‘జహీరాబాద్’ విద్యార్థులు రాసిన కథలు
– డి.కవిత, తొమ్మిదవ తరగతి, శాంతతినికేతన్ విద్యాలయం,
– ఎస్.పాండు, ఏడవ తరగతి, శాంతినికేతన్ విద్యాలయం
– పి.శ్రీధర్, ఐదవ తరగతి, విశ్వభారతి విద్యాలలయం
– ఎస్.దీపిక, ఆరవ తరగతి, యూనిక్ ట్యాలెంట్ స్కూల్
– ఎ.కార్తీక్, ధైబడ్స్ స్కూల్.
ఒక ఊరిలో వినోద్ అనే ధనవంతుల కుటుంబానికి చెందిన అబ్బాయి ఉండేవాడు. ఎప్పుడూ ఖరీదైన బట్టలు వేసుకునేవాడు. ఒకరోజు వినోద్ బడికి వెళ్తున్నపుడు దారిలో ఒక అబ్బాయి కనిపించాడు.. వాడు వినోద్‌ని చూసి నవ్వుతూ నా పేరు శీను, మేము ఈ వీథిలోకి కొత్తగా వచ్చాం. నేను మీ స్కూలులోనే చదువుతున్నాను అని చెప్పాడు. శీను వేసుకున్న నలిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు వినోద్‌కి ఏ మాత్రం నచ్చలేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముఖం పక్కకు తిప్పుకుని గబగబా నడుస్తూ బడికి వెళ్ళిపోయాడు.
వినోద్ స్కూలుకి వెళ్ళిన కాసేపటి తర్వాత శీను కూడా వెళ్ళాడు. వాడిని చూస్తూనే వినోద్ చికాకు పడ్డాడు. అయితే మాస్టారు అడిగిన ప్రశ్నలకు శీను టకటకా సమాధానాలు చెప్తుంటే వినోద్ ఆశ్చర్యపోయాడు. వీడికి కూడా తెలివితేటలు ఉన్నాయా అనుకున్నాడు.
ఇంటికి వెళ్ళిన తర్వాత వినోద్ తల్లితో శీను గురించి ఎగతాళిగా చెప్పాడు. అప్పుడు ఆమె, అందరూ ఒకేలాగా ఉండరు. వాళ్ళకు డబ్బు లేదని తక్కువగా చూడడం తప్పని చెప్పింది. మరుసటి రోజు వినోద్ స్కూలుకి వెళుతున్నపుడు దారిలో ఒక చెట్టు కొమ్మ విరిగి అతని మీద పడబోయింది. వెనకే వస్తున్న శీను వినోద్ చెయ్యి పట్టుకుని పక్కకు లాగాడు. దానితో వినోద్‌కు ప్రాణాపాయం తప్పింది. శీను మంచితనం ఏమిటో వినోద్‌కు అర్థమయ్యింది. తను ఎంతో చులకనగా చూసినప్పటికీ అది మనసులో పెట్టుకోకుండా తన ప్రాణాలు కాపాడాడు. దాంతో శీనుకి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా తన ప్రవర్తన పట్ల క్షమాపణలు కూడా కోరాడు వినోద్. అప్పటినుంచీ వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు.