పభుత్వాలు అభివృద్ధి చేయాల్సింది బళ్ళనా? గుళ్ళనా? – కొండవీటి సత్యవతి

 

ఈ మధ్య పేపర్‌లో ఒక వార్త కనబడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ముక్తేశ్వరం అనే ఆలయానికి 100 కోట్లు, మీరు సరిగ్గానే చదివారు ఒకటి కాదు… పది కాదు… వంద కోట్లు కేటాయిస్తామని చెప్పారని ఆ వార్త సారాంశం. ఒక ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ ధనాన్ని ఎలా కేటాయిస్తారనే ప్రశ్న పక్కన పెడితే వంద కోట్లంటే చాలా పెద్ద మొత్తం. ఇప్పటికే యాదగిరి గుట్ట అభివృద్ధి పేరుతో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇదేమీ హిందూ మత రాజ్యం కాదు. మతాతీత లౌకిక రాజ్యం. రాజ్యాంగం చెప్పిన సెక్యులర్‌ అంటే రాజ్యానికి మతముండకూడదు. రాజ్యం మతాతీతంగా ఉండాలి. ఒక మతానికి సంబంధించిన గుళ్ళకి వందల కోట్ల ప్రజాధనాన్ని, ప్రజలు చెమటోడ్చి సంపాదించి, ప్రజోపయోగ కార్యక్రమాలకి ఖర్చు చెయ్యమని కట్టిన పన్ను సొమ్మును ఒక మతానికి చెందిన ఆలయాలకు ఎలా కేటాయిస్తారు? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అలా అని చర్చిలు, మసీదుల అభివృద్ధి పేరుతో కూడా ఖర్చు చెయ్యకూడదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చిన పాలకులకు ఈ విషయం తెలియదనుకోకూడదు. తెలుసు. నా ఇష్టం. నన్నడిగిటోడు ఎవడు? అనే అభిజాత్య ధోరణికి ఇది పరాకాష్ట అనుకోవాలి.

సరే… ఆ విషయం పక్కనపెడితే… ముక్తేశ్వరాలయ అభివృద్ధికి వంద కోట్లు అనే వార్త చదవగానే నాకు వెంటనే హాజీపూర్‌ గుర్తుకొచ్చింది. హాజీపూర్‌లో ఒక వ్యవసాయ బావిలో శవాలైన ముగ్గురు ఆడపిల్లలు గుర్తొచ్చారు. హాజీపూర్‌ దుర్ఘటనకి, ముక్తేశ్వర ఆలయానికి లింక్‌ ఏమిటి? మీరు మరీను. అనిపిస్తోంది కదా! వస్తున్నా… అక్కడికే వస్తున్నాను. హాజీపూర్‌లో ఉండే ముగ్గురమ్మాయిలు చదువు మీద ప్రేమతో, నిర్మానుష్య రోడ్ల మీద నడుస్తూ స్కూళ్ళకి వెళ్ళేటపుడు ఒక కామాంధుని వలలో చిక్కి, అత్యాచారాలకి, హత్యలకు బలై ఒక వ్యవసాయ బావిలో శవాలై తేలినప్పుడు మేము కొంతమందిమి కలిసి నిజనిర్ధారణకి హాజీపూర్‌ వెళ్ళాం. ఏం చూశాం?

కారు దిగిన చోట దట్టంగా పెరిగిన బ్రహ్మజెముళ్ళ పొదలు, ఆ పొదలకటూ, ఇటూ రెండు బావులు, మట్టి రోడ్డు, బండలు, మనిషి జాడ కన్పించని నిర్మానుష్య పరిసరాలు. ఆ బ్రహ్మ జెముళ్ళ పొదలు, దాని వెనుక బావులు చూడగానే నా గుండె ఝల్లుమంది. వ్యక్తం చెయ్యలేని దుఃఖమేదో మనసంతా కమ్మేసింది. ముగ్గురు పసిమొగ్గలు అనుభవించిన హింస వారి ఆర్తనాదాలు ప్రతిధ్వనించసాగాయి. బావి దగ్గరకు వెళుతుంటే నా కాళ్ళు ఒణికాయి. బావి లోపలికి ఒంగి చూడాలంటే నా కళ్ళకు నీళ్ళు అడ్డం పడ్డాయి. ఒక కామాంధుడి ఘోర కృత్యానికి, వాడు పెట్టిన హింసకి ఎంత తల్లడిల్లి ఉంటారో అనే భావన కడుపులో తిప్పినట్టయింది. అతి కష్టం మీద ముగ్గురమ్మాయిల శవాలను వెలికి తీసిన రాతి బావుల్లోకి తొంగి చూసి, చూడలేక అక్కడ గుమిగూడిన యువతతో కలిసి గ్రామంలోకి వెళ్ళడానికి కారెక్కాం. అతుకుల, గుంతల మట్టిరోడ్డు. కారు కిందిగి, మీదికి ఊగుతుంటే నడుముల్లో నొప్పి మొదలైంది కారులో ఉన్నవాళ్ళకి. అంత అధ్వాన్నంగా ఉంది రోడ్డు. దారి పొడుగునా ఇళ్ళేమీ లేవు. నిర్మానుష్యం. వీథి దీపాలు కూడా లేవని మాతో వచ్చిన కుర్రాళ్ళన్నారు. అంటే… ప్రతి రోజూ, ఈ నిర్మానుష్య దారుల్లో ఒంటరిగా పిల్లలు స్కూలుకో, కాలేజికో వెళ్ళాలి. ఒకటో, రెండో చెదురు మదురుగా వచ్చే బస్సులు పిల్లల స్కూల్‌ టైమ్‌లకి అనుగుణంగా ఉండేవి కావు. అప్పుడప్పుడూ ఊరి వాళ్ళ మోటార్‌ సైకిళ్ళ మీద వెళ్ళడం పిల్లలకి, పెద్దలకి అలవాటే. బొమ్మల రామారానికో, మరింకెక్కడికో వెళ్ళాలంటే చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరికీ నడకే శరణ్యం. లేకుంటే లిఫ్ట్‌లడిగి ఊరి కుర్రాళ్ళ బళ్ళమీద వెళ్ళడం మామూలే. శ్రీనివాసరెడ్డి అనే కిరాతకుడు దీనిని ఉపయోగించుకుని, ముగ్గురమ్మాయిల్ని బండి మీద ఎక్కించుకుని మెయిన్‌ రోడ్డుమీద దింపేవాడు. ఆ ఊరికి బస్‌ లేకపోవడం వల్ల పిల్లలు మన ఊరివాడే కదా అనే నమ్మకంతో బండెక్కి, అతని బీభత్స హింసకి బలైపోయారు.

హాజీపూర్‌కి రోడ్లెందుకు వెయ్యలేదు. బస్సులెందుకు నడపలేదు. వీథి దీపాలెందుకు ఏర్పాటు చెయ్యలేదు. ఈ మూడు బాధ్యతల్ని ప్రభుత్వమో, పంచాయితీనో సక్రమంగా ఏర్పాటు చేసి ఉంటే ఈ రోజు ఒకే ఊరి నుండి ముక్కుపచ్చలారని ముగ్గురు ఆడపిల్లల్ని వ్యవసాయ బావులకు బలిచ్చేవాళ్ళం కాదు కదా! నిజానికి ఇది ఒక్క హాజీపూర్‌ సమస్యే కాదు… ఇలాంటి గ్రామాలు… రోడ్లు, రవాణా సౌకర్యాలు, అందుబాటులో విద్యాసంస్థలు లేని గ్రామాలు వేలల్లోనే ఉండి ఉంటాయి. ఈ సమస్యల వల్లనే కాదు పాఠశాలల్లో టాయిలెట్‌లు ఉన్నా వాటిని శుభ్రం చేసేవాళ్ళుండరు, కొన్నిచోట్ల ఈ అన్ని కారణాల నీళ్ళే వల్ల అమ్మాయిలు మధ్యలోనే చదువులాపేయవలసిన దుస్థితిలోకి నెట్టివేయబడుతున్నారు. చదువులాగిపోయి ఇంట్లో ఉండడం వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

గుళ్ళ అభివృద్ధికి వందల కోట్లు ధారబోసే బదులు ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఎందుకు అభివృద్ధి పరచరు? గ్రామాల్లో రోడ్లెందుకు వెయ్యరు? బస్సులెందుకు నడపరు? అమానుషంగా, అమానవీయ రీతిలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురాడపిల్లలు అత్యాచారాలకి, హత్యలకి బలైతే… ప్రభుత్వం నించి రావాల్సిన స్పందన ఏంటి? మేం ఆడపిల్లల భద్రత కోసం, వారి చదువుల కోసం సకల చర్యలూ తీసుకుంటాం, ఇదిగో వీటి కోసం ఇన్ని కోట్లు కేటాయిస్తున్నాం అని చెప్పకుండా… ఒక్క గుడి అభివృద్ధికి వంద కోట్లిస్తామంటే ఏమనాలి? బిడ్డల్ని కోల్పోయిన హాజీపూర్‌ బాధితులు న్యాయం చేయాలని మండుటెండల్లో రోడ్లమీద కూర్చుని ధర్నా చేస్తుంటే వాళ్ళను ఓదార్చి, పలకరించని ప్రభుత్వాధినేత ఓ గుడికి కోట్లిస్తానని ప్రకటించడం అన్యాయమే కాదు, అమానుషం. తెలంగాణ బిడ్డల భద్రత, వారి చదువు సంధ్యలకన్నా గుళ్ళో రాళ్ళే ముఖ్యమని అన్యాపదేశంగా చెప్పినట్లే కదా! ఈ దృక్పథం ఆడపిల్లల అభివృద్ధికి, వారి చదువు సంధ్యలకి, వారి హక్కుల అమలుకి పెద్ద అడ్డంకి అవుతుంది. గుళ్ళు, ఆరాధనా స్థలాల వ్యక్తిగతమైనవి. ప్రభుత్వానికి ఏమి సంబంధం? కానీ ఆడపిల్లల విద్య, భద్రత, వారి హక్కుల రక్షణ ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యతే, ఈ విషయంలో రెండోమాటకి తావులేదు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.