జెండర్ సిద్ధాంతాన్ని ఉపయోగించటం వల్ల స్త్రీల సాధికారీకరణకు చెప్పుకోదగిన విధంగా తోడ్పడిందా?
సిద్ధాంతాలన్నవి ప్రధానంగా విశ్లేషణకు ఉపయోగపడే పరికరాలు; సూత్రీకరణలు, మన అభిప్రాయాలను, సామాజిక వాస్తవికతను మరింతగా క్రమబద్ధంగా పరిశీలించుకుని, స్పష్టపరచుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి వాటంతట అవే వాస్తవాలను మార్చలేవు. కానీ వాస్తవాల పట్ల మన అవగాహనను మార్చి, ఆ విధంగా దాని నిర్మాణానికి దోహదపడతాయి. స్త్రీ, పురుషులనేది శారీరకంగా ఏర్పడిన వర్గాలే కాకుండా సమాజ నిర్మిత వర్గాలని స్పష్టపరచటమే జెండర్ సిద్ధాంతం చేసే పని.
అయితే ఈ సిద్ధాంతంలో కొన్ని సైద్ధాంతిక సమస్యలున్నాయన్నది కొంతమంది ఫెమినిస్టుల అభిప్రాయం. మరియా మీస్ ప్రకారం సెక్స్, జెండర్‌ల మధ్య విభజన ‘ప్రకృతి’ నుంచి ‘సంస్కృతి’ని వేరుచేసే విధానాన్ని అనుసరిస్తుంది. ఈ రకమైన విభజన పాశ్చాత్య ఆలోచనా విధానంలో చాలాకాలంగా ఉంటూ వస్తోంది; దీని ప్రభావం చాలా దారుణంగా ఉంది. ఆధునిక విజ్ఞానశాస్త్రం వృద్ధి చెందిన నాటి నుంచి స్త్రీ స్థానాన్ని ప్రకృతితో పాటు కేటాయించారని ఆమె అంటారు. మానవ సెక్స్, లైంగికత ఎప్పుడూ శారీరక అంశాలుగా లేవు. కాబట్టి సెక్స్, జెండర్ అన్న విభజన సమస్యాత్మకంగా మారుతుంది. జెండర్ మాదిరిగానే సెక్స్ కూడా సాంస్కృతిక, చారిత్రక వర్గం. సెక్స్, జెండర్ అని రెండుగా విభజించటం ద్వారా, ఒకదానిని శారీరకమైనదిగానూ, రెండవ దానిని సాంస్కృతికమైనదిగాను పరిగణించటం ద్వారా మానవులలో లైంగిక తేడాలు శరీర నిర్మాణం ఆధారంగా రూపుదిద్దుకున్నవన్న లేదా భౌతికమైనవన్న అభిప్రాయానికి ఆస్కారం
ఉంటుంది.
శరీర నిర్మాణం రాజకీయ, తాత్విక ప్రాముఖ్యతలను తిరిగి పరిగణించాలని మరికొంత మంది అభిప్రాయం. వారి దృష్టిలో జెండర్ అన్నది కొంతవరకు సెక్స్ ఆధారంగా నిర్ధారితమవుతుంది. కాబట్టి సెక్స్‌కి సంబంధించిన కొన్ని అంశాలు రాజకీయంగా సరైనవి కావచ్చు. ఉదాహరణకు స్త్రీల శరీర నిర్మాణం కారణంగా పిల్లల్ని కనటం వంటి ప్రస్ఫుట అంశాలలో స్త్రీల అవసరాలు అప్పుడప్పుడూ పురుషుల అవసరాల కంటే భిన్నంగా ఉండవచ్చు.
అయితే ఈ సైద్ధాంతిక విభేదాల కంటే ఈ రోజు జెండర్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తున్న విధానంలో చాలా సమస్యలున్నాయి.
”జెండర్ వ్యవహారాల్లో” మీకు ఎదురైన సమస్యలేంటి?
ఈ రోజు జెండర్ అన్న పదం లేకుండా స్త్రీలపై వర్క్‌షాప్, పత్రం, వ్యాసం, ఉపన్యాసం ఉండడం లేదు. ఈ పదం పట్ల
ఉత్సాహం ఉన్నంతగా అవగాహన ఉండటం లేదు. ఫలితంగా దానిని ఉపయోగించకూడని సందర్భాలలో ఉపయోగిస్తున్నారు. దురుపయోగం చేస్తున్నారు. తప్పు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఉదాహరణకు సెక్స్ (స్త్రీ, పురుష) నిష్పత్తికి బదులు జెండర్ నిష్పత్తి అన్న పదం ఉపయోగిస్తున్నారు. అలాగే సెక్స్ ఆధారంగా (ప్రత్యేకంగా స్త్రీలకు) సేకరించిన గణాంకాలు అనటానికి బదులు జెండర్ ఆధారంగా సేకరించిన గణాంకాలు అని ఉపయోగిస్తున్నారు.
ఈ సిద్ధాంతాన్ని నిజంగా అర్థం చేసుకోకపోవటం వల్ల ఈ విధమైన గందరగోళం ఏర్పడుతోంది, దురుపయోగం జరుగుతోంది.
బంగ్లాదేశ్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక వృద్ధ సామాజిక కార్యకర్తను మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించగా ‘నేను జెండర్’ కోసం పనిచేస్తున్నాను అన్నారు. బహుశా అతని ఉద్దేశం స్త్రీల అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని కావచ్చు. స్త్రీల సాధికారీకరణ, స్త్రీల స్వయం ప్రతిపత్తి, స్త్రీల అభివృద్ధి వంటి పదాలకు బదులు జెండర్ సమానత, సమానత్వం వంటి పదాలను ఉపయోగిస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వీటిని వ్యాఖ్యానాలిచ్చుకుంటున్నారు. ఇటువంటి అభిప్రాయాలు ఎంత బలంగా ఉన్నాయంటే ఒక సీనియర్ అభివృద్ధి నిపుణుడు ఒకసారి నాతో ఇలా అన్నాడు.”జెండర్, జెండర్ అంశాలకు స్పందించడం అంటూ రాద్ధాంతం చేస్తారెందుకు? జెండర్ అంటే ఏమిటో ప్రతి ఒక్కరికీ తెలుసు; అందరి బట్టలు విప్పేస్తే కనపడేదే జెండర్”. పాపం అతనికి అసలు విషయం ఆవగింజంతైనా అవగతం కాలేదు. మన నగ్న శరీరాలకంటే మన బట్టలే జెండర్ గురించి ఎక్కువ వెల్లడి చేస్తాయని అతడు గుర్తించలేదు!
ఈ పదం ఉన్నట్లుండి ఇంతగా ఆదరణ పొందటానికి కారణాలేమిటి?
స్త్రీ, పురుషుల గురించి ఆలోచింపచేసి, వారి మధ్య సంబంధాలను పరిశీలించేలా చేస్తుంది కాబట్టి జెండర్ అన్న పదాన్ని ప్రచారం చేశారు. అయితే జెండర్ అన్న పదం ఉపయోగిస్తున్న చాలామంది కేవలం స్త్రీల గురించే మాట్లాడుతున్నారు. లేదా కేవలం స్త్రీల కోసమే, స్త్రీలతోనే, స్త్రీలపైనే పనిచేస్తున్నారు.
ఈ పదం న్యూట్రల్ కాబట్టి; అంటే స్త్రీ, పురుషులిరువురిని ఉద్దేశించటం వల్ల ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి దీనిని చాలామంది ఉపయోగిస్తున్నారు. ”స్త్రీల సాధికారీకరణ”, ”పితృస్వామ్యం” వంటి పదాలతో పురుషులు ఇబ్బంది పడినట్లు ఈ పదంతో ఇబ్బంది పడరు. కానీ చాలామంది ఫెమినిస్టులకు ఈ పదం న్యూట్రాలిటీనే ఇబ్బంది కలిగిస్తుంది. జెండర్, లేదా జెండర్ సంబంధాలు అన్న పదాలు ఆ సంబంధాల స్వభావం గురించి ఏమీ చెప్పవు. ఉదాహరణకు జెండర్ అసమానతలు అంటే స్త్రీలు పరాధీనులు, అసమానులు అని అర్థం కాదు. జెండర్ల మధ్య అసమానతలు ఉన్నాయని మాత్రమే ఇది చెబుతుంది.
ఫెమినిజం అంటే సానుభూతి లేనివాళ్ళు, దానిని వ్యతిరేకించే వాళ్ళతో సహా అన్ని రకాల ప్రజలు ఈ పదాన్ని వాడడం ఆశ్చర్యమేమీ కలిగించదని మరియా మీస్ అంటారు. ‘లైంగిక హింస’ అన్న పదానికి బదులు ‘జెండర్ హింస’ అనటం వల్ల ఇది ఒక ూపర్‌తీaష్ పదంగా అయిపోయి, మరీ అంత దారుణంగా అనిపించదు; అంతేకాకుండా దీనివల్ల రాజకీయ బాధ్యతల గురించి ప్రస్తావన లేకుండా ఒక శుద్ధ చర్చగా మిగులుతుంది.
స్త్రీల పరాధీనత అన్న పదం వల్ల కూడా ఎవరు పరాధీనతకు గురయ్యారు, ఎవరు అంచులకు నెట్టివేయబడ్డారు అన్నది తెలియదు, అలాగే ఎవరిపై దృష్టి కేంద్రీకరించాలో కూడా తెలియదు. అలాగే స్త్రీల సాధికారీకరణ అన్నది కూడా చాలా అస్పష్టమైన పదమవుతుంది.
పితృస్వామ్యం (ఇది జెండర్ అన్న పదానికి ప్రత్యామ్నాయం కాదు, కాని ఈ పదం వాడుక రాను రాను తగ్గిపోతోంది) అన్న పదం న్యూట్రల్ కాదు. జెండర్ సంబంధాలను అంటే పురుషుల నియంత్రణలో ఉన్నది, పురుషుడు నిర్దేశిస్తున్న ప్రపంచంలో ఉన్నామని తెలియజేస్తూ జెండర్ సంబంధాల స్వభావాన్ని నీళ్ళు నమలకుండా స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ పురుష ప్రపంచ వివరాలను జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరంం ఉంది; అయితే ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరికి అధికారం పంచిపెట్టాలి అన్నది స్పష్టంగా ఉంటుంది.
జెండర్ అన్న పదం న్యూట్రల్ కాబట్టి చాలా గందరగోళం సృష్టిస్తోంది. అది ఏమిటో, ఎందుకు ప్రవేశపెట్టబడిందో, ఎలా ఉపయోగించాలో చెప్పకపోవటంతో ప్రజలు తమ సొంత ఆలోచనలకు అనుగుణంగా దీనిని ఉపయోగిస్తున్నారు. ”జెండర్ సెల్ కదా, మరి స్త్రీ ఇన్‌ఛార్జిగా ఉన్నారేమిటి?”, ”జెండర్ వర్క్‌షాప్‌లో పురుషులు ఎందుకు లేరు?”, ”జెండర్ శిక్షకులలో పురుషులు ఎందుకు లేరు?” వంటి ప్రశ్నలడిగే అనేకమంది పురుషులు ఉన్నారు. జెండర్ గురించి మాట్లాడుతున్నామని నిరూపించుకోవటానికీ, పురుషులను వెలివేయకుండా ఉండటానికి ప్రతి దాంట్లోనూ స్త్రీ, పురుషులు సగం సగం ఉండాలని పట్టుబడుతున్నారు. ఉన్నట్లుండి చాలామంది – ప్రధానంగా పురుషులే అయినప్పటికీ, అందరూ పురుషులే కాదు, పురుషులను మరిచిపోకూడదని, వాళ్ళను వదిలిపెట్టకూడదని, అన్నింటిలో వాళ్ళను భాగస్వాముల్ని చేయటం లేదని ఆందోళనలు పడసాగారు. స్త్రీకి పెద్దగా న్యాయం జరగకముందే పురుషుడికి అన్యాయం జరిగే అవకాశం గురించి ఆలోచించటం మొదలుపెట్టారు.
కాబట్టి జెండర్ అన్న పదం ఆధిపత్య సంబంధాలను బట్టబయలు చేసే బదులు వాటిని మరుగుపరుస్తోందని అర్థమవుతుంది. దీనిని ఒక సభ్య, న్యూట్రల్ పదంగా పరిగణిస్తున్నారు. జెండర్ నిపుణులలో చాలామందికి అది ఒక ప్రత్యేకత అయిపోయింది. సజీవ, పరస్పర సంబంధాలు గల ప్రపంచం నుంచి అది వేరయ్యింది. ఒక ప్రాజెక్టు నేపథ్యంలో జెండర్ గురించి మాట్లాడుతూ పితృస్వామ్యం గురించి ప్రస్తావించకపోయినా, జెండర్ పరాధీనతకు మూలకారణాలను అర్థం చేసుకోకపోయినా, సవాలు చేయకపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు.
జెండర్ వేగంగా ఇతరులకు, ప్రత్యేకించి ”టార్గెట్ బృందాలకు” లేదా లబ్ధిదారులని పిలవబడే వారికి బయటి వాళ్ళు ”చేసేది” అవుతుంది. సిద్ధాంతంలో లేకపోయినప్పటికీ ఆచరణలో జెండర్ అంశాలు ”గ్రామస్థాయి”కి పరిమితమవుతున్నాయి. జెండర్ కేవలం ప్రాజెక్టుతో సంబంధం గలదయితే దానితో ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. అణిచివేతకు గురిచేసే నిర్మాణాలు, వ్యవస్థలు, దృక్పథాలు తొలగించాలనే పితృస్వామ్యం వ్యతిరేకత మాదిరి కాకుండా ఇది అందరికీ ఆమోదయోగ్యం అవుతుంది. దీనిని ప్రధాన జీవన స్రవంతిలో భాగం చేయవచ్చు.
జెండర్ అన్న పదాన్ని రాజకీయంగా ఉపయోగించలేమని దీని అర్థం కాదు. చాలామంది ఫెమినిస్టులు దీన్ని అలా ఉపయోగిస్తున్నారు కూడా. కానీ ఈ సిద్ధాంతాన్ని రాజకీయాలరహితంగా ఉపయోగించే ప్రమాదమూ ఉంది. అయితే ఏదీ నిజానికి రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండదు కాబట్టి అంతిమంగా ఇది అసలు విషయాన్ని మరుగున పరచటానికీ, పితృస్వామ్య ఆధిపత్యానికి దోహదం చేయవచ్చు. అందుకే దక్షిణాసియాలో చాలామందిమి ఈ పదం వాడడానికి అంతగా ఇష్టపడడం లేదు. ఇప్పుడు కూడా పితృస్వామ్యం వంటి ఇతర సిద్ధాంతాలతో కలిపి దాన్ని ఆచితూచి మాత్రమే వాడుతున్నాం.
అభివృద్ధి కార్యక్రమాలలో జెండర్ చర్యలు తమ ఉద్దేశాలలో, అవగాహనలో ఎంతో అంతరాలు కలిగి ఉన్నాయి. అయితే పురుష (స్త్రీలు కూడా) విధాన నిర్ణేతలకు, ప్రణాళికాకారులకు, అమలు చేసేవారికి అధికార సంస్థలు, కన్సల్టెంట్లు / శిక్షకులు ఇచ్చే జెండర్‌కి స్పందింపచేసే శిక్షణలని పిలవబడుతున్న వాటి ప్రధాన ఉద్దేశాలు ఇలా ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా బాగా అమలు చేయడానికి జెండర్ సంబంధాలను పరిశీలించడం; స్త్రీల ”ఉత్పాదక ఉపయోగాలను” వినియోగించుకోవటానికి అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాముల్ని చేయటం, స్త్రీలలో పెట్టుబడి పెట్టటం, జెండర్ సమానత, జెండర్ న్యాయం అన్నవి వారి ప్రధాన ఉద్దేశాలు కాకపోవచ్చు. ఈ నిపుణులు జెండర్ సంబంధాలలో అధికారం గురించి అరుదుగా తప్పించి ప్రస్తావించరు. స్త్రీ, పురుషుల విభిన్న పాత్రలు, బాధ్యతలను వివరించటానికో, వనరుల నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలకు అందుబాటు, నియంత్రణలలో ఉన్న తేడాలను తెలియజేయడానికో జెండర్ అన్న పదాన్ని ఉపయోగించటమే నేను ఎక్కువగా విన్నాను. చాలామంది జెండర్ శిక్షకులు ప్రస్తుత పరిస్థితిని వివరించటానికి మించి ఏమీ చెయ్యరు. ఒకవేళ జెండర్ అసమానతలకు కారణాలను విశ్లేషించినప్పటికీ వాళ్ళు దానిని సవాలు చేస్తారని ఏమీ లేదు. ప్రస్తుతం ఉన్న జెండర్ ఆధారిత శ్రమ విభజన ప్రకారం తమ అభివృద్ధి చర్యలను తరచూ రూపొందించవచ్చు.
జెండర్ శిక్షకులు, నిపుణులలో చాలామంది జెండర్ అన్న అంశాన్ని ఒక సాంకేతిక విషయంగా పరిగణిస్తారు. జెండర్ విశ్లేషణకు కొన్ని పద్ధతులు వాడటం ద్వారా జెండర్ అసమానతలు తొలిగిపోతాయన్నట్లు వ్యవహరిస్తారు. ఇటువంటి శిక్షణలు, చర్యలు జెండర్ అసమానతలను సవాలు చెయ్యకపోవటమే కాకుండా ఈ విషయాలను రాజకీయాల నుంచి వేరుచేసి, మార్పు తీసుకురావటం మరింత క్లిష్టతరం చేస్తున్నాయని మా అభిప్రాయం.
ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులను ముందు పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికాకారులు తేలిక
షెడ్యూళ్ళు, అంకెలలోకి మార్చగల లక్ష్యాలు, తేలిక పరిష్కారాల కోసం వెదుకుతున్నారని సాస్కియా వైరింగా పేర్కొంటున్నారు. సంక్లిష్టతలను అర్థం చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా స్పందించటానికి బదులు వాళ్ళు తమ సంకుచిత చట్రంలోకి సామాజిక వాస్తవాలను ఇరికించాలని చూస్తున్నారు.
అభివృద్ధి చర్యలను రూపొందించేటప్పుడు స్త్రీల ప్రయోజనాలకు సంబంధించిన మౌలిక ప్రశ్నలు అడగడం లేదని వైరింగా అంటున్నారు. వ్యవస్థాగత సర్దుబాటు కార్యక్రమాలలో ఈ విధమైన ప్రశ్నలు వేసుకుని ఉండవలసిందని ఆమె అంటున్నారు. పేదరికానికి స్త్రీలే ఎక్కువగా ఎందుకు గురవుతున్నారు? చిన్నపిల్లలు, వృద్ధులు, జబ్బు పడినవారి సంరక్షణ వంటి వేతనం లేని పనులు స్త్రీలే ఎందుకు చేయాలి? కుటుంబాలు ఏర్పడడానికి కారణమైన పురుషులే ఎందుకు వాటి నుంచి తొలగిపోతున్నారు?
ఆమె ఇంకా ఇలా అంటున్నారు, ”దీనికి సంబంధించి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఆహారం, విలాస వస్తువులు, తీరిక సమయం వంటి వాటిల్లో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు; సాంప్రదాయం పేరు చెప్పి స్త్రీలను జీవితంలోని కొత్త రంగాలలోకి ప్రవేశించనివ్వకపోవడం, అదే పరిస్థితుల్లో పురుషులు సృజనాత్మకత గలవారని భావించటం; సుస్థిరత, పర్యావరణ క్షీణత, జెండర్ వంటి అంశాలపై దృష్టి పెట్టకపోవటం; తమ జీవితాలకు సంబంధించి రాజకీయ, ఆర్థిక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులలో స్త్రీలు కీలక స్థానాలలో లేకపోవటం; అభివృద్ధిని కేవలం ఆర్థిక ప్రక్రియగా పరిగణించి సామాజిక అంశాలను పట్టించుకోకపోవటం (ఒక దేశం యొక్క ప్రధాన వనరు దాని ప్రజలే); లైంగిక హింస అనేది నిజమైన అభివృద్ధి అంశంగా గుర్తించకపోవడం.”
దక్షిణ ఆసియాలో ప్రధాన జీవన స్రవంతిలో ప్రస్తుతం జరుగుతున్న జెండర్ పని చూస్తుంటే నిబద్ధత, పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవటం, సామాజిక వాస్తవాలను జీవావరణ, ఇతర అనేక విధాల ముడిపడి ఉన్న వాటి దృష్టి కోణం నుంచి చూడటాన్ని ప్రోత్సహించకుండా ”జెండర్ నిపుణులు” చాలా తేలికైన పరికరాలు, చట్రాలు, పనులు అందిస్తున్నారని మా అభిప్రాయం.
”జెండర్ నిపుణుల”లో స్త్రీలకు సంబంధించిన అంశాలను చాలామంది రాజకీయాల నుంచి వేరుచేసి చూపడం ఆందోళన కలిగిస్తోంది. స్త్రీల అంశాలపై చర్చలో పోరాట విషయాలు, వారి మిలిటెన్సీ లోపిస్తున్నాయి. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా సవాళ్ళను నీరు కార్చటం కాకుండా బలపర్చాలనీ, పితృస్వామ్య అధికారం ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదని భావించే మరికొందరు శిక్షకులకు ఇది ఇబ్బందికరంగా ఉంటోంది. వాస్తవానికి ఆర్థిక సరళీకరణ, మత ఛాందసవాదం, మితవాదాల ప్రాముఖ్యత పెరుగుతుండడంతో పితృస్వామ్యం తిరిగి బలం పుంజుకుంటోంది.
సోషలిస్టు ఫెమినిస్టులు, ఎకో ఫెమినిస్టులు ప్రస్తుత అభివృద్ధి విధానాలే ప్రజాస్వామ్య భావాలు కలవనీ, జీవావరణాన్ని నాశనం చేసేవనీ పేర్కొంటూ వాటిని ఎదుర్కొంటున్నారు. కానీ ప్రధాన జీవన స్రవంతిలో జెండర్ ప్రయత్నాలు ప్రస్తుతం వ్యవస్థలోనే స్త్రీల ‘సాధికారీకరణ’కు అవకాశాలను పెంచటానికి పరిమితమవుతున్నాయి. పితృస్వామ్యం, కులం, వర్గం, జాతి, రాజ్యం, వలసవాదం / సామ్రాజ్యవాదం, పర్యావరణం వంటి వాటి మధ్య సంబంధాలు ”రాజకీయ” అంశాలుగా నిర్వచించటం. వాటిపై చర్చ అరుదుగా గాని జరగదు!! ఈ తారతమ్యాలను అంగీకరించటం అంటే రాజకీయాలకు దూరంగా ఉండడం అన్న భావన దీని వెనుక ఉంటుంది.
స్త్రీల అంశాల నుంచి రాజకీయాలను వేరుచేసే ధోరణులను సవాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దక్షిణాసియాలో పితృస్వామ్యాన్ని కుల, వర్గ, మత, జాతి ఆధారంగా రూపొందే తారతమ్యాలను ఎదుర్కోవడానికీ, ప్రగతిశీల సామాజిక మార్పులు సాధించడానికి మనకి మరింత స్పష్టత, నమ్మకం, నిబద్ధత అవసరం. ప్రణాళికాకారులు అమలు చేసేవాళ్ళు, ఆలోచనలు చేసేవాళ్ళు – పనులు చేసే
వాళ్ళు, నిపుణులు – నిపుణులు కానివారు వంటి వారి మధ్య అంతరాలు సాధ్యమైనంతగా తగ్గాలి; జెండర్ ప్రణాళికలు తయారుచేయటం, ఫెమినిస్టు సిద్ధాంతం, స్త్రీల ఉద్యమాల మధ్య సన్నిహిత చర్చలు ఉండి, సహకారం పెరగాలి. ఫెమినిజం అంటే వెనుకడుగు వేయటం కాకుండా స్త్రీల సాధికారీకరణకు చేపట్టే కార్యక్రమాలు మరింత స్పష్టమైన ఫెమినిస్టు దృక్పథం కలిగి ఉండాలి.
మీ దృష్టి ప్రకారం ప్రాధాన్యత ఇవ్వవలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయి. ఇప్పటివరకు లభించిన ప్రాధాన్యత దృష్ట్యా చూస్తే కనీసం రెండు అంశాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది. అవి…
శ్రీ ప్రకృతి వనరులైన భూమి, నీరు, అడవులు వంటి వాటిల్లో స్త్రీలకు అందుబాటు, నియంత్రణ. ఈ వనరులపై స్త్రీలకు అందుబాటు, నియంత్రణ ఉండేలా కార్యక్రమాలు, విధానాల స్థాయిలో మరింత స్పష్టమైన చర్యలు తీసుకోవాలి.
శ్రీ పురుషులు, బాలురు ఇంటి పనిని పంచుకోవడం.
దక్షిణాసియాలో స్త్రీల పరాధీనత, స్వయం ప్రతిపత్తి లేకపోవడం, అనారోగ్యం వంటి వాటికి ఇంటిపని ఎక్కువగా
ఉండడం ప్రధాన కారణం. యు.ఎన్.డి.పి. మానవ అభివృద్ధి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు వేతనం లేకుండా చేసే పని విలువ ప్రతి సంవత్సరం 11 ట్రిలియన్ల అమెరికన్ డాలర్లు. అభివృద్ధి పథకాలు స్త్రీలను అభివృద్ధి క్రమంలోకి తీసుకువచ్చి, ప్రపంచస్థాయి ఉత్పత్తి సేవలో వారి ”మానవ వనరులను”, వారి ”పెట్టుబడిని” ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. ఇటీవలి కాలంలో పాలనలోని అన్ని స్థాయిలలో స్త్రీల భాగస్వామ్యాన్ని పెంచడానికి చాలామంది కృషి చేస్తున్నారు. కానీ, ఇంకోవైపు శ్రామిక వర్గ మహిళలు పని భారం వల్ల కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉన్నారు. స్త్రీల గృహ బాధ్యతలు తగ్గించటం గురించి పెద్దగా వినపడదేమిటి? ”స్త్రీల అభివృద్ధి”, ”సాధికారీకరణ” వంటి పేర్లతో అనేక కార్యక్రమాలు స్త్రీల పనిని, బాధ్యతలను పెంచుతున్నాయి. సీనియర్ యాజమాన్య పదవులలో కానీ, ఇతర కీలక పదవులలో కానీ స్త్రీలు లేకపోవడానికి కారణం వారికి ఇంటివద్ద పూర్తికాలం కంటే ఎక్కువ పని ఉండడమని మనమంతా ఒప్పుకోక తప్పదు. పునరుత్పత్తి, పిల్లల సంరక్షణ, కుటుంబాలు అంతరించిపోయేవి కాదు కాబట్టి పురుషులు కుటుంబం, వంటిల్లు, గృహ అవసరాలలో పాల్గొనేలా సమాంతర ఉద్యమం మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది. మేనేజర్లు, రాజకీయ నాయకులు, సభ్య సమాజ నేతలుగా మరింత మంది స్త్రీలను చూడాలని మనం అనుకుంటే మరింత మంది పురుషులు తల్లులు కావాలి, సంరక్షకులు కావాలి, నర్సులు కావాలి, వంట చేసేవాళ్ళు కావాలి. పునరుత్పాదక పనిభారం తగ్గినప్పుడే స్త్రీలు తమ శరీరాలు, జీవితాల మీద స్వతంత్ర అధికారాన్ని పొందగలుగుతారు.
మరియా మీస్ ఇలా అంటున్నారు; ఇప్పటి వరకు ”ఇంటి పని”గా పేర్కొన్న జీవ ఉత్పత్తి, పిల్లల సంరక్షణ, ఇంటిపని, వృద్ధులు, జబ్బు పడినవారి సంరక్షణ, సామాజిక సంబంధాల పని వంటి వాటన్నింటిలో పురుషులు బాధ్యతలు పంచుకోవాలి… అంటే దాని అర్థం పిల్లలతో గడపడం, వంటపని, శుభ్రం చేయడం, జబ్బు పడినవారి సంరక్షణ వంటి వాటిల్లో పురుషులు ఎక్కువ సమయం కేటాయించాలి. ఫలితంగా పరిశ్రమలో విధ్వంసక ఉత్పత్తికి, విధ్వంసక పరిశోధనకి, విధ్వంసక తీరిక-సమయం పనులకి, యుద్ధాలకి వారికి తక్కువ సమయం ఉంటుంది. దీనిని సకారాత్మకంగా పెట్టాలంటే తమ శరీరాలు, మనసుల సమగ్రతను, స్వతంత్రతను తిరిగి పొందగలుగుతారు; పని భారాన్ని, సంతోషాన్ని తిరిగి అనుభవించగలుగుతారు; పనికి సంబంధించి ఒక కొత్త విలువల కొలబద్ధను తయారు చెయ్యగలుగుతారు. జీవ ఉత్పత్తి, జీవ సంరక్షణ పనిని స్వయంగా చేయటం ద్వారానే దోపిడీ పూరిత, పెట్టుబడిదారీ, పితృస్వామ్య పని సిద్ధాంతం నుంచి బయటపడి కొత్త పని సిద్ధాంతాన్ని తయారు చేయగలుగుతారు.
స్త్రీల విముక్తి, పురుషుల విముక్తి ప్రక్రియలు పరస్పరం ముడిపడి ఉన్నాయి. మన సమాజంలో స్త్రీలు పితృస్వామ్య బంధనాల నుంచి బయటపడాలంటే పురుషులు కూడా అదే దిశలో ఉద్యమం చేపట్టనిదే సాధ్యం కాదు. పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పురుషుల
ఉద్యమం ఏదో దాతృత్వ ధోరణితో కాకుండా, తమ గౌరవం, తమ మానవ అభిమానం కాపాడుకోవాలన్న కోరిక కారణంగా చేపట్టాలి. స్త్రీల పట్ల గౌరవం లేనిదే తమను తాము పురుషులు ఎలా గౌరవించుకోగలరు?”
జెండర్ పని చేపట్టడం అంటే కేవలం స్త్రీలు, లేదా కేవలం పురుషులతో కాకుండా స్త్రీ, పురుషులతో కలిసి పనిచేయడమని కొంతమంది అభిప్రాయం.
ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించను. జెండర్ అభివృద్ధి అంటే స్త్రీ, పురుషుల బృందాలు వేరుగా ఉండకూడదని కానీ, వారికి వేరువేరుగా వర్క్‌షాపులు నిర్వహించగూడదని కానీ, లేదా ప్రతి వర్క్‌షాప్‌లో స్త్రీ, పురుష శిక్షకులు తప్పనిసరిగా ఉండాలని కానీ కాదు. స్త్రీ, పురుషుల గుర్తింపు, జెండర్ సంబంధాలపై సామాజిక ప్రభావాన్ని విశ్లేషించటంపై మనం దృష్టి కేంద్రీకరించాలన్నది నా అభిప్రాయం. ఈ విశ్లేషణ అవసరమైతే స్త్రీ, పురుషులు వేరువేరు బృందాలుగా చేపట్టవచ్చు. వాస్తవానికి కొన్ని సమాజాలలో స్త్రీలు స్వేచ్ఛగా ఆలోచించటానికీ, మాట్లాడడానికీ, పరస్పర సంబంధాలు బలపరచడానికీ, వ్యూహాలను రూపొందించడానికీ వారికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం అవసరమవుతుంది. అదేవిధంగా పురుషులు కూడా మొహమాటాలు లేకుండా చర్చించుకోవటానికి ప్రత్యేక సమావేశాలు అవసరం కావచ్చు. స్త్రీ, పురుషులకు ఎటువంటి ఇబ్బందులు లేని సందర్భాలలో వారిని కలిపి సమావేశాలు, వర్క్‌షాపులు నిర్వహించవచ్చు.
జెండర్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్నామంటే స్త్రీల గురించి, స్త్రీల సాధికారీకరణ గురించి మాట్లాడగూడదని ఏమీ లేదు. జెండర్ సంబంధాలలో తారతమ్యాలున్నంతవరకు, స్త్రీలు పరాధీనులుగా ఉన్నంతవరకు జెండర్ సమానతను సాధించాలంటే స్త్రీల సాధికారీకరణకు మద్దతు తెలపాల్సిందే. జెండర్ సమానత సాధించడానికి ముందే అన్ని సందర్భాలలో స్త్రీ, పురుషులను సమానంగా చూడాలనడం సరయినది కాదు. స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు ఉన్నాయి కాబట్టే మనం జెండర్ గురించి మాట్లాడడం మొదలుపెట్టామని మరిచిపోకూడదు.
జెండర్ చర్చ అనేది పురుషులకు వ్యతిరేకంగా స్త్రీలు అన్న చర్చ అయితే కాదు కదా?
కాదు. జెండర్ సమానత అన్నది పురుషులకు స్త్రీలు వ్యతిరేకం అని కాదు, స్త్రీలందరి మధ్య, పురుషులందరి మధ్య ఘర్షణ
ఉందనీ కాదు. ఇది సమానతను నమ్మి, దానిని కోరుకునే వారికీ – పురుష ఆధిపత్యం కొనసాగాలని కోరుకునే వారికీ మధ్యన సాగే విషయం. ఇది విశ్వాసాలకు-భావజాలాలకు నడుమ ఉండేది. పితృస్వామ్యాన్ని అంగీకరించి, దానివల్ల ప్రయోజనం పొందేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వారు యథాతథ పరిస్థితి కొనసాగాలని కోరుకుంటారు. మరి కొంతమంది సామాజిక మార్పు కోసం కృషి చేస్తారు. చాలామంది పురుషులు ఈనాడు తమ హక్కులు, సౌకర్యాలను, పాత్రలు, బాధ్యతలను పరిశీలించుకుంటున్నారు. పురుషత్వం, పురుష అధికారం, పురుష లైంగికత, పురుష జ్ఞాన వ్యవస్థలు, పురుషులు నిర్దేశించిన సామాజిక సంబంధాలు మొట్టమొదటిసారిగా నిశిత పరిశీలనకు గురవుతున్నాయి. ఈ పరిశీలకుల్లో స్త్రీలు ఉన్నారు, పురుషులూ ఉన్నారు. కాబట్టి జెండర్ సమానత కోసం జరిగే పోరాటాన్ని స్త్రీ, పురుషుల మధ్య పోరాటం అనుకోవటం తప్పవుతుంది. అయితే స్త్రీల ప్రయోజనాలకీ, పురుషుల ప్రయోజనాలకీ మధ్య కొంత ఘర్షణ ఉందన్నది ఒప్పుకోవాలి. స్త్రీలు సాధికారులౌతున్న కొద్దీ ఈ ఘర్షణలు కొంతకాలం తీవ్రరూపం దాల్చవచ్చు. సమానత్వం కోసం సాగే ఏ పోరాటమైనా సమతౌల్యాన్ని సాధించే ముందు కొంత భిన్న ధృవాలుగా విడిపోవటమనేది జరుగుతుంది.
జెండర్ సంబంధిత అంశాలు ఇంతటి ఉద్వేగాలను, వ్యతిరేకతను ఎందుకు పురిగొల్పుతాయి?
దీనిని మారియా మీస్ బాగా వివరించారు. ప్రస్తుత సమాజంలో, ఆ తరువాత కుటుంబంలో స్త్రీ-పురుష సంబంధాల అసలు స్వరూపాన్ని తెలుసుకుంటే డబ్బు, అధికారం, అత్యాశలతో నిండిన ఈ క్రూర ప్రపంచంలో శాంతి, సామర్ధ్యాల ఆఖరి దీవి అయిన కుటుంబం విచ్ఛిన్నమవుతుందన్న భయంతో చాలామంది స్త్రీ, పురుషులు జెండర్ సంబంధాలను పరిశీలించడానికి నిరాకరిస్తారు. అంతేకాకుండా ఈ అంశాన్ని తమ చేతనలోకి ప్రవేశించనిస్తే, స్త్రీ-పురుషులు కేవలం బాధితులు, బాధలు పెట్టేవాళ్ళుగానే కాక మొత్తంగా స్త్రీలనూ, పురుషులనూ కలిపి అణచివేత సాగించే దోపిడీ వ్యవస్థలో భాగస్తులని ఒప్పుకోవలసి వస్తుంది. నిజమైన, స్వేచ్ఛాయుత మానవ సంబంధాలు కోరుకుంటే వాళ్ళు తమ సంక్లిష్టతలను వదులుకోవాలి. ఈ వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొందే పురుషులకే కాకుండా దానితో తమ భౌతిక మనుగడ ముడిపడి ఉన్న స్త్రీలకు కూడా అది వర్తిస్తుంది.
అణచివేతతో కూడుకున్న అసమాన స్త్రీ,పురుష సంబంధాల చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని పగలగొట్టిందీ, దాన్ని మార్చాలనేదీ ఫెమినిస్టులే. సమాజంలో, కుటుంబాలలోనూ న్యాయపూరిత, శాంతియుత, సంబంధాలు నెలకొనాలంటే స్త్రీ, పురుషుల మధ్య సమానత తప్పనిసరి అని భావించేవాళ్ళు పెరుగుతున్నారు. జెండర్ సమానత సాధించడానికీ, న్యాయపూరిత, శాంతియుత ప్రపంచాన్ని సృష్టించడానికి స్త్రీ, పురుషులు అంతా చేతులు కలపాలి.
దీని అర్థం అభివృద్ధిలో జెండర్ అంశాలు అంటే అభివృద్ధిలో స్త్రీలను భాగస్వాముల్ని చేస్తే సరిపోదనా?
ప్రస్తుత సంస్థలు, వ్యవస్థలకు ‘స్త్రీల అంశాన్ని’ జోడిస్తే సరిపోతుందని చాలా సంస్థల అభిప్రాయం. అయితే నిజమైన సామాజిక మార్పు సాధించాలంటే పితృస్వామ్య సమాజంలో సమూల మార్పులతో పాటు, అభివృద్ధి పట్ల మనకు గల అభిప్రాయాలు, ఆచరణలు కూడా మారాలని మేం నమ్ముతున్నాం.
అభివృద్ధి ప్రణాళికలు, కార్యక్రమాలలో అనేక స్త్రీ వ్యతిరేక (పేదల వ్యతిరేక) ధోరణులు ఉండవచ్చని మనం చూశాం. ఇటువంటి ప్రణాళికలు, పథకాలలోకి స్త్రీలను భాగస్వాముల్ని చేయటంతో సరిపెట్టుకోకుండా వాటిని సవాలు చేసి, మార్చాల్సిన అవసరరం ఉంది. ఆర్థిక ప్రగతి, లాభాల వేట, వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రస్తుత అభివృద్ధి పంథా వల్ల స్త్రీలు-పురుషుల మధ్య, ధనికులు-పేదల మధ్య, ధనిక దేశాలు-పేద దేశాల మధ్య అంతరాలు పెరిగాయనడానికి తగినన్ని రుజువులు ఈనాడు మన ముందున్నాయి. అంతేకాకుండా ఇది జీవావరణ విధ్వంసానికి కూడా దారితీసింది. ప్రస్తుత అభివృద్ధి విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నిరుద్యోగులుగా, గళం లేని వారుగా, నిర్ణయాలుగా, మూలాలు లేనివారుగా, భవిష్యత్తు లేనివారుగా మారిపోయారని తెలియజేసే గణాంకాలను యు.ఎన్.డి.పి. మానవ అభివృద్ధి నివేదికలు అందిస్తున్నాయి. (యు.ఎన్.డి.పి. మానవ అభివృద్ధి నివేదిక, 1996). ఈనాడు 250 కోట్ల పేదల ఆధీనంలో
ఉన్న డబ్బుకంటే 35.8 కోట్ల కోటీశ్వరుల ఆధీనంలో ఉన్న డబ్బు ఎక్కువగా ఉంది. కొన్ని బహుళ జాతి సంస్థల బడ్జెట్ చాలా దేశాల బడ్జెట్ కంటే ఎక్కువ. ఈ రకంగా అధికారం కేంద్రీకృతం కావటంవల్ల మరిన్ని ఒత్తిడులు, వైరుధ్యాలు పెరుగుతాయి, హింస పెరుగుతుంది.
అభివృద్ధి ఆలోచనా విధానంలో మార్పుతో పాటు మన సంస్థలు, మన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలలో సమూల మార్పులు చేపట్టాలి. విలువలలో కూడా పెద్ద ఎత్తున మార్పులు రావాలి. ఉదాహరణకు స్వప్రయోజనానికీ, పోటీకి బదులు సహకారం, సాంఘిక న్యాయం; విస్తరణ నుంచి సంరక్షణకి; భౌతిక వస్తువులను సమకూర్చుకోవటం నుంచి అంతర్గత ఎదుగుదలకూ మారాలి. మనకు తెలిసిన అభివృద్ధిని మార్చి దానిని మరింత సమానంగా, అందరికీ ప్రయోజనం కలిగించేదిగా చెయ్యటానికి అభివృద్ధి పంథాలను, ఆచరణలను జెండర్‌కు గురిచేయటం ఒక పద్ధతి.
జెండర్ సమానతను సాధించటం అంటే ‘స్త్రీత్వ’, ‘పురుషత్వ’ లక్షణాలు, విలువలు (ఆధిపత్యం-అణిగి ఉండటం; పోటీతత్వం-సహకారం; స్వార్థప్రయోజనం-స్వార్థ త్యాగం; దోపిడీ-సంరక్షణ, పోషణ) మరోసారి పరిశీలించుకుని, ఈ విషయాల గురించి తీవ్రంగా ఆలోచించాలి.
. అభివృద్ధి అంటే ”స్త్రీత్వ” లక్షణాలను, విలువలను కించపరిచి, ”పురుషత్వ” లక్షణాలు, విలువలను ప్రశంసించటమేనా?
. జెండర్, అభివృద్ధి అంటే స్త్రీలు కూడా బహిరంగ రంగాలలోకి ప్రవేశించి పురుషుల మాదిరి ప్రవర్తించటమేనా?
. భిన్న ధృవాలుగా ఏర్పడి, సంఘర్షపూరిత, జీవావరణ విధ్వంసానికి దారితీసిన ప్రస్తుత ప్రపంచానికి అవసరమయినది మరింత పోటీతత్వమా, మరింత సహకారమా? ప్రకృతిని మరింత దోచుకోవడమా లేక ప్రకృతిని మరింతగా సంరక్షించడమా? ఇంకో మాటల్లో చెప్పాలంటే ప్రస్తుత ప్రపంచానికి మరిన్ని ”స్త్రీత్వ” లక్షణాలు కావాలా; మరిన్ని ”పురుషత్వ” లక్షణాలు కావాలా?
వాస్తవానికి మనం మరింత ముందుకు వెళ్ళి అసలు లక్షణాలు, విలువలకు స్త్రీత్వ, పురుషత్వ గుణాలను ఆపాదించడం సరైనదేనా అని ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ మానవ విలువలు కాదా? స్త్రీ, పురుషులిరువురూ ‘పురుషత్వ’, ‘స్త్రీత్వ’ అంశాలను అభివృద్ధిపరచుకోవలసిన అవసరం లేదా? హేతుబద్ధంగా, ఉద్వేగభరితంగా, తన అవసరాలను చూసుకుంటూనే ఇతరుల పట్ల సున్నితంగా ఉండటం, వ్యాపారవేత్తలు, గృహసంరక్షకులుగా; ప్రజావ్యక్తులుగానే కాక కుటుంబ వ్యక్తులుగా స్త్రీ, పురుషులిరువురూ ఉండకూడదా? స్త్రీలు బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి కొన్ని బాధ్యతలు చేపడుతుంటే పురుషులు ఇంటిలోకి ప్రవేశించి పిల్లల సంరక్షణ, పోషణ, గృహ నిర్వహణ వంటి కొన్ని బాధ్యతలు చేపట్టకూడదా?
ఉభయ సభలలో స్త్రీల ప్రాతినిధ్యం ఉండాలి
జెండర్ సమానత అంటే స్త్రీ, పురుషులమయిన మనమందరం మనల్ని మనం పరిశీలించుకొని మనలోని సకారాత్మక ”పురుష” (దుడుకుతనం, ఆధిపత్యం, పోటీతత్వం, స్వార్థపూరితం) గుణాలను, సకారాత్మక ”స్త్రీ” (అణిగి ఉండటం, భయపడటం) స్వభావాలను అధిగమించాలి. అంతేకాకుండా స్త్రీ, పురుషులమూ; బాల బాలికలమూ అయిన మనమంతా కూడా సకారాత్మక పురుష, స్త్రీ గుణాలను పెంచి పోషించుకోవాలి. మనలో ప్రతి ఒక్కరమూ దృఢంగానూ, సంరక్షకులుగానూ, నిర్భయులుగానూ, స్పందనశీలురు గానూ; ఉద్వేగపరులుగానూ, హేతుబద్ధులుగానూ ఉండాలి. ఇంతకుముందెన్నడూ లేనంతగా, సహించరాని స్థాయిలో హింస, పర్యావరణ క్షీణతలను ఎదుర్కొంటున్న ప్రస్తుత ప్రపంచాన్ని నయం చేయాలంటే ఇంటా, బయటా సంరక్షణ, పోషణ గుణాలను పెద్ద ఎత్తున ఆచరించటం ఒక్కటే మార్గమని మేం నమ్ముతున్నాం.
అదేవిధంగా వేరొక స్థాయిలో ఆర్థికాన్ని, నైతికతనూ వేరుచేయటం; రాజకీయాలనూ, విలువలనూ వేరు చేయటం; విజ్ఞాన శాస్త్రాన్ని, మతాన్నీ వేరు చేయటం వంటి వాటిని ప్రశ్నించాలి. ఈ విధమైన విభజన వల్ల నైతికత లేని ఆర్థిక లక్ష్యాలు, విలువలేని రాజకీయ అధికారం, విజ్ఞాన శాస్త్రాన్ని బాధ్యతారహితంగా, విధ్వంసకరంగా ఉపయోగించటం వంటి వాటిని చూస్తున్నాం. ఆర్థిక రంగం, రాజకీయాలు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు విలువలు, నైతికత బయట ఉండడం కాకుండా వాటి అంతర్గత అంశాలుగా, ఆధారంగా, చోదకశక్తిగా
ఉండాలని మేం నమ్ముతున్నాం. ఈ అంశాలన్నీ కూడా మా దృష్టిలో అభివృద్ధిని జెండర్‌కి గురిచెయ్యడంలో భాగమే. జెండర్, అభివృద్ధి వంటి అంశాలను సంకుచితంగానూ, యాంత్రికంగానూ చూడగూడదని మా నమ్మకం. ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు అన్న ప్రశ్నలకే చర్చ పరిమితం కాకూడదు. సుస్థిరత కోసం సాగే మన అన్వేషణలో జెండర్, అభివృద్ధి చర్చలు దోపిడీపూరిత, పరస్పరం సున్నితంగా స్పందించే ధోరణి లేని జెండర్, కుల, వర్గ, జాతి, ఉత్తర-దక్షిణ (ప్రపంచాల) ఆధారంగా ఏర్పడిన శ్రమ విభజనను మార్చేవిగా ఉండాలి.
అభివృద్ధి లక్ష్యాలు, మానవ జీవన సార్థకత వంటి మౌలిక ప్రశ్నలు కూడా లేవనెత్తాలి. జెండర్ చర్చలలో ప్రస్తుతం ఇస్తున్న దానికంటే ఈ కింది అంశాలకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.
శ్రీ మానవ ప్రయత్నాల ఉద్దేశం వస్తువులు, లాభాలు ఉత్పత్తి చేయటంగా ఉండాలా లేక జీవం, ఉపయోగ విలువ సృష్టించటంగా
ఉండాలా?
శ్రీ ప్రకృతి నుంచి, సేంద్రీయ పదార్థాల నుంచి పూర్తిగా వేరుపడితే మానవులు నిజంగా మానవులుగా ఉండగలుగుతారా?
శ్రీ దోపిడీ నుంచి, బ్లాక్ మెయిల్ నుంచి తప్పించుకోవటానికి సమాజాలు తమకు అవసరమైన వస్తువుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం లేదా?
శ్రీ స్త్రీలు తమ శరీరాలు, జీవితాల మీద స్వయం ప్రతిపత్తిని సాధించకుండా, జీవన ఉత్పత్తికి సంబంధించిన పనులలోనూ, ఇప్పటివరకూ ‘ఇంటిపని’గా పేర్కొన్న అన్ని పనులలోనూ పురుషులు బాధ్యతలు పంచుకోకుండా సుస్థిర సమాజాలు, కుటుంబాలు ఏర్పడడం సాధ్యమేనా?