణాలు లేదా చిన్న మొత్తాలలో పెట్టుబడి అందించడం, మార్కెటింగ్‌, నైపుణ్యాలు, యాజమాన్యం, సాంకేతిక విజ్ఞానాలలో శిక్షణ వంటి వాటిల్లో మద్దతుతో పాటు వ్యక్తిగత లేదా జాయింట్‌ పట్టాల ద్వారా చెట్లు, ఇళ్ళు, భూమి వంటి కీలక ఉత్పాదక వనరులు స్త్రీలకు అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్త్రీల సాధికారీకరణను సాధించడానికి స్త్రీల సంఘాలనున ప్రోత్సహించడం సరైన వ్యూహమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు.

జెండర్‌ సమానతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలలో రాజ్యాంగానికి చేసిన 73వ సవరణ బాగా చెప్పుకోదగినది. దీనిద్వారా రాజకీయ రంగంలో స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికయ్యే సీట్లలో మూడింట ఒక వంతు స్త్రీలకు రిజర్వు చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలలో అట్టడుగు స్థాయిలో పదిలక్షల మంది స్త్రీలు నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది. వీరిలో 75,000 మంది ఛైర్‌పర్సన్‌లు ఉంటారు. స్త్రీల సాధికారీకరణకు ప్రభుత్వం ముసాయిదా జాతీయ విధానాన్ని కూడా రూపొందించింది. పార్లమెంటులోనూ, శాసనసభలోనూ స్త్రీలకు రిజర్వేషన్‌పై చర్చ కొనసాగుతోంది.

జెండర్‌ అంశాలకు స్పందన, జెండర్‌ అంశాలకు స్పందించేలా చేయటం అంటే అర్థం ఏమిటి?

వివిధ వ్యక్తులు ఈ పదాలను వేరువేరు అర్థాలలో ఉపయోగిస్తున్నారు. అనేక సమాజాలలో స్త్రీలు పరాధీనులుగా

ఉన్నారనీ, ఈ పరాధీనత కేవలం స్త్రీలు, బాలికలకే కాకుండా పురుషులకూ, బాలురకూ, మొత్తం సమాజానికీ హానికరం అనేది గుర్తించడం జెండర్‌ అంశాలకు స్పందన అనవచ్చు. స్త్రీలు, పురుషులు భిన్నంగా ఎందుకు ప్రవర్తిస్తారో, వారి అవసరాలు, అంశాలు ఏమిటో గుర్తించడమవుతుంది. విభిన్న విధానాలు, పథకాలు స్త్రీ, పురుషులపై ఏ విధంగా ప్రభావం చూపుతాయో అర్థం చేసుకోవడం కూడా అవుతుంది. ప్రణాళికల తయారీలో జెండర్‌ అంశాలకు స్పందించడమంటే స్త్రీలను నిర్లక్ష్యం చేసి వారిని పట్టించుకోకపోవడం కాకుండా స్త్రీల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారిని భాగస్వాములని చేయడానికి, వారి సాధికారీకరణకు ప్రత్యేక ప్రయత్నాలు చేసేలా ప్రణాళికలు తయారుచేయడమవుతుంది. క్లుప్తంగా జెండర్‌ సంబంధాలను మార్చడమవుతుంది.

జెండర్‌ శిక్షణలిచ్చే ఫెమినిస్టుల ప్రకారం జెండర్‌ పట్ల స్పందించటమంటే జెండర్‌ అంశాలను అర్థం చేసుకోవటమే కాకుండా పితృస్వామ్యాన్ని, దానితో సంబంధం ఉన్న కుల, వర్గ, జాతి, ఉత్తర-దక్షిణ (ప్రపంచాల) తారతమ్యాలను సవాల్‌ చేయడం కూడా. సంస్థలలో అన్ని స్థాయిలలో జెండర్‌కి స్పందన ఉండాల్సిన అవసరముందని నమ్ముతున్నాం. ”వ్యక్తిగతమూ రాజకీయమే” అన్న ఫెమినిస్టుల నినాదంతో అంగీకరిస్తూ జెండర్‌కీ స్పందించటమనేది ప్రతి ఒక్కరితో, కుటుంబాల నుంచి, సంస్థల నుంచి మొదలవ్వాలని నమ్ముతున్నాం. జెండర్‌, పితృస్వామ్యం వంటి సిద్ధాంతాలను అర్థం చేసుకోవటమే కాకుండా ఈ అవగాహనను మన ఆలోచనా, మన ప్రవర్తనా విధానాలను మార్చుకోవటానికి ఉపయోగించాలి. కేవలం అర్ధం చేసుకున్నంత మాత్రాన సామాజిక వాస్తవాలు, సామాజిక సంబంధాలు మారిపోవు. వ్యక్తుల ప్రవర్తన, ఆలోచనల్లో మార్పుల వల్లనే సమాజం మారుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే, జెండర్‌ అంశాలకు స్పందించటమంటే మన అవగాహనను అంతర్గతం చేసుకుని, దానిని మన ప్రవర్తనకు అన్వయించుకోవాలి. జెండర్‌ సంబంధాలను మార్చటమంటే సిద్దాంతమూ-ఆచరణ; వ్యక్తిగతమూ-జనజీవనం; వస్తుగతమూ-విషయగతం; హేతుబద్థమూ-ఉద్వేగాల మధ్యనున్న అంతరాలను నిర్మూలించటమే. జెండర్‌ అంశాలకు స్పందించటమంటే స్త్రీలను ‘జన (పురుష) జీవన స్రవంతి’లో కలపటం కాదు. జనజీవన స్రవంతిని ఫెమినిస్టు దృక్పథం నుంచి పరిశీలించటం. అది పితృస్వామ్య భావాలు, అసమానతతో ఉండి అస్థిరమైనది అయితే దాంట్లో చేరటానికి బదులు దాన్ని సవాలు చేసి, మార్చాల్సిన ఆవశ్యకత ఉంటుంది.

జెండర్‌ అంశాలకి స్పందించటమంటే మానవజాతిలో స్త్రీలు సగం మంది కాబట్టి ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ అన్ని అంశాలను స్త్రీల అంశాలుగా గుర్తించటమే.

అదేవిధంగా స్త్రీల అంశాలుగా పిలవబడుతున్నవి (వరకట్నం, అత్యాచారం, బూతు సాహిత్యం, స్త్రీ భ్రూణ హత్య, స్త్రీ శిశుహత్య, వంటివి) కేవలం స్త్రీల అంశాలే కాదు, సమాజం మొత్తానికి సంబంధించిన అంశాలివి. చాలాకాలంగా ఈ అంశాల పట్ల కేవలం స్త్రీలు, స్త్రీల సంఘాలు మాత్రమే పనిచేస్తుండడం దురదృష్టకరమైన విషయం. అయితే స్పందన గల కొంతమంది పురుషులు ఈ అంశాలకు విరుద్ధంగా ‘అత్యాచారానికి వ్యతిరేకంగా పురుషులు’, ‘స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా పురుషులు’ వంటి సంఘాలను ఏర్పాటు చేయటం సంతోషించదగ్గ విషయం.

జెండర్‌ అంశాలకి స్పందించటం, జెండర్‌ సమానత అంటే సంస్థలలో, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలలో స్త్రీల సమాన భాగస్వామ్యం ఉండడం తప్పనిసరి. దీనితోపాటు సంస్థల సంస్కృతి, ఆచరణలలో కూడా మార్పులు రావాలి. ఉదాహరణకు చాలా స్వచ్ఛంద సంస్థలు మరింత ఎక్కువమంది స్త్రీలను ఉద్యోగాల్లో తీసుకుంటున్నప్పటికీ వారి సంస్థల సంస్కృతి ప్రధానంగా పురుష పద్ధతులను అనుసరిస్తూ ఉంటుంది; కొన్నిసార్లు స్త్రీలకు వ్యతిరేకత కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి సంస్థలో ఉపయోగించే భాషను, చెప్పుకునే జోకులను, పాడే పాటలను, ఒకరి వేషధారణపై చేసే వ్యాఖ్యానాలు వంటి వాటిని సునిశితంగా పరిశీలించాలి.

చాలా స్వచ్ఛంద సంస్థలలో సీనియర్‌ మేనేజర్లు ప్రతిరోజూ ఎక్కువ గంటలు పనిచేయాలని, వారాంతపు శెలవల్లో కూడా పనిచేయాలని, ప్రయాణాలు చేయాలని ఆశిస్తాయి. ఇంటివద్ద బాధ్యతలు ఉండే స్త్రీలు ఈ విధంగా పనిచేయడం వీలు కాకపోవచ్చు. ఫలితంగా మేనేజీరియల్‌ స్థానాల్లో వాళ్ళు చేరరు. కాబట్టి స్త్రీలు మరిన్ని ఎక్కువ గంటలు పనిచేయాలని అనవసర ఒత్తిడి పెట్టే బదులు పురుషులు మరింత సమయం ఇంటి దగ్గర గడపాలని, తండ్రిగా, జీవిత భాగస్వామిగా, కుటుంబ సభ్యునిగా తమ పాత్రలు, బాధ్యతలపై మరింత శ్రద్ధ వహించాలని స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాలి. పురుషుల ప్రవర్తన, పనులలో ఖచ్చితమైన మార్పుల ఆధారంగానే అసమాన జెండర్‌ సంబంధాలలో నిజమైన మార్పులు తీసుకురాగలుగుతాం. స్త్రీల అంతులేని, మళ్ళీ మళ్ళీ చెయ్యాల్సిన, గుర్తింపు లేని ఇంటిపనిని పంచుకోవటం ద్వారా మాత్రమే పురుషులు స్త్రీలను అర్థం చేసుకోగలుగుతారు, అభినందించగలుగుతారు, సహాయపడగలుగుతారు.

ఇంటిపని, బయటి ఉద్యోగం రెండూ చేయాల్సిన స్త్రీల పరిస్థితిని అర్థం చేసుకోవడం కూడా జెండర్‌ అంశాలపట్ల స్పందించటమే. పనిభారం రెట్టింపుగా ఉండడమే కాకుండా స్త్రీలు, ప్రత్యేకించి మేనేజిరియల్‌ స్థానాల్లో ఉన్నవాళ్ళు రెండు రకాల ప్రవర్తనా తీరుల మధ్య నలిగిపోతుంటారు. మేనేజర్‌గా ఉన్న స్త్రీ కఠినంగా, ప్రశాంతంగా, హేతుబద్ధంగా, పోటీతత్వంతో మొత్తం పరిస్థితులు తన అదుపులో

ఉండేలా ప్రవర్తించాలని ఆశిస్తారు. కానీ అదే స్త్రీ ఇంటి వద్ద భార్యగా, తల్లిగా అణిగిమణిగి ఉండాలని, సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని, స్వార్ధ త్యాగం చేయాలని ఆశిస్తారు. పురుష మేనేజర్లు ఈ విధమైన ద్వైదీ భావాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఉండదు.

అంతిమంగా చెప్పాలంటే, జెండర్‌ అంశాలకు స్పందించడమంటే సున్నితంగా ఉండడం, సంరక్షణ బాధ్యతలు చేపట్టటం; స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు, అన్యాయాలు ఎక్కడ ఎదురైనా వాటిని వ్యతిరేకించటం.

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.